మరిన్ని గ్రూప్‌-2 కొలువులు -కొత్తగా 295 పోస్టులు




మరిన్ని గ్రూప్‌-2 కొలువులు
కొత్తగా 295 పోస్టులు
2008 ప్రకటనకు 191 అదనం
ఉద్యోగాల భర్తీకి సిద్ధం
హైదరాబాద్‌

నిరుద్యోగులకు శుభవార్త. గ్రూపు-2 కింద కొత్త ప్రకటన వెలువడనుంది. 2011 ఏడాది కింద వెలువడనున్న ఈ ప్రకటన ద్వారా 295 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుంది. ఇక 2008 ప్రకటనకు 191 పోస్టులను అదనంగా కలపనుంది. దీంతో కొత్తగా గ్రూప్‌-2 అభ్యర్థులకు 486 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇది వారిలో ఉత్సాహం నింపుతోంది.
గ్రూపు-2 కింద 682 పోస్టుల భర్తీకి 2008లో ప్రకటన వెలువడింది. 4,54,000 మంది దరఖాస్తు చేశారు. ఇంతవరకు రాతపరీక్ష జరగలేదు. మరోవైపు అదనపు పోస్టులను కలపాలనే అంశంపై నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీనిని అనుసరించి అదనంగా మరో 191 పోస్టులను కలిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2008 ప్రకటనతో సంబంధం లేకుండా గ్రూప్‌-2 కింద తాజాగా మరో ప్రకటన జారీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరీక్షలు ఎప్పుడు?: 2008 గ్రూప్‌-2 పరీక్షను ఇంతవరకూ నిర్వహించలేదు. అందువల్లే ఈ ప్రకటనకు అదనపు పోస్టులను కలిపేందుకు అవరోధం ఏర్పడలేదు. 191 పోస్టులను అదనంగా కలుపుతున్నందున మళ్లీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే నాలుగున్నర లక్షలమందికిపైగా దరఖాస్తు చేసినందున మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించడంపై సందిగ్ధం నెలకొంది. జులైదాకా ఏపీపీఎస్సీ వివిధ రకాల రాత పరీక్షలతో బిజీగా ఉంది. ఆ తర్వాతే 2008 పరీక్ష గురించి ఆలోచించనుంది. ఆ పరీక్ష అయితేగానీ 2011 ప్రకటన జారీ విషయం ముందుకు వస్తుంది.

గ్రూప్స్‌ గెలుపు... ఇదే మేలుకొలుపు!

గ్రూప్స్‌ గెలుపు... ఇదే మేలుకొలుపు!



