వ్యాసాన్ని మెరిపించేదెలా?

వ్యాసాన్ని మెరిపించేదెలా?
కొడాలి భవానీ శంకర్‌

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు నిర్దేశించిన వ్యాసరచనను కొందరు తేలిగ్గా తీసుకుంటుంటారు. అది సరి కాదు. దీనిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవటానికి బాగా కసరత్తు అవసరం. పరీక్షలో వ్యాసాన్ని ఎందుకు రాయమని అడుగుతున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేలా వ్యాసం ఉండాలి. అందుకు పకడ్బందీగా సాధన చేయాలి!
భ్యర్థి సృజనాత్మకత, విషయ అవగాహన, నవ్యత, సామాజిక స్పృహ, వర్తమానాంశాల అనుసంధానం, నిర్ణయాత్మక శక్తి, మానసిక పరిపక్వత మొదలైనవి ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించటమే వ్యాస లక్ష్యం. అందువల్ల మనం ఏ విషయంలో వ్యాసం రాస్తున్నామో అందులో వ్యాస లక్ష్యం నెరవేరేలా రాయటమే విజయ రహస్యం! ఈ లక్ష్యాన్ని సాధించాలంటే వ్యాసంలో కొన్ని లక్షణాలు తప్పనిసరి. 1. విషయ సంపూర్ణత: ఏ వ్యాసమైనా దానికి సంబంధించిన విషయంపై సమగ్ర సమాచారం ఇవ్వగలగాలి. మెయిన్స్‌లోని మిగతా పేపర్లలో ప్రశ్నించిన అంశానికి నేరుగా సమాధానం ఇస్తే చాలు. కానీ వ్యాసంలో మాత్రం విషయంతో ముడిపడిన అనేక ఇతర అంశాలను వివరించాలి. అప్పుడే సంపూర్ణత్వం వ్యాసంలో ప్రతిబింబిస్తుంది.
'పక్షి కంటిలోకి చూస్తూ బాణం వేయటం' జనరల్‌స్టడీస్‌ సమాధాన శైలి. దీనికి భిన్నంగా 'పక్షి కంటిలోకి చూస్తూనే దాని పరిసరాలనూ పరిగణనలోకి తీసుకుంటూ బాణం వేయటం' వ్యాసం సమాధాన శైలిగా చెప్పవచ్చు!
2. సమతుల్యత: జనరల్‌స్టడీస్‌ ప్రశ్నల్లో మంచి/చెడు; అనుకూలం/వ్యతిరేకం... ఇలా ఏ కోణంలో అడిగితే ఆ రకంగా రాస్తే సరిపోతుంది. కానీ వ్యాసంలో అడిగినా అడగకపోయినా వివిధ అంశాలను సమతుల్యం (బ్యాలెన్స్‌) చేస్తూ రాయటం అవసరం. అభ్యర్థి భావోద్వేగాలు కూడా సమతుల్యంగా ఉండాలి. ఏదో ఒకవైపు పూర్తిగా మొగ్గి రాయకూడదు!
3. విషయ విశ్లేషణ: వ్యాసం ద్వారా పరిశీలించే కీలక అంశమిది. ప్రశ్న దేనిపై అడిగారో దాన్ని సూక్ష్మం నుంచి స్థూలం వరకూ వివరించాలి. ఇందుకోసం నిర్వచనం, అర్థం, పరిణామం, ఉదాహరణలు, భేదాలు, పోలికలు, ప్రత్యామ్నాయాలు, తులనాత్మక పరిశీలన మొదలైనవి పేర్కొంటూ ఉండాలి. అందుకే విశ్లేషణను 'గడ్డివాము నుంచి సూదిని బయటపడెయ్యటం' అంటారు.
4. సృజనాత్మకత: మెయిన్స్‌లోని మిగతా పేపర్ల ప్రశ్నలకు సృజనాత్మకత జోడించటం కొద్దిగా కష్టమే. కానీ వ్యాస ప్రశ్నలో ప్రత్యేకంగా హద్దులు ఏమీ పేర్కొనరు కాబట్టి ఆ అంశంలోనే అభ్యర్థి వీలైనంత సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు. ఇతర అభ్యర్థుల కంటే విభిన్న సమాచారం, విభిన్న సమర్పణ, భిన్న భావాలు మొదలైనవి సృజనాత్మకతను సాధిస్తాయి.
5. భావ వ్యక్తీకరణ: చెప్పదల్చుకున్నదాన్ని చదివేవారికి (ఎగ్జామినర్‌) చక్కగా చేరవెయ్యగలగటమే భావ వ్యక్తీకరణ. మనసులో ఉన్న భావం కొన్నిసార్లు సబ్జెక్టు సమాచారం ఇచ్చినంత మాత్రాన అవతలివ్యక్తికి పూర్తిగా చేరదు. అందువల్ల సామెతలు, నుడికారాలు, ఉదాహరణలు మొదలైనవాటిని సందర్భోచితంగా వాడితే భావాన్ని సమర్థంగా అందించవచ్చు.
6. భాషపై పట్టు: మెయిన్స్‌లోని మిగతా పేపర్లలో భాషాపటుత్వం పాత్ర పరిమితం. విషయాన్ని అందిస్తే చాలు. కానీ వ్యాసమే భావాల వ్యక్తీకరణ అని గమనించి భాషాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఆంగ్ల పదాలు, ఆంగ్ల వాక్యాలు తెలుగుభాషలో రాస్తున్న వ్యాసంలో రాయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా రాస్తే తెలుగు లిపిలో రాయటం మేలు. Risk బదులు 'రిస్క్‌' అని రాయాలి.
