భారత్.. వ్యవసాయ విధానం

అల్పాభివృద్ధి దేశాల్లో ఆర్థికాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించడమే కాకుండా ఎక్కువ శ్రామిక శక్తికి ఉపాధి, పొదుపు పెంపొందించడం, పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్, విదేశీ మారకద్రవ్యం ఆర్జనలాంటి విషయాలలో వ్యవసాయ రంగం పాత్ర ప్రధానమైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు జాతీయాదాయానికి ఎక్కువ వాటాను సమకూర్చటమే కాకుండా, ఎక్కువమంది శ్రామిక శక్తికి.. ఉపాధి కల్పనలో ఈ రంగం ముందంజలో ఉంది.

సుమారు 72 శాతం శ్రామిక శక్తి వ్యవసాయరంగంపై ఆధారపడటాన్ని బట్టి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆధారిత వ్యవస్థగా భావించవచ్చు. వ్యవసాయేతర రంగాల అభివృద్ధి, మొత్తం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వ్యవసాయరంగ అభివృద్ధిపైనే ఆధారపడటాన్ని స్వాతంత్య్రానంతరం మనం గమనించొచ్చు.


స్వాతంత్య్రానికి ముందు 50 ఏళ్లలో వ్యవసాయరంగంలో వృద్ధి సగటున ఒక శాతం, కాగా.. స్వాతంత్య్రానంతర కాలంలో సగటు వార్షిక వృద్ధి 2.6 శాతం. 1950, 1960 దశకాలలో సాగు విస్తీర్ణంలో పెరుగుదల నమోదు కాగా.. తర్వాత కాలంలో వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి పెరిగిన భూవిస్తీర్ణంలో తగ్గుదల సంభవించింది. వ్యవసాయ ఉత్పత్తిలో వృద్ధికి ముఖ్య ఆధారంగా ఉత్పాదకతలో పెరుగుదల వెలుగులోకి వచ్చింది.


స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాల దిగుమతిపై భారత్ ఆధారపడగా తర్వాత కాలంలో ఈ ఉత్పత్తుల దిగుమతులను నిరోధించడంలో వ్యవసాయ రంగం విజయవంతమైంది. ఉత్పత్తి, దిగుబడిలో వచ్చిన మార్పులే కాకుండా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు సంభవించడానికి వ్యవసాయ రంగం దోహదపడింది.


ప్రభుత్వం అమలు పరిచిన భూసంస్కరణలు, వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు, నూతన వ్యవసాయ అభివృద్ధి వ్యూహం అమలు, పరిశోధన, విస్తరణ సేవలపై పెట్టుబడి, పరపతి సౌకర్యాల పెంపు వంటి చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రధాన కారకాలుగా నిలిచాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీఓ) ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల స్థితిలో కొంత ప్రతికూల వాతావరణం కన్పిస్తుంది.


ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌లో అన్ని పంటల ఉత్పత్తి వృద్ధి 2.93 శాతం నుంచి 1.57 శాతానికి తగ్గింది. లైవ్‌స్టాక్ వృద్ధి 4.21 శాతం నుంచి 3.40 శాతానికి, ఫిషరీస్ రంగ వృద్ధి 7.48 నుంచి 3.25 శాతానికి తగ్గింది అయితే.. అడవుల విషయంలో మాత్రం వృద్ధి 0.09 నుంచి 1.82 శాతానికి పెరిగింది.


వ్యవసాయ విధానం:

స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగ అభివృద్ధిలో భాగంగా అనేక సంస్థాపరమైన అవస్థాపన సౌకర్యాల్లో మార్పులు ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగ అభివృద్ధిని నాలుగు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ (1947-1960 దశకం మధ్య కాలం), రెండోదశ (1960వ దశకం మధ్యకాలం నుంచి 1980 వరకు), మూడో దశ (1980 నుంచి 1991 వరకు), నాలుగో దశ (1991-92 తర్వాత కాలం)గా పేర్కొనవచ్చు.

మొదటి దశ:

వ్యవసాయ విధానం మొదటి దశలో వ్యవసాయ సంస్కరణలు, సంస్థాపర మార్పులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధి, సహకార పరపతి సంఘాల పటిష్టత కోసం చర్యలు తీసుకున్నారు. భూసంస్కరణల్లో భాగంగా మధ్యవర్తుల తొలగింపు, భూమిని వాస్తవంగా సేద్యం చేసిన వారికి భూపట్టాల పంపిణీ జరిగింది.

