మెంటల్ ఎబిలిటీ గ్రూప్ - 1 మెయిన్స్


ఎ. అనిల్ కుమార్ రెడ్డి
హైదరాబాద్

 

PASSAGE ANALYSIS
1. ఆర్ధిక సంస్కరణలు ప్రైవేట్ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడమంటే చాలామంది ప్రైవేటీకరణ అనే అనుకుంటారు. ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో భారతదేశం ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా ప్రైవేటీకరణ విధానాన్ని భారతదేశంలో ప్రారంభించినట్లయింది.

భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలు నైపుణ్యలేమికి (Inefficiency) పెట్టింది పేరు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఏళ్లుగా నష్టాల్లో కూరుకుపోయాయి. మరోవైపు ప్రైవేట్ రంగ సంస్థలు లాభాల పంట పండిస్తున్నాయి. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను పునర్నిర్మించకుంటే(restructuring) ఆర్థిక సంస్కరణల అమలు సంపూర్ణం కాదు.


కింది నిర్ణయాల్లో ఏవి కచ్చితమైనవి

ఎ) ఆర్థిక సంస్కరణల ప్రభావం ప్రధానంగా ప్రైవేట్ రంగంపై ఉంటుంది?
జ: నిర్ణీతాంశంలోని మొదటి వాక్యంలో ఆర్థిక సంస్కరణల ప్రభావం ప్రైవేట్ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా ఉంటుంది అని చెప్పారు. అంటే సంస్కరణల ప్రభావం ప్రైవేట్ రంగ సంస్థలపై అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయం సరి అయ్యే అవకాశం ఉంది. (probably True)

Note: ఆర్ధిక సంస్కరణల ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలపై ఉంటుంది అనే నిర్ణయాన్ని కూడా పై విధంగానే విశ్లేషించవచ్చు. ఈ నిర్ణయం సరికాక పోయే అవకాశం ఉంది. (probably False)


బి) భారతదేశం ఆర్ధిక సంస్కరణల వైపు జాగ్రత్తగా అడుగులు వేయాలనుకుంటోంది?

జ: ఇచ్చిన నిర్ణీతాంశంలోని మూడో వాక్యం నుంచి ఈ నిర్ణయం కచ్చితంగా సరైంది అని (definitely True) చెప్పొచ్చు.

సి) ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణం ఆర్థిక సంస్కరణల ఉద్దేశం కాదు?

జ: మొదటి వాక్యంలో ఆర్థిక సంస్కరణల ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థలపై ఉంటుం ది అని ఇచ్చారు. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా సంస్కరణలు అమలు చేస్తున్నారు అని చెప్పారు. అలాగే చివరి వాక్యంలో ప్రభుత్వరంగ సంస్థలను పునర్నిర్మించకుంటే ఆర్థిక సంస్కరణలు సంపూర్ణం కాలేవు అని పేర్కొన్నారు. కాబట్టి ఈ నిర్ణయం కచ్చితంగా తప్పు (definitely False)

డి) ఆర్థిక సంస్కరణలు అంటే ప్రైవేటీకరణయే.

జ: ఈ నిర్ణయం కూడా కచ్చితంగా తప్పు. ఎందుకంటే నిర్ణీతాంశం ప్రకారం ఆర్థిక సంస్కరణలు అంటే ప్రైవేటీకరణయే అని చాలామంది అనుకుంటారు అని మాత్రమే చెప్పారు. కానీ ఆర్థిక సంస్కరణల ప్రభావం ప్రైవేట్ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా ఉంది.

ఇ) ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించడం ఆర్థిక సంస్కరణల్లో భాగం.

జ: ఈ నిర్ణయం కచ్చితంగా సరైంది. ఎందుకంటే ఇచ్చిన నిర్ణీతాంశంలోని నాల్గో వాక్యంలో దీన్ని స్పష్టంగా చెప్పారు.

