మార్కుల్లో ముందు నిలిపే 'తెలుగు'

మార్కుల్లో ముందు నిలిపే 'తెలుగు'
గ్రూప్స్‌ పరీక్షల్లో ఇతరులకంటే ఎక్కువ మార్కులు సంపాదించాలంటే... తెలుగు భాషాసాహిత్యాలపై కూడా దృష్టి సారించాలి. 'గ్రూప్‌-1లో ఒక ప్రశ్న సాహిత్యంపై తప్పనిసరి; గ్రూప్‌-2లో భాషా సాహిత్యాలపై 20 నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందం'టున్నారు సాహితీవేత్త, పోటీ పరీక్షల నిపుణుడు డా. ద్వా.నా. శాస్త్రి.
గ్రూప్‌-1, గ్రూప్‌-2 సిలబస్‌లలో ఆప్షనల్స్‌ లేవు గానీ వాటికి సంబంధించిన అంశాలున్నాయి. ముఖ్యంగా చాలామంది తెలుగు సాహిత్యానికి చెందినవి లేవనుకొంటారు. అది సరికాదు. గ్రూప్‌-1లో పేపర్‌ 2లో 'భారతదేశ చరిత్ర - సాంస్కృతిక వారసత్వం', 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర' అనే విభాగాలున్నాయి. మొదటిదానిలో మతపరమైన ఉద్యమాలు, భక్తి ఉద్యమాల స్వభావం, దేశభాషల వృద్ధి, సాహిత్యం... అన్నప్పుడు మన రాష్ట్రంలోని మతపరమైన ఉద్యమాల్ని, భక్తి ఉద్యమాల్ని సంక్షిప్తంగా రాయవలసి ఉంటుంది. పాల్కురికి సోమన శైవ మతపరమైన ఉద్యమాన్ని, వీరశైవ మత ఉద్యమాన్ని చేపట్టాడు. పోతన, అన్నమయ్యలు పరోక్షంగా వైష్ణవ మత ప్రచారానికి ప్రాధాన్యమిచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా వైష్ణవానికి ప్రాముఖ్యమిచ్చారు. 'విజయనగర సామ్రాజ్యం నాటి సాహిత్యం' అనే అంశంలో అష్టదిగ్గజ కవుల గురించీ, రాయల వారి కావ్యాల గురించీ వివరించవలసి ఉంటుంది. జాతీయవాదంలో, జాతీయోద్యమంలో కవుల పాత్ర కూడా పరామర్శిస్తే అదనపు సమాచారం అవుతుంది.
ఉద్యమాల్లో తెలుగువారు
దళిత ఉద్యమంలో, బ్రాహ్మణేతర ఉద్యమంలో తెలుగు వారి పాత్ర ఉంది. దళిత ఉద్యమంలో కుసుమ ధర్మన్న, జాషువా వంటి వారిని పరిచయం చేయాలి. బ్రాహ్మణేతర ఉద్యమం తమిళనాడులో నాయకర్‌ ప్రారంభించినట్టుగా మనరాష్ట్రంలో త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రారంభించారు. అనేక రచనలూ చేశారు.
'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్ర'లో తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన అంశాలు చాలానే ఉన్నాయి. శాతవాహనుల కాలంలో తెలుగు సాహిత్యం లేదు. కానీ హాలుని గాథాసప్తశతిలో తెలుగు భాషా పదాలున్నాయి. తూర్పు చాళుక్యులు- ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు- ఆస్థాన కవి నన్నయ తెలుగు భాషా సాహిత్యాల సేవపై వివరంగా తెలుసుకోవాలి. కుతుబ్‌షాహీలు కూడా తెలుగును ఆదరించారు. తెలుగు కవుల్ని పోషించి, కావ్యాలను అంకితాలుగా తీసుకున్నారు.
కందుకూరి వీరేశలింగం, జాషువా, భీమన్న, శ్రీశ్రీల గురించి అవగాహన ఉండాలి. వీరంతా సంఘ సంస్కర్తలే. ఆంధ్రాలో జాతీయవాద ఉద్యమంలో కవుల, రచయితల పాత్ర మరువరాదు. 'ఆంధ్ర సారస్వత పరిషత్‌' చేసిన భాషా సాహిత్యాల సేవ అసామాన్యం. తెలుగు బోధన, సభల నిర్వహణ, పుస్తక ప్రచురణ అనే విధంగా ఈ సంస్థను వివరించవలసి ఉంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో తెలుగు కవుల పాత్ర తక్కువేమీ కాదు.
జనరల్‌ స్టడీస్‌లోనూ...
వీటితో పాటూ గ్రూప్స్‌ జనరల్‌స్టడీస్‌ పేపర్‌లో కూడా తెలుగు భాషా సాహిత్యాలకు, రాజులకు, కవులకు సంబంధించిన ప్రశ్నలు కనీసం 10 తప్పకుండా ఉంటాయి. అందువల్ల ఇతరుల కంటే ఎక్కువ మార్కులు సంపాదించాలంటే తెలుగు భాషా సాహిత్యాలపై కూడా దృష్టి నిలపడం అవసరం.
గ్రూప్‌-1లో ప్రశ్నల స్వరూపం...
* నన్నయ తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవ
* విజయనగర రాజుల కాలంలో సాహిత్య పోషణ
* నవాబుల సాహిత్య పోషణ
* తెలుగునాట ఉద్యమాలు- కవుల పాత్ర
* సంఘ సంస్కరణకు తోడ్పడిన తెలుగు కవులు, రచయితలు
* తెలంగాణా సాయుధ పోరాటం - సాహిత్యం
