గ్రూప్‌-1 మెయిన్స్‌... విజయ వ్యూహం!

గ్రూప్‌-1 మెయిన్స్‌... విజయ వ్యూహం!

కొడాలి భవానీ శంకర్‌
రాష్ట్రంలోని అత్యుత్తమ సర్వీస్‌ గ్రూప్‌-1. ఈ నియామక పరీక్ష ప్రిలిమినరీ పూర్తయింది. తర్వాతి ఘట్టం... మెయిన్స్‌! రాబోయే కొద్దినెలల సమయాన్ని మెయిన్స్‌ ప్రిపరేషన్‌ కోసం వ్యూహాత్మకంగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే కోరుకున్న ఉద్యోగం సాధించవచ్చు!

పరీక్షకయినా 'సొంత నోట్సు' చేసే మేలు చాలా ఎక్కువ. ముఖ్యంగా సొంత నోట్సు వల్ల విషయం బాగా జ్ఞాపకం ఉంటుంది. అయితే సొంతనోట్సు తయారుచేసుకోవాలా, లేదా అనేది లభించే సమయాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఫిబ్రవరి, మార్చిల్లో పరీక్షలుంటే సొంతనోట్సు జోలికి పోవద్దు. దీనికంటే కచ్చితంగా ప్రశ్నలు రావటానికి అవకాశం ఉన్న పాఠ్యాంశాలు ఎంచుకుని, వాటికి సొంతనోట్సు రాసుకోవచ్చు. ఒకవేళ, దీనిక్కూడా సమయం అనుకూలంగా లేకపోతే ప్రామాణిక మెటీరియల్‌ ఒకదాన్ని తీసుకుని, అదనంగా కొంత సమాచారం జోడించుకుని సిద్ధమవ్వటం మంచిది. పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారం సేకరించుకునేందుకు తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాల పాఠ్యగ్రంథాలు, ప్రభుత్వ అధికార ప్రచురణలు మొదలైనవాటిపై ఆధారపడటం ఉత్తమం. మార్కెట్లో దొరికే ప్రతి సమాచారం గుప్పిస్తే పొంతన కుదరకపోయే ప్రమాదముంది.
చాయిస్‌ ప్రిపరేషన్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రతి అధ్యాయంలోనూ కొన్ని కీలకాంశాలూ; కొన్ని అప్రాధాన్యమైవనీ ఉన్నాయి. కీలకమైనవాటిపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలి. అప్రాధాన్య అంశాలపై కూడా స్థూల అవగాహన పెంచుకుంటే ఇబ్బందేమీ ఉండదు. ఈ విధంగా కొంత సిలబస్‌ను వదిలివేయడం ద్వారా లభించే సమయాన్ని సద్వినియోగం చేసుకుని, మంచి మార్కులు సాధించవచ్చు.
ఐదు పేపర్లకూ సమయాన్ని ఎలా కేటాయించుకోవాలనేది చాలామంది అభ్యర్థుల్లో సందేహం. దీనికి మూడుపద్ధతులున్నాయి గానీ, ప్రతిదాంట్లోనూ లాభనష్టాలు కనిపిస్తాయి.
