భారత్.. పారిశ్రామిక రంగ ప్రగతి

స్వాతంత్య్రానంతరం భారత్ ఆర్థికంగా పురోగతి సాధించడానికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విస్తరణతోపాటు అధిక ఉత్పత్తి దోహదపడింది. అనేక పరిశ్రమల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టారు. పారిశ్రామిక పెట్టుబడులు పెరిగాయి. దీంతోపాటు ఆధునిక యాజమాన్య పద్ధతులు, నవకల్పనల నేపథ్యంలో ఉద్యమదారులు పెరగ డం, ప్రభుత్వ మద్దతు పారిశ్రామికాభివృద్ధికి దోహదపడ్డాయి.

దేశంలోని అనేక ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి జరిగింది. గత కొన్నేళ్లుగా మౌలిక సౌకర్యాలైన విద్యుచ్ఛక్తి, కమ్యూనికేషన్లపై ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగాయి. ఉద్యమిత్వ అభివృద్ధి (ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్)ని పెంపొందించే అనేక సంస్థల తోపాటు పారిశ్రామిక పరపతి సంస్థలు ఎక్కువగా ఏర్పడటం పారిశ్రామిక రంగ పురోగతికి కారణమయ్యాయి.

ఆర్థిక విస్తరణ భారతదేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు దారితీసింది. స్వాతంత్య్రానంతరం 4 సంవత్సరాలు మినహా, భారత్ ధనాత్మక వృద్ధిని నమోదు చేసుకుంది. 1951తో పోల్చినపుడు 1999-2000 సంవత్సరంలో దేశ తలసరి నికరజాతీయోత్పత్తి 2.75 రెట్లు ఎక్కువ. తలసరి నికర జాతీయోత్పత్తి 1950-90 మధ్య కాలంలో వార్షిక వృద్ధి సగటు 3.2 శాతం కాగా 1993-94 నుంచి 1999-2000 మధ్య కాలంలో వార్షిక వృద్ధి 4.8 శాతంగా నమోదైంది. 2009-10లో ఈ వృద్ధి 6.1 శాతం.

సంస్కరణల ముందు కాలం: ప్రభుత్వం అవలంబించిన అనేక ప్రోత్సాహకర విధానాలు స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం రక్షణ విధానాలు అవలంబించడంతోపాటు విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఒప్పందాలను ప్రోత్సహించినప్పటికీ విదేశీ పెట్టుబడులపై పరిమితిని 40 శాతంగా విధించింది. దిగుమతుల విధానాన్ని స్థానిక పరిశ్రమలకు అనుకూలంగా అవలంబించిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి.

స్వాతంత్య్రానంతరం కొంత కాలంలోనే విదేశీ మారక ద్రవ్య కొరతను భారత్ ఎదుర్కొన్నందువల్ల దిగుమతులపై నియంత్రణ విధించింది. వినియోగ వస్తువుల దిగుమతులను పూర్తిగా నియంత్రించింది. వీటితోపాటు మూల ధన వస్తువుల దిగమతులపై కూడా ప్రభుత్వం కొంతమేర నియంత్రణ విధించినప్పటికి దేశంలో ఈ ఉత్పత్తుల పెరుగుదలకు ప్రభుత్వ విధానం దోహదపడింది.

మూలధన వస్తువులకు సంబంధించి విదేశీ సహకారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం దిగుమతికి మూలధన వస్తు పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. రెండు, మూడో పంచవర్ష ప్రణాళికా కాలంలో మూలధన వస్తు పరిశ్రమల అభివృద్ధి దిశగా కొన్ని పరికరాల దిగుమతికి ప్రభుత్వం అనుమతిచ్చింది.

స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా దిగుమతులపై నియంత్రణతో పాటు అనేక ఉత్పత్తుల దిగుమతులపై 200 నుంచి 300 శాతం వరకు దిగుమతి సుంకం విధిస్తూ స్థానిక పరిశ్రమలకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. పారిశ్రామిక రంగ అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసింది. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులను పారిశ్రామిక రంగ అభివృద్ధికి అందించడం అభివృద్ధి బ్యాంకు ముఖ్యోద్దేశం.

ఈ క్రమంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 1948లో, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఐసీఐ) 1955లో, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ) 1964లో, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు 1990లో స్థాపించారు. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1963లో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956లో ఏర్పాటయ్యాయి.

