జన గణన 2011.. విశేషాలు, వివరాలు..

భారతదేశ జనాభా 121 కోట్లకు చేరింది. ఇది అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాకు సమానం. 2011 జనగణన వివరాల ప్రకారం.. గత పదేళ్లలో దేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది.

1911-21 దశాబ్దాన్ని మినహాయిస్తే.. వృద్ధి రేటు తగ్గడం దేశంలో ఇదే తొలిసారి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. 19.9 కోట్లతో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉండగా.. కేవలం 64,429 మంది జనాభాతో లక్షదీవులు అట్టడుగు స్థానంలో ఉంది.



స్వదేశీ మార్కెట్ పరిమాణాన్ని నిర్ణయించడంలో ఒక ముఖ్య కారకం జనాభా. సాపేక్షికంగా ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉన్నప్పటికీ.. చైనా, భారత్‌లలో జనాభా కూడా అధికంగా ఉండడంతోపాటు అంతే స్థాయిలో మార్కెట్లు కూడా విస్తరించాయి. దీంతో బహుళజాతి సంస్థలు ఈ దేశాల్లోని మార్కెట్లలో ప్రవేశించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాయి.


21వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ జనాభా 6.1 బిలియన్లు కాగా.. అది 2007లో 6.6 బిలియన్లకు చేరుకుంది. 2010లో 6.9 బిలియన్లకు పెరిగింది. 2015 నాటికి 7.2 బిలియన్లకు, 2050 నాటికి 9.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 90 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. 2001లో భారత్ జనాభా 1,028, 737,436 నుంచి 2011లో 1,210,193,422 కు పెరిగింది.


ప్రపంచ జనాభాలో భారత్:

ప్రస్తుత భారతదేశ మొత్తం జనాభా..అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాకు సమానం. ఈ ఆరు దేశాల మొత్తం జనాభా 1214.3 మిలియన్లు కాగా భారత్ జనాభా 2011 లెక్కల ప్రకారం.. 1210.2 మిలియన్లు. చైనా, భారత్ జనాభాలోని తేడా 2001లో 238 మిలియన్లు. 2011లో ఈ వ్యత్యాసం 131 మిలియన్లకు తగ్గింది.

ప్రపంచంలోని మొత్తం జనాభాలో 19.4 శాతం చైనాలో, 17.5 శాతం భారత్‌లో నివసిస్తున్నారు. భారత్, అమెరికా జనాభాలోని తేడా 2001లో 741 మిలియన్లు ఇది 2011 నాటికి 902 మిలియన్లకు పెరిగింది. 2000-10 మధ్య కాలంలో ప్రపంచ జనాభావృద్ధి 1.23 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి అభిప్రాయంలో ఇదే కాలానికి సంబంధించి చైనాలో జనాభా వృద్ధి 0.53 శాతం. భారత్‌లో వృద్ధి 1.64 శాతం.


20వ శతాబ్దం ప్రారంభంలో భారత్ జనాభా 238.4 మిలియన్లు. గత 110 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా 4 రెట్లు పెరిగి.. 2011లో 1210 మిలియన్లకు చేరుకుంది. 20వ శతాబ్దం ప్రథమార్థంలో జనాభా ఒకటిన్నర రెట్లు, ద్వితీయార్థంలో మూడు రెట్లు పెరిగింది. స్వాతంత్య్రానంతరం దశాబ్దపు జనాభా వృద్ధి 1981-91 మధ్య 23.87 శాతం నుంచి 1991-2001 మధ్య 21.54కు తగ్గి 2001-2011 మధ్య 17.64 శాతానికి చేరుకుంది.

జనాభా-రాష్ట్రాలు:

దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్ర జనాభా బ్రెజిల్ దేశ జనాభాకు సమానం. ఉత్తరప్రదేశ్, మహారాష్టల్ర జనాభా కలిపితే 312 మిలియన్లు. ఈ మొత్తం అమెరికాలో నివసించే జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 10 మిలియన్ల కంటే ఎక్కువజనాభా కలిగి ఉన్నాయి. మరోవైపు దేశంలోని 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జనాభా ఒక మిలియన్‌కు చేరుకునే అవకాశం ఉంది.

1991-2001 కాలంలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో దశాబ్దపు జనాభా వృద్ధి శాతం ఎక్కువగా ఉంది. కాగా 2001-11 మధ్య ఈ వృద్ధి శాతం తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తగ్గుదల స్వల్పంగా 3.5 శాతంగా ఉంది. మహారాష్టల్రో 6.7 శాతం, తమిళనాడులో 3.9 శాతం కాగా పుదుచ్చేరిలో అత్యధికంగా 7.1 శాతంగా నమోదైంది.


చిన్న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాద్రానగర్ హవేలీ, డామన్-డయ్యూల్లో ఈ వృద్ధి 5.3 శాతం కంటే ఎక్కువగా ఉంది. లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులు, గోవాలలో ఈ వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. కాగా నాగాలాండ్‌లో మాత్రమే ఈ అంశానికి సంబంధించి రుణాత్మక వృద్ధి నమోదైంది.


కేరళలో జనాభా వృద్ధి 1961-71 మధ్య 26.29 శాతం కాగా 1991-2001 మధ్య 9.43 శాతానికి పడిపోయింది. వివిధ కార్యక్రమాల ద్వారా 2001-11 మధ్య జనాభా వృద్ధి రేటును 4.9 శాతానికి పరిమితం చేసుకోగలిగింది. జనాభా వృద్ధి రేటు విషయంలో..40 సంవత్సరాల క్రితం కేరళ, తమిళనాడులలో నెలకొన్న స్థితి ప్రస్తుతం బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కనిపిస్తోంది.


