మార్కుల చుట్టూ భూగోళం!


మార్కుల చుట్టూ భూగోళం!
ఎ.ఎం. రెడ్డి
కెరీర్‌ ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌

ఏపీపీఎస్‌సీ త్వరలో నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షల్లోని జనరల్‌ స్టడీస్‌లో భూగోళశాస్త్రం కీలకమైనది. ముఖ్యంగా గ్రూప్‌-1 మెయిన్స్‌లో, గ్రూప్‌-2లో మార్కుల పరంగా దీనికున్న ప్రాధాన్యం గ్రహించి, తగిన సమయం కేటాయించుకోవాలి; వ్యూహాత్మకంగా అధ్యయనం చేయాలి!
భూగోళశాస్త్రాన్ని (geography)ఇంటర్‌ డిసిప్లినరీ సబ్జెక్టుగా పేర్కొంటారు. అనేక ఇతర సబ్జెక్టులతో దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలుంటాయి కాబట్టే దీనికీ పేరు! ప్రశ్నలు భౌతిక, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి ఉంటాయి. గ్రూప్‌-2... దీని వాటా?
గ్రూప్‌-2 పరీక్షలోని మొదటి పేపర్లో 30 ప్రశ్నలు, మూడో పేపర్‌ భారతదేశ ఆర్థికవ్యవస్థ మూడో విభాగం నుంచి మరో 20-25 ప్రశ్నలు, మూడో పేపర్‌ రెండో విభాగం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థలోని మూడో యూనిట్‌ నుంచి 20-25 ప్రశ్నలూ వస్తాయి. అంటే గ్రూప్‌-2 పరీక్షలో... భూగోళశాస్త్రం నుంచి 70-75 ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి దీని ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకోవాలి.
గ్రూప్‌-1 మెయిన్స్‌లో కీలకం
గ్రూప్‌-1 మెయిన్స్‌ నాలుగో పేపర్‌లోని మొదటి విభాగం నుంచి 30 మార్కులకు, మూడో విభాగం నుంచి మరో 30-40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. అంతేకాక భూగోళశాస్త్ర అధ్యయన ఆధారంగా 50 మార్కుల వ్యాసం కూడా వచ్చే అవకాశముంది. ఉదాహరణకు... 1. వాతావరణ మార్పు 2. ఇంధన భద్రత (Energy Security) 3. ఆహార భద్రత- వరదలు- క్షామ పరిస్థితులు మొదలైనవి. ఈ విధమైన వ్యాసరచనకు భూగోళ పరిస్థితుల పరిజ్ఞానం, దాని అన్వయం ఎంతగానో తోడ్పడుతుంది.

ఇతర పరీక్షలన్నిటిలో జనరల్‌స్టడీస్‌ పేపర్‌ నుంచి భూగోళశాస్త్ర ప్రశ్నలు 30 తప్పకుండా ఉంటాయి. మారిన సరళి...
రాబోయే పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా భూగోళశాస్త్రం నుంచి వచ్చే ప్రశ్నల తీరును తెలుసుకోవాలి. ఇటీవలికాలంలో జరిగిన వివిధ పోటీ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలస్థాయి, సరళిలో వచ్చిన మార్పులను గ్రహించాలి. ప్రశ్నలు గతంలో మాదిరి మూసలో కాకుండా విషయ అవగాహన ఆధారంగా విశ్లేషణాత్మకంగా వస్తున్నాయి. ఉదాహరణకు... ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ప్రపంచ భూగోళశాస్త్రంలోని లోతైన అవగాహనను పరీక్షించేవిగా ఉన్నాయి. ముందుగా ఇలాంటి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఎలా సిద్ధం కావాలో పరిశీలిద్దాం.
మనదేశానికే పరిమితం కాదు
భూగోళశాస్త్రమంటే భారతదేశ భౌగోళిక అంశాలు మాత్రమే కాదు. ప్రశ్నలను పరిశీలిస్తే... గతంలో నాలుగైదు ప్రశ్నలకే పరిమితమైవుండే ప్రపంచ భూగోళశాస్త్రం, భౌతిక భూగోళశాస్త్రాలు ఇప్పుడు 10-12 ప్రశ్నలకు పెరిగాయి. మారిన ఈ ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా భౌతిక భూగోళశాస్త్రం అంటే.. భూస్వరూపశాస్త్రం, శీతోష్ణస్థితి శాస్త్రం, సముద్రశాస్త్రాల్లోని మౌలిక అంశాలను అవగాహన చేసుకుని, వాటి అనువర్తనాలపై పట్టు సాధించాలి.
ప్రపంచ భూగోళశాస్త్ర ప్రాధాన్యం
ఈ సబ్జెక్టు నుంచి వచ్చే మొత్తం ప్రశ్నల్లో దాదాపు సగం ప్రపంచ భూగోళశాస్త్రం నుంచి వస్తాయని గుర్తించండి. (భౌతిక భూగోళశాస్త్రాన్ని దీనిలో భాగంగానే పరిగణించాలి. ఎందుకంటే... భౌతిక భూగోళ మౌలిక భావనలు భూగ్రహానికి సంబంధించినవి.)
ఇటీవలి గ్రూప్‌-1లోని ఈ దిగువ ప్రశ్నలను గమనించండి.
* భూమి వెలుపలి పొరను ఏమని పిలుస్తారు?
* ప్రపంచంలో అతి పెద్ద మహాసముద్రమేది?
* అక్షాంశాలను భూమధ్యరేఖకు సమాంతరంగా ఎటువైపు నుంచి గీస్తారు?
* ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబరు 21న సూర్యుని కిరణాలు దేనిపై నేరుగా ప్రసరిస్తాయి?
ఈ నాలుగు ప్రశ్నలూ భౌతిక భూగోళానికి సంబంధించినవే. కాబట్టి భారతదేశ అంశాలకు పరిమితం కాకుండా భౌతిక భూగోళశాస్త్రంలోని విభాగాలన్నిటిలో ఉన్న మౌలిక భావనలపై పట్టు పెంచుకోవాలి.
పాఠశాల పుస్తకాలే ఆధారం
దీనికోసం మొదట 5,6,7,8,9 తరగతుల పాఠ్యపుస్తకాలను చదివి, తర్వాత ఇంటర్మీడియట్‌ భూగోళశాస్త్ర పాఠ్యపుస్తకాలను చదవాలి. ఆపై డిగ్రీ స్థాయిలో తెలుగు అకాడమీ ఇటీవల ప్రచురించిన భౌతిక భూగోళశాస్త్రాన్ని చదివితే ఈ విభాగంపై పూర్తి పట్టు సాధించవచ్చు. సాధారణంగా ఎగ్జామినర్స్‌ అంతా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కాబట్టి వారు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలను అడిగినప్పటికీ మీరు ఇందులోని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించగలుగుతారు.
ఈ అంశాలను చదివేటప్పుడు వాటికి సంబంధించిన చిత్రపటాలపై (మ్యాపులు) దృష్టిని కేంద్రీకరిస్తే పాఠ్యాంశంపై సమగ్ర అవగాహన ఏర్పడి, మనసులో నాటుకుంటుంది.
వీలైతే 8 నుంచి 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను కూడా చదవగలిగితే ప్రిపరేషన్‌ సమగ్రంగా, సంపూర్ణంగా ఉంటుంది. పరీక్షలో వచ్చే ప్రశ్నలన్నిటికీ కచ్చితమైన సమాధానాలను గుర్తించవచ్చు. ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ప్రతి అంశానికీ ప్రామాణిక చిత్రపటం ఉంటుంది. ప్రపంచ భూగోళశాస్త్ర అధ్యయనానికి అట్లాస్‌తో పాటు ఖండాలవారీగా చిత్రపటాలు లభ్యమవుతాయి. వాటిని ముందుంచుకుని చదివితే సబ్జెక్టు ఇంకా తేలిగ్గా అర్థమవటమే కాకుండా మనసులో స్థిరంగా ఉంటుంది.
భారతదేశ భౌగోళికాంశాలు
వీటి నుంచి దాదాపు 10-12 ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రం నుంచి 3-5 ప్రశ్నలూ వస్తాయి. వీటికోసం ముందుగా 8-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను చదవాలి. ఇంకా 8- 10 తరగతి పాఠ్యపుస్తకాల్లోని ఆంధ్రప్రదేశ్‌, భారతదేశ భౌగోళికాంశాలను చదువుతూ తాజా సమాచారం కోసం ఇండియా ఇయర్‌బుక్‌ను క్షుణ్ణంగా చదవాలి.
సాధారణంగా ఇప్పటివరకూ భారతదేశ శీతోష్ణస్థితి... అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన అంశాలపై అత్యధిక/ అత్యల్ప వర్షపాతం?- లేదా ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ఏవి?- అనే ప్రశ్నలుండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నల స్థాయి పెరిగింది. వివిధ రాష్ట్రాల, వార్షిక గరిష్ఠ, కనిష్ఠ వ్యత్యాసం, సగటు ఉష్ణోగ్రతలపై ప్రశ్నలు వస్తున్నాయని గమనించండి.
గోడలకు చిత్రపటాలు
వివిధ రాష్ట్రాల, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల భౌగోళిక ఆకృతులపై ప్రశ్నలు వచ్చాయి. అంటే... రాష్ట్ర చిత్రపటాన్ని కానీ, జిల్లా చిత్రపటాన్ని కానీ ఇచ్చి వాటిని గుర్తించమని ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ముందుగా భారతదేశ చిత్రపటాన్ని ముందుంచుకుని వివిధ రాష్ట్రాల ఆకృతులనూ, వాటి సరిహద్దులనూ గమనించాల్సివుంటుంది. అలాగే మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆకృతులనూ, వాటి సరిహద్దులనూ కూడా జాగ్రత్తగా గమనించాలి.
మీ స్టడీరూంలో గోడలకు వివిధ చిత్రపటాలను తగిలించి, వీలైనప్పుడల్లా వాటిని పరిశీలిస్తూనే ఉంటే తప్ప ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించలేరు.
ఇంకా ఇతర అంశాలు... పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, నేలలు, అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జీవావరణ కేంద్రాలు, వ్యవసాయ పంటలు, పశుపోషణ, ఖనిజ వనరులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, రవాణా, సమాచార సాధనాలు మొదలైనవాటిని అధ్యయనం చేసేటపుడు ప్రతి అంశాన్నీ తాజాసమాచారంతో జోడించాలి.
* ఆంధ్రప్రదేశ్‌లో కేశోరాం సిమెంటు పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది?
* భారతదేశంలో మాంగనీసును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రమేది?
* (ఈ కిందివాటిలో) ఏ నదీ హరివాణం అధిక భూగర్భ జలాల సంభావ్యాన్ని/ శక్మతను కలిగివుంది?
* ఆంధ్రప్రదేశ్‌లో సీసపు నిల్వలు అధికంగా ఉన్న జిల్లా ఏది?
ఇలాంటివి గతంలో మూసగా అడిగిన ప్రశ్నలకు భిన్నంగా ఉన్నాయని గ్రహించి, ప్రిపరేషన్‌ని దీనికి అనుగుణంగా మార్చుకోవాల్సివుంటుంది.
భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలకు సంబంధించి ముందుగా పేర్కొన్నట్టు గ్రూప్‌-2 అభ్యర్థులకు మూడో పేపర్లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ వనరులు, జనాభా శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మొదటి పేపర్లోని భౌగోళికాంశాలకే పరిమితం కాకుండా మూడో పేపర్‌ కోసం విస్తృతంగా చదవాలి.
ముఖ్యంగా త్వరలో 15వ జనగణన జరగనుంది. కాబట్టి మీ పరీక్షలో 14వ జనగణనపై పూర్తి పట్టు సాధిస్తే 15వ జనగణనపై, ఈ రెంటిమధ్య గల వ్యత్యాసాలపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించగలుగుతారు.
గ్రూప్‌-1 మెయిన్స్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ రాసే అభ్యర్థులు కూడా పైన సూచించిన భౌగోళికాంశాలపై పట్టు సాధిస్తే... వ్యాసరచనలో అవసరమైన చోటు ఉదాహరించటానికి చక్కగా తోడ్పడుతుంది. మెయిన్స్‌ నాలుగో పేపర్‌ మొదటి విభాగంలోని ఇంధన వనరులు... ముఖ్యంగా పునః స్థాపిత ఇంధన వనరులు- అణుశక్తి మొదలైనవి ముఖ్యం. భూగోళశాస్త్ర కోణంలో వాటి ప్రాధాన్యాన్నీ, లభ్యతనూ, పరిణామాలనూ అధ్యయనం చేయాల్సివుంటుంది. వీటి నుంచి వివిధ కోణాల్లో వచ్చే ప్రశ్నలకు 150 పదాల్లో సమగ్ర సమాధానాలను రాయగలిగే రీతిలో నోట్సును సిద్ధం చేసుకోవాల్సివుంటుంది.


