ఆ ఒక్కటీ... జీవితాన్నే మార్చేస్తుంది!



                                             ఆ ఒక్కటీ... జీవితాన్నే మార్చేస్తుంది!


                                                                         సత్య                                     
 
విద్యార్థుల జీవితం 'పరీక్షలు- మార్కులు- ర్యాంకుల' తోనే ముడిపడివుంది. కొందరు... ఎంతో కష్టపడుతున్నామనుకుంటారు. కానీ మార్కులు చూస్తే తక్కువే వస్తుంటాయి. కారణాలేమిటి?
1985 నాటి సివిల్‌ సర్వీసెస్‌లో ఐఏఎస్‌ ప్రవేశానికి ఆఖరి మార్కు 1088. అది 30 మందికి వచ్చింది. అయితే, ఆ ముప్పై మందికీ ఐఏఎస్‌ రాలేదు. వారిలో కొందరికి ఐఏఎస్‌, కొందరికి ఐపీఎస్‌, మరికొందరికి గ్రూప్‌-ఏ సర్వీసులు వచ్చాయి. మార్కు అదే అయినా వచ్చిన సర్వీసులు వేర్వేరు. అదే మార్కుకు పరిస్థితి అలా ఉంటే, ఒక్క మార్కు తేడా వస్తే? ఒక్కటీ జీవితాన్నే మార్చేస్తుంది.

ఒక్క మార్కు తేడాతో...
* కోరుకున్న కోర్సును కోల్పోతాడో విద్యార్థి
* ఇష్టపడ్డ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడో అభ్యర్థి.
* ఏడాది కాలం వ్యర్థమైపోతుంది ఓ విద్యార్థికి.
* వ్యర్థమైన ఏడాదికి లక్షల్లో నష్టం వస్తుంది ఓ ఉద్యోగార్థికి.

అంతేనా? తప్పిపోయిన పదోన్నతులు, పదవి తెచ్చే గౌరవ మర్యాదలు, సాంఘిక హోదాలు, విదేశీ అవకాశాలు, ఆత్మ విశ్వాసం, ఆత్మ సంతృప్తి, అందించే సేవలు, ఆర్జించే కీలక విజ్ఞానం అన్నీ ఒక్క మార్కు మీదే ఆధారపడివుంటాయి. అలాంటి ఆ మార్కుకు ఖరీదు కట్టే షరాబు ఎవరు?

ఒక స్థాయి మార్కుల కోసం విద్యార్థులు పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. యాబై, అరవై శాతం అవలీలగా అందుకోవచ్చు. కాస్త కృషి చేస్తే ఓ ఎనబై శాతం తేలిగ్గానే తెచ్చుకోవచ్చు.

కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది!
ఆపైన ప్రతి మార్కుకూ విద్యార్థి పరితపించాలి. అదనపు మార్కు కోసం అహర్నిశం శ్రమించాలి. ఎన్ని మార్కులు వస్తే కోరుకున్న సబ్జెక్టు దక్కుతుందో/ కలలు కన్న కళాశాలలో స్థానం దక్కుతుందో/ ఉన్నతోద్యోగం వస్తుందో ఎవరూ చెప్పలేరు. నిర్దిష్టంగా 'ఇన్ని' వస్తే చాలని ఈ పోటీ ప్రపంచంలో ఎవరూ తాపీగా కూర్చోలేరు. తనతో పోటీ పడేవారి కన్నా అదనంగా ఒక మార్కు ఎక్కువ తెచ్చుకుంటేనే కాలేజీ సీటైనా, కార్పొరేట్ఉద్యోగమైనా!

పోటీ జగమంతా...
పోటీ జగమంతా మార్కుల మయం. సగటు విద్యార్థిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంచేవి మార్కులే. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేవి ఇవే. అందరి ప్రశంసలూ పొంది, తల్లిదండ్రులను ఆనందపరచాలంటే సాధనం మంచి మార్కుల సాధనే. అంతే కాదు, అభ్యర్థి ఉన్నతోద్యోగంలోకి వెళ్ళాలంటే పాస్‌పోర్టుగా పనిచేసేవీ, ఒక్కొక్కసారి పదోన్నతులను ప్రభావితం చేసేవి కూడా మార్కులే.

విద్యలో, ఉద్యోగ సంపాదనలో మార్కులకు ఇంత ప్రాధాన్యం ఉన్నా చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. ''ఆ...! మార్కులే జీవితమా? విద్యకు పరమావధి అవేనా? రానివాళ్ళు జీవితంలో ఎదగలేరా? విజయాలు సాధించలేరా?'' అంటారు.

వీరి దృష్టిలో పరీక్షల్లో విజయం (
success in exams) , పనిలో విజయం (success in career), జీవితంలో ఆనందం life (happiness in)వేర్వేరు.కానీ నిజమైన ఆనందం అలా విడివిడిగా ఉంటే రాదు. మూడు అంశాలూ ఒకదానితో ఒకటి అల్లుకుపోవాలి. ఒకదానికొకటి ఆసరాగా నిలవాలి. అందువల్ల మార్కులే జీవితం కాకపోయినా, మనిషి ఆనందంలో అవి అంతర్భాగమే. పరీక్షల్లో విజయానికీ, పనిలో ప్రవేశానికీ మంచి మార్కులే పునాది కదా!

ఇవీ కారణాలు...
ఇంత ప్రాధాన్యం ఉన్నా, మంచి మార్కులు అందరికీ రావు. అందుకు కారణాలెన్నో.
* పరీక్షలంటే భయపడటం
* తగినంత సన్నద్ధత చేయకపోవటం
* పరీక్ష విధానం తెలియకపోవటం
* జవాబుల్లో ఒరిజినాలిటీ లోపించడం
* ఆశించిన ప్రమాణాలతో జవాబులు రాయకపోవటం
* జవాబులను ఆహ్లాదకరంగా ప్రదర్శించలేకపోవడం (
Lack of pleasant display)
* రాతలో పటుత్వం లేకపోవటం
* రాసినదాన్లో స్పష్టత కరువవడం
* చేతిరాత అందంగా లేకపోవటం
* రాసేటప్పుడు నిర్లక్ష్యంతో తప్పులు చేయడం
* ప్రతిఘటించకుండా తేలిగ్గా ప్రయత్నాన్ని విరమించడం
* కడకంటా తగిన ప్రేరణ కొనసాగించుకోలేకపోవడం
* ఎక్కువసేపు శ్రద్ధ పెట్టకపోవడం
* జ్ఞాపక శక్తిని వినియోగించుకోలేకపోవడం
* సబ్జెక్టు పట్ల ఆసక్తి చూపకపోవడం
* కాలాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం
* ప్రణాళికాబద్ధంగా ఉండకపోవడం
* వాయిదాల వ్యాధికి లొంగిపోవడం
* తరగతిలో పగటి కలలు కంటూ కూర్చోవడం
* సబ్జెక్టు అర్థం కాకపోతే క్లిష్టంగా భావించి వదిలేయటం
* నిరుత్సాహపరిచే ఉపాధ్యాయులు
* ఒత్తిడి పెంచే తల్లిదండ్రులు
* టీవీ, ఇంటర్నెట్‌, సెల్ఫోన్‌, కంప్యూటర్క్రీడలు, చాటింగ్కు ప్రాధాన్యం
* విపరీతమైన బద్ధకం
రెండు అంచెల పద్ధతి (2 step process)
సగటు విద్యార్థులు మార్కుల కోసం దిగువ పద్ధతులు అనుసరిస్తారు. 1. నోట్సు, పాఠ్యపుస్తకాలు చదువుతారు 2. పరీక్షలు రాస్తారు. దాదాపు అరవై శాతం ఈ బాపతు వాళ్ళే. వీళ్ళలో అత్యధికులు పరీక్ష తప్పుతారు. లేదా అత్తెసరు మార్కులతో గట్టెక్కుతారు. అంతకు మించితే ఓ సెకండ్‌ క్లాసు తెచ్చుకోగలుగుతారు.

