సహజ వనరులు.. గాలి, నీరు

గాలి
భూమిపై గాలి పొర భూ ఉపరితలం నుంచి సుమారు 1000 కి.మీ వరకు ఉంది. ఈ గాలి పొరనే వాతావరణం అంటారు.
గాలి ఒక మిశ్రమ పదార్థం.
వాతావరణంలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్‌తోపాటు కార్బన్‌డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, నియాన్, క్రిప్టాన్, జినాన్ వంటి జడవాయువులు కూడా ఉంటాయి.

గాలిలో నీటి ఆవిరి కూడా ఉంటుంది.

గాలి ధర్మాలు:
గాలికి బరువు ఉంటుంది. స్థలాన్ని ఆక్రమిస్తుంది.
గాలికి ఉండే పీడనాలు.. ఊర్ధ్వ ముఖ పీడనం, అధోః ముఖ పీడనం, పార్శ్వ ముఖ పీడనం.

వాతావరణ పీడనం:

గాలి భూమిపై కొంత పీడనాన్ని కలుగజేస్తుంది. ఈ పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు.
వాతావరణ పీడనాన్ని భారమితి (బారోమీటర్) తో కొలుస్తారు.
టారిసెల్లీ అనే శాస్త్రవేత్త పాదరస భారమితిని రూపొందించాడు.
పాదరస భారమితిలోని పాదరస స్తంభం ఎత్తు 76 సెం.మీ. దీన్నే సాధారణ వాతావరణ పీడనం అంటారు.
భారమితిలో పాదరస స్తంభంపై ఉన్న శూన్య ప్రదేశాన్ని టారిసెల్ల్లీ శూన్య ప్రదేశం అంటారు.
పాదరస స్తంభం ఎత్తు క్రమేపీ తగ్గడం వర్షం రాకను, హఠాత్తుగా తగ్గడం తుఫాను రాకను సూచిస్తుంది.

గాలి కాలుష్యం:

హానికర పదార్థాలు.. గాలిలో అధికంగా ఉండటాన్ని గాలి కాలుష్యం అంటారు.
కాలుష్య కారకాలు:
ఇంధనాల వినియోగం, అడవుల నరికివేత, వాహనాల నుంచి వెలువడే వాయువులు, పారిశ్రామికీకరణ, ఆధునిక వ్యవసాయ విధానాలు, అణుధార్మికత, ధ్వని కాలుష్యం.

కాలుష్య నివారణ మార్గాలు:

సీఎన్‌జీ వాహనాల వినియోగం.
ఫ్యాక్టరీల్లో వెలువడే పొగకు సరైన ఫిల్టర్‌లు వాడటం.
{పత్యామ్నాయ ఇంధన వనరులైన సౌరశక్తి, బయోగ్యాస్, బయోమాస్ ఎనర్జీ వంటి వాటి వాడకం.
అడవుల పెంపకం
బాయిల్ సూత్రం: నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటే.. దాని పీడనం, ఘనపరిమాణం విలోమానుపాతంలో ఉంటాయి.

P a 1/V (OR) PV= Constant

బెర్నౌలీ సూత్రం: ఏదైనా ఒక వస్తువు ఉపరితలానికి సమాంతరంగా గాలి వీచినప్పుడు తలం పైన పీడనం, కింది పీడనం కంటే తక్కువ ఉంటుంది. దీన్నే బెర్నౌలీ సూత్రం అంటారు.

అనువర్తనాలు:

గదిలో సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు గోడ మీదున్న కాలెండర్ కాగితాలు పైకి లేవడం
ఉధృతంగా గాలి వీచేటప్పుడు ఇంటి పై కప్పులు ఎగిరిపోవడం
విమానాలు గాలిలో ఎగరటం
ప్రవాహి పీడనం:ప్రవాహి అనగా ప్రవహించేది అని అర్థం.

ఒత్తిడి: తలానికి లంబంగా కలుగజేసిన మొత్తం బలం లేదా బరువును ఒత్తిడి అంటారు. దీనికి ప్రమాణాలు సీజీఎస్ పద్ధతిలో డైన్లు, ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్లు.

పీడనం: ఒక బిందువు వద్ద ఉన్న ప్రమాణ వైశాల్యం గల తలంపై కలుగజేసిన ఒత్తిడిని ఆ బిందువు వ ద్ద పీడనం అంటారు.

పీడనం = ఒత్తిడి/వైశాల్యం

పీడనం ప్రమాణాలు: సీజీఎస్ పద్ధతిలో డైను/సెం.మీ2, ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్/మీ2
ప్రవాహి ఊర్ధ్వ, అధః, పార్శ్వ పీడనాలను కలుగజేస్తుంది.

పాస్కల్ సూత్రం: నిశ్చల స్థితిలో ఉన్న ద్రవంపై ఒక బిందువు వద్ద పీడనం ఎక్కువ చేస్తే అది ఆ ద్రవంలోని అన్ని బిందువులను అంటే...అన్ని దిశలకు సమానంగా, ఏ మార్పు లేకుండా వ్యాపిస్తుంది లేదా ప్రసారమవుతుంది.