కొడాలి భవానీ శంకర్‌
 అభ్యర్థుల ఉద్యోగావకాశాలను పెంచుతూ గ్రూప్‌-1కి తాజాగా, గ్రూప్‌-2కి సప్లిమెంటరీ నోటిఫికేషన్లు రాబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. 'ప్రకటనలు విడుదల కాలేదు; పరీక్ష తేదీలు తెలియకుండా చదవబుద్ధి కాద'నుకుంటే పోటీలో వెనుకబడే ప్రమాదముంది. ఇప్పటినుంచే మేలుకొని, సన్నద్ధమవటం ప్రారంభిస్తే మొత్తం సిలబస్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది!
కడమిక్‌ పరీక్షలకు నాలుగు నెలల ముందు చదవటం ప్రారంభించినా మంచి మార్కులు సాధించవచ్చు. కానీ పోటీ పరీక్షల్లో పోటీ ఎక్కువ; ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తేనే మంచి ఉద్యోగాలు వస్తాయి. 2008 పరీక్షలో విఫలమైన అభ్యర్థులతో పాటు గత 3 సంవత్సరాలుగా చదువుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. ఫలితంగా తాజా అభ్యర్థులు తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిందే. గ్రూప్‌-2 మూడు పేపర్లలో మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌, రెండోది ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, పాలిటీ; మూడోది భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు.
ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సిలబస్‌ పరిమితం కాబట్టి చరిత్ర పట్ల ఆసక్తి ఉంటే దీనితో ప్రిపరేషన్‌ మొదలుపెట్టొచ్చు. ఒక్కో సిలబస్‌ అంశాన్ని చదివి ప్రశ్నలు సాధన చేస్తే ఆత్మవిశ్వాసం త్వరగా పెంపొందుతుంది. పాలిటీ సిలబస్‌ కూడా పరిమితమే. పైగా మెటీరియల్‌ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి పేపర్‌-2 పై త్వరగా పట్టు సాధించే అవకాశం ఉంది.
ఆర్థికశాస్త్రాన్ని గ్రాడ్యుయేషన్‌/ పీజీ స్థాయిలో చదివినవారు పేపర్‌-3లోని ఇండియన్‌ ఎకానమీ సిలబస్‌ అంశాలతో అధ్యయనం మొదలుపెడితే ప్రేరణ బాగుంటుంది. తరవాత ఏపీ ఎకానమీని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఇందుకోసం గ్రూప్‌-2 కోసం రచించిన పుస్తకాలు మార్కెట్లో బాగానే ఉన్నాయి. వాటి అధ్యయనం ద్వారా ప్రిపరేషన్‌ గాడిలో పడే అవకాశం ఎక్కువ.
సైన్సు, ఇతర సబ్జెక్టులు డిగ్రీ/ పీజీలో సంబంధం కలిగినవారు నేరుగా జనరల్‌ స్టడీస్‌తో మొదలుపెట్టొచ్చు. జీఎస్‌లో వచ్చే ప్రశ్నల్లో కనీసం 60 శాతం పాఠశాల స్థాయి సమాచారానికి సంబంధించినవే. కాబట్టి వాటిపై ముందుగా దృష్టి నిలపాలి. పాఠశాల స్థాయిలో వివిధ సబ్జెక్టుల్లోని సమాజ అన్వయ విషయాలపై శ్రద్ధ చూపాలి.
సమాంతరంగా...
మొత్తం మీద 3 పేపర్లలోనూ ప్రిపరేషన్‌ సమాంతరంగా సాగించాలి. పాఠ్యాంశాల వారీగా సిద్ధమవుతూ ఆబ్జెక్టివ్‌ ధోరణిలో ప్రతి అంశాన్నీ ఆలోచించడం అవసరం. ప్రతి పేపర్‌లోనూ కనీసం 50 శాతం ప్రిపరేషన్‌ ముగిసిన తరవాత ప్రామాణికమైన నమూనా ప్రశ్నల్ని, ఏపీపీఎస్సీ గత ప్రశ్నపత్రాల్ని సాధన చేయాలి. చదివిన సిలబస్‌లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాల్ని ఎంత కచ్చితంగా గుర్తించారో సరిచూసుకోవాలి.
తప్పుల శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఎందుకలా జరుగుతోందో సమీక్షించుకోవాలి. వాస్తవాల ఆధారిత ప్రశ్నల్లో ఎక్కువ తప్పులు వస్తుంటే ప్రధానాంశాల ప్రిపరేషన్‌ను అవసరమైతే కొంత బట్టీ ధోరణిలోకి మార్చాలి. విశ్లేషణాత్మక ప్రశ్నల్లో వెనకబడివుంటే ఆయా విషయాల్లోని భావనలను మరొక్కసారి పరిశీలించుకోవాలి. ఎక్కువశాతం ప్రశ్నలు అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టుగా అన్పిస్తే మాత్రం చదువుతున్న పుస్తకాలను మార్చాలి!
'సీనియర్లతో పోటీపడగలమా?'
పాత, కొత్త అభ్యర్థులకు గ్రూప్‌-2 ఒకే పరీక్ష ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో తాజా అభ్యర్థులు తాము పోటీపడగలమా అనే భావనకు గురవుతున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో సత్తా కలిగిన అభ్యర్థులు 5 లేదా 6 నెలలు కష్టపడి మంచి ర్యాంకులు సాధించిన సంఘటనలు ఎక్కువే ఉన్నాయి. ఎగ్జామ్‌ ఓరియంటేషన్‌, భావనలపై అవగాహన, ప్రామాణిక సమాచారం, గ్రహణశక్తి, అన్వయ దృక్పథం మొదలైనవి విజయంపై ప్రభావం చూపుతాయి. ఈ లక్షణాల్ని అలవర్చుకుంటే వారు సీనియర్‌ అయినా, జూనియర్‌ అయినా గెలుపు సాధించగలరు.
సీనియర్‌ అభ్యర్థుల సంగతి?
గత మూడు సంవత్సరాలుగా ఇదే పరీక్షకు అగమ్యగోచరంగా చదువుతూ ఉండటంతో కొంత నిరాశ ఏర్పడి ఉంటుంది. 'చాలామంది పరీక్ష తేదీలు వచ్చాక చూసుకోవచ్చులే' అని తాత్కాలిక విరామం ప్రకటించారు. తాబేలు- కుందేలు కథ మాదిరిగా దెబ్బతినకుండా ఉండాలంటే వీరు అప్రమత్తంగా ఉండాల్సిందే!
గత మూడేళ్ళలో ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విషయాల్లో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా ఎకానమీ అంశాల్లో విస్తృత సమాచారం అందుబాటులోకి వచ్చింది. తాజా అభ్యర్థుల పోటీ నిర్లక్ష్యం చేయదగ్గది కాదు. పూర్తిగా పుస్తకాలు అటకెక్కించవద్దు. పీజీ/బ్యాంక్‌ మొదలైన పరీక్షలకు సిద్ధమవుతున్నా నిత్యం 2, 3 గంటల సమయాన్ని గ్రూప్స్‌కి వెచ్చించడం సముచితం.
గ్రూప్‌-1, 2... పరస్పర ఆధారితాలు
ఏదో ఒక పరీక్షనే అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకోకుండా, రెండింటికీ సిద్ధమవటం మెరుగైన ఫలితాలనిస్తుంది. రెంటిలోనూ కామన్‌గా 30 శాతం ప్రశ్నలున్నాయి. వాటిని ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌ కోణంలో చదవాలి.
భారత్‌ జట్టు క్రికెట్‌ ప్రపంచకప్‌ రెండోసారి గెలవడానికి 28 సంవత్సరాలు పట్టింది. అనివార్యమైన నిరీక్షణను సహనం, పట్టుదలతో అధిగమిస్తేనే అంతిమ విజయమని గ్రూప్స్‌ అభ్యర్థులూ గుర్తించాలి!




