పోటీ తక్కువే… పోరాడితే గెలుపే!
మొదట గ్రూప్-1 టాపిక్స్‌లో ఏది ఇంకా అర్థం కాలేదో పేపర్‌వారీగా ఒక అంచనాకు రండి. అలా అర్థం కాని టాపిక్‌ను ఛాయిస్ కింద వదిలేసే అవకాశం ఉన్నదా అని గమనించండి. ఆ అవకాశముంటే ప్రత్యామ్నాయంగా ఉన్న టాపిక్‌పై మీ పట్టు ఎంతో ఒకసారి సమీక్షించండి.
* ఛాయిస్ కింద వదిలేసే అవకాశం లేకపోతే మరోసారి క్షుణ్ణంగా పునశ్చరణ (రివిజన్) చేయండి. ఎక్కువ సమయం వెచ్చించకండి. ఇలాంటి టాపిక్స్ అన్నిటినీ పేపర్‌వారీగా జాబితాగా రాసుకొని, సంబంధిత పరీక్ష ముందురోజున పునశ్చరణ చేయండి. ఫలితముంటుంది.
* కచ్చితంగా వచ్చే అవకాశాలున్న టాపిక్స్ జాబితా రాయండి. వీటిని క్రమబద్ధంగా పునశ్చరణ చేయండి. ఈ మూడు రోజుల ప్రిపరేషన్ తర్వాత ఇక చూడాల్సిన అవసరం లేని టాపిక్స్‌ను వదిలేసి; పరీక్ష రోజు కూడా రివిజన్ చేయాల్సినవాటి జాబితా రాసుకోండి. ఇందువల్ల సమయం వృథా కాకుండా పరీక్ష రోజున అవసరమైన అంశాలపైనే దృష్టి నిలపవచ్చు.
*ఆ 3 రోజుల్లో వివిధ పేపర్ల మధ్య అనుసంధానంగా ఉన్న అంశాలను చదివితే మొత్తమ్మీద మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు… వ్యాస పరీక్షను ఎదుర్కొనేందుకు పేపర్-3లోని మూడో యూనిట్ టాపిక్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వ్యాసరచన ప్రిపరేషన్లో భాగంగా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ అంశాలు ఏవైతే ఉంటాయో… వాటిపై దృష్టి సారించండి.
* మహిళా సాధికారత, మానవ వనరుల నిర్మాణం, గ్రామ సాధికారత లాంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే సమాచార సాంకేతికత, ప్రజారోగ్యం, ఆం.ప్ర. పథకాలు లాంటివి ఉదాహరించాల్సిందే కదా! అందువల్ల ఇలాంటి అంశాలపై దృష్టి నిలిపితే ఈ మూడు రోజులనూ సద్వినియోగం చేసుకున్నట్లే.
* రైటింగ్ సాధనలాంటివి ఈ దశలో పెట్టుకోకండి.
* పాత గణాంక సమాచారం బదులుగా సాధికారికంగా వెలువడిన నూతన గణాంకాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి.
* చివరిగా వర్తమాన వ్యవహారాల రివిజన్ చేయండి. వివిధ దినపత్రికల్లో వచ్చిన టాపిక్స్ అన్నిటినీ పేపర్‌వారీగా విభజించుకొని, ఆయా పరీక్షల ముందురోజున ఓ సారి చూసుకోవాలి.
* అనేక పుస్తకాలను ఈ దశలో రిఫరల్‌బుక్స్‌గా చదవకుండా స్టాండర్డ్ సమాధానాలున్న పుస్తకాన్నే రివిజన్ చేయండి. సొంతనోట్సు తయారుచేసుకుని ఉంటే ఆ నోట్సుకే పరిమితమవ్వటం ఉత్తమం.
* కొత్త పుస్తకాలు, కొత్త సమాధానాలను చదవొద్దు. ఈ దశలో మీ కర్తవ్యం- ఉన్నదాన్నే మరింత బలీయంగా చేసుకోవటం, అదే లక్ష్యంతో ముందుకువెళ్ళటం. కొత్త పాయింట్లు తగులుతాయేమోననే ఆలోచనతో ఉన్న సబ్జెక్టును చెడగొట్టుకోవద్దు.
* డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో అన్ని రకాల సమస్యల సాధనలో ఉన్న స్టెప్స్‌ను, షార్ట్‌కట్స్‌ను ఒక్కసారి పరిశీలించండి. ఈ దశలో సాధనకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. దీనికి సమయం కేటాయిస్తే మిగతా ప్రిపరేషన్ దెబ్బతినే ప్రమాదముంది.