అనువర్తనాలు: హైడ్రాలిక్ యంత్రాలు పాస్కల్ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. వీటిని పత్తి బేళ్ల తయారీకి, నూనె గింజల నుంచి నూనె తీయడానికి వినియోగిస్తారు. అంతేకాకుండా వాహనాలకు హైడ్రాలిక్ బ్రేకులుగా వాడతారు.


ఆర్కిమెడిస్ సూత్రం: ఏదైనా వస్తువు ఒక ప్రవాహిలో పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ మునిగి ఉన్నప్పుడు అది కోల్పోయినట్లనిపించిన బరువు... తొలగించిన ప్రవాహి బరువుకు సమానం.


అనువర్తనాలు: ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించి ఘనపదార్థాల సాపేక్ష సాంద్రతలను కనుక్కోవచ్చు. అదేవిధంగా ద్రవం సాంద్రతను నిర్ణయించవచ్చు.


ప్లవన సూత్రాలు:

తొలగించిన ద్రవ ద్రవ్యరాశి, ఆ ద్రవంలో తేలియాడుతున్న వస్తువు ద్రవ్యరాశికి సమానం.
{దవంలో తేలియాడు వస్తువు గరిమనాభి, తొలగించిన ద్రవ గరిమ నాభి, రెండూ ఒకే క్షితిజ లంబరేఖపై ఉంటాయి.

అనువర్తనాలు: హైడ్రోమీటర్‌ను ద్రవాల విశిష్ట సాంద్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు.


నీరు

భూ ఉపరితలంపై నీరు సమారు 70 శాతం మేర ఉంటుంది.
{పధాన నీటి వనరులు సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, బావులు మొదలైనవి.
భూమిపై ఉన్న నీటిలో సుమారు 97 శాతం సముద్రపు నీరు. ఇది తాగు నీటిగా ఉపయోగపడదు.
మిగిలిన 3 శాతం మంచినీటిలో.. రెండు శాతం ధ్రువాల వద్ద మంచు రూపంలో ఉంది.
మిగిలిన ఒక శాతం నీరు మాత్రమే తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది.
నీరు ద్రవ, ఘన, వాయు రూపాలలో లభిస్తుంది.

నీటి బాష్పీభవనం:

నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.
ఒక సెకనులో ఎంత ఘనపరిమాణం గల నీరు ఆవిరిగా మారుతుందో దాన్ని బాష్పీభవనం అంటారు.
బాష్పీభవన రేటు ప్రవాహిని, ప్రదేశాన్ని బట్టి మారుతుంది.

నీటి ద్రవీభవనం:

నీటి ఆవిరి చల్లారి నీరుగా మారే ప్రక్రియను నీటి ద్రవీభవనం అంటారు.
నీటి ఘనీభవనం: నీరు మంచుగా మారటాన్ని నీటి ఘనీభవనం అంటారు.
జలచక్రం: సముద్రం, భూమి, వాతావరణాల మధ్య నీరు నిరంతరం తిరుగుతూ ఉండటాన్ని జలచక్రం అంటారు.
నీటి ఘనపరిమాణాత్మక సంఘటనం:
నీరు మూలకం కాదు
నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్‌లు 1:2 నిష్పత్తిలో ఉంటాయి.
నీటిని విద్యుద్విశ్లేషణం చెందించడం ద్వారా నీటి ఘనపరిమాణాత్మక సంఘటనాన్ని తెలుసుకోవచ్చు.

జల కాఠిన్యత:

సబ్బుతో చర్యను బట్టి నీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.. 1. కఠిన జలం 2. సాధు జలం
సబ్బుతో వెంటనే నురగనిచ్చే నీటిని సాధు జలం అంటారు.
సబ్బుతో వెంటనే నురగ నివ్వక తెల్లని పిండి వంటి అవక్షేపాన్నిచ్చే నీటిని కఠిన జలం అంటారు.
జల కాఠిన్యం రెండు రకాలు
1. తాత్కాలిక కాఠిన్యత 2. శాశ్వత కాఠిన్యత.

తాత్కాలిక కఠినత్వం: నీటిలో కాల్షియం, మెగ్నీషియం బై కార్పొనేట్‌లు కలిగి ఉండటం వల్ల నీటికి తాత్కాలిక కఠినత్వం వస్తుంది. దీన్ని మరిగించటం వల్ల లేదా క్లార్క్ విధానం ద్వారా తొలగించవచ్చు.

శాశ్వత కఠినత్వం: నీటిలో కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్, క్లోరైడ్‌లు కరిగి ఉండటం వల్ల నీటికి శాశ్వత కఠినత్వం కలుగుతుంది. దీన్ని పెర్‌మ్యుటిట్ పద్ధతి ద్వారా, అయానుల మార్పిడి పద్ధతి ద్వారా తొలగించవచ్చు.