సరైన సన్నద్ధత
కడమిక్‌ పరీక్షల్లో 80, 90 శాతం మార్కులు సాధించామనే ధీమాను పోటీ పరీక్షల విషయంలో అన్వయించలేము. అకడమిక్‌ పరీక్షల్లో ఛాయిస్‌ విధానం, ముఖ్యమైన పాఠ్యాంశాలు మొదలైన అనుకూలతలుంటాయి. గ్రూప్‌- 2 లాంటి ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ఏ చిన్న అంశంపైనయినా ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి సమూలమైన అధ్యయనం కీలకపాత్ర పోషిస్తుంది. సమూలమైన అధ్యయనం అంటే... సిలబస్‌లో ప్రాథమిక భావనలు, విశ్లేషణ, ప్రాధాన్యం, అడ్వాన్స్‌డ్‌ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేయడం.
ఈ ప్రతి విభాగంలోనూ వాస్తవాల, భావనాధార ప్రశ్నలు ఉంటాయని గుర్తించి అధ్యయనం చేయాలి.
1: ప్రతి పాఠ్యాంశంలోని మౌలిక విషయాలపై పట్టును సాధించాలి.
2: ప్రతి పాఠ్యాంశంలోని కోర్‌ (ప్రాధాన్య) అంశాలపై దృష్టి నిలపాలి.
(ఈ రెంటిపై గట్టి పట్టు సాధించిన అభ్యర్థి 50 శాతం పైన మార్కులు సాధించగలుగుతారు.)
3: ప్రతి పాఠ్యాంశంలోని విశ్లేషణాత్మక ప్రశ్నలు, అడ్వాన్స్‌ సబ్జెక్టు విషయాల్ని అధ్యయనం చేయాలి.
నమూనా పరీక్షల్లో తప్పుల శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఎందుకలా జరుగుతోందో సమీక్షించుకోవాలి. విశ్లేషణాత్మక ప్రశ్నల్లో వెనకబడివుంటే ఆయా విషయాల్లోని భావనలను మరొక్కసారి పరిశీలించుకోవాలి. ఎక్కువశాతం ప్రశ్నలు అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టు అన్పిస్తే మాత్రం చదువుతున్న పుస్తకాలను మార్చెయ్యాలి!