పద్ధతి 1: మొత్తం సమయాన్ని 5 పేపర్లకూ 5 భాగాలుగా విభజించుకోవాలి. దాని ప్రకారం సిలబస్‌ అధ్యయనం, పునశ్చరణ (రివిజన్‌) ఆ సమయంలో పూర్తిచేసుకోవాలి.
లాభం: ఒక సబ్జెక్టును పూర్తిగా చదివిన తృప్తి, పునశ్చరణ చేసిన నమ్మకం ఏర్పడతాయి.
నష్టం: మొదట్లో చదివిన సమాచారంపై పట్టును పరీక్ష జరిగే సమయానికి కోల్పోయే ప్రమాదం అధికం. విస్మృతి ప్రభావం ఉంటుంది.
పద్ధతి 2: పట్టు దొరకని పేపర్లకు మొదట్లో లభించే కాలాన్ని అధికంగా కేటాయించి, పట్టు ఉన్న పేపర్లకు పరీక్షకు ముందు కొంత సమయాన్ని కేటాయించటం.
లాభం, నష్టం: మొదటి పద్ధతిలోని లాభనష్టాలే దీనికీ వర్తిస్తాయి.
పద్ధతి 3: ప్రతిరోజూ అన్ని పేపర్లకూ సమయం కేటాయించటం. ఆ రోజే వాటి అధ్యయనం, పునశ్చరణా పూర్తిచేయటం.
లాభం: అన్ని సబ్జెక్టుల్లో అభ్యర్థికి నిరంతర కొనసాగింపు ఉంటుంది. ఒకే సబ్జెక్టు చదవటం వల్ల వచ్చే విసుగు నుంచి బయటపడవచ్చు.
నష్టం: ఏ ఒక్క సబ్జెక్టూ పూర్తయిన సంతృప్తి ఉండదు. ఆత్మవిశ్వాసం త్వరగా కలగదు. 'చేస్తున్న పని సరైందేనా?' అనే ఇబ్బంది ఉంటుంది.
వీటిలో మూడో పద్ధతి ఎక్కువ అనుకూల ఫలితాన్నిస్తుంది. కొద్దిపాటి నమ్మకం, సహనంతో ఈ తరహా అధ్యయనం, పునశ్చరణలను కొనసాగించవచ్చు.
మరో విషయం- అన్ని పేపర్లకూ 'సమం'గా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి ఒక పేపర్‌కు అధిక సమయం, మరో పేపర్‌కి తక్కువ సమయం కేటాయించవచ్చు.
స్కోరింగ్‌-నాన్‌ స్కోరింగ్‌ సబ్జెక్టులు
సబ్జెక్టు స్వభావరీత్యా కొన్ని పేపర్లకు ఎక్కువ మార్కులూ, కొన్ని పేపర్లకు తక్కువ మార్కులూ వస్తాయి. 'పళ్ళున్న చెట్టుకే రాళ్ళదెబ్బలు' కాబట్టి, స్కోరింగ్‌ పేపర్లలోనే ఎక్కువ మార్కులు 'లాగెయ్యా'లనుకుంటూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. కొన్ని పేపర్ల పైన అనవసరంగా వ్యతిరేకత పెంచుకుంటారు. విజయం సాధించాలంటే అన్ని పేపర్లలోనూ గరిష్ఠ మార్కులు తప్పనిసరి.


