మీ ప్రిపరేషన్‌ ఎంత ఎంత పక్కా?

                                మీ ప్రిపరేషన్‌ ఎంత ఎంత పక్కా?
                            కొడాలి భవానీ శంకర్‌

వేసే ప్రతి అడుగూ లక్ష్యాన్ని దగ్గర చేయాలి… చదివే ప్రతి గంటా అదనపు మార్కులు సంపాదించిపెట్టాలి! లక్షలమంది రాసే గ్రూప్‌-2 లాంటి పరీక్షకు ఈ ధోరణి చాలా అవసరం. అందుకే… ముందుకు సాగేముందు – మీ ప్రిపరేషన్‌ సరైన పంథాలో సాగుతోందో లేదో తేల్చుకోవాలి. అవసరమైన మార్పులూ చేర్పులూ చేసుకోవాలి. లక్ష్యం వైపు దూసుకుపోవాల్సిన తీరు ఇదే!
గ్రూప్‌-2 పరీక్షలు ఇంకా 75 రోజులు కూడా లేవు. ఇప్పుడున్న వ్యవధి సంపూర్ణంగా సద్వినియోగమయ్యేలా వ్యూహాత్మకంగా సిద్ధమైతేనే మీకు ప్రభుత్వ ఉద్యోగ యోగం!
ఇప్పటికే వేలమంది శ్రద్ధగా సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే చదవటం మొదలుపెడుతున్నారు. అదేదో సినిమాలో అన్నట్లుగా- ఎప్పుడు వచ్చామన్నది కాదు, ‘బుల్లెట్‌ దిగిందా లేదా’ అన్నదే ముఖ్యం. ఆలస్యంగా ఆరంభించినా, ముందుగా మొదలుపెట్టినా ‘వ్యూహం సరైందా, కాదా’ అన్నదే కదా ముఖ్యం! అందుకే మీ ప్రిపరేషన్‌ సరైనరీతిలో ఉందో లేదో సమీక్షించుకోవాలి.
భావనలపై ఆధారపడి…
మొన్నటికి మొన్న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో సీనియర్‌ అభ్యర్థులు కూడా క్వాలిఫై కాలేకపోయారనే వార్తలు వచ్చాయి. పేపర్‌లోని అంశాలు చాలా సాధారణంగా, ప్రాథమిక (బేసిక్‌) సమాచారంతో పాటు కాన్సెప్ట్‌ (భావన) ఆధారితాలుగా ఉన్నాయి. పైపైన బిట్లు ప్రిపేరైన అభ్యర్థులు అనుబంధ విషయాలపై ప్రశ్నలు అడిగేసరికి తడబడినట్లుగా తెలుస్తోంది.
ప్రారంభం నుంచే ‘ఇది ఇంపార్టెంట్‌ బిట్‌, ఇది కాదు’ అనే ధోరణిలో చదవకూడదు. చదివే టాపిక్‌లో కీలక (కోర్‌) అంశం ఏమిటి? దానితో ముడిపడిన ఇతర ముఖ్యాంశాలు ఏమిటి; చదువుతున్న టాపిక్‌కు పోలిక/భేదాలతో కూడిన ఇతర అంశాలేమిటి, సంబంధమున్న నిజజీవిత ఉదాహరణలు ఏమిటి… ఇలా అధ్యయనం చేస్తే భావనలపై పట్టు ఏర్పడుతుంది.
ఈ తరహా ప్రిపరేషన్‌ వల్ల ప్రశ్న ఎలాంటిదైనా సమాధానాలను సరిగా గుర్తించవచ్చు.
బట్టీ కూడా అవసరమే
భావనలపై ఆధారపడిన ప్రిపరేషన్‌ వల్ల దాదాపు 80 శాతం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. అయినప్పటికీ గ్రూప్‌-2 పరీక్ష ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల స్వభావాన్ని బట్టి గణాంకాల సమాచారంపై 15 శాతం ప్రశ్నల వరకూ వచ్చే అవకాశముంది. ఇలాంటి బిట్లను ఎదుర్కొనేందుకు తెలివితో కూడిన బట్టీని అనుసరించాల్సిందే.