స్త్రీ-పురుష నిష్పత్తి:

దేశ స్వాతంత్య్రానంతరం సమాజంలో మహిళా ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష నిష్పత్తిలో పెరుగుదల ఉంటుందని భావించారు. కానీ దానికి భిన్నంగా మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఈ నిష్పత్తి తగ్గింది. 1961 నుంచి కేరళలో స్ర్తీ-పురుష నిష్పత్తిలో మంచి పెరుగుదల కనిపించింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్ర్తీ-పురుష నిష్పత్తి జాతీయ సగటు క ంటే ఎక్కువ.

జనాభా వృద్ధి రేటు తగ్గుదల:

భారత్‌లో స్వాతంత్య్రానంతరం ఆరోగ్య సౌకర్యాల విస్తరణతోపాటు అంటు వ్యాధులను పూర్తిగా అరికట్టడం వల్ల మరణాల రేటు తగ్గింది. 1950-51లో జననాల రేటు ప్రతి 1000 మందికి 39.9. కాగా మరణాల రేటు ప్రతి 1000 మందికి 27.4. మరణాల రేటు 2009 నాటికి ప్రతి 1000 మందికి 7.4 కు తగ్గింది. 1911-21 మధ్య కాలంలో జనన, మరణాల రేటు సమానంగా ఉండటంతో జనాభా పెరుగుదల సంభవించలేదు. గత 50 సంవత్సరాల కాలంగా శిశు మరణాల రేటులో తగ్గుదల నమోదైంది. 20వ శతాబ్దపు రెండో దశాబ్దంలో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 218 కాగా 2007 నాటికి 55కి తగ్గింది.

అవసరమైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోయినప్పటికీ, పేదరిక తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రసూతి మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదు కావడం గమనార్హం. జననాల రేటు ప్రతి 1000 మందికి 1950-51లో 39.9గా ఉంది. కాగా ఈ రేటు 2008-09లో 22.8కి తగ్గింది. పెరుగుతున్న పట్టణీకరణ కూడా జనాభా వృద్ధి తగ్గడానికి ఒక రకంగా కారణమైందని చెప్పొచ్చు. జనాభా నియంత్రణలో భాగంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందింది.


చైనాలో జననాల రేటు ప్రతి 1000 మందికి 24 కాగా ప్రస్తుతం 12కు తగ్గించుకోగలిగింది. అక్కడ వివాహితులైన స్త్రీలలో 85 శాతం మంది గర్భనిరోధక సాధనాలు వినియోగిస్తున్నారు. మన దేశంలో వీరి శాతం 41 మాత్రమే. గర్భనిరోధక సాధనాల వినియోగంలో మన దేశం కంటే శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంది. దాంతో ఆ దేశంలో జననాల రేటు 19కి తగ్గింది. కేరళ, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలను మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పట్ల ఎక్కువ మంది ప్రజలకు అవగాహన లేదని చెప్పొచ్చు.


జనాభా వృద్ధి రేటులో తగ్గుదల గణనీయంగా ఉన్నప్పటికీ.. ప్రోత్సాహక విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ వృద్ధిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. మహిళా సాధికారత పెంపు, వివాహ వయసు పెంచడం, ఒకే బిడ్డ విధానం (వన్ చైల్డ్ నార్మ్) పాటించిన వారికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించడం, హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యల ద్వారా జనాభా వృద్ధి రేటును నియంత్రించవచ్చు. దేశంలో జనాభా వృద్ధి రేటులో తగ్గుదల నమోదుకావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగుపడగలదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.


ముఖ్యాంశాలు:

1950లో ప్రపంచ జనాభాలో చైనా జనాభా 22 శాతం కాగా భారత్ వాటా 14.2 శాతం.
ప్రపంచ విస్తీర్ణంలో భారత్ వాటా 2.4 శాతం. జనాభా వాటా 17.5 శాతం.
ప్రపంచ విస్తీర్ణంలో అమెరికా వాటా 7.2 శాతం. జనాభా వాటా 4.5 శాతం.
2001-11 మధ్య కాలంలో భారత్‌లో జనాభా పెరుగుదల 181 మిలియన్లు.
భారతదేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ శాతం 16. అంధ్రప్రదేశ్ జనాభా ఏడు శాతం.
2000-10 మధ్య కాలంలో ప్రపంచ జనాభా వృద్ధి 1.23 శాతంగా ఉండగలదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ప్రపంచంలో జనాభా పరంగా ఐదో పెద్ద దేశం బ్రెజిల్.
199.6 మిలియన ్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (112.4 మిలియన్లు), బీహార్ (103.8 మిలియన్లు), పశ్చిమ బెంగాల్ (91.3 మిలియన్లు), ఆంధ్రప్రదేశ్ (84.7 మిలియన్లు) ఉన్నాయి.
నాగాలాండ్ రాష్ట్రంలో మాత్రమే దశాబ్దపు జనాభావృద్ధి శాతం పరంగా రుణాత్మకం.
డామన్-డయ్యూలో స్ర్తీ-పురుష నిష్పత్తి 618:1000
కేరళలో స్ర్తీ-పురుష నిష్పత్తి 1084:1000
భారత్ జనాభాలో 0-6 వయో వర్గం 13.2 శాతం
భారత్‌లో అక్షరాస్యత 74.04 శాతం. కాగా పురుషుల అక్షరాస్యత రేటు 82.14 శాతం, స్ర్తీల అక్షరాస్యత రేటు 65.46 శాతం.

No comments:

Post a Comment