మూడంచెల పద్ధతి (3
step process)
సగటు విద్యార్థులకు పైమెట్టులో ఉండేవారు మూడంచెల పద్ధతిని అవలంబిస్తారు. 1. నోట్సు, పాఠ్యపుస్తకాలు చదువుతారు. 2. వాటిని బాగా బట్టీ పెడతారు. 3. పరీక్షలకు హాజరై దించేస్తారు. వీరు సాధారణంగా ద్వితీయ శ్రేణికి ఎగువగా, ప్రథమ శ్రేణికి దిగువగా మార్కులు తెచ్చుకుంటారు.

నాలుగంచెల పద్ధతి (4
step process)
పైన చెప్పినవారికన్నా కాస్త మెరుగైనవారు నాలుగంచెల పద్ధతి పాటిస్తారు. 1. నోట్సు, పాఠ్యపుస్తకాలు చదువుతారు. 2. వాటిని బాగా బట్టీ పెడతారు. 3. పరీక్షల్లో రాబోయే ప్రశ్నలు ఊహించి జవాబులు ఇంటి దగ్గరే అభ్యాసం చేస్తారు. 4. పరీక్షలకు హాజరై జవాబులు రాస్తారు.


* సగటు విద్యార్థి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి రెండు నుంచి నాలుగంచెల వ్యూహాన్ని అనుసరిస్తాడు. అందువల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోతున్నాడు.
* ఉత్తమ విద్యార్థి ఆరు నుంచి తొమ్మిది అంచెల వ్యూహాన్ని పాటిస్తాడు. అందువల్లే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతున్నాడు. ఇదీ పరిశోధనల్లో తేలిన రహస్యం!
_______________
(ఈనాడు,౦౧:౧౨:౨౦౦౮)
______________

విద్యావేత్తలూ, కెరియర్‌ గైడెన్స్‌ నిపుణులూ విద్యార్థులకు మంచి మార్కులు రాకపోవడానికి కారణాలేమిటని విస్తృత పరిశోధనలు చేశారు.
సగటు విద్యార్థులకూ, అసాధారణ వ్యక్తులకూ మెదడులో కానీ, శక్తిసామర్థ్యాల్లో కానీ తేడా లేదు. వారి మధ్య తేడా అల్లా వాటినివినియోగించుకోవడంలో వారు ఉపయోగించే వ్యూహాలే.
_______________________________________


8 అంచెల వ్యూహం ఎలా ఉంటుందో చూద్దామా?

కార్యకారణ సంబంధం

8 అంచెల వ్యూహానికి 'కార్య కార సంబంధం' (Law of cause and effect) అనే ప్రాకృతిక సూత్రమే ప్రాణాధారం. ఇది కొన్ని నిత్యసత్యాల మీద పనిచేస్తుంది.

* పంట కావాలంటే ముందు విత్తనం వేయాలి.
* ఏ విత్తనం వేస్తే ఆ పంటే వస్తుంది. వేప విత్తనానికి మామిడి పండు రాదు.
* విత్తనం వేసిన వెంటనే పంట చేతికి రాదు. పంట రావటానికి నిర్ణీతకాలం పడుతుంది.
* విత్తనాలను బట్టే పంట పరిమాణం ఉంటుంది. తక్కువ విత్తనాలు వేస్తే తక్కువ పంట వస్తుంది. ఎక్కువ వేస్తే ఎక్కువ పంట.

ఎంత పనిచేస్తే అంత ఫలితమే వస్తుందనే సత్యాన్ని చెప్పేదే కార్యకారణ సంబంధం. బుద్ధుడి నుంచి స్టీవెన్‌ ఆర్‌. కవీ దాకా ఈ కార్యకారణ సంబంధాన్ని అనుసరించినవారే. అయితే 'చదవకుండా పాసయ్యే షార్ట్‌కట్‌' కావాలనుకునేవారికి ఇది మింగుడుపడదు. వారంతా ఫలితాన్ని కోరుకుంటారు కానీ దానికి మూలాధారమైన పనిని పట్టించుకోరు.

అన్నదాతే ఆదర్శం
కార్యకారణ సూత్రానికి మరో పేరు 'పంట సూత్రం' (Law of harvest). 8 అంచెల వ్యూహంతో కూడిన పంట సూత్రమే రైతుకు ప్రాణాధారం.

1. పరిమితమైన పొలంలో గరిష్ఠమైన ఫలసాయం మీదే రైతు గురిపెడతాడు. తన పొలమెంతో, అందులో ఏమేం పంటలు పండుతాయో తెలుసు కాబట్టి, ఎంత దిగుబడి తేవాలో లక్ష్యంగా పెట్టుకుంటాడు.
2. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రైతూ పక్కా ప్రణాళికతో పనిచేస్తాడు. ఎప్పుడు తొలకరి పలకరిస్తుంది? విత్తనాలు ఎప్పుడు సిద్ధం చేయాలి? పొలం దున్నే పనిముట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయా? ఎప్పుడు నారు వేయాలి? ఎప్పుడు, ఎంత నీరు పెట్టాలి? నాట్లు ఎప్పుడు వేయాలి? ఎప్పుడు కలుపు తీయాలి? ఎరువు ఎప్పుడు వేయాలి? ఎప్పుడు కోతలు కోయాలి?... ఇలా ప్రతి సూక్ష్మ విషయాన్నీ ప్రణాళికాబద్ధంగా ముందే సిద్ధం చేసుకుంటాడు. వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా, ఎక్కడ జాప్యం జరిగినా పంట దక్కదని రైతుకు తెలుసు.
3. అనుక్షణం, నిరంతరం రైతు తన పంట కోసమే పరిశ్రమిస్తూ ఉంటాడు. పనిలో దిగిన రైతు మరేదీ పట్టించుకోడు. తొలకరి నుంచి పంట నూర్చేదాకా రైతు తన పొలం విడిచి వేరేచోటికి పోడు. మరో పని పెట్టుకోడు. పండగ చేసుకున్నా అది పంట సంబంధమైనదై ఉంటుంది.
4. రైతు నారుమడిలో కాకుండా నేరుగా విత్తనాలు వేయడు. మొలకెత్తే నారుమడిని ప్రాణంలా చూసుకుంటాడు.
5. నారుమడిలో పంట పండదు. అందుకే విశాలమైన మరో పొలంలో నాట్లు వేసి, నీరు పెడతాడు. చేను ఏపుగా పెరగాలంటే, పంట విరగబడి పండాలంటే సారవంతమైన మరో చోటు కావాలని రైతుకు ఎరుకే.
6. కలుపు తీసి ఎరువు వేస్తేనే 'చేనుకు చేవ'.
7. పంట కోతకు వచ్చేలోపు పక్షులూ, పందులూ, పశువుల బారినుంచి రక్షణ కల్పిస్తూ చేనుకు దోహదం చేస్తాడు.
8. పక్వమైన చేను కోసి, కుప్ప వేసి ఊపిరి పీల్చుకుంటాడు. తన బతుకుపంట ఆ కుప్పలో పదిలంగా దాగివుందని అతనికి బాగా తెలుసు.
రైతు పండించే పంటకూ, విద్యార్థి తెచ్చుకునే మార్కులకూ సంబంధం ఏమిటనే సందేహం కలగవచ్చు.