* పేపర్‌-1 లోని వివిధ భౌగోళికాంశాలు, భారతదేశ చరిత్రలో యుద్ధాలు, రచనలు, వారసత్వ క్రమం మొదలైనవి.
* పేపర్‌-2లోని ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక విషయాలు, పాలిటీలోని ఆర్టికల్స్‌, సవరణలు మొదలైనవి.
* పేపర్‌-3లోని భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అంశాల్లో ప్రాథమిక సమాచారం నుంచి తాజా సమాచారం వరకూ.
ఇలాంటి అంశాలు అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో నమోదు చేసుకొని, చార్టుల మాదిరిగా తయారుచేసుకొని వీలైనప్పుడల్లా పునఃస్మరణ చేయాలి. అప్పుడు పరీక్ష హాల్లో తికమక పడకుండా సమాధానాలు గుర్తించవచ్చు.
ఆం.ప్ర.పై పట్టుందా?
గ్రూప్‌-1లోనైనా, గ్రూప్‌-2లోనైనా మారిన పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక, ఆర్థిక, సామాజిక విషయాలు కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక, ఆర్థిక విషయాలకు 450కు 150 మార్కులు కేటాయించారంటేనే జయాపజయాలను నిర్ణయించే స్థితికి ‘ఆంధ్రప్రదేశ్‌ సమాచారం’ చేరినట్టు గుర్తించాలి. అందుకే ఆం.ప్ర. చరిత్ర, ఆర్థిక వ్యవస్థలపై పట్టు అవసరం. దానికోసం ఈ రెండు అంశాలపై లోతైన, మారుమూల అంశాలను కూడా అధ్యయనం చేయాలి. మరి మీ ప్రిపరేషన్‌ ఈ రీతిగా సాగుతోందా?
ప్రాథమికం చదివితే చాలదు
పోటీ పరీక్షల్లో కాలానుగుణంగా అభివృద్ధి చెందే భావనలు, ఉత్పత్తులపైన ప్రశ్నలు అడిగే ధోరణి ఉంటోంది. అందువల్ల ప్రతి సబ్జెక్టులోనూ తాజా పరిణామాలపై దృష్టి నిలపాలి.
* చరిత్రలో ఇటీవల బయల్పడిన పురాతన సాక్ష్యాలు ఏమిటి?
* ఇటీవల చర్చనీయాంశాలు/ వివాదాస్పదంగా మారిన అంశాలు ఏమిటి?
ఈ తరహాలో ప్రశ్నించుకొని, సమాధానాలు సేకరించుకోవాలి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.
ప్లూటో ఒక గ్రహమా, కాదా అన్న ఆధునిక ధోరణులు, పరిశోధనలను బట్టి గ్రహమండల వ్యవస్థ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో లేదో గమనించాలి. ‘సునామీ’లాంటి తాజా పరిణామాలు, కరుగుతున్న మంచుకొండలు మొదలైన కోణాల్లో సబ్జెక్టును అధ్యయనం చేయాలి.
ముఖ్యంగా… శాస్త్ర సాంకేతిక రంగంలో రోజుకో రీతిలో నూతన అంశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల ప్రాథమిక సమాచారంతోపాటు లోతుగా, తాజా అంశాలను చేర్చిన (అడ్వాన్స్‌డ్‌) సమాచారంపై దృష్టి నిలిపితేనే ఎగ్జామినర్‌ స్థాయి ఆలోచన మీలో ఏర్పడుతుంది. ఆ దృష్టికోణం ఎప్పుడైతే మీలో ఏర్పడుతుందో అప్పుడు ప్రతి అంశాన్నీ అదే రీతిలో అధ్యయనం చేయగలుగుతారు.
