'శాస్త్రీయం'గా అత్యధిక స్కోరు

'శాస్త్రీయం'గా అత్యధిక స్కోరు
గ్రూప్‌-I మెయిన్స్‌లో ఉండే ఐదు పేపర్లలో నాలుగోదైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కీలకమైనది. దీనిలో సిలబస్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా పేపర్ల కంటే ఎక్కువ మార్కులు స్కోరు చేసుకోవచ్చు. ఆర్ట్స్‌ అభ్యర్థులైనా, సైన్సు వారైనా ఈ పేపర్‌పై కొద్దిపాటి అవగాహనను పెంపొందించుకొంటే దీని ప్రిపరేషన్‌ సులభమవుతుంది.
పేపర్‌-IV సిలబస్‌లో మూడు సెక్షన్లు ఉన్నాయి. మొదటి దాంట్లో 'భారతదేశ అభివృద్ధిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర, ప్రభావం' అన్న అంశానికి సంబంధించినవి. రెండో దాంట్లో 'జీవశాస్త్రాల ఆధునిక ధోరణులు- సాధారణ పరిజ్ఞానం' సిలబస్‌. మూడో సెక్షన్‌లో 'అభివృద్ధి, పర్యావరణ' అంశాలు ఉన్నాయి. ఈ మూడు సెక్షన్లలో తిరిగి ఒక్కొక్కదానిలో ఐదు యూనిట్లు. మొత్తం సిలబస్‌ను పదిహేను యూనిట్లుగా విభజిస్తే, ప్రతి యూనిట్‌ నుంచీ రెండు ప్రశ్నలు వస్తాయి. దీనిలో ఒకటి ఛాయిస్‌. అంటే ఒక ప్రశ్నకు సమాధానం రాస్తే సరి. పేపర్‌ మొత్తంలో ఉండే 30 ప్రశ్నల్లో పదిహేనింటికి జవాబులు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు పది మార్కులు. మొత్తం 150 మార్కులు. ప్రశ్నలు పది మార్కులకనే కాకుండా 1, 2, 4, 5, 6, 8 ఇలా విభజించి అడిగే అవకాశం ఉంది. 2008 మెయిన్స్‌లో ఇలాగే చేశారు.
ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మూడు దశలుగా విభజించుకోవచ్చు. i) సిలబస్‌ను క్షుణ్ణంగా చదివి, అర్థం చేసుకొని నోట్సు సిద్ధం చేసుకోవటం. ii) సమాధానాలను సాధన చేయటం. iii) పునశ్చరణ (రివిజన్‌).
ఏ తీరులో సిద్ధమవ్వాలి?
అభ్యర్థి ముందుగా ఒక్కొక్క సెక్షన్‌లో ఉన్న సిలబస్‌ను క్షుణ్ణంగా చదివి ఏయే అంశాలున్నాయో గమనించాలి. వీటిలో యూనిట్‌ వారీగా ఉన్న అంశాలను వివిధ పుస్తకాలు, మెటీరియల్‌ సాయంతో చదువుతూ నోట్సు తయారుచేసుకోవాలి. సిలబస్‌లోని ప్రతి అంశాన్నీ పూర్తిగా చదివి, అర్థం చేసుకొంటూ నోట్సు రూపొందించుకోవాలి.
* ముఖ్యమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
* అంశాలను, సమాధానాలను బట్టీ పట్టకూడదు.
* కొన్నింటిని చదివి, కొన్నింటిని వదిలేయటం సరికాదు.
* అకడమిక్‌ పరీక్షలలో రాసినట్టు కాకుండా ప్రశ్నలకు సమాధానాలు సూటిగా, స్పష్టంగా ఉండాలి. తెలిసిన సమాచారమంతా సందర్భశుద్ధి లేకుండా సమాధానంలో నింపెయ్యకూడదు.
* ప్రశ్న ఏ విధంగా వచ్చినా, ఎన్ని మార్కులకు వచ్చినా సమాధానం రాయగలిగేలా శ్రద్ధ పెట్టాలి.
రెండో దశ...
ప్రతి అంశానికీ సంబంధించిన నోట్సు సిద్ధమయ్యాక అభ్యర్థులు దాన్ని క్షుణ్ణంగా మనసుకు పట్టించుకోవాలి. కీలక అంశాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన వాటిని సారాంశం (సినాప్సిస్‌) మాదిరిగా రాసుకోవచ్చు. ఆపైన ఒక్కొక్క అంశాన్ని చూడకుండా రాయటం అభ్యాసం చేయాలి. అభ్యర్థులు ఎక్కువగా రైటింగ్‌ ప్రాక్టీస్‌పై ఆసక్తి చూపరు. కానీ వివిధ అంశాలను ఎంతగా రాతలో సాధన చేస్తే అంత ఎక్కువగా విజయం సాధించగలుగుతారు. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా సాధన చేస్తూ ఉంటే సమస్యలు తొలగిపోతాయి.