గ్రూప్‌-2లో... ఇలా సన్నద్ధం
పేపర్‌ 2లో 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక చరిత్ర' అంశం ఉంది. దీనికి 150 మార్కులున్నాయి. మొత్తం ఐదు అధ్యాయాలు. ఇందులో కొంత చరిత్ర, కొంత సంస్కృతితో పాటు సాహిత్యం కూడా ఉంది. చాలామంది ఈ విషయం గమనించరు. వివిధ రాజులు, వారి సాహిత్య సేవ, వారి ఆస్థాన కవులు, కృతిని తీసుకున్న రాజులు మొదలైనవాటిపై దృష్టి సారించాలి. వీటితో పాటు ఆధునికంగా ఉద్యమాల పరిచయం కూడా అవసరం. జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం, తెలంగాణా సాయుధ పోరాట ఉద్యమాలు చాలా ముఖ్యం.
తెలుగు కవుల్లో కందుకూరి వీరేశలింగం, జాషువా, బోయి భీమన్న, శ్రీశ్రీలు ముఖ్యం. 'ఇతర కవులు' అని కూడా సిలబస్‌లో ఉంది. అంటే త్రిపురనేని రామస్వామి, నార్ల వెంకటేశ్వరరావు, కుసుమ ధర్మన్న కవి వంటి వారిని కూడా తెలుసుకోవాలి. ఆంధ్ర మహాసభలో పాల్గొన్న సాహితీ ప్రముఖులూ ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ తెలంగాణాలో తెలుగు భాషా సాహిత్యాల కోసం స్థాపితమైన సంస్థ. దీనికి ఘన చరిత్ర ఉంది.
శాతవాహనుల కాలం నాటికి తెలుగు సాహిత్య వికాసం లేదనే చెప్పాలి. అయితే తెలుగు జాతి ఉంది. భాష ఉంది. ముఖ్యంగా హాలుడు సంకలించిన గాథా సప్తశతిలో తెలుగు వారి గ్రామీణ జీవితం ఉంది. అత్త, పొట్ట, పాడి వంటి తెలుగు పదాలున్నాయి. క్రీ.శ. ఒకటో శతాబ్దం నాటి ప్రాకృత గ్రంథంలో తెలుగు పదాలున్నాయంటే అప్పటికే ఆ భాష ప్రచురంగా ఉందని తెలుస్తోంది.
చాళుక్య యుగంలోనే తెలుగు భాషా సాహిత్యాల వికాసం కనబడుతుంది. ఈ యుగంలోనే తెలుగు శిలా శాసనాలు వేయించబడ్డాయి. నన్నయ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి కదా! కాబట్టి నన్నయ నుంచి మొల్ల వరకు గల ప్రముఖ కవుల, కవయిత్రుల గురించి తెలుసుకోవాలి. ఎవరు వారు? పాల్కురికి సోమన, నన్నెచోడుడు, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, అన్నమయ్య, పోతన, మొల్ల... అన్నమాట. వారి పరిచయం తెలిస్తే చాలు. సిలబస్‌లో ఉన్నవారినే కాకుండా వేమన, శ్రీకృష్ణ దేవరాయలు, గురజాడలను గురించి కూడా తెలుసుకుంటే మరింత ప్రయోజనకరం.
పేపర్‌ 2లో సాహిత్యానికి సంబంధించి 10 ప్రశ్నల నుంచి 15 వరకు రావచ్చు. ఎందుకంటే చరిత్రకీ, సంస్కృతికీ, సాహిత్యానికీ సంబంధం ఉంది కాబట్టి.
నమూనా ప్రశ్నలు పరిశీలించండి
* గుణాఢ్యుడు రచించినది
1. గాథా సప్తశతి 2. బృహత్కథ 3. నాట్యశాస్త్రం 4. బృహత్‌ సంహిత(2) * నాగార్జునుని రచనల్లో ముఖ్యమైనది
1. సుహృల్లేఖ 2. దివ్యలేఖ 3. ప్రజ్ఞాపారమితి 4. ఏదీకాదు (1)
* ఆంధ్రుల రసికతను తెలిపిన తొలి గ్రంథం
1. ఆంధ్ర శబ్ద చింతామణి 2. క్రీడాభిరామం 3. గాథా సప్తశతి 4. బాలభారతం (3)
* తిక్కన బిరుదు
1. కవి బ్రహ్మ 2. ఉభయకవి మిత్ర 3. రెండూ 4. రెండూ కాదు (3)
* అన్నమయ్య బిరుదు
1. కవి సార్వభౌమ 2. ప్రబంధ పరమేశ్వర 3. కవిరత్న 4. పద కవితా పితామహ (4)
* ఆంధ్ర మహాసభతో సంబంధం గల సాహితీవేత్త ఎవరు?
1. సురవరం ప్రతాపరెడ్డి 2. రావి నారాయణరెడ్డి 3. ప్రకాశం పంతులు 4. అందరూ (1)
* ఆత్మగౌరవ పోరాటాన్ని తొలుత ప్రారంభించినది
1. జాషువా 2. జ్యోతిబాపూలే 3. కత్తి పద్మారావు 4. బోయి భీమన్న (2)
* 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అన్న కవి?
1. కాళోజీ 2. సి. నారాయణరెడ్డి 3. దాశరథి 4. గద్దర్‌ (3)
* ఆంధ్ర సారసత్వ పరిషత్‌ ప్రస్తుత అధ్యక్షుడు
1. ఎ.బి.కె. ప్రసాద్‌ 2. సి. నారాయణరెడ్డి 3. దేవులపల్లి రామానుజరావు 4. ఎన్‌. గోపి (2)
* తానీషా కాలం నాటి తెలుగు వాగ్గేయకారుడు
1. అన్నమయ్య 2. క్షేత్రయ్య 3. వీరబ్రహ్మ 4. రామదాసు (4)

No comments:

Post a Comment