తాజా సమాచారమే కీలకం!
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, పంటల విధానం మొదలైనవి కూడా భూగోళశాస్త్రానికి సంబంధించినవే. కానీ వీటికోసం పాఠ్యపుస్తకాల్లో లభించే సమాచారంతో పాటు తాజా సమాచారాన్ని కూడా వార్తాపత్రికల నుంచి సేకరించాలి. తీవ్ర విమర్శలను పక్కకుపెట్టి నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రమే గ్రహించి,నోట్సు తయారుచేసుకోవాలి. గ్రూప్‌-1 మెయిన్స్‌ నాలుగో పేపర్‌ మూడో విభాగంలోని దాదాపు అన్ని అంశాలూ కొంతవరకూ భూగోళశాస్త్ర అధ్యయనంతో ముడిపడివున్నాయి. కాబట్టి వీటిని భౌగోళిక భావనల ఆధారంగా అర్థం చేసుకుని, శాస్త్రీయంగా వాటిని వివరించాల్సివుంటుంది. ఈ అంశాలన్నిటినీ కవర్‌ చేస్తూ వివిధ పత్రికల్లో వచ్చే ప్రత్యేక వ్యాసాలను సేకరించి, మీ పరీక్షకు అనుగుణంగా మార్చుకోవాలి. వాటితో టాపిక్‌కు సంబంధించిన మౌలిక భావాలను జతచేసి నోట్సు సిద్ధం చేసుకోవాలి. దీన్ని శ్రద్ధగా చదివితే గ్రూప్‌-1 మెయిన్స్‌లో సమగ్ర సమాధానాలు రాయగలుగుతారు.
నిజానికి భూగోళశాస్త్రాన్ని అన్ని శాస్త్రాలకూ మాతృక వంటిదని అభివర్ణిస్తారు. అందుకే గ్రూప్‌-1 అభ్యర్థులు మొదట దీనిపై దృష్టి పెడితే పేపర్‌-1తో పాటు పేపర్‌-3లో కొంతవరకూ, పేపర్‌-4లో చాలావరకూ ప్రశ్నలకు సమగ్ర జవాబులు రాయటం సాధ్యమవుతుంది.

కోచింగ్‌ లేకుండానే ... గ్రూప్స్‌లో గెలుపు!

కోచింగ్‌ లేకుండానే ... గ్రూప్స్‌లో గెలుపు!
* గ్రామీణ నేపథ్యం... అర్హత డిగ్రీ. గ్రూప్స్‌ కోచింగ్‌ తీసుకోలేని పరిస్థితి. ఏ మెలకువలు పాటిస్తే ఇలాంటి వాళ్ళు కూడా విజయం సాధించగలుగుతారు? * కోచింగ్‌ అనేది శ్రమను తగ్గిస్తుంది. సమయాన్ని పొదుపు చేస్తుంది. కోచింగ్‌ వల్లే ఉద్యోగం వస్తుందనేది అపోహ మాత్రమే. కోచింగ్‌తో పాటు కృషి, సమయ నిర్వహణ, మెటీరియల్‌ సేకరణ, ప్రశ్నల సరళిని పరిశీలించటం మొదలైనవి అభ్యర్థుల విజయావకాశాలకు తోడ్పడతాయి.
అందువల్ల గ్రామీణ నేపథ్యమున్నవారు ముందు సిలబస్‌ని అధ్యయనం చేయాలి. సిలబస్‌కు సంబంధించి ప్రామాణిక తెలుగు అకాడమీ, పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలు, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పుస్తకాలను చదవాలి. సమీపంలోని డిగ్రీ కాలేజీ లెక్చరర్లను కలిసి, ఆయా పాఠ్యాంశాల్లో సందేహాలను తీర్చుకోవాలి; సలహాలు తీసుకోవాలి. నమూనా ప్రశ్నలకు సమాధానాలు రాసి, వారికి చూపించాలి. తప్పొప్పులు తెలుసుకోవాలి. గ్రూప్స్‌లో విజయాలు సాధించి ఉద్యోగాలు చేస్తున్న అధికారులను సంప్రదించటం ప్రేరణనూ, మార్గదర్శకత్వాన్నీ అందిస్తుంది. నిజాయితీగా కృషి చేయాలి.
ఇటీవల ఆర్డీవోగా ఎంపికైన నారాయణరెడ్డి ఒకటి రెండు పేపర్లలో తప్ప మిగతా ప్రిపరేషన్‌ని ఇదే రీతిలో కొనసాగించారు! దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.
* కొత్త సిలబస్‌లో జరిగిన గ్రూప్‌-| పరీక్షల్లో మాథ్స్‌, సైన్స్‌ అభ్యర్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని అంటున్నారు. నిజమేనా? ఎం.ఎ. తెలుగు చేసినవారికి విజయావకాశాలు ఎలా ఉంటాయి?
* కొత్త సిలబస్‌లో జరిగిన గ్రూప్‌-I, II పరీక్షలు సైన్స్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టులు అని కాకుండా కష్టపడిన అభ్యర్థులనే ఎంపిక చేశాయి. అందుకే మొదటి పది మందిలో దాదాపు 50 శాతం మంది ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ నేపథ్యమున్నవారు ఉన్నారు.
ఆర్ట్స్‌ అభ్యర్థులు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని ప్రాథమికాంశాలు సరిగా అర్థం చేసుకోకపోవటం, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ పేపర్లో ప్రాక్టీస్‌ చేయకపోవటం మొదలైన కారణాల వల్ల మొత్తమ్మీద వెనకబడివుండొచ్చు. సరైనరీతిలో కృషి చేస్తే వీరైనా మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు.
బీటెక్‌ చదివి, ఇటీవల డీఎస్‌పీగా ఎంపికైన అభ్యర్థి ఎకానమీలో 118 మార్కులు స్కోర్‌ చేశారు. తీరా అదే అభ్యర్థికి పాలిటీ, హిస్టరీ కలయికైన పేపర్‌II లో 54 మార్కులు వచ్చాయి. అందువల్ల ఆయా సబ్జెక్టుల్లో మార్కులనేవి అభ్యర్థి అవగాహన సామర్థ్యంపై ఆధారపడివుంటుంది. ఎమ్మే పొలిటికల్‌ సైన్స్‌ అభ్యర్థి పేపర్‌-V లో 124 మార్కులు స్కోర్‌ చేశారు.
అందువల్ల పీజీ, గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులు ఏవైనా కానివ్వండి- సమస్య ఏమీ లేదు. సిలబస్‌ని ప్రశ్నలవారీగా కాకుండా కాన్సెప్ట్‌ ఆధారంగా అధ్యయనం చేస్తే... మంచి ఫలితం తథ్యం!
* గ్రూప్‌-I, II లకు ఉపయోగపడే మ్యాగజీన్లూ, పత్రికలూ?
* ఇంగ్లిష్‌ మీడియం: సివిల్‌ సర్వీసెస్‌ క్రానికల్‌, యోజన, కురుక్షేత్ర, ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్‌, సైన్స్‌ రిపోర్టర్‌, ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ.
తెలుగు మీడియం: ఆంధ్రప్రదేశ్‌, యోజన, ఇండియా టుడే, వీక్షణం, ఏపీ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌, ఏపీ ఎకనమిక్‌ సర్వే, ఇంకా... ప్రముఖ దినపత్రికలు.
- కొడాలి భవానీ శంకర్‌

మార్కుల్లో ముందు నిలిపే 'తెలుగు'

