సివిల్స్‌కు సిద్ధమా? ఇతర పరీక్షలకూ లాభం!

సివిల్స్‌కు సిద్ధమా? ఇతర పరీక్షలకూ లాభం!
2011 సంవత్సరం నుంచీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలో మార్పులు అమలు కాబోతున్నాయి. సూచనప్రాయంగా యూపీఎస్‌సీ కొన్ని నమూనా ప్రశ్నలను కూడా విడుదల చేసింది. సివిల్స్‌లో ప్రవేశపెట్టిన మార్పులకు సంబంధించి అభ్యర్థుల్లో తలెత్తుతున్న కొన్ని సందేహాలకు జవాబులు ఇవిగో...
* నేను ఇంటర్మీడియట్లో సివిక్స్‌, ఎకనమిక్స్‌, కామర్స్‌ చదివాను. సివిల్స్‌ కెరియర్‌ను దృష్టిలో ఉంచుకుని, డిగ్రీలో బి.ఎ. చేశాను. కొత్త మార్పుల మూలంగా నేను పాసయ్యే పరిస్థితి ఉందా? నా కెరియర్‌ సంగతి ఇక మర్చిపోవలసిందేనా? * చాలామంది అభ్యర్థులు ఇలాంటి భయమే వ్యక్తపరుస్తున్నారు. బేసిక్‌ న్యూమరసీ, డాటా ఇంటర్‌ప్రెటేషన్‌, మెంటల్‌ ఎబిలిటీ విభాగాలుండటం వల్ల వారిలో ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే... ఈ ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. పైగా ఇతర పోటీ పరీక్షలన్నిట్లోనూ బేసిక్‌ న్యూమరసీ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకని టెన్త్‌తోపాటే గణితాన్ని వదిలేసిన విద్యార్థులు తమ లెక్కల నైపుణ్యాలకు పదునుపెట్టుకోవటం మేలు!
మీ సంగతికొస్తే... ఒకవేళ మీరు లెక్కల్లో మరీ బలహీనంగా ఉన్నట్టనిపిస్తే ప్రైవేటు ట్యూటర్‌ సహాయం తీసుకోవటం మంచిది. అంతేగానీ కొత్త మార్పుల కారణంగా మీ సివిల్స్‌ స్వప్నాన్ని వదిలెయ్యకండి. ఈ అవరోధాన్ని మీరు దాటేస్తే... మెయిన్స్‌లో హ్యుమానిటీస్‌ స్ట్రీమ్‌నుంచి సబ్జెక్టులు ఎంచుకున్నపుడు మీకు మొగ్గు లభిస్తుందని మర్చిపోవద్దు!
* మార్పుల్లో ఇంగ్లిష్‌కి ఎందుకంత ప్రాముఖ్యం ఇచ్చినట్టు?
* సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియను 1990లో సతీష్‌చంద్ర కమిటీ సమీక్షించినపుడు విజయవంతులైన ఎందరో అభ్యర్థుల డ్రాఫ్టింగ్‌ నైపుణ్యాలు నాసిరకంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అందుకనే మెయిన్స్‌లో జనరల్‌ ఎస్సే పేపర్‌ను ప్రవేశపెట్టారు. అయితే హిందీ, ఇంగ్లిషు- రెంటిలో ఈ పేపర్‌ రాసే అవకాశం ఉండటం వల్ల అభ్యర్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలకు గ్యారంటీ లేకుండా పోయింది. సరళీకరణా, ప్రపంచీకరణా వచ్చాక అన్నిరంగాల్లోనూ ఆంగ్లభాషా ప్రావీణ్యం అవసరమనే ధోరణి బలపడింది. అందుకనే... ఇంగ్లిష్‌కి ప్రాముఖ్యం ఇచ్చారు.
* ఇంగ్లిష్‌ మరీ ఎక్కువ స్థాయిలో ఉంటుందా? ప్రాంతీయ మీడియాల్లో చదువుకున్న విద్యార్థులు వెనకబడాల్సిందేనా?
* ఇంగ్లిష్‌ టెన్త్‌ స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే ఇది సీబీఎస్‌ఈ లేదా ఐసీఎస్‌ఈ ప్రమాణాల్లో ఉంటుంది కానీ, స్టేట్‌బోర్డుల ప్రమాణాల్లో ఉండదు. మన రాష్ట్రం విషయం చూస్తే... ఇక్కడి టెన్త్‌ ఇంగ్లిష్‌ ఉన్నతస్థాయిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్‌లాంగ్వేజ్‌గా చదివిన ఏ అభ్యర్థికి కూడా సమస్యలెదురుకావు. అయితే ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటూ ప్రాంతీయ మీడియాల్లో టెన్త్‌ రాసిన విద్యార్థులు అదనంగా కృషి చేయాల్సిందే!
* ఈ కొత్త పద్ధతి వల్ల ప్రయోజనాలేమిటి?
* గతంలో సివిల్స్‌ రాయదలిచిన అభ్యర్థి తన ప్రిపరేషన్‌పైనే పూర్తిసమయం వెచ్చించాల్సివుండేది. ఒకవేళ అతడు విజయం సాధించలేకపోతే అప్పటిదాకా కేటాయించిన సమయం వృథా అయ్యేది. ఆ ప్రిపరేషన్‌ మిగతా పోటీ పరీక్షలకు ఉపయోగపడేదే కాదు- మిగతా పరీక్షల పద్ధతులు వేరేగా ఉండేవి కాబట్టి! ఇప్పుడు సివిల్స్‌లో ప్రవేశపెట్టిన కొత్త పద్ధతికీ, ఇతర పరీక్షల పద్ధతులకూ పోలిక వుంది కాబట్టి సివిల్స్‌ అభ్యర్థులు బ్యాంకింగ్‌, మేనేజ్‌మెంట్‌ ప్రవేశపరీక్షలూ మొదలైనవి కూడా రాయటానికి ఆస్కారం ఏర్పడింది!