* రైతు విత్తనాలు నాటుతాడు. విద్యార్థి విషయాలను నాటుతాడు.
* రైతు పొలంలో నీరు పారిస్తాడు. విద్యార్థి తన మెదడులో సమాచార జలాన్ని పారిస్తాడు.
* రైతు చేనులోంచి కలుపు తీస్తాడు. విద్యార్థి తన మనసులోంచి చెడు ఆలోచనల కలుపు తీస్తాడు.
* రైతు తన పొలాన్ని దున్ని పంట పండిస్తాడు. విద్యార్థి తన మెదడును దున్ని మార్కుల పంట పండిస్తాడు.
... ఇలా ఇద్దరికీ ఎన్నో సారూప్యాలు ఉన్నాయి. పాత్రికేయ మేధావి నార్ల వెంకటేశ్వరరావు చెప్పినట్టు కల్చర్కూ, అగ్రికల్చర్కూ అవినాభావ సంబంధముంది. పొలం పక్వమైతే పంట వస్తుంది. మెదడు పక్వమైతే జ్ఞానం వస్తుంది.

విద్యార్థులూ... ఈ ఎనిమిదీ పాటించండి!
1. రైతు పొలం నుంచి అధిక దిగుబడి ఆశించినట్టుగానే విద్యార్థి పరీక్షల నుంచి ఎక్కువ మార్కులు లక్షించాలి. మొత్తం ఎన్ని మార్కులు సాధించాలనుకుంటున్నాడో ముందుగానే స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి. అలాగే ప్రతి పేపర్లో ఎన్ని మార్కులు రావాలో ముందుగానే రాసి పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకున్న విద్యార్థి చదివే విధానానికీ, నిర్లక్ష్యంగా ఉండే కుర్రాడు చదివే తీరుకూ ఎంతో అంతరం ఉంటుంది.అందుకు తగ్గట్టే ఇద్దరికీ మార్కుల్లోనూ అంత తేడా వస్తుంది.
2. పాఠాలన్నీ ఎప్పటికి పూర్తిచేయాలో, పునశ్చరణ ఎలా ఉండాలో, పరీక్షల నాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలో పక్కా ప్రణాళికతో టైం షెడ్యూళ్ళు తయారుచేసుకొని అమలు చేయాలి.
3. నిరంతర శ్రామికుడైన రైతు మాదిరిగానే, ప్రతి విద్యార్థీ పరీక్షలు పూర్తయ్యేవరకూ నిత్య కృషీవలుడు కావాలి. ఎలాంటి ఆకర్షణలు ప్రలోభపెట్టినా అనునిత్యం తన లక్ష్యాన్ని స్మరిస్తూ ముందుకు సాగిపోవాలి.
4. చదువుకు సరైన బీజాలు పడేది కళాశాలలోనే. పాఠం ఎలా చదవాలో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ప్రశ్నలకు జవాబులు ఎలా రాయాలో, ఏ పుస్తకాలు చదవాలో, విషయాన్ని ఎలా సేకరించాలో, పరీక్షల భయాన్ని ఎలా పారదోలాలో ఆ మెలకువలన్నీ అధ్యాపకులు చెపుతారు. వారి మాటలు పాటించిన విద్యార్థే ఆత్మవిశ్వాసంతో జీవితంలోకి అడుగుపెడతాడు.
5. పరిమిత ప్రాంతంలో పెరిగిన నారును విస్తారమైన పొలంలో రైతు నాటినట్టుగానే, బీజప్రాయంగా కళాశాలలో నేర్చుకున్న విషయాలను విద్యార్థి ఇంటిదగ్గర విస్తృతపరుచుకోవాలి. విషయాన్ని సేకరించుకోవాలి. నోట్సులు తయారుచేసుకోవాలి. పునశ్చరణలు చేయాలి. బాగా గుర్తుపెట్టుకోవడానికి జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. నమూనా పరీక్షలు రాయాలి. పరీక్షల్లో రాబోయే ప్రశ్నలకు తన దగ్గరున్న సమాచారాన్ని ఎలా అనువర్తించాలో నేర్చుకోవాలి. ఇవన్నీ ఇంటిదగ్గరే అభ్యాసం చేయాలి.
6. చదువు ఒక్కటే చాలదు మంచి మార్కులు రావడానికి. చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. విద్యార్థి తనలోని చెడు అలవాట్ల కలుపు తీసి, సత్ప్రవర్తన ఎరువు వేసి, వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. దృఢమైన ఆరోగ్యం, అనుకూల దృక్పథం, దూసుకుపోయే స్వభావం, పెద్దలను గౌరవించే సంస్కారం, ఒదిగివుండే తత్వం లాంటి చదువుకు సంబంధం లేని ఎన్నో అంశాలు ఎక్కువ మార్కులు తెచ్చిపెడతాయి.
7. అదునుకు వచ్చిన పంటను రైతు పరిరక్షించుకున్నట్టుగానే, తాను ఎన్నో నెలలుగా సముపార్జించుకున్న విస్తారమైన విజ్ఞానాన్ని క్రోడీకరించుకోవాలి. పరీక్షల్లో దాన్ని మార్కులుగా మలచుకోడానికి ప్రతి విద్యార్థీ ముందస్తు సన్నాహాలు చేసుకోవాలి. పరీక్షలకు రెండు నెలల ముందు నుంచే ఈ సన్నద్ధత ఉద్ధృతం చేయాలి.
8. సబ్జెక్టు ఎంత తెలిసినా, పరీక్షల్లో దాన్ని సక్రమంగా ప్రదర్శించకపోతే మార్కులు రావు. పరీక్షల కురుక్షేత్రంలో విద్యార్థి మరో కర్ణుడు కాకూడదు. విజయుడిలా విజృంభించాలి. అడిగే ప్రశ్నలకు అదిరే రీతిలో జవాబులు రాసి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అంత తేలికైన పని కాదు. అదో సవాలు. పరీక్షల పద్మవ్యూహాన్ని ఛేదించే అనేక మెలకువలు అమలుచేయాలి.

ఇలా ప్రతి విద్యార్థీ 8 అంచెల వ్యూహాన్ని చదువుల్లో అమలు చేస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవటమే కాదు; ఉన్నత పోటీ పరీక్షల్లో విజేతగా నిలుస్తాడు. బతుకుబాటలో సైతం విజయబావుటా ఎగరేస్తాడు.

క్లుప్తంగా...
విద్యార్థికి ఎక్కువ మార్కులు ఇచ్చే 8 అంచెల వ్యూహం సంక్షిప్తంగా...
1. స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి.
2. ప్రణాళికాబద్ధంగా తయారుకావాలి.
3. నిరంతరం ఉత్సాహంతో ప్రయత్నించాలి.
4. కళాశాలలో విజ్ఞానబీజాలు నాటుకోవాలి.
5. ఇంటిదగ్గర వాటిని విస్తరించుకోవాలి.
6. వ్యక్తిత్వాన్నిచ్చే ప్రవర్తన అలవర్చుకోవాలి.
7. పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.
8. పరీక్షహాల్లో మార్కుల పంట పండించుకోవాలి.
___________________________
(ఈనాడు, ౦౮:౧౨:౨౦౦౮)
____________________________

బద్ధకాన్ని తరిమేసే కిటుకేంటి?
[ఎనిమిది అంచెల వ్యూహంలో మొదటి అంశం-1
'స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవటం'
]
సత్య
'ఫలితంపై దృష్టి పెట్టి పనిని ప్రారంభించా'లని ఆధునిక వ్యక్తిత్వవికాస నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని అమలు చేసినవారే ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గణాంకాలు తేల్చిచెపుతున్నాయి. అందుకని పరీక్షల్లో ఏ పేపర్లో తమకెన్ని మార్కులు రావాలనుకుంటున్నారో విద్యార్థులు మొదటినుంచీ స్పష్టతతో ఉండటం ముఖ్యం.

ఎక్కువ మార్కులు తెచ్చే ఎనిమిది అంచెల వ్యూహంలో
మొదటి అంశం- 'స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవటం'.
విద్యాసంవత్సరం ప్రారంభమైన మొదటి వారంలోనే ఆ సంవత్సరాంత పరీక్షల్లో ఎన్ని మార్కులు సాధించాలనుకుంటున్నామో, ఓ స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకున్న విద్యార్థి చదివే విధానానికీ, నిర్లక్ష్యంగా ఉండే కుర్రాడి చదువు తీరుకూ చాలా తేడా ఉంటుంది. అది వారి మార్కుల్లోనూ కనిపిస్తుంది.