మార్కుల్లో ముందు నిలిపే 'తెలుగు'
గ్రూప్స్‌ పరీక్షల్లో ఇతరులకంటే ఎక్కువ మార్కులు సంపాదించాలంటే... తెలుగు భాషాసాహిత్యాలపై కూడా దృష్టి సారించాలి. 'గ్రూప్‌-1లో ఒక ప్రశ్న సాహిత్యంపై తప్పనిసరి; గ్రూప్‌-2లో భాషా సాహిత్యాలపై 20 నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందం'టున్నారు సాహితీవేత్త, పోటీ పరీక్షల నిపుణుడు డా. ద్వా.నా. శాస్త్రి.
గ్రూప్‌-1, గ్రూప్‌-2 సిలబస్‌లలో ఆప్షనల్స్‌ లేవు గానీ వాటికి సంబంధించిన అంశాలున్నాయి. ముఖ్యంగా చాలామంది తెలుగు సాహిత్యానికి చెందినవి లేవనుకొంటారు. అది సరికాదు. గ్రూప్‌-1లో పేపర్‌ 2లో 'భారతదేశ చరిత్ర - సాంస్కృతిక వారసత్వం', 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర' అనే విభాగాలున్నాయి. మొదటిదానిలో మతపరమైన ఉద్యమాలు, భక్తి ఉద్యమాల స్వభావం, దేశభాషల వృద్ధి, సాహిత్యం... అన్నప్పుడు మన రాష్ట్రంలోని మతపరమైన ఉద్యమాల్ని, భక్తి ఉద్యమాల్ని సంక్షిప్తంగా రాయవలసి ఉంటుంది. పాల్కురికి సోమన శైవ మతపరమైన ఉద్యమాన్ని, వీరశైవ మత ఉద్యమాన్ని చేపట్టాడు. పోతన, అన్నమయ్యలు పరోక్షంగా వైష్ణవ మత ప్రచారానికి ప్రాధాన్యమిచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా వైష్ణవానికి ప్రాముఖ్యమిచ్చారు. 'విజయనగర సామ్రాజ్యం నాటి సాహిత్యం' అనే అంశంలో అష్టదిగ్గజ కవుల గురించీ, రాయల వారి కావ్యాల గురించీ వివరించవలసి ఉంటుంది. జాతీయవాదంలో, జాతీయోద్యమంలో కవుల పాత్ర కూడా పరామర్శిస్తే అదనపు సమాచారం అవుతుంది.
ఉద్యమాల్లో తెలుగువారు
దళిత ఉద్యమంలో, బ్రాహ్మణేతర ఉద్యమంలో తెలుగు వారి పాత్ర ఉంది. దళిత ఉద్యమంలో కుసుమ ధర్మన్న, జాషువా వంటి వారిని పరిచయం చేయాలి. బ్రాహ్మణేతర ఉద్యమం తమిళనాడులో నాయకర్‌ ప్రారంభించినట్టుగా మనరాష్ట్రంలో త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రారంభించారు. అనేక రచనలూ చేశారు.
'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర'లో తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన అంశాలు చాలానే ఉన్నాయి. శాతవాహనుల కాలంలో తెలుగు సాహిత్యం లేదు. కానీ హాలుని గాథాసప్తశతిలో తెలుగు భాషా పదాలున్నాయి. తూర్పు చాళుక్యులు- ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు- ఆస్థాన కవి నన్నయ తెలుగు భాషా సాహిత్యాల సేవపై వివరంగా తెలుసుకోవాలి. కుతుబ్‌షాహీలు కూడా తెలుగును ఆదరించారు. తెలుగు కవుల్ని పోషించి, కావ్యాలను అంకితాలుగా తీసుకున్నారు.
కందుకూరి వీరేశలింగం, జాషువా, భీమన్న, శ్రీశ్రీల గురించి అవగాహన ఉండాలి. వీరంతా సంఘ సంస్కర్తలే. ఆంధ్రాలో జాతీయవాద ఉద్యమంలో కవుల, రచయితల పాత్ర మరువరాదు. 'ఆంధ్ర సారస్వత పరిషత్‌' చేసిన భాషా సాహిత్యాల సేవ అసామాన్యం. తెలుగు బోధన, సభల నిర్వహణ, పుస్తక ప్రచురణ అనే విధంగా ఈ సంస్థను వివరించవలసి ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో తెలుగు కవుల పాత్ర తక్కువేమీ కాదు.
జనరల్‌ స్టడీస్‌లోనూ...
వీటితో పాటూ గ్రూప్స్‌ జనరల్‌స్టడీస్‌ పేపర్‌లో కూడా తెలుగు భాషా సాహిత్యాలకు, రాజులకు, కవులకు సంబంధించిన ప్రశ్నలు కనీసం 10 తప్పకుండా ఉంటాయి. అందువల్ల ఇతరుల కంటే ఎక్కువ మార్కులు సంపాదించాలంటే తెలుగు భాషా సాహిత్యాలపై కూడా దృష్టి నిలపడం అవసరం.
గ్రూప్‌-1లో ప్రశ్నల స్వరూపం...
* నన్నయ తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవ
* విజయనగర రాజుల కాలంలో సాహిత్య పోషణ
* నవాబుల సాహిత్య పోషణ
* తెలుగునాట ఉద్యమాలు- కవుల పాత్ర
* సంఘ సంస్కరణకు తోడ్పడిన తెలుగు కవులు, రచయితలు
* తెలంగాణా సాయుధ పోరాటం - సాహిత్యం
గ్రూప్‌-2లో... ఇలా సన్నద్ధం
పేపర్‌ 2లో 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక చరిత్ర' అంశం ఉంది. దీనికి 150 మార్కులున్నాయి. మొత్తం ఐదు అధ్యాయాలు. ఇందులో కొంత చరిత్ర, కొంత సంస్కృతితో పాటు సాహిత్యం కూడా ఉంది. చాలామంది ఈ విషయం గమనించరు. వివిధ రాజులు, వారి సాహిత్య సేవ, వారి ఆస్థాన కవులు, కృతిని తీసుకున్న రాజులు మొదలైనవాటిపై దృష్టి సారించాలి. వీటితో పాటు ఆధునికంగా ఉద్యమాల పరిచయం కూడా అవసరం. జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం, తెలంగాణా సాయుధ పోరాట ఉద్యమాలు చాలా ముఖ్యం.
తెలుగు కవుల్లో కందుకూరి వీరేశలింగం, జాషువా, బోయి భీమన్న, శ్రీశ్రీలు ముఖ్యం. 'ఇతర కవులు' అని కూడా సిలబస్‌లో ఉంది. అంటే త్రిపురనేని రామస్వామి, నార్ల వెంకటేశ్వరరావు, కుసుమ ధర్మన్న కవి వంటి వారిని కూడా తెలుసుకోవాలి. ఆంధ్ర మహాసభలో పాల్గొన్న సాహితీ ప్రముఖులూ ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ తెలంగాణాలో తెలుగు భాషా సాహిత్యాల కోసం స్థాపితమైన సంస్థ. దీనికి ఘన చరిత్ర ఉంది.
శాతవాహనుల కాలం నాటికి తెలుగు సాహిత్య వికాసం లేదనే చెప్పాలి. అయితే తెలుగు జాతి ఉంది. భాష ఉంది. ముఖ్యంగా హాలుడు సంకలించిన గాథా సప్తశతిలో తెలుగు వారి గ్రామీణ జీవితం ఉంది. అత్త, పొట్ట, పాడి వంటి తెలుగు పదాలున్నాయి. క్రీ.శ. ఒకటో శతాబ్దం నాటి ప్రాకృత గ్రంథంలో తెలుగు పదాలున్నాయంటే అప్పటికే ఆ భాష ప్రచురంగా ఉందని తెలుస్తోంది.
చాళుక్య యుగంలోనే తెలుగు భాషా సాహిత్యాల వికాసం కనబడుతుంది. ఈ యుగంలోనే తెలుగు శిలా శాసనాలు వేయించబడ్డాయి. నన్నయ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి కదా! కాబట్టి నన్నయ నుంచి మొల్ల వరకు గల ప్రముఖ కవుల, కవయిత్రుల గురించి తెలుసుకోవాలి. ఎవరు వారు? పాల్కురికి సోమన, నన్నెచోడుడు, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, అన్నమయ్య, పోతన, మొల్ల... అన్నమాట. వారి పరిచయం తెలిస్తే చాలు. సిలబస్‌లో ఉన్నవారినే కాకుండా వేమన, శ్రీకృష్ణ దేవరాయలు, గురజాడలను గురించి కూడా తెలుసుకుంటే మరింత ప్రయోజనకరం.
పేపర్‌ 2లో సాహిత్యానికి సంబంధించి 10 ప్రశ్నల నుంచి 15 వరకు రావచ్చు. ఎందుకంటే చరిత్రకీ, సంస్కృతికీ, సాహిత్యానికీ సంబంధం ఉంది కాబట్టి.
నమూనా ప్రశ్నలు పరిశీలించండి
* గుణాఢ్యుడు రచించినది
1. గాథా సప్తశతి 2. బృహత్కథ 3. నాట్యశాస్త్రం 4. బృహత్‌ సంహిత(2) * నాగార్జునుని రచనల్లో ముఖ్యమైనది
1. సుహృల్లేఖ 2. దివ్యలేఖ 3. ప్రజ్ఞాపారమితి 4. ఏదీకాదు (1)
* ఆంధ్రుల రసికతను తెలిపిన తొలి గ్రంథం
1. ఆంధ్ర శబ్ద చింతామణి 2. క్రీడాభిరామం 3. గాథా సప్తశతి 4. బాలభారతం (3)
* తిక్కన బిరుదు
1. కవి బ్రహ్మ 2. ఉభయకవి మిత్ర 3. రెండూ 4. రెండూ కాదు (3)
* అన్నమయ్య బిరుదు
1. కవి సార్వభౌమ 2. ప్రబంధ పరమేశ్వర 3. కవిరత్న 4. పద కవితా పితామహ (4)
* ఆంధ్ర మహాసభతో సంబంధం గల సాహితీవేత్త ఎవరు?
1. సురవరం ప్రతాపరెడ్డి 2. రావి నారాయణరెడ్డి 3. ప్రకాశం పంతులు 4. అందరూ (1)
* ఆత్మగౌరవ పోరాటాన్ని తొలుత ప్రారంభించినది
1. జాషువా 2. జ్యోతిబాపూలే 3. కత్తి పద్మారావు 4. బోయి భీమన్న (2)
* 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అన్న కవి?
1. కాళోజీ 2. సి. నారాయణరెడ్డి 3. దాశరథి 4. గద్దర్‌ (3)
* ఆంధ్ర సారసత్వ పరిషత్‌ ప్రస్తుత అధ్యక్షుడు
1. ఎ.బి.కె. ప్రసాద్‌ 2. సి. నారాయణరెడ్డి 3. దేవులపల్లి రామానుజరావు 4. ఎన్‌. గోపి (2)
* తానీషా కాలం నాటి తెలుగు వాగ్గేయకారుడు
1. అన్నమయ్య 2. క్షేత్రయ్య 3. వీరబ్రహ్మ 4. రామదాసు (4)

మార్కులు తెచ్చే 'మానసిక సామర్థ్యం'

మార్కులు తెచ్చే 'మానసిక సామర్థ్యం'
జె.వి.ఎస్‌. రావు
ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2 వంటి పోటీ పరీక్షల్లోని జనరల్‌స్టడీస్‌లో 'మెంటల్‌ ఎబిలిటీ' (మానసిక సామర్థ్యం) ప్రధానపాత్ర వహిస్తుంది. దీన్నే జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అని కూడా అంటాము. ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు 25 నుంచి 30 వరకు ఉంటాయి. వీటికెలా సిద్ధం కావాలో తెలుసుకుందాం!
దైనా ఒక విషయాన్ని వేగంగా అర్థం చేసుకుని, విశ్లేషణాత్మకంగా సమాచారాన్ని పరిశీలించి తగిన నిర్ణయానికి రావడాన్నే మెంటల్‌ ఎబిలిటీ అంటారు. ఈ విభాగం నుంచి ప్రశ్నలు అడగడంలో ముఖ్య ఉద్దేశం పరిపాలనా విభాగాలలోని ఉన్నతస్థాయి ఉద్యోగాలకు జరిగే ఎంపికలో, పరీక్షలలో అభ్యర్థుల మానసిక సామర్థ్యాన్ని అంచనా వేయడం. అంటే విషయ సమీక్షా పరిజ్ఞానం, మానసిక ఆలోచనాశక్తి, ఊహాశక్తులను పరీక్షించడం. ముఖ్యంగా నాన్‌ మేథమేటిక్స్‌ అభ్యర్థులు మెంటల్‌ ఎబిలిటీ అనగానే వెనుకంజ వేస్తారు. సిలబస్‌పై పూర్తి అవగాహన లేకపోవటం; ప్రిపరేషన్‌ విధానం తెలియకపోవడమే దీనికి కారణాలు. అందుకేం చేయాలి? సిలబస్‌పై అవగాహన పెంచుకుని, గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. అభ్యాసాలను సాధన చేయాలి. ఇలా మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించాలి. అప్పుడు ఈ విభాగంలోని ప్రశ్నలను సులభంగా, చురుకుగా సాధించవచ్చు.
సిలబస్‌- ప్రిపరేషన్‌ తీరు
మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. 1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 2. మేథమేటికల్‌ ఎబిలిటీ
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ను వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ అని రెండు భాగాలుగా ఉంటుంది.
ప్రధానంగా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రశ్నల్లో ఎక్కువగా వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి 15 నుంచి 20 వరకు వస్తున్నాయి. నాన్‌-వెర్బల్‌, మేథమెటికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు చాలా తక్కువే. నాన్‌-వెర్బల్‌ నుంచి 2, 3 ప్రశ్నలూ, అరిథ్‌మెటికల్‌ విభాగం నుంచి 2, 3 ప్రశ్నలూ ఇస్తుంటారు.
వెర్బల్‌, నాన్‌వెర్బల్‌కి సంబంధించి ఏదో ఒక ప్రామాణిక మెటీరియల్‌ను తీసుకుని ముందుగా సిద్ధం కావడం మేలు. దీనివల్ల అనవసర ఆందోళనకు దూరమై, వాటిపై పూర్తి అవగాహన వస్తుంది.
మేథమేటికల్‌ విభాగంలో ఆరు నుంచి పదో తరగతుల సిలబస్‌ స్థాయి ఉంటుంది. దీనికిగాను అభ్యర్థులు ఆయా తరగతుల గణితాంశాలను సాధన చెయ్యాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరాసరి, శాతాలు, నిష్పత్తులు, లాభనష్టాలు, కాలము- పని, కాలము-దూరం, సాంఖ్యక శాస్త్రం వంటి అంశాలను సాధన చెయ్యాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌ పుస్తకాలలోని ప్రాథమిక అంశాలను అవగాహన చేసుకుంటే ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత అంశాలపై ప్రశ్నలను చాలా సులువుగా సాధించవచ్చు.
మారుతున్న ప్రశ్నల శైలి
ఈ మధ్యకాలంలో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రతరం అవుతుండటంతో ప్రశ్నల శైలిలో కొంతమార్పు చోటు చేసుకుంటోంది. అందుకే కొత్తగా ఇన్ఫరెన్సెస్‌, స్టేట్‌మెంట్స్‌, కన్‌క్లూజన్స్‌, స్టేట్‌మెంట్స్‌ ఎసెంప్షన్‌ను సిలబస్‌లో చేర్చి, వీటిపై ప్రశ్నలు అధికంగా ఇస్తున్నారు. ప్రశ్నల శైలి మారుతుండటంతో ప్రతి అంశానికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి.
విభాగాలు - వివరాలు
వెర్బల్‌ రీజనింగ్‌ : దీనిలో అంశాలు: 1. కోడింగ్‌ డీకోడింగ్‌ 2. భిన్న పరీక్ష 3. సిరీస్‌ 4. అనాలజీ 5. క్లాసిఫికేషన్‌ 6. రక్త సంబంధాలు 7. డైరెక్షన్‌ టెస్ట్‌ 8. నంబర్‌ పజిల్‌ టెస్టు 9. వెన్‌ డయాగ్రమ్స్‌ 10. ప్రాబ్లమ్స్‌ ఆన్‌ డైస్‌ 11. క్యాలెండర్‌, గడియారం 12. సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్‌ అండ్‌ గ్రూప్‌ రీజనింగ్‌ 13. డాటా సఫిషియన్సీ 14. స్టేట్‌మెంట్స్‌ అసెంప్షన్‌, కన్‌క్లూజన్స్‌ 15. ఇన్ఫరెన్సెస్‌
* ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలది అగ్రస్థానం. డేటా, స్టాటిస్టిక్స్‌ ఆధారంగా కూడా ప్రశ్నలు రావొచ్చు. ఇచ్చిన డేటాలో అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాన్ని కనుక్కోవాలి.
* ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే స్వీయ విశ్లేషణా శక్తి, ప్రతి అంశాన్నీ సునిశితంగా పరిశీలించే నైపుణ్యం అలవర్చుకోవాలి.
* ఒక సమస్యను చదువుతున్నప్పుడే అందులోని ముఖ్యాంశాలను గుర్తించే పరిజ్ఞానం అవసరం.
* నిరంతరమైన సాధన చాలా అవసరం.
నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌
నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌లో ప్రశ్నలను బొమ్మలు, పటాల రూపంలో ఇస్తుంటారు. కొన్ని బొమ్మలు, గుర్తులు ఒక శ్రేణి రూపంలో ఇచ్చి దాని తర్వాత చిత్రాలను కనుగొనమని అడుగుతారు. సాధారణంగా ప్రశ్నలు ఈ కింది విభాగాల నుంచి ఉంటాయి.
*comepletion of series
* problems related to figure rotation
* Find the odd one out
ఈ విభాగం కోసం అభ్యర్థులు ప్రామాణిక మెటీరియల్‌ను నిరంతరం సాధన చేయడం ద్వారా పట్టు సాధించవచ్చు.
మేథమేటికల్‌ ఎబిలిటీ
ఇది ప్రాథమికమైన గణిత సామర్థ్యాలను పరీక్షించే విభాగం. పదో తరగతి స్థాయి సిలబస్‌తో ఈ అంశాలపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.
దీనిలోని అంశాలు: 1. ప్రాథమిక సంఖ్యావాదం 2. నంబర్‌ సిస్టమ్‌ 3. సగటు 4. నిష్పత్తులు 5. శాతాలు 6. భాగస్వామ్యం 7. కాలము-పని 8. కాలము-దూరం 9. బారువడ్డీ 10. చక్రవడ్డీ 11. ప్రస్తారాలు-సంయోగాలు 12. సంభావ్యత 13. క్షేత్రమితి 14. సాంఖ్యక శాస్త్రం
.
ఈ సూచనలు గమనించండి
* అభ్యర్థులు వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ నైపుణ్యాలను తక్కువ సమయంలో అనువర్తించేలా సన్నద్ధం కావాలి.
* పరీక్షకు ముందు కొన్ని రోజుల పాటు క్రమంగా మాక్‌టెస్టులు రాయాలి. స్వీయ విశ్లేషణ చేసుకొని, బలహీనంగా ఉన్న అంశాలపై బాగా శ్రద్ధ వహించాలి.
* వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యే మెంటల్‌ ఎబిటిలీ ప్రశ్నలను సాధన చేయాలి.
* కష్టంగా అన్పించే ప్రశ్నలపై అధిక సమయం వెచ్చించకుండా అభ్యర్థులు జాగ్రత్త వహించాలి. సంప్రదించాల్సిన పుస్తకాలు:
* రీజనింగ్‌: ఆర్‌. ఎస్‌. అగర్వాల్‌
* అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ: ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌, ఆరు నుంచి పదో తరగతి గణిత పాఠ్య పుస్తకాలు.