పీఎస్‌ఎల్‌వీ విజయవంతం

 పీఎస్‌ఎల్‌వీ విజయవంతం
కక్ష్యలోకి మూడు ఉపగ్రహాలు
వీటిలో రెండు విదేశాలవి
సహజవనరుల అధ్యయనంలో
ఉపయోగపడనున్న రిసోర్స్‌శాట్‌-2


వ్యయం
పీఎస్‌ఎల్‌వీ-సి16 తయారీకి రూ.95 కోట్లు, మూడు ఉపగ్రహాలకు రూ.135 కోట్లు. మొత్తం ఖర్చు రూ.230 కోట్లు.

రిసోర్స్‌శాట్‌-2
2003లో ఇస్రో ప్రయోగించిన రిసోర్స్‌శాట్‌-1 స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది.
బరువు: 1206 కిలోలు, జీవితకాలం: ఐదేళ్లు, భ్రమణ సమయం: 101.35 నిమిషాలు, ఒక్క రోజుకు భ్రమణాలు: 14
ఉపయోగం: వ్యవసాయం, జలవనరులు, గ్రామీణాభివృద్ధి, జీవ ఇంధనాలు తదితర రంగాలకు సేవలు. పంటల నాణ్యత, అటవీసాంద్రత, సరస్సులు, రిజర్వాయర్లలో ఉన్న నీటిస్థాయి గుర్తింపు. సముద్రాల్లోని నౌకల స్థానం, వేగం తదితర సమాచారాన్ని ఈ వ్యవస్థ గుర్తిస్తుంది.
ఈ ఉపగ్రహం అందించే ఫొటోలు మరో 15 దేశాలకు ప్రయోజనం.

యూత్‌శాట్‌
ఈ ఉపగ్రహాన్ని భారత-రష్యా సంయుక్తంగా రూపొందించాయి.
బరువు: 92 కిలోలు, జీవితకాలం: రెండేళ్లు, భ్రమణ సమయం: 101.35 నిమిషాలు, ఒక్క రోజుకు భ్రమణాలు: 14
ఉపయోగం: నక్షత్రాలు, వాతావరణ అధ్యయనంలో పరిశోధక విద్యార్థులకు తోడ్పాటు.

ఎక్స్‌-శాట్‌
ఇది సింగపూర్‌కు చెందిన మొట్టమొదటి ఉపగ్రహం. బరువు : 106 కిలోలు.
ఉపయోగం: రిమోట్‌సెన్సింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాల పరీక్షించడానికి.


