రాజకీయ వ్యవస్థలో... వ్యూహాత్మక సన్నద్ధత


రాజకీయ వ్యవస్థలో... వ్యూహాత్మక సన్నద్ధత
కొడాలి భవానీ శంకర్‌

రాజకీయాలలో రాణించటానికి వ్యూహాలు ఎలా అవసరమో గ్రూప్స్‌ పరీక్షల్లో మంచి మార్కులు సాధించటానికి కూడా తగిన వ్యూహాలు అలాగే ఉపయోగకరం. ముఖ్యంగా భారత రాజకీయ వ్యవస్థ (Indian Polity)లో మెరుగైన ఫలితాలను సాధించటానికి ఏమేం అనుసరించాలో తెలుసుకుందాం.
భారత రాజ్యాంగంలో సులభంగానే ప్రశ్నలు వస్తాయని చాలామంది అభ్యర్థులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తూ అంతిమంగా తక్కువ మార్కులు సాధిస్తున్నారు. గత గ్రూపు-1 మెయిన్స్‌లో ఎక్కువమందికి తక్కువ మార్కులు పేపర్‌- 2లోనే నమోదయ్యాయి. అభ్యర్థులు రాసిన సమాధానాలు పరీక్షలు దిద్దేవారికి సంతృప్తిని ఇవ్వకపోవడమే అందుక్కారణం.
వ్యూహం 1:
గ్రూప్‌-1 మెయిన్స్‌, గ్రూప్‌-2 పరీక్షల్లో పాలిటీ సిలబస్‌ దాదాపుగా ఒకే రకంగా ఉంది. మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌ రీత్యా, గ్రూప్‌-2 ఆబ్జెక్టివ్‌ స్వభావరీత్యా గ్రూప్‌-1 మెయిన్స్‌కి అదనంగా కొన్ని పాఠ్యాంశాలను కలిపారు; కొన్నిటిని తీసివేశారు. ఈ విషయాన్ని గమనించి ఆ రెండు సిలబస్సులనూ అనుసంధానం చేసుకుని చదవటం వల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.
వ్యూహం 2:
గ్రూప్‌ - 1, గ్రూప్‌ -2ల పరీక్ష స్వభావరీత్యా కొన్ని పాఠ్యాంశాలు ఆయా పరీక్షలకు అనువుగా ఉండవు. అందువల్ల వాటిపైన తక్కువ దృష్టి నిలపవచ్చు.
గ్రూప్‌-1 ప్రిపరేషన్‌లో తక్కువ ప్రాధాన్యం ఇవ్వగల్గినవి.
ఛాప్టర్‌ 1: రాజ్యాంగ పరిణామాలు, ప్రాథమిక విధులు, 2: రాజ్యాంగబద్ధమైన సంస్థల అధికారాలు, విధులు, 3: శాసన వ్యవస్థల సంక్షోభాలు, దత్తశాసనంపై కార్యానిర్వాహక నియంత్రణ, 4: సమాజ వికాస ప్రయోగం, 5: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, మహిళా కమిషన్‌, మైనార్టీ కమిషన్‌
గ్రూప్‌- 2 ప్రిపరేషన్‌లో అవగాహనకు పరిమితం అవదగినవి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకి పెద్దగా అవకాశం లేనివి.
ఛాప్టర్‌ 1: ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల సంబంధం, 3: 73, 74 రాజ్యాంగ సవరణల అమలు, 5: శాసన వ్యవస్థల పతనం
వ్యూహం 3:
గ్రూప్‌- 2 ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి అన్ని అధ్యాయాలూ, పాఠ్యాంశాలూ చదవాల్సిందే. కాకపోతే కొన్ని పాఠ్యాంశాల నుంచి ఆ అధ్యాయానికి కేటాయించిన మొత్తం ప్రశ్నలలో సగం కంటే ఎక్కువ రావచ్చు. వాటిపై అధిక దృష్టిని నిలపడం వల్ల ఎక్కువ లాభపడవచ్చు.
గ్రూప్‌-1: కోర్‌ పాఠ్యాంశాలుగా గుర్తించదగినవి.
ఛాప్టర్‌ 1: రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సమాఖ్య విశిష్ట లక్షణాలు.2008 సంవత్సరం పరీక్షలో ప్రవేశిక, సమాఖ్యలపై ప్రశ్నలు అడిగారు. ఈసారి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలపై ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువే.
