ఏ దశ.. ఏ దిశ?

గ్రూప్‌-2లో మీ గమనం...
ఏ దశ.. ఏ దిశ?
కొడాలి భవానీ శంకర్‌
ప్రాక్టీసు మ్యాచ్‌గా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి పాసైన గ్రూప్‌-2 అభ్యర్థులు మొత్తం ఉత్తీర్ణుల్లో 70 శాతం వరకూ ఉన్నట్లు అంచనా. మరోపక్క గ్రూప్‌-1 లక్ష్యంగా నిర్ణయించుకుని రెండేళ్ళ నుంచి సరైన పంథా పాటించక విఫలమైన సీనియర్లూ అధికంగానే కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రూప్‌-2 విజయానికి అభ్యర్థులు ఏయే కిటుకులు పాటించాలో తెలుసుకుందాం!
గ్రూప్‌-2 సర్వీసును లక్ష్యంగా నిర్ణయించుకుని గ్రూప్‌-1 ప్రిలిమినరీ పాసైన అభ్యర్థుల ఆలోచనలు ఎలా ఉంటాయి? 'గ్రూప్‌-2లో సీనియర్లతో పోటీపడగలమా?' 'సమయం సరిపోతుందా?' 'గ్రూప్‌-1, 2 రెంటికీ చెడతామా?'... ఇలా! కానీ వీరికి ఈ ఆందోళన అవసరం లేదు. సాధారణంగా ఏ రెండు పెద్ద పరీక్షల మధ్య కాలవ్యవధి అయినా బాగానే ఉంటుంది. కాబట్టి గ్రూప్‌-1కి సిద్ధమవుతూ గ్రూప్‌-2 అందుకోలేమో అని భయపడనక్కర్లేదు. గ్రూప్‌-1 ప్రిలిమినరీలో విజేతలు కానివారు
గ్రూప్‌-1 ప్రిలిమినరీలో విజయం సాధించలేనివారు తమ ఆశలన్నిటినీ, ప్రయత్నాలన్నిటినీ గ్రూప్‌-2 మీదే కేంద్రీకరిస్తారు. వీరు గ్రూప్‌-2లో విజయం సాధించాలంటే...
* గ్రూప్‌-1 ప్రిపరేషన్లో ఏర్పడిన దృక్పథం గ్రూప్‌-2లో చాలా ఉపయోగకరమనే ప్రేరణను పొందాలి.
* 'పాలిటీ'ని జనరల్‌స్టడీస్‌ మాదిరిగా కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి. పాలిటీ అంశాలకు అదనంగా ఉన్న రెండు అధ్యాయాలపై దృష్టి నిలపాలి.
* ఏపీ చరిత్ర సులభంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సాంఘిక, సాంస్కృతిక కోణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* జనరల్‌ స్టడీస్‌ ప్రిలిమినరీలో చేసిన తప్పులను పరిహరిస్తూనే జాగ్రఫీ, జనరల్‌సైన్స్‌, మెంటల్‌ ఎబిలిటీలకు అధిక సమయం కేటాయించాలి.
* ఎకానమీ అంశాలను సూక్ష్మస్థాయిలో చదవటం కీలకమని గుర్తించాలి.
గ్రూప్‌-2కి సిద్ధమవుతున్నవారు
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పాస్‌ కాలేనివారిలో 50 శాతంపైగా గ్రూప్‌-2ని తమ తదుపరి లక్ష్యంగా ఎంచుకుంటుంటారు. అందుకే ఈ ఏడాది గ్రూప్‌-2లో విపరీతమైన పోటీ కనిపించవచ్చు. 'ప్రిలిమినరీ పాస్‌ కాలేనివారులే' అని వీరి గురించి నిర్లక్ష్యధోరణితో ఉండకూడదు. 'దెబ్బతిన్న పులి' సంగతి తెలుసు కదా? అలా వీరికి మెయిన్స్‌ ప్రిపరేషన్లో అలవర్చుకున్న స్థూల అవగాహన (overall understanding)చక్కని ఆయుధంగా ఉపయోగపడవచ్చు. పైచేయి సాధించటానికి వీరికి అవకాశం ఉంది.
వీరి పోటీ తట్టుకుని మంచి ర్యాంకు సాధించాలంటే మీ ప్రిపరేషన్లో ఏ మెలకువలు పాటించాలో కింది అంశాల ఆధారంగా విశ్లేషించుకోండి.
* గ్రూప్‌-1 ప్రిలిమినరీ పేపర్‌కు జవాబులు రాస్తే... కనీసం 95 మార్కులు సాధించగలరా? గ్రూప్‌-2 జనరల్‌స్టడీస్‌లో అలాంటి ధోరణిలో ప్రశ్నలు వస్తే ఏం చేయాలనే ఆలోచించండి. పరిష్కారమార్గాన్ని ప్రిపరేషన్లో అనుసంధానించండి.
