ఒకప్పుడైతే గ్రూప్-1,2 పరీక్షల్లో సైన్సు నుంచి 20-25 ప్రశ్నలు మాత్రమే వస్తుండేవి. అవి కూడా కొన్ని అంశాల నుంచి మాత్రమే. ప్రాథమికాంశాలపై (బేసిక్స్) ఎక్కువ ప్రశ్నలు వచ్చేవి. కానీ రానురానూ గ్రూప్స్‌లో సైన్సు ప్రాధాన్యం పెరుగుతోంది. 2008 గ్రూప్-1, గ్రూప్-2లలో దీని నుంచి వరుసగా 30, 46 ప్రశ్నలు అడిగారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీలో కూడా సైన్స్ నుంచి 31 ప్రశ్నలు వచ్చాయి. 2004, 05లలో జరిగిన గ్రూప్స్ పరీక్షల్లో కంటే 2008, 10లలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు అన్ని అంశాల నుంచీ విస్తృతంగా అడగటమే కాదు; అవి క్లిష్టంగానూ ఉన్నాయి.
గ్రూప్స్‌లో మారుతోంది... సైన్సు సరళి! ఏ పోటీ పరీక్షలోనైనా తప్పనిసరిగా ఉండే సబ్జెక్టు సైన్సు. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, గతంలో జరిగిన పరీక్షలు ఏమేం సూచిస్తున్నాయి? రాబోయే గ్రూప్-2 కోసం కీలకమైన ఈ సబ్జెక్టు ప్రిపరేషన్ తీరులో ఏ మార్పులు చేసుకోవాలి? పరిశీలిద్దాం!
డా. బి. నరేశ్
రాబోయే గ్రూప్-2లో కూడా సైన్సు నుంచి 45-50 ప్రశ్నలు రావటానికి అవకాశముంది. ప్రశ్నలు కూడా లోతుగా, విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి రావొచ్చు.
ఏపీపీఎస్‌సీ ప్రకటించిన సైన్స్ సిలబస్ అభ్యర్థులను తికమక పెట్టేదిగా ఉంది. అందుకని ప్రిపరేషన్లో అన్ని అంశాలనూ కవర్ చేస్తూ నిత్యజీవితంలోని సంఘటనలను గమనిస్తూ లోతుగా చదవాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్ర అంశాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో- అంతరిక్ష రంగం, రక్షణ రంగం, బయో టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ అధ్యయనం చేయాలి. అదనపు అంశాల్లో- పర్యావరణ సమస్యలు (గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, వాతావరణ మార్పులు), వివిధ పరిశోధనా సంస్థలు, అవి ఉండే ప్రదేశాలు, జీవశాస్త్ర విభాగాలు, వైద్య సంబంధ అంశాలు, కంప్యూటర్ రంగం మొదలైనవి చదవాల్సివుంటుంది.
ప్రిపరేషన్ స్థాయి పెరగాలి
అభ్యర్థులు ఇప్పటివరకూ సైన్స్ విభాగం నుంచి పాఠశాల స్థాయి వరకు మాత్రమే ప్రశ్నలు వస్తున్నాయని భావిస్తూ వచ్చారు. కానీ 2010, 2008 గ్రూప్-1, 2008 గ్రూప్-2 ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలు ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో అడుగుతున్నారని గమనించవచ్చు. కాబట్టి ప్రిపరేషన్ స్థాయిని పాఠశాల స్థాయి నుంచి పై స్థాయికి పెంచితే ఎక్కువ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు. గ్రూప్-2 అభ్యర్థులకు సమయం కూడా తగినంత ఉంది కాబట్టి వారు ఈవిధంగా సిద్ధమవ్వటం అవసరం.
విస్తృత అధ్యయనం కావాలి
గ్రూప్-1, 2లలో ప్రశ్నలు లోతుగా, విషయ పరిజ్ఞానంపై అవగాహన ఉండేలా అడుగుతారు. అభ్యర్థులు ప్రిపరేషన్ సాగించేటపుడు ఒక టాపిక్ గురించి కూలంకషంగా చదువుతూ దానిలోని అంశాలను సమన్వయపరచుకోవాలి.
* శొంఠి కొమ్ము/అల్లంలో ఆర్థికంగా ఉపయోగపడే భాగం
ఎ) లశునం బి) ఫలం సి) కొమ్ము డి) వేరు
దీనికి సమాధానం గుర్తించేటపుడు అల్లం మొదట మొక్క కాండం భాగమా, వేరు భాగమా అని అభ్యర్థులు తికమక పడుతుంటారు. కొద్దిగా అవగాహన ఉన్నవారు ఇది కాండం అని గుర్తిస్తారు. కానీ సమాధానంలో ఈ పదం లేదు. ఈ ప్రశ్నకు తికమక లేకుండా సమాధానం గుర్తించాలంటే అభ్యర్థికి కాండ రూపాంతరాలు, వేరు రూపాంతరాలు, భూమిలో ఉండేవన్నీ వేర్లు కావని అవగాహన ఉండాలి. భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండాన్ని కొమ్ము అంటారు. ఈ విషయాన్ని అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో గమనిస్తూ విస్తృతంగా చదవాలి. అలాగే ఇచ్చిన ఆప్షన్లలో అన్ని పదాలకూ అర్థం తెలుసుకుని, వాటిపై అవగాహన పెంచుకోవాలి.
వ్యూహం మార్చుకోవాలి
మారుతున్న ప్రశ్నల స్థాయికి తగ్గట్టు అభ్యర్థులు తమ ప్రిపరేషన్ వ్యూహాన్ని మార్చుకోవాలి. పాఠశాల స్థాయి వరకూ ఇప్పటికే చదివివున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా పై స్థాయి పుస్తకాలను చదవటం మంచిది. వీరు ప్రిపరేషన్ సమయంలో ఇంటర్ స్థాయిలో ఉండే అదనపు అంశాలను- అప్పటికే తమ దగ్గర ఉండే పాఠశాల స్థాయి అంశాల దగ్గర నోట్సుగా రాసుకోవాలి. ఉదాహరణకు... ఇంటర్లో ఉండే శ్వాసక్రియ నోట్సును పాఠశాల స్థాయి శ్వాసక్రియ నోట్సు దగ్గర రాసుకోవాలి.
కొత్తగా ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు ఒకేసారి పాఠశాల స్థాయి, ఇంటర్ స్థాయి పుస్తకాలను చదవాలి. అయితే వీరు మొదట ప్రాథమిక స్థాయి పుస్తకాలను చదవాల్సివుంటుంది. వీటిలో సబ్జెక్టు విషయాలే కాకుండా నిత్యజీవితంలో వాటి ప్రాధాన్యంపై కూడా దృష్టి సారించాలి.
No comments:
Post a Comment