* అంశాలను నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా ప్రిపరేషన్‌ ఉండాలి.
* ఒక్కొక్క ప్రశ్న జవాబును 11, 12 నిమిషాల్లో రాయగలగాలి. ఆరంభంలో ఎక్కువ సమయం పట్టినా తరవాత నిర్ణీత సమయంలోనే రాసే స్థాయికి చేరుకోవాలి.
* 180 నిమిషాలలో పదిహేను ప్రశ్నలకు జవాబు రాయాలి. ఇదే నమూనాలో మీకు మీరుగా ప్రశ్నపత్రం తయారుచేసుకొని నమూనాటెస్టులు రాయండి.
* ఒక అంశంపై వివిధ రకాలుగా ప్రశ్నలు తయారుచేసుకొని సమాధానాలు రాయటం అభ్యసించటం వల్ల ప్రశ్న ఏ విధంగా వచ్చినా జవాబు రాయటం అలవాటవుతుంది.
మూడో దశ ...
ఈ దశలో ప్రతి టాపిక్‌నూ తరచూ పునశ్చరణ చేస్తూ ఉండాలి. దీనివల్ల ముఖ్యమైన అంశాలూ, పదాలను మరిచిపోకుండా గుర్తుంచుకొంటారు. దీనితో పాటు వివిధ టాపిక్‌లకు సంబంధించిన వర్తమాన అంశాలను ఆయా అంశాల నోట్సు వద్ద రాసుకొంటూ ఉండాలి. పోటీ పరీక్షల పత్రికలు, దినపత్రికల నుంచి తెలుసుకొన్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వర్తమాన అంశాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ (అప్‌డేట్‌) ఉండాలి. పరీక్ష తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాత సాధన, పునశ్చరణలు ఎక్కువగా జరగాలి.
వర్తమాన అంశాలు
పేపర్‌ IVలోని మూడు సెక్షన్లలో చాలా అంశాలు టెక్నాలజీ సంబంధ వర్తమాన అంశాలు అయ్యుంటాయి. పరీక్షలో ప్రతి సమాధానంలో దానికి తగ్గట్టుగా వర్తమాన అంశాలు జోడించినట్టయితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. మొదటి సెక్షన్‌లోని మొదటి యూనిట్‌లో భారతదేశం ప్రస్తుతం ప్రతిపాదించిన టెక్నాలజీ మిషన్‌లు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇటీవల తీసుకొన్న చర్యలు వర్తమాన అంశాలతో ముడిపడి ఉన్నాయి.
రెండో యూనిట్‌లో భారతదేశం ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల వివరాలు, వాటి ప్రాధాన్యం, చంద్రయాన్‌ వర్తమాన అంశాలు. మూడో దాంట్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రస్తుతం ఏయే రంగాలలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతోంది అనే అంశానికి సమకాలీనతను జోడిస్తూ రాయాలి. నాలుగో యూనిట్‌లో భారతదేశం అణుశక్తి అభివృద్ధి కోసం కుదుర్చుకొన్న ఒప్పందాలు, సౌరశక్తి వినియోగానికి ఏర్పర్చిన సోలార్‌ టెక్నాలజీ మిషన్‌, శక్తి, డిమాండు తీర్చడానికి భారతదేశం తీసుకొంటున్న చర్యలు తాజా సమాచారం.
ఐదో యూనిట్‌లో భారతదేశం ఆపత్సమయ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, పట్టణీకరణకు చేపడుతున్న జవహర్‌లాల్‌ నెహ్రూ అర్బన్‌ రెన్యువల్‌ స్కీమ్‌ వంటి వర్తమాన అంశాలు రాయగలిగితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
రెండో సెక్షన్‌ మూడో యూనిట్‌లో బయోటెక్నాలజీలో ఇటీవల సాధించిన విజయాలు, ఇటీవల వివాదాస్పదమవుతున్న బీటీ పత్తి, బీటీ వంకాయ వంటివి ముఖ్యమైనవి. నాలుగో యూనిట్‌లో అనేక వ్యాధులకు నూతనంగా కనుగొన్న చికిత్సా విధానాలు, స్వైన్‌ ఫ్లూ, ఎయిడ్స్‌ వ్యాధి నివారణ దిశలో వర్తమాన అంశాలను తప్పకుండా రాయాలి. ఐదో యూనిట్‌లో ఇటీవల రూపొందించిన వ్యాక్సిన్‌లు, వివాదాస్పదమవుతున్న వ్యాక్సిన్లు వంటివి కీలకం.
మూడో సెక్షన్‌ మొదటి యూనిట్‌లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మార్పులు, చేసిన చట్టాలు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, హరిత భవనాలు శ్రద్ధ పెట్టాల్సినవి. మూడో యూనిట్‌లో- జీవ వైవిధ్యం ఎలా నశిస్తోంది, మనదేశం ఇటీవల తీసుకున్న చర్యలు, ముఖ్య వర్తమాన అంశాలు. నాలుగో యూనిట్‌లో ఘన వ్యర్థ పదార్థాలను ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్‌కు ఏ చర్యలు తీసుకోవాలనేది కీలకం. ఐదో యూనిట్‌లో శీతోష్ణస్థితి మార్పు వల్ల భారతదేశంపై కలుగుతున్న, కలగబోయే పరిణామాలు, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న కృషి, ఒప్పందాలు, సదస్సుల వంటి వర్తమాన అంశాలు తప్పనిసరిగా దృష్టి పెట్టవలసినవే.
పునరావృత అంశాల సంగతి
ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నపుడు కొన్ని అంశాలు వివిధ యూనిట్లలో పునరావృతమవుతుంటాయి. లేదా ఒక యూనిట్లో ఒక అంశానికి సంబంధించిన సమాచారం వేరొక యూనిట్లో మరోదానికి ఉపయోగపడుతుంది. ఇలాంటివి గుర్తించి వీటిపై దృష్టిసారిస్తే ప్రిపరేషన్‌ తేలికవుతుంది. ఎక్కువ సమాచారమూ రాసినట్టవుతుంది. ఉదాహరణకు... * సెక్షన్‌ Iఒకటో యూనిట్లో ఉన్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలకు సంబంధించిన జాతీయ విధానం, వస్తున్న మార్పులు అనే అంశానికి ఇతర సెక్షన్లలో ఉన్న వ్యవసాయ, అంతరిక్ష, అణుశక్తి, ఐటీ వంటివాటిలో ప్రస్తుత భారతదేశ విధానాన్ని రాయవచ్చు.
* శీతోష్ణస్థితి మార్పు అనేది సెక్షన్‌Iలోని ఐదో యూనిట్లో, సెక్షన్‌ IIIలోని ఐదో యూనిట్లో కూడా ఉంది.
* ఐటీ ఉపయోగాలు అనే సమాచారాన్ని సెక్షన్‌ Iలోని యూనిట్‌ 3లో, సెక్షన్‌ III లోని యూనిట్‌5 లోని పర్యావరణ, మానవ ఆరోగ్య రంగాల్లో సమాచారం సాంకేతిక విజ్ఞానం పాత్ర అనే అంశంలో రాయవచ్చు.
* సెక్షన్‌IIలోని ఒకటో యూనిట్‌లో ఉన్న రికాంబినెంట్‌ టీకాల ఉత్పత్తి, యూనిట్‌ 5లో ఉన్న ఆధునిక టీకాల ఉత్పత్తి అనే అంశాల్లో ఒకేరకమైన సమాచారాన్ని రాయవచ్చు. ఇదే సెక్షన్లో యూనిట్‌ 3లో ఉన్న పరిసరాల పరిశుభ్ర విధానాల్లో జీవసాంకేతిక విజ్ఞానం పాత్ర అనే సమాచారాన్ని సెక్షన్‌ IIIలోని యూనిట్‌ 4లో రాయవచ్చు.
* జన్యు ఇంజినీరింగ్‌ అనేది బయోటెక్నాలజీలో భాగం కాబట్టి ఈ రెంటిలో ఒకే సమాచారం ఉపయోగపడుతుంది. ఈ విధంగా సంబంధం కలిగిన అనేక అంశాలను గమనించాలి.
అదనంగా 50 మార్కులు
అభ్యర్థులు క్షుణ్ణంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వర్తమాన అంశాలను కలుపుకుని చదివితే పేపర్‌-IV లోని 150 మార్కులతో పాటు పేపర్‌-Iలో ఉన్న 50 మార్కులకు కూడా ఉపయోగం. పేపర్‌-Iలో ఉన్న జాతీయ వర్తమాన అంశాలు, ఆపత్సమయ నిర్వహణ వంటివి పేపర్‌-IVలో కవరవుతాయి. పేపర్‌-IVలో ఉన్న అణుశక్తి రంగం, ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలు, జన్యుపరివర్తన పంటలు (బీటీ కాటన్‌, బీటీ వంకాయ) స్వైన్‌ ఫ్లూ వంటి వ్యాధులు, నూతన వ్యాక్సిన్‌లు, శీతోష్ణస్థితి మార్పు, ఆపత్సమయ నిర్వహణ, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటివి పేపర్‌-Iకు కూడా ప్రాధాన్యమైనవి కాబట్టి ఇలాంటివి ఎక్కువగా చదివితే అదనంగా 50 మార్కులు ఖాయం. 2008లో జరిగిన మెయిన్స్‌ పేపర్‌-Iలో ఆపత్సమయ నిర్వహణ, భారతదేశం ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలు అనేవాటి నుంచి ప్రశ్నలు వచ్చాయి.


 

No comments:

Post a Comment