ఉదాహరణకు... లెక్కల పేపర్లో 'నూటికి నూరు మార్కులు' రావాలనే విద్యార్థి చదివే విధానం- 'నాకో అరవై వస్తే చాల్లే' అనే కుర్రాడి చదువు తీరు కన్నా భిన్నంగా ఉంటుంది.

* 'నూటికి నూరు' వచ్చితీరాలని తీర్మానించుకున్న విద్యార్థి మెదడు పాదరసంలా పనిచేస్తుంది. ఒక్క మార్కు సైతం వదులుకోరాదని భావిస్తుంది. ప్రతి ఒక్క మార్కు కోసం పోరాడుతుంది. ఫలితంగా ఆ విద్యార్థి నూటికి నూరు/కనీసం తొంబై మార్కులు సాధిస్తాడు.
*'అరవై చాల్లే' అనే కుర్రాడి మెదడు నలబైశాతం మార్కులు కోల్పోడానికి సిద్ధమైపోతుంది. సబ్జెక్టులో ఏది కష్టమనిపించినా వదిలేస్తుంది. అలా వదిలేస్తే కొంపలంటుకోవని సమర్థించుకుంటుంది. క్రమేణా బద్ధకిస్తుంది. చివరికి ఆ అరవై మార్కులకు కూడా గ్యారంటీ లేకుండా పోతుంది!

ఎందుకు పెట్టుకోవాలి?
పరిమితమైన శక్తిసామర్థ్యాలతో ఉన్నత ఫలితాలు పొందడమే నిజమైన విజయం. అలాంటి విజయాన్ని పొందాలంటే నిర్దిష్టమైన గమ్యంపై దృష్టి లగ్నం కావాలి. దానికి స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి.

లక్ష్యమనేది వ్యక్తికి దిశానిర్దేశం చేస్తుంది. కర్తవ్యాన్ని ప్రబోధిస్తుంది. బద్ధకాన్ని తరిమివేసి, కార్యోన్ముఖుణ్ని చేస్తుంది. ఫలితం వైపు మళ్ళిస్తుంది. లోపల దాగిన అంతశ్శక్తులను వెలికితీస్తుంది. మానసికమైన హద్దుల్ని బద్దలు చేస్తుంది. అందనంత ఎత్తులోని శిఖరాలను అధిరోహించడానికి అందమైన మెట్లు నిర్మిస్తుంది. అందుకే సూపర్‌ విద్యార్థి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తాను ఎన్ని మార్కులు సాధించాలనుకుంటున్నాడో ఓ లక్ష్యంగా పెట్టుకుంటాడు. దాన్ని అమలు చేసి అద్భుత ఫలితాలు సాధిస్తాడు.

ఎదురుచూస్తూ కూర్చుంటే విజయం ఎవరిదరికీ రాదు. అది విధి లిఖితం (chance)కాదు; స్వయంకృతమే (choice).కేవలం కోరిక ఉంటే చాలదు. అందుకు కృషి కావాలి.విజేతలైనవారంతా లక్ష్యాన్ని పెట్టుకొని కార్మోన్ముఖులైనవారే. అందుకే ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణుడు స్టీవెన్‌ ఆర్‌. కవీ తన 'ద సెవెన్‌ హాబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌' అనే పుస్తకంలో ''ఫలితంపై దృష్టి పెట్టి పనిని ప్రారంభించు'' (Begin with the end in mind) అంటాడు.

నమ్మకం లేకనే...
ఎవరు చెప్పినా, యేల్‌ యూనివర్సిటీ గోల చేసినా మనిషికి లక్ష్యం ఉండాలనే. ఫలితంపై దృష్టి పెట్టి పనిని ప్రారంభించిన విద్యార్థులే జీవితంలో ఉన్నత పదవులు చేపట్టారనీ, ఉన్నత ఆర్థిక కక్ష్యలో స్థిరపడ్డారనీ గణాంకాలతో తేల్చిచెప్పినా చాలామంది విద్యార్థులు లక్ష్యాలు పెట్టుకోరు. కేవలం ఓ మూడు శాతం తప్పితే, మిగతావారంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దానికి కారణం వారిపై వారికి నమ్మకం లేకపోవడమే అంటారు నిపుణులు. ఆత్మగౌరవం కొరవడటం, విజయసాధనకు శ్రమరూపంలో తగిన మూల్యం చెల్లించకపోవడం, విఫలమైతే లోకులు నవ్వుతారేమోనన్న వింత భయం... వారు లక్ష్యాలు పెట్టుకోకపోవడానికి ముఖ్య కారణాలు.
----------------------------------
(ఈనాడు,౧౫:౧౨:౨౦౦౮ )
------------------------------------




లక్ష్య దిశగా తొలి అడుగు!
[ఎనిమిదంచెల వ్యూహంలో మొదటి అంశం-
'స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవటం'

లక్ష్యసాధనకు అధిరోహించాల్సిన'సప్తపద సోపానం' ]
సత్య
మనం 'ఎక్కువ మార్కులు సాధించాల'నే లక్ష్యం నిర్దేశించుకున్నాక అది నిత్యం కళ్ళముందు కనబడాలి. కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ కార్యోన్ముఖుణ్ని చేయాలి. లక్ష్యం పెట్టుకున్నరోజు నుంచే దాని అమలుకు ప్రయత్నించాలి. అది చిన్నపాటి చర్యే అయినా- ఫర్వాలేదు; నిరంతరాయమైన చర్యగా ఉండాలి!

ఎక్కువ మార్కులు తెచ్చే ఎనిమిదంచెల వ్యూహంలో మొదటి అంశం- 'స్పష్టమైన లక్ష్యాన్నిపెట్టుకోవటం'. ఆ
లక్ష్యసాధనకు అధిరోహించాల్సిన 'సప్తపద సోపానం'లో మూడింటిని తెలుసుకున్నాం. అవి1) లక్ష్యానికి స్పష్టత ఇవ్వాలి
2) లక్ష్యం సాధిస్తే వచ్చే లాభాలు, కారణాలు తేల్చుకోవాలి
3) లక్ష్యానికి వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక ముఖ్యం.

మిగతావాటిని ఇప్పుడు చూద్దాం.
4. లక్ష్యసాధన నైపుణ్యాలు అలవర్చుకోవాలి
ఎక్కువ మార్కులు లక్షించే విద్యార్థి కేవలం విజ్ఞాన పరిగ్రహణకే పరిమితం కారాదు. విషయాన్నివిశ్లేషణాత్మకంగా వివరించగలగాలి. అరటిపండు ఒలిచినంత హాయిగా వ్యక్తీకరించాలి. పరీక్షలమదింపుదారుడు మెచ్చుకునేలా విస్తరించగలగాలి.

