బెంగాలీ బాంబు!

కారల్‌మార్క్స్‌ 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాస్తే, మమతాబెనర్జీ 'యాంటీ కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాశారు. మూడున్నర దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మార్క్సిస్టు పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి... తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు ఆ రాయల్‌బెంగాల్‌ ఆడపులి!
మ్యూనిస్టు కోట కుప్పకూలిన ఆనవాళ్లు... గుట్టలుగుట్టలుగా ఎర్రజెండాల పీలికలు... ఓటమి గాయాలతో కామ్రేడ్ల మూలుగులు... చెదపురుగుల పాలైనమార్క్సిస్టు సాహిత్యం. ఆ శిథిలాల మధ్య నుంచి మమతాబెనర్జీ నడుస్తున్నారు. ఎప్పట్లాగానే రబ్బరు చెప్పులు.
ఎప్పట్లాగానే ముతక చీర.
ఎప్పట్లాగానే చిందరవందర జుత్తు.
ఎప్పట్లాగానే భుజానికి గుడ్డ సంచి.
వెుహంలో మాత్రం...
ఎప్పుడూ కనిపించని విజయగర్వం!
సుదీర్ఘ పోరాట ఫలితమిది. ఈరోజు కోసమే ఇన్నేళ్లూ ఎదురుచూశారు. ఈ విజయం కోసమే ఎన్నాళ్లుగానో కలలుగన్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం దగ్గరైతే సందడే సందడి. జయజయధ్వానాలు. కరతాళధ్వనులు. విజయహారతులు. బాణసంచా పేలుళ్లు. మీడియా కెమేరాల మెరుపులు. పాత్రికేయుల పాతరోత ప్రశ్నలు. ఎవరో కాళికతో పోలుస్తున్నారు. ఇంకెవరో ఇందిరమ్మను గుర్తుచేసుకుంటున్నారు. ఇక, ఢిల్లీ పీఠమే మిగిలిందని అంచనాలు వేస్తున్నారు. ఏవో... ఎవరు చెప్పగలరు? సంకీర్ణాల యుగంలో ఏదీ అసాధ్యం కాదు. అయినా, పదీపదిహేనేళ్ల నాడు... కమ్యూనిస్టుల ఉక్కుకవచం తుక్కుతుక్కు అవుతుందని ఎవరైనా వూహించారా? ఆ ఎరుపుజెండా మెరుపు తగ్గిపోతుందని ఏ నిపుణుడైనా విశ్లేషించాడా? కాకలుతీరిన కామ్రేడ్లు కాడి వదలాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఏ పెద్దమనిషైనా అంజనమేసి చెప్పాడా?
అటువైపు... యోధానయోధులు. సుశిక్షిత కార్యకర్తలు. వ్యూహప్రతివ్యూహాల్లో ఆరితేరిన సలహాబృందాలు. గగుర్పాటు కలిగించే విప్లవాల చరిత్ర. చేతినిండా అధికారం. గల్లాపెట్టె నిండా నిధులు.
ఇటువైపు... మామూలు మహిళ. ఆస్తిపాస్తుల్లేవు. రాజకీయ వారసత్వం లేదు. చెప్పుకోదగ్గ అనుచరగణమూ లేదు. కొంత రాజకీయానుభవం, కొండంత ఆవేశం... అవే ఆమె అర్హతలు.
ఆ ఒంటరి నారి... వింటినారి సవరిస్తుంటే అంతా వినోదంలా చూశారు. ఆ పడతి పైటబిగిస్తుంటే... ఫక్కుమని నవ్వారు. ఆ గాండ్రింపులకు భయపడిందెవరు? ఆ ప్రతిజ్ఞలను పట్టించుకుందెవరు? నవ్వినచోటే, ఓట్లచేను పండింది. మూడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతూ వస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్టు ప్రభుత్వం... కుప్పకూలిపోయింది. మమత విజేతగా నిలిచారు.
సంకెళ్లు తెంచుకుని...
వందేళ్లు నిండిన కాంగ్రెస్‌. వందకు దగ్గర్లో ఉన్న వృద్ధనేతలు. పేరుకు రాజకీయ పార్టీయే కాని, నరనరానా పెత్తందారీ పోకడలే. స్వతంత్ర భావాల్ని స్వాగతించలేని ఛాందసవాదుల సమూహం. సొంత గొంతుకల్ని నొక్కిపడేసే ఖద్దరు పెద్దల గుంపు. సీతారాం కేసరి ముక్కుతూ మూలుగుతూ కాంగ్రెస్‌ అధ్యక్షపదవిలో నెట్టుకొస్తున్నరోజులవి. చేవలేకపోయినా, చేతకాకపోయినా... ఒక్కసారి, ఒక్కసారైనా ప్రధాని పీఠం మీద కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారా వృద్ధనేత. సరిగ్గా అదే సమయానికి కలకత్తా నగరంలో కాంగ్రెస్‌ ప్లీనరీ జరుగుతోంది. మమతకు మాత్రం పిలుపులేదు. పిలవని పేరంటాలకెళ్లడం ఆమెకెప్పుడూ అలవాటు లేదు. కానీ, పిలవాలన్న ఆలోచన లేని పెద్దమనుషులకు బుద్ధిచెప్పడం ఎలాగో బాగా తెలుసు. ప్లీనరీ వేదికకు కూతవేటుదూరంలోనే బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు. 'ఏమిటీ? కేసరి నన్ను పార్టీలోంచి బహిష్కరిస్తారా? బహిష్కరించనివ్వండి? నేనూ ఆయన్ని బహిష్కరిస్తాను'... అంటూ ఏకంగా అధ్యక్షుడికే సవాలు విసరాలంటే ఎంత దమ్ముండాలి? ఆ తిరుగుబాటు స్వరం ప్రజలకు నచ్చింది. కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు.
కాంగ్రెస్‌ పార్టీని వీడాలన్న ఆలోచన మమతకు ఏ కోశానా లేదు. పరిస్థితులే అందుకు ప్రేరేపించాయి. వారసత్వం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా... స్వశక్తితో వ్యక్తిత్వసంపదతో నాయకురాలిగా ఎదిగారామె. మమతాబెనర్జీ కలకత్తాలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. పదిహేనేళ్ల వయసులో తండ్రి మరణించారు. మంచానపడిన మనిషికి వైద్యం చేయించలేనంత పేదరికం. వెుత్తం ఆరుగురు సోదరులు. పెద్దతమ్ముడి టీకొట్టే కుటుంబానికి ఆధారం. ఆ నాలుగురాళ్లతో గుట్టుగా నెట్టుకురావాల్సిన బాధ్యత మాత్రం మమతదే! పదింటికంతా ఇంటి పనులన్నీ ముగించుకుని కాలేజీకి వెళ్లేవారు. సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్లు చెప్పేవారు. రాజకీయాల మీద ఆసక్తితో కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగంలో చేరారు. ఓసారి ఏదో బహిరంగ సభలో మాట్లాడుతుంటే, అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్‌రే చూశారు. కారు ఆపి మరీ, శ్రద్ధగా ప్రసంగం విన్నారు. ఆ ఉపన్యాసపటిమే విద్యార్థి నేతను ప్రజానాయకురాలిగా తీర్చిదిద్దింది. కొద్దికాలంలోనే, రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా విభాగంలో చురుకైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాదవ్‌పూర్‌ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేసే అవకాశమూ వచ్చింది. ప్రత్యర్థి ఎవరో కాదు... కమ్యూనిస్టు దిగ్గజం సోమనాథ్‌ చటర్జీ. ముపైశ్ఫ ఏళ్లు కూడా నిండని ఆ యువతి ఆత్మవిశ్వాసం ఓటర్లను అబ్బురపరిచింది. ఇందిరాగాంధీ హత్యతో పెల్లుబికిన సానుభూతి కూడా తోడైంది. మమతాబెనర్జీ నలభై ఎనిమిదివేల మెజారిటీతో గెలిచారు. అదో సంచలనం! ఫలితాలు ప్రకటించగానే మమత నేరుగా సోమనాథ్‌ ఇంటికెళ్లి ఆశీర్వాదాలు అందుకున్నారు. 'ప్రజల తీర్పునే కాదు... ప్రత్యర్థి పెద్దరికాన్ని కూడా గౌరవించాలి' అన్న ఆలోచన ఆమె వ్యక్తిత్వానికి మచ్చుతునక. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో, కాంగ్రెస్‌పార్టీ బెంగాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎదురుగాలి మమతనూ ఓడించింది. మళ్లీ 1991లో దక్షిణ కలకత్తా నియోజకవర్గం నుంచి గెలిచారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో యువజన శాఖ చేపట్టారు. అంతకంటే పైకెదగనివ్వలేని పరిస్థితులే ఆమెను నిరాశకు గురిచేశాయి. పార్టీలోని వెన్నుపోటు రాజకీయాలు మరింత ఇబ్బందిపెట్టాయి. దానికితోడు, బెంగాల్‌ కాంగ్రెస్‌ పెద్దలు ఎన్నికల్లో తమ పీఠాలు కాపాడుకోడానికి కమ్యూనిస్టుల అడుగులకు మడుగులొత్తుతుంటే కడుపుమండిపోయేది. ఏదో ఒకరోజు కమ్యూనిస్టుల్ని గద్దె దించాలన్న కోరిక మనసులో బలపడిపోయింది. అదేం అకారణ ద్వేషం కాదు. మార్క్సిస్టుల పాలనలో అవినీతి పెచ్చుపెరిగింది. అధికార దుర్వినియోగం సర్వసాధారణమైంది. ఆ అవినీతిని నిలదీయాలి. ఆ దుర్వినియోగానికి అడ్డుకట్టవేయాలి. కాంగ్రెస్‌లో ఉంటే అది అసాధ్యమని అర్థమైపోయింది. అందుకే, బయటికొచ్చి కొత్తపార్టీని స్థాపించారు. ఇదీ కాంగ్రెసే. కానీ, పెత్తందార్ల కాంగ్రెస్‌ కాదు. వృద్ధ జంబూకాల కాంగ్రెస్‌ కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌... అంటే, అట్టడుగు కార్యకర్తల కాంగ్రెస్‌! మమత భారతీయ జనతాపార్టీతో జతకట్టినా, అది ఎక్కువకాలం నిలబడలేదు. ఆ స్నేహం కారణంగా, బెంగాల్‌లోని మైనారిటీలు తనకు దూరమయ్యే ప్రమాదం ఉందని అర్థమైపోయింది. మళ్లీ కాంగ్రెస్‌కే దగ్గరయ్యారు. దగ్గరకావడం అంటే సాగిలపడటం కాదు, రాజీపడటం కాదు, వ్యక్తిత్వాన్ని చంపుకోవడం కాదు. ప్రజా ప్రయోజనాల్ని పణంగా పెట్టడం కాదు. ఎన్నికల సమయంలో కొద్దిపాటి రాజకీయ సర్దుబాటు. అంతే, అంతకుమించి ఎలాంటి ప్రాధాన్యం లేదు. అవసరమనుకుంటే, ఆ బంధాన్ని తెంచుకోడానికి కూడా ఎప్పుడూ వెనుకాడరు. అంతెందుకు, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంత బతిమాలినా ఇవ్వాలనుకున్న సీట్లకుమించి, ఒక్కటి కూడా అదనంగా ఇవ్వలేదు. ఆ పట్టుదల తెలుసు కాబట్టి, కాంగ్రెస్‌ అధిష్ఠానమూ కిమ్మనకుండా పుచ్చుకుంది. తృణమూల్‌కు కాంగ్రెస్‌ అవసరం కంటే, కాంగ్రెస్‌కు తృణమూల్‌ అవసరమే ఎక్కువ. పందొమ్మిది మంది ఎంపీలతో ఆపార్టీ యూపీఏ-2లో ప్రధాన భాగస్వామి. బెంగాల్‌లో కాంగ్రెస్‌ పరిస్థితీ ఏమంత గొప్పగా లేదు. మహా అయితే, తృణమూల్‌కు ఓ తోకపార్టీ! అసెంబ్లీ ఫలితాలే, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం అయితే, మమత కేంద్రంలో మరింత శక్తిమంతురాలు అవుతారు.