చిన్న ఉద్యమదారులకు పరపతి కల్పించడం కోసం రాష్ట్రాల స్థాయిలో 1951లో పార్లమెంట్ చట్టం ద్వారా ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్‌ను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు.

పారిశ్రామికాభివృద్ధి వేగవంతంకావడానికి శక్తి-రవాణా-సమాచార సౌకర్యాలు తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పాదన, పంపిణీతోపాటు కొత్త విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులపై పెట్టుబడులను పెంచాయి. వీటితోపాటు రోడ్ల నిర్మాణం, సమాచారం, నౌకాయానా అభివృద్ధిపై పెట్టుబడులు పెరిగాయి.

1977లో పారిశ్రామిక తీర్మానం నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వాడలను అన్ని మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేశాయి. 1980 దశకం తర్వాత కాలంలో చమురు, సహజ వాయువు శక్తి ఉత్పాదనకు ముఖ్య ఆధారాలుగా రూపొందాయి. చమురు వెలికితీతకు ‘ఆయిల్, సహజ వాయువు కమిషన్ (ఓఎన్‌జీసీ)’ ఏర్పాటు చేశారు. ప్లాంట్లను విస్తరించడం ద్వారా అదనపు రిఫైనింగ్ సామర్ధ్యం పెంచారు.

పారిశ్రామిక రంగం.. 1991 తర్వాత:
1991లో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. ప్రభుత్వ రంగ పాత్రను తగ్గిస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యమిచ్చారు. స్వదేశీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులను 51 శాతానికి పెంచారు. అవస్థాపనా సౌకర్యాల కల్పనలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.

పారిశ్రామిక రంగంలో అనేక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టినప్పటికీ 9వ ప్రణాళికలో పారిశ్రామిక రంగం కేవలం 5 శాతం వృద్ధినే సాధించింది. 1950-51లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 7.9 శాతం కాగా ఏప్రిల్-డిసెంబర్ 2010లో 8.6శాతం. బేసిక్ గూడ్స్, ‘వినియోగనశ్వర వస్తువు’ రం గంలో ప్రగతి తగ్గినందువల్ల 2010లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో చెప్పుకోదగ్గ పెరుగుదల సంభవించలేదు.

సంస్కరణల యుగంలో పారిశ్రామిక రంగంలో ఉత్పాదక సామర్ధ్యం పెరిగినందువల్ల ‘స్వదేశీ మూలధన కల్పన’లో ఎక్కువ వాటాను ఈ రంగం ఆకర్షించగలిగింది. నేషనల్ అకౌంట్స్ అంచనా ప్రకారం 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి సగటు 8.6 శాతం కాగా ఇదే కాలానికి సంబంధించి నూతన పెట్టుబడుల వార్షిక వృద్ధి 11.3 శాతం. మైనింగ్, రిజిస్టర్డ్ తయారీ రంగం, విద్యుచ్ఛక్తి రంగాల్లో స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు ఎక్కువ.

2008-09లో మొత్తం స్థూల మూలధన కల్పనలో పారిశ్రామిక స్థూల మూలధన కల్పన తగ్గడానికి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణమయింది. కాని 2009-10లో పారిశ్రామిక స్థూల మూలధన కల్పన వాటా మొత్తం స్థిర మూలధన కల్పనలో 43.8 శాతంగా ఉండడానికి ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్స్‌లో పురోగతి కారణమయింది.

సంస్కరణల యుగంలో ముఖ్యంగా 2003-04 తర్వాత దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఆగస్ట్ 1991 నుంచి మే 2010 మధ్యకాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 136.86 బిలియన్ డాలర్లు.

భారత్‌లో సేవలు, టెలికమ్యూనికేషన్లు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగాలు ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడులు స్థంభించే అవకాశం ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నివేదిక 2010 పేర్కొంది.

పారిశ్రామికాభివృద్ధికి వనరులు:

ప్రణాళికా యుగంలో పారిశ్రామికీకరణ సాధించే దిశగా పారిశ్రామిక రంగానికి వనరుల కేటాయింపు పెరిగింది. మొదటి ప్రణాళికలో మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడి రూ, 1960 కోట్లలో 2.8 శాతం అంటే రూ.56 కోట్లు పరిశ్రమలు, ఖనిజాలకు కేటాయించారు. రెండో ప్రణాళికలో మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడిలో 20.1 శాతం, మూడో ప్రణాళికలోను 20.1 శాతం ఈ రంగానికి కేటాయించారు.