ఆ మాటలే గెలిపించాయి


మనసులో మాట
ఆ మాటలే గెలిపించాయి
డిగ్రీ చదువు... గుమాస్తా ఉద్యోగం... ఐదేళ్ల కిందట ఓ కుర్రాడి గురించి ఈ మాటలు చాలు. మరిపుడు అతడు డిప్యూటీ తహశీల్దార్‌. ఓ గుమాస్తా, ప్రభుత్వాధికారిగా ఎలా మారాడు?
'మస్తే సర్‌' ఈ పదం వింటే నా గతం గుర్తొస్తుంది. సినిమా రీళ్లలా పాత జీవితం కళ్లముందు మెదుల్తుంది. ప్రేమను పంచే అమ్మ... ఒకే తనువులా మెదిలే ఫ్రెండ్స్‌... అప్పుడప్పుడు వాళ్లతో చేసుకొనే పార్టీలు... ఇవంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేనేనాడూ వూరిని వదల్లేదు. ఆఖరుకు 'ఉద్యోగం ఇప్పిస్తా' అని ఓ బంధువు చెప్పినా. కానీ బండి నడవాలంటే ఇం'ధనం' కావాలిగా. అందుకే ఓ షాపులో గుమాస్తాగా చేరా.
'నీకన్నా చిన్నవాళ్లకు పెళ్లిళ్లు అవుతున్నాయ్‌... నువ్వెపుడు చేసుకుంటావురా?' అమ్మ అడిగిందోరోజు. 'తొందరేముందిలే' అన్నా మనసులో నాకూ చేసుకోవాలనే ఉంది. ఆ ఆలోచనలే పదేపదే ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే రజని (పేరు మార్చాం) గుర్తొచ్చింది. మంచితనం, కలుపుగోలుతనంతో కుందనపు బొమ్మలా ఉండేది. ఈ సంగతి స్నేహితులతో చెబితే 'సూపర్‌ సెలెక్షన్‌ మామా' అన్నారు. వాళ్లిచ్చిన ధైర్యంతోనే నేరుగా రజని నాన్న దగ్గరికెళ్లి మాట్లాడా. ఎప్పుడూ ప్రేమగా పలకరించే తను ఇంతెత్తున లేచాడు. 'కూలీ కొడుకుతో నా కూతరు పెళ్లేంట్రా?' అంటూ వూగిపోయాడు. మా కుటుంబం గురించి నానా మాటలన్నాడు.
నిజమే... మా అమ్మ ఒకప్పుడు కూలీనే. కానీ ఇప్పుడు కాదు. పదిహేనేళ్ల కిందట నాన్న చనిపోతే కూలీ పనులు చేసి అక్కను, నన్నూ పెంచింది. ఇప్పుడు నా సంపాదనతో మేం సంతోషంగా బతుకుతున్నాం. ఇంకో వ్యక్తి అదనంగా చేరినా మాకొచ్చే ఇబ్బందేం లేదు. అయినా కూలీ పనులు చేయడం తప్పేం కాదుగా? దానికే ఇంతలా అవమానించడం తట్టుకోలేకపోయా. ఇన్నిమాటలు అన్న తనే 'శెభాష్‌' అనేలా మంచి ఉద్యోగం సాధించాలనే కసితో హైదరాబాద్‌ బయల్దేరా.
ఉద్యోగం, డబ్బు సంపాదించడం అనుకున్నంత సులువేం కాదని తొందరగానే అర్థమైంది. 'కొలువు ఇప్పిస్తా'నన్న బంధువు మొహం చాటేశాడు. చేసేదిలేక ఓ స్నేహితుడి రూంలో దిగా. ఇరుకు గదిలో ఇంకో నలుగురితో నేను. 'ఇంత జనమేంటి?' అంటూ ఓనర్‌ రోజూ తిట్టేవాడు. చివరకో స్నేహితుడి సలహాతో సాఫ్ట్‌వేర్‌ కోర్సులో చేరా. కోర్సులు పూర్తయ్యాయి... డబ్బులు కరిగిపోయాయి... ఉద్యోగం మాత్రం రాలేదు. ఓ సంస్థను నమ్మి పెద్దమొత్తంలో డబ్బులు కడితే వాళ్లూ మోసం చేశారు. ఒక్కోసారి బస్‌ఛార్జీలు మిగుల్తాయని కిలోమీటర్ల కొద్దీ నడిచేవాణ్ని. ఇవన్నీ గుర్తొస్తుంటే ఆవేశంతో సిటీకొచ్చి తప్పు చేశానేమో అనిపించేది.
అప్పుడే నా ధైర్యాన్ని పెంచే టానిక్‌లా గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ వెలువడింది. దాంతో నా లక్ష్యమేంటో స్పష్టంగా అర్థమైంది. ఈసారి అవసరాల కోసం అమ్మ నగలు కరిగిపోయాయి. ఆర్నెళ్లు వంచిన తల ఎత్తకుండా చదివా. నా కష్టం, అమ్మ పూజలు ఫలించాయి. డిప్యూటీ తహశీల్దారుగా మా జిల్లాలోనే పోస్టింగ్‌ దక్కింది. ఏడాది కిందట లక్ష్మితో పెళ్త్లెంది. తను నాతో కలిసి కోచింగ్‌ తీసుకుంటున్నపుడు పరిచయం. నా పరిస్థితి తెలుసుకొని ఆర్థిక సాయం చేసేది. ఇప్పుడు మాకో పాప. జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. అప్పుడప్పుడు వూరెళ్తే 'ఏం బాబూ బాగున్నావా?' అంటూ పలకరిస్తాడు రజనీ వాళ్ల నాన్న. అలా అంటున్నపుడు ఆయన కళ్లల్లో పశ్చాత్తాపం. నాకు మాత్రం తనను చూసినప్పుడల్లా కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఎందుకంటే నేనీస్థాయిలో ఉండటానికి కారణం తనే కాబట్టి.
- శ్రీ