2. దారిద్య్ర రేఖకు దిగవ ఉన్న వారికి ఏడాదిలో 100 రోజులు ఉపాధి కల్పిస్తామన్న హామీ ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ పరిణామం. ఐతే ఇలాంటి ఉపాధి పనులు చేయడానికి అర్హులందరూ ముందుకు రాకపోవచ్చు. ఉదాహరణకు కేవలం 30 మిలియన్ల మంది ఈ పథకం కింద ఇస్తామన్న పనులను చేయడానికి ముందుకు వస్తారని అనుకుందాం.

జవహర్ రోజ్‌గార్ యోజన, ఉపాధి హామీ పథకం కింద మనిషికి ఒక రోజు పని కల్పించడానికి ఉండే వ్యయం రూ.150. ఈ విధంగా చూస్తే ఏడాదికయ్యే మొత్తం వ్యయం రూ.45,000 కోట్లు. రుతుపవనాలు, వేతనాల స్థాయి సామగ్రి ఖర్చు మొదలైన వాటిననుసరించి ఈ వ్య యం క్రమంగా పెరగొచ్చు. కానీ ప్రస్తుతం ఈ పథకాలకు కేటాయిస్తున్న నిధులు అవసరమైన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి.


కింది నిర్ణయాల్లో ఏవి కచ్చితమైనవి

ఎ) నిజానికి దారిద్య్రరేఖకు దిగువన 30 మిలియన్ల మంది ఉన్నారు.
జ: ఈ నిర్ణయం కచ్చితంగా తప్పు (defin-itely False). ఎందుకంటే నిర్ణీతాంశం ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిలో కేవలం 30 మిలియన్ల మంది ఈ పథకం కింద పనులు చేయడానికి ముందుకు వస్తారని అంచనా వేశారు. అంటే నిజానికి దారిద్య్రరేఖకు దిగువన ఉండే వారి సంఖ్య 30 మిలియన్ల కంటే అధికం.

బి) జవహర్‌రోజ్‌గార్ యోజన పథకానికి సరిపడా నిధులు కేటాయించారు.

జ: ఈ నిర్ణయం కూడా కచ్చితంగా తప్పు. ఎందుకంటే నిర్ణీతాంశం చివరి వాక్యంలో ఈ పథకానికి నిధులను సరిపడా కేటాయించడం లేదని పేర్కొన్నారు.

సి) ఉపాధి హామీ పథకం కింద అయ్యే వ్యయం రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది.

జ: ఈ నిర్ణయం కచ్చితంగా సరైందే. ఎందుకంటే నిర్ణీతాంశంలో రుతుపవనాలు, వేతనాల స్థాయి, సామగ్రి ఖర్చులపై ఆధారపడి ఈ పథకానికి అయ్యే వ్యయం పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

డి) ఉపాధి హామీ పథకాలకు చేసే నిధుల కేటాయింపులు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

జ: ఈ నిర్ణయం కూడా కచ్చితంగా సరైందే. ఇచ్చిన నిర్ణీతాంశంలో రుతుపవనాల ఆధారంగా ఈ పథకానికి అయ్యే వ్యయం పెరిగే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. అప్పుడు ఈ పథకానికి కేటాయించాల్సిన నిధులు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇ) జవహర్ రోజ్‌గార్ యోజన ఉపాధి హామీ పథకాలు అవసరమైన వారందరికీ పని కల్పిస్తున్నాయి.

జ: ఈ నిర్ణయం సరైంది కాదు. ఎందుకంటే నిర్ణీతాంశంలో ఈ పథకాలకు సరిపడా నిధులు కేటాయించడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి అవసరమైన అందరికీ ఈ పథకాలు పని కల్పించడం లేదు అని అర్థమవుతుంది.

3. దక్షిణ ఆసియా ప్రాంతం తనకంటూ ప్రత్యేకగుర్తింపు కలిగి ఉంది.

