మౌర్య పూర్వ యుగం - షోడశ మహా జనపదాలు

క్రీస్తు పూర్వం 600 నుంచి 325 వరకు గల కాలాన్నీ మౌర్య పూర్వ యుగం (Pre-Mouryan Age) అని వ్యవహరిస్తున్నారు. ప్రాచీన భారత రాజ్య వ్యవస్థతోపాటు, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు కూడా స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్న కాలమది. సుమారు వేయి సంవత్సరాలపాటు భారత రాజకీయ, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు అదే రూపంతో కొనసాగాయని చెప్పవచ్చు.

షోడశ మహా జనపదాలు:
బౌద్ధ గ్రంథం ‘అంగుత్తర నికాయ’ ఆధారంగా.. ఆనాటి భారతదేశంలో 16 మహా జనపదాలు ఉండేవని తెలుస్తోంది. ఈ మహా జనపదాలు, వాటి రాజధానుల వివరాలు ఇవి..

మహా జనపదం రాజధాని
అంగ చంపా
మగధ గిరివజ్రం, పాటలీపుత్రం
కాశీ వారణాసి
కోసల అయోధ్య, శ్రావస్తి
వజ్జి వైశాలి
మల్ల కుసీ నగర, పావాపురి
చేది సుక్తిమతి
వత్స కౌసాంబి
కురు ఇంద్రప్రస్థ
పాంచాల అహిచ్ఛత్ర
మత్స్య విరాట నగరం
సౌరసేన మధుర
అస్సక పౌధన్యపురం (బోధన్)
అవంతి ఉజ్జయిని, మహిష్మతి
గాంధార తక్షశిల
కాంభోజ రాజపుర

షోడశ మహా జనపదాల్లో రాచరిక వ్యవస్థలే అధికం. అయినప్పటికీ కొన్ని గణ రాజ్యాలు కూడా ఉన్నాయి. వజ్జి, మల్ల జనపదాలు అలాంటివే. శాక్యులు పాలించిన కపిలవస్తు, కోలియుల రామగ్రామం, జ్ఞాత్రికుల కుందగ్రామం, తదితరాలు కూడా ఈ కోవకు చెందినవే.

షోడశ మహా జనపదాల్లో కాశీ, కోసల, మగధ, వజ్జియగణ సమాఖ్య ముఖ్యమైనవి. ఈ నాలుగు రాజ్యాల మధ్య నిరంతర యుద్ధాలు జరిగేవి. దీనికి ముఖ్య కారణం.. గంగా నదీ లోయలో సాగే వాణిజ్యంపై ఆధిపత్యం సాధించాలనుకోవడం. ఈ ఆధిపత్య పోరులో చివరకు మగధ పై చేయి సాధించింది.

కాశి: షోడశ మహా జనపదాల్లో తొలుత ప్రాబల్యాన్ని పొందిన రాజ్యం. వరుణ, ఆసి అనే నదుల సంగమ స్థానంలో ఉండటం వల్ల రాజధానికి ‘వారణాసి’ అనే పేరు వచ్చింది. ‘‘కాశీ రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో..’’ అంటూ ఎన్నో జాతక గాధలు ప్రారంభమవడాన్ని బట్టి బ్రహ్మదత్తుడు అనే కాశీ పాలకుడు ఎంతో ప్రాచుర్యం పొందాడని చెప్పవచ్చు.

కోసల: తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. కాశీని ఆక్రమించడం ద్వారా కోసల శక్తిమంతంగా రూపుదిద్దుకుంది. బుద్ధుని కాలంలో కోసల రాజ్యాన్ని ప్రసేనజిత్ (పసేనది) పాలించేవాడు. ఇతని వారసుడు ‘విధూదభ’ శాక్య రాజ్యంపై దండెత్తి శాక్యతెగను సమూలంగా సంహరించాడు.

వజ్జి: ఎనిమిది తెగలు కలిసి పాలించడం వల్ల దీనికి ‘అట్టకుల’ అనే పేరు వచ్చింది. ఈ ఎనిమిది తెగల్లో లిచ్ఛవులు ప్రధానమైన తెగ. మగధ పాలకుడు బింబిసారుడు... లిచ్ఛవుల నాయకుడైన ‘చేతకుని’ కుమార్తె ‘చెల్లన’ను వివాహం చేసుకున్నాడు.
షోడశ మహా జనపదాల్లో అత్యంత శక్తిమంతమై.. మహా సామ్రాజ్యంగా ఎదిగిన రాజ్యం మగధ. ఈ సామ్రాజ్య వికాసంలో పాలకుల విధానాలతో పాటు మగధకు గల భౌగోళిక సానుకూలతలు కూడా దోహదపడ్డాయి.