అన్నా హజారే ఎవరు..? ఎందుకీ ఆమరణ నిరాహార దీక్ష..!?

అన్నా హజారే ఎవరు..? ఎందుకీ ఆమరణ నిరాహార దీక్ష..!?
 అవినీతిపై అహింసా అస్త్రాన్ని సంధించి ఆమరణ నిరాహార దీక్షకు ఉపకరించిన ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే గురించి తెలుసుకోవాల్సిన పది విషయాలు...

1. అసలు అన్నా హజారే ఎవరు..?
ఓ మాజీ ఆర్మీ వ్యక్తి. 1965 భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన వీరుడు.

2. అతనిలో అంత ప్రత్యేకమైన అంశం ఏంటి..?
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో రాలేగావ్ సిద్ధి అనే గ్రామాన్ని నిర్మించారు.

3. అయితే ఏంటి..?
ఈ గ్రామం పూర్తిగా స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడినది. ఇక్కడి విద్యుత్‌ను కూడా గ్రామస్తులే స్వంతంగా.. సౌరశక్తి, జీవ ఇంధనం, పవన విద్యుత్‌ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. 1975లో ఈ గ్రామం అత్యంత దారిద్ర్యంతో అలమటించేది. కానీ ఈ గ్రామం ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా ఎదిగి దేశానికే ఆదర్శంగా నిలిచింది.

4. సరే,....?
ఈ వ్యక్తి (అన్నా హజారే) చేసిన సామాజిక సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇతనిని ప్రతిష్టాత్మకమై "పధ్మ భుషన్" అవార్డుతో సత్కరించింది.

5. నిజంగానా, అయితే ఇతను దేనికోసం పోరాటం చేశారు..?
భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని పారద్రోలేందుకు చట్ట సవరణలు చేయాలని పోరాటం చేస్తున్నారు.

6. మరి ఇదెలా సాధ్యమవుతుంది..?
లోక్ పాల్ బిల్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులు, ఉన్నత ప్రభుత్వాధికారులను స్వతంత్రంగా విచారించి అవినీతిపరులకు సాధారణ కోర్టుల కన్నా అత్యంత వేగంగా శిక్ష పడేలా చేయటం ఈ బిల్లు ప్రత్యేకత. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చాలా కాలం నుంచి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

7. ఇది పూర్తిగా కొత్త విషయమే కదా..?
కాదు.. 1972లోనే ఈ బిల్లును ప్రతిపాదించడం జరిగింది. అప్పటి న్యాయశాఖ మంత్రి శాంతి భూషన్ ఈ బిల్లును ప్రతిపాదించారు. కానీ మారుతున్న ప్రభుత్వాలు మాత్రం దీనిని పక్కకు నెట్టేస్తూ వచ్చాయి. కొందరు అవినీతి రాజకీయ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ బిల్లును మార్చాలని కూడా ప్రయత్నించారు. ఈసారి ఎలాగైన ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించేలా చేయాలని హజారే నడుం బిగించారు. యువత కూడా భారీగానే ఆయనకు తమ మద్దతు తెలుపుతున్నారు.