* వ్యవహారంలో ఉన్న భాషనే వినియోగించాలి. మాండలికం, షార్ట్‌కట్‌ పదాలు ఉపయోగించరాదు.
* గ్రాంథిక పదజాలం కూడా వాడకూడదు.
* నిగూఢ, సాంకేతిక పదాలను వీలైనంతవరకూ ఉపయోగించవద్దు. తప్పనిసరై వాడితే వాటి అర్థాలను బ్రాకెట్లలో పేర్కొని, సమాచారం సరిగా అందించాలి.
* చిన్నచిన్న వాక్యాల ద్వారా భావాలను స్పష్టంగా అందించవచ్చు. అందువల్ల పెద్దపెద్ద వాక్యాలు రాయవద్దు.
* ఇంగ్లిష్‌, తెలుగు పదాల కలయికలో వాక్యాలు ఉండరాదు. ఇంగ్లిష్‌ భాషా ప్రభావంతో కర్త-కర్మ-క్రియలను సరైన తెలుగు నిర్మాణంలో రాయకపోవటం వల్ల నష్టం అధికం.
వ్యాస నిర్మాణం
గ్రూప్‌-1 వ్యాసరూప ప్రశ్నల్లో వ్యాసంలో ఉండాల్సిన వివిధ అంశాలను స్పష్టంగా పేర్కొంటున్నారు. అందువల్ల వ్యాసం రాస్తున్నపుడు ఏయే అంశాలకు ఎంత వెయిటేజి ఇవ్వాలనే సూచనకు అభ్యర్థులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు అనుగుణంగానే వ్యాస నిర్మాణం జరగాలి.
2008 గ్రూప్‌-1లో 'భారతదేశ ఆర్థిక సంక్షోభం, వ్యవస్థీకరణ సంస్కరణలు, అభివృద్ధికి గల అంశాలను గురించి' వ్యాసం రాయమన్నారు. ఈ ప్రశ్నలో ఆర్థిక సంక్షోభం నిర్వచనం, ఈ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు (పరిణామం), ఆర్థిక సంక్షోభానికి గురైన ప్రధాన వ్యవస్థలు, వాటి వల్ల దుష్ఫలితాలు, సంస్కరణలకు అవకాశం ఉన్న రంగాలు, ఈ సంస్కరణల వల్ల ఆశించదగిన అభివృద్ధి అనే ప్రధాన కోణాలున్నాయి. ఇవన్నీ రాస్తేనే సంపూర్ణత్వం వస్తుంది. అయితే ఆర్థిక సంక్షోభం పరిణామం, సంక్షోభానికి గురైన ప్రధాన వ్యవస్థలు, చేయదగిన సంస్కరణలు అనేవాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సివుంటుంది. మిగతావాటికి తక్కువ ప్రాధాన్యం, స్వల్ప వివరణలు ఇచ్చినా సరిపోతుంది.
తొలి మెట్టు
వ్యాసం సరైన రీతిలో రాసేందుకు 'చిత్తుప్రతి' తయారుచేసుకోవటం మొదటి సోపానం. చిత్తుప్రతిని తయారు చేయటానికి 7-10 నిమిషాల సమయం వెచ్చించాలి.
* వ్యాసంలో ఏ అంశం తర్వాత ఏ అంశం రాయాలి?
* ఒక అంశంలో ఏయే ఉప అంశాలుండాలి?
* ఏ అంశానికి ఎంతమేరకు ప్రాధాన్యం? దేనికెంత సమయం కేటాయించాలి?
వీటి ఆధారంగా చిత్తుప్రతిని తయారుచేయాలి. తర్వాత వ్యాస రచనకు ఉపక్రమించాలి.
* వ్యాసంలో ఉపోద్ఘాతం ప్రస్తావన మొదటి అంచెగా ఉండాలి. క్లుప్తంగా వ్యాసం ఏయే అంశాలను వివరించబోతోందో తెలియజేయటం ఇందులో ప్రధాన అంశం. లేదా వ్యాసంలోని 'మౌలిక సూత్రం' ఉపోద్ఘాతంలో కనిపించాలి.
* గ్రూప్‌-1 పరీక్ష కాబట్టి ప్రశ్నలో ఇచ్చిన వివిధ భాగాలను అర్థం చేసుకుని, చిత్తుప్రతిలో నిర్ణయించుకున్నరీతిలో వివరణను కొన్ని అంశాలకు అధికంగా, కొన్నిటికి తక్కువగా ఇస్తూ రాయాలి.
* చివర్లో ముగింపు తప్పనిసరి. ఉపోద్ఘాతం, ముగింపు ఒకే స్ఫూర్తిని కలుగజేయాలి. వాటి మధ్య ఉండే సంబంధమే వ్యాసంలోని మధ్య భాగాల్లో ప్రతిబింబించాలి.
'పక్షి కంటిలోకి చూస్తూ బాణం వేయటం'- జనరల్‌స్టడీస్‌కు నప్పే సమాధాన శైలి. వ్యాసానికి ఉండాల్సిన సమాధాన శైలి దీనికి భిన్నం. అది... 'పక్షి కంటిలోకి చూస్తూనే దాని పరిసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని బాణం వేయటం' లాంటిది!