గ్రూప్‌-1కు గురి పెట్టేదెలా?



గ్రూప్‌-1కు గురి పెట్టేదెలా?
కొడాలి భవానీ శంకర్‌

సంవత్సరాల తరబడి చదివితేనే గానీ గ్రూప్‌-1 మెయిన్స్‌లో విజయం దక్కదనే విశ్వాసం చాలామంది అభ్యర్థుల్లో ఉంది. ఇది కేవలం అపోహే! కాలాన్ని ప్రణాళికాయుతంగా వినియోగించుకోవటమే విజయ రహస్యం. ఇప్పుడున్న సమయం 4 - 5 నెలలు అనుకుంటే... పోటీ పడుతున్న ప్రతి అభ్యర్థీ వ్యూహాత్మకంగా ఎలా సంసిద్ధమవ్వాలో తెలుసుకుందాం!
ప్రిలిమినరీ ఫలితాల్లో గ్రూప్‌-1ని సీరియస్‌గా తీసుకోని చాలామంది తాజా అభ్యర్థులు ఎంపికయ్యారు. దీంతో ఫలితాలకూ మెయిన్స్‌కూ మధ్య తగినంత సమయం దొరకటంతో మెయిన్స్‌ రాసేందుకు సమాయత్తమవుతున్నారు.

వీరు కాలాన్ని ఇలా వినియోగించుకోవచ్చు.
మొదటి రెండు నెలల్లో...
* ఒక ప్రామాణిక మెటీరియల్‌కి పరిమితం కావాలి.
* అధ్యాయాలవారీగా ప్రామాణిక మెటీరియల్‌ను నిర్థారించుకుని చదవాలి.
* వీలైతే రైటింగ్‌ ప్రాక్టీసుకు సమయం కేటాయించాలి.
* ప్రతి విషయాన్నీ ప్రశ్నలవారీగా కాకుండా 'విషయాన్ని' అర్థం చేసుకుంటూ చదవాలి.
* 'చాయిస్‌'గా వదిలేయదగ్గ అంశాలను ప్రిపరేషన్‌ జాబితా నుంచి తొలగించాలి.
మూడో నెలలో...: మొదట చదివిన మెటీరియల్‌లో సంతృప్తి దొరకని పాఠ్యాంశాల్లో ఇతర మెటీరియల్‌ సమాచారం ద్వారా సంతృప్తిని పొందేందుకు ప్రయత్నించాలి.
* ప్రతి పాఠ్యాంశంలో గతంలో వచ్చిన ప్రశ్నలు, రాదగిన ప్రశ్నలు పరిశీలించుకోవాలి.
* ప్రశ్నల ఆధారంగా పాఠ్యాంశాలను మరోసారి చదవాలి.
నాలుగో నెలలో...: మొదటి మూడు నెలల్లో వచ్చిన అనుభవాల్ని బట్టి పాఠ్యాంశాల్లో బలంగా ఎక్కడున్నారో, బలహీనంగా ఎక్కడున్నారో నిర్ణయించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలపై దృష్టి బాగా నిలపాలి.
* పట్టు ఉన్న అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది.
* బలహీనంగా ఉన్నవాటిని మరొక్కసారి అధ్యయనం చేయాలి. బలహీనత ఎక్కడుందో కనిపెడితే సరిపోతుంది.
ఐదో నెలలో...: ఈ దశలో పునశ్చరణ (రివిజన్‌) పూర్తయిందని భావిస్తూ సబ్జెక్టులవారీగా వివిధ పాఠ్యాంశాల అనుసంధానాలపై దృష్టి నిలపాలి. సమగ్రదృష్టిని పెంచుకోవాలి.
* గతంలో 'పట్టు' ఉన్నవని వదిలిపెట్టిన అంశాలను స్థూలంగా మరొక్కసారి పరిశీలించాలి.
* నిర్దిష్ట సమయంలో ప్రశ్నలకు జవాబులు రాస్తూ భావ వ్యక్తీకరణ గమనించుకోవాలి.




ప్రిపరేషన్లో నిమగ్నమైన సీనియర్‌ అభ్యర్థులు
తంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి గ్రూప్‌-1 మెయిన్స్‌లో పోటీ ఉంది. శ్రద్ధగా రాసేవారు దాదాపు 3,000 మంది వరకూ ఉండే అవకాశముంది. అందువల్ల ప్రిపరేషన్లో ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేసినపుడే విజయం దగ్గరవుతుంది. * మన దగ్గర 'విషయం' ఎంతయినా ఉండొచ్చు; దాన్ని ఎగ్జామినర్‌ ఆశించినట్టుగా పరీక్షాపత్రంలో సక్రమంగా వ్యక్తీకరించినపుడే మార్కులు వస్తాయి. అదే ప్రెజెంటేషన్‌ నైపుణ్యం! దీన్ని మెరుగుపరుచుకోడానికి ఈ 4/5 నెలల కాలాన్ని వినియోగించుకోవాలి. ఇందుకోసం...
బృంద చర్చల్లో పాల్గొనండి: మీలాగా సిద్ధమౌతున్న ఇద్దరు ముగ్గురు అభ్యర్థులతో అంశాలవారీ చర్చల్లో పాల్గొనండి. వీటిలో నిజాయతీగా వ్యవహరించాలి. 'అవతలి వ్యక్తులు లబ్ధి పొందుతారేమో' అనే సంకుచిత ధోరణి విడనాడి మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయండి. అందువల్ల పరస్పర ప్రయోజనం పొందుతారు. వ్యక్తీకరించిన భావాల్లో సమంజసనీయం ఏవో, అర్థరహితమైనవి ఏవో గ్రహించటం ద్వారా ప్రెజెంటేషన్‌కు కావలసిన శక్తి సమకూరుతుంటుంది.
సమయ నిర్వహణ కీలకం
ప్రస్తుత మెయిన్స్‌లో సమయ నిర్వహణ ప్రధానమైన సవాలని అభ్యర్థులు గుర్తించాలి. 1 మార్కు నుంచి 10 మార్కుల వరకూ వివిధ రకాల వెయిటేజిలున్న ప్రశ్నలకు ఆస్కారముంది. సమాచారం ఎక్కువుందని అవసరానికి మించి రాస్తే ప్రయోజనం ఉండదు. మార్కులను బట్టి సమయం కేటాయించుకుని, దాన్ని పక్కాగా అమలుచేసే ప్రణాళికకు సిద్ధపడాలి. అందుకోసం ఇప్పటినుంచే నిర్దిష్ట సమయంలో సమాధానాలు రాసే పద్ధతిని అనుసరించాలి.
నమూనా సమాధానాల మూల్యాంకనం: ఆ సమాధానాలను మూల్యాంకనం చేయటం ద్వారా తప్పొప్పులు తెలుసుకునే అవకాశముంది. దీనికి సీనియర్‌ లెక్చరర్ల సహకారం తీసుకోవచ్చు. అయితే వీరిలో చాలామంది పోటీ పరీక్షల ధోరణికి భిన్నమైన 'అకడమిక్‌ ధోరణి'తో ఉండే ప్రమాదముంది. అందుకని ఇటీవల గ్రూప్స్‌ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల సహకారం పొందటం మెరుగు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులను కూడా సంప్రదించవచ్చు.
సివిల్స్‌ జీఎస్‌ ప్రశ్నలు: సీనియర్‌ అభ్యర్థులకు ప్రిపరేషన్‌ పూర్తయింది కాబట్టి సివిల్స్‌ జనరల్‌స్టడీస్‌ మెయిన్స్‌ ప్రశ్నపత్రాలను పరిశీలించటం ప్రయోజనకరం. ఆ తరహా ప్రశ్నలు వస్తే సమాధానాలు ఎలా రాయాలో నిర్ణయించుకుంటే సరైన దిశలో పయనించినట్టే.
విహంగ వీక్షణమూ ముఖ్యమే
ఎలాగూ ప్రిపరేషన్‌ ముగిసి పునశ్చరణ దశలో ఉన్నారు కాబట్టి సిలబస్‌ అంశాలకే పరిమితం కాకూడదు. సిలబస్‌తో ముడిపడిన వర్తమానాంశాలు, ఆయా సబ్జెక్టుల్లో నూతన ధోరణులు మొదలైనవాటిపై కూడా సమయం వెచ్చించండి. ఇలా సిలబస్‌ అంశాలకు అదనపు సమాచారం జోడించి మార్కులు కొల్లగొట్టవచ్చు.
పాఠ్యాంశాలపై, సబ్జెక్టులపై స్థూల అవగాహన పెంచుకునేందుకు కూడా ఇది అనువైన సమయం. అలా చేస్తే సమగ్ర అవగాహనతో కూడిన సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. నేరుగా ప్రశ్నలకే ప్రిపేరవకుండా ఇలా చేసే విహంగ వీక్షణం పరీక్షలో ఎంతో మేలు చేకూరుస్తుంది.

ఏపీ ఎకానమీపై పట్టు ఎలా?


                                 ఏపీ ఎకానమీపై పట్టు ఎలా?
                         కొడాలి భవానీ శంకర్‌

గ్రూప్‌-2 పరీక్షలో ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) పేపర్‌లో పార్ట్‌-1కి స్టడీ మెటీరియల్‌ బాగానే లభిస్తోంది. పార్ట్‌-2లోని అంశాల దగ్గరే సమస్య వస్తోంది. లభించిన మెటీరియల్‌లో కచ్చితత్వం లోపించటం మొదలైన సమస్యలున్నాయి. దీంతో ఈ మార్కులు అభ్యర్థి జయాపజయాలను నిర్ణయించే స్థితిలో ఉన్నాయి. ఎకానమీ అనగానే గణాంక సమాచారం అనే అభిప్రాయం వదిలిపెట్టాలి. భావనలపై (కాన్సెప్ట్‌) ఆధారపడిన సమాచారం చదవాలి.


రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల వృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థలు కూడా గ్రూప్‌-2 పరీక్ష కోణంలో ముఖ్యం. గత 10 సంవత్సరాల్లో ఏపీ పరిశ్రమల్లో వచ్చిన తీరుతెన్నులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
గ్రూప్‌-2 (పేపర్‌-3) ఎకానమీ పార్ట్‌-2లో ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, పరిణామాలు’ను సిలబస్‌గా నిర్దేశించారు. దీనిలో ఐదు యూనిట్లున్నాయి.
మొదటి యూనిట్‌:
దీనిలో జాతీయాదాయం, ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలు, స్థూల దేశీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం, మానవ వికాస సూచిలను సిలబస్‌ అంశాలుగా చేర్చారు. ఈ విషయాలన్నీ భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించినవే. పేపర్‌-3లోనే పార్ట్‌-1 ఐదో యూనిట్లోని ప్రాథమిక సమాచారంతో అనుసంధానం చేసుకొని, వీటిని చదవాలి. 2007-08 తాజా గణాంక సమాచారం పరిగణనలోకి తీసుకోవాలి. మానవ అభివృద్ధి సూచిక రూపకల్పనా ప్రమాణాలు కూడా ముఖ్యమే.

ఇదే యూనిట్లో ఆంధ్రప్రదేశ్‌ జి.ఎస్‌.డి.పి.పై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా దీనిలో వ్యవసాయరంగం పాత్ర, ఉపాధి కల్పనలో వ్యవసాయరంగం స్థితిగతులు మొదలైనవి కూడా పరిగణించాలి.
రెండో యూనిట్‌:
ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలో పరివ్యయాలు ప్రధానంగా సిలబస్‌లో ఉన్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాలు ఉండేవి కాబట్టి వాటికి సంబంధించిన గణాంక సమాచారం పాత అకాడమీ పుస్తకాల్లో దొరుకుతుంది. ప్రతి ప్రణాళికలోనూ పరివ్యయం ఎంత, వ్యయం ఎంత అనే కోణంలో అధ్యయనం జరగాలి. వివిధ ప్రణాళికల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరిగాయో గ్రహిస్తూ చదవాలి.

మొదటి మూడు ప్రణాళికల్లో ఆహార ధాన్యాలు, జల విద్యుత్తు, రవాణా రంగానికి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారో విశ్లేషిస్తూ చదవాలి. ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి, వివిధ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆకస్మిక ప్రాధాన్యం ఎందుకు పెంచిందీ గ్రహించాలి. తాజా 11వ ప్రణాళికాంశాలపైన కూడా దృష్టిపెట్టాలి. పదో ప్రణాళిక సమీక్ష అంశాలూ ముఖ్యమే. మొదటి విభాగంలోని ఒకటో యూనిట్‌లో ఉన్న భారత ప్రణాళికలతో అనుసంధానం చేసుకొని చదవటం వల్ల భారత్‌-ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికలమధ్య ఉన్న సంబంధాలు సమగ్రంగా అర్థమవుతాయి. ఈ సిలబస్‌లో గణాంక సమాచారంపై ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
మూడో యూనిట్‌:
దీనిలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి విస్తృతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అడవులు, సాగు నేల, నీటిపారుదల విస్తీర్ణం, పంటలు మొదలైన అంశాలను ఏపీ జాగ్రఫీతో అనుసంధానం చేసుకొని చదవటం తెలివైన పని. ఏ అడవులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ అటవీ ఉత్పత్తులు, వాటి వల్ల ఆర్థికవ్యవస్థపై ప్రభావం అనే కోణంలో అధ్యయనం చేయాలి. వివిధ రకాల పంటలు, ప్రాంత ఆధారిత అసమానతలకు ఎలా దారితీశాయనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల అధ్యయనం చేయటం అవసరం.

ఇదే యూనిట్లోని భూసంస్కరణలను పరిణామాత్మక కోణంలో చదవాలి. స్వాతంత్య్రానికి పూర్వం- భూమిశిస్తు విధానాలు, భూసంస్కరణ యత్నాలు; స్వాతంత్య్రానంతరం భూసంస్కరణలు అంటూ తులనాత్మక అధ్యయనం చేయటం అవసరం.
భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ భూకమతాల పరిమాణం, విస్తృతి అనే అంశాలపై దృష్టి పెట్టాలి. భూదాన ఉద్యమం నుంచి ఇందిరప్రభ వరకూ భూపంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా ప్రధానమే. కోనేరు రంగారావు కమిటీ నేపథ్యంలో భూసంస్కరణల్లోని వివిధ అంశాలు ముఖ్యమైనవి. పంటల విధానం కింద- ఖరీఫ్‌, రబీ పంటలు, ఉత్పత్తి, ఉత్పాదకత అనే అంశాలపై దృష్టి నిలపటం మంచిది. వ్యవసాయ రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష మద్దతులపై సమాచారం అవసరమే.
నాలుగో యూనిట్‌:
దీనిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగం, సహకార రంగంపై సిలబస్‌ ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల పరిణామం, భారీ పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో, రంగాల్లో ఉన్నాయని పరీక్ష కోణంలో అడిగే అవకాశం ఉంది. చిన్నతరహా పరిశ్రమలు- విస్తరణ, ఉత్పత్తి, ఉపాధికల్పన అనే కోణంలో అత్యంత ప్రధాన అంశం. రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల వృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థలు కూడా గ్రూప్‌-2 పరీక్ష కోణంలో ముఖ్యం. గత 10 సంవత్సరాల్లో ఏపీ పరిశ్రమల్లో వచ్చిన తీరుతెన్నులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పారిశ్రామిక విధానం 2005, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్‌ల) ఏర్పాటు, ఆం.ప్ర. ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యుత్‌ స్థితిగతులు మొదలైనవి ప్రధానమైనవి.

ఇదే యూనిట్లోని సహకార రంగంపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. సహకార రంగం ఆంధ్రప్రదేశ్‌లో ఎలా పరిణమించిందనేదీ, గత 50 సంవత్సరాల్లో సహకార రంగం మైలురాళ్ళుగా పేర్కొనే నిర్ణయాలపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఆం.ప్ర. సహకార సంఘాల నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మార్పులు, వైకుంఠలాల్‌ మెహతా కమిటీ సూచనలు, వైద్యనాథన్‌ కమిటీ సిఫార్సులు మొదలైన అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. చక్కెర పరిశ్రమ, పాల ఉత్పత్తి, గిరిజనాభివృద్ధి మొదలైన రంగాల్లో సహకార సంఘాలు ఎక్కడెక్కడ స్థాపితమయ్యాయో వాటి వివరాలు పరీక్ష కోణంలో ప్రాధాన్యమున్నవి.
ఐదో యూనిట్‌:
దీనిలో కూడా వివిధ అంశాల్లో గణాంక, గణాంకేతర సమాచారం కీలకం. ఇటీవల ‘కనీస మద్దతు ధర’ సరైన రీతిలో లేదని రైతులు ఉద్యమాలు చేసిన నేపథ్యంలో కనీస మద్దతు ధర, జారీ ధర, సేకరణ ధర, మార్కెట్‌ధర మొదలైన అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. ధరల నిర్ణయీకరణ ప్రమాణాలు, ధరల నిర్ణయీకరణలో వివిధ ఏజెన్సీల పాత్ర మొదలైనవాటిపై పట్టు బిగించాలి. తాజా కనీస మద్దతు ధరలు పరీక్ష కోణంలో ముఖ్యం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్మాణం మొదలైన అంశాలను తాజా రెండు రూపాయిల కిలోబియ్యం, రూ.30 కిలో కందిపప్పు లాంటి పథకాల నేపథ్యంలో అధ్యయనం చేయాలి.
సంప్రదాయేతర ఆర్థిక వనరులైన సమాచార, జీవ సాంకేతిక (ఐటీ, బీటీ) రంగాల్లో ఏపీ సాధించిన ప్రగతిపై దృష్టి నిలపాలి. ముఖ్యంగా ఈ రెండు రంగాల్లో ప్రభుత్వ విధానాలు పరిశీలించాలి. సమాచార, జీవ సాంకేతిక రంగాల ప్రగతి కోసం ప్రభుత్వం ఏర్పరచిన మౌలిక వనరులైన జీనోమ్‌ వ్యాలీ, హైటెక్‌ సిటీ, ఫ్యాబ్‌సిటీ మొదలైన వ్యవస్థాగత అంశాలు పరీక్ష కోణంలో చాలా ముఖ్యం.
పర్యాటక విధానం, ప్రముఖ పర్యాటక స్థలాల సమాచారం అవసరం. అతి పెద్ద ఆర్థిక వనరుగా పరిణమించబోతున్న పర్యాటకరంగంపై ఆంధ్రప్రదేశ్‌ వ్యూహం, ప్రోత్సాహకాలు పరిశీలించాలి. రోడ్‌పాలసీ కింద ప్రభుత్వం రహదారుల నిర్మాణం కోసం ఏర్పరచుకున్న ప్రాధాన్యాలపై ప్రశ్నలు ఆశించవచ్చు.
This entry was posted on September 6, 2008 and is filed under చదువు.

గ్రూప్స్‌లో ఏ పేపర్‌ ఎలా?

      గ్రూప్స్‌లో ఏ పేపర్‌ ఎలా?
    కొడాలి భవానీ శంకర్‌
గ్రూప్‌-I మెయిన్స్‌ పరీక్షకు సుదీర్ఘమైన వ్యవధి లేదు. దీనికి పకడ్బందీగా తయారవ్వాలంటే… పేపర్లవారీగా సిలబస్‌ను పరిశీలించటం, దాన్ని విశ్లేషించటం అవసరం. గత సంచికలో పేపర్‌-I, II గురించి చూశాం. మిగతా మూడు పేపర్ల సిలబస్‌ విశ్లేషణ, సిద్ధమయ్యే పద్ధతిల గురించి తెలుసుకుందాం.
పీపీఎస్‌సీ విడుదల చేసిన ప్రశ్నపత్రాలే అభ్యర్థుల ప్రణాళిక రూపకల్పనకు మేలైన సాధనం. గ్రూప్‌-I మెయిన్స్‌ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉండకపోయినప్పటికీ సిలబస్‌లోని అంశాలను ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌ కోణంలో కలిపి చదవాల్సివుంటుంది.
పేపర్‌-III
నమూనా ప్రశ్నపత్రాలను బట్టి చిన్నచిన్న ప్రశ్నలు కొన్నిటిని కలిపి ఒక ప్రశ్నగా రూపొందించటం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఇచ్చిన సిలబస్‌ కూడా అందుకు దోహదపడేదిగా ఉంది. కాబట్టి సిలబస్‌లోని ప్రతి అంశంలో చిన్నచిన్న విషయాలను కూడా చదవాల్సివుంటుంది. సంఖ్యా సమాచారాన్ని తాజా నివేదికల ఆధారంగా సేకరించుకోవాలి. ఈ గతిశీలతను పరిగణనలోకి తీసుకొని, అభ్యర్థులు సిద్ధమవ్వాలి.