 
ఉద్యమాల జీవితం
మమతాబెనర్జీకి కుట్రలు తెలియవు. కుతంత్రాలు తెలియవు. ఓట్లకోసం కోట్లకుకోట్లు కుమ్మరించగల స్థోమతా లేదు. ఇన్నేళ్ల ప్రజాజీవితంలో, రాజకీయాల్లో నిలదొక్కుకోడానికి అవసరమైన అవలక్షణాలేవీ ఒంటబట్టించుకోలేదామె. అయినా, ఎలా నిలవగలిగారు? ఎలా గెలవగలిగారు?ప్రజాప్రతినిధులంతా తెలుసుకోవాల్సిన రాజకీయ సత్యమిది. సామాన్యుల తరపున నిలబడే ధైర్యం ఉంటే, సమస్యల మీద పోరాడే తెగువ ఉంటే, ఎన్ని వైఫల్యాలొచ్చినా తట్టుకోగల గుండె దిటవు ఉంటే... ఏదో ఒకరోజు గెలుపు పిలుపు వినిపిస్తుంది! మమతా బెనర్జీ విషయంలోనూ అక్షరాలా అదే జరిగింది. ఆమె చేసిన పోరాటాలకూ ఉద్యమాలకూ లెక్కేలేదు. దాడుల్ని తట్టుకున్నారు. లాఠీదెబ్బల్ని భరించారు. హత్యాయత్నాలూ జరిగాయి. ప్రత్యర్థుల విమర్శలు, పార్టీలో కుమ్ములాటలు... ఆమె స్త్థెర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. అయినా వెనుకడుగు లేదు. గెలిచినా గెలవకపోయినా, ఎన్నికలున్నా లేకపోయినా... ప్రజల మధ్యే ఉన్నారు. ప్రజల్నే నమ్ముకున్నారు. ప్రజలను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు!
అతికొద్దిమంది నేతల్లో కనిపించే అరుదైన లక్షణం... నిజాయతీ. పెద్దగా ఆధారాల్లేని ఒకట్రెండు విమర్శలు తప్పిస్తే...మమతాబెనర్జీ ప్రజా జీవితంలో ఎలాంటి అవినీతి మరకలూ లేవు. లంచాలూ వాటాలూ సిఫార్సులూ ఆమె గడప తొక్కడానికి కూడా భయపడతాయని చెబుతారు బాగా ఎరిగినవారు. కొత్తగా కేంద్రమంత్రి అయిన రోజుల్లో... ఓ రియల్‌ఎస్టేట్‌ గొడవలో మాటసాయం చేయమంటూ సొంత తమ్ముళ్లే ఎవర్నో తీసుకెళ్లారు. ఆమెకు పైరవీలంటే గిట్టదు. ఆచెంపా ఈచెంపా వాయించాలన్నంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు. గబగబా నాలుగు చీరలు సూట్‌కేసులో సర్దేసుకుని మౌనంగా ఇంట్లోంచి వచ్చేశారు. నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయి అక్కడే మకాం పెట్టారు. అదే ఆమె సమాధానం. పేరుకు రైల్వేమంత్రి అయినా, విలాసాల బోగీల్లో ఎప్పుడూ ప్రయాణించింది లేదు. బహుమతులకూ నజరానాలకూ ఆమె ఆమడదూరం, అవి చిన్నవైనా సరే. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు, ఓ ముస్లిం అభిమాని ప్రేమతో శాలువా ఇవ్వబోయాడు. వెుదట తిరస్కరించారు. కానీ ఆ అభిమాని ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడో అని, 'నేను బహుమతులు ఇష్టపడను. ప్రేమతో ఇస్తున్నావు కాబట్టి, అంతే ప్రేమతో అందుకుంటున్నా' అంటూ చిరునవ్వుతో స్వీకరించారు. ఆ అభిమాని కళ్లలో ఆనందబాష్పాలు!
మమతకు చాలా విషయాల మీద స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే, వెుహమాటం లేకుండా విమర్శిస్తారు. కడిగిపారేస్తారు. ఎదుటి వ్యక్తి... రాష్ట్రంలోని కమ్యూనిస్టు నేత కావచ్చు. కేంద్రంలోని కాంగ్రెస్‌ అధినేత్రీ కావచ్చు. అమాయక ప్రజల భూముల్ని లాక్కుని టాటాలకు అప్పగించారన్న కారణంతో 'నానో'ను వ్యతిరేకించిన మమత... సాక్షాత్తూ తన నేతృత్వంలోని రైల్వే మంత్రిత్వశాఖలో విస్తరణ కార్యక్రమాల కోసం సామాన్యుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదించినప్పుడూ అంతే కచ్చితంగా కాదన్నారు. 'అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. పారిశ్రామికీకరణనూ కాదనను. ఆ పేరుతో పేదల ఉసురు తీస్తే మాత్రం సహించేది లేదు' అని తేల్చిచెప్పారు. చుక్కల్ని తాకే నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆమె ప్రతిపక్షాల కంటే ముందున్నారు. 'ధరలకు పగ్గాలు వేయడానికి ఓ స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని నేనెప్పుడో చెప్పాను. అయినా మీరు పట్టించుకోలేదు' అని సర్కారు మీద విరుచుకుపడ్డారు. 'మమత నిరంకుశ నాయకురాలు. నలుగుర్నీ కలుపుకువెళ్లడం అస్సలు తెలియదు' అన్న విమర్శకు నందిగ్రామ్‌, సింగూర్‌ పోరాటాల ఘనవిజయమే సమాధానం. ఆమె వివిధ ప్రజాసంఘాలతో కలిసి పనిచేశారు. చిన్నాపెద్దా నాయకులతో వేదిక పంచుకున్నారు. వేలమందిని ఒక తాటిమీద నడిపించారు. ఆ ఉద్యమాలు మార్క్సిస్టు పాలకులకు చెమటలు పట్టించాయి.
ఓరోజు మమతాబెనర్జీ ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. దార్లో ట్రాఫిక్‌జామ్‌! ఏమిటా అని అద్దాల్లోంచి తొంగిచూస్తే... రోడ్డు ప్రమాదం. ఓ యువకుడు కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మమత పరుగుపరుగున అక్కడికెళ్లారు. క్షతగాత్రుడిని తన కార్లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మాట పెళుసే కానీ, మనసు వెన్న. ఎదుటి మనిషి కష్టాల్ని చూసి తట్టుకోలేరు. కన్నీళ్లు పొంగుకొచ్చేస్తాయి. అంత సున్నిత మనస్తత్వాన్ని ఏ కళాకారుల్లోనో చూస్తాం. నిజానికి, మమతలో ఓ మంచి కళాకారిణి ఉన్నారు. ఆమెకు చదవడం ఇష్టం. రాయడం ఇష్టం. బొమ్మలు గీసుకోవడం ఇష్టం. హావభావాల్ని పలికిస్తూ రవీంద్రుడి గీతాంజలి చదువుకోవడం మరీమరీ ఇష్టం. 'వేర్‌ ద మైండ్‌ ఈజ్‌ విథవుట్‌ ఫియర్‌...' ...ఠాగూర్‌ కవితాపంక్తిని తరచూ ఉటంకిస్తుంటారు. 'బద్లా నోయి, బద్లా ఛాయి' (మాకు మార్పు కావాలి, ప్రతీకారం కాదు), మా... మాటి... మనుష్‌ (తల్లి, నేల, ప్రజలు) తదితర నినాదాల్లో ఆమె సాహితీ స్పృహ తొంగిచూస్తుంది.
మంకుపట్టు మహారాణి
మమత అనుకుందంటే, ఆ పని జరిగిపోవాల్సిందే. నిబంధనలూ గిబంధనలూ జాన్తానై. చూస్తాం, ఆలోచిస్తాం అంటే కుదర్దు. మాటకు లొంగకపోతే... హెచ్చరిస్తారు, బెదిరిస్తారు, కయ్యానికి కాలుదువ్వుతారు. ఆమెను బుజ్జగించడానికి నానాకష్టాలూ పడినవారిలో సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఉన్నారు. ఎదుటివ్యక్తి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. ఎంత పేరున్న నేత అయినా కావచ్చు. ఆ ధాటికి తలవంచాల్సిందే. పెట్రోలు ధరల పెంపు విషయంలో అమర్‌సింగ్‌ను నలుగుర్లో నిలదీశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించినందుకు దరోగా ప్రసాద్‌ సరోజ్‌కూ అలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ తనకు తెలియకుండా బెంగాల్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు రచ్చరచ్చ చేశారు.
పేరుకు మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గ సహచరురాలే అయినా, తనను తాను సర్వస్వతంత్రురాలిగానే భావించుకుంటారు మమత. తన మద్దతుతో నడిచే ప్రభుత్వంలో తన నిర్ణయానికి తిరుగేం ఉంటుందన్న ధైర్యమూ కావచ్చు. కేబినెట్‌ అనుమతులేవీ లేకుండానే బెంగాల్‌ మీద వరాల వర్షం కురిపించుకున్నారు. షాలిమార్‌ దగ్గర ఆటోహబ్‌, గూడ్స్‌యార్డు మంజూరు చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. సింగూర్‌లో కోచ్‌తయారీ పరిశ్రమ పెట్టాలన్నది ఆమె ఆలోచన. పాపం, ప్రధానమంత్రి! అవునన్నా తిప్పలే. కాదన్నా తిప్పలే. ఆ మంకుపట్టు వల్ల ఆమె కొన్ని శత్రుత్వాల్ని కొనితెచ్చుకుని ఉండవచ్చు. చిన్నాచితకా ఇబ్బందులూ ఎదురై ఉండవచ్చు. కానీ ఆ మంకుపట్టే లేకపోతే, శత్రుదుర్భేద్యమైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చేసేవారు కాదు. ఆ మంకుపట్టే లేకపోతే అన్నన్ని వైఫల్యాల్నీ అవమానాల్నీ తట్టుకుని నిలబడేవారే కాదు. ఆ మంకుపట్టే లేకపోతే ఎవరెన్ని అనుకున్నా పట్టించుకోకుండా, పెద్దపెద్ద రైల్వే ప్రాజెక్టుల్ని రాష్ట్రానికి తరలించుకు వెళ్లేవారే కాదు. బెంగాలీల హృదయాల్లో స్థానం సంపాదించేవారే కాదు.
సృష్టికర్త ప్రతిజీవి ఆత్మరక్షణ కోసం ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కొన్ని వెుక్కలకు ముళ్లిచ్చాడు. కొన్ని వెుక్కలకు ముడుచుకుపోయే గుణం ఇచ్చాడు. కొన్నింటికి దురదపుట్టించే లక్షణం ఇచ్చాడు. వూసరవెల్లిలాంటి జీవులకు రంగుమార్చుకునే వెసులుబాటూ కల్పించాడు. మనుషుల విషయానికి వచ్చేసరికి పరిస్థితులకూ అనుభవాలకూ అనుగుణంగా తమనుతాము మలుచుకునే గుణం ఇచ్చాడు. మమతాబెనర్జీ బాల్యంలో చాలా సౌమ్యురాలు. నలుగురి మధ్యకు వెళ్లాలంటేనే ముడుచుకుపోయేవారు. ఎదిగేకొద్దీ జీవితానుభవాలు పెరిగేకొద్దీ... ఆమె ఆలోచనలూ స్వభావం మారుతూ వచ్చాయి. పెద్ద కూతురిగా తండ్రి మరణం తర్వాత ఇంటి బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. పురుషాధిక్య సమాజంలో ధైర్యంగా నిలబడటానికి అవసరమైన లక్షణాల్ని కూడా అప్పుడే ఒంటబట్టించుకుని ఉంటారు. ఎదుటి వ్యక్తులు మితిమీరిన చొరవ ప్రదర్శించకుండా, తనకున్న పరిమితుల్ని అలుసుగా తీసుకోకుండా... గాంభీర్యాన్నీ గయ్యాళితనాన్నీ రక్షణ కవచంలా ఉపయోగించుకుని ఉండవచ్చు. నిజానికి, మమత రాజకీయ జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. సొంతపార్టీ పెట్టుకోగానే ఘనవిజయాలు వరించలేదు. ఒంటరి సభ్యురాలిగా పార్లమెంటులో చాలా అవమానాలే ఎదుర్కొన్నారు. ఆ నిస్పృహ ఆమె మాటల్లో చేతల్లో వ్యక్తంకావడం అసహజమేం కాదు. ఒకటి మాత్రం నిజం. ఆ కోపతాపాల్నీ పంతాల్నీ పట్టింపుల్నీ మమత ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికే అలకపాన్పులెక్కారు.

 
బెంగాల్‌ మీదే బెంగ!
ఏ శాఖ నిర్వహించినా, ఏ హోదాలో ఉన్నా... మమత మనసెప్పుడూ బెంగాల్‌ మీదే! మనసొక్కటేనా, మనిషీ బెంగాల్‌లో ఉండటానికే ఇష్టపడతారు. పేరుకు కేంద్రమంత్రే అయినా, ఢిల్లీలో గడిపేది తక్కువే. తను ఏ శాఖ చూస్తే, ఆ శాఖ పద్దుల్లో సొంతరాష్ట్రానికే సింహభాగం. రామ్‌విలాస్‌పాశ్వాన్‌ రైల్వేమంత్రిగా ఉన్నరోజుల్లో... బెంగాల్‌కు తగినన్ని నిధులు కేటాయించలేదని తన ఒంటిమీదున్న శాలువాను ఆయన వెుహం మీదికి విసిరేసి, సభ నుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాష్ట్రానికి ఏదో ప్రాజెక్టు మంజూరు చేయలేదని పరిశ్రమల మంత్రి క్యాబిన్‌ ముందు ధర్నా చేయడానికీ వెనుకాడలేదు. ఎలాగైనా సరే, మార్క్సిస్టులను మట్టికరిపించాలన్న కోరికే కాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి ఎంతోకొంత మంచి చేయాలన్న తపనా ఉంది ఆమెలో. ఆ చిత్తశుద్ధిని బెంగాలీలు కాస్త ఆలస్యంగా అయినా గుర్తించారు. 2008 పంచాయతీ ఎన్నికల్లో తూర్పు మిడ్నాపూర్‌, 24 పరగణా ప్రాంతంలో మంచి ఫలితాలు అందించారు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో 19 లోక్‌సభ స్థానాల్లో గెలిపించారు. మూడున్నర దశాబ్దాలుగా పట్టంకడుతున్న మార్క్సిస్టులను కాదని, అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీని అందించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం బెంగాల్‌ పరిస్థితి కూడా ఏమంత గొప్పగాలేదు. శాంతిభద్రతల్ని పునరుద్ధరించాలి. పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థికంగా మెరుగుపరచాలి. నిజానికి కమ్యూనిస్టులను ఓడించడం కంటే, ఇదే పెద్ద సవాలు. ఆ విషయం ఆమెకూ తెలుసు. మమత మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.

పచ్చని పల్లె!




రైతంటే ఆత్మహత్యలే ఎందుకు గుర్తుకు రావాలి? సేద్యంలో అప్పులే ఎందుకు మిగలాలి? పొలిమేరలో కాలుపెట్టగానే క్రిమిసంహారకాల వాసనే ఎందుకు గుప్పుమనాలి? 'రసాయన రహిత గ్రామం'గా రికార్డుకెక్కిన వరంగల్‌జిల్లాలోని ఏనెబావి... పల్లెలకు పాఠం, రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి నిదర్శనం.