అందుకు విజ్ఞాన సేకరణ, భావ వ్యక్తీకరణ లాంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలి. చదివేటప్పుడు కీలకసమాచారాన్ని సేకరించడం, విషయాన్ని వేగంగా అవగతం చేసుకోవడం, సమగ్ర దృష్టిని అలవర్చుకోవడం, చక్కని నోట్సు తయారుచేసుకోవడం, చిటికెలో గుర్తుకొచ్చే సినాప్సిస్‌ ఏర్పరచుకోవడం, సులభంగా గుర్తుండేమైండ్మ్యాప్లు లిఖించుకోవడం, మంచి జ్ఞాపకశక్తి పద్ధతులు అభ్యాసం చేయడం, శాస్త్రీయ పద్ధతిలోపాఠ్యాంశాలను పునశ్చరణ చేయడం, వేగంగా రాయటం- ఇలాంటి అనేక నైపుణ్యాలు విజ్ఞానార్జనను వేగవంతంచేయడమే కాక, భావ వ్యక్తీకరణకు పదును పెడతాయి.
‌‌ 5. లక్ష్యాలకు కాలనిబంధన విధించుకోవాలి
ప్రారంభించే ప్రతి పనికీ ఓ ముగింపు ఉంటుంది. అయితే, ఆ ముగింపు ఎప్పుడనేది పరిస్థితుల చేతిలో కాక, విద్యార్థి చేతిలో ఉండాలి.
''చక్కని వ్యాసం రాయాలనుకుంటే, ప్రపంచంలో అదో మైలురాయిగా నిలవాలని భావిస్తే, బాగా తీరిక దొరికాక చూద్దామనుకుంటే, అది అనుకోవడం వరకే ఉంటుంది కానీ ఆచరణకు నోచుకోదు'' అంటాడు రచనపై పరిశోధించిన హాస్య రచయిత స్టీఫెన్‌ లీకాక్‌. ''ఓ పనికి ఎంత కాలం కేటాయిస్తే ఆ పని అంతకాలమూ తీసుకుంటుంది'' అనేది పీటర్‌ ప్రిన్సిపుల్‌.

ఎంతకాలం ఓ సబ్జెక్టుకు సమయం కేటాయిస్తే అది అంత కాలాన్నీ ఆక్రమిస్తుంది. అందువల్ల
ప్రతి సబ్జెక్టుకీ అందులోని ప్రతి అంశానికీ ఓ కాల నిబంధన (డెడ్‌లైన్‌) విధించుకోవాలి. ఆ పరిమితిలోనే పూర్తిచేసే క్రమశిక్షణ అలవర్చుకోవాలి. సన్నద్ధమయ్యే పరీక్షకు కింది విధంగా కాలనిబంధన విధించుకోవాలి.

6. లక్ష్యాన్ని ఉద్వేగాలతో ఉత్సాహపరచాలి
'ఏ పని చేయడానికైనా మనిషిని ప్రేరేపించేది అతని తర్కం కాదు, భావోద్వేగాలే' అంటారు మానసికనిపుణులు. ప్రతి ఒక్కరూ తాను బౌద్ధికంగానే ప్రవర్తిస్తున్నానని అనుకుంటారు కానీ నిజానికి వారిని
నడిపించేవి భావోద్వేగాలే.
హెవీ వెయిట్‌ బాక్సింగ్‌లో చెరగని ముద్ర మొహ్మద్‌ అలీది. బాగా సన్నగా రివటలా ఉండే అలీబకాసురుల్లాంటి ఎత్తయిన మత్తేభాలను సైతం మట్టి కరిపించాడు. దానికి కారణం ఏమిటో ఆయనే చెప్పాడు. బాక్సింగ్‌ రింగులో ఉన్నా, బాత్‌రూంలో ఉన్నా 'ఐయాం ద గ్రేటస్ట్‌, ఐయాం ద ఛాంపియన్‌' అంటూ అలీ ఉద్వేగాలతో ఉత్సాహపరచుకునేవాడు. అందుకే నిజజీవితంలో ఛాంపియన్‌ కావడమే కాదు; చరిత్రలో చిరస్మరణీయుడైన బాక్సర్‌ కాగలిగాడు. అందువల్ల అనునిత్యం తన లక్ష్యాలను భావోద్వేగాలతోఉత్సాహపరచుకునే వ్యక్తులే విజయాలు సాధించగలుగుతారు. వూహాజగత్తులోని లక్ష్యాలు వాస్తవరూపం దాల్చడానికి ఉద్వేగాలే వూపునిస్తాయి.
7. చర్య తీసుకుంటేనే చలనం వస్తుంది
లక్ష్యాలు పెట్టుకొని, ప్రణాళికలు సిద్ధం చేసుకొని వూరికే కూర్చుంటే ఫలితం రాదు. లక్ష్యం పెట్టుకున్నరోజునుంచే దాన్ని అమలు చేయడానికి చర్య తీసుకోవాలి. అది ఏ పాటి చర్య అయినా, చిన్నపాటి చర్యే అయినా- ఫర్వాలేదు. అది నిరంతరాయమైన చర్య కావాలి.

లక్ష్యనిర్దేశం మీద సాధికారికంగా చెప్పగలిగే వ్యక్తిత్వ నిపుణుడు
బ్రయాన్‌ ట్రేసీ మాటల్లో- ''మనం పెట్టుకున్న లక్ష్యాలను కాగితం మీద ప్రతిరోజూ రాసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ వాటిపై ఎంతో కొంత చర్య తీసుకుంటూ ఉండాలి.''

గొప్ప లక్ష్యాల కోసం విస్తృత ప్రణాళికలు వేసుకున్న విజ్ఞులు సైతం విస్మృత గర్భంలోకి వెళ్ళిపోవడానికి కారణంతమ లక్ష్యాల అమలు కోసం వారు ఏపాటి చర్యా తీసుకోకపోవడమే.
'గోల్‌పోస్టర్‌' వాల్‌పోస్టర్‌ కావాలి
అందంగా రాసుకొని, భద్రంగా దాచుకుంటూ ఏడాదికోసారి చూసి మురిసిపోడానికి కాదు
లక్ష్యాన్ని పెట్టుకునేది. అది నిత్యం కళ్ళముందు కనబడాలి. కర్తవ్యాన్ని గుర్తుచెయ్యాలి. కార్యోన్ముఖుణ్ని కావించాలి. అలా జరగాలంటే లక్ష్యాలను ఏదో చిత్తు కాగితాల్లోనో, మూసిపడుండే పుస్తకంలోనో రాసుకుంటేచాలదు. ఓ అందమైన 'గోల్‌పోస్టర్‌'గా తయారుచేసుకోవాలి. దాన్నో 'వాల్‌పోస్టర్‌'గా అతికించుకోవాలి. కళాశాలకు వెళ్ళేముందు, అక్కణ్నుంచి ఇంటికి వచ్చాక కూడా అది కళ్ళముందుకనబడుతుంది. కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. కడకంటా ప్రేరణ ఇస్తుంది.

గోల్పోస్టర్ను ఎలా తయారుచేసుకోవాలో ఓ నమూనా చూడండి.
* ఈ మార్కులు ఎందుకు కావాలంటే...
* ఐఏఎస్‌ సాధించడానికి
* ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితాన్ని అనుభవించడానికి
* నా తల్లిదండ్రులకు ఆనందం కలిగించడానికి
* ఈ మార్కులు ఎలా తెచ్చుకుంటానంటే...
* పేపర్లన్నిటి మీదా సమానదృష్టి పెట్టి రోజుకు 12 గంటలు చదువుతాను.
* ఉన్నత ప్రమాణాలున్న పోటీపరీక్షల సంస్థలో శిక్షణ తీసుకుంటాను.
* పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న శ్రేష్ఠులైన మిత్రబృందంతో చర్చిస్తూ చదువుతాను.
* నమూనా పరీక్షలు అభ్యాసం చేస్తూ నా రాతను మెరుగుపరచుకుంటాను.
వీటిని అమలు చేస్తూ మే 29, 2010 నాటికి నేను ఐఏఎస్‌ తెచ్చుకుంటాను.
ఎక్కువ మార్కులు కోరే విద్యార్థులూ... ఈ రోజే మీ గోల్పోస్టర్‌ తయారుచేసుకోండి. వాల్పోస్టరుగాఅతికించండి. లక్ష్యం దిశగా తొలి అడుగు వేయండి.
‌‌‌‌



--------------------------
(ఈనాడు,౨౨:౧౨:౨౦౦౮)
---------------------------

కాలానికి వేద్దామా.. కళ్ళెం?