తద్వారా వ్యవసాయరంగంలో కమతాలపై యాజమాన్య హక్కులు పొందిన సాగుదార్లు చూపించిన శ్రద్ధ వల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది. మొదటి దశలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు భూసంస్కరణలు కారణమయ్యాయి. బ్రిటిష్ పాలనలో స్తంభించిన వ్యవసాయ రంగాన్ని తిరిగి పురోగమింప చేసే కృషిలో భాగంగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ప్రణాళికా వికేంద్రీకరణ, సాంద్ర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.


రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా నడిపించేందుకు ప్రోత్సాహక ధరల విధానాన్ని ప్రవేశపెట్టడానికి వ్యవసాయ ధరల కమిషన్‌ను 1965లో ఏర్పాటు చేశారు. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని అందించే చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ దశలో ఆహారధాన్యాల దిగుమతిపై ఆధారపడింది.


రెండో దశ:

వ్యవసాయ రంగంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని 1960 వ దశకం మధ్యకాలం నుంచి అవలంభించడం ద్వారా వ్యవసాయరంగంలో రెండో దశ ప్రారంభమైంది. నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా మేలురకమైన విత్తనాల వినియోగం, బహుళ పంటలు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నీటిపారుదల సౌకర్యాల విస్తర ణ జరిగింది. ఈ వ్యూహంలో భాగంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధ్యమైంది. ఈ దశలో వ్యవసాయరంగంలో సంస్కరణలు చోటు చేసుకోలేదు. అయితే విధాన నిర్ణేతలు పరిశోధన, విస్తరణ, ఉత్పాదితాల సరఫరా, పరపతి, మార్కెటింగ్, మద్దతు ధర, సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తిలాంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.

మూడో దశ:1980వ దశకం ప్రారంభంలో వ్యవసాయ రంగంలో మూడో దశ ప్రారంభమైంది. ఈ కాలంలో పంటల మార్పిడి సాధ్యమయింది. ఆహారేతర ఉత్పత్తుల్లో అధిక వృద్ధి నమోదైంది. మరోవైపు పాలు, ఫిషరీస్, పౌల్ట్రీ, కూరగాయలు, పండ్ల ఉత్పత్తుల్లో గణనీయ ప్రగతి నమోదైంది. ఈ కాలంలోనే వ్యవసాయ రంగానికి సబ్సిడీలు పెరిగాయి. వ్యవసాయ రంగంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వరంగ పెట్టుబడులు తగ్గాయి. అయితే రైతుల పెట్టుబడిలో మాత్రం పెరుగుదల కన్పించింది.


నాలుగో దశ:

1991లో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వ్యవసాయరంగంలో వ్యవసాయ విధానం నాలుగో దశ ప్రారంభమైంది. అనేక నియంత్రణల సడలింపు, అనేక కార్యకలాపాల్లో ప్రభుత్వ పరిధిని తగ్గించడం, సరళీకరణ వంటి విధానాలు ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగా ఏవిధమైన సంస్కరణలు ప్రవేశపెట్టనప్పటికీ వినిమయరేటులో సంభవించిన ఒడిదుడుకులు ఈ రంగంపై పరోక్ష ప్రభావాన్ని చూపించాయి. పారిశ్రామిక రంగానికి సంబంధించి రక్షణ విధానాన్ని ఉపసంహరించుకోవడం, విదేశీ వాణిజ్య సరళీకరణలాంటి విధానాలు కూడా వ్యవసాయరంగ అభివృద్ధిపై కొంత మేర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి.

ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల మేరకు స్వదేశీ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాలు వ్యవసాయ రంగంలో సంక్షోభానికి కారణమయ్యాయి. విధాన నిర్ణేతలకు ఈ దశలో వ్యవసాయ రంగం ఒక సవాలుగా నిలిచింది. దీనివల్లే భారత ప్రభుత్వం జూలై 2000లో నూతన వ్యవసాయ విధానం ప్రవేశపెట్టింది. వనరుల సమర్థ వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో నాలుగు శాతం వృద్ధి సాధించడం వ్యవసాయ విధానం లక్ష్యం. కేంద్ర, రాష్ర్ట్ర స్థాయిలో నూతన వ్యవసాయ విధానం లక్ష్యాలు సాధించడానికి కాలప్రాతిపదికన యాక్షన్ ప్లాన్స్ రూపొందించవలసిన అవసరం ఉంది.


పంటల తీరులో మార్పు:

ఒక నిర్ణీతకాలంలో వివిధ పంటల కింద ఉన్న భూవిస్తీర్ణాన్ని పంటల తీరు అంటారు. స్వాతంత్య్రానంతరం మొత్తం పంటల విస్తీర్ణంలో ఆహారేతర పంటల విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ.. ఆహారపంటల కింద ఉన్న భూవిస్తీర్ణమే ఎక్కువ. ప్రణాళిక రచన ప్రారంభమయ్యే సమయంలో మొత్తం పంటల విస్తీర్ణంలో 76.7 శాతం భూమి ఆహారపంటల కింద 23.3 శాతం భూమి ఆహారేతర పంటల కింద ఉంది.