ఇవీ జాగ్రత్తలు
* ఉపశీర్షికలు (సైడ్‌ హెడింగ్స్‌) ఎక్కడో అవసరమైతే తప్ప ఎక్కువగా వినియోగించకూడదు. ఎందుకంటే వ్యాసం సాఫీగా సాగే ప్రవాహంలా కన్పించాలి. సైడ్‌ హెడింగ్‌ పెట్టే అంశాన్ని పేరా మొదటిలైనులో పెద్ద అక్షరాలతో రాస్తే సరిపోతుంది. * ఒకటి రెండు చోట్ల తప్ప, ప్రతి భాగాన్నీ పాయింట్ల రూపంలో రాస్తే వ్యాసంలో ఉండాల్సిన అందం పోయి, జనరల్‌స్టడీస్‌ ధోరణి కనిపిస్తుంది.
* ఎన్ని పేజీలు అనేదానికి ప్రాధాన్యం లేదు. ఎంత బాగా ప్రెజెంట్‌ చేస్తున్నామనేదానిపై దృష్టి నిలపాలి.
* అక్కడక్కడా గణాంకాలు కన్పించాలి కానీ, గణాంకాలే వ్యాసం కాకూడదు. పదాల ద్వారా భావాలు వివరించే ప్రయత్నం ఉత్తమం.
* వ్యాసాలను బట్టీ పట్టకుండా... అర్థం చేసుకుని, రాసేలా సాధన చేయటం చాలా అవసరం.

No comments:

Post a Comment