[8 అంచెల వ్యూహంలో రెండో అంశం-2
'ప్రణాళికాబద్ధంగా కాలాన్ని వినియోగించటం'.
]
సత్య

సగటు విద్యార్థికి- 'చేతివేళ్ళ సందుల్లో ఇసుకలా' కాలం జారిపోతుంది. జూన్‌ మొన్ననే వెళ్ళినట్టుంటుంది. ఇంతలోనే డిసెంబర్‌ ఆఖరు... మళ్ళీ కొత్త సంవత్సరం! కళ్ళు తెరిచి చూసేసరికి పరీక్షల పెనుభూతం ప్రత్యక్షమవుతుంది. మామూలు విద్యార్థికీ, సూపర్‌ విద్యార్థికీ మధ్య తేడా... సమయాన్ని వినియోగించుకునే విధానంలోనే ఉంటుంది! ఉత్తమ విద్యార్థి కాలానికి కళ్ళెం వేస్తాడు. ప్రాథమ్యాలు ఏర్పరచుకొని కృషి చేస్తాడు; పరీక్షల్లో విజేతగా నిలుస్తాడు!

ఎక్కువ మార్కులు సంపాదించిపెట్టే 8 అంచెల వ్యూహాన్ని తెలుసుకుంటున్నాం కదా... దానిలో మొదటిదైన 'స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవటం' గురించి చూశాం.
ఇక రెండో అంశం- 'ప్రణాళికాబద్ధంగా కాలాన్ని వినియోగించటం'.

పంట పండించే ప్రక్రియలో అన్నదాత ప్రతి క్షణాన్నీ ఉపయోగించుకున్నట్టే చదువు ప్రక్రియలో కూడా విద్యార్థులు పక్కా ప్రణాళికతో కాల పట్టికలు (టైమ్‌ షెడ్యూళ్ళు) తయారుచేసుకొని కాలాన్ని నియంత్రించాలి.

సగటు విద్యార్థికైనా, సూపర్‌ (ఉత్తమ) విద్యార్థికైనా ప్రకృతి ప్రసాదించే కాలం ఒక్కటే. దాన్ని వారు వినియోగించుకునే విధానమే వేరు. కాల వినియోగంపై ఎంతోకాలం పరిశోధించిన స్టీవెన్‌ ఆర్‌. కవీ అది రెండు రకాలుగా ఉంటుందంటాడు.
ఒకటి అత్యవసరం (urgent),
రెండు ముఖ్యం (important).
తక్షణం లేదా ఓ కాలపరిమితిలో చేయాల్సిన పని 'అర్జంటు'. తరుముకొచ్చే కాలంతో నిమిత్తం లేకుండా మంచి ఫలితం కోసం చేసే పని 'ముఖ్యం'. ఈ 'అర్జెంటు-ముఖ్యం' అనే అంశాలు వాటి కలయికల వల్ల తిరిగి నాలుగు వర్గాలుగా విడిపోతాయి.

విద్యార్థి చదువుకు కేటాయించే కాలాన్ని matrix'కాల వినియోగపట్టిక' (Time management) ద్వారా ఇలా చూడవచ్చు.



* మొదటి గడిలోని పనులు 'అర్జంటు-ముఖ్యం' అనే వర్గానికి చెందుతాయి. 'రేపే చేయాల్సిన హోం వర్క్‌' మొదలైనవి దీని కిందకు వస్తాయి.
* మూడో గడిలోనివి 'ముఖ్యం కాదు, కానీ అర్జంటు'గా చేయాలనేవి. 'ఇంటికొచ్చే ఫోన్లకు సుదీర్ఘంగా సమాధానాలు ఇవ్వడం' వగైరా.
* నాలుగో గడిలోని పనులు 'ముఖ్యమైనవీ కాదు, అర్జంటూ కాదు' వర్గానికి చెందుతాయి. 'టీవీకి అతుక్కుపోవడం' మొదలైనవి.
సగటు విద్యార్థి మూడు గడుల్లో సుళ్ళు తిరుగుతూ కాలాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు.

* రెండో గడిలోని పనులు 'అర్జంటు కాదు, ముఖ్యం' వర్గానికి చెందినవి.
సూపర్‌ విద్యార్థి తన కాలాన్ని ఎక్కువగా ఈ రెండో గడికే కేటాయిస్తాడు. ప్రణాళికాబద్ధంగా ముందుగానే చదువు ప్రారంభిస్తాడు. సబ్జెక్టు ఎప్పటికి పూర్తిచేయాలో షెడ్యూళ్ళు తయారుచేసుకుంటాడు. పునశ్చరణకు ప్రాధాన్యం ఇస్తాడు. మైండ్‌ మ్యాపులు తయారుచేసుకుంటాడు. జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరచుకుంటాడు. పరీక్షలు సమీపించేసరికి సర్వసన్నద్ధుడై ఉత్సాహంగా ఉంటాడు.

ఎవరు ఏ తీరు?

ఇంతకుముందు చూసిన పట్టిక ఆధారంగా సగటు విద్యార్థి తన కాలాన్ని ఎలా వినియోగిస్తాడో చూడండి.
మొదటి గడిలో వ్యాపకాల కోసం 25 శాతం వాడతాడు. మూడో గడిలో పనులకు 40 శాతం మింగేస్తాడు. నాలుగో గడికి 30 శాతం నైవేద్యం పెడతాడు. ఇక అతి ముఖ్యమైన మార్కులు తెచ్చే రెండో గడి పనులకు కేవలం 5 శాతం కేటాయిస్తాడు.
సూపర్‌ విద్యార్థి కూడా ఈ నాలుగింటికీ కాలాన్ని వాడుకుంటాడు. కానీ అతని ప్రాథమ్యాలు మాత్రం వేరుగా ఉంటాయి.

మొదటి గడిలోని పనులకు 20 శాతం కేటాయిస్తాడు. మూడో గడిలో వాటికి 15 శాతానికే పరిమితమవుతాడు. నాలుగో గడిలో కేవలం 5 శాతం గడుపుతాడు. ఇక, రెండో గడి పనులకు 60 శాతం అంకితమవుతాడు. అందువల్లనే ఎలాంటి చింతా, చికాకూ లేకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతాడు.

కాల వినియోగ పట్టిక కింది రెండు గడుల్లోనే సగటు విద్యార్థులు చతికిలపడతారు. దాదాపు 70 శాతం కాలాన్ని అక్కడే వ్యర్థం చేస్తారు. ముఖ్యమైనవాటికి కేవలం ముప్పై శాతమే కేటాయిస్తారు. సూపర్‌ విద్యార్థులు మాత్రం కింది రెండు గడుల్లోని పనులకు కేవలం 20 శాతమే కేటాయిస్తారు. మిగతా 80 శాతాన్ని పై గడుల్లో వినియోగిస్తారు. కాల వినియోగ పట్టికలోని రేఖకు కింద ఉండేవారు మార్కుల్లో కూడా కిందే ఉంటారు. రేఖకు పైభాగాన ఉండేవారు మార్కుల్లోనే కాదు, జీవితంలో కూడా పైపైకి ఎగబాకుతారు.
---------------------------
(ఈనాడు, ౨౯ :౧౨ : ౨౦౦౮)
---------------------------


వాయిదాల వ్యాధికి దివ్యౌషధం!
[8 అంచెల వ్యూహంలో మూడో అంశం-3
'నిర్విరామంగా నిరంతరం ప్రయత్నించడం'
]

ఉత్తమ విద్యార్థికి చదువంటే ప్రాణం, ప్రేరణ.
ప్రేరణ లేకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు!
అధిక మార్కులు తెచ్చే 8 అంచెల వ్యూహంలో
మూడో అంశం- 'నిర్విరామంగా నిరంతరం ప్రయత్నించడం'.
అన్నదాత పంట కోసం అనునిత్యం పరిశ్రమించినట్లుగానే మార్కుల పంట కోసం విద్యార్థి ప్రతిక్షణం పాటుపడాలి. లక్ష్యాలు చాలామంది పెట్టుకుంటారు. విపులంగా వాటిని కొందరు రాసుకుంటారు కూడా. ఇంకొందరు పక్కా ప్రణాళికతో కాలపట్టికలు (schedules) సైతం తయారుచేసుకుంటారు. మరి ఇంత చేసినా వాటిని అమలు చేయడానికి ఎలాంటి చర్యా తీసుకోకపోతే, ఆ పడిన శ్రమకు ఫలితమేమిటి?