2001 లెక్కల ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఆహార పంటల విస్తీర్ణం 65.83 శాతానికి తగ్గగా ఆహారేతర పంటల కింద ఉన్న విస్తీర్ణం 34.17 శాతానికి పెరిగింది. వివిధ పంటలకు సంబంధించి భూపంపిణీలో వచ్చిన మార్పు వ్యవసాయ రంగాన్ని జీవనాధార వ్యవసాయం నుంచి కమర్షియల్ క్రాపింగ్ (వాణిజ్యపరమైన వ్యవసాయం)గా మార్చింది. మార్కెట్‌లో ధరలతోపాటు ప్రతి హెక్టారుకు లభించే లాభదాయకత ఆహారేతర పంటల విషయంలో ఎక్కువగా ఉండటం.. వీటి భూ విస్తీర్ణం పెరగడానికి కారణం.


మొత్తం పంటల విస్తీర్ణంలో 54.43 శాతం భూమి ఆహార ధాన్యాల కింద, 11.4 శాతం భూమి పప్పు ధాన్యాల కింద ఉంది. ధాన్యపు పంటలు, పప్పు ధాన్యాలు కింద ఉన్న విస్తీర్ణంలో పెరుగదల సంభవించగా, పప్పు ధాన్యాల విస్తీర్ణంలో పెరుగుదల కంటే ధాన్యపు పంటల (cereals) విస్తీర్ణంలో పెరుగుదల రేటు ఎక్కువ. నీటిపారుదల సౌకర్యాలు, రసాయన ఎరువులు, మేలురకమైన విత్తనాల వల్ల పంటల విస్తీర్ణంలో ఏ విధమైన పెరుగదల సంభవించనప్పటికీ ఆహారధాన్యాలకు సంబంధించిన విస్తీర్ణంలో మార్పు ఎక్కువ ఉంటుంది. 1950-51 తర్వాత ధాన్యపు గింజలు (Coarse Cereals) కింద ఉన్న భూవిస్తీర్ణంలో తగ్గుదల సంభవించింది.


ఆహార వినియోగ ప్రక్రియలో మార్పు:

వినియోగదారుల అభిరుచులు, సరఫరా అనుకూలంగా ఉండటం, సాపేక్ష ధరలలోని మార్పు వల్ల ఆహార వినియోగ ప్రక్రియలో మార్పులు సంభవించాయి. పట్టణీకరణ, ఆర్థికవృద్ధిలో పెరుగుదల ధాన్యపు పంటల తలసరి డిమాండ్‌లో తగ్గుదలకు దారితీసి noncereal food items డిమాండ్‌లో పెరుగుదలకు కారణమైంది. వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న ఆధునికీకరణ ధాన్యపు పంటల తలసరి వినియోగంపై రుణాత్మక ప్రభావాన్ని చూపించింది. 1972-73 నుంచి 2004-05 మధ్యకాలంలో ఆహార వినియోగ ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు సంభవించాయి.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ బడ్జెట్‌లో ఆహార ఉత్పత్తుల వాటా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో టజ్చిట్ఛ ౌజ జౌౌఛీ మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో 72.9 శాతం నుంచి (1972-73) 2004-05 నాటికి 55 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో share of food మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో 64.5 శాతం నుంచి 42.5 శాతానికి తగ్గింది.


పప్పు ధాన్యాల వాటాలోనూ తగ్గుదల కన్పించింది.

కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, గుడ్లు, వంట నూనెల వాటా మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో పెరుగుతుంది.
...........................................


ముఖ్యాంశాలు


స్వాతంత్య్రానికి ముందు 50 ఏళ్లలో వ్యవసాయ రంగంలో సగటు వార్షిక వృద్ధి ఒక శాతం కాగా స్వాతంత్య్రానంతరం ఈ రంగం సగటున 2.6 శాతం వృద్ధి నమోదు చేసింది.


వ్యవసాయ విధానం మొదటి దశ (1947- 1965) లో భూసంస్కరణలు, సంస్థాపరమైన మార్పులు, భారీనీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధి, సహకార పరపతి సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకున్నారు.


వ్యవసాయరంగంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని 1960వ దశకం మధ్యకాలం నుంచి అవలంభించారు.


ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అడవులు మినహా మిగులు వ్యవసాయం, అనుబంధాల వృద్ధి రేటు తగ్గింది.


భారత ప్రభుత్వం జూలై 2000లో నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.

No comments:

Post a Comment