హర్యాంకులు:
బింబిసారుడు (క్రీస్తు పూర్వం 547-495 వరకు): రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంలో వైవాహిక సంబంధాలకున్న ప్రాధాన్యాన్ని గుర్తించాడు. కోసల రాజ కుమారి కోసలాదేవి, మద్రదేశ (పంజాబ్ ప్రాంతం) రాకుమారి ఖౌమ, లిచ్ఛవుల రాకుమారి ‘చెల్లన’లను పెళ్లి చేసుకుని తన రాజ్యానికి అన్ని వైపుల నుంచి భద్రతను సాధించాడు.

భారతదేశ చరిత్రలో సిద్ధ సైన్యానికి (Standing army) ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాజుగా బింబిసారుడుని పేర్కోవచ్చు. అతడికి గల ‘సేనియ’ అనే బిరుదు ఈ విషయాన్నే సూచిస్తోంది. గ్రామాధికారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ పరిపాలనలో అట్టడుగు స్థాయి వరకు ఆసక్తి ప్రదర్శించాడు. పొరుగునే ఉన్న అంగ రాజ్యాన్ని ఆక్రమించి గంగా నదిపై మగధ ప్రాబల్యాన్ని విస్తరించాడు. అవంతి పాలకుడైన ప్రద్యోతునితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు.

ప్రద్యోతుడు కామెర్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు బింబిసారుడు తన వ్యక్తిగత వైద్యుడైన జీవకుడిని ప్రద్యోతుడి దగ్గరికి పంపాడు. అతనికి స్వస్థత చేకూరేలా చేశాడు. బింబిసారుడు సహజ మరణాన్ని పొందలేదని, కుమారుని కారణంగా అతని జీవితం విషాదంగా ముగిసిందని సాహిత్యాధారాలు సూచిస్తున్నాయి.

అజాత శత్రువు (క్రీస్తు పూర్వం 495-462 వరకు): వజ్జి గణ సమాఖ్యను ధ్వంసం చేయడం ఇతడు సాధించిన ప్రధాన విజయం. లిచ్ఛవుల్లో చిచ్చు పెట్టేందుకు ‘వస్సకార’ అనే బ్రాహ్మణుడిని అజాత శత్రువు నియోగించాడు. వస్సకారుడి కృషి కారణంగా లిచ్ఛవ నాయకుల ఐక్యత దెబ్బతింది. లిచ్ఛవులు బలహీనపడ్డారనే సమాచారం అందుకున్న అజాత శత్రువు వారిపై యుద్ధం ప్రకటించాడు.

ఈ యుద్ధంలో అజాత శత్రువు ‘మహా శిల కంటక’, ‘రథముసల’ అనే ఆయుధాలను వినియోగించి విజయం సాధించినట్లు తెలుస్తోంది. అజాతశత్రువు బుద్ధుడిని కలిసి.. తన తండ్రిని చ ంపి నేరానికి పాల్పడినట్లు తెలిపి... పశ్చాత్తాపాన్ని ప్రకటించినట్లు బౌద్ధ సంప్రదాయం చెబుతోంది.

అజాత శత్రువు తర్వాత వరుసగా నలుగురు పితృహంతకులు అధికారంలోకి వచ్చారు. వారితో విసిగి వేసారిన ప్రజలను ఆకట్టుకొని ‘శిశునాగుడు’ అధికారం చేపట్టాడు. ఆ విధంగా హర్యాంక వంశం అంతమై శిశునాగ వంశం అధికారంలోకి వచ్చింది.

శిశునాగులు: ‘అవంతి’ రాజ్యాన్ని ఆక్రమించి మగధ ప్రాబల్య విస్తరణలో శిశునాగుడు కీలక పాత్ర పోషించాడు. శిశునాగుని వారసుడైన కాలాశోకుడు(కాకవర్ణి) కాలంలోనే వైశాలిలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. కాలాశోకుడిని వధించి మహాపద్మ నందుడు‘నంద ’ వంశాన్ని స్థాపించాడు.

