జె.వి.ఎస్. రావు
ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షల్లోని జనరల్‌స్టడీస్‌లో 'మెంటల్ ఎబిలిటీ' (మానసిక సామర్థ్యం) ప్రధానపాత్ర వహిస్తుంది. దీన్నే జనరల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాము. ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు 25 నుంచి 30 వరకు ఉంటాయి. వీటికెలా సిద్ధం కావాలో తెలుసుకుందాం!ఏదైనా ఒక విషయాన్ని వేగంగా అర్థం చేసుకుని, విశ్లేషణాత్మకంగా సమాచారాన్ని పరిశీలించి తగిన నిర్ణయానికి రావడాన్నే మెంటల్ ఎబిలిటీ అంటారు. ఈ విభాగం నుంచి ప్రశ్నలు అడగడంలో ముఖ్య ఉద్దేశం పరిపాలనా విభాగాలలోని ఉన్నతస్థాయి ఉద్యోగాలకు జరిగే ఎంపికలో, పరీక్షలలో అభ్యర్థుల మానసిక సామర్థ్యాన్ని అంచనా వేయడం. అంటే విషయ సమీక్షా పరిజ్ఞానం, మానసిక ఆలోచనాశక్తి, ఊహాశక్తులను పరీక్షించడం. ముఖ్యంగా నాన్ మేథమేటిక్స్ అభ్యర్థులు మెంటల్ ఎబిలిటీ అనగానే వెనుకంజ వేస్తారు. సిలబస్‌పై పూర్తి అవగాహన లేకపోవటం; ప్రిపరేషన్ విధానం తెలియకపోవడమే దీనికి కారణాలు. అందుకేం చేయాలి? సిలబస్‌పై అవగాహన పెంచుకుని, గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. అభ్యాసాలను సాధన చేయాలి. ఇలా మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించాలి. అప్పుడు ఈ విభాగంలోని ప్రశ్నలను సులభంగా, చురుకుగా సాధించవచ్చు.
సిలబస్- ప్రిపరేషన్ తీరు
మెంటల్ ఎబిలిటీ విభాగంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. 1. జనరల్ ఇంటెలిజెన్స్ 2. మేథమేటికల్ ఎబిలిటీ
జనరల్ ఇంటెలిజెన్స్‌ను వెర్బల్, నాన్‌వెర్బల్ అని రెండు భాగాలుగా ఉంటుంది.
ప్రధానంగా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రశ్నల్లో ఎక్కువగా వెర్బల్ రీజనింగ్ నుంచి 15 నుంచి 20 వరకు వస్తున్నాయి. నాన్-వెర్బల్, మేథమెటికల్ ఎబిలిటీ ప్రశ్నలు చాలా తక్కువే. నాన్-వెర్బల్ నుంచి 2, 3 ప్రశ్నలూ, అరిథ్‌మెటికల్ విభాగం నుంచి 2, 3 ప్రశ్నలూ ఇస్తుంటారు.
వెర్బల్, నాన్‌వెర్బల్‌కి సంబంధించి ఏదో ఒక ప్రామాణిక మెటీరియల్‌ను తీసుకుని ముందుగా సిద్ధం కావడం మేలు. దీనివల్ల అనవసర ఆందోళనకు దూరమై, వాటిపై పూర్తి అవగాహన వస్తుంది.
మేథమేటికల్ విభాగంలో ఆరు నుంచి పదో తరగతుల సిలబస్ స్థాయి ఉంటుంది. దీనికిగాను అభ్యర్థులు ఆయా తరగతుల గణితాంశాలను సాధన చెయ్యాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరాసరి, శాతాలు, నిష్పత్తులు, లాభనష్టాలు, కాలము- పని, కాలము-దూరం, సాంఖ్యక శాస్త్రం వంటి అంశాలను సాధన చెయ్యాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పుస్తకాలలోని ప్రాథమిక అంశాలను అవగాహన చేసుకుంటే ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత అంశాలపై ప్రశ్నలను చాలా సులువుగా సాధించవచ్చు.
మారుతున్న ప్రశ్నల శైలి
ఈ మధ్యకాలంలో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రతరం అవుతుండటంతో ప్రశ్నల శైలిలో కొంతమార్పు చోటు చేసుకుంటోంది. అందుకే కొత్తగా ఇన్ఫరెన్సెస్, స్టేట్‌మెంట్స్, కన్‌క్లూజన్స్, స్టేట్‌మెంట్స్ ఎసెంప్షన్‌ను సిలబస్‌లో చేర్చి, వీటిపై ప్రశ్నలు అధికంగా ఇస్తున్నారు. ప్రశ్నల శైలి మారుతుండటంతో ప్రతి అంశానికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి.
