చెదలుపట్టిన తాళపత్ర గ్రంథాలకూ, వైద్యశిఖామణుల అద్దాల అరలకూ పరిమితమైపోయిన ఆయుర్వేదాన్ని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత చింతలూరు వారిదే. ఇప్పుడా ఔషధాలు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అచ్చతెలుగు ఆయుర్వేద బ్రాండ్ 'వేంకటేశ్వర ఫార్మసీ' ఎనిమిదిన్నర దశాబ్దాల వ్యాపార ప్రస్థానమిది...మంధరపర్వతం కవ్వమైంది. వాసుకి తాడైంది. క్షీరసాగర మథనం ప్రారంభమైంది. దేవతలొక పక్క, రాక్షసులొక పక్క... పోటీపడి చిలికారు.
చింతామణి వచ్చింది. కల్పవృక్షం వచ్చింది. చంద్రుడొచ్చాడు. శ్రీలక్ష్మి వచ్చింది. శంఖం, చక్రం, అమృతపాత్ర, ఆయుర్వేద శాస్త్రం తలోచేతా పట్టుకుని ధన్వంతరి ప్రత్యక్షమయ్యాడు. ఆయుర్వేద విజ్ఞాన సంపదని సవినయంగా స్వీకరించి దక్షప్రజాపతికి, ఇంద్రుడికి, అశ్వినీ దేవతలకు, మహర్షులకు అందించాడు బ్రహ్మదేవుడు. చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు తదితరులు తమతమ కాలాల్లో ప్రజలందరికీ పంచారు. కలియుగంలో ఆ బాధ్యత వేంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి అప్పగించారు.
* * *
చింతలూరు ఫార్మసీ విజయం, నూటికి నూరుపాళ్లు భారతీయ మేనేజ్‌మెంట్ అద్భుతం.
1949లో వెంకటేశ్వర్లు మరణంతో, సూర్యనారాయణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలోనే ఆయుర్వేద నిలయం 'ప్రైవేట్ లిమిటెడ్'గా మారింది. సిబ్బంది సంఖ్య పెరిగింది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు వచ్చిచేరాయి. ఆయుర్వేద నిలయం యాభై ఏళ్ల పండగ కూడా ఘనంగా జరిగింది. నారాయణమూర్తి ఆధునికీకరణకు ప్రాధాన్యమిచ్చారు. గిరాకీకి సరిపడా సరఫరా పెంచడానికి యంత్రాల్ని ఉపయోగించారు. అలా అని సంప్రదాయ పద్ధతుల్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. పాతకొత్తల్ని మేళవించారు. టర్నోవరు లక్షల నుంచి కోట్లకు పెరిగింది. శ్రీరామమూర్తితో మూడోతరం నిర్వహణ వెుదలైంది. ఆయన నాయకత్వంలో టర్నోవరు పదహారు కోట్లకు చేరుకుంది. ఇందులో రెండు కోట్లు విదేశీ ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో చింతలూరు మందులకు మంచి గిరాకీ ఉంది. ఇటలీ నుంచి కూడా వ్యాపార ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రస్తుతం వేంకటేశ్వర ఫార్మసీకి 215 శాఖలున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బలమైన పంపిణీ వ్యవస్థ ఉంది.
శ్రీరామమూర్తి ఆయుర్వేద వ్యాపారంలో కార్పొరేట్ వ్యూహాల్ని అమలుచేస్తున్నారు. ప్యాకింగ్‌లో, ప్రచారంలో సరికొత్త ధోరణులకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్ సిబ్బందికి లక్ష్యాలు పెట్టారు. అన్ని విభాగాల్నీ కంప్యూటరీకరించారు. ఉద్యోగి-యజమాని సంబంధాల విషయంలో ఏ సంస్థ అయినా, ఆయుర్వేద నిలయాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. నలభై ఎనిమిదేళ్ల క్రితం చిన్న గుమస్తాగా చేరిన ఉమామహేశ్వర్లు ఇంకా... తనవంతు సేవలు అందిస్తూనే ఉన్నారు. సంస్థ ఆయన జీవితంలో ఓ భాగమైపోయింది. సిబ్బంది తమది కేవలం ఉద్యోగమనే అనుకోరు. దాన్నో బాధ్యతగా భావిస్తారు. యజమానులు సిబ్బందిని సిబ్బందిలా చూడరు. ఆత్మీయుల్లా ఆదరిస్తారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. పిల్లల పెళ్లిళ్లకు సంస్థ తనవంతు సాయం చేస్తుంది. అవసరమైతే వడ్డీలేని రుణాలు ఇస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఉద్యోగుల సంఖ్య కొంత తగ్గించాల్సి వచ్చినా, సంస్థను నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపంలో ఉపాధి కల్పించారు.