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ (పేపర్‌-3) విషయానికొస్తే… మన రాష్ట్రం సంప్రదాయ వస్తూత్పత్తి, తద్వారా సంపద పెంచుకోవటంపై కంటే సమాచార సాంకేతికత, బయోటెక్నాలజీ, పర్యాటకరంగం మొదలైన సేవారంగ సంబంధ అంశాలపై దృష్టి కేంద్రీకరించి స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్‌డీపీ)ని పెంచుకుంటోంది. కాబట్టి ఆధునిక ఉత్పత్తి ధోరణులు మీ ప్రిపరేషన్‌లో ఏ మోతాదులో ఉన్నాయో చూసుకొని ఈ 75 రోజుల ప్రిపరేషన్‌కు పదును పెట్టండి.
వర్తమానం పరిధి, స్థాయి?
ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటే 6 నెలల క్రితం వరకూ జరిగిన అంశాలపైనే ప్రశ్నలు అడిగారు. అవి కూడా అభ్యర్థిలో కచ్చితమైన సమాచారాన్ని పరిశీలించేవిగా ఉన్నాయి. ఊహించి సమాధానాలు గుర్తించే అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రశ్న, చాయిస్‌లను తయారుచేశారు. అందువల్ల ‘అదృష్టం’ పాత్ర కన్పించలేదు. ఇదే ధోరణి గ్రూప్‌-2లో కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని గతంలో మాదిరిగా కాకుండా ప్రతి వర్తమాన అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయాలి. ఈ ధోరణి ఇప్పటివరకూ మీ ప్రిపరేషన్లో లేకుంటే వెంటనే మేల్కొనాలి. ప్రతిరోజూ కరంట్‌ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి.
‘మెంటల్‌ ఎబిలిటీ’ స్థాయి పెరిగిందా?
ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో తాజాగా విన్పిస్తున్న మార్పు- మానసిక సామర్థ్యం (మెంటల్‌ ఎబిలిటీ) ప్రశ్నల స్థాయి పెరగటం. మొన్నటి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఎసర్షన్‌, రీజనింగ్‌ ప్రశ్నలు వచ్చాయి. వాటి ద్వారా అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని పరిశీలిస్తారు. ఇదే ధోరణి గ్రూప్‌-2లో కూడా పునరావృతమయ్యే అవకాశం ఎక్కువ. అందువల్ల మెంటల్‌ ఎబిలిటీలో ఇలాంటి అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? అని అధ్యయనం చేయటం అవసరం. క్లిష్టమైన సమస్యలను బాగా సాధన చేయాలి. ప్రతి మార్కూ విలువైన ఈ పోటీ పరీక్షల్లో ఏ అంశాన్నయినా నిఖార్సుగా అధ్యయనం చేయాలి. ఇలాంటి ధోరణి మీ ప్రిపరేషన్లో ఉందా?
భారీ సిలబస్‌కు బహుముఖ వ్యూహం
ఇటీవల ‘ఈనాడు-చదువు’ నిర్వహించిన SMS పోల్‌లో 68 శాతం మంది అభ్యర్థులు సిలబస్‌ భారీగా, భారంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇది నిజమే అయినా ఆ ఆలోచన మీ దరిదాపుల్లోకి కూడా రానీయవద్దు. ఎంతటి భారీ, క్లిష్ట అంశానికైనా ఒక మార్గం కచ్చితంగా ఉంటుంది. మీ ప్రిపరేషన్‌లో కేవలం ఒక్క మార్గంపైనే ఆధారపడకుండా బహుముఖ మార్గాలను అనుసరించండి.