సెక్షన్‌-I: ఇండియన్‌ ఎకానమీ కింద ‘ప్రిలిమినరీ’లో చదివిన చాలా అంశాలు ఈ సెక్షన్‌ అధ్యయనానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ సమాచారాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకోవటం అవసరం.
మొదటి యూనిట్లో జాతీయాదాయం లెక్కింపు పద్ధతులు, మానవ అభివృద్ధి సూచిక-2007, జాతీయాదాయం పద్ధతుల్లో వస్తున్న మార్పులపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
రెండో యూనిట్లో ప్రణాళికా ప్రాధాన్యాల్లో మార్పులు, ఆర్థిక సంస్కరణల ప్రభావం, 11వ పంచవర్ష ప్రణాళికాంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.
మూడో యూనిట్లో పేదరికం, నిరుద్యోగం అంశాలపై, నిర్మూలన కార్యక్రమాలపై తాజా సంఖ్యా సమాచారం ఆధారంగా తయారవ్వాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేపథ్యంలో ఫలితాలను సమీక్షించుకోవాలి.
నాలుగో యూనిట్లో ఆర్‌బీఐ పరపతి విధానాలు, నరసింహం కమిటీ సిఫార్సుల నేపథ్యంలో బ్యాంకింగ్‌ నిర్మాణంలో వచ్చిన మార్పులపై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ.
ఐదో యూనిట్లో కేంద్రప్రభుత్వ ఆదాయ, వ్యయ వనరులు, భారతదేశ రుణ సమస్యపై దృష్టి పెడితే సరిపోతుంది.
సెక్షన్‌- II : మొదటి యూనిట్లో భూసంస్కరణలు, సంస్కరణ రూపాలు, చారిత్రక నేపథ్యంపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. భూకమతాల పరిణామంపై సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు తయారైతే మంచిది.
రెండో యూనిట్లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల స్వరూపంపై ప్రశ్న రావొచ్చు. సెక్షన్‌III లోని మూడో యూనిట్‌ను అనుసంధానం చేసుకొని చదివితే ఉత్పాదక రంగం నమూనాలు ప్రాంతీయ అసమానతలకు ఏ విధంగా దారితీశాయో అర్థమవుతుంది.
మూడో యూనిట్లో ఏపీ జనాభా గణాంకాలపై దృష్టిని పెట్టాలి. 2001 జనాభా లెక్కల ఆధారంగా వృత్తి స్వరూపం, నిరక్షరాస్యత, పేదరికం మొదలైన అంశాలను వివరించే విధంగా ప్రశ్నలు రావొచ్చు.
నాలుగో యూనిట్లో రాష్ట్రప్రభుత్వ విత్త నిర్వహణ ప్రధానాంశం. 2008-09 బడ్జెట్‌ను ఉపయోగించుకుంటూ పన్నుల నిర్మాణాన్ని పటిష్ఠంగా చదవాలి. ప్రణాళిక- ప్రణాళికేతర వ్యయంపై ప్రశ్నలు రావొచ్చు. రాష్ట్ర విదేశీ రుణభారంపైన సాధారణ స్థాయిలో ప్రశ్నలను ఊహించవచ్చు.
ఐదో యూనిట్లో ఏపీ పంచవర్ష ప్రణాళికల అనుభవాలు, తాజా పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యాల కోణంలో అధ్యయనం చేయాలి.
సెక్షన్‌- III : ఏపీ చిన్నతరహా పరిశ్రమలు, పరిశ్రమలు, ప్రాంతీయ అనుకూలత, అననుకూలతల నేపథ్యంలో ఎలా వృద్ది చెందాయో యూనిట్‌: I ద్వారా పరిశీలించే అవకాశం ఉంది. పరిశ్రమల వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను ప్రాంతీయంగా గుర్తించి అధ్యయనం చేయాలి.
రెండో యూనిట్లో ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి పటిష్ఠంగా తయారవ్వాలి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల రకాలు, ప్రధానంగా మద్దతు ధర నిర్ణయీకరణలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని సిద్ధమైతే మంచిది.
మూడో యూనిట్లో fact orientationతో ప్రశ్నలు ఎక్కువ రావొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను ఆధారంగా చేసుకొని చదివితే మంచిది. ప్రాంతీయ అసమానతలు ప్రధానాంశంగా ప్రశ్నలు రావొచ్చు.
నాలుగో యూనిట్లో సహకార వ్యవస్థపై ప్రశ్న తప్పనిసరిగా అడిగే అవకాశముంది. పావలా వడ్డీ పథకం, మైక్రో ఫైనాన్సింగ్‌ లాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఐదో యూనిట్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోణంలో ప్రధానంగా ప్రశ్న అడగవచ్చు. సేవారంగంలో వచ్చిన మార్పులపై ప్రశ్నను సంధించే అవకాశం ఉంది.
పేపర్‌-IV
ఈ పేపర్‌లోని ప్రశ్నలకు అభ్యర్థి ఇచ్చే సమాధానాన్ని బట్టి పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
సెక్షన్‌- I : ఒకటో యూనిట్లో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జాతీయ విధానం, టెక్నాలజీ మిషన్స్‌ కీలక అంశాలు. అందువల్ల ప్రధానమైన మూడు జాతీయ విధానాలు చదవటం వల్ల ఒక ప్రశ్నకు సులువుగా సమాధానం ఇవ్వవచ్చు.

రెండో యూనిట్లో ఉపగ్రహ వ్యవస్థ, ఉపగ్రహ వాహక వ్యవస్థ, రిమోట్‌ సెన్సింగ్‌ల వినియోగ కోణంలో అధ్యయనం చేయాలి. గ్రామీణాభివృద్ధిలో అంతరిక్ష సాంకేతికత కోణంలో చదవాలి.
మూడో యూనిట్లో సమాచార సాంకేతికత మూలాంశాలు, అనువర్తనాలు, ఏపీలో ప్రభుత్వ ప్రోత్సాహం… చదవాలి.
నాలుగో యూనిట్లో అణుశక్తితో పాటు సంప్రదాయేతర ఇంధన వనరులు ప్రధానాంశాలుగా గుర్తించాలి.
ఐదో యూనిట్లో ఆపత్సమయ నిర్వహణపై బాగా దృష్టి నిలిపితే పేపర్‌-I మొదటి యూనిట్‌లోని అంశాలకు కూడా తయారయినట్టు అవుతుంది. పంటల విజ్ఞానంపై ఒక ప్రశ్న ఊహించవచ్చు.
సెక్షన్‌- II: ఈ సెక్షన్‌ (బయోటెక్నాలజీ)లో ఉన్న ఐదు యూనిట్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ అంతర్గతంగా సబ్జెక్టుపరంగా ఒకదానితో మరొకటి సంబంధాన్ని కలిగివున్నాయి.
సైన్స్‌ అభ్యర్థులకు ఈ పేపర్‌ అనుకూలంగా ఉంటుందన్నది కొందరి అభిప్రాయం. కానీ ఆర్ట్స్‌ అభ్యర్థులు కొద్దిగా కష్టపడి, నమూనా ప్రశ్నలకు సమాధానాలు రాయటం సాధన చేస్తే ప్రతి సమాధానానికీ పూర్తిమార్కులు సాధించటం కష్టమేమీ కాదు. సైన్సు అభ్యర్థులకు కొన్ని శాస్త్రీయ నామాలు, శాస్త్రీయ పదాలు తెలిసివుంటాయి. కానీ ఏదైనా ఒక ఉత్పత్తి విధానం, ప్రక్రియ మాత్రం సైన్సు-ఆర్ట్స్‌ అభ్యర్థులందరికీ కొత్తే. కాబట్టి ఆర్ట్స్‌ వారు శాస్త్రీయ పదాలు, పేర్లు మొదలైనవాటిని వీలైనన్ని ఎక్కువసార్లు సాధన చేస్తే సబ్జెక్టు సులువవుతుంది.
సెక్షన్‌ - III విషయానికొస్తే… అభ్యర్థులందరికీ కొత్త సబ్జెక్టే. యూనిట్‌-I లో వివిధ రకాలైన పర్యావరణ చట్టాలు, లా సబ్జెక్టు నుంచి సేకరించాలి. భౌగోళిక వ్యవస్థ నుంచి యూనిట్‌ II (సహజ వనరులు), యూనిట్‌ V లను సేకరించవచ్చు. జీవశాస్త్ర పుస్తకాల నుంచి యూనిట్‌ III, IV (జీవవైవిధ్యం, కాలుష్యం) లభ్యమవుతాయి.
పేపర్‌ -V
మొదటి సెక్షన్‌లో ఉన్న నిష్పత్తులు, శాతాలు, సగటులపై పట్టు సాధించాలంటే మొదటిగా అభ్యర్థి వాటి ప్రాథమికాంశాలను బాగా అధ్యయనం చేయాలి. ఈ విభాగంలో మంచి మార్కులు రావాలంటే శాతాలు, లాభనష్టాలు, సరాసరి, నిష్పత్తి, కాలం-దూరం, కాలం-పని మొదలైనవి సాధన చేయాలి. ప్రశ్నలో మొదటి వాక్యం, రెండో వాక్యాల మధ్య కచ్చితమైన సంబంధాన్ని కనుగొని, ఆ సంబంధాన్ని సమీకరణ రూపంలో రాస్తే మంచి ఫలితాలు వస్తాయి.

రెండో సెక్షన్‌లో… ఇచ్చిన చిత్రాలను పరిశీలించి, చిత్రానికీ ప్రశ్నకూ మధ్య పోలికను అధ్యయనం చేయాలి. డాటాను సంపూర్ణంగా ఏ చిత్రంలో పొందుపరచాలో తెలిసివుండాలి. గత సివిల్స్‌ మెయిన్స్‌ జనరల్‌స్టడీస్‌లో ఉన్న స్టాటిస్టిక్స్‌ను చేసినట్లయితే మెరుగైన మార్కులు వస్తాయి.
మూడో సెక్షన్‌ మిగిలినవాటితో పోలిస్తే క్లిష్టమైనదని చెప్పవచ్చు. దీనిపై పట్టు సాధించాలంటే… ప్రతిరోజూ ఒక గంట దీనిపైన సాధన చేయాలి. BSC అనలిటికల్‌ రీజనింగ్‌ పుస్తకం నుంచి ఎవాల్యుయేటింగ్‌ ఇన్‌ఫరెన్సెస్‌ ప్రిపేరవ్వాలి. మిగిలినవాటికి ఏదైనా ఒక మంచి పుస్తకం ప్రిపేరైతే సరిపోతుంది.
సైన్స్‌ అభ్యర్థులకు పేపర్‌- IV అనుకూలంగా ఉంటుందన్నది కొందరి అభిప్రాయం. కానీ ఆర్ట్స్‌ అభ్యర్థులు నమూనా ప్రశ్నలకు సమాధానాలు రాయటం బాగా సాధన చేస్తే ప్రతి సమాధానానికీ పూర్తిమార్కులు సాధించటం కష్టమేమీ కాదు.
This entry was posted on August 31, 2008 at 7:03 am and is filed under చదువు

మీ ప్రిపరేషన్‌ ఎంత ఎంత పక్కా?

