ఆర్థిక వ్యవస్థలో మార్కుల మర్మం! 'భారత ఆర్థిక వ్యవస్థ- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ' చాలామంది దృష్టిలో జటిలమైన సబ్జెక్టు. గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2 పరీక్షల్లో దీన్ని అధ్యయనం చేయాల్సిన తీరూ, అత్యధిక మార్కులు సాధించే మెలకువల గురించి తెలుసుకుందాం.
గడపర్తి వెంకటేశ్వర్లు
భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశమూ ఇంకోదానిపై ఆధారపడివుంటుంది.
ఒక్కో పాఠ్యాంశంలోని అంశాలూ అనేక అంశాలపై ప్రభావితమై ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు విస్తృతంగా చదవాలి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గ్రూప్-1 అభ్యర్థులు ఆర్థిక విధానాల ప్రభావం సామాజిక వ్యవస్థపై ఎలా ఉంది అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఈ రకంగా అధ్యయనం చేయనందువల్లనే 2008లో నిర్వహించిన గ్రూప్-1 పేపర్-3లో ఎక్కువమంది మంచి మార్కులు సాధించలేకపోయారు.
భారత ఆర్థిక విధానాలు అర్థశాస్త్ర పదజాలంతో ముడిపడివున్నాయి. అభ్యర్థులు ముందుగా అర్థశాస్త్ర పదజాలం అర్థాలనూ, నిర్వచనాలనూ తెలుసుకోవాలి.
ప్రాథమిక భావనలు తెలుసా?
అభ్యర్థులు సాధారణంగా భారత ఆర్థిక వ్యవస్థలోని పాఠ్యాంశాలను నేరుగా చదువుతారు. ఇది సరైన పద్ధతి కాదు. ముందుగా అర్థశాస్త్రంలోని ప్రాథమిక భావనలను తెలుసుకోవాలి. తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలి. ఆపై సిలబస్‌లోని ప్రతి పాఠ్యాంశాన్నీ క్షుణ్ణంగా చదవాలి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రకటించి అమలుపరుస్తున్న ఆర్థిక విధానాల ప్రభావం వివిధ రంగాలపై, సమాజంపై ఎలా ఉన్నదో పరిశీలించాలి.
ఆర్థిక వ్యవస్థను ప్రశ్న- సమాధానం పద్ధతిలో చదువుతుంటారు కొందరు. దీనివల్ల నష్టం ఏమిటంటే... చదివిన ప్రశ్న అడిగితేనే సమాధానం రాయగలుగుతారు. భారత ఆర్థిక వ్యవస్థ పాఠ్యాంశంలోని ప్రతి అంశమూ ఇంకో అంశంపై ఆధారపడివుంటుంది. ప్రతి పాఠ్యాంశంలోని అంశాలూ అనేక అంశాలపై ప్రభావితమై ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు విస్తృతంగా చదవాలి.
ఆర్థిక విషయాలను 'ఒకసారి చదివితే చాలు; గుర్తుంచుకోగల'మని భావించటం సరైంది కాదు. ఒకే అంశాన్ని చాలా పర్యాయాలు చదవటం వల్ల అవగాహన పెరిగి, విస్తృత సమాచారాన్ని సూక్ష్మంగా పది నిమిషాల్లో రాయడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇతరులు రాసిన నోట్సుపై ఆధారపడకూడదు. సంబంధిత పుస్తకాల, దినపత్రికల, పోటీపరీక్షల మాసపత్రికల ఆధారంగా సొంత నోట్సు తయారుచేసుకుంటే మంచిది.
ప్రశ్నలు ఎలా ఉండొచ్చు?
ఇవి మూడు విధాలుగా ఉండొచ్చు. 1. fact oriented 2. concept based 3. application oriented.గ్రూప్-1లో మూడో రకం ప్రశ్నలకు సమాధానాలు రాయటం వల్ల మంచి మార్కులను సాధించవచ్చు.