మజాల బురదలో...
ఎంతోమందికి ఎన్నో చేయాలని ఉంటుంది కానీ వాటిలో వందోవంతు కూడా వారు చేయరు. కారణం- వాయిదా వ్యాధి (procrastination)తో ఖాయిలా (sickness) పడడమే. మజాల బురదలో కూరుకుపోవడమే. బద్ధకం ఊబిలో బందీలవడమే. చాలామంది విద్యార్థులు చదువు అంటేనే బోర్‌ ఫీలవుతారు. పుస్తకం తీయాలంటే భారమంటారు. తీరా పరీక్షలు తరుముకొచ్చేసరికి బావురుమంటారు. ఎక్కువ మార్కులు రావాలంటే ఏ రోజు పాఠం ఆ రోజే చదవాలనీ, ఏ రోజు హోం వర్క్‌ ఆ రోజే పూర్తిచేయాలనీ విద్యార్థులందరికీ తెలుసు. అయినా అవేమీ చేయకుండా చదువును వాయిదా వేస్తూ పీకల మీదకు తెచ్చుకుంటారు.

బాధ, హాయిల మధ్య బందీ
విద్యార్థులే కాదు, పెద్దవాళ్ళు సైతం తమ పనులను వాయిదా వేయడానికి కారణం ఏమిటి? ఇంతకీ వాయిదా అంటే ఏమిటి? చర్య (action) తీసుకోవడంలో పక్షవాతానికి (paralysis)గురి కావడమే. అంటే చర్య తీసుకోవలసిన సమయంలో అనాసక్తత చూపడం. ఎదుర్కోవలసిన సమయంలో వెన్ను చూపడం.

ఇలా ఎందుకు జరుగుతుంది?
పని పట్ల ప్రేరణ లేకపోవడమే అంటారు పెద్దలు. అలా పని పట్ల ప్రేరణ లోపించడానికి కారణం- మానసికంగా మనలో జరిగే కండిషనింగ్‌. (conditioning).

చదువు అనగానే వారికి లోపల నుంచి బాధ పుట్టుకువస్తుంది. చదవాలంటే ఓ చోట గంటల తరబడి బుద్ధిగా కూర్చోవాలి. నడుంనొప్పి పుట్టినా లేవకూడదు. తనకు నచ్చిన టీవీ కార్యక్రమాలు, స్నేహితులతో తిరగడాలు, కంప్యూటర్‌ క్రీడలు, సెల్‌ఫోన్‌ చాటింగ్‌లు చాలా వదులుకోవాలి. అలా వదులుకోవడం విద్యార్థికి బాధగా ఉంటుంది. అవిచ్చే హాయి చదువులో దొరకదు అతనికి. ఒక్కోసారి ఆ చదివే సబ్జెక్టు ఆసక్తిగా లేకపోతే ఎంతో ఆందోళనగా ఉంటుంది. అది మరింత బాధ కలిగిస్తుంది. పైగా చదువుకోడానికి రేపూ మాపూ ఉండనే ఉంది; కానీ ఈ రోజు టీవీ ప్రోగ్రాం రేపు రాదు కదా! అందుకే... విద్యార్థి చదువును వాయిదా వేసెయ్యాలని తీర్మానించుకుంటాడు. వెంటనే టీవీ ముందు తిష్ఠ వేస్తాడు. కంప్యూటర్‌ క్రీడల్లో మునిగిపోతాడు. సెల్‌ఫోన్‌ చాటింగుల్లో తలమునకలవుతాడు. మిత్రులతో మంతనాలు సాగిస్తాడు. బజార్లో బాతాఖానీ కొడతాడు.

ఇలా చేస్తూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఇలా బాధ, హాయిల మధ్య విద్యార్థి బందీ కావడం వల్ల కాలాన్ని వాయిదా వేస్తూ చదువును అశ్రద్ధ చేస్తాడు.

సగటు విద్యార్థి చదువుతో బాధను ముడేస్తాడు. చదవాలంటే బాధ పడతాడు. చదువు తప్పిపోతే ఆనందపడతాడు. కానీ సూపర్‌ విద్యార్థి తన ఆనందాన్ని చదువుతో జత చేస్తాడు. చదవడంలోనే ఆనందం పొందుతాడు. చదవడానికి వీలుకాకపోతే విపరీతమైన బాధ పడతాడు. సగటు విద్యార్థికి చదువు 'బాధ'. సూపర్‌ విద్యార్థికి చదువు 'హాయి'. సగటు విద్యార్థికి చదువంటే బోరు, చికాకు. సూపర్‌ విద్యార్థికి చదువంటే ప్రాణం, ప్రేరణ. ప్రేరణ ఉంటుంది కాబట్టి చదువును ప్రేమిస్తాడు. ప్రేరణ లేకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు.

నిత్య ప్రేరితుడు కావాలంటే..?
బాధ, హాయిల మధ్య బందీ కాకుండా విద్యార్థి చదువు మీద ధ్యాస పెట్టాలంటే ఏం చేయాలి? చదువు పట్ల నిత్యప్రేరితుడు కావాలి. మార్కుల వల్ల వచ్చే ఆనందాన్నీ, భవిష్యత్తులో తాను సాధించబోయే విజయాలనూ నిత్యం మననం చేసుకోవాలి. అలాగే మార్కులు సరిగా రాకపోతే వచ్చే అనర్థాలనూ, జీవితంలో తాను ఎదుర్కొనబోయే అపజయాలనూ ఊహించుకోవాలి. విద్యార్థి నిత్యప్రేరితుడు కావాలంటే, నిర్విరామంగా ప్రయత్నించాలంటే, కర్తవ్య పాలకుడు కావాలంటే ఓ ఎనిమిది అంశాల పట్ల ఏకాగ్రత చూపాలి.



అవాంఛనీయ స్థితికి బాధను జోడించండి
చదువును వాయిదా వేసే ప్రతి విద్యార్థీ ఓ పని చేయాలి. తనకొచ్చే తక్కువ మార్కుల వల్ల ఎంత బాధ కలుగుతుందో, ఎంత అపరాధ భావానికి గురవుతామో, ఎంత చిత్తక్షోభ కలుగుతుందో దాన్ని నిజంగా జరిగినట్టు వూహించి పాయింట్లుగా కాగితమ్మీద రాసుకోవాలి.

మీకు తగిన మార్కులు వచ్చి, మీ మిత్రులకు ఎక్కువ మార్కులు వస్తే, మీరు డిటెయిన్‌ అయ్యి, మీ మిత్రులు పై తరగతులకు ప్రమోట్‌ అయితే, మీరు కోరుకున్న కాలేజీలో సీటు రాకపోతే, మీకు నచ్చిన సబ్జెక్టు దక్కకపోతే, ఓ అయిదేళ్ళ తర్వాత మీకు ఉద్యోగం దొరక్కపోతే, నిరుద్యోగపర్వంలో మగ్గుతూ ఉంటే, మీరు ఏ గుమాస్తాగిరిలోనో ఉండగా మీ మిత్రుడు మీ పై అధికారిగా పెత్తనం చెలాయిస్తుంటే, ఆపై మరో అయిదేళ్ళ తర్వాత ఆర్థికస్థితి బాగా లేక అప్పులవాళ్ళు చుట్టుముడితే....