                                మీ ప్రిపరేషన్‌ ఎంత ఎంత పక్కా?
                            కొడాలి భవానీ శంకర్‌

వేసే ప్రతి అడుగూ లక్ష్యాన్ని దగ్గర చేయాలి… చదివే ప్రతి గంటా అదనపు మార్కులు సంపాదించిపెట్టాలి! లక్షలమంది రాసే గ్రూప్‌-2 లాంటి పరీక్షకు ఈ ధోరణి చాలా అవసరం. అందుకే… ముందుకు సాగేముందు – మీ ప్రిపరేషన్‌ సరైన పంథాలో సాగుతోందో లేదో తేల్చుకోవాలి. అవసరమైన మార్పులూ చేర్పులూ చేసుకోవాలి. లక్ష్యం వైపు దూసుకుపోవాల్సిన తీరు ఇదే!
గ్రూప్‌-2 పరీక్షలు ఇంకా 75 రోజులు కూడా లేవు. ఇప్పుడున్న వ్యవధి సంపూర్ణంగా సద్వినియోగమయ్యేలా వ్యూహాత్మకంగా సిద్ధమైతేనే మీకు ప్రభుత్వ ఉద్యోగ యోగం!
ఇప్పటికే వేలమంది శ్రద్ధగా సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే చదవటం మొదలుపెడుతున్నారు. అదేదో సినిమాలో అన్నట్లుగా- ఎప్పుడు వచ్చామన్నది కాదు, ‘బుల్లెట్‌ దిగిందా లేదా’ అన్నదే ముఖ్యం. ఆలస్యంగా ఆరంభించినా, ముందుగా మొదలుపెట్టినా ‘వ్యూహం సరైందా, కాదా’ అన్నదే కదా ముఖ్యం! అందుకే మీ ప్రిపరేషన్‌ సరైనరీతిలో ఉందో లేదో సమీక్షించుకోవాలి.
భావనలపై ఆధారపడి…
మొన్నటికి మొన్న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో సీనియర్‌ అభ్యర్థులు కూడా క్వాలిఫై కాలేకపోయారనే వార్తలు వచ్చాయి. పేపర్‌లోని అంశాలు చాలా సాధారణంగా, ప్రాథమిక (బేసిక్‌) సమాచారంతో పాటు కాన్సెప్ట్‌ (భావన) ఆధారితాలుగా ఉన్నాయి. పైపైన బిట్లు ప్రిపేరైన అభ్యర్థులు అనుబంధ విషయాలపై ప్రశ్నలు అడిగేసరికి తడబడినట్లుగా తెలుస్తోంది.
ప్రారంభం నుంచే ‘ఇది ఇంపార్టెంట్‌ బిట్‌, ఇది కాదు’ అనే ధోరణిలో చదవకూడదు. చదివే టాపిక్‌లో కీలక (కోర్‌) అంశం ఏమిటి? దానితో ముడిపడిన ఇతర ముఖ్యాంశాలు ఏమిటి; చదువుతున్న టాపిక్‌కు పోలిక/భేదాలతో కూడిన ఇతర అంశాలేమిటి, సంబంధమున్న నిజజీవిత ఉదాహరణలు ఏమిటి… ఇలా అధ్యయనం చేస్తే భావనలపై పట్టు ఏర్పడుతుంది.
ఈ తరహా ప్రిపరేషన్‌ వల్ల ప్రశ్న ఎలాంటిదైనా సమాధానాలను సరిగా గుర్తించవచ్చు.
బట్టీ కూడా అవసరమే
భావనలపై ఆధారపడిన ప్రిపరేషన్‌ వల్ల దాదాపు 80 శాతం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. అయినప్పటికీ గ్రూప్‌-2 పరీక్ష ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల స్వభావాన్ని బట్టి గణాంకాల సమాచారంపై 15 శాతం ప్రశ్నల వరకూ వచ్చే అవకాశముంది. ఇలాంటి బిట్లను ఎదుర్కొనేందుకు తెలివితో కూడిన బట్టీని అనుసరించాల్సిందే.
* పేపర్‌-1 లోని వివిధ భౌగోళికాంశాలు, భారతదేశ చరిత్రలో యుద్ధాలు, రచనలు, వారసత్వ క్రమం మొదలైనవి.
* పేపర్‌-2లోని ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక విషయాలు, పాలిటీలోని ఆర్టికల్స్‌, సవరణలు మొదలైనవి.
* పేపర్‌-3లోని భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అంశాల్లో ప్రాథమిక సమాచారం నుంచి తాజా సమాచారం వరకూ.
ఇలాంటి అంశాలు అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో నమోదు చేసుకొని, చార్టుల మాదిరిగా తయారుచేసుకొని వీలైనప్పుడల్లా పునఃస్మరణ చేయాలి. అప్పుడు పరీక్ష హాల్లో తికమక పడకుండా సమాధానాలు గుర్తించవచ్చు.
ఆం.ప్ర.పై పట్టుందా?
గ్రూప్‌-1లోనైనా, గ్రూప్‌-2లోనైనా మారిన పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక, ఆర్థిక, సామాజిక విషయాలు కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక, ఆర్థిక విషయాలకు 450కు 150 మార్కులు కేటాయించారంటేనే జయాపజయాలను నిర్ణయించే స్థితికి ‘ఆంధ్రప్రదేశ్‌ సమాచారం’ చేరినట్టు గుర్తించాలి. అందుకే ఆం.ప్ర. చరిత్ర, ఆర్థిక వ్యవస్థలపై పట్టు అవసరం. దానికోసం ఈ రెండు అంశాలపై లోతైన, మారుమూల అంశాలను కూడా అధ్యయనం చేయాలి. మరి మీ ప్రిపరేషన్‌ ఈ రీతిగా సాగుతోందా?
ప్రాథమికం చదివితే చాలదు
పోటీ పరీక్షల్లో కాలానుగుణంగా అభివృద్ధి చెందే భావనలు, ఉత్పత్తులపైన ప్రశ్నలు అడిగే ధోరణి ఉంటోంది. అందువల్ల ప్రతి సబ్జెక్టులోనూ తాజా పరిణామాలపై దృష్టి నిలపాలి.
* చరిత్రలో ఇటీవల బయల్పడిన పురాతన సాక్ష్యాలు ఏమిటి?
* ఇటీవల చర్చనీయాంశాలు/ వివాదాస్పదంగా మారిన అంశాలు ఏమిటి?
ఈ తరహాలో ప్రశ్నించుకొని, సమాధానాలు సేకరించుకోవాలి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.
ప్లూటో ఒక గ్రహమా, కాదా అన్న ఆధునిక ధోరణులు, పరిశోధనలను బట్టి గ్రహమండల వ్యవస్థ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో లేదో గమనించాలి. ‘సునామీ’లాంటి తాజా పరిణామాలు, కరుగుతున్న మంచుకొండలు మొదలైన కోణాల్లో సబ్జెక్టును అధ్యయనం చేయాలి.
ముఖ్యంగా… శాస్త్ర సాంకేతిక రంగంలో రోజుకో రీతిలో నూతన అంశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల ప్రాథమిక సమాచారంతోపాటు లోతుగా, తాజా అంశాలను చేర్చిన (అడ్వాన్స్‌డ్‌) సమాచారంపై దృష్టి నిలిపితేనే ఎగ్జామినర్‌ స్థాయి ఆలోచన మీలో ఏర్పడుతుంది. ఆ దృష్టికోణం ఎప్పుడైతే మీలో ఏర్పడుతుందో అప్పుడు ప్రతి అంశాన్నీ అదే రీతిలో అధ్యయనం చేయగలుగుతారు.
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ (పేపర్‌-3) విషయానికొస్తే… మన రాష్ట్రం సంప్రదాయ వస్తూత్పత్తి, తద్వారా సంపద పెంచుకోవటంపై కంటే సమాచార సాంకేతికత, బయోటెక్నాలజీ, పర్యాటకరంగం మొదలైన సేవారంగ సంబంధ అంశాలపై దృష్టి కేంద్రీకరించి స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్‌డీపీ)ని పెంచుకుంటోంది. కాబట్టి ఆధునిక ఉత్పత్తి ధోరణులు మీ ప్రిపరేషన్‌లో ఏ మోతాదులో ఉన్నాయో చూసుకొని ఈ 75 రోజుల ప్రిపరేషన్‌కు పదును పెట్టండి.
వర్తమానం పరిధి, స్థాయి?
ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటే 6 నెలల క్రితం వరకూ జరిగిన అంశాలపైనే ప్రశ్నలు అడిగారు. అవి కూడా అభ్యర్థిలో కచ్చితమైన సమాచారాన్ని పరిశీలించేవిగా ఉన్నాయి. ఊహించి సమాధానాలు గుర్తించే అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రశ్న, చాయిస్‌లను తయారుచేశారు. అందువల్ల ‘అదృష్టం’ పాత్ర కన్పించలేదు. ఇదే ధోరణి గ్రూప్‌-2లో కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని గతంలో మాదిరిగా కాకుండా ప్రతి వర్తమాన అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయాలి. ఈ ధోరణి ఇప్పటివరకూ మీ ప్రిపరేషన్లో లేకుంటే వెంటనే మేల్కొనాలి. ప్రతిరోజూ కరంట్‌ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి.
‘మెంటల్‌ ఎబిలిటీ’ స్థాయి పెరిగిందా?
ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో తాజాగా విన్పిస్తున్న మార్పు- మానసిక సామర్థ్యం (మెంటల్‌ ఎబిలిటీ) ప్రశ్నల స్థాయి పెరగటం. మొన్నటి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఎసర్షన్‌, రీజనింగ్‌ ప్రశ్నలు వచ్చాయి. వాటి ద్వారా అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని పరిశీలిస్తారు. ఇదే ధోరణి గ్రూప్‌-2లో కూడా పునరావృతమయ్యే అవకాశం ఎక్కువ. అందువల్ల మెంటల్‌ ఎబిలిటీలో ఇలాంటి అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? అని అధ్యయనం చేయటం అవసరం. క్లిష్టమైన సమస్యలను బాగా సాధన చేయాలి. ప్రతి మార్కూ విలువైన ఈ పోటీ పరీక్షల్లో ఏ అంశాన్నయినా నిఖార్సుగా అధ్యయనం చేయాలి. ఇలాంటి ధోరణి మీ ప్రిపరేషన్లో ఉందా?
భారీ సిలబస్‌కు బహుముఖ వ్యూహం
ఇటీవల ‘ఈనాడు-చదువు’ నిర్వహించిన SMS పోల్‌లో 68 శాతం మంది అభ్యర్థులు సిలబస్‌ భారీగా, భారంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇది నిజమే అయినా ఆ ఆలోచన మీ దరిదాపుల్లోకి కూడా రానీయవద్దు. ఎంతటి భారీ, క్లిష్ట అంశానికైనా ఒక మార్గం కచ్చితంగా ఉంటుంది. మీ ప్రిపరేషన్‌లో కేవలం ఒక్క మార్గంపైనే ఆధారపడకుండా బహుముఖ మార్గాలను అనుసరించండి.
1) కొన్ని పాఠ్యాంశాల్లో లోతైన అధ్యయనం అవసరం.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌ సహకార వ్యవస్థ, ప్రజా పంపిణీ, సంక్షేమపాలన
2) కొన్ని అంశాల్లో స్థూల అవగాహన చాలు.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో రవాణా విధానం, కమ్యూనికేషన్‌ సిస్టమ్‌
3) కొన్నిటిని గణాంకాల ఆధారంగానే అధ్యయనం చేయాలి.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలు, మానవ వికాససూచి, భారత ప్రణాళిక వ్యవస్థలు, విత్త బడ్జెట్‌
ఈ విధంగా ప్రతి పేపర్‌లోనూ సబ్జెక్టు పరిధిని బట్టి, ప్రాధాన్యం బట్టి స్థాయిని నిర్ణయించుకొని ప్రిపేరైతే సిలబస్‌ ఎంత భారీగా ఉన్నా చదవటం సులువుగానే ఉంటుంది.
పేపర్‌-1 లో జాగ్రఫీ, జనరల్‌సైన్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, కరంట్‌ అఫైర్స్‌ల నుంచి ఒక్కోదానిపై 35 బిట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. భారతదేశ చరిత్రకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. ఏపీ చరిత్ర పేపర్‌-2లో 75 మార్కుల ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయానికి అవకాశముంది. అందువల్ల పైన చెప్పిన నాలుగు సబ్జెక్టుల్లో లోతుగా చదవాలి. పాత పద్ధతిలోని జనరల్‌స్టడీస్‌ స్థాయి కంటే మించి ఉండేలా ప్రిపరేషన్‌ సాగించాలి.
పునశ్చరణ (రివిజన్‌)
మీ ప్రిపరేషన్లో పునశ్చరణ పాత్ర ఏమిటి? కొందరు అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టులోని ఒక్కో పాఠం చదువుకుంటూ మొత్తం పాఠాలను పూర్తిచేశాక వీలైతే రివిజన్‌ చేస్తారు. సమయం ఎక్కువ లేకపోతే రివిజన్‌ ఏమీ చేయకుండానే కొత్త సబ్జెక్టులోకి వెళ్ళిపోతారు. ఇలా అన్ని సబ్జెక్టులూ ఒకసారి పూర్తయ్యాక రివిజన్‌ మొదలుపెడతారు. ఇది సరైన ధోరణి కాదని జ్ఞాపకశక్తి అధ్యయన నిపుణులు చెపుతున్నారు. మొదటిసారి చదివిన సందర్భానికీ, రెండోసారి చదివిన సందర్భానికీ మధ్య కాలవ్యవధి చాలా ఎక్కువ ఉండటమే దీనిలో లోపం.
ఉదాహరణకు… మూడు పేపర్లు చదవాలనుకోండి. ప్రతిరోజూ 3 పేపర్లకు సమయాన్ని కేటాయించాలి.
ఈ విధంగా చదవటం వల్ల సమయం వృథా అవుతుందనే అపోహ అక్కర్లేదు. పునరభ్యాసం వల్ల మొదటి రోజు పట్టిన సమయం కంటే రెండో రోజు అదే పాఠానికి తక్కువ సమయం పడుతుంది. మూడో రోజు మరింత తక్కువ సమయం! అందుకని ఆందోళన పడకుండా ప్రతి సబ్జెక్టులోనూ అన్ని పాఠాలకూ ఇదే ధోరణిని అనుసరించాలి.
ఎవరైనా అభ్యర్థి గ్రూప్‌-2 సిలబస్‌ మొత్తంపై మంచి అవగాహన ఏర్పరచుకున్నాడనుకుందాం. అయినప్పటికీ పునశ్చరణ, నమూనా పరీక్షల సాధన ఏమీ చేయకుండా నేరుగా పరీక్ష రాస్తే అతడు విజయం సాధించటం కష్టమే. అతడే తగిన విధంగా పునశ్చరణ చేసి, నమూనా పరీక్షలు రాస్తే విజేతల జాబితాలో నిలవటం తథ్యం! విషయ అవగాహన ద్వారా లభించే విజయావకాశాలు 60 శాతం మాత్రమే. పునశ్చరణ (రివిజన్‌) ద్వారా వాటిని మరో 25 శాతం పెంచుకోవచ్చు.
మానసిక సవాళ్ళు
లక్షలమంది ప్రేక్షకుల అరుపుల మధ్య బంతిని ఎదుర్కొనే క్రికెటర్‌ కంటే మీపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందా? ఆ ఒత్తిడిని అధిగమించి క్రికెటర్లు సెంచరీలు చేయటం లేదా? బౌలర్లు వికెట్లు తీయటం లేదా? ఏ లక్ష్యసాధనలోనైనా ఒత్తిడి సహజం. దీన్ని జయించేందుకు ఈ మెలకువలను మీ ప్రిపరేషన్లో భాగం చేసుకోండి.
* ‘నేను బాగానే చదువుతున్నాను. నాకు ఉద్యోగం తప్పకుండా వస్తుం’దని తరచూ అనుకోవాలి.
* ప్రతిరోజూ నిద్రపోయేముందు ఆ రోజు చదివిన పాఠాలన్నీ గుర్తుచేసుకోండి. మంచి ఫలితం ఉందని సమీక్షించుకోవాలి.
* గతంలో మీరు సాధించిన విజయాలను ఒక్కసారి స్మరించుకోండి. అదే బాటలో పయనిస్తున్నానని స్థిమితపడండి.
* పోటీ ఎక్కువుందని లేనిపోనివి వూహించుకొని ఆందోళన పడకండి. లక్షలమంది రాసినా ‘నాలాంటి వాణ్ని నేనొక్కణ్నే. ఒక్క ఉద్యోగం ఉన్నా అది నాదే’ అనే భావన పెంచుకోవాలి. ఈ ఆశావహ దృక్పథం పరీక్ష రాసేవరకూ కొనసాగాలి.
పరీక్షల సాధన – ప్రిపరేషన్లో భాగమే అభ్యర్థుల్లో ఎక్కువమంది చదవటంపై ఉండే ఆసక్తిని నమూనా పరీక్షలు ఎదుర్కొనేందుకు చూపరు. నిజానికి ఆబ్జెక్టివ్‌ పరీక్షవిధానంలో విజయమనే 100 లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ‘సిలబస్‌ చదవటం’, ‘నమూనా పరీక్షలు రాయటం’ రెండూ కీలకమైనవే. లక్ష్యసాధన 100 శాతమైతే దానిలో చదవటం పాత్ర 65 శాతం, నమూనా పరీక్షల పాత్ర మిగతా 35 శాతం. చదివిన విషయాల్లో నమూనా పరీక్షలను వెంటవెంటనే రాయటం ద్వారా కింది ప్రయోజనాలు ఉంటాయి.
* ప్రశ్నలు ఏ విధంగా రావొచ్చో తెలుస్తుంది.
* చదివిన అంశాలను గుర్తు చేసుకునే అవకాశం దొరుకుతుంది. దాని ద్వారా బాగా గుర్తుండిపోతుంది.
* ప్రిపరేషన్‌ సందర్భంగా చదవనివీ, కొత్త అంశాలూ చదివే అవకాశం ఉంది.
* తప్పులు ఎక్కడ చేసే అవకాశం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల ఆ దోషాలను సవరించుకొని ఒప్పుల సంఖ్య పెంచుకోవచ్చు.
* సమయ నిర్వహణ ఎలా చేయాలో అర్థమవుతుంది.
* పరీక్ష అంటే ఉండే భయం తొలగుతుంది.
* రాసే సమాధానాల్లో కచ్చితత్వం పెరుగుతుంది.
కాబట్టి ప్రతి సబ్జెక్టులోనూ వీలైనన్ని నమూనా పరీక్షలను ప్రిపరేషన్లో భాగంగా సాధించాలి. ఈ 75 రోజుల వ్యూహంలో ‘నమూనా పరీక్షల సాధన’ మీ పదునైన ఆయుధమని మర్చిపోకండి.
This entry was posted on August 31, 2008 and is filed under చదువు.