1) కొన్ని పాఠ్యాంశాల్లో లోతైన అధ్యయనం అవసరం.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌ సహకార వ్యవస్థ, ప్రజా పంపిణీ, సంక్షేమపాలన
2) కొన్ని అంశాల్లో స్థూల అవగాహన చాలు.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో రవాణా విధానం, కమ్యూనికేషన్‌ సిస్టమ్‌
3) కొన్నిటిని గణాంకాల ఆధారంగానే అధ్యయనం చేయాలి.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలు, మానవ వికాససూచి, భారత ప్రణాళిక వ్యవస్థలు, విత్త బడ్జెట్‌
ఈ విధంగా ప్రతి పేపర్‌లోనూ సబ్జెక్టు పరిధిని బట్టి, ప్రాధాన్యం బట్టి స్థాయిని నిర్ణయించుకొని ప్రిపేరైతే సిలబస్‌ ఎంత భారీగా ఉన్నా చదవటం సులువుగానే ఉంటుంది.
పేపర్‌-1 లో జాగ్రఫీ, జనరల్‌సైన్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, కరంట్‌ అఫైర్స్‌ల నుంచి ఒక్కోదానిపై 35 బిట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. భారతదేశ చరిత్రకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. ఏపీ చరిత్ర పేపర్‌-2లో 75 మార్కుల ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయానికి అవకాశముంది. అందువల్ల పైన చెప్పిన నాలుగు సబ్జెక్టుల్లో లోతుగా చదవాలి. పాత పద్ధతిలోని జనరల్‌స్టడీస్‌ స్థాయి కంటే మించి ఉండేలా ప్రిపరేషన్‌ సాగించాలి.
పునశ్చరణ (రివిజన్‌)
మీ ప్రిపరేషన్లో పునశ్చరణ పాత్ర ఏమిటి? కొందరు అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టులోని ఒక్కో పాఠం చదువుకుంటూ మొత్తం పాఠాలను పూర్తిచేశాక వీలైతే రివిజన్‌ చేస్తారు. సమయం ఎక్కువ లేకపోతే రివిజన్‌ ఏమీ చేయకుండానే కొత్త సబ్జెక్టులోకి వెళ్ళిపోతారు. ఇలా అన్ని సబ్జెక్టులూ ఒకసారి పూర్తయ్యాక రివిజన్‌ మొదలుపెడతారు. ఇది సరైన ధోరణి కాదని జ్ఞాపకశక్తి అధ్యయన నిపుణులు చెపుతున్నారు. మొదటిసారి చదివిన సందర్భానికీ, రెండోసారి చదివిన సందర్భానికీ మధ్య కాలవ్యవధి చాలా ఎక్కువ ఉండటమే దీనిలో లోపం.
ఉదాహరణకు… మూడు పేపర్లు చదవాలనుకోండి. ప్రతిరోజూ 3 పేపర్లకు సమయాన్ని కేటాయించాలి.
ఈ విధంగా చదవటం వల్ల సమయం వృథా అవుతుందనే అపోహ అక్కర్లేదు. పునరభ్యాసం వల్ల మొదటి రోజు పట్టిన సమయం కంటే రెండో రోజు అదే పాఠానికి తక్కువ సమయం పడుతుంది. మూడో రోజు మరింత తక్కువ సమయం! అందుకని ఆందోళన పడకుండా ప్రతి సబ్జెక్టులోనూ అన్ని పాఠాలకూ ఇదే ధోరణిని అనుసరించాలి.
ఎవరైనా అభ్యర్థి గ్రూప్‌-2 సిలబస్‌ మొత్తంపై మంచి అవగాహన ఏర్పరచుకున్నాడనుకుందాం. అయినప్పటికీ పునశ్చరణ, నమూనా పరీక్షల సాధన ఏమీ చేయకుండా నేరుగా పరీక్ష రాస్తే అతడు విజయం సాధించటం కష్టమే. అతడే తగిన విధంగా పునశ్చరణ చేసి, నమూనా పరీక్షలు రాస్తే విజేతల జాబితాలో నిలవటం తథ్యం! విషయ అవగాహన ద్వారా లభించే విజయావకాశాలు 60 శాతం మాత్రమే. పునశ్చరణ (రివిజన్‌) ద్వారా వాటిని మరో 25 శాతం పెంచుకోవచ్చు.