విభాగాలు - వివరాలు
వెర్బల్ రీజనింగ్ : దీనిలో అంశాలు: 1. కోడింగ్ డీకోడింగ్ 2. భిన్న పరీక్ష 3. సిరీస్ 4. అనాలజీ 5. క్లాసిఫికేషన్ 6. రక్త సంబంధాలు 7. డైరెక్షన్ టెస్ట్ 8. నంబర్ పజిల్ టెస్టు 9. వెన్ డయాగ్రమ్స్ 10. ప్రాబ్లమ్స్ ఆన్ డైస్ 11. క్యాలెండర్, గడియారం 12. సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అండ్ గ్రూప్ రీజనింగ్ 13. డాటా సఫిషియన్సీ 14. స్టేట్‌మెంట్స్ అసెంప్షన్, కన్‌క్లూజన్స్ 15. ఇన్ఫరెన్సెస్
* ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలది అగ్రస్థానం. డేటా, స్టాటిస్టిక్స్ ఆధారంగా కూడా ప్రశ్నలు రావొచ్చు. ఇచ్చిన డేటాలో అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాన్ని కనుక్కోవాలి.
* ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే స్వీయ విశ్లేషణా శక్తి, ప్రతి అంశాన్నీ సునిశితంగా పరిశీలించే నైపుణ్యం అలవర్చుకోవాలి.
* ఒక సమస్యను చదువుతున్నప్పుడే అందులోని ముఖ్యాంశాలను గుర్తించే పరిజ్ఞానం అవసరం.
* నిరంతరమైన సాధన చాలా అవసరం.
నాన్-వెర్బల్ రీజనింగ్
నాన్-వెర్బల్ రీజనింగ్‌లో ప్రశ్నలను బొమ్మలు, పటాల రూపంలో ఇస్తుంటారు. కొన్ని బొమ్మలు, గుర్తులు ఒక శ్రేణి రూపంలో ఇచ్చి దాని తర్వాత చిత్రాలను కనుగొనమని అడుగుతారు. సాధారణంగా ప్రశ్నలు ఈ కింది విభాగాల నుంచి ఉంటాయి.
*comepletion of series
* problems related to figure rotation
* Find the odd one out
ఈ విభాగం కోసం అభ్యర్థులు ప్రామాణిక మెటీరియల్‌ను నిరంతరం సాధన చేయడం ద్వారా పట్టు సాధించవచ్చు.
మేథమేటికల్ ఎబిలిటీ
ఇది ప్రాథమికమైన గణిత సామర్థ్యాలను పరీక్షించే విభాగం. పదో తరగతి స్థాయి సిలబస్‌తో ఈ అంశాలపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు.
దీనిలోని అంశాలు: 1. ప్రాథమిక సంఖ్యావాదం 2. నంబర్ సిస్టమ్ 3. సగటు 4. నిష్పత్తులు 5. శాతాలు 6. భాగస్వామ్యం 7. కాలము-పని 8. కాలము-దూరం 9. బారువడ్డీ 10. చక్రవడ్డీ 11. ప్రస్తారాలు-సంయోగాలు 12. సంభావ్యత 13. క్షేత్రమితి 14. సాంఖ్యక శాస్త్రం
.
ఈ సూచనలు గమనించండి * అభ్యర్థులు వెర్బల్, నాన్‌వెర్బల్ నైపుణ్యాలను తక్కువ సమయంలో అనువర్తించేలా సన్నద్ధం కావాలి. * పరీక్షకు ముందు కొన్ని రోజుల పాటు క్రమంగా మాక్‌టెస్టులు రాయాలి. స్వీయ విశ్లేషణ చేసుకొని, బలహీనంగా ఉన్న అంశాలపై బాగా శ్రద్ధ వహించాలి. * వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యే మెంటల్ ఎబిటిలీ ప్రశ్నలను సాధన చేయాలి. * కష్టంగా అన్పించే ప్రశ్నలపై అధిక సమయం వెచ్చించకుండా అభ్యర్థులు జాగ్రత్త వహించాలి. సంప్రదించాల్సిన పుస్తకాలు: * రీజనింగ్: ఆర్. ఎస్. అగర్వాల్ * అరిథ్‌మెటికల్ ఎబిలిటీ: ఆర్.ఎస్. అగర్వాల్, ఆరు నుంచి పదో తరగతి గణిత పాఠ్య పుస్తకాలు. |
No comments:
Post a Comment