* ప్రిలిమినరీ ఎకానమీలో అడిగిన స్థూల అవగాహన ప్రశ్నలకు కనీసం 90 శాతం కచ్చితంగా జవాబులు గుర్తించగలుగుతున్నారా? అలా లేకపోతే... కారణాలేమిటో ఆలోచించుకోండి.
* గ్రూప్‌-2 పేపర్‌-3లో ఏపీ ఎకానమీ ప్రిపరేషన్‌ తగిన స్థాయిలో ఉందా? ఏపీ ఎకనమిక్‌ సర్వే 2009-10ని బిట్ల మాదిరిగా కాకుండా స్థూల అవగాహన కోసం ఇప్పటివరకూ చదివారా? లేదా? చదవకపోతే అలాంటి ప్రిపరేషన్‌ అవసరమని గుర్తించాలి.
* పాలిటీని రాజ్యవ్యవస్థకు చెందిన 'స్టాక్‌ జి.కె.'లో అనుసంధానం చేసి ప్రిపేరయ్యారా? లేదా?
* ఏపీ ఎకానమీ- ఏపీ ఎకనమిక్‌ జాగ్రఫీలతో కలిపి ఒక అవగాహనకు వచ్చారా? ఈ రెంటి మధ్య ఉన్న సబ్జెక్టు అనుసంధానాన్ని విశ్లేషించారా?
* 1951 నుంచి ఇప్పటివరకూ సంవత్సరాల వారీగా ఏపీ గణాంక సమాచారం బట్టీ పట్టేందుకు ప్రయత్నించటం లేదు కదా? అలాంటి ప్రయత్నాలు బెడిసి కొడతాయి. పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు, స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి లాంటి వివిధ భావనలకు సంబంధించిన trendsపై దృష్టి పెట్టాలి. గమనించదగిన మార్పులు వచ్చిన సందర్భంలో మాత్రమే మెదడుకు పదును పెడితే సరిపోతుంది. 1956 నాటి గణాంక సమాచారం, ఆయా రంగాల్లో తీవ్ర మార్పులు వచ్చిన సంవత్సరపు గణాంక సమాచారం- గత నాలుగేళ్ళ గణాంక సమాచారానికి పరిమితమైతే చాలు.
* ఎకానమీలో ఐటీ, పర్యాటకం మొదలైన చాప్టర్లలో ఇటీవలి పరిణామాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. అందువల్ల ఆయా పాఠ్యాంశాలు చదివేటప్పుడు తాజా విధాన ప్రకటనలు, తాజా గణాంకాలు, బడ్జెటరీ కేటాయింపులు మొదలైనవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
.
ఇవి గమనించండి!
* నిరంతరం సమయాన్ని మొత్తం ప్రిపరేషన్‌కి వెచ్చించకుండా 'పరీక్ష తేదీలు వచ్చాక చదువుదాంలే!' అనుకునే అభ్యర్థులు నూరుశాతం విజయం సాధించలేరు. * ఉపాధ్యాయులుగా, చిన్నచిన్న ఉద్యోగులుగా ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళల్లో కలిపి రోజుకు కనీసం 6 గంటలు చదివినప్పుడే ఆశించిన ఫలితం లభిస్తుంది.
* ఇప్పటికే పుస్తకాలు బాగా చదివేసినవారు దినపత్రికల్లో వచ్చే వివిధ ఆర్టికిల్స్‌ను చదవటం ద్వారా స్థూల అవగాహనను పెంచుకోవచ్చు. విమర్శనాత్మక ధోరణిని కూడా అలవర్చుకోవచ్చు. అందువల్ల విశ్లేషణాత్మక ప్రశ్నలను సులభంగా ఎదుర్కోవటం సాధ్యమవుతుంది.
* గణాంక సమాచారం వివిధ పత్రికల కథనాల ఆధారంగా నిర్ణయించుకోవద్దు. తెలుగు అకాడమీ, ఎకనమిక్‌ సర్వే, ప్రభుత్వ ప్రకటనల నుంచి లభించే గణాంకాలు ప్రామాణికమని గుర్తించండి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్‌ని మార్చుకోవాలి.
* సమయం లభిస్తున్న ఈ తరుణంలో వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాల సాధనకు ప్రాధాన్యం ఇవ్వండి.
* సిలబస్‌, 2008 ప్రశ్నపత్రాలు మార్గదర్శకాలుగా పెట్టుకుని ప్రిపరేషన్‌ దశ-దిశ నిర్ణయించుకోవటం విజయానికి దారితీస్తుంది.

No comments:

Post a Comment