దక్షిణ ఆసియా దేశాలకు సంబంధించిన ఉమ్మడి విషయాలు- వలసపాలన, అభివృద్థి లేకపోవడం నిరుద్యోగ సమస్య, నిరక్షరాస్యత, పేదరికం, లింగవివక్ష, రాజకీయ వ్యవస్థలో అస్థిరత్వం మొదలైనవి. ఈ సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దక్షిణ ఆసియా దేశాల్లో ఎక్కువ. దక్షిణ ఆసియా దేశాలన్నీ చాలా ఏళ్ల పాటు పాశ్చాత్య దేశాల పాలనలో మనుగడ సాగించాయి. ఈ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉన్నాయి. సుమారు 50 శాతం ప్రజలు నిరక్షరాస్యులే. విపరీతమైన నిరుద్యోగం పేదరికానికి దారి తీసింది. దక్షిణాసియా దేశాల్లోని మహిళలపై తరచూ భౌతిక, మానసిక దాడులు జరుగుతున్నాయి.

కింది నిర్ణయాల్లో ఏవి కచ్చితమైనవి

ఎ) భారతదేశం కంటే పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఎక్కువసార్లు మారింది.
జ: నిర్ణీతాంశంలోని సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం సరైనదో కాదో చెప్పలేం. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ దేశాల్లో ప్రభుత్వ మార్పుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.

బి) భారతదేశంలో దాదాపు 500 మిలియన్ల మంది నిరక్షరాస్యులు

జ: ఈ నిర్ణయం సరైందని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇచ్చిన నిర్ణీతాంశంలో భారతదేశపు జనాభా ఎంత అనేది ప్రస్తావించలేదు. కేవలం సగం మంది జనాభా నిరక్షరాస్యులు అని మాత్రమే చెప్పారు. భారతదేశ జనాభా 1000 మిలియన్లు అయితే ఈ నిర్ణయం సరైంది కావడానికి అవకాశం ఉంటుంది.

సి) మహిళల స్థితిగతులు దక్షిణాసియా దేశాలకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగ్గా ఉన్నాయి.

జ: ఈ నిర్ణయం కచ్చితంగా సరైందని చెప్పవచ్చు. ఇచ్చిన నిర్ణీతాంశంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల్లో లింగ వివక్షత ఎక్కువని పేర్కొన్నారు.

డి) దక్షిణాసియాలోని చాలా దేశాల స్థూల జాతీయోత్పత్తి (G.D.P) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉంది.

జ: ఈ నిర్ణయం సరైందని కచ్చితంగా చెప్పలేం. కానీ సరైంది కావడానికి అవకాశం ఉంది (probably true). ఎందుకంటే నిర్ణీతాంశంలో దక్షిణాసియా దేశాల్లో పేదరికం చాలా తీవ్రంగా ఉందన్నారు. వీటి ఆర్థిక వ్యవస్థలు కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశల్లో ఉన్నాయని పేర్కొ న్నారు. కానీ పేదరికం ఉన్నంత మాత్రాన స్థూల జాతీయోత్పత్తి ఇతర దేశాలకంటే, లేదా ప్రపంచపు సగటు కంటే కచ్చితంగా తక్కువ ఉండాల్సిన అవసరం లేదు.

ఇ) దక్షిణాసియా దేశాల్లో ఉత్సాహవంతులైన వ్యాపారవేత్తలు పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉన్నారు.

జ: ఈ నిర్ణయాన్ని కచ్చితంగా తప్పు అని చెప్పలేం. కానీ ఈ నిర్ణయం తప్పు కావడానికీ అవకాశం ఉంది (probably false). ఎందుకంటే ఇచ్చిన నిర్ణీతాంశంలో దక్షిణ దేశాల్లో లింగ వివక్ష ఉంది అని పేర్కొన్నారు. అంతేకాకుండా స్త్రీలు ఈ దేశాల్లో భౌతిక, మానసిక దాడులకు గురవుతున్నారు అని కూడా పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పురుషుల్లో కంటే మహిళల్లో వ్యాపారవేత్తలు ఎక్కువ సంఖ్యలో ఉండటానికి అవకాశం లేదు.

No comments:

Post a Comment