2: కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనివార్యంగా ప్రశ్నల రూపంలో వస్తున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి రావచ్చు. సిలబస్‌లో ప్రస్తావించకపోయినా, ఈసారి అంతర్రాష్ట్ర సంబంధాలు, కేంద్రం పాత్రని కూడా పరిశీలించడం ఆహ్వానించదగింది.
3: ఏక సభ, ద్విసభ శాసన వ్యవస్థలు- జవాబుదారీ, విధులు, సంక్షోభాలు, శాసన వ్యవస్థ పతనంపై తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్ర విధానపరిషత్‌ ఏర్పాటుకు అనుకూల/ ప్రతికూల వాదనలు, పార్లమెంటరీ విధానం ప్రాముఖ్యం - ప్రత్యామ్నాయాలు, శాసన వ్యవస్థల పతనానికి దారితీస్తున్న పరిస్థితులపై లోతైన అధ్యయనం జరపాలి. దత్త శాసనం కూడా ఇంతే ప్రాధాన్యం కలిగింది కాబట్టి ఏదో ఒక విధానంపై దృష్టిని నిలపవచ్చు.
4: పంచాయతీరాజ్‌ వ్యవస్థపై తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గత పదిహేడేళ్ల పంచాయతీరాజ్‌ అనుభవాలపై మూల్యాంకన కోణంలో విశ్లేషణాత్మకంగా సిద్ధపడితే మంచిది.
5: ఎస్సీ, ఎస్టీల సంక్షేమ ఏర్పాట్లు ప్రాధాన్యతా అంశం. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమగ్ర అవగాహన ఉంటే ఈ ఛాప్టర్‌లోవచ్చే ప్రశ్నల్ని ఎదుర్కోవటం సులభమే. 'మానవ హక్కుల కమీషన్‌' వర్తమాన పాఠాలలో చదవదగిన అంశం.
గ్రూప్‌ 2: ఆబ్జెక్టివ్‌ పరీక్షా విధానం కాబట్టి గ్రూప్‌-1లో అనుసరించే ఛాయిస్‌ పద్ధతి అనుసరించదగింది కాదు. కాకపోతే ఈ కింది పాఠ్యాంశాలపై దృష్టిని అధికంగా నిలపటం ద్వారా ఎక్కువ ఫలితాలను రాబట్టవచ్చు.
ఛాప్టర్‌ 1: రాజ్యాంగ చరిత్ర, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, 2: సమాఖ్య, ఏక కేంద్ర భేదాలు. శాసన, కార్యనిర్వాహక, అర్థిక పరమైన విధుల విభజన, 3: పంచాయతీరాజ్‌ పరిణామం- 73, 74 రాజ్యాంగ అంశాలు ఆర్టికల్స్‌ వారీగా, 4: మొత్తం అంశాలు, 5: కేంద్ర, రాష్ట్ర శాసన వ్యవస్థల నిర్మాణం (ఆర్టికల్‌ వారీగా). కేంద్ర రాష్ట్ర శాసన వ్యవస్థల విధులు.
వ్యూహం 4:
ఇప్పటివరకూ జరిగిన అన్ని పోటీ పరీక్షల్లోనూ పాలిటీ ప్రశ్నల్ని తయారుచేసేందుకు ఎగ్జామినర్‌ వర్తమానాంశాల అనుసంధానానికిఅధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. జరుగుతున్న రాజ్యాంగ సవరణలు, వివాదాస్పదమైన రాజ్యాంగ అంశాలు, న్యాయస్థానాలు విశ్లేషించిన రాజ్యాంగ ఆర్టికల్స్‌, తాజాగా రూపొందించిన ప్రధాన చట్టాలు మొదలైన కోణాలలో ఎప్పటికప్పుడు అభ్యర్థి పాలిటీ అంశాల్ని అనుసంధానం చేసుకోవాలి.
* చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు
* స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ శాతం పెంచే యత్నం.
* నూతన రాష్ట్రాల ఏర్పాటు/పరిణామం
* రాష్ట్రపతి/గవర్నర్‌ క్షమాభిక్ష అధికారం
* ఆర్టికల్‌ 371 ద్వారా ప్రత్యేక ప్రయోజనాన్ని పొందిన రాష్ట్రాలు.
 