ఏపీపీఎస్‌సీ మాదిరి ప్రశ్నలను కానీ, 2008లో ఏపీపీఎస్‌సీలో అడిగిన ప్రశ్నలను గానీ పరిశీలిస్తే ప్రతి అధ్యాయంలోనూ ఒక ప్రశ్న పాఠ్యాంశానికి సంబంధించినదైతే మరోటి అనువర్తనీయాంశంలో అడిగారు. పైగా ప్రశ్నలు విభజనాత్మకంగా ఉన్నాయి. ఉదా: జాతీయ, తలసరి ఆదాయం పెరుగుదల ధోరణులను తెలుపుము. జాతీయ తలసరి ఆదాయాలు నెమ్మదిగా పెరగటానికి కారణాలేమిటి?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాసేటపుడు మొదటి భాగాన్ని గణాంకాలతో వివరించాలి. రెండో భాగానికి ఆచరణాత్మకంగా జవాబు రాయాలి.
ప్రశ్నలన్నీ పది మార్కులకు అడుగుతారేమోననే భావంతో అభ్యర్థులు తమ అధ్యయనాన్ని కొనసాగిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. కొన్ని సందర్భాల్లో 5 మార్కులూ, 2 మార్కుల ప్రశ్నలను కూడా అడగవచ్చు. ఇలాంటి సందర్భంలో 10 మార్కుల కంటే 5 మార్కులూ, 2 మార్కుల ప్రశ్నలకు సమాధానం రాయటం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. దీనికోసం ప్రతి పాఠ్యాంశాన్నీ విపులంగా చదువుకోవాలి.
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గ్రూప్-1 సిలబస్‌ను పరిశీలిస్తే మొదటి, ఐదో అధ్యాయాల్లో ఆర్థిక సిద్ధాంతాల కోణంలో ప్రశ్నలు అడగవచ్చు.
ఉదా: 2008లో ప్రభుత్వ వ్యయ నియమాలను గురించి రాయండి. ఈ ప్రశ్నకు సమాధానంగా విత్తశాస్త్రంలోని వ్యయ నియమాలను గురించి రాయాలి.
3, 4, 5 పాఠ్యాంశాల్లో ప్రశ్నలను 'కాలానుగుణంగా ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక చలాంకాల్లో, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రభావం ఉంటుంది' అనే కోణంలో అడగవచ్చు. ఉదా: ఇటీవలికాలంలో పేదరిక పరిమాణాల్లో వ్యత్యాసాలున్నాయి. కారణాలేమిటి? చర్చించండి. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు రాయాలంటే వివిధ కమిటీలు, వివిధ నిపుణుల బృందాలు పేదరికాన్ని నిర్వచించడానికి తీసుకున్న ప్రాతిపదికల ఆధారంతో రాయాలి. కాబట్టి సిలబస్‌లోని పాఠ్యాంశాలను ఆచరణాత్మకంగా చదువుకోవాలి.
గణాంకాలు అవసరమా?
గ్రూప్-1లో కానీ, గ్రూప్-2లో కానీ ప్రశ్నలకు సమాధానాలు రాసేటపుడు గణాంకాలు ఎంతవరకు ఉపయోగపడతాయనే సందేహం చాలామందిలో ఉంటుంది. మానవ ఆకృతికి 'ఎముకల గూడు' ఎలాంటిదో ఆర్థిక వ్యవస్థకు గణాంకాలు అలాంటివి. కాబట్టి ప్రశ్నలకు సమాధానాలను గణాంకాల ఆధారంతోనే రాయాలి. వాటిని ఆధారం చేసుకునే ఆర్థిక వ్యవస్థలో వస్తున్న నిర్మాణాత్మక మార్పులను విశ్లేషించాలి. సందర్భోచిత గణాంకాలతో విశ్లేషణాత్మకంగా రాయాలి.
ఉదా: భారత ఆర్థిక వ్యవస్థలో ఆదాయం, ఉపాధికల్పనలో వివిధ రంగాల్లో వచ్చిన నిర్మాణాత్మక మార్పులను విశ్లేషించండి.
ఇలాంటి ప్రశ్నలు అడిగినపుడు 1951లో ఆదాయంలో వివిధ రంగాల వాటా ఏ విధంగా ఉన్నదీ, 1991లో ఏ విధంగా ఉన్నదీ, 2008-09 నాటికి ఏ విధంగా ఉన్నదీ తెలిపే గణాంకాలను పట్టిక రూపంలో రాసి విశ్లేషించాలి.
ఆదాయంతో పాటు ఉపాధి కల్పనలో వివిధ రంగాల వాటాల్లో వచ్చిన మార్పులను గణాంకాలతో పట్టిక రూపంలో వివరించి విశ్లేషించాలి. ఆదాయంలో వివిధ రంగాల వాటాల్లో వచ్చిన అనుపాత నిష్పత్తికి సమానంగా ఉపాధి కల్పనలో మార్పులు ఎందువల్ల సంభవించలేదో విశ్లేషించాలి.