రెండో, మూడో ప్రణాళికల్లో బేసిక్ ఇండస్ట్రీస్,మూలధన వస్తు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ పరిధిని విస్తరించారు. వినియోగ వస్తు పరిశ్రమలను ప్రైవేటు రంగంలో అనుమతించారు. నాలుగో ప్రణాళికలో మొత్తం వ్యయం రూ.15779 కోట్లలో 18.2 శాతం అంటే 2,864 కోట్లను; 5వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 22.8 శాతాన్ని పరిశ్రమలు, ఖనిజాలకు కేటాయించారు.

పరిశ్రమలు అవస్థాపనా సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవడం, ఉత్పాదకతను పెంపొందించడం, మూలధన వస్తు పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, శక్తి సామర్ధ్యం పెంపునకు 6వ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం వ్యయంలో ఈ ప్రణాళికలో 13.7 శాతం ఏడో ప్రణాళికలో 11.9 శాతం ఈ రంగానికి కేటాయించారు.

నూతన పారిశ్రామిక విధానం 1991 ప్రకారం పారిశ్రామిక కార్యకలాపాల్లో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యమిచ్చారు. మౌలిక, కీలక రంగాల్లో ప్రభుత్వ రంగం కీలక పాత్ర పోషించగలదని భావించారు. 8వ ప్రణాళిక మొత్తం వ్యయం రూ.4,85,457 కోట్లలో 8.4 శాతం అంటే రూ.40,623 కోట్లు ఈ రంగానికి కేటాయించారు. 9 వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో ఈ రంగంపై వ్యయం 5 శాతం మాత్రమే.

మిగతా ప్రణాళికలతో పోల్చినపుడు 10వ ప్రణాళికలో ఈ రంగంపై చేసిన వాస్తవ వ్యయం మొత్తం వ్యయంలో 3.9 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ పెట్టుబడులు తగ్గడం మరో వైపు ప్రైవేటు రంగ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించకపోవడం వల్ల సంస్కరణల కాలంలో ప్రణాళికల్లో వృద్ధిరేటు తగ్గింది. 11వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 4.2 శాతం పారిశ్రామిక రంగానికి కేటాయించారు.

ముఖ్యాంశాలు:
{పపంచ పెట్టుబడి నివేదిక 2009 ప్రకారం ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం 2007లో 1.979 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. కాగా 2008లో 1.697 ట్రిలియన్ డాలర్లు.

పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం-1951.
ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి వృద్ధి 2009-10లో 13 శాతం.
2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 8.6 శాతం.
2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో పారిశ్రామిక రంగంలో కొత్త పెట్టుబడుల వృద్ధి 11.3 శాతం.

2003-04 తర్వాత దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది.
2003-04తో పోల్చినపుడు 2009-10లో దేశంలోకి వచ్చిన ఈక్విటి ప్రవాహాల్లో పెరుగుదల 13 రెట్లు.
2009-11 మధ్య కాలంలో చైనా, ఇండియా, బ్రెజిల్, అమెరికా, రష్యన్ ఫెడరేషన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీ ప్రవాహాలు 2003-04లో జీడీపీలో 0.37 శాతం కాగా 2008- 09లో 2.21 శాతం.

వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అనువుగా ఉండే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండోస్థానం ఆక్రమించిందని ‘జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’ అభిప్రాయపడింది.
ఆగస్ట్ 1991 నుంచి మే 2010 మధ్య కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 136.86 బిలియన్ డాలర్లు.
{పపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడులు స్థంబించగలవని ఓఈసీడీ నివేదిక 2010 అభిప్రాయపడింది.
1951లో పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగ అభివృద్ధికి రాష్ట్రాల స్థాయిలో ఫైనాన్స్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశాయి.
10వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 3.9 శాతం, 11వ ప్రణాళికలో 4.2 శాతం పారిశ్రామిక రంగానికి కేటాయించారు.

No comments:

Post a Comment