8. ఓహో.. అలాగా... మరి అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది ఆ బిల్లు పూర్తిగా అమలయ్యేలా చేయడానికన్నమాట..! మరి ఇంత తక్కువ సమయంలో అదెలా సాధ్యమవుతుంది..?
హజారే మొదటిగా అడుగుతున్నదేంటంటే.. ఈ బిల్లును ఆమోదిస్తానని ప్రభుత్వం ముందు రావాలి. తర్వాత లోక్ పాల్ బిల్లును డ్రాఫ్ట్ చేయడానికి.. 50 శాతం ప్రభుత్వం తరఫు నుంచి, 50 శాతం ప్రజల తరఫు నుంచి కూడిన సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఓ సంయుక్త కమిటీని (జాయింట్ కమిటీని) ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వాన్ని నమ్మడం అసాధ్యం. అలా చేస్తే ప్రభుత్వంలో ఉన్న కొందరు అవినీతిపరులు చట్టం కళ్లు కప్పి తప్పించుకునే ఆస్కారం ఉంది.

9. బావుంది, ఈ బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుంది..?
లోక్ పాల్ బిల్లు పాస్ అయితే కేంద్రం ఓ "లోక్ పాల్‌"ను ఎన్నుకోవడం జరుగుతుంది. అతనికి పూర్తి స్వతంత్రాధికారాలు ఉంటాయి. ఉదాహారణకు భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) మాదిరిగా అన్నమాట. ప్రతి ఒక్క స్థాయిలోనూ లోకాయిక్తను నియమించడం జరుగుతుంది. ఒక్క ఏడాదిలోపు అవినీతిపరులందరనీ విచారించడం జరుగుతుంది. మరో ఏడాదిలోగా సదరు అక్రమార్కులను శిక్షించడం జరుగుతుంది. భోఫోర్స్ కుంభకోణం, భోఫాల్ గ్యాస్ విషాదం వంటి కేసుల్లో మాదిరిగా 25 ఏళ్ల పాటు విచారణ జరిపి చిన్న చిన్న శిక్షలు విధించ కుండా ఉండాలంటే ఈ బిల్లు పాస్ అవ్వాల్సిందే. ఈ బిల్లు పాస్ అయితే.. రెండేళ్లలోపే అవినీతిపరులు ఊచలు లెక్కబెడతారన్నమాట.

10. అతను ఒక్కడేనా..? అన్నా హజారేతో ఈ పోరాటంలో మరెవరూ లేరా..?
ఎందుకు లేరు... మాజీ ఐపిఎస్ కిరణ్ బేడి, ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, ఆర్‌టిఐ విప్లవవేత్త అరవింద్ కెజ్రివాల్‌ కూడా ఆయనకు తోడుగా నిలిచారు. అంతేకాకుండా.. అశేష భారతావని జనం ఆయనకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

సరే అర్థమైంది. మరి నేనేం చేయగలను..?
అవీనితిపై జరుగుతున్న ఈ పోరాంటంలో పాల్గొందాం. అన్నా హజారేకు మన మద్దతు ప్రకటిద్దాం. కనీసం ఈ సందేశాన్నైనా మీ మిత్రులు శ్రేయోభిలాషులకు చేరవేద్దాం. అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం. భావిసమాజానికి బాటలు వేద్దాం. మన తర్వాతి తరమైన హాయిగా గుండెలపై చేయి వేసుకొని నిద్రేంచేలా చేద్దాం..!