ఏపీ ఎకానమీపై పట్టు ఎలా?
కొడాలి భవానీ శంకర్
గ్రూప్-2 పరీక్షలో ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) పేపర్‌లో పార్ట్-1కి స్టడీ మెటీరియల్ బాగానే లభిస్తోంది. పార్ట్-2లోని అంశాల దగ్గరే సమస్య వస్తోంది. లభించిన మెటీరియల్‌లో కచ్చితత్వం లోపించటం మొదలైన సమస్యలున్నాయి. దీంతో ఈ మార్కులు అభ్యర్థి జయాపజయాలను నిర్ణయించే స్థితిలో ఉన్నాయి. ఎకానమీ అనగానే గణాంక సమాచారం అనే అభిప్రాయం వదిలిపెట్టాలి. భావనలపై (కాన్సెప్ట్) ఆధారపడిన సమాచారం చదవాలి.
రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల వృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థలు కూడా గ్రూప్-2 పరీక్ష కోణంలో ముఖ్యం. గత 10 సంవత్సరాల్లో ఏపీ పరిశ్రమల్లో వచ్చిన తీరుతెన్నులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. |
మొదటి యూనిట్:
దీనిలో జాతీయాదాయం, ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలు, స్థూల దేశీయ ఉత్పత్తి, తలసరి ఆదాయం, మానవ వికాస సూచిలను సిలబస్ అంశాలుగా చేర్చారు. ఈ విషయాలన్నీ భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించినవే. పేపర్-3లోనే పార్ట్-1 ఐదో యూనిట్లోని ప్రాథమిక సమాచారంతో అనుసంధానం చేసుకొని, వీటిని చదవాలి. 2007-08 తాజా గణాంక సమాచారం పరిగణనలోకి తీసుకోవాలి. మానవ అభివృద్ధి సూచిక రూపకల్పనా ప్రమాణాలు కూడా ముఖ్యమే.
ఇదే యూనిట్లో ఆంధ్రప్రదేశ్ జి.ఎస్.డి.పి.పై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా దీనిలో వ్యవసాయరంగం పాత్ర, ఉపాధి కల్పనలో వ్యవసాయరంగం స్థితిగతులు మొదలైనవి కూడా పరిగణించాలి.
రెండో యూనిట్:
ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలో పరివ్యయాలు ప్రధానంగా సిలబస్‌లో ఉన్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు ఉండేవి కాబట్టి వాటికి సంబంధించిన గణాంక సమాచారం పాత అకాడమీ పుస్తకాల్లో దొరుకుతుంది. ప్రతి ప్రణాళికలోనూ పరివ్యయం ఎంత, వ్యయం ఎంత అనే కోణంలో అధ్యయనం జరగాలి. వివిధ ప్రణాళికల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరిగాయో గ్రహిస్తూ చదవాలి.
మొదటి మూడు ప్రణాళికల్లో ఆహార ధాన్యాలు, జల విద్యుత్తు, రవాణా రంగానికి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారో విశ్లేషిస్తూ చదవాలి. ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి, వివిధ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆకస్మిక ప్రాధాన్యం ఎందుకు పెంచిందీ గ్రహించాలి. తాజా 11వ ప్రణాళికాంశాలపైన కూడా దృష్టిపెట్టాలి. పదో ప్రణాళిక సమీక్ష అంశాలూ ముఖ్యమే. మొదటి విభాగంలోని ఒకటో యూనిట్‌లో ఉన్న భారత ప్రణాళికలతో అనుసంధానం చేసుకొని చదవటం వల్ల భారత్-ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలమధ్య ఉన్న సంబంధాలు సమగ్రంగా అర్థమవుతాయి. ఈ సిలబస్‌లో గణాంక సమాచారంపై ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
మూడో యూనిట్:
దీనిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి విస్తృతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అడవులు, సాగు నేల, నీటిపారుదల విస్తీర్ణం, పంటలు మొదలైన అంశాలను ఏపీ జాగ్రఫీతో అనుసంధానం చేసుకొని చదవటం తెలివైన పని. ఏ అడవులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ అటవీ ఉత్పత్తులు, వాటి వల్ల ఆర్థికవ్యవస్థపై ప్రభావం అనే కోణంలో అధ్యయనం చేయాలి. వివిధ రకాల పంటలు, ప్రాంత ఆధారిత అసమానతలకు ఎలా దారితీశాయనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల అధ్యయనం చేయటం అవసరం.
ఇదే యూనిట్లోని భూసంస్కరణలను పరిణామాత్మక కోణంలో చదవాలి. స్వాతంత్య్రానికి పూర్వం- భూమిశిస్తు విధానాలు, భూసంస్కరణ యత్నాలు; స్వాతంత్య్రానంతరం భూసంస్కరణలు అంటూ తులనాత్మక అధ్యయనం చేయటం అవసరం.
భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భూకమతాల పరిమాణం, విస్తృతి అనే అంశాలపై దృష్టి పెట్టాలి. భూదాన ఉద్యమం నుంచి ఇందిరప్రభ వరకూ భూపంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా ప్రధానమే. కోనేరు రంగారావు కమిటీ నేపథ్యంలో భూసంస్కరణల్లోని వివిధ అంశాలు ముఖ్యమైనవి. పంటల విధానం కింద- ఖరీఫ్, రబీ పంటలు, ఉత్పత్తి, ఉత్పాదకత అనే అంశాలపై దృష్టి నిలపటం మంచిది. వ్యవసాయ రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష మద్దతులపై సమాచారం అవసరమే.
నాలుగో యూనిట్:
దీనిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం, సహకార రంగంపై సిలబస్ ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల పరిణామం, భారీ పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో, రంగాల్లో ఉన్నాయని పరీక్ష కోణంలో అడిగే అవకాశం ఉంది. చిన్నతరహా పరిశ్రమలు- విస్తరణ, ఉత్పత్తి, ఉపాధికల్పన అనే కోణంలో అత్యంత ప్రధాన అంశం. రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల వృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థలు కూడా గ్రూప్-2 పరీక్ష కోణంలో ముఖ్యం. గత 10 సంవత్సరాల్లో ఏపీ పరిశ్రమల్లో వచ్చిన తీరుతెన్నులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పారిశ్రామిక విధానం 2005, ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్‌ల) ఏర్పాటు, ఆం.ప్ర. ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యుత్ స్థితిగతులు మొదలైనవి ప్రధానమైనవి.
ఇదే యూనిట్లోని సహకార రంగంపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. సహకార రంగం ఆంధ్రప్రదేశ్‌లో ఎలా పరిణమించిందనేదీ, గత 50 సంవత్సరాల్లో సహకార రంగం మైలురాళ్ళుగా పేర్కొనే నిర్ణయాలపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఆం.ప్ర. సహకార సంఘాల నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మార్పులు, వైకుంఠలాల్ మెహతా కమిటీ సూచనలు, వైద్యనాథన్ కమిటీ సిఫార్సులు మొదలైన అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. చక్కెర పరిశ్రమ, పాల ఉత్పత్తి, గిరిజనాభివృద్ధి మొదలైన రంగాల్లో సహకార సంఘాలు ఎక్కడెక్కడ స్థాపితమయ్యాయో వాటి వివరాలు పరీక్ష కోణంలో ప్రాధాన్యమున్నవి.
ఐదో యూనిట్:
దీనిలో కూడా వివిధ అంశాల్లో గణాంక, గణాంకేతర సమాచారం కీలకం. ఇటీవల ‘కనీస మద్దతు ధర’ సరైన రీతిలో లేదని రైతులు ఉద్యమాలు చేసిన నేపథ్యంలో కనీస మద్దతు ధర, జారీ ధర, సేకరణ ధర, మార్కెట్‌ధర మొదలైన అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. ధరల నిర్ణయీకరణ ప్రమాణాలు, ధరల నిర్ణయీకరణలో వివిధ ఏజెన్సీల పాత్ర మొదలైనవాటిపై పట్టు బిగించాలి. తాజా కనీస మద్దతు ధరలు పరీక్ష కోణంలో ముఖ్యం.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్మాణం మొదలైన అంశాలను తాజా రెండు రూపాయిల కిలోబియ్యం, రూ.30 కిలో కందిపప్పు లాంటి పథకాల నేపథ్యంలో అధ్యయనం చేయాలి.
సంప్రదాయేతర ఆర్థిక వనరులైన సమాచార, జీవ సాంకేతిక (ఐటీ, బీటీ) రంగాల్లో ఏపీ సాధించిన ప్రగతిపై దృష్టి నిలపాలి. ముఖ్యంగా ఈ రెండు రంగాల్లో ప్రభుత్వ విధానాలు పరిశీలించాలి. సమాచార, జీవ సాంకేతిక రంగాల ప్రగతి కోసం ప్రభుత్వం ఏర్పరచిన మౌలిక వనరులైన జీనోమ్ వ్యాలీ, హైటెక్ సిటీ, ఫ్యాబ్‌సిటీ మొదలైన వ్యవస్థాగత అంశాలు పరీక్ష కోణంలో చాలా ముఖ్యం.
పర్యాటక విధానం, ప్రముఖ పర్యాటక స్థలాల సమాచారం అవసరం. అతి పెద్ద ఆర్థిక వనరుగా పరిణమించబోతున్న పర్యాటకరంగంపై ఆంధ్రప్రదేశ్ వ్యూహం, ప్రోత్సాహకాలు పరిశీలించాలి. రోడ్‌పాలసీ కింద ప్రభుత్వం రహదారుల నిర్మాణం కోసం ఏర్పరచుకున్న ప్రాధాన్యాలపై ప్రశ్నలు ఆశించవచ్చు.
This entry was posted on September 6, 2008 and is filed under చదువు.
No comments:
Post a Comment