ఇలా వూహించుకుంటూ మీలో కలిగే బాధను అనుభూతికి తెచ్చుకోండి. మార్కులు రాకపోతే జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో వూహాజగత్తులో పొందే చిత్తక్షోభ నిజజీవితంలో ఉండకుండా పోవాలంటే అలాంటి అవాంఛనీయ మార్కుల పట్ల బాధను పెంచుకోవాలి.

వాంఛనీయ స్థితికి హాయి జతచేయండి
ఎప్పటి పాఠం అప్పుడు చదివి, ఎక్కువ మార్కులు వస్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత గర్వంగా, ఉత్సాహంగా ఉంటుందో అలాంటి వాంఛనీయ స్థితి ఎంత ఉల్లాసంగా ఉంటుందో కాగితమ్మీద రాసుకోండి.

మీ తల్లిదండ్రులు ఆనందంగా అక్కున చేర్చుకుంటుంటే, మీ అమ్మగారు పొరుగువాళ్ళతో మీ గొప్పదనం చెప్పుకుంటుంటే, మీకు మంచి మార్కులు వచ్చిన సందర్భంగా మీ నాన్నగారిని ఆయన మిత్రులు అభినందిస్తుంటే, మీ మిత్రులు మీకు పార్టీ ఇస్తుంటే, మీ టీచర్లు గర్వంగా మిమ్మల్ని చూసి పొంగిపోతుంటే ఎలా ఉంటుందో వూహించుకోండి. వూహాజగత్తులో పొందే ఆ ఆనందాన్ని వాస్తవ జీవితంలో నిజం చేసుకోవాలంటే ఎక్కువ మార్కుల పట్ల హాయిని పెంచుకోవాలి.

--------------------------
(ఈనాడు, ౦౫:౦౧:౨౦౦౯)
---------------------------

సరదాల బందిఖానా... బయటపడేదెలా?
[8 అంచెల వ్యూహంలో మూడో అంశం-
'నిర్విరామంగా నిరంతరం ప్రయత్నించడం']

సత్య
స్నేహితులతో కబుర్లూ షికార్లూ, విందులూ వినోదాలూ... ఈ బందిఖానాలో ఇరుక్కుపోతే అదే స్వర్గమనిపిస్తుంది. చాలామంది విద్యార్థులు ఎప్పుడూ అలానే ఉండాలని ఆరాటపడుతుంటారు. దానికి విఘాతం కలిగితే గిలగిలలాడిపోతుంటారు. నిజమైన ప్రగతి కావాలంటే దాన్నుంచి బయటపడాలి!

అధిక మార్కులు తెచ్చే 8 అంచెల వ్యూహంలో
మూడో అంశం- 'నిర్విరామంగా నిరంతరం ప్రయత్నించడం'.

విద్యార్థి నిత్యప్రేరితుడై నిర్విరామంగా ప్రయత్నించాలంటే
1) అవాంఛనీయ స్థితికి బాధను జోడించాలనీ
2) వాంఛనీయ స్థితికి హాయిని జతచేయాలనీ
తెలుసుకున్నాం. ఇంకా ఏం చేయాలో పరిశీలిద్దాం.

3) కంఫర్ట్‌జోన్‌ను బద్దలు కొట్టండి
ప్రతి విద్యార్థి చుట్టూ ఓ 'కంఫర్ట్‌ జోన్‌' అల్లుకుని ఉంటుంది. దీన్ని పచ్చిగా చెప్పాలంటే బురదగుంట అనవచ్చు. చుట్టూ స్నేహితులు, వాళ్ళతో కబుర్లు, షికార్లు, టీవీ ముందు తిష్ఠ వేయడం, కంప్యూటర్లో క్రీడా ప్రావీణ్యం, సెల్‌ఫోన్‌ చాటింగ్‌, అందం కోసం అర్రులు చాస్తూ అద్దానికి అతుక్కుపోవడం, విందులూ వినోదాలూ వగైరాల కంఫర్ట్‌జోన్‌ బందిఖానాలో ఇరుక్కుపోయే వ్యక్తి దాన్నో స్వర్గంలా భావిస్తాడు. ఎప్పుడూ అలానే ఉండాలని ఆరాటపడతాడు. దానికి విఘాతం కలిగితే గిలగిలలాడిపోతాడు. కానీ, నిజమైన అభివృద్ధి కావాలంటే ఆ బురదగుంట నుంచి బయటపడాలి. కంఫర్ట్‌జోన్‌ను బద్దలు కొట్టాలి. అలా చేయాలంటే ప్రతి విద్యార్థీ నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రగతివైపు అడుగులు వేయాలి.

4) మీకు మీరు వాగ్దానం చేసుకోండి
కర్తవ్యాన్ని గుర్తుచేసి కార్యరంగంలోకి దూకేలా చేసేది మనకు మనం చేసుకునే వాగ్దానమే (commitment). కోరికకూ, వాగ్దానానికీ తేడా ఉంది. కోరిక కేవలం అనుకోవడం వరకే ఉంటుంది. కానీ వాగ్దానం పీక తెగినా మాట తప్పని స్థితి. తన మాట కోసం ఎలాంటి సుఖాన్నయినా త్యాగం చేయడానికి సిద్ధం కావడమే వాగ్దానం.

వాగ్దానం కేవలం మాటలకే పరిమితం కారాదు. లక్ష్యాన్ని రాత రూపంలో పెట్టినట్టుగానే వాగ్దానాన్ని కూడా రాతలో పెట్టాలి. మీకు మీరు ఓ వాగ్దానపత్రిక రాసుకోవాలి. దానికింద పూర్తి సంతకం చేయాలి. తేదీ కూడా వేయాలి. అలా చేసేవారిలో అది తీసుకువచ్చే మార్పు ఓ మ్యాజిక్‌లా ఉంటుంది.

5) మీ వాగ్దానాన్ని బహిర్గతం చేయండి
స్తబ్ధత పోయి చురుకుదనం రావాలంటే మీ వాగ్దానాన్ని బహిరంగపరచాలంటాడు ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణుడు ఆంథొని రాబిన్స్‌. మనకు మనం చేసుకున్న స్వయం వాగ్దానం శక్తిమంతమైందే కానీ ఒక్కోసారి పరిస్థితులకు రాజీపడే ప్రమాదం అందులో పొంచివుంది. అదే బహిర్గత వాగ్దానమైతే ప్రతికూల పరిస్థితులను సైతం మనకు అనుకూలంగా మలచుకునే అవకాశం వస్తుంది. 'నేను ఈ ఏడాది గ్రూప్‌-1 టాపర్లలో ఉంటా'నని మీ మిత్రులతో, తల్లిదండ్రులతో, సన్నిహితులతో చెప్పండి. చెప్పడమే కాదు; ఓ ప్రామిసరీ నోటు రాసినప్పుడు సంతకం చేసి, సాక్షి సంతకాలు కూడా చేయించినట్టుగానే మీరు సంతకం చేసిన వాగ్దానపత్రం మీద వారిచేత కూడా సంతకం చేయించండి. దానివల్ల వారంతా మీ లక్ష్యసాధనకు సహకరిస్తారు.

అయితే ఈ బహిర్గత వాగ్దానం వల్ల మీకో సవాలు ఎదురుకావచ్చు. 'ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందంట' అని కొందరు ఎగతాళి చేయవచ్చు. కానీ బహిర్గత వాగ్దానం ఆ ఎగతాళిని వైతాళిక గీతంగా మార్చేస్తుంది. మడం తిప్పని మార్చింగ్‌ సాంగ్‌లా ముందుకు నడిపిస్తుంది. కదం తొక్కే కొదమసింహంలా విజృంభింపచేస్తుంది. అనంతశక్తిని మీలో ఆవిర్భవింపజేస్తుంది.

6) ప్రగతిని నిరంతరం సమీక్షించుకోండి
మీరు సాధిస్తున్న ప్రగతిని క్రమపద్ధతిలో సమీక్షించుకోవాలి