మానసిక సవాళ్ళు
లక్షలమంది ప్రేక్షకుల అరుపుల మధ్య బంతిని ఎదుర్కొనే క్రికెటర్‌ కంటే మీపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందా? ఆ ఒత్తిడిని అధిగమించి క్రికెటర్లు సెంచరీలు చేయటం లేదా? బౌలర్లు వికెట్లు తీయటం లేదా? ఏ లక్ష్యసాధనలోనైనా ఒత్తిడి సహజం. దీన్ని జయించేందుకు ఈ మెలకువలను మీ ప్రిపరేషన్లో భాగం చేసుకోండి.
* ‘నేను బాగానే చదువుతున్నాను. నాకు ఉద్యోగం తప్పకుండా వస్తుం’దని తరచూ అనుకోవాలి.
* ప్రతిరోజూ నిద్రపోయేముందు ఆ రోజు చదివిన పాఠాలన్నీ గుర్తుచేసుకోండి. మంచి ఫలితం ఉందని సమీక్షించుకోవాలి.
* గతంలో మీరు సాధించిన విజయాలను ఒక్కసారి స్మరించుకోండి. అదే బాటలో పయనిస్తున్నానని స్థిమితపడండి.
* పోటీ ఎక్కువుందని లేనిపోనివి వూహించుకొని ఆందోళన పడకండి. లక్షలమంది రాసినా ‘నాలాంటి వాణ్ని నేనొక్కణ్నే. ఒక్క ఉద్యోగం ఉన్నా అది నాదే’ అనే భావన పెంచుకోవాలి. ఈ ఆశావహ దృక్పథం పరీక్ష రాసేవరకూ కొనసాగాలి.
పరీక్షల సాధన – ప్రిపరేషన్లో భాగమే అభ్యర్థుల్లో ఎక్కువమంది చదవటంపై ఉండే ఆసక్తిని నమూనా పరీక్షలు ఎదుర్కొనేందుకు చూపరు. నిజానికి ఆబ్జెక్టివ్‌ పరీక్షవిధానంలో విజయమనే 100 లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ‘సిలబస్‌ చదవటం’, ‘నమూనా పరీక్షలు రాయటం’ రెండూ కీలకమైనవే. లక్ష్యసాధన 100 శాతమైతే దానిలో చదవటం పాత్ర 65 శాతం, నమూనా పరీక్షల పాత్ర మిగతా 35 శాతం. చదివిన విషయాల్లో నమూనా పరీక్షలను వెంటవెంటనే రాయటం ద్వారా కింది ప్రయోజనాలు ఉంటాయి.
* ప్రశ్నలు ఏ విధంగా రావొచ్చో తెలుస్తుంది.
* చదివిన అంశాలను గుర్తు చేసుకునే అవకాశం దొరుకుతుంది. దాని ద్వారా బాగా గుర్తుండిపోతుంది.
* ప్రిపరేషన్‌ సందర్భంగా చదవనివీ, కొత్త అంశాలూ చదివే అవకాశం ఉంది.
* తప్పులు ఎక్కడ చేసే అవకాశం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల ఆ దోషాలను సవరించుకొని ఒప్పుల సంఖ్య పెంచుకోవచ్చు.
* సమయ నిర్వహణ ఎలా చేయాలో అర్థమవుతుంది.
* పరీక్ష అంటే ఉండే భయం తొలగుతుంది.
* రాసే సమాధానాల్లో కచ్చితత్వం పెరుగుతుంది.
కాబట్టి ప్రతి సబ్జెక్టులోనూ వీలైనన్ని నమూనా పరీక్షలను ప్రిపరేషన్లో భాగంగా సాధించాలి. ఈ 75 రోజుల వ్యూహంలో ‘నమూనా పరీక్షల సాధన’ మీ పదునైన ఆయుధమని మర్చిపోకండి.
This entry was posted on August 31, 2008 and is filed under చదువు.

No comments:

Post a Comment