పోటీ తక్కువే… పోరాడితే గెలుపే!

పోటీ తక్కువే… పోరాడితే గెలుపే!  

మొదట గ్రూప్‌-1 టాపిక్స్‌లో ఏది ఇంకా అర్థం కాలేదో పేపర్‌వారీగా ఒక అంచనాకు రండి. అలా అర్థం కాని టాపిక్‌ను ఛాయిస్‌ కింద వదిలేసే అవకాశం ఉన్నదా అని గమనించండి. ఆ అవకాశముంటే ప్రత్యామ్నాయంగా ఉన్న టాపిక్‌పై మీ పట్టు ఎంతో ఒకసారి సమీక్షించండి. 
* ఛాయిస్‌ కింద వదిలేసే అవకాశం లేకపోతే మరోసారి క్షుణ్ణంగా పునశ్చరణ (రివిజన్‌) చేయండి. ఎక్కువ సమయం వెచ్చించకండి. ఇలాంటి టాపిక్స్‌ అన్నిటినీ పేపర్‌వారీగా జాబితాగా రాసుకొని, సంబంధిత పరీక్ష ముందురోజున పునశ్చరణ చేయండి. ఫలితముంటుంది.
* కచ్చితంగా వచ్చే అవకాశాలున్న టాపిక్స్‌ జాబితా రాయండి. వీటిని క్రమబద్ధంగా పునశ్చరణ చేయండి. ఈ మూడు రోజుల ప్రిపరేషన్‌ తర్వాత ఇక చూడాల్సిన అవసరం లేని టాపిక్స్‌ను వదిలేసి; పరీక్ష రోజు కూడా రివిజన్‌ చేయాల్సినవాటి జాబితా రాసుకోండి. ఇందువల్ల సమయం వృథా కాకుండా పరీక్ష రోజున అవసరమైన అంశాలపైనే దృష్టి నిలపవచ్చు.
*ఆ 3 రోజుల్లో వివిధ పేపర్ల మధ్య అనుసంధానంగా ఉన్న అంశాలను చదివితే మొత్తమ్మీద మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు… వ్యాస పరీక్షను ఎదుర్కొనేందుకు పేపర్‌-3లోని మూడో యూనిట్‌ టాపిక్స్‌ ఉపయోగపడతాయి. కాబట్టి వ్యాసరచన ప్రిపరేషన్లో భాగంగా ఇలాంటి ఇంటిగ్రేటెడ్‌ అంశాలు ఏవైతే ఉంటాయో… వాటిపై దృష్టి సారించండి.
* మహిళా సాధికారత, మానవ వనరుల నిర్మాణం, గ్రామ సాధికారత లాంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే సమాచార సాంకేతికత, ప్రజారోగ్యం, ఆం.ప్ర. పథకాలు లాంటివి ఉదాహరించాల్సిందే కదా! అందువల్ల ఇలాంటి అంశాలపై దృష్టి నిలిపితే ఈ మూడు రోజులనూ సద్వినియోగం చేసుకున్నట్లే.
* రైటింగ్‌ సాధనలాంటివి ఈ దశలో పెట్టుకోకండి.
* పాత గణాంక సమాచారం బదులుగా సాధికారికంగా వెలువడిన నూతన గణాంకాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి.
* చివరిగా వర్తమాన వ్యవహారాల రివిజన్‌ చేయండి. వివిధ దినపత్రికల్లో వచ్చిన టాపిక్స్‌ అన్నిటినీ పేపర్‌వారీగా విభజించుకొని, ఆయా పరీక్షల ముందురోజున ఓ సారి చూసుకోవాలి.
* అనేక పుస్తకాలను ఈ దశలో రిఫరల్‌బుక్స్‌గా చదవకుండా స్టాండర్డ్‌ సమాధానాలున్న పుస్తకాన్నే రివిజన్‌ చేయండి. సొంతనోట్సు తయారుచేసుకుని ఉంటే ఆ నోట్సుకే పరిమితమవ్వటం ఉత్తమం.
* కొత్త పుస్తకాలు, కొత్త సమాధానాలను చదవొద్దు. ఈ దశలో మీ కర్తవ్యం- ఉన్నదాన్నే మరింత బలీయంగా చేసుకోవటం, అదే లక్ష్యంతో ముందుకువెళ్ళటం. కొత్త పాయింట్లు తగులుతాయేమోననే ఆలోచనతో ఉన్న సబ్జెక్టును చెడగొట్టుకోవద్దు.
* డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో అన్ని రకాల సమస్యల సాధనలో ఉన్న స్టెప్స్‌ను, షార్ట్‌కట్స్‌ను ఒక్కసారి పరిశీలించండి. ఈ దశలో సాధనకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. దీనికి సమయం కేటాయిస్తే మిగతా ప్రిపరేషన్‌ దెబ్బతినే ప్రమాదముంది.
* వ్యాసరచన అంశాలను ఒక్కసారి సమీక్షించుకోండి. అభ్యాసం కోసం చిత్తుప్రతిని తయారుచేసుకోండి. చిత్తుప్రతులనూ, వ్యాఖ్యానాలనూ, గణాంకాలనూ పైపైన పునశ్చరణ చేయండి. గంటల తరబడి ఒక్కో వ్యాసానికి సమయం కేటాయించే పద్ధతిని వదిలేయండి.
* ఇప్పటివరకూ ఇంగ్లిష్‌ను పట్టించుకోనివారు దానిపై దృష్టి నిలపండి. క్వాలిఫైయింగ్‌ పేపర్‌ అనే ఆలోచన, అతి విశ్వాసం మొదలైన కారణాలతో ఇంగ్లిష్‌ను నిర్లక్ష్యంగా వదిలేయకుండా వివిధ అంశాల్లోని ముఖ్యాంశాలను గుర్తుచేసుకోండి.
* పరీక్ష కేంద్రం మీ ఊరు కాకపోతే ముందురోజే ఆ కేంద్రానికి చేరిపోండి. కావాల్సిన పుస్తకాలు, ఇతరత్రా సామగ్రిని తీసుకువెళ్ళండి. పరీక్ష కేంద్రాన్ని ముందురోజే ఒకసారి చూసుకోండి.

పరీక్ష రోజుల్లో…
* పరీక్ష సమయానికి అరగంట ముందే హాల్లోకి వెళ్ళనిస్తారు. ఈ సమయంలో ప్రధాన బుక్‌లెట్‌కు మార్జిన్లు కొట్టటం, పేజీలకు సీరియల్‌ నంబరు వేయటం ముందుగా చేస్తే చివర్లో మీపై ఒత్తిడి తగ్గుతుంది.
* నూతన పరీక్షా విధానంలో అభ్యర్థిలో సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ రెండూ పరిశీలిస్తారు. అందుకని మొత్తం ప్రశ్నను క్షుణ్ణంగా చదవండి. ప్రశ్న తీరును బట్టి ఉపప్రశ్నల వెయిటేజిని నిర్ణయించుకోండి. ఒక మార్కు మాత్రమే ఇచ్చేలా ఉంటే క్లుప్తంగా సమాధానం రాస్తే చాలనే ఆత్మవిశ్వాసంతో రాయండి. ప్రశ్నలోని ఉపప్రశ్నలన్నింటికీ తగిన మోతాదులోనే జవాబు రాయాలి. లేకపోతే సమాధానాల బ్యాలన్స్‌ పోతుంది. మార్కుల నష్టం వస్తుంది.
* బాగా వచ్చినవి మొదట రాసి, అటుఇటుగా వచ్చినవి చివర్లో రాయాలని తెలిసిందే కదా!
* బాగా తెలిసిన సమాధానాన్ని ఎక్కువ రాసే ధోరణి మంచిది కాదు. దీనివల్ల మిగతా ప్రశ్నలకు కేటాయించాల్సిన సమయం తగ్గిపోయి, అంతిమంగా నష్టపోవాల్సివస్తుంది.
* అన్ని ప్రశ్నలకూ (ఛాయిస్‌ ఉన్నవి మినహా) సమాధానాలు రాయండి. పూర్తిగా సమాధానం తెలియకపోయినా తెలిసినంత వరకైనా రాయండి. ఒక్కమార్కు కలిసివచ్చినా వచ్చినట్టే కదా! 

* పరీక్షహాల్లో ఇతరులు ఎక్కువ ఎడిషనల్‌ పేపర్లు తీసుకుంటున్నారని ఒత్తిడికి గురికావొద్దు. అసలు ఇతరుల గురించి పట్టించుకోవద్దు.
* పరీక్షాపత్రం ‘టఫ్‌’గా వచ్చినా ఆందోళన పడొద్దు. గ్రూప్స్‌ నూతన పరీక్షావిధానంలో అందరి ప్రిపరేషన్లోనూ ఎన్నో లోపాలున్నాయి. ‘నేను మాత్రమే తక్కువ ప్రిపేరయ్యాను’ అనే ధోరణి వద్దు. క్లిష్టత అనేది అందరికీ ఒకటే. ఉన్నంతలోనే పోరాటధోరణితో మార్కులు పొందేందుకు ప్రయత్నించండి.
* ఒక పేపర్‌ బాగా రాయలేదని మిగతా పేపర్లు వదిలేయవద్దు. అన్ని పేపర్లకూ హాజరై మీ వంతు ప్రయత్నం చేయండి.
ఈసారి మెయిన్స్‌ పరీక్షకు పోటీ బాగా తక్కువగా ఉంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రశాంతంగా పరీక్షలను ఎదుర్కోండి. విజయోస్తు!

కొడాలి భవానీ శంకర్‌
This entry was posted on September 6, 2008 and is filed under చదువు.