టెక్నాలజీ మేళవింపు
నాణ్యత సాధించడానికి, ఉత్పత్తి పెంచడానికి...మిక్సింగ్ నుంచి ప్యాకింగ్ దాకా ప్రతిదశలోనూ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు నిర్వాహకులు. భారత ప్రభుత్వ అనుమతితో సొంతంగా రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్ (ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేసుకోవడం వెనకున్న లక్ష్యమూ అదే. ఆయుర్వేద నిలయంలో తయారయ్యే ఔషధాల నాణ్యతను ముందుగా ఇక్కడ పరీక్షిస్తారు. తర్వాతే మార్కెట్లో విడుదల చేస్తారు. రాష్ట్రంలో అత్యాధునిక హంగులతో మైక్రోబయాలజీ లేబొరేటరీ ఉన్న ఆయుర్వేద సంస్థ ఇదొక్కటే. గత ఏడాది వేదాశ్వ, వీకే4డయాకాన్ అనే ఔషధాలకు, ఈ ఏడాది హీవోలాక్స్‌కు పేటెంట్లు వచ్చాయి. 'ఆయుర్వేద రంగంలో ఇన్ని పేటెంట్లు సాధించిన సంస్థ మరొకటి లేదు. కాలేయ సంబంధ వ్యాధులకు ఓ మందును తయారుచేస్తున్నాం. మధుమేహ రోగులకు అత్యుత్తమ ప్రయోజనాన్ని అందించే ఔషధాన్ని రూపొందించాం. కీళ్లవ్యాధులను సమర్థంగా నియంత్రించగల మందూ సిద్ధంగా ఉంది. వీటినీ పేటెంట్ చేయబోతున్నాం. మరో నాలుగు మందులకు కూడా పేటెంట్ల కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాం. మా పరిశోధన విభాగం ఆ పన్లో నిమగ్నమై ఉంది' అని చెబుతారు శ్రీరామమూర్తి. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, లక్నోలోని నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు, వివిధ పరిశోధన సంస్థలతో ఆయుర్వేద నిలయం ఒప్పందాలు చేసుకుంది.
అవే విలువలు
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయంలో ఔషధాల తయారీకి ఏటా 10 కిలోల బంగారం, 60 కిలోల వెండి, 70 కిలోల పగడాలు, 50 కిలోల మంచిముత్యాలు, 500 కిలోల పాదరసం వినియోగిస్తారు. సంస్థ తయారు చేసే దాదాపు 26 రకాల ఔషధాల్లో బంగారాన్ని కలుపుతారు.భారత ప్రభుత్వం 1965లో బంగారం మీద కంట్రోలు విధించింది. అప్పట్లో ఆయుర్వేద నిలయంవారు వివిధ ఔషధాల్లో ఏటా ఆరు కిలోలకు పైగా బంగారాన్ని వాడేవారు. కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి రావడంలో కొంత ఆలస్యమైంది. దీంతో ఔషధాల్లో బంగారాన్ని కలపడం కుదరలేదు. దీనివల్ల ఔషధగుణంలో లోపం ఉండదు, కానీ పూర్తిస్థాయి సామర్ధ్యాన్ని చూపలేదు. ఆ సమయంలో 'బంగారం కలపని ఔషధం' అని అట్టమీద స్పష్టంగా ముద్రించేవారు. తయారీ వ్యయం తగ్గింది కాబట్టి, ఔషధాల ధరల్ని కూడా తగ్గించారు. ఆ తర్వాత ప్రత్యేక అనుమతి రావడంతో, తిరిగి బంగారం కలిపిన ఔషధాలు తయారు చేశారు. ఈ విశ్వసనీయతే ఎనిమిది దశాబ్దాలుగా సంస్థను కాపాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐఎస్‌ఓ సర్టిఫికేట్ పొందిన వెుట్టవెుదటి ఆయుర్వేద కంపెనీ కూడా ఇదే.