స్కోరింగ్‌ పేపర్లో కీలకమైన పోటీదారులు అందరికీ ఒకే స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పేపర్‌-2,3లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టటం ద్వారా అంతిమ ఫలితాల్లో ర్యాంకింగ్‌ని మెరుగుపరచుకోవచ్చు కూడా. సూక్ష్మ- స్థూల సంసిద్ధత
పేపర్‌-2,3,4,5 లలో 1 మార్కు ప్రశ్న నుంచి 10 మార్కుల ప్రశ్నల వరకూ ఏ రూపంలోనైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 2008లో జరిగిన పరీక్షను బట్టి ఈ ధోరణి పేపర్‌-4లో బాగా ఎక్కువ కనిపించింది. అందువల్ల అభ్యర్థులు ఏ పాఠ్యాంశం చదువుతున్నప్పుడైనా '1 మార్కు ప్రశ్న వస్తే ఎలా రాయాలి?', '2 మార్కులకు వస్తే రాయాలి'? '10 మార్కులకు ఇస్తే జవాబును ఎలా తీర్చిదిద్దాలి?'- ఈ విధమైన సూక్ష్మ-స్థూల (మైక్రో-మాక్రో) ప్రిపరేషన్‌పై దృష్టి బాగా పెట్టాలి.
* ఆవరణ వ్యవస్థ అంటే ఏమని అర్థం చేసుకున్నావు? (1 మార్కు)
* తెలంగాణాలో గ్రంథాలయ ప్రాముఖ్యం అంచనా వేయండి (10 మార్కులు)
* ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలకు సంబంధించిన ప్రధాన చట్టాలు ఏమిటి? (5 మార్కులు)
* భారతదేశంలోని వివిధ జలావరణ వ్యవస్థలను ఉదాహరించండి (2 మార్కులు)
విభిన్నత్వం- నవ్యత
గ్రూప్స్‌ అభ్యర్థుల్లో కొద్దిమంది మాత్రమే సిలబస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ సిద్ధమవుతున్నారు. ఎక్కువమంది రెడీమేడ్‌ మెటీరియల్‌, కోచింగ్‌ మెటీరియల్‌పై ఆధారపడుతున్నారు. ఇలాంటి అభ్యర్థుల పేపర్లను దిద్దుతున్నపుడు పరీక్ష దిద్దేవారు బోర్‌గా ఫీలవుతారు. దానితో మార్కులు తగ్గే అవకాశం ఏర్పడుతోంది. ప్రతి సమాధానంలోనూ అవే ఉదాహరణలూ, అంకెలూ, కొటేషన్లూ చూడగానే దిద్దేవారికి ఒకరకమైన నిరుత్సాహం కలుగుతుంది.
రెడీమేడ్‌ మెటీరియల్‌పై ఆధారపడుతున్నా అదనంగా నూతన అంశాలను పొందుపర్చుకుని నవ్యత, విభిన్నత్వం ప్రదర్శించే శక్తిని పొందేలా ప్రస్తుత ప్రిపరేషన్‌ ఉండాలి. అలా అని పూర్తిస్థాయిలో 'కొత్తదనం' ప్రదర్శించాలని ప్రయత్నిస్తే అభ్యర్థి ఇచ్చే సమాచారంపై దిద్దేవారికి సందేహం కలగవచ్చు. ఇది మరీ ప్రమాదం. మంచి మార్కులు సాధించాలంటే ప్రామాణిక పుస్తకాల సమాచారంపై ఆధారపడుతూనే నవ్యతను అందించే ప్రయత్నం చేయాలి.
ప్రశ్న చివర గమనించండి
మెయిన్స్‌ పరీక్షలో ప్రశ్నల చివర 'విశ్లేషించండి', 'సమీక్షించండి', 'వివరించండి', 'సమర్థించు', 'వ్యతిరేకించు', 'వ్యాఖ్యానించు' మొదలైన అంత్య పదాలుంటాయి. ఈ ట్యాగ్స్‌ను సమాధానం రాసేందుకు వేదికగా గుర్తించాలి.
2008 గ్రూప్‌-1లో ప్రశ్నలు:
* ఆధునిక భారత దేశంలో తలెత్తిన ముఖ్య రైతు ఉద్యమాలు, వాటి ప్రధాన లక్షణాలను సమీక్షించండి.
* శాసనసభల్లో దిగజారుతున్న పోకడలను గురించి వ్యాఖ్యానించుము.
* ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ నిర్మాణం, వృద్ధిని పరిశీలించుము.
* మేధో సంపత్తి ఉత్పత్తి, నిర్వహణ యొక్క జాతీయ విధానాన్ని చర్చించండి.
* భారతదేశంలోని అడవుల రకాలను గురించి విశదీకరించుము.
ప్రతి ట్యాగ్‌లోని విభిన్నతను గుర్తించి దానికి అనుగుణంగా జవాబు రాయటం విజయానికి దోహదపడుతుంది. దీనికి తగ్గట్టుగానే ప్రిపరేషన్‌ ఉండాలి.
అనుసంధానం గుర్తించండి
పేపర్‌-1లోని వ్యాసాలను రెడీమేడ్‌ పుస్తకాల నుంచి చదవకుండా 2,3,4 పేపర్లలోని సిలబస్‌తో అనుసంధానం చేసుకుని రాయటం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది.
పేపర్‌-2: 1773-1947 మధ్య జరిగిన వివిధ పరిణామాలను వ్యాసంలో చారిత్రకంగా పరిశీలించండి- అని అడిగితే ఉపయోగపడతాయి. * సమస్య పరిష్కారంలో రాజ్యాంగం ఏం చెబుతోంది?
పేపర్‌-3: వివిధ సాంఘిక సమస్యల్లోని ఆర్థిక కోణం ప్రదర్శించవచ్చు. * ఏపీ సంబంధిత వ్యాసంలో ఏపీ ఎకానమీ ఉపయోగం.
పేపర్‌-4: కరువులు, వరదలు, కాలుష్యం, ఆహార భద్రత, మానవ వనరుల నిర్మాణం, అంతరిక్ష పరిశోధనలు, పర్యావరణం మొదలైన వ్యాసాల్లో ఉపయోగం.


No comments:

Post a Comment