గణాంకాల సేకరణ
ఈ సేకరణ కొంచెం క్లిష్టమైనదే. ఒక పుస్తకంలోని గణాంకాలకూ, మరో పుస్తకంలోని గణాంకాలకూ కొంత వ్యత్యాసం ఉంటుంది. ఆ పుస్తక రచయిత ఏ ఆధారంగా గణాంకాలను సేకరించాడో, దానివల్ల కొంతమేరకు వ్యత్యాసాలుంటాయి. ఆర్థిక సర్వే 2009-10, సామాజిక ఆర్థిక సర్వే 2009-10 నుంచీ, ప్రభుత్వ ప్రచురణల ద్వారా గణాంకాలను సేకరించుకోవాలి. అవసరాన్ని బట్టి సంఖ్యా రూపంలో ఉన్న గణాంకాలను శాతాల్లోకి మార్చుకుంటే సులభంగా గుర్తుంచుకోవచ్చు.
ప్రతి అధ్యాయానికి సంబంధించిన గణాంకాలనూ పట్టికల రూపంలో రాసుకుని, ప్రతిరోజూ వాటిని పరిశీలిస్తూవుంటే సులభంగా గుర్తుంచుకోడానికి వీలుంటుంది.
గ్రూప్-1, 2 సిలబస్ ఒకటేనా?
చాలామంది అభ్యర్థులు గ్రూప్-1,2 సిలబస్‌లలో పూర్తిగా వేరని భావిస్తుంటారు. గ్రూప్-1లోని సిలబస్‌లో 70 శాతం వరకూ గ్రూప్-2 సిలబస్. గ్రూప్-1 మెయిన్స్ ప్రశ్నలకు సరైన సమాధానాలను సమర్థంగా రాయడానికి గ్రూప-2 ప్రాతిపదిక. రెండు పరీక్షలకూ సిద్ధమవుతున్నవారు రెంటినీ అనుసంధానం చేసుకుని చదివితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. గ్రూప్-1కి సిద్ధమవుతుంటే గ్రూప్-2కు కూడా చదువుతున్నట్లేనని గుర్తుంచుకోవాలి.
* ప్రభుత్వరంగానికి కావలసిన ఆర్థిక వనరుల సేకరణ, ఇటీవలి ప్రణాళికల్లో ప్రభుత్వ రంగ అభివృద్ధికి కావలసిన వనరులను ఏయే మార్గాల ద్వారా సమీకరించుకున్నారు? * ఆర్థిక సంస్కరణలకు ముందు, తర్వాత రంగాలవారీగా వనరుల కేటాయింపులో వచ్చిన మార్పులు * ప్రణాళికల ఉమ్మడి సామాజిక ఆర్థిక లక్ష్యాలు, ప్రతి ప్రణాళికల ప్రాధాన్యాలు * సంస్కరణలకు పూర్వం- తర్వాత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ-ప్రైవేటు రంగాల పాత్ర * ప్రణాళికల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు * ప్రణాళికల విజయాలూ వైఫల్యాలూ * ప్రణాళికల్లో సాధించిన వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి, చేపట్టిన కార్యక్రమాలు * పదో ప్రణాళిక విజయాలు- వైఫల్యాలు * 11వ ప్రణాళిక లక్ష్యాలు, మధ్యంతర సమీక్ష ఈ విషయాలపై సమగ్ర అవగాహన కలిగి, అడిగిన ప్రశ్నకు సూటిగా, సంక్షిప్తంగా జవాబు రాయాలి. కొన్ని సందర్భాల్లో 2, 5 మార్కుల ప్రశ్నలు కూడా అడిగే అవకాశముంది. |
* పేదరిక స్వభావం, కారణాలు * పేదరికం అంచనాలు, నివారణ చర్యలు * పేదరికంపై ఆర్థిక సంస్కరణల ప్రభావం. * ఇటీవలి పేదరికపు అంచనాల్లో వ్యత్యాలుండటానికి కారణాలు? * నిరుద్యోగిత అంచనాలు, పరిమాణం, నివారణ చర్యలు * అమల్లో ఉన్న పేదరిక- నిరుద్యోగ నివారణ పథకాలు |
No comments:
Post a Comment