నందులు: నంద వంశ స్థాపకుడైన ‘మహాపద్మ’ నిమ్న జాతికి చెందిన వాడని పురాణాలు, ఇతర సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. నందులు.. మగధ ప్రాబల్యాన్ని మరింత విస్తరించారు. ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రకారం ‘కళింగ’ను నందులు ఆక్రమించినట్లు తెలుస్తోంది.

నందులు గొప్ప సైన్యాన్ని, కోశాగారాన్ని నిర్మించారు. నందులలో చివరి వాడు ధన నందుడు. గ్రీకు రచయితలు ఇతడినే ‘అగ్రేమ్సు’ అని పిలిచే వారు. ఇతడిని ఓడించి చంద్ర గుప్తమౌర్యుడు అధికారంలోకి వచ్చాడు. మగధ విజృంభణకు రాజుల దండయాత్రలు, విధానాలే గాక, మగధకు గల ప్రత్యేక భౌగోళిక సానుకూలతలు కూడా ఉపకరించాయి.

గంగానదీ ప్రవాహ ప్రాంతంలో అధిక భాగాన్ని ఆక్రమించగలగడం మగధ సాధించిన తొలి విజయంగా చెప్పొచ్చు. కాశీ నుంచి అంగ వరకు సారవంతమైన ఒండ్రు మట్టి నేలలు, మగధ రాజ్యంలో ఉండటం వల్ల వ్యవసాయిక మిగులు పెరిగి, మగధ ఆర్థికంగా బలపడింది. ఆ రోజుల్లో వాణిజ్యంలో గంగానదీ వ్యవస్థ ఎంతో కీలకమైంది. గంగానదీపై గల ప్రధాన వాణిజ్య రేవు పట్టణాలన్నింటీని నియంత్రించడం ద్వారా మగధ ఎంతో లాభపడింది.

భారతదేశంలోని అత్యంత సుసంపన్నమైన ఇనుప గనులు మగధ రాజ్యంలోనే ఉన్నాయి. ఇనుప గొడ్డళ్లు.. అడవులను నరికి సాగు భూమిని పెంచడానికి, ఇనుప నాగళు..్ల వ్యవసాయానికి, కొడవళ్లు పంటకోతకు ఉపయోగపడ్డాయి. ఇనుముతో బలమైన ఆయుధాలను తయారు చేసుకోవడం కూడా మగధకు ఉపకరించిన అంశమే.

మగధ దక్షిణ ప్రాంతంలో గల అడవులు, ఆ నాటి యుద్ధతంత్రంలో కీలకమైన గజ బలాన్ని అందించాయి. అలాగే సుదూర వాణిజ్యంలో కూడా ఏనుగు దంతం ఎంతో ప్రతిష్టాత్మకమైన వస్తువుగా మారింది. అంతేకాకుండా ఆ అడవులు రథాల తయారీకి, భవన నిర్మాణాలకు కావల్సిన కలపను అందించాయి.

మగధ కొత్తగా ఆర్యీకరణకు గురైన ప్రాంతం. కొత్తగా నాగరికతకు గురైన ప్రజల్లో ఉండే చొరవ, ఉత్సాహం మగధ ప్రజల్లో కూడా ఉన్నాయి. సమర్థులైన పాలకులకు మద్దతివ్వడం, అసమర్థులను తొలగించడంలో మగధ ప్రజలు చూపిన వివేకం మగధ సామ్రాజ్య వాదానికి దోహపడిందని చెప్పొచ్చు.

పర్షియన్ గ్రీకు దండయాత్రలు:
ప్రపంచ ఆధిపత్యం కోసం పర్షియన్లు, గ్రీకులు సంఘర్షించుకున్న కాలమది. ఈ పోరులో చివరకు గ్రీకులే పై చేయి సాధించారు.

పర్షియాకు చెందిన సైరస్.. సింధు నది వరకు చొచ్చుకు రాగలిగారు. సైరస్ మనమడైన డేరియస్ సామ్రాజ్యంలోని భారతదేశం 20వ సత్రపి(రాష్ట్రం)గా ఉందని హెరోడోటస్ పేర్కొన్నాడు. అయితే అలెగ్జాండర్ దండేత్తే నాటికే పర్షియన్ల నియంత్రణ సడలిన ట్లు తెలుస్తోంది.

క్రీ.పూ. 334లో తన తండ్రి ఫిలిప్ మరణం తర్వాత మాసిడోనియా సింహాసనాన్ని అధిష్టించిన అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించి, విశ్వ విజేత కావాలని కాంక్షించాడు.