* వ్యాసరచన అంశాలను ఒక్కసారి సమీక్షించుకోండి. అభ్యాసం కోసం చిత్తుప్రతిని తయారుచేసుకోండి. చిత్తుప్రతులనూ, వ్యాఖ్యానాలనూ, గణాంకాలనూ పైపైన పునశ్చరణ చేయండి. గంటల తరబడి ఒక్కో వ్యాసానికి సమయం కేటాయించే పద్ధతిని వదిలేయండి.
* ఇప్పటివరకూ ఇంగ్లిష్‌ను పట్టించుకోనివారు దానిపై దృష్టి నిలపండి. క్వాలిఫైయింగ్ పేపర్ అనే ఆలోచన, అతి విశ్వాసం మొదలైన కారణాలతో ఇంగ్లిష్‌ను నిర్లక్ష్యంగా వదిలేయకుండా వివిధ అంశాల్లోని ముఖ్యాంశాలను గుర్తుచేసుకోండి.
* పరీక్ష కేంద్రం మీ ఊరు కాకపోతే ముందురోజే ఆ కేంద్రానికి చేరిపోండి. కావాల్సిన పుస్తకాలు, ఇతరత్రా సామగ్రిని తీసుకువెళ్ళండి. పరీక్ష కేంద్రాన్ని ముందురోజే ఒకసారి చూసుకోండి.
పరీక్ష రోజుల్లో…
* పరీక్ష సమయానికి అరగంట ముందే హాల్లోకి వెళ్ళనిస్తారు. ఈ సమయంలో ప్రధాన బుక్‌లెట్‌కు మార్జిన్లు కొట్టటం, పేజీలకు సీరియల్ నంబరు వేయటం ముందుగా చేస్తే చివర్లో మీపై ఒత్తిడి తగ్గుతుంది.
* నూతన పరీక్షా విధానంలో అభ్యర్థిలో సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ రెండూ పరిశీలిస్తారు. అందుకని మొత్తం ప్రశ్నను క్షుణ్ణంగా చదవండి. ప్రశ్న తీరును బట్టి ఉపప్రశ్నల వెయిటేజిని నిర్ణయించుకోండి. ఒక మార్కు మాత్రమే ఇచ్చేలా ఉంటే క్లుప్తంగా సమాధానం రాస్తే చాలనే ఆత్మవిశ్వాసంతో రాయండి. ప్రశ్నలోని ఉపప్రశ్నలన్నింటికీ తగిన మోతాదులోనే జవాబు రాయాలి. లేకపోతే సమాధానాల బ్యాలన్స్ పోతుంది. మార్కుల నష్టం వస్తుంది.
* బాగా వచ్చినవి మొదట రాసి, అటుఇటుగా వచ్చినవి చివర్లో రాయాలని తెలిసిందే కదా!
* బాగా తెలిసిన సమాధానాన్ని ఎక్కువ రాసే ధోరణి మంచిది కాదు. దీనివల్ల మిగతా ప్రశ్నలకు కేటాయించాల్సిన సమయం తగ్గిపోయి, అంతిమంగా నష్టపోవాల్సివస్తుంది.
* అన్ని ప్రశ్నలకూ (ఛాయిస్ ఉన్నవి మినహా) సమాధానాలు రాయండి. పూర్తిగా సమాధానం తెలియకపోయినా తెలిసినంత వరకైనా రాయండి. ఒక్కమార్కు కలిసివచ్చినా వచ్చినట్టే కదా!
* పరీక్షహాల్లో ఇతరులు ఎక్కువ ఎడిషనల్ పేపర్లు తీసుకుంటున్నారని ఒత్తిడికి గురికావొద్దు. అసలు ఇతరుల గురించి పట్టించుకోవద్దు.
* పరీక్షాపత్రం ‘టఫ్’గా వచ్చినా ఆందోళన పడొద్దు. గ్రూప్స్ నూతన పరీక్షావిధానంలో అందరి ప్రిపరేషన్లోనూ ఎన్నో లోపాలున్నాయి. ‘నేను మాత్రమే తక్కువ ప్రిపేరయ్యాను’ అనే ధోరణి వద్దు. క్లిష్టత అనేది అందరికీ ఒకటే. ఉన్నంతలోనే పోరాటధోరణితో మార్కులు పొందేందుకు ప్రయత్నించండి.
* ఒక పేపర్ బాగా రాయలేదని మిగతా పేపర్లు వదిలేయవద్దు. అన్ని పేపర్లకూ హాజరై మీ వంతు ప్రయత్నం చేయండి.
ఈసారి మెయిన్స్ పరీక్షకు పోటీ బాగా తక్కువగా ఉంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రశాంతంగా పరీక్షలను ఎదుర్కోండి. విజయోస్తు!
కొడాలి భవానీ శంకర్
This entry was posted on September 6, 2008 and is filed under చదువు.
No comments:
Post a Comment