గ్రామీణ స్వావలంబన గురించి ఏ సదస్సులో చర్చకు వచ్చినా ఆ వూరిపేరే చెబుతారు. క్రిమిసంహారకాల్లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఆ వూరినే ఉదాహరణగా చూపుతారు. నీటి పొదుపు గురించి ఎవరు అధ్యయనం చేయాలన్నా ఆ వూరికే వస్తారు. విత్తనాల కొరతను అధిగమించడం ఎలాగో ఆ వూరి రైతులనే అడుగుతారు. 'అప్పుల్లేని రైతులు ఎక్కడైనా ఉన్నారా' అన్న ప్రశ్నకూ ఆ వూరే సమాధానం.
...ఏనెబావి!
ఆ గ్రామస్థుల ఆలోచనలు, నిర్ణయాలు, శ్రమజీవనం, పర్యావరణ ప్రియత్వం... అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్నాయి. దాదాపు 30 వేలమంది రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు... ఆ పల్లెను పర్యాటక కేంద్రమంత ఆసక్తితో తిలకించారు. ఆధ్యాత్మిక క్షేత్రమంత భక్తితో దర్శించుకున్నారు. ఆ ఘనత వెనుక చాలా శ్రమ ఉంది. సంఘర్షణ ఉంది. వైఫల్యాలున్నాయి. చేదు అనుభవాలున్నాయి. ఆ రైతులు అన్నింటినీ భరించారు, ఎదిరించారు, గెలిచారు, చరిత్రకెక్కారు.
అనగనగా...
ఏనెబావి శివారు పల్లె. వరంగల్‌ జిల్లా జనగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని లింగాలఘనపురం మండలంలో ఉంది. మాణిక్యపురం గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. 280 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆ పల్లెలో 51 కుటుంబాలు ఉన్నాయి.
జనాభా... పిల్లాపెద్దా కలిసి 207 మంది. నిజమే, చాలా చిన్న పల్లెటూరే. కానీ, ఆ పల్లె వెనుక పెద్ద కథే ఉంది.
జనగామ డివిజన్లోని గ్రామాలన్నీ ఇంకా తెలంగాణ సాయుధ పోరాట ప్రభావంలో ఉన్న సమయమది. పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం సాగిస్తున్నారు. నర్మెట్టలో భూస్వామ్య వ్యవస్థ ఛాయలు పూర్తిగా సమసిపోలేదు. ఉన్నపొలమంతా నలుగురైదుగురు సంపన్నులదే. పల్లెపల్లెంతా పాలేర్లే! కొన్ని కుటుంబాలవారు ఆ బానిస బతుకులు బతకలేక..సంకెళ్లు తెంచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దగ్గర్లోని ఓ గ్రామంలో ముస్లిం భూస్వామికి పదిహేనువందల ఎకరాల బంజరుభూమి ఉందని ఎవరో చెప్పారు. ఆ నేలను సాగుచేసుకోవాలన్న ఆశ కలిగింది. ఆ పంజరంలోంచి బయటపడాలన్న ఆకాంక్ష పెరిగింది. తమ ఆలోచన తెలిస్తే పెత్తందార్లు కళ్లెర్రజేస్తారేవో అన్న భయవెుకవైపు. ఇట్టెబోయిన యాదయ్యకు ఆ సంగతులింకా గుర్తున్నాయి... ''మాది నర్మెట్ట. లింగాలఘనపురం నుంచి ఓ శాలాయన బట్టలు తెచ్చి అమ్మేవాడు. ఓ వూళ్లో వందల ఎకరాల బంజరు భూమి ఉందని అతనే మా పట్వారీకి చెప్పాడు. పట్వారీ మాకు చెప్పాడు. 1962లో మాకున్న గుడిసేగుట్టా అమ్ముకుని వెుత్తం అయిదు కుటుంబాల వాళ్లం బయల్దేరాం. ఆతర్వాత ఇంకో ఎనిమిది కుటుంబాలు వచ్చాయి. ముందుగా, నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరికి చేరుకున్నాం. ఆ ఊరి సంపన్నుడిదే భూమి. ఆస్తులన్నీ అమ్మగా వచ్చిన డబ్బంతా పోగేస్తే పాతికవేలైంది. 133 ఎకరాలు కొన్నాం. కొనడమైతే కొన్నాం కానీ... అంతా బీడుభూమి. ఎటుచూసినా రాళ్లూరప్పలే. ఎదురుగా ఏనె (చిన్న గుట్టలాంటిది), పక్కనే బావి. ఏనెబావి అని పిలుచుకున్నాం!
ఆ భూమిని సాగులోకి తీసుకురావడానికి రెక్కలు ముక్కలు చేసుకున్నాం. అదే బతుకన్నంత కష్టపడ్డాం. నిద్రలేచింది వెుదలు... చికటి పడేవరకూ... అదే పని, అదే ధ్యాస! ఆకలి తెలియదు, దప్పిక తెలియదు. మాకు కష్టం కొత్తకాదు. కానీ ఎప్పుడూ మాకోసం మేం కష్టపడింది లేదు. మా చెమటంతా పెత్తందార్ల కోసమే ధారపోశాం. ఇప్పుడు... మా కోసం మేం శ్రమిస్తున్నాం. ఆ మట్టి మాది. ఆ నీరు మాది. ఆ గడ్డిపరక మాది. అందుకేనేవో, మాకు అలసట తెలియలేదు. భూమి ఒక చోట..కాపురం మరోచోట అయితే సేద్యం సాగదని తొందర్లోనే అర్థమైంది. అందుకే ఏనెబావి దగ్గరే తాటి కమ్మలతో గుడిసెలు వేసుకున్నాం''.
అలా పల్లె పుట్టింది. పొలం సిద్ధమైంది.
రంకెలేస్తూ బసవన్న వచ్చాడు. ఉత్సాహంగా కాడె భుజానికెత్తుకున్నాడు. లక్షణంగా గోవుమాలచ్చిమి వచ్చింది. ఇంటింటా పాలు పొంగించింది. కామధేనువు కాలుపెట్టింది. మరి, కల్పవృక్షం! చెరువే కల్పవృక్షమైంది. చేనుకు చేవ రావాలంటే, భూమిలో జీవం ఉండాలి. అదేవో బీడు భూమి. అంత సారవంతమైన మట్టి ఎక్కడ దొరుకుతుంది? ఆ చెరువులోని మట్టికి పరుసవేది విద్య తెలుసు. ఆ స్పర్శతో పంట బంగారమవుతుంది. తలోచేయీ వేసి మట్టిని తరలించారు. 'చెరువు మా కన్నతల్లి..కంటి పాప. బుక్కెడు బువ్వ నోట్లోకి పోతోందంటే... మా గరిసెల్లో ధాన్యం కుప్పలున్నాయంటే... ఆ చెరువు మట్టే కారణం' అంటారు ఏనెబావి ప్రజలు.



గుణపాఠం...
ఓ రైతు. అతని దగ్గర రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు. కొంతకాలం సంతోషంగానే ఉన్నాడు. మెల్లగా దురాశ వెుదలైంది. దురాలోచన వేధించింది. కడుపుకోస్తే బోలెడన్ని బంగారు గుడ్లు దొరుకుతాయని ఆశపడ్డాడు. మిగిలిందేమిటి? నిరాశే! చిన్నప్పుడు చదువుకున్న కథే. పెద్దయ్యాక, ఆ కథలోని నీతి తెలియాల్సిన సమయానికి మన ఆలోచనారీతి దారితప్పిపోతుంది. ఏనెబావి విషయంలోనూ అదే జరిగింది. కొంతకాలానికి సంప్రదాయ సేద్యం వెుహంవెుత్తిపోయింది. రసాయన ఎరువులు చూసిన కళ్లకి... చెరువు మట్టి ఆనలేదు. క్రిమిసంహారకాల ఘాటు ముందు... పెంటకుప్పలు చిన్నబోయాయి. మరింత పంట పండాలి? మరింత దిగుబడి కావాలి? మట్టిని గట్టిగా పిండుకుందాం. సారాన్ని బలవంతంగా పీల్చుకుందాం. రసాయన ఎరువులు వెదజల్లుదాం. క్రిమిసంహారకాలు పిచికారీ చేద్దాం.
... రైతు రైతులా ఆలోచించినంత కాలం వ్యవసాయం హాయిగా సాగింది. ఎప్పుడైతే వ్యాపారిలా ఆలోచించడం వెుదలుపెట్టాడో... ఆక్షణమే పతనం వెుదలైంది. ఏనెబావి కూడా అందుకు మినహాయింపు కాదు. 1975 నుంచి 1995 దాకా... అది వ్యవసాయం కాదు. రసాయన విధ్వంసం. కృత్రిమమైన దిగుబడి. విచ్చలవిడిగా ఎరువులేశారు. వేలకొద్దీ పెట్టుబడులు పెట్టారు. మితిమీరిన ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయాన్ని జూదంతో పోలుస్తారు. యాదృచ్ఛికమే కావచ్చు కానీ, జూదానికి అలవాటుపడిన కొత్తలో రాబడి బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అనిపిస్తుంది. అది కాకి బంగారమని తెలియడానికి ఎంతోకాలం పట్టదు. తెలిసేలోపు, పరిస్థితులు అదుపుతప్పిపోతాయి. ఇక్కడా అంతే. ఒకటిరెండు పంటలు విరగపండాయి. డబ్బే డబ్బు! రైతు రెచ్చిపోయాడు. పెట్టుబడి రెట్టించాడు. ఇంకో లోడు ఎరువులు దించాడు. క్రిమిసంహారకాలు టోకున కొన్నాడు. ఆ దెబ్బకి చిడపీడలు రాటుదేలిపోయాయి. మందుల్ని తట్టుకునే సత్తువ కూడగట్టుకున్నాయి. రైతన్న పప్పులు ఉడకలేదు. అప్పులే మిగిలాయి. అదో పాడుకాలం. పంటలేకాదు, మనశ్శాంతీ కరవైన కాలం.


కొత్త జీవితం... రైతులో ఆలోచన వెుదలైంది. దారి తప్పామని అర్థమైపోయింది. రసాయనాల ఊబిలోంచి బయటపడాలన్న తపన కనిపించింది. కానీ, ఎలా? వేలుపట్టుకు నడిపించేదెవరు? దారిచూపి పుణ్యంకట్టుకునేదెవరు?కష్టాలు, నష్టాలు, అప్పులు... ఇవి చాలవన్నట్టు రాకాసి బొంతపురుగులు! బొంతపురుగు సేద్యానికి బొంద పెడుతుంది. హద్దూ అదుపూ లేని రసాయనాల వాడకంతో... ఓ దశదాటాక పురుగులు నిరోధకశక్తిని పెంచుకున్నాయి. ఏ మందులూ ఏమీ చేయలేని పరిస్థితి. అప్పులతో నష్టాలతో సతమతమౌతున్న రైతన్నకు ఇదో పెద్దదెబ్బ! సరిగ్గా అప్పుడే... జనగామ కేంద్రంగా పనిచేస్తున్న క్రాప్స్‌ (సీఆర్‌వోపీఎస్‌- సెంటర్‌ ఫర్‌ రూరల్‌ ఆపరేషన్స్‌ ప్రోగ్రామ్‌ సొసైటీ) కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సంస్థ బొంతపురుగు నివారణకు ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. క్రాప్స్‌ వ్యవస్థాపకుడు రేకల లింగయ్య తన బృందంతో ఏనెబావికి వచ్చాడు. రైతుల కన్నీళ్లు చూశాడు. కష్టాలు విన్నాడు. దీపపు ఎరలతో తల్లిపురుగులను ఎలా నాశనం చేయవచ్చో ప్రత్యక్షంగా చూపించాడు. దెబ్బకి దెయ్యం వదిలింది. పురుగు పరుగుపెట్టింది. ఏనెబావి ప్రజలకు సంప్రదాయ సేద్యమంటే గురి కుదిరింది.
'నిజమే. మన తాతముత్తాతలు, వాళ్ల తాతముత్తాతలు... పర్యావరణానికి హాని జరగకుండా, రైతుకు నష్టం వాటిల్లకుండా... సమాజానికంతా మంచి జరిగేలా చక్కని వ్యవసాయ పద్ధతుల్ని రూపొందించారు. తాత్కాలిక లాభాలకు ఆశపడి మనం వాటిని దూరంచేసుకుంటున్నాం. అది తప్పు' అన్న పశ్చాత్తాపం కనిపించింది. అదే మార్పుకు తొలి అడుగు. ఆ అడుగు పొన్నం మల్లయ్యది. మిగిలిన రైతులంతా ఆ దార్లోనే నడిచారు. క్రాప్స్‌ సహకారం ఉండనే ఉంది. ఏనెబావి రైతులు 1995 నుంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వాడకాన్ని తగ్గించారు. 2005 నాటికి పూర్తిగా వదులుకున్నారు. దీంతో 'సెర్ప్‌ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) సంస్థ ఏనెబావిని రసాయన రహిత గ్రామంగా ప్రకటించింది. అప్పటి నుంచి సేద్యంలో ఘాటైన రసాయనాల్లేవు. ప్రకృతికి నష్టం కలిగించే క్రిమిసంహారకాల్లేవు. ఆ గాలి స్వచ్ఛం. ఆ నీరు స్వచ్ఛం. ఆ పైరు స్వచ్ఛం. ఆ పంట స్వచ్ఛం.రసాయన సేద్యానికి బానిసైపోయాక రైతుకు పేడఎరువుల అవసరం లేకపోయింది. మూగజీవాల్ని నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా పశుసంపద తగ్గిపోయింది. సేంద్రియ వ్యవసాయం చేపట్టగానే దూరమైపోయిన పశువుల అవసరం గుర్తుకొచ్చింది. ఏనెబావి రైతుల వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్న ఆంధ్రాబ్యాంకు అధికారులు పశువుల్ని సమకూర్చుకోడానికి రుణాలిచ్చారు. ఇంకేముంది, గోధూళితో పల్లె పావనమైపోయింది. ఇప్పుడు అక్కడ, రోజుకు వంద లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఐదువందలకుపైగా పశుసంపద ఉంది. ఆ ఊళ్లో గేదెలే కాదు, ఆవులూ కనిపిస్తాయి. సేంద్రియ వ్యవసాయంలో గోమాతకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఆవు పేడ, పంచితం (మూత్రం), పాలు, పెరుగు, నెయ్యి కలిస్తే..పంచగవ్యం. ఇది చేనుకు చేవనిస్తుంది. ఇక గోమూత్రం, శనగపిండి, బెల్లంతో తయారు చేసే 'జీవామృతం' నేలకు రోగనిరోధక శక్తినిస్తుంది. వేపపిండి, వేపనూనె, వేప కషాయం, పొగాకు కషాయం, పచ్చిమిరప, వెల్లుల్లి కషాయం... ఇవే సేంద్రియ సాగులో తిరుగులేని క్రిమిసంహారిణులు. 'పర్యావరణంలో ప్రతిజీవి ప్రాణమూ విలువైందే..రసాయన ఎరువులు వాడితే శత్రుపురుగుల నాశనం సంగతి దేవుడెరుగు..మేలు చేసే నేస్తాలు కూడా నామరూపాల్లేకుండా పోతాయ్‌.. అందుకే మేం ఏ పురుగులనూ చంపడానికి ఇష్టపడం. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాం. రెండేళ్లుగా సంప్రదాయ క్రిమిసంహారిణులను కూడా వాడటం లేదు' అని రైతులు సగర్వంగా చెబుతారు. నిజమే, రైతుకు పంచడమే తెలుసు. చంపడం అతని ప్రవృత్తి కాదు.
అయిదు సంవత్సరాలుగా ఏనెబావి రైతులు ఎరువుల దుకాణాలకు వెళ్లడం లేదు. మరీ అవసరమైతే కోడిపెంటను వినియోగిస్తారు. దేశవాళి విత్తనాలనే నాటుతున్నారు. తమ భూమిలో పండిన విత్తనాల్నే తిరిగి వాడుకుంటున్నారు. నల్గొండ జిల్లా చొల్లేరులో జరిగిన విత్తన మేళాలో ఏకంగా 96 రకాల విత్తనాల్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.