అలెగ్జాండర్ భారత దేశ దండయాత్ర: క్రీ.పూ.326లో ఖైబర్ కనుమను దాటి అలెగ్జాండర్ భారత దేశంలోకి ప్రవేశించాడు.తక్షశిల పాలకుడైన ఆంఫిస్ (అంభి) అలెగ్జాండర్‌కు లొంగిపోయాడు. జీలం, చీనాబ్ నదుల మధ్య గల‘పోరస్’ (పురుషోత్తముడు) రాజ్యాన్ని ఆక్రమించేందుకు అలెగ్జాండర్‌కు సహకరించాడు.

క్రీ.పూ. 326లో జరిగిన హైడాస్పెస్ యుద్ధం (జీలం నదినే గ్రీకులు హైడాస్పెస్ అని పిలిచారు) లో పోరస్ తీవ్రంగా పోరాడి ఓడాడు. పోరస్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్న అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికే కట్టబెట్టాడు.

అలా జీలం నది వద్ద మొదలైన అలెగ్జాండర్ ప్రస్థానం బియాస్ నది వరకు సాగుతూ వచ్చింది. అయితే.. అప్పటికే అలసిన సైనికులు బియాస్ నదిని దాటేందుకు నిరాకరించడంతో అలెగ్జాండర్ నిరుత్తరుడయ్యాడు. నిరంతర యుద్ధాలు, ఇంటి బెంగ అలెగ్జాండర్ సైన్యాన్ని బలహీనపరచాయి.

బియాస్ నదికి అవతల మహాసైన్యాన్ని, కోశాన్ని కలిగిన నందుల రాజ్యం ఉంది. దానిని లొంగతీసుకోవడం అంత సులభం కాదని కూడా భావించాడు. ఫలితంగా అలెగ్జాండర్ వెనుదిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

సింధు నుండి బియాస్ వరకు విస్తరించి ఉన్న తన రాజ్యాన్ని అలెగ్జాండర్ మూడు భాగాలుగా విభజించి ప్రతినిధులను నియమించాడు. నియార్ఖస్ నేతృత్వంలో కొంత సైన్యాన్ని సముద్ర మార్గం ద్వారా వెనక్కు పంపాడు. తను భూమార్గం ద్వారా ప్రయాణించాడు. బాబిలోనియా చేరేసరికి అలెగ్జాండర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు.

అలెగ్జాండర్ దండయాత్ర వల్ల కొత్త వాణిజ్య మార్గాలు వృద్ధి చెందాయి. ఎన్నో చిల్లర రాజ్యాలను, తెగలను నిర్మూలించడం ద్వారా వాయవ్య భారత దేశంలో రాజకీయ చిత్రపటాన్ని మార్చి చంద్రగుప్తునికి మార్గం సుగమం చేశాడు అలెగ్జాండర్. ఇంతకు మించి అలెగ్జాండర్ భాతర దండయాత్రకు ప్రాధాన్యం లేదు. భారతీయ గ్రంధాల్లో అలెగ్జాండర్ ప్రస్తావన మచ్చుకైనా కనపడదు.

ముఖ్యాంశాలు:
{పాచీన భారత రాజ్య వ్యవస్థతోపాటు, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు కూడా స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్న కాలం మౌర్య పూర్వ యుగం.
భారతదేశ చరిత్రలో సిద్ధ సైన్యానికి (Standing army) ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాజుగా బింబిసారుడుని పేర్కోవచ్చు.
వజ్జి గణ సమాఖ్యను ధ్వంసం చేయడం అజాత శత్రువు సాధించిన ప్రధాన విజయం.
నందులలో చివరి వాడు ధన నందుడు. గ్రీకు రచయితలు ఇతడినే ‘అగ్రేమ్సు’ అని పిలిచే వారు.
సైరస్ మనమడైన డేరియస్ సామ్రాజ్యంలోని భారతదేశం 20వ సత్రపి(రాష్ట్రం)గా ఉందని హెరోడోటస్ పేర్కొన్నాడు.
334లో తన తండ్రి ఫిలిప్ మరణం తర్వాత మాసిడోనియా సింహాసనాన్ని అధిష్టించిన అలెగ్జాండర్
326లో జరిగిన హైడాస్పెస్ యుద్ధంలో పోరస్ (పురుషోత్తముడు) తీవ్రంగా పోరాడి ఓడాడు.

More Headlines

No comments:

Post a Comment