ఆయుర్వేద ఔషధాల్లో 'చ్యవనప్రాశ'కు చాలా గిరాకీ ఉంది. పేరున్న కంపెనీలన్నీ పోటీపడి ఉత్పత్తిచేస్తున్నాయి. చ్యవనప్రాశ తయారీ అంత సులభం కాదు. శ్రమతో కూడుకున్న వ్యవహారం. కొన్నిరకాల మూలికల కషాయాన్ని మరిగిస్తూ, అందులో మంచి పక్వానికి వచ్చిన ఉసిరిపళ్ల గుజ్జును ఒకే దఫాలో కాకుండా, నిర్ణీత వ్యవధుల్లో కలుపుతూ ఉడికించాలి. ఆ గుజ్జుకు నెయ్యి, పటికబెల్లం, తేనె వంటి పదార్థాలు జోడించి, పాకం చేయాలి. ఆ పాకానికి కొన్ని మూలికా చూర్ణాలు చేర్చాలి. 1998లో ఆంధ్ర విశ్వవిద్యాలయ రసాయనశాస్త్ర విభాగాధిపతి ఎస్.సోమేశ్వరరావు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న చ్యవనప్రాశ లేహ్యాలను పరీక్షించారు. వాటన్నింట్లోకీ ఆయుర్వేద నిలయం తయారుచేసిందే శ్రేష్టంగా ఉందని గుర్తించారు. కొన్ని సంస్థలైతే ఇక్కడి నుంచే టోకుగా తీసుకెళ్లి, సొంతముద్రలు వేసుకున్న దాఖలాలూ ఉన్నాయి.
దేశీ వయాగ్రా పేరుతో చాలా ఆయుర్వేద కంపెనీలు లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల్ని విక్రయిస్తున్నాయి. రెచ్చగొట్టే ప్రకటనలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం మాత్రం తన సంప్రదాయ మార్గాన్ని వీడలేదు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకూ పోలేదు. నిజానికి ఆ సంస్థ సిద్ధమకరధ్వజం, పూర్ణచంద్రోదయం, వసంత కుసుమాకరం తదితర ఔషధాల తయారీలో ఎంతోపేరు తెచ్చుకుంది. వాటినే కొన్ని కంపెనీలు పేరుమార్చి, ప్యాకింగ్ మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి. బలహీనతలతో వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఆయుర్వేద నిలయానికి ఎప్పుడూ లేదు. కల్లో కూడా రాదు.
నాణ్యతకు పెద్దపీట

వూరికి ఉపకారం
ఆయుర్వేద నిలయాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో చింతలూరు ఎలాంటి ప్రత్యేకతలూ లేని కుగ్రామం. సరైన దారిలేదు. పోస్టాఫీసు లేదు. కనీస సౌకర్యాలు లేవు. ఆపేరుతో ఓవూరు ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఆ పల్లెకు ప్రపంచపటంలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది వేంకటేశ్వర ఫార్మసీ. వెంకటేశ్వర్లు అయినా, ఆయన వారసులైనా సొంతూరి అభివృద్ధి విషయంలో తమ బాధ్యతను ఎప్పుడూ మరచిపోలేదు. చింతలూరుతోపాటు, చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఆ కృతజ్ఞతతోనే చింతలూరు గ్రామస్థులు సూర్యనారాయణమూర్తిని పాతిక సంవత్సరాలపాటు ఏకగ్రీవంగా సర్పంచి పదవికి ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని ఆయనెప్పుడూ వమ్ము చేయలేదు. ఆయన హయాంలోనే సిమెంటు రోడ్లు వచ్చాయి. మురుగునీటి పారుదల వ్యవస్థ వచ్చింది. రక్షిత తాగునీరు అందుబాటులోకి వచ్చింది. సొంత ఖర్చులతో పనులు చేయించి, ఆ తర్వాత ఎప్పటికో బిల్లు పాసైతే డబ్బు తీసుకునేవారు. ఊరికి వచ్చే అధికారులందరికీ ఉచితంగా వైద్యం చేశారు. దీంతో వారు, ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసేవారు. వెంకటేశ్వర్లు నిర్మించిన ధన్వంతరి ఆలయం వూరికే వన్నెతెచ్చింది. ధూపదీప నైవేద్యాలకు ఎనిమిది ఎకరాలు విరాళంగా రాసిచ్చారాయన. సర్పంచిగా పాతికేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గ్రామస్థులంతా కలిసి సూర్యనారాయణమూర్తిని 'సర్దార్' బిరుదంతో సత్కరించారు. ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ అభివృద్ధికి కూడా ఆయన తనవంతు సాయం అందించారు. ఒక్క చింతలూరే కాదు, మారుమూల గ్రామాలకు కూడా ఆయుర్వేదం అందాలన్నది ఆ కుటుంబం కోరిక. తొలిదశలో, కరీంనగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నారు.
'అందరికీ ఆయుర్వేదం
ఆయుర్వేదంతో ఆరోగ్యం'...
ఇదే చింతలూరు ఫార్మసీ నినాదం.
No comments:
Post a Comment