ఆర్టికల్స్‌, సంవత్సరాలు, వ్యక్తుల పేర్లు, నిర్మాణ అంచెలు, అధికారాలు, విధులు ఒక్కటొక్కటిగా గుర్తు పెట్టుకొనే ధోరణి కొంతవరకు 
అవసరమే. కానీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల్లో కూడా విశ్లేషణని కోరే ప్రశ్నలు వస్తున్నాయి. అటువంటి వాటికి సన్నద్ధమవటం ప్రాధాన్యం కలిగిన అంశం!
ఇలాంటి అంశాలు గత తొమ్మిది నెలల్లో జరిగిన అంశాలకు అనుసంధానమైనవే. వీటన్నిటిని జాగ్రత్తగా అధ్యయనం చేయటం అవసరం.
గ్రూప్‌-1 మెయిన్స్‌లో కూడా అదే తరహాలో ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వవిద్యాలయాలు, ఇతర విషయాలలో ప్రదర్శిస్తున్న క్రియాశీలత నేపథ్యంలో....
* కర్ణాటక గవర్నర్‌... అసెంబ్లీ సభ్యుల సభ్యత్వం రద్దు చేసేందుకు హెచ్చరిక, రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రతిపాదన నేపథ్యంలో ఎగ్జామినర్‌ దృష్టి గవర్నర్‌ అధికారాలపై పడవచ్చు.
ప్రశ్న: భారత రాజ్యాంగం రబ్బర్‌ స్టాంప్‌ వంటి గవర్నర్‌ని ఏర్పర్చలేదు. సంక్షోభ నివారకుడిగా, సంక్షోభకారిగా మారే అవకాశాలు ఇచ్చింది. మీరేమంటారు?- తరహాలో అడిగే అవకాశం ఉంది.
* సభ్యుల అర్హతలు/అనర్హతలు (పార్టీ ఫిరాయింపుల కోణంలో) నిర్ణయించే అధికారాలు స్పీకర్‌కి ఉండటం... కర్ణాటక శాసనసభలో జరిగిన సంఘటనల నేపథ్యంలో...
ప్రశ్న: స్పీకర్‌ తటస్థత భారత రాజ్యాంగ వ్యవస్థలో అనుమానాస్పదమే. చట్టసభల విలువల పతనంలో స్పీకర్‌ కూడా భాగస్వామే. విశ్లేషించండి.- ఈ తరహా ప్రశ్నలు అడగొచ్చు.
వ్యూహం 5:
గ్రూప్‌- 2 పాలిటీలో రాజ్యాంగ సంబంధిత జీకే ప్రశ్నలు అడగటం కూడా ఎక్కువే. సాధారణంగా రాజ్యాంగ అంశాలు, వాటికి సంబంధించిన వర్తమాన అంశాలు అడుగుతుంటారు.
2008 గ్రూప్‌ 2లో...
మొదటి స్పీకర్‌ ఎవరు?
పార్లమెంట్‌ భవన రూపశిల్పి ఎవరు?
రాష్ట్రపతి భవన రూపకర్త ఎవరు?
మొదలైన ప్రశ్నలు అడిగారు. వీటి సంఖ్య పది వరకు ఉన్నందున అభ్యర్థులు ఈ విషయాలపై కూడా దృష్టి నిలపడం అవసరం.
గ్రూప్‌-1లో సిలబస్‌ సంబంధితంగానే ప్రశ్నలు ఉంటాయి. కాకపోతే కొంత జనరల్‌గా ప్రశ్నలు అడుగుతారు. జి.కె. ఓరియెంటేషన్లో ఉండవు.
వ్యూహం 6:
ప్రిపరేషన్‌లో సమతుల్యత ఉంటే ప్రశ్న రూపంలో ఫ్యాక్ట్‌ ఓరియంటేషన్‌లో ఉన్నా, విశ్లేషణాత్మకంగా ఉన్నా సరైన సమాధానాలు ఇవ్వగలుగుతారు.
గ్రూప్‌ 2: అభ్యర్థులు ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి బిట్స్‌ రూపేణా చదువుతారు. చాలామంది అభ్యర్థులు ఆర్టికల్స్‌, సంవత్సరాలు, వ్యక్తుల పేర్లు, నిర్మాణ అంచెలు, అధికారాలు, విధులు ఒక్కటొక్కటిగా గుర్తు పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ ధోరణి కొంతవరకు అవసరమే కానీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలలో కూడా విశ్లేషణని కోరే ప్రశ్నలు వస్తున్నాయి. అటువంటి వాటికి సన్నద్ధమవటం పాలిటీలో ప్రాధాన్యత కలిగిన అంశం.
గ్రూప్‌ 1: అభ్యర్థులు సునిశితంగా గమనిస్తే 2008 ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నలలో అధిక భాగం అభ్యర్థి సమతుల్యతని ప్రశ్నించేవే.
* పంచాయతీరాజ్‌ విజయవంతం కాని దేవుడు?
* మహిళా రిజర్వేషన్లలో ఇమిడిన రాజకీయాలు?
* 356వ అధికరణం సద్వినియోగించటం కన్నా ఎక్కువగా దుర్వినియోగం చేశారు... వ్యాఖ్యానించు.
* 'విధులు రాష్ట్రాలకు ఇచ్చి కేంద్రమే నిధులు ఉంచుకొంటోంది' అనే వాదనతో ఏకీభవిస్తారా?
ఈ తరహా ప్రశ్నలు అన్నిటికీ అభ్యర్థికి 'నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే' ప్రతి విషయాన్నీ రెండు వైపులా విశ్లేషించే నిపుణతని ప్రదర్శించాలి. ఆ విధంగా ప్రతి పాఠ్యాంశాన్ని విశ్లేషించే సామర్థ్యం పొందితేనే మంచి మార్కులు సొంతం అవుతాయి.

No comments:

Post a Comment