మనసులో మాట
పాతాళంలోకి తోస్తే... ఆకాశంలోకి ఎదిగా!
మూడు నెలల పరిచయం మూడేళ్ల ప్రేమగా మారింది. మూడు రోజుల ప్రయాణంతో అది ముక్కలైంది... ఎందుకిలా? మనసు విరిగిన అబ్బాయి చెబుతున్నాడు... 'బాబూ నీకు ఫోన్... ఎవరో అమ్మాయి లైన్లో ఉంది' ఇంటి ఓనర్ చెప్పగానే నాలో అయోమయం. 'నాకు ఫోన్ చేసేదెవరబ్బా?' అనుకుంటూనే 'హలో' అన్నా. 'హాయ్ హరీ బాగున్నావా...' అందామె. సర్‌ప్రైజ్... తను ఏడాది కిందట నాతోపాటు కంప్యూటర్ కోర్సు నేర్చుకున్న అమ్మాయి. ఆ మూడు నెలలూ తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడైతే దాదాపు మర్చిపోయా. పాత సంగతులు చెబితేగానీ గుర్తుకు రాలేదు. చాలాసేపే మాట్లాడి చివర్లో నా అడ్రస్ తీసుకుంది. పదిహేను రోజుల తర్వాత ఓ ఉత్తరం పంపింది. మొదట్లో నేనేం పట్టించుకోలేదు. తర్వాత మరోటి రావడంతో స్పందించక తప్పలేదు. ఇలా రెండేళ్లు సాగింది మా లేఖల రాయబారం. ఆ ఉత్తరాల అక్షరాల్లో భావాలు తర్జుమా అయ్యాయ్. మనసులు మాటాడుకున్నాయ్. చిగుళ్లు వేసిన ప్రేమ వట వృక్షంలా ఎదిగింది. అప్పుడప్పుడు నా రూమ్మేట్స్ మొబైల్స్‌కి కూడా ఫోన్‌చేసి నాతో మాట్లాడేది. తనప్పుడు ఇంజినీరింగ్ మూడో ఏడాది. 'నిన్ను చూడాలనిపిస్తోంది వూరొస్తావా?' అందోరోజు. నాకూ ఆమెను చూడాలనే ఉంది. అయితే ఇన్నాళ్ల తర్వాత మా కలయిక ఓ తీపి జ్ఞాపకంలా ఉండాలనుకున్నా. అందుకే వైజాగ్, అరకు టూర్ ప్లాన్ చేశా. దీని కోసం తనను ఒప్పించడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. పెళ్లి కాకుండానే కలిసి తిరగడం బాగుండదని ఇంకో ఇద్దరు స్నేహితుల్ని కూడా తీసుకెళ్లా. అనుకున్నట్టుగానే ముందు వైజాగ్‌లో కలుసుకున్నాం. తనను చూడగానే నాలో ఉద్వేగం. తనూ అంతే... అంతులేని ప్రేమ కురిపించింది. మూడ్రోజులు మూడు నిమిషాల్లా గడిచిపోయాయి. చివరి రోజైతే రాత్రి నుంచి తెల్లవారేదాకా ఒకటే కబుర్లు చెప్పుకున్నాం.
వూరు దగ్గరే కావడంతో తను పొద్దునే వెళ్లిపోయింది. నేనూ, ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్లే హడావుడిలో ఉన్నాం. అప్పుడే ఆమె నుంచి ఫోన్. 'హరీ... నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి' అంది. 'కచ్చితంగా పెళ్లి గురించే' అనుకుంటూ వూహల్లో మునిపోయా. కానీ నా అంచనా తప్పింది. 'నీతోపాటు టూర్‌కొచ్చిన నీ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నా' అంటూ నా నెత్తిన పిడుగులు కురిపించింది. ఆ మాటతో నా నోరు మూగబోయింది. 'ఏంటి సైలెంట్‌గా ఉన్నావ్... కొంపదీసి నన్నేమైనా ప్రేమిస్తున్నావా?' అంది ఏమీ తెలియనట్టుగా. అంటే మూడేళ్ల నుంచి లెటర్లు రాసుకోవడం... ఫోన్లలో మాట్లాడుకోవడం ప్రేమ కాదా? 'నిన్ను చూడాలని ఉంద'ని ఇక్కడి దాకా రప్పించడంలో ఏ అర్థం లేదా? తన తీరుకు పీకల్దాకా కోపమొచ్చినా మూడు రోజుల్లో మనసు మార్చుకున్న తనతో మాట్లాడటం... ప్రేమిస్తున్నాని అర్థించడం వ్యర్థమనిపించింది.
ఒక్కడ్నే హైదరాబాద్ బయల్దేరా. చిన్నప్పట్నుంచి నాకు ఏడుపంటే గిట్టదు. అది చేతగాని వాళ్లు చేస్తారని అనుకునేవాణ్ని. కానీ బస్సులో వెళ్తున్నంతసేపూ నేను అసహ్యించుకునే కన్నీళ్లే వెంట వచ్చాయ్. తర్వాత ఆ ఏడుపే కోపంగా... తెగింపుగా... కసిగా మారింది. తన మీద చూపించిన ప్రేమ, తపనను లక్ష్యంపై పెట్టా. ఐదేళ్లు తిరిగేసరికి లక్షల సంపాదన... మంచి ఉద్యోగంలో చేరిపోయా. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది... సమాజంలో గౌరవముంది. మనసును అర్థం చేసుకునే తనకంటే అందమైన అమ్మాయితో పెళ్త్లెంది. ఏదేమైనా అప్పుడు నాకు కన్నీళ్లు తెప్పించిన తనే నేనీ స్థితిలో ఉండటానికి కారణం. కానీ దురదృష్టం... నన్ను వంచించిన అమ్మాయి... నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడు జీవితంలో ఒక్కటి కాలేకపోయారు.
- హరి |
|
|
|
|
No comments:
Post a Comment