తాగునీటి సరఫరా:

నీటిలో అనేక ఖనిజాలు, సూక్ష్మ జీవులు ఉంటాయి. అందువల్ల తాగే నీరు శుభ్రంగా ఉండాలి. లేకపోతే కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సంభవిస్తాయి.
నీటిని గ్రామాలలోనూ, పట్టణాల్లోనూ శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు.
ఈ సరఫరాలో మూడు దశలు ఉన్నాయి. అవి 1. రిజర్వాయర్‌ల్లో నిల్వ చేయడం 2. క్లోరినేషన్/ఎరేషన్ 3. గొట్టాల ద్వారా సరఫరా చేయడం.

నీటి కాలుష్యం:

అధిక మోతాదులో ఉండకూడని వ్యర్థ పదార్థాలు నీటిలో ఉంటే దాన్ని నీటి కాలుష్యం అంటారు.
కాలుష్య కారకాలు: పరిశ్రమల వ్యర్థాలు, అణు ఉత్పాదన కేంద్రాలు, వ్యవసాయ వ్యర్థాలు, పౌల్ట్రీ పరిశ్రమలు, డైరీ పరిశ్రమలు మొదలైనవి.

కాలుష్య నివారణ పద్ధతులు:

వ్యర్థ నీటిని చెరువులు, సరస్సుల్లోకి వదిలేముందు శుద్ధి చేయాలి.
చెత్త పదార్థాలను నీటిలో కలవనీయకుండా కంపోస్ట్ తయారు చేయాలి.
నివాసప్రాంతాలకు దూరంగా పరిశ్రమలు స్థాపించాలి.
వాన నీటిని నిల్వ చేసే పద్ధతులు అవలంబించాలి.
నదులు, సరస్సులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి.

....................................................


బిట్స్

1. కిరోసిన్, పెట్రోల్‌లలో బాష్పీభవన రేటు అధికంగా ఉండేది ..................
2. నీటి ఆవిరి గాలిలో ప్రవే శించడాన్ని.................అంటారు.
3. నీటి బాష్పీభవన స్థానం.................
4. నీటి ఘనీభవన స్థానంచి.................
5. నీటి విద్యుత్ వాహకతను పెంచడానికి .................కలుపుతారు.
6. విద్యుత్‌ను ఉపయోగించి పదార్థాన్ని వినియోగం చెందించడాన్ని .................అంటారు.
7. భారమితిలో పాదరస స్తంభంపై ఉన్న శూన్య ప్రదేశాన్ని .................అంటారు.
8. అయాన్ మార్పిడి ద్వారా నీటి కాఠిన్యతను తొలగించే పరికరంలో ఆ పాత్ర.................ను కలిగుంటుంది.
9. అయాన్ మార్పిడి ద్వారా నీటి కాఠిన్యతను తొలగించే పరికరంలో అ పాత్రను.................అంటారు.
10. మెగ్నీషియం కార్బొనేట్ నీటిలో కరిగిన .................కాఠిన్యత ఏర్పడుతుంది.
11. క్లార్క్ విధానంలో నీటిని శుభ్రపరిచినప్పుడు నీటికి .................కలుపుతారు.
12. నీటిని తుషార రూపంలో గాలిలోకి పంపు చేసి సూక్ష్మ జీవులను నిర్మూలించడాన్ని.................అంటారు.
13. క్లోరిన్ వాయువును పంపి నీటిని శుభ్రం చేసే విధానాన్ని .................అంటారు.
14. అధిక మోతాదులో ఉండకూడని వ్యర్థ పదార్థాలు నీటిలో ఉండటాన్ని .................అంటారు.
15. అధిక పీడన ప్రదేశం నుంచి అల్ప పీడన ప్రదేశానికి వీచే గాలిని .................అంటారు.
16. వర్షాన్ని కొలవడానికి .................వాడతారు.
17. మంచు, ఉప్పుల మిశ్రమాన్ని .................అంటారు.
18. గాలి భూ ఉపరితలంపై కలుగజేసే పీడనాన్ని ................. అంటారు.
19. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం .................
20. భారమితిలో పాదరస స్తంభం ఎత్తు .................

సమాధానాలు:

1. పెట్రోలు; 2. ఆర్ధ్రత; 3. 100 డిగ్రీ సెంటిగ్రేడ్; 4. 0 డిగ్రీ సెంటిగ్రేడ్; 5. ఆమ్లం; 6. విద్యుద్విశ్లేషణం; 7. టారిసెల్లీ శూన్యప్రదేశం; 8. డీ అసిలైట్; 9. అయాన్ ఎక్స్‌చేంజర్; 10. తాత్కాలిక; 11. సున్నం; 12. ఏరేషన్; 13. క్లోరినేషన్; 14. నీటి కాలుష్యం; 15. పవనం; 16. వర్షమాపకం; 17. ఘనీభవన మిశ్రమం; 18. వాతావరణ పీడనం; 19. భారమితి; 20. 76 సెం.మీ

No comments:

Post a Comment