అప్పుల తిప్పల్లేవు... రసాయన ఎరువుల్లేకుండా ఏనెబావి రైతులు పండించిన పంటలు పేరుప్రతిష్ఠల్నే కాదు, సిరిసంపదల్నీ వోసుకొచ్చాయి. పొరుగూళ్లోని షావుకారు దగ్గరికెళ్లి ప్రతి సీజన్లోనూ ట్రాక్టర్లకొద్దీ ఎరువులు తెచ్చుకున్న రైతులు... ఇప్పుడు అటువైపు తొంగి కూడా చూడటం లేదు. ఆ అవసరమే లేకుండా పోయింది. పెట్టుబడుల భారం తప్పింది. అప్పుల వూబిలోంచి బయటపడ్డారు. దానికితోడు,
రసాయన ఎరువులు వేయని ఆ పంటల్ని కొనడానికి ఎక్కడెక్కడి ప్రజలో వస్తున్నారు. పంట చేతికి రాకముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. ఏనెబావిలో ప్రతిరైతు ఇంట్లో కనీసం ఐదు క్వింటాళ్లకు తక్కువ కాకుండా సన్నబియ్యం నిల్వలు ఉంటాయి. ఇక పప్పుధాన్యాలు, కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు. ఎవరికి పండినా... అందరూ పంచుకుంటారు.
ఆరోగ్య సంపన్నులు
స్వచ్ఛమైన ఏనెబావి గాలి చాలు, ఏ రోగమైనా నయమైపోతుంది. రసాయనాల ఆనవాళ్లు లేని ఆ ఆహారం చాలు, రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుంది. దేశమంతా వ్యాపించిన చికున్‌ గున్యా వీరి దరిదాపుల్లోకి రాలేదు. కళ్లకలక వంటి అంటువ్యాధుల వాసన కూడా సోకలేదు. అకాల మరణాల బెడదే లేదు. మూడేళ్ల క్రితం ఓ పండు ముదుసలి మరణించారు. మళ్లీ, ఈ మార్చి 19న మరో పండుముదుసలి కాలం చేశారు. 'ప్రకృతిని కాపాడుకుంటున్నాం.. ప్రకృతి మమ్మల్ని కాపాడుతోంది' అంటారా గ్రామస్థులు. ఎవరికీ కేన్సర్‌, గుండె జబ్బు, మధుమేహం వంటి వ్యాధులు రాలేదని సగర్వంగా చెబుతారు. రసాయన ఎరువులు అతిగా వాడటం వల్ల వచ్చే కొన్నిరకాల చర్మవ్యాధులు, శ్వాసకోశవ్యాధులు... వూరి పొలిమేరల్లో కాలుపెట్టడానికి కూడా సాహసించడం లేదు.
జలమే జయం!
గ్రామ ప్రజలంతా కలిసి జలసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉన్న నీటినే సక్రమంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. భూగర్భజలాలను కాపాడుకునేందుకు అంతా ఒక్కటయ్యారు. గ్రామంలో 26 బోర్లు, 11 బావులు ఉన్నాయి. అవసరానికి మించి బోర్లు వేయకూడదని తీర్మానం చేసుకున్నారు. జలసంపద ఎక్కువగా ఉన్నవారు..కొరతలో ఉన్న వారికి సాయం అందించాలనే కట్టుబాటును ఎలాంటి మనస్పర్ధలకూ తావులేకుండా అమలు చేస్తున్నారు. గత మూడేళ్లలో గ్రామంలో కొత్తగా ఒక్క బోరు కూడా వేయలేదు. ఆ అవసరమే రాలేదు. వ్యవసాయంలో విద్యుత్తు పాత్ర కీలకంగా మారింది. ఈ సత్యాన్ని గ్రహించిన రైతులు, పంపుసెట్లకు కెపాసిటర్లను అమర్చారు. 100 శాతం కెపాసిటర్ల అమరికలో రాష్ట్రానికే ఆదర్శమయ్యారు. అనధికారికంగా విద్యుత్తు వాడకూడదని కట్టుబాటుచేసుకున్నారు. అదనపు కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించారు.


ప్రశంసలే ప్రశంసలు! ఏనెబావి కీర్తి ఎల్లలు దాటింది. ప్రకృతినీ పర్యావరణాన్నీ కాపాడుతున్న గ్రామస్థుల కృషికి ప్రశంసలు వెల్లువెత్తాయి. జిల్లా, రాష్ట్రం, దేశ సరిహద్దులు దాటిన ఆ వ్యవసాయ విధానం గురించి తెలుసుకునేందుకు ఇప్పటి దాకా 30వేల మంది రైతులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని వూరువూరంతా.. గర్వంగా చెబుతుంది. పొన్నం పద్మ అనే మహిళారైతు శ్రీలంకకు వెళ్లి తమ విజయాలను వివరించింది. అక్కడి విశేషాలనూ విధానాలనూ అధ్యయనం చేసొచ్చి, స్థానిక రైతులకు పాఠాలు చెప్పింది. ఏనెబావి రైతులు ప్రకృతికి చేస్తున్న మేలు, పర్యావరణాన్ని కాపాడుతున్న తీరూ తెలుసుకున్న యోగాగురువు రాందేవ్‌ 'కృషిగౌరవ్‌' అవార్డును బహూకరించారు. లక్షా నూటపదహారు రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందితే మరిన్ని అద్భుతాలు చేస్తామని గ్రామస్థులు అంటున్నారు.
వ్యవసాయ అవసరాలకు 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలనీ తాగునీటి అవసరాలకు ఓ వ్యవస్థను రూపొందించాలని కోరుతున్నారు. సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక దుకాణాల్ని నిర్మించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


*  *  *
కేంద్ర పర్యావరణ మంత్రి జైరాంరమేశ్‌ వచ్చివెళ్లారు. సాగు పద్ధతుల్లో మార్పును అభినందించారు. కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యుడు వీఎల్‌ చోప్రా, సెర్ప్‌ సీఈవో విజయ్‌కుమార్‌ తదితరులు కూడా ఏనెబావిని చూసివెళ్లారు. గతంలో వరంగల్‌ కలెక్టరుగా పనిచేసిన దమయంతి మూడు పర్యాయాలు పర్యటించి రైతులను ప్రోత్సహించారు. పదకొండు దేశాల ప్రతినిధులు వచ్చి పాఠాలు నేర్చుకున్నారు. అయితే, ఇప్పటి వరకూ రాష్ట్ర మంత్రులు కానీ, స్థానిక శాసనభ్యులు కానీ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కానీ... ఇటువైపు తొంగి కూడా చూడలేదు. మనవాళ్లకు దగ్గర్లోని అద్భుతాలు కనిపించవు. దూరపుకొండలు చూడటానికి మాత్రం కోట్లు వెచ్చించి మరీ విదేశాలకు ప్రయాణమవుతారు. అలాంటి పల్లెలు మన అదృష్టం. ఇలాంటి నేతలు మన దురదృష్టం.
 



మా మంచి పల్లె
ఏనెబావి రైతులు సేంద్రియ వ్యవసాయ విధానంలోనే కాదు... జీవన విధానంలోనూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. పండుగపబ్బాలప్పుడు తప్పించి... మాంసాహారం జోలికి వెళ్లరు. ఊళ్లో గుడుంబా గుప్పు మనదు. కొద్దిమంది మాత్రం, తమ పొలాల్లో దొరికే తాటికల్లును మాత్రమే సేవిస్తారు. * ఏ ఇంట్లో తోరణం కట్టినా ఊరంతా పండగే. అందరికీ విందు భోజనమే.
* గ్రామ ప్రజలకు చదువు విలువ తెలుసు. ఇంగ్లీషు అవసరం తెలుసు. అందుకే రోజూ 13 మంది చిన్నారులు ఆటోలో జనగామ దాకా వెళ్లి కాన్వెంట్‌ చదువులు చదువుకుంటున్నారు. నలుగురు యువకులు డిగ్రీ పూర్తి చేశారు. అయినా, మట్టి మీద మమకారంతో సేద్యంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
* పల్లెకు పోలీసుల అవసరమే లేదు. ఏ సమస్య వచ్చినా తమలో తామే పరిష్కరించుకుంటారు. పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాల గడప తొక్కే అవసరం ఎప్పుడూ రాలేదని గ్రామపెద్ద పొన్నం మల్లయ్య సగర్వంగా చెబుతారు.
* ఈ పల్లె నుంచి ఏకగ్రీవంగా ఓ సభ్యుడిని ఎన్నుకుని గ్రామపంచాయతీకి పంపుతారు. ఇప్పటిదాకా పోటీ లేదు. భవిష్యత్‌లోనూ ఉండబోదంటారు.
* ఏనెబావిలో ఒక్క గుడిసె కూడా కనిపించదు. అన్నీ పక్కా ఇళ్లే! గ్రామానికి తారు రోడ్డు తెచ్చుకున్నారు. ఊరంతటికీ ఒకే వీధి... ఆ వీధికి సిమెంటు రోడ్డు వేయించుకున్నారు. ప్రతి ఇంటిమీదా సేంద్రియ వ్యవసాయం, జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలే చిరునామాల్లా దర్శనమిస్తాయి.
* ఎవరికి ఏ కష్టం వచ్చినా.. అది అందరిదీ. అంతా అండగా ఉంటారు. గ్రామంలోని రైతులు శ్రీరామ, మంజునాధ, కాకతీయ రైతుసంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాలన్నీ 'ఏనెబావి సేంద్రియ రైతు సంఘం' నాయకత్వంలో పనిచేస్తాయి. గ్రామంలోని రైతు శిక్షణ భవనంలో సమావేశాలను నిర్వహిస్తారు. నెలకు ఇరవై రూపాయల చొప్పున పొదుపుచేసి, అవసరమైన వారికి అప్పుగా ఇస్తారు. మహిళలు క్రాప్స్‌, ఇతర సంస్థల పరిధిలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
* అసలే చిన్న గ్రామం. అన్ని వృత్తులవారూ లేకపోవడం ఓ సమస్యే. దీంతో వ్యవసాయానికి అవసరమైన నాగలి తదితర పరికరాలను తామే తయారు చేసుకుంటారు. ఒక్కో కుటుంబం ఒక్కో వృత్తిలో నైపుణ్యాన్ని సాధించింది.
* అవసరమైనప్పుడు రైతులే కూలీల అవతారమెత్తుతారు. ఒకరి అవసరాలకు మరొకరు వెళ్లి పనులు చేస్తారు. నాట్లు ఎక్కువగా ఉన్నప్పుడూ తామంతా సరిపోనప్పుడు మాత్రమే.. పొరుగూళ్ల సాయం తీసుకుంటారు.
.


ఏనెబావికి వెన్నెముక...
నెబావి కీర్తి ప్రతిష్ఠలు, రైతుల అభివృద్ధి, సుస్థిర వ్యవసాయం, రసాయనాల్లేని వాతావరణం..ఇన్ని విజయాలకు ప్రధాన కారణం జనగామలోని క్రాప్స్‌ సంస్థ. బొంతపురుగు నివారణ ఉద్యమం ద్వారా రైతులకు చేరువైన ఆ సంస్థ వ్యవస్థాపకుడి పేరు రేకల లింగయ్య, వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడు. ఎస్‌.ఆర్‌.శ్రీనివాస్‌, మహేందర్‌, గిరిబాబు, నర్మద, విష్ణు, లక్ష్మీనారాయణలతో పాటు మరో 12 మంది ఆయన బృందంలో సభ్యులు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ఆచరించేలా ఓర్పుతో రైతులను ఒప్పించగలిగారు. చెరువు మట్టి తరలింపులో, కోళ్లపెంట సరఫరాలో, వర్మీకంపోస్టు, గోమూత్ర సేకరణశాలల నిర్మాణం, పాడి పశువుల కొనుగోలుకు రుణాలు...ఇలా ఎన్నో విషయాల్లో ఏనెబావి రైతులకు అండగా నిలిచింది క్రాప్స్‌. సంప్రదాయ ఎరువుల తయారీలో శిక్షణ ఇచ్చింది. శ్రీవరిసాగు ఉద్యమానికి తెరతీసింది. 'మేం దారి చూపాం. గ్రామస్థులు నమ్మకంతో మావెంట నడిచారు. శ్రమించారు. ఫలితాలు సాధించారు. ఏనెబావిని ఆదర్శంగా నిలిపారు. తమ విజయాల్లో మాకూ స్థానం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ మార్పు.. ఈ ప్రయోగం.. ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా గుర్తించాలి. ప్రోత్సహించాలి' అంటారు రేకల లింగయ్య.

ఐఏఎస్ చిన్న నాటి లక్ష్యం

 ఆప్షనల్, జీఎస్, ఎస్సే పరీక్షలకు మీ స్ట్రాటజీ?

ఆప్షనల్‌కు సంబంధించి మొత్తం సిలబస్ పూర్తి చేశాను. ప్రతి టాపిక్ నుంచి అన్ని పాయింట్లపైనా దృష్టి సారించాను. పరీక్షల ముందు రివిజన్ చేసుకునేదాణ్ని. రాసుకున్న నోట్సు పరీక్ష సమయంలో బాగా ఉపయోగపడింది. జీఎస్ విషయంలో ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు అదనంగా సొంత ఆలోచన, విశ్లేషణ జోడించాను. ఎస్సే పేపర్‌కు ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదు. జనరల్ స్టడీస్ బాగా చదివితే ఎస్సే సులువుగా రాయొచ్చు. వార్తాపత్రికలు రెగ్యులర్‌గా చదివితే ఎస్సే బాగా రాయడానికి మంచి ఆలోచనలొస్తాయి.


‘‘50 నుంచి 100 లోపు ర్యాంకు వస్తుందనుకున్నా.. కానీ ఒకటో ర్యాంకు వచ్చింది. సంకల్పం ఉంటే దేనినైనా అలవోకగా సాధించొచ్చు అంటున్నారు... ఐఎఎస్ ఫస్ట్ ర్యాంకర్, చెన్నైకి చెందిన దివ్యదర్శిని’’

ప్ర: సివిల్స్ లక్ష్యంగా ఎప్పుడు నిర్ణయించుకున్నారు? దీన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయా..?

జ: చిన్నప్పటి నుంచి ఐఎఎస్ కావాలనే లక్ష్యం ఏర్పరచుకున్నాను. ఐదో తరగతిలో ఉన్నప్పుడే బాగా చదవాలి. ఉన్నతోద్యోగంలో స్థిరపడాలని మా అమ్మానాన్నలు పదే పదే చెప్పేవారు. అప్పుడు పెద్ద చదు వు అంటే ఏమిటంటూ ఓ రోజు అమ్మని అడిగా...అప్పుడు మా అమ్మ ఐఎఎస్ అం టూ కలెక్టర్ అని చెప్పింది. ఆరోజే నేను కూడా ఐఎఎస్ చదువుతా అని చెప్పాను. అప్పటి నుంచి చదువుపైనే దృష్టి పెట్టాను.

ప్ర: ప్రిపరేషన్ ఎప్పుడు మొదలుపెట్టారు? ప్రణాళిక ఎలా తయారు చేసుకున్నారు? ఎన్ని గంటలు చదివే వారు?

జ: డిగ్రీ (లా) మొదటి సంవత్సరం నుంచే సివిల్స్ ప్రిపరేషన్ కోసం రోజుకు ఐదు గంటల సమయం కేటాయించాను.

ప్ర: మీ విజయం వెనుక శ్రమ, ప్రోత్సహించిన వాళ్ల గురించి...?

జ: మాది సాధారణ కుటుంబమైనప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం నా కుటుంబం ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. రోజు కు ఐదారు గంటలు చదువుపై దృష్టి సారించడం వల్ల అనేక సమయాల్లో బాగా నీరసించి పోయేదాన్ని. అప్పుడు కుటుంబ సభ్యుల ప్రోద్భలం నా శ్రమను మర్చి పోయేలా చేశాయి.

ప్ర: ఎన్నో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు..?

జ: రెండో ప్రయత్నం. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌కు కూడా ఎంపిక కాలేదు. లా ఆఖరు సంవత్సరం చదువుతున్నప్పుడే మొదటి ప్రయత్నం చేశాను.

ప్ర: మీ ఆప్షనల్స్, వాటినే తీసుకోవడానికి కారణం?

జ: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు మంచి మెటీరియల్ లభిస్తుంది. ఈ సబ్జెక్టులో గెడైన్స్ కూడా బాగా లభించింది. లా నేను చదివిన సబ్జెక్టు. ఈ కారణాలతో వీటిని ఎంపిక చేసుకున్నాను.

ప్ర: మీరు చదివిన ప్రామాణిక పుస్తకాల వివరా లు...? మీకు సహకరించిన ఇన్‌స్టిట్యూట్?

జ: నాకు బాగా సహకారం అందించింది మాత్రం చెన్నైలోని ప్రభాకరన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం లక్ష్మీకాంత్, మహేశ్వరి రాసిన పుస్తకాలు, పాత ప్రశ్నపత్రాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జర్నల్స్ చదివాను. లాలో జైన్ నారాయణ్‌పాండే, ఎంసీజైన్ రాసిన కాన్‌స్టిట్యూషన్; అవతార్ సింగ్ రాసిన కాంట్రాక్ట్స్, అచ్యుతన్‌పిళ్లై టోర్ట్స్, కపూర్ అండ్ అగర్వాల్ ఇంటర్నేషనల్ లా పుస్తకాలు చదివాను.

ప్ర: ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు?

జ: ఆర్‌టీఐ యాక్ట్, లోక్ పాల్ బిల్లుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగానే దీనికోసం సిద్ధమవ్వడంతో సమాధానాలు సులువుగానే చెప్పాను. ఒకట్రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలీకపోవడంతో నాకు తెలీదని నిజాయితీగా చెప్పాను.

ప్ర: కోచింగ్ అవసరమా? ఎంతవరకు ఉపయోగపడుతుంది?

జ: కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు చాలా తక్కువగా గైడ్ చేస్తాయి. అభ్యర్థులే బాగా శ్రమించాలి. మాక్ పరీక్షలు బాగా రాయాలి. కోచింగ్ సంస్థ ఎంపికలో జాగ్రత్త వహించాలి. మంచి సంస్థ ఎంపిక చేసుకోపోతే విలువైన సమయం, డబ్బు రెండూ వృథా.

ప్ర: సివిల్స్ లక్ష ్యంగా ఎంచుకున్న అభ్యర్థులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు..? సగటు విద్యార్ధి సివిల్స్ సాధించ గలడా..?

జ: సివిల్స్ చదవాలంటే స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఓటమికి కుంగి పోకుండా ముందుకు సాగితే ఎంతటి విజయాన్నైనా సాధించొచ్చు. అదే సమయం లో సామాజిక విషయాలపై అవగాహన ఉంటే సగటు విద్యార్ధి కూడా సివిల్స్ సాధించొచ్చు. ఇంటర్ నుంచే ప్రణాళిక రూపొందించుకొని ఐదారేళ్లు శ్రద్ధగా చదివితే సివిల్స్ సాధించొచ్చు. మీపై మీకు నమ్మకం, ధైర్యం, సరైన శ్రమ ఉంటే విజయం వరిస్తుంది.

ప్ర: సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మీ సలహా?

జ: సంకల్పం ఉంటే సాధించ లేనిది ఏదీ ఉం డదు. ఓటమికి నిరాశ చెందకుండా ఎదురీదాలి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.

ప్ర: చదువులో మొదటి నుంచే టాపరా?

జ: చిన్నప్పటి నుంచి మంచి ఉత్తీర్ణతే సాధిం చా. టెన్త్ (సీబీఎస్‌ఈ)లో 74 శాతం, ప్లస్ టూ(ఇంటర్) లో 86 శాతం సాధించా.

ప్ర: సివిల్స్‌కు ఎంపిక కాకుంటే?

జ: సివిల్స్‌కు ఎంపిక కాకుంటే, నాకు న్యాయ శాస్త్రం(లా) ఉంది. సివిల్స్‌లో విజయం సాధిస్తాననే నమ్మకం ఉండేది.

ప్ర: మీ ఆశయాలు, భవిష్యత్తు ప్రణాళిక..?

జ: దేశం మొత్తం సమాన అభివృద్ధి సాధన, అవినీతిని అంత మొందించడం. ఈ రెండూ నా లక్ష్యాలు.

ప్ర: మీ హాబీ లేంటి..?

జ: క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్ ఆడుతాను. సినిమాలు చూస్తుంటాను. సం గీతం కూడా వింటా.
ప్ర: బాల్యం, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ గురించి....?
జ: బాల్యం అంతా చెన్నైలోనే. ఫ్లస్ టూ వరకు చెన్నైలోని అసన్ మెట్య్రుక్యులేషన్‌లో, బిఎ బిఎల్ అంబేద్కర్ లా యూనివర్సిటీలో గడిచింది.

ప్ర: మీకు నచ్చిన పుస్తకం..?

జ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాసిన ‘ది వింగ్స్ ఆఫ్ ఫైర్’. అంటే చాలా ఇష్టం. మన లక్ష్యాలను ఎలా నిర్ధేశించుకోవచ్చో అందులో యువతకు కలాం సూచించారు.

ప్ర: మీ రోల్ మోడల్...?.

జ: అబ్దుల్ కలాం, మదర్ థెరిస్సా, మా అమ్మా నాన్నలు.

ప్ర: మీరు ఆరాధించే వ్యక్తులు...?

జ: లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అంటే చాలా ఇష్టం. నాలాంటి వారికి ఆయన ఓ స్పూర్తి.

ఐపీఎస్ నుంచి ఐఏఎస్‌కు


జేఎన్‌టీయూలో బీటెక్. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్, సత్యం కంప్యూటర్స్‌లో ఉద్యోగం. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్. మొదటి ప్రయత్నంలోనే 117 ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపిక. రెండో ప్రయత్నంలో 12వ ర్యాంక్...ఇదీ కెవీఎన్ చక్రధర బాబు స్వగతం. ప్రస్తుతం అసోం లోని శివసాగర్‌కు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా చక్రధరబాబు పనిచేస్తున్నారు. విజయగాథ ఆయన మాటల్లోనే...

సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్న అభ్యర్థులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు? అలవర్చుకోవాల్సిన స్కిల్స్?


ఓపిక, సహనం ఉండాలి. చేసే పనిపై స్పష్టత ఉండాలి. సివిల్స్ ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారో ప్రశ్నవేసుకోవాలి. కేవలం హోదా కోసమైతే 30 ఏళ్లపాటు సర్వీస్‌లో కొనసాగలేరు. సేవ చేయాలనే తపన, లక్ష్యంపై స్పష్టత ఉంటే ప్రిపరేషన్ సులువవుతుంది.

తెలివితేటలు, కష్టపడేతత్వం రెండూ ఉండాలి. ఓరియంటేషన్ రావాలి. రాతలో నైపుణ్యం పెంచుకోవాలి. డిగ్రీలో ఉన్నప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. చిన్నప్పుడే ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో ఉన్నత స్థానంలోకి చేరడానికి అవకాశం దక్కుతుంది. ఒకసారి పరీక్ష రాస్తే ఆ ప్రాసెస్ ఏడాదికిపైగా పడుతుంది. ఏ స్టేజ్‌లో ఫెయిలైనా మళ్లీ మొదటి నుంచి చదువుకోవాల్సి వస్తుంది. ఏం చదువుతున్నారు? అది పరీక్షలో ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయంలో అవగాహన ఉండాలి.


సివిల్స్‌లో ప్రశ్నను అన్ని కోణాల్లోనూ ఆలోచించి విశ్లేషించాలి. అకడమిక్ పరీక్షల్లా కుదరదు. తక్కువ సమయంలో అర్థవంతమైన పదాలతో స్పష్టత లోపించకుండా రాయాలి. పదపరిమితి చాలా ముఖ్యం. బాగా రాస్తే దిద్దేవారి పని సులువవుతుంది. అడిషనల్స్ ఎక్కువ తీసుకుని తెలిసిందంతా రాసేస్తే సరైన సమాధానం కోసం ఎగ్జామినర్ వెతుక్కోవాల్సి వస్తుంది. పేజీల సంఖ్య కంటే సమాచార నాణ్యత ముఖ్యం.


సివిల్స్ లక్ష్యంగా ఎప్పుడు నిర్ణయించుకున్నారు? దీన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?
మానాన్న భాస్కరరావు ప్రస్థుతం తహసీల్దారుగా పనిచేస్తున్నారు. ఆయన అప్పట్లో సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. నేను కలెక్టర్ కావాలని నాన్న ఆకాంక్ష. చిన్నప్పుడే కలెక్టర్ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. బాధ్యతలు, హోదా కెరీర్ ఆరంభంలోనే సివిల్ సర్వెంట్లకు లభిస్తాయి. మిగతా ప్రొఫెషన్లలో ఈ అవకాశం దక్కాలంటే ఎంతో సమయం ఆగాలి.

{పిపరేషన్ ఎప్పుడు ప్రారంభించారు?


సిస్టమేటిక్‌గా చదవలేదు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ చదివేవాణ్ని. చివర్లో ఆరు నెలలు సెలవు పెట్టి రోజుకి 14 గంటలు చదివాను. అదే నా ప్రిపరేషన్. మొదటి ప్రయత్నంలోనే 117 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను.

ఎన్నాళ్లు... రోజుకి ఎన్ని గంటలు చదివేవారు?


తొలిసారి రాసినప్పుడు ఉద్యోగానికి 6 నెలలు సెలవు పెట్టాను. ఆ సమయంలో రోజుకి 14 గంటలు చదివేవాణ్ని. రెండో సారి రాసినప్పుడు చాలా తక్కువ సమయం ఉండేది. అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా పనిచేస్తూ చదివేవాణ్ని. కరెంట్ అఫైర్స్ ఇంటర్నెట్‌లో ఫాలో అయ్యాను. కేవలం పరీక్షలు, ఇంటర్వ్యూ కోసమే సెలవు పెట్టాను. అస్సాం ఎన్నికల దృష్ట్యా సెలవు పెట్టడానికి కుదరలేదు.

మీ ఆప్షన్స్ ... వాటినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?


పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు సాహిత్యం నా ఆప్షనల్ సబ్జెక్టులు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్‌ని కాబట్టి కొత్త సబ్జెక్టులు తీసుకోవాలనుకున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగానికి దగ్గరగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివాను. తెలుగు సరిగా రాదు. రానిది నేర్చుకోవాలనే తపన నాకెక్కువ. అందుకే తెలుగు లిటరేచర్ ఒక ఆప్షనల్‌గా తీసుకున్నాను. హైస్కూల్ స్థాయిలోనూ మ్యాథ్స్ సరిగా రాదు. ఈ కారణంతోనే ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ ఎంపిక చేసుకున్నాను.


మీకు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు... మీరు చెప్పిన సమాధానాలు?
ఇంటర్వ్యూ 45 నిమిషాలు పాటు జరిగింది. ప్రస్తుతం ఏఎస్పీగా పనిచేస్తుండటంతో అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రశ్నలడిగారు. ఐపీఎస్‌లో ఉన్నావు కదా ఐఏఎస్ ఎందుకు అని ప్రశ్నించారు. ఐపీఎస్‌లో కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే చేతిలో ఉంటుంది. ఐఏఎస్‌లో అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్లూ నిర్వహించడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పరిధులు, బాధ్యతలు విస్తరిస్తాయి. అందుకే ఐఏఎస్‌లో చేరాలనుకుంటున్నానని చెప్పాను. పోలీస్ రిఫార్మ్స్, హ్యూమన్ రైట్స్, కానిస్టేబుల్ ట్రైనింగ్, అసోం ఎన్నికలు, మిడ్‌డే మీల్, విమెన్ ఎంపోవర్‌మెంట్, లోక్‌పాల్ బిల్, అన్నా హజారే..తదితరాంశాల్లో ప్రశ్నలడిగారు.


ఎన్నో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు? దశలవారీ మీ అనుభవాలు, మీరు చేసిన పొరపాట్లు వివరిస్తారా? మధ్యలో ఆప్షన్స్ మార్చారా?
2008లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి ఐపీఎస్‌కి ఎంపికయ్యాను. ఇది రెండో ప్రయత్నం. మొదటి ప్రయత్నంలో అంతగా అవగాహన లేదు. సాధారణ విద్యార్థి రాసినట్లు సమాధానాలు రాశాను. చదివిందంతా, తెలిసిందంతా రాయాలి అనే భావనతో రాశాను. సమాధానంలో నాణ్యత కంటే పరిమాణంపై దృష్టి సారించాను. రెండో ప్రయత్నంలో నా అనుభవాలు జోడించి రాశాను. నాణ్యతపై దృష్టి సారించాను. ఐపీఎస్ శిక్షణ, అనుభవం బాగా ఉపయోగపడ్డాయి.

{పిపరేషన్ కోసం మీకు సహకరించిన ఫ్యాకల్టీ/ఇన్‌స్టిట్యూట్?


మొదటి సారి రాసినప్పుడు జనరల్ స్టడీస్‌లో జాగ్రఫీ, ఎకనామిక్స్ కోసం ఆర్‌సీరెడ్డి; మాక్ ఇంటర్వ్యూ కోసం బ్రెయిన్‌ట్రీలో కోచింగ్ తీసుకున్నాను. సర్వీస్‌లో ఉన్నప్పుడు మిత్రులతో చర్చించి, వాళ్ల అనుభవాల ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను.

సివిల్స్ సాధించాలంటే కోచింగ్ అవసరమా?

కోచింగ్‌తో సమయం కలిసొస్తుంది. అన్నీ ఒకే దగ్గర లభిస్తాయి. కానీ అవగాహన లేకుండా ఒక్క సంస్థపైనే ఆధారపడకూడదు. సొంత సామర్థ్యమే చాలా ముఖ్యం.

మిమ్మల్ని బాగా ప్రోత్సహించినవారు?


మా అమ్మ, నాన్న బాగా ప్రోత్సహించారు. అమ్మకు పోలీస్ సర్వీస్ అంటే భయం. దీంతో ఎలాగైనా ఐఏఎస్ సాధించాలని చెప్పేది. కొన్ని సందర్భాల్లో ఐపీఎస్ కంటే ఐఏఎస్ అయ్యుంటే బాగుండేది అనిపించేది.

చదువులో మీరు మొదటి నుంచే టాపర్‌గా ఉన్నారా?


మొదటి నుంచీ టాపర్‌గానే ఉన్నాను. పదోతరగతిలో స్కూల్ ఫస్ట్ నేనే. స్టీల్ ప్లాంట్ పరీక్షలో సీఎస్ స్ట్రీమ్‌లో టాపర్‌గా నిలిచాను. జీమ్యాట్ రాశాను దీంతో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ-అమెరికాలో సీటు కూడా వచ్చింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం, ఐఏఎస్ కావాలనే తపనతో చేరలేదు. క్యాట్, గేట్ పరీక్షల్లోనూ మంచి మార్కులే వచ్చాయి.
సులువుగా నేర్చుకోవడానికి మీకు తెలిసిన చిట్కాలేమైనా ఉన్నాయా?
పాయింట్లలో సమాచారం ఉంటే కోడ్స్ పెట్టుకోవాలి. కొన్నింటికి బట్టీ తప్పదు. కొన్ని విషయాలు చదివేటప్పుడు వాటికి లింక్ సబ్జెక్టులు ఉంటాయి. ఆ పుస్తకాలు దగ్గరపెట్టుకొని వాటిని వెంటనే చదువుకోవాలి. ముఖ్య సమాచారం, క్యాచీ వర్డ్స్ కింద గీతలు గీస్తే సులువుగా గుర్తుంచుకోవచ్చు. రివిజన్ తేలికవుతుంది.


ఇప్పుడున్న పరీక్షా విధానం ఓకేనా? ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది?
ఆప్షనల్ సబ్జెక్టుల్లో కంప్యూటర్ సైన్స్ లాంటివి చేర్చాలి. ఇప్పుడు టెక్నికల్ పరిజ్ఞానం, మేనేజేరియల్ స్కిల్స్ రెండూ ఉద్యోగానికి చాలా అవసరం కాబట్టి పరీక్షలో వీటిపై ప్రశ్నలు చేర్చాలి. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లి ఏ సర్వీసూ పొందనివారికి తర్వాత సంవత్సరం ప్రిలిమ్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. గ్రూప్ డిస్కషన్, స్పీచ్ ఈ రెండూ ఇంటర్వ్యూలో చేర్చాలి. సివిల్ సర్వెంట్లకు టీం వర్క్ చాలా ముఖ్యం. ఇప్పుడున్న ఇంటర్వ్యూ ద్వారా టీం స్కిల్స్ అంచనా వేయడానికి సాధ్యం కాదు. అభ్యర్థి బృంద సభ్యుడిగా ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి జీడీ ఉపయోగపడుతుంది.

కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది?


మా అబ్బాయి ఐఏఎస్ ఇదే మా నాన్నగారి కోరిక. ఎన్ని అవకాశాలొచ్చినా నన్ను ఐఏఎస్‌గా చూడాలనేది ఆయన కోరిక. బాగా చదువుకోవడానికి అమ్మా,నాన్న ప్రోత్సహించారు.
ఆశయాలు...భవిష్యత్తు ప్రణాళికలేమైనా ఉన్నాయా?
ఐపీఎస్‌లో బాగుంది. ఐఏఎస్ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు విభాగాల్లో మార్పుల దిశగా కృషి చేయాలనుకుంటున్నాను.

మీ హాబీలేంటి?


ఐపీఎస్‌లో చేరిన తర్వాత నుంచి టెన్నిస్, బ్యాడ్నింటన్ ఆడుతున్నాను. ఇంటర్నెట్ చూస్తుంటాను.

మీకు నచ్చిన పుస్తకం?


టువార్డ్స్ ది గోల్ ఆఫ్ బ్యూటిఫుల్ లైఫ్-సద్గురు వామన్‌రావ్‌పాయ్
మెచ్చిన సినిమాలు... ఇష్టమైన నటులు...
పాత సినిమాలంటే ఇష్టం. కె.విశ్వనాథ్, కమల్ హాసన్, మణిరత్నం సినిమాలు చూస్తుంటాను.
మీకిష్టమైన క్వొటేషన్...
toil to make yourself remarkable
మీరు ఆరాధించే వ్యక్తులు...
మా అమ్మ,నాన్న

మీ రోల్ మోడల్ ఎవరు?


చాలా మంది ఉన్నారు. మా ఐపీఎస్ డెరైక్టర్, టీఎన్ శేషన్, కిరణ్‌బేడి, ఇళయరాజా, ఎస్వీరంగారావు, మదర్ థెరిస్సా, కమల్‌హాసన్..
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు/సంఘటనలు?
విద్యార్థిగా ఉన్నప్పుడు సింహాచలం గుడికి వెళ్లినప్పుడు మేం క్యూలో నిల్చున్నాం. అదే సమయంలో అక్కడికి కలెక్టర్ వచ్చారు. ఆలయ నిర్వాహకులు అతిథి మర్యాదలతో అతనికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆ సమయంలో నువ్వుకూడా ఐఏఎస్ ఐతే మాకు ఇలాంటి అవకాశం దక్కుతుందని అమ్మ, నాన్న అన్నారు.

మరిచిపోలేని అనుభూతులు...


ఐపీఎస్ శిక్షణ. ఒక వ్యక్తిగా ఎదగడానికి తోడ్పడింది. మానసికంగా, శారీరకంగా పరిణతి వచ్చింది. శిక్షణ ద్వారా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాను.

కోపాన్ని ఎలా అదుపు చేసుకుంటారు...


మొదట్లో కోపం ఎక్కువగా ఉండేది. ఉద్యోగంలో చేరిన తర్వాత తగ్గింది. పబ్లిక్‌ని హ్యాండిల్ చేయాలంటే కోపం ఉండకూడదు. సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తాను. మాటల ద్వారా అవతలి వ్యక్తుల్లో ఆవేశం తగ్గుతుంది.

ఒత్తిడిని ఎలా అధిగమించేవారు...

యోగ, ప్రాణాయామం చేస్తుంటాను. ఐపీఎస్ శిక్షణలో వీటిని కూడా నేర్పుతారు.

యువతకు మీ సలహా...


శక్తి, సామర్థ్యాలన్నీ సానుకూలాంశాలపై వినియోగించుకోవాలి. చెడు ప్రభావాలకు లోనుకాకూడదు. నచ్చిన రంగం/అంశంలో స్కిల్స్ పెంచుకోవాలి. తర్కం, ఆలోచనా సామర్థ్యం మెరుగుపరచుకోవాలి. బయట చాలా శక్తులు వాళ్ల అవసరాలకు యువతను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

మీరు చదివిన ప్రామాణిక

పుస్తకాల వివరాలు?
హిస్టరీ: బిపిన్‌చంద్ర
జాగ్ర ఫీ: 10,11,12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
ఎకనామిక్స్: ఎకనమిక్ సర్వే, ఇండియా ఇయర్ బుక్

పాలిటిక్స్: లక్ష్మీకాంత్, డిడిబసు
కరెంట్ అఫైర్స్: www.india.gov.in, నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్, టైమ్ మ్యాగజీన్, వికీపీడియా..వెబ్‌సైట్లు చూసేవాడిని.

టాపర్ చెప్పిన... గెలుపు కిటికులు....




సివిల్స్‌- 2010
ఆమె... తొలిసారి సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కూడా దాటలేదు. రెండో ప్రయత్నం ఫలించినా ఆశించిన ర్యాంకు రాలేదు; ఐఏఎస్‌ అభిలాష నెరవేరలేదు! సాధించినదానికి సంతృప్తిపడటం ఆమె నైజం కాదు. ఓ పక్క విధులూ, బాధ్యతలూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా తన లక్ష్యాన్ని విస్మరించలేదు; సంకల్పం వీడలేదు! ఎదురులేని దీక్షకూ, కృషికీ కానుకగా ఆలిండియా  సెకండ్‌ ర్యాంకు (ఆంధ్రప్రదేశ్‌లో టాప్‌ర్యాంకు) ఆమెను వరించింది! సివిల్స్‌ శిఖరారోహణ చేసిన  శ్వేతా మహంతి తన ప్రస్థానాన్నీ, విజయవ్యూహాన్నీ 'చదువు' పాఠకులకు ఇలా వివరిస్తున్నారు....
''కాలేజీలో చదువుతున్నపుడే నా సివిల్‌ సర్వీసెస్‌ ప్రయాణం మొదలైంది. ఓ ఐఏఎస్‌ అధికారి కూతురిగా సివిల్స్‌పై అవగాహన నాకున్న అనుకూలాంశం. కెరియర్‌ అవకాశంగా ఇది నా మనసులో ఉన్నప్పటికీ డిగ్రీలో చేరేవరకూ సివిల్స్‌ గురించి సీరియస్‌గా ఆలోచించనేలేదు!
'డిగ్రీ అవగానే సివిల్స్‌ రాస్తే నెగ్గగలనా?' అనే సందేహం నాకుండేది. అయితే డిగ్రీ పూర్తవగానే సివిల్స్‌కు హాజరైన స్మితాదాస్‌ (సభర్వాల్‌) ఆలిండియా ఫోర్త్‌ ర్యాంకు సాధించటంతో నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. పైగా ఆమె ఇదే తరహా సర్వీస్‌ నేపథ్యం (తండ్రి ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌) నుంచి రావటం, తనూ హైదరాబాద్‌ కాలేజీలోనే చదివివుండటం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో డిగ్రీ అవగానే పరీక్ష రాయాలని నిశ్చయించుకున్నా.
గ్రాడ్యుయేషన్‌ 4 నెలల్లో ముగుస్తుందనగా నాన్నగారితో నా ఆలోచనల గురించి చర్చించాను. స్వయంగా సివిల్స్‌ రాసివున్నప్పటికీ (చాలాకాలం క్రితమే అనుకోండీ), విద్యావేత్త అయివున్నప్పటికీ professional advice తీసుకున్నాకే ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టమని ఆయన సూచించారు. అలా ఆయనతో కలిసి హైదరాబాద్‌లో 'బ్రెయిన్‌ ట్రీ' డైరెక్టర్‌ గోపాలకృష్ణగారిని కలిసి, కౌన్సెలింగ్‌ తీసుకున్నా.
చాలాసేపు జరిగిన కౌన్సెలింగ్‌ సెషన్లో నా అనుమానాలెన్నో నివృత్తి అయ్యాయి. ఒకవేళ సివిల్స్‌ పరీక్ష సరిగా రాయలేకపోతే ఏమిటనేది ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆప్షనల్స్‌గా పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ సబ్జెక్టులే ఎందుకో తెలుసా? కోచింగ్‌, స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంటాయి. ఈ సబ్జెక్టులకు ఇప్పటికే విజయాల ట్రాక్‌రికార్డు ఉంది. ప్రతి సంవత్సరమూ వీటిని ఎంచుకుని రాసినవాళ్ళే టాపర్లు అవుతున్నారు. నాన్నగారు కూడా ఈ సబ్జెక్టుల విషయంలో సహాయపడతానన్నారు. దీంతో ఆప్షనల్స్‌ నిర్ణయం తేలికైపోయింది.
ఇలా మొదలైంది!
పరీక్ష రాద్దామని నిర్ణయించుకోగానే నాన్నగారు నన్ను SWOT విశ్లేషణ చేసుకోమన్నారు. అంటే తెలుసుగా? నా Strengths, Weaknesses, Opportunities & Threats ను గుర్తించటం.
బలాలు: 1) ఇంగ్లిష్‌లో పట్టు 2) విశ్లేషణ సామర్థ్యాలు (ఇంజినీరింగ్‌లో ఇవి నేర్చుకున్నా).
బలహీనతలు: రాసే అలవాటు తగ్గిపోవడం. ఇంజినీరింగ్‌లో వ్యాసాలను ఎక్కువగా రాసే అవసరం ఉండదు కదా!
అవకాశాలు: 1) మరిన్నిసార్లు పరీక్ష రాయగలిగే వయసు 2) నాన్నగారి ప్రోత్సాహం.
నిరోధాలు/సమస్యలు: కాలేజీలో నా స్నేహితులు చాలామంది మల్లే ప్రైవేటురంగంలో ప్రవేశించాలనే దురాకర్షణ. అలాంటి మిత్రులతో పోల్చిచూసుకోకూడదనీ, సివిల్‌ సర్వీసెస్‌లో నా లక్ష్యం చేరుకోవటం గురించే నిరంతరం ఆలోచించాలనీ పెద్దలు నాకు సలహా ఇచ్చారు.
'బ్రెయిన్‌ ట్రీ'లో కోచింగ్‌ తరగతులకు హాజరవటం ప్రారంభించాను. ఎంచుకున్న సబ్జెక్టులు రెండూ కొత్తే! పైగా ఇంజినీరింగ్‌ విద్యార్థినిని అయివుండటం వల్ల మొదట్లో ఆ సబ్జెక్టులు నిస్సారంగా అనిపించేవి. అయితే చదువుతూవుంటే ఆసక్తి పెరుగుతూవచ్చిందనుకోండీ.
ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్న చాలామంది ఈ సామాజికశాస్త్రాల విషయంలో భయాలు పెంచుకుంటుంటారు. నిజానికవి అపోహలే! ఈ సబ్జెక్టులు చాలా సులువని స్వానుభవంతో చెపుతున్నా. మొదట సబ్జెక్టును ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతేకానీ పుస్తకంలోని facts ను బట్టీ పట్టెయ్యాలని చూడకూడదు. ముఖ్యంగా గమనించాల్సింది- సైన్స్‌ సబ్జెక్టుల్లాంటివి కావివి. సైన్సెస్‌లో 2+2 కు సమాధానం ఎప్పుడైనా, ఎక్కడైనా జవాబు నాలుగే! కానీ ఈ సబ్జెక్టుల్లో 2+2= 4 కావొచ్చు; 6 కూడా కావొచ్చు!
చదివే ప్రతి అంశానికీ ఇతర అంశాలతో సంబంధం ఉంటుంది. నేను మొదట అన్ని అధ్యాయాలనూ చదివేశాను. తర్వాత వాటిని ఒకదానితో మరొకటి అనుసంధానించటం ప్రారంభించాను. విడివిడి పూసలను దారంతో కలిపేసి, అందమైన కంఠహారం తయారుచేస్తామే, అలాగన్నమాట! అనుసంధానాలపై అవగాహన వచ్చాక చాలా సౌకర్యంగా అనిపించింది. సైకిల్‌ నేర్చుకోవటం మొదట్లో భయపెడుతుంది. కానీ బ్యాలన్స్‌ చేయటం వచ్చేశాక, చాలా ఉల్లాసంగా ఉంటుంది కదా? ఈ సబ్జెక్టుల అధ్యయనం కూడా అంతే! మరో సంగతేమిటంటే... సైక్లింగ్‌, స్విమింగ్‌ల్లాగా ఒకసారి అవగాహన సాధించేస్తే చాలాకాలం అవి గుర్తుండిపోతాయి.
రెండు attempts మధ్యా మూడేళ్ళ అంతరం వచ్చినా ఈ సబ్జెక్టుల్లో నేను బాగా స్కోర్‌ చేయటానికి ప్రధాన కారణం ఇదే!
జనరల్‌స్టడీస్‌లో మనదేశం గురించీ, ప్రపంచం గురించీ ఎంతో తెలుసుకోవచ్చు. అందుకే దీన్ని చదవటం ఆసక్తికరం. టెన్త్‌లో చదివిన హిస్టరీ, జాగ్రఫీ మొదలైనవాటిని మళ్ళీ మళ్ళీ నేర్చుకునే అవకాశం ప్రిపరేషన్లో లభించింది. సానుకూల దృక్పథం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఒక సబ్జెక్టును నేర్చుకునే సమయం గణనీయంగా తగ్గిపోతుందని గ్రహించాను. NCERT ప్రాథమిక పుస్తకాలను చదివి నోట్సు తయారుచేసుకున్నాను. కరంట్‌ అఫైర్స్‌ కోసం జాతీయ వార్తాపత్రికలను చదివాను.
ఒక్కో అడుగూ...
మొదటిసారి 2005లో సివిల్స్‌ రాశాను. ప్రిలిమినరీలో అర్హత పొందలేకపోయాను. ఇది ఆబ్జెక్టివ్‌ పరీక్షే కదా, సులభంగా రాసెయ్యవచ్చని ఆలోచించటం వల్లనే ఇలాంటి వ్యతిరేక ఫలితం వచ్చింది. ప్రిలిమ్స్‌ పాసవ్వకపోయినా మెయిన్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించి, డిసెంబర్‌ 2005కల్లా ఆప్షనల్స్‌- మెయిన్స్‌ సిలబస్‌ను పూర్తిచేశాను. జనవరిలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ జనరల్‌స్టడీస్‌ ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. మార్చి నుంచీ మళ్ళీ నా ఆప్షనల్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివి, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలను సాధన చేయటం ప్రారంభించాను. ఈసారి నేను జనరల్‌స్టడీస్‌ మీద కంటే పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌మీదనే ఎక్కువ దృష్టిపెట్టాను.
ఇది అనుకూల ఫలితాన్నిచ్చింది. ఆగస్టు 2006లో వచ్చిన ప్రిలిమినరీ ఫలితాల జాబితాలో నా రోల్‌నంబర్‌ ఉండటం చాలా సంతోషాన్నిచ్చింది. నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే... ఏ పరీక్షనూ తక్కువ అంచనా వేయకూడదని. అలాగే మార్కుల వెయిటేజిని విశ్లేషించుకోవాలనీ!
మెయిన్స్‌ ఫార్మ్‌ రాగానే దానిలో ఏం రాయాలనేదానిపై ఎక్కువ సమయం వెచ్చించి, ఆలోచించాను. బయోడేటా ఫార్మ్‌ నుంచే ఇంటర్‌వ్యూలో చాలా ప్రశ్నలు వస్తాయని విన్నాను. పైగా అక్కడ నింపే order of choices of services సమాచారంపైనే మన భవిష్యత్తు ఆధారపడివుంటుంది. ఈ ఫార్మ్‌ను నింపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యర్థులందరికీ నా సలహా.
మెయిన్స్‌ కోసం... పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీల్లో expected questions, కొన్నిటికి prepared answers ను తయారుచేయటానికి ప్రయత్నించాను. 2007లో ఇంటర్వ్యూకి హాజరై, 312 ర్యాంకు తెచ్చుకున్నాను. కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ సర్వీస్‌కు ఎంపికయ్యాను.
ఐఏఎస్‌ సాధించాలనే అభిలాష అలాగే ఉండిపోయింది కదా? అయితే వెంటనే మళ్ళీ సివిల్స్‌ పరీక్ష రాయకూడదనీ, నా శిక్షణ మీదే దృష్టి పెట్టాలనీ నిర్ణయించుకున్నాను. శిక్షణ తర్వాత పెళ్ళి చేసుకున్నాను... పరీక్ష వెంటనే రాయబోవటం లేదు కదా అని!
మళ్ళీ సివిల్స్‌ సమరం
ఈసారి ఉద్యోగం చేస్తూనే 2010లో సివిల్స్‌ రాశాను. ఒక పక్క పాపాయి అవసరాలూ, ఇంకో పక్క ఉద్యోగ విధులూ, మరోపక్క పరీక్ష కోసం కేటాయించాల్సిన సమయం- వీటన్నిటినీ సమన్వయం చేసుకోవటం... నిజంగా చాలా కష్టమయింది! నా భర్త, అత్తింటివారూ, నా తల్లిదండ్రులూ ఎంతగానో సహకరించారు.
ఈ ప్రయత్నంలో నేను ఏ వ్యూహం పాటించానో చెపుతాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోసం మౌలిక పుస్తకాలతో పాటు 2nd Administrative Reforms Commission నివేదికలను సంప్రదించాను. ఇది గొప్పగా ఉపకరించింది. ఆంత్రపాలజీలో ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టి ఫిజికల్‌ ఆంత్రపాలజీపై అదనపు శ్రద్ధ పెట్టాను. ఇంతకుముందు ప్రయత్నంలో నేను నిర్లక్ష్యం చేసిన, ఎక్కువ స్కోరింగ్‌ అవకాశమున్న భాగమిది!
మెయిన్స్‌లో నెగ్గి ఇంటర్వ్యూకు సిద్ధమయ్యాను.
ఇంటర్వ్యూలో ఏయే ప్రశ్నలు రావటానికి అవకాశముందో అంచనా వేయటం ప్రారంభించాను. ఆ ప్రశ్నలను స్థూలంగా ఏడు అంశాలుగా విభజించుకున్నాను. 1) వ్యక్తిగతం 2) విద్యాసంబంధం 3) సర్వీస్‌ ప్రిఫరెన్స్‌ 4) ఉద్యోగ విధులు 5) ఆప్షనల్స్‌ 6) అభిరుచులు 7) కరంట్‌ అఫైర్స్‌.
అడగటానికి ఆస్కారమున్న ప్రశ్నలను ఊహించి, వాటన్నిటికీ సమాధానాలు సిద్ధం చేసుకున్నాను. డిగ్రీలో నా సబ్జెక్టులకు సంబంధించిన కరంట్‌ అఫైర్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాను. నా డిపార్ట్‌మెంట్‌, విధుల తీరు గురించిన సమాచారాన్ని సమీక్షించుకున్నాను. ఒడిస్సీ నృత్యాన్ని నా అభిరుచిగా రాశాను కాబట్టి దాని గురించి కొంత అధ్యయనం చేశా. కరంట్‌ అఫైర్స్‌లో ప్రాథమిక అంశాలు చదివాను. సమయం చాలక ఇంటర్వ్యూ గైడెన్స్‌, మాక్‌ ఇంటర్‌వ్యూ ఫోన్లోనే తీసుకోవాల్సివచ్చింది.
సివిల్స్‌ ఇంటర్‌వ్యూ 20 నిమిషాలసేపు జరిగింది. ఎక్కువ ప్రశ్నలు నా ఉద్యోగంపైనే వచ్చాయి. అసిస్టెంట్‌ కమిషనర్‌గా నా విధులేమిటని బోర్డ్‌ చైర్మన్‌ అడిగారు. కస్టమ్స్‌ విభాగంపై ప్రజలకు ఎందుకని వ్యతిరేక భావన ఉందని ఓ సభ్యుడు ప్రశ్నించారు. అవినీతి గురించి మరో ప్రశ్న. ఈజిప్ట్‌ గురించి ఇంకో ప్రశ్న. జనాభా, జనసాంద్రతకు సంబంధించి అగ్రశ్రేణిలో ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలేమిటని ఒక సభ్యుడు అడిగారు. ఆవనూనె (మస్టర్డ్‌ ఆయిల్‌)ను ఎక్కడ వినియోగిస్తారనీ, కల్తీ ఆవనూనె తయారీకి ఏం ఉపయోగిస్తారనీ ప్రశ్నించారు.
అన్ని ప్రశ్నలకూ కాకుండా కొన్నిటికి మాత్రమే సమాధానాలు చెప్పగలిగాను. సంతృప్తికరంగా ఇంటర్‌వ్యూ చేయలేకపోయాననీ, ఇంకా బాగా చేసివుండొచ్చనీ అనిపించింది. ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకును ఆశించాను కానీ, టాప్‌ ర్యాంకు వస్తుందని మాత్రం అనుకోలేదు.
అందుకే జాతీయస్థాయిలో సెకండ్‌ ర్యాంకు వచ్చిందని తెలియగానే... అది అర్థమవ్వటానికి కాస్త సమయం పట్టింది! విస్మయం, సంతోషం, సంతృప్తీ... ఒకేసారి మనసును చుట్టుముట్టాయి''.

*సైకిల్‌ నేర్చుకోవటం మొదట్లో భయపెడుతుంది. కానీ బ్యాలన్స్‌ చేయటం వచ్చేశాక, చాలా ఉల్లాసంగా ఉంటుంది కదా? ఈ సబ్జెక్టుల అధ్యయనం కూడా అంతే! *నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే... ఏ పరీక్షనూ తక్కువ అంచనా వేయకూడదని. అలాగే మార్కుల వెయిటేజిని విశ్లేషించుకోవాలనీ!

అభ్యర్థులూ... పాటించండి!
* మీపై మీరు నమ్మకం పెంచుకోండి. పరీక్ష రాయకపోతే ఏమవుతుందోనని సతమతం కావొద్దు. * పరీక్ష వ్యూహంపై ఈ రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి. మీ మిత్రులు సూచించారనే కారణంతో మాత్రం ఆప్షనల్స్‌ను ఎంచుకోకండి.
* ప్రిపరేషన్‌ సాగించేటపుడు స్త్థెర్యం కోల్పోవచ్చు. అలాంటపుడు తల్లిదండ్రులపై, దగ్గర కుటుంబ సభ్యులపై నమ్మకం ఉంచండి.
* జనరల్‌ స్టడీస్‌ను ఎంత ఎక్కువ అధ్యయనం చేసినా సంతృప్తస్థాయిని చేరుకోవటం ఉండదు. అందుకే చదవగలిగినంతవరకూ చదివెయ్యండి.
* సరైన ప్రశ్నలనే ఎంచుకోండి. ఉదాహరణకు... జనరల్‌ ఎస్సేలో 'India as an Emerging Global Super Power' ను ఎంచుకున్నాను. ఎందుకంటే... ఈ అంశంపై నేను ఎంతైనా రాయగలను కాబట్టి.
* మీ పరిజ్ఞానానికి ఆధారంగా, అనుబంధంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించండి.
* చివరిగా, మీ ప్రయత్నంలో విఫలమైతే నిరాశలో కూరుకుపోవద్దు. విజయం అనాయాసంగా ఎవరినీ వరించదు. దానికి అవసరమైన కాలాన్ని అది తీసుకుంటుంది!

అద్భుత లక్షణాలు... అందుకుంటే విజయాలు!

అద్భుత లక్షణాలు... అందుకుంటే విజయాలు!
నిన్నటిదాకా లక్షల్లో ఒకరు... ఇప్పుడు కోట్లమంది మెచ్చిన హీరోలు... బుగ్గకారు... దర్పం... సమాజంలో గౌరవం... ఇవన్నీ ఒక్కరోజు శ్రమకు దక్కిన ఫలితం కాదు... కొందరు త్యాగాలు చేశారు... ఇంకొందరు ఉద్యోగాలే వదులుకున్నారు... అపజయాలనే విజయాలకు సోపానాలుగా మలుచుకున్నారు... వీళ్లని విజేతలుగా నిలిపిన లక్షణాలేంటి? ముందుకు నడిపించిన శక్తులేంటి? విశ్లేషిస్తున్నారు మానసిక వ్యక్తిత్వ నిపుణులు.
శిఖరాగ్రానికి చేరుకున్నవారిని ప్రపంచమంతా గుర్తిస్తుంది. అది విజయానికి దక్కే గౌరవం. అలాంటి విజయాలను అందుకోవాలనుకునే వారు మాత్రం కేవలం వారిని చూసి జేజేలు పలికితే సరిపోదు. వారు నడిచిన మార్గం కేసి దృష్టి సారించాలి. ఆ దారిలో ఒకో అడుగూ ఒకో పాఠం. ఒకో మలుపూ ఒకో సూత్రం. సివిల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారి నేపథ్యాల నుంచి నేటి యువత నేర్చుకోవలసిన అంశాలెన్నో ఉన్నాయి. వేర్వేరు రంగాల్లో, వేర్వేరు ఉద్యోగాల్లో, స్థితిగతుల్లో ఉన్న యువతీయువకులందరూ ఈ విజేతల నుంచి నేర్చుకోవలసింది ఒక్కటే. అది... 'ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి' ఎదగాలనే తపన.
ప్రేరణ, తపన, పట్టుదల, సకారాత్మక ఆలోచన విధానం, వైఫల్యాలకు నిరాశపడకపోవడం, కొంచెం సాధించగానే సంతృప్తి పడక పోవడం... ఇలా ఎన్నో చక్కని లక్షణాలు విజేతల వెనుక చోదక శక్తిగా ఉంటాయి. వీటిలో అన్నీ, లేదా కొన్ని కొందరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ వారిని ముందుకు నడుపుతాయి. మనం గమనించాల్సింది ఆ లక్షణాలనే.
ఆగిపోకు అక్కడే
సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయమనుకుంటే పొరపాటు. ఉన్నదాంతో సమాధానపడిపోతే కాలం గడిచిపోతుంది. పైకి లోపమేదీ ఉండకపోవచ్చు. కానీ విజయంలోని మజా దూరమవుతుంది. ఎవరైనా ఉత్తమ స్థితికేసి దృష్టి సారిస్తేనే అద్భుత ఫలితాలు అందుకుంటారు.
ఉదాహరణ: రెండో ర్యాంకు సాధించిన హైదరాబాద్‌ అమ్మాయి శ్వేతా మొహంతిలో ఇది ప్రస్ఫుటం. తండ్రి, భర్తలు ఐఏఎస్‌లు. తనదీ మంచి ఉద్యోగమే. సంతృప్తి పడి పోతే ఈనాటి విజయం లేదు. ముద్దులొలికే పాపతో పొద్దు గడిచిపోయేది. అయినా శ్వేత లక్ష్యం నిర్దేశించుకుంది. మొదటిసారి ప్రిలిమ్స్‌ దాటకపోయినా నిరాశతో వెనుకడుగేయలేదు. రెండోసారి 312 ర్యాంకుతో మంచి ఉద్యోగం వచ్చినా ఆగిపోలేదు. ముచ్చటగా మూడోసారి అనుకున్నది సాధించింది. రెండో ర్యాంకుతో దేశం దృష్టిని ఆకర్షించింది.
ఆశయమే ఆలంబన!
వాహనం నడవాలంటే ఇంధనం కావాలి. మనిషి ఎదగాలంటే ప్రేరణ కావాలి. విజయ పథంవైపు నడిపించే లక్షణాల్లో ఉత్తమమైన ఆశయం కూడా ఒకటి. అదే చోదక శక్తిగా మారి మార్గాన్ని నిర్దేశిస్తుంది. దాన్ని మనసులో ముద్రించుకున్నవారు మాత్రమే విజయాల దిశగా అడుగులు వేస్తారు.
ఉదాహరణ: హైదరాబాదీ అనిరుధ్‌ శ్రవణ్‌ది ఉన్నత స్థాయి కుటుంబం. కానీ అతడి దృష్టి ఎప్పుడూ పక్కనే ఉన్న గుడిసెల్లోని పేదలపైనే. సర్కారీ బడుల్లోని పిల్లల కోసం స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేశాడు. అదే తపన ఐ.బి.ఎం.లో ఉద్యోగం వదులుకునేలా చేసింది. సివిల్స్‌ సాధించేలా పట్టుదలను రగిల్చింది. మొదటి ప్రయత్నం విఫలం. రెండోసారి మూడు మార్కులతో మిస్‌. సేవా సంకల్పమే అతడిలో స్ఫూర్తిని రగిల్చింది. మూడో ప్రయత్నంలో పదమూడో ర్యాంకు ఇచ్చింది. 'సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పేదో ముందు మన నుంచే మొదలవ్వాలి' అంటాడు అనిరుధ్‌.
పట్టుదలతో ఫలితం!
చేయాలనుకున్న పనిని చేసేవరకు నిద్రపోని మనస్తత్వం విజేతల సొంతం. దీని కోసం ఇష్టాలను వదులుకుంటారు. కష్టాలకు ఎదురెళ్తారు. ఇందులో పేదా, గొప్ప తారతమ్యాలుండవు. స్థాయి, హోదాలు కానరావు. ఐఏఎస్‌ కూతురుకైనా, వాచ్‌మెన్‌ కొడుకుకైనా అందరిదీ ఒకే పంథా.
ఉదాహరణ: వాచ్‌మెన్‌ కొడుకు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఈ పరిస్థితుల్లో దొడ్డె ఆంజనేయులు సివిల్స్‌ సాధించాలనుకోవడం సాహసమే. చదువుల యాగం మొదలుపెట్టాడు. పది నుంచి ఇంజినీరింగ్‌ దాకా అన్నింట్లోనూ ర్యాంకులే. సాఫ్ట్‌వేర్‌ కొలువులో చేరాడు. ఏడాదికి ఏడు లక్షల రూపాయల జీతం. కానీ చిన్ననాటి లక్ష్యం ముందు ఇది చిన్నగానే కనిపించింది. ఉద్యోగం వదిలేసి పేదవాళ్లకు మేలు చేయాలని తపించాడు. ఈలోగా నాన్న మరణం. మొదటి రెండు ప్రయత్నాలూ ఫెయిల్‌. వేరొకరైతే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయేవారేమో! కానీ పట్టుదల తోడుగా ఆంజనేయులు 278 ర్యాంకు సాధించాడు. అందుకే కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని ఎస్సీ కాలనీ అతడిని తల్చుకుని గర్విస్తోంది.
ఒకొక్కటిగా లక్ష్యాలు!
జీవితంలో ఎదగాలనుకునే వారికి ఒక లక్ష్యం చాలదు. ఒక దాని తర్వాత మరో లక్ష్యం పెట్టుకుంటూ ముందుకు సాగుతారు. అదే వారికి విజయ సోపానమై ఉన్నత స్థితికి చేరుస్తుంది.
ఉదాహరణ: ఇరవై అయిదో ర్యాంకు సాధించిన ప్రకాశం జిల్లా కుర్రాడు జయచంద్ర భానురెడ్డిని విజేతగా నిలిపింది ఈ లక్షణమే. అతడి మొదటి లక్ష్యం మెడిసిన్‌. ర్యాంక్‌ సాధించి మెడిసిన్‌లో చేరినా సరదాగా గ్రూప్‌ 1 రాశాడు. ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. కానీ మొదటి లక్ష్యం పూర్తి అయ్యాకే మరొకటి అనుకున్నాడు. మెడిసిన్‌ అయింది. అయినా ఆగలేదు. ఈసారి లక్ష్యం సివిల్స్‌. మొదటి ప్రయత్నం ఫెయిల్‌. రెండో ప్రయత్నం సెభాష్‌!
మనసు తలుపులు తెరిస్తే...
సమాజంలో పరస్పర సహకారం లేనిదే ఏదీ సాధ్యం కాదు. ఇది గ్రహించిన వారు ఇతరుల నుంచి సూచనలు అందుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. ఇతరుల నుంచి ప్రోత్సాహం పొందాలంటే వారిలోని గొప్పదనాన్ని గ్రహించాలి. మనసు తలుపులు తెరిస్తే నలుదిశలా సహకారమే.
ఉదాహరణ: చదువుతున్న దశ నుంచీ హెప్సిబా రాణి అందరి సలహాలు వినయంగా స్వీకరించేది. ఢిల్లీలో పీజీ చదువుతున్నపుడు అక్కడికొచ్చే ప్రముఖులు, శాస్త్రవేత్తలను కలిసేది. విలువైన సూచనలు తీసుకునేది. విజయవాడలో ఉన్నపుడు మునిసిపల్‌ కమిషనర్‌ గుల్జార్‌ బ్లాగుని ఫాలో అయ్యేది. సబ్‌కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సివిల్స్‌ ఇంటర్వ్యూకు సంబంధించి సూచనలిచ్చారు. ఐఏఎస్‌లు వీణ, పి.కె.మహంతిలను తరచూ కలిసేది. 'సునామీ గురించి తెలుసుకో' అని అమ్మ ఇచ్చిన సలహా కూడా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నగా వచ్చింది. అందువల్లనే కృష్ణాజిల్లా గడ్డమణుగుకు చెందిన ఈ అమ్మాయి ఇరవయ్యో ర్యాంకు సాధించింది.
స్ఫూర్తి గెలిపిస్తుంది
ఉన్నత స్థానంలో నిలిచినవాళ్లను చూసి ఆశ్చర్యపోవడం సామాన్యుల వంతు. ఆ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని వారి సరసన చేరడం విజేతల లక్షణం. ఆ స్ఫూర్తే సంకల్పంగా మారుతుంది.
ఉదాహరణ: కడప జిల్లాకు చెందిన పొమ్మల సునీల్‌కుమార్‌ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. అన్న సంపత్‌కుమార్‌ గ్రూప్‌ 1లో విజయం సాధించి ఆర్డీవోగా ఎంపికవడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. సివిల్స్‌ లక్ష్యాన్ని ఏర్పరిచింది. మొదటి ప్రయత్నంలో పది మార్కులతో సర్వీస్‌ మిస్‌. అయినా నేలకు కొట్టిన బంతిలా పైకి లేచాడు. రెండో ప్రయత్నంలో 18వ ర్యాంకు.
పకడ్బందీ ప్రణాళిక!
మొదట ఏం సాధించాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. తర్వాత దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక అనుక్షణం దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రణాళికను అమలులో పెట్టాలి.
ఉదాహరణ: గుంటూరు జిల్లా చిలుమూరు కుర్రాడు కొలసాని వెంకట సుబ్బయ్య చౌదరి విజయంలో ఈ లక్షణాలే కనిపిస్తాయి. సివిల్స్‌లో 26వ ర్యాంకు సాధించిన ఇతడు పెద్ద ఉద్యోగాలను కాదని తానేం చేయాలో నిర్ణయించుకున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు వారికోసమే సివిల్స్‌ సాధించాలనే స్పష్టత వచ్చింది. పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమం. పీజీ తర్వాత ఉద్యోగావకాశాలు వచ్చినా సేవా మార్గాన్ని ఎంచుకున్నాడు. తొలి ప్రయత్నంలో 268వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కి ఎంపికైనా తిరిగి రాసి 26వ ర్యాంకు సాధించాడు. ప్రతి సబ్జెక్ట్‌పైనా సొంతంగా నోట్స్‌ రాసుకోవడం, రోజుకి పది గంటలు చదవడం అతడి ప్రణాళికలో భాగం.
స్పష్టత ముఖ్యం!
ఎంత సేపు చదివామనేది ముఖ్యం కాదు. చదివినంత సేపు ఎంత స్పష్టతతో చదివామనేదే ప్రధానం. ఇది సాధించాలంటే ఇంత సేపు చదవాలని దేనికీ నిర్ణయమై ఉండదు. చదివిన ప్రతి విషయంపై మనసులో స్పష్టత కలిగి ఉండడం ముఖ్యం.
ఉదాహరణ: పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమమే. ఇంటర్‌ వరకు గుంటూరులో. ఆపై చెన్నైలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌. సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఎంపిక. జీవితం స్థిరపడిపోయింది. కానీ మనసు సమాధాన పడలేదు. అందుకే గుంటూరు జిల్లా వీరాపురానికి చెందిన రైతు కుటుంబంలోంచి వచ్చిన శాఖమూరి చంద్రశేఖర్‌ 24వ ర్యాంక్‌ సాధించాడు. తొలిసారి 422వ ర్యాంకు వచ్చి అనువైన కొలువు పొందినా రెండోసారి యత్నం. అదీ కాదని మూడోసారి విజయం. రోజుకు కేవలం ఆరు నుంచి ఎనిమిది గంటలే చదివినా స్పష్టతతో చదవడం మేలు చేసింది. సినిమాలు, ఫంక్షన్లు మానకుండానే సాధించడం విశేషం. గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ఇప్పుడితడి స్పష్టమైన లక్ష్యం.
ప్రతికూల ఆలోచనలకు స్వస్తి!
మనసు విభిన్న ఆలోచనల పుట్ట. ప్రతి కూల ఆలోచనలను అది ఎప్పుడూ ముందుకు తెస్తుంటుంది. వాటిని దూరం చేసుకుంటేనే విజయం. పల్లెటూరి వాడిననో, ఇంగ్లిషు రాదనో, కష్టపడినా ఫలితం ఉండదనో లాంటి ఆలోచనలకు లొంగకూడదు.
ఉదాహరణ: నాన్న పది కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి పాల వ్యాపారం చేస్తేనే ఇల్లు గడిచే నేపథ్యం. చదువు కోసం వడ్డీకి అప్పులు చేసిన ఆర్థిక స్థితి. ఆ పరిస్థితులే చదువును వెలిగించాయి. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారి పల్లె నుంచి వచ్చిన కుర్రాడు అన్నం మల్లికార్జున 252వ ర్యాంకు సాధించడానికి కారణం ప్రతికూల ఆలోచనలు జయించడమే. ఎంసెట్‌ ర్యాంకుతో మెడిసిన్‌ సాధించి పల్లెటూరిలో వైద్యాధికారిగా చేరినా గ్రామీణుల కోసం సివిల్స్‌ లక్ష్యం ఏర్పడింది. రెండు సార్లు పరీక్షలో, మూడోసారి ఇంటర్వ్యూలో వైఫల్యం. అయినా ఆగలేదు కాబట్టే ఇప్పుడు చక్కని ర్యాంక్‌.
సహకారం: జె.కళ్యాణ్‌బాబు (గుంటూరు), హసన్‌(హైదరాబాద్‌), ఎం.సుబ్బారావు(ఒంగోలు), మూల్పూరి పద్మజ(విజయవాడ), టి.సురేశ్‌(కడప)

ప్రేమా... నీకు జోహారు!

మనసులో మాట
ప్రేమా... నీకు జోహారు!
'ప్రేమిస్తున్నా'నంటూ వెంటపడ్డాడో అబ్బాయి. 'జీవితంలో స్థిరపడితే అప్పుడాలోచిస్తా' అందా అమ్మాయి. తీరా కుర్రాడికి ఉద్యోగమొచ్చాక ఏమైంది?

'యాహూ...' నా కేకతో బోర్డుపై పేర్లు చూసుకుంటున్న వాళ్లంతా షాక్‌. 'ఏంటి బాబూ! ప్రపంచాన్నేమైనా జయించావా?' అన్నారొకరు. ఔను.ప. ప్రభుత్వ కాలేజీలో సీటు దొరకడం నాకు అంతకన్నా ఎక్కువే. ఇంటర్లో నాకొచ్చినవి అత్తెసరు మార్కులే మరి. టిప్‌టాప్‌గా తయారై డిగ్రీ క్లాసులో అడుగుపెట్టా. ఎప్పట్లాగే చదువులో బిలో యావరేజ్‌. కానీ కాలేజీలో వినిపించే ప్రేమకథలకు చెవులొగ్గేవాణ్ని. తొందర్లోనే నాకూ ఆ లవ్‌ వైరస్‌ సోకింది. ఆ ప్రభావం నన్నో అమ్మాయి వెంట పడేలా చేసింది. తను ఇంటర్‌ సెకండియర్‌. ఆమె దృష్టిలో పడటానికి ఎన్నో గిమ్మిక్కులు చేశా. ఎలాగైతేనేం ఓరోజు ఆమెతో 'హాయ్‌' అనిపించుకున్నా. ఆరోజు నాకు పండగే. ఈ గొడవలో పడి రెండు సబ్జెక్టులు డింకీ కొట్టా. మిగతా వాటిల్లో మార్కులు నలభైకి లోపే. తనతో చెప్తే 'ఇలాగ కూడా పాసవుతారా?' అని వేళాకోళమాడింది. తర్వాత తనే భుజం తట్టింది. 'నువ్‌ తలచుకుంటే ఫస్ట్‌క్లాస్‌లో పాసవుతావ్‌' అంది.
అదేం మహత్యమో! తన మాట నాలో వూహించని మార్పు తీసుకొచ్చింది. చెప్పినట్టే కష్టపడి చదివా. సెకండ్‌ క్లాస్‌తో డిగ్రీ పాసయ్యా. తర్వాత ఓ స్కూళ్లో టీచర్‌గా అవతారమెత్తా. స్థిర పడ్డానన్న ఫీలింగ్‌. ఆలస్యం చేయకుండా నా మనసులో మాట చెప్పేశా. తప్పకుండా 'ఓకే' చెబుతుందనే నమ్మకం. సీన్‌ రివర్సైంది. 'నాకా ఉద్దేశం లేద'ంటూ తేల్చేసింది. 'డిగ్రీ చదివా. నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నా. ఇంకేం కావాలి?' అంటూ వాదనకు దిగా. ముందు మౌనంగా ఉంది. కాసేపయ్యాక నోరు విప్పింది. 'బతకడానికి ప్రేమొక్కటే సరిపోదు. ముందు జీవితంలో స్థిరపడు అప్పుడాలోచిస్తా' అంది. పట్టుదలతో అక్కడ్నుంచి కదిలా.
ఎంట్రన్స్‌ రాసి బీఈడీలో జాయినయ్యా. మధ్యమధ్యలో తనను కలిసేవాణ్ని. బాగా ప్రోత్సహించేది. ఆమె ప్రతి మాటా ఓ సూచనలా ఉండేది. ప్రతి ఆలోచన జీవితంపై ప్రేమను పెంచేది. బీఈడీ చివరి పరీక్షలు. అప్పుడే తనకు పెళ్లి చూపులని తెలిసింది. పరుగెత్తుకెళ్లాను. 'చూపులే. పెళ్లికి ఒప్పుకోన్లే' అని భరోసా ఇచ్చింది. తర్వాత ఫస్ట్‌క్లాస్‌తో బీఈడీ పాసయ్యా. అదృష్టం కొద్దీ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌. పోయినేడుతో పోల్చితే తక్కువ పోస్టులు. జాబ్‌ రాదేమోనని మళ్లీ నిరాశ. 'తప్పకుండా జాబ్‌ కొడతావ్‌. ఇదే నీ ప్రేమకు చివరి పరీక్షనుకో' అంది. అది టానిక్‌లా పని చేసింది. పగలు రాత్రులు ఏకం చేసి చదివా. ఆఖరికి బాత్రూమ్‌కెళ్లినా చేతిలో పుస్తకముండేది. ఆ కష్టానికి ఫలితం దక్కింది. జిల్లాలో వందలోపు ర్యాంకు. కోరుకున్నచోట పోస్టింగు. చెప్పలేనంత ఆనందం. గర్వంతో ఆమె ముందు నిలబడ్డా. విషయం వినగానే తన కళ్లలో మెరుపు. ఆమె హడావుడి చూసి నా ప్రేమకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసిందనుకున్నా.
ఇంకోసారి నా వూపిరి ఆగిపోయే మాట వినాల్సి వచ్చింది. 'నా పెళ్లి ఫిక్సయింది' అంటూ ఓరోజు బాంబు పేల్చింది. సంతోషం స్థానంలో విషాదం. 'ఎందుకిలా?' అన్నా కన్నీళ్లతో. 'నువ్‌ బాగు పడాలనే' జవాబొచ్చింది. 'ముందే నీ ప్రేమకు నో చెబితే నువ్‌ ఇంత పట్టుదలగా చదివే వాడివా? టీచర్‌ అయ్యేవాడివా?' అని ప్రశ్నించింది. తను చెప్పిందినిజం. తను అప్పుడే అలా చేస్తే దేవదాసులా మారిపోయేవాణ్నేమో! ఉద్యోగం వచ్చాక కూడా నన్ను వద్దనడానికీ కారణం చెప్పింది. 'ఇరవై ఏళ్లు ప్రాణంలా పెంచిన తల్లిదండ్రుల్ని ఎదురించలేను' అని. ఏదేమైనా ఆమె నిర్ణయం కొన్నాళ్లు నా మనసును తీవ్రంగా బాధపెట్టింది. తర్వాత తేరుకుని మళ్లీ మామూలు మనిషయ్యా. ఇప్పుడు నేను వేరొకరికి భర్తను. చక్కని సంసారం. ఈ సంతోషకరమైన జీవితం ఆమె చలవే.