ఎ.ఎం. రెడ్డి
కెరీర్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్
ఏపీపీఎస్‌సీ త్వరలో నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షల్లోని జనరల్ స్టడీస్‌లో భూగోళశాస్త్రం కీలకమైనది. ముఖ్యంగా గ్రూప్-1 మెయిన్స్‌లో, గ్రూప్-2లో మార్కుల పరంగా దీనికున్న ప్రాధాన్యం గ్రహించి, తగిన సమయం కేటాయించుకోవాలి; వ్యూహాత్మకంగా అధ్యయనం చేయాలి!భూగోళశాస్త్రాన్ని (geography)ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టుగా పేర్కొంటారు. అనేక ఇతర సబ్జెక్టులతో దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలుంటాయి కాబట్టే దీనికీ పేరు! ప్రశ్నలు భౌతిక, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి ఉంటాయి. గ్రూప్-2... దీని వాటా?
గ్రూప్-2 పరీక్షలోని మొదటి పేపర్లో 30 ప్రశ్నలు, మూడో పేపర్ భారతదేశ ఆర్థికవ్యవస్థ మూడో విభాగం నుంచి మరో 20-25 ప్రశ్నలు, మూడో పేపర్ రెండో విభాగం ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థలోని మూడో యూనిట్ నుంచి 20-25 ప్రశ్నలూ వస్తాయి. అంటే గ్రూప్-2 పరీక్షలో... భూగోళశాస్త్రం నుంచి 70-75 ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి దీని ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకోవాలి.
గ్రూప్-1 మెయిన్స్‌లో కీలకం
గ్రూప్-1 మెయిన్స్ నాలుగో పేపర్‌లోని మొదటి విభాగం నుంచి 30 మార్కులకు, మూడో విభాగం నుంచి మరో 30-40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. అంతేకాక భూగోళశాస్త్ర అధ్యయన ఆధారంగా 50 మార్కుల వ్యాసం కూడా వచ్చే అవకాశముంది. ఉదాహరణకు... 1. వాతావరణ మార్పు 2. ఇంధన భద్రత (Energy Security) 3. ఆహార భద్రత- వరదలు- క్షామ పరిస్థితులు మొదలైనవి. ఈ విధమైన వ్యాసరచనకు భూగోళ పరిస్థితుల పరిజ్ఞానం, దాని అన్వయం ఎంతగానో తోడ్పడుతుంది.
రాబోయే పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా భూగోళశాస్త్రం నుంచి వచ్చే ప్రశ్నల తీరును తెలుసుకోవాలి. ఇటీవలికాలంలో జరిగిన వివిధ పోటీ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలస్థాయి, సరళిలో వచ్చిన మార్పులను గ్రహించాలి. ప్రశ్నలు గతంలో మాదిరి మూసలో కాకుండా విషయ అవగాహన ఆధారంగా విశ్లేషణాత్మకంగా వస్తున్నాయి. ఉదాహరణకు... ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ప్రపంచ భూగోళశాస్త్రంలోని లోతైన అవగాహనను పరీక్షించేవిగా ఉన్నాయి. ముందుగా ఇలాంటి ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఎలా సిద్ధం కావాలో పరిశీలిద్దాం.
మనదేశానికే పరిమితం కాదు
భూగోళశాస్త్రమంటే భారతదేశ భౌగోళిక అంశాలు మాత్రమే కాదు. ప్రశ్నలను పరిశీలిస్తే... గతంలో నాలుగైదు ప్రశ్నలకే పరిమితమైవుండే ప్రపంచ భూగోళశాస్త్రం, భౌతిక భూగోళశాస్త్రాలు ఇప్పుడు 10-12 ప్రశ్నలకు పెరిగాయి. మారిన ఈ ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా భౌతిక భూగోళశాస్త్రం అంటే.. భూస్వరూపశాస్త్రం, శీతోష్ణస్థితి శాస్త్రం, సముద్రశాస్త్రాల్లోని మౌలిక అంశాలను అవగాహన చేసుకుని, వాటి అనువర్తనాలపై పట్టు సాధించాలి.
ప్రపంచ భూగోళశాస్త్ర ప్రాధాన్యం
ఈ సబ్జెక్టు నుంచి వచ్చే మొత్తం ప్రశ్నల్లో దాదాపు సగం ప్రపంచ భూగోళశాస్త్రం నుంచి వస్తాయని గుర్తించండి. (భౌతిక భూగోళశాస్త్రాన్ని దీనిలో భాగంగానే పరిగణించాలి. ఎందుకంటే... భౌతిక భూగోళ మౌలిక భావనలు భూగ్రహానికి సంబంధించినవి.)
ఇటీవలి గ్రూప్-1లోని ఈ దిగువ ప్రశ్నలను గమనించండి.
* భూమి వెలుపలి పొరను ఏమని పిలుస్తారు?
* ప్రపంచంలో అతి పెద్ద మహాసముద్రమేది?
* అక్షాంశాలను భూమధ్యరేఖకు సమాంతరంగా ఎటువైపు నుంచి గీస్తారు?
* ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబరు 21న సూర్యుని కిరణాలు దేనిపై నేరుగా ప్రసరిస్తాయి?
ఈ నాలుగు ప్రశ్నలూ భౌతిక భూగోళానికి సంబంధించినవే. కాబట్టి భారతదేశ అంశాలకు పరిమితం కాకుండా భౌతిక భూగోళశాస్త్రంలోని విభాగాలన్నిటిలో ఉన్న మౌలిక భావనలపై పట్టు పెంచుకోవాలి.
పాఠశాల పుస్తకాలే ఆధారం
దీనికోసం మొదట 5,6,7,8,9 తరగతుల పాఠ్యపుస్తకాలను చదివి, తర్వాత ఇంటర్మీడియట్ భూగోళశాస్త్ర పాఠ్యపుస్తకాలను చదవాలి. ఆపై డిగ్రీ స్థాయిలో తెలుగు అకాడమీ ఇటీవల ప్రచురించిన భౌతిక భూగోళశాస్త్రాన్ని చదివితే ఈ విభాగంపై పూర్తి పట్టు సాధించవచ్చు. సాధారణంగా ఎగ్జామినర్స్ అంతా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కాబట్టి వారు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలను అడిగినప్పటికీ మీరు ఇందులోని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించగలుగుతారు.
ఈ అంశాలను చదివేటప్పుడు వాటికి సంబంధించిన చిత్రపటాలపై (మ్యాపులు) దృష్టిని కేంద్రీకరిస్తే పాఠ్యాంశంపై సమగ్ర అవగాహన ఏర్పడి, మనసులో నాటుకుంటుంది.
వీలైతే 8 నుంచి 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను కూడా చదవగలిగితే ప్రిపరేషన్ సమగ్రంగా, సంపూర్ణంగా ఉంటుంది. పరీక్షలో వచ్చే ప్రశ్నలన్నిటికీ కచ్చితమైన సమాధానాలను గుర్తించవచ్చు. ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ప్రతి అంశానికీ ప్రామాణిక చిత్రపటం ఉంటుంది. ప్రపంచ భూగోళశాస్త్ర అధ్యయనానికి అట్లాస్‌తో పాటు ఖండాలవారీగా చిత్రపటాలు లభ్యమవుతాయి. వాటిని ముందుంచుకుని చదివితే సబ్జెక్టు ఇంకా తేలిగ్గా అర్థమవటమే కాకుండా మనసులో స్థిరంగా ఉంటుంది.
భారతదేశ భౌగోళికాంశాలు
వీటి నుంచి దాదాపు 10-12 ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం నుంచి 3-5 ప్రశ్నలూ వస్తాయి. వీటికోసం ముందుగా 8-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను చదవాలి. ఇంకా 8- 10 తరగతి పాఠ్యపుస్తకాల్లోని ఆంధ్రప్రదేశ్, భారతదేశ భౌగోళికాంశాలను చదువుతూ తాజా సమాచారం కోసం ఇండియా ఇయర్‌బుక్‌ను క్షుణ్ణంగా చదవాలి.
సాధారణంగా ఇప్పటివరకూ భారతదేశ శీతోష్ణస్థితి... అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన అంశాలపై అత్యధిక/ అత్యల్ప వర్షపాతం?- లేదా ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ఏవి?- అనే ప్రశ్నలుండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నల స్థాయి పెరిగింది. వివిధ రాష్ట్రాల, వార్షిక గరిష్ఠ, కనిష్ఠ వ్యత్యాసం, సగటు ఉష్ణోగ్రతలపై ప్రశ్నలు వస్తున్నాయని గమనించండి.
గోడలకు చిత్రపటాలు
వివిధ రాష్ట్రాల, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల భౌగోళిక ఆకృతులపై ప్రశ్నలు వచ్చాయి. అంటే... రాష్ట్ర చిత్రపటాన్ని కానీ, జిల్లా చిత్రపటాన్ని కానీ ఇచ్చి వాటిని గుర్తించమని ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ముందుగా భారతదేశ చిత్రపటాన్ని ముందుంచుకుని వివిధ రాష్ట్రాల ఆకృతులనూ, వాటి సరిహద్దులనూ గమనించాల్సివుంటుంది. అలాగే మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆకృతులనూ, వాటి సరిహద్దులనూ కూడా జాగ్రత్తగా గమనించాలి.
మీ స్టడీరూంలో గోడలకు వివిధ చిత్రపటాలను తగిలించి, వీలైనప్పుడల్లా వాటిని పరిశీలిస్తూనే ఉంటే తప్ప ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించలేరు.
ఇంకా ఇతర అంశాలు... పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, నేలలు, అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జీవావరణ కేంద్రాలు, వ్యవసాయ పంటలు, పశుపోషణ, ఖనిజ వనరులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, రవాణా, సమాచార సాధనాలు మొదలైనవాటిని అధ్యయనం చేసేటపుడు ప్రతి అంశాన్నీ తాజాసమాచారంతో జోడించాలి.
* ఆంధ్రప్రదేశ్‌లో కేశోరాం సిమెంటు పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది?
* భారతదేశంలో మాంగనీసును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రమేది?
* (ఈ కిందివాటిలో) ఏ నదీ హరివాణం అధిక భూగర్భ జలాల సంభావ్యాన్ని/ శక్మతను కలిగివుంది?
* ఆంధ్రప్రదేశ్‌లో సీసపు నిల్వలు అధికంగా ఉన్న జిల్లా ఏది?
ఇలాంటివి గతంలో మూసగా అడిగిన ప్రశ్నలకు భిన్నంగా ఉన్నాయని గ్రహించి, ప్రిపరేషన్‌ని దీనికి అనుగుణంగా మార్చుకోవాల్సివుంటుంది.
భారతదేశ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలకు సంబంధించి ముందుగా పేర్కొన్నట్టు గ్రూప్-2 అభ్యర్థులకు మూడో పేపర్లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్ వనరులు, జనాభా శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మొదటి పేపర్లోని భౌగోళికాంశాలకే పరిమితం కాకుండా మూడో పేపర్ కోసం విస్తృతంగా చదవాలి.
ముఖ్యంగా త్వరలో 15వ జనగణన జరగనుంది. కాబట్టి మీ పరీక్షలో 14వ జనగణనపై పూర్తి పట్టు సాధిస్తే 15వ జనగణనపై, ఈ రెంటిమధ్య గల వ్యత్యాసాలపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించగలుగుతారు.
గ్రూప్-1 మెయిన్స్
గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులు కూడా పైన సూచించిన భౌగోళికాంశాలపై పట్టు సాధిస్తే... వ్యాసరచనలో అవసరమైన చోటు ఉదాహరించటానికి చక్కగా తోడ్పడుతుంది. మెయిన్స్ నాలుగో పేపర్ మొదటి విభాగంలోని ఇంధన వనరులు... ముఖ్యంగా పునః స్థాపిత ఇంధన వనరులు- అణుశక్తి మొదలైనవి ముఖ్యం. భూగోళశాస్త్ర కోణంలో వాటి ప్రాధాన్యాన్నీ, లభ్యతనూ, పరిణామాలనూ అధ్యయనం చేయాల్సివుంటుంది. వీటి నుంచి వివిధ కోణాల్లో వచ్చే ప్రశ్నలకు 150 పదాల్లో సమగ్ర సమాధానాలను రాయగలిగే రీతిలో నోట్సును సిద్ధం చేసుకోవాల్సివుంటుంది.
నిజానికి భూగోళశాస్త్రాన్ని అన్ని శాస్త్రాలకూ మాతృక వంటిదని అభివర్ణిస్తారు. అందుకే గ్రూప్-1 అభ్యర్థులు మొదట దీనిపై దృష్టి పెడితే పేపర్-1తో పాటు పేపర్-3లో కొంతవరకూ, పేపర్-4లో చాలావరకూ ప్రశ్నలకు సమగ్ర జవాబులు రాయటం సాధ్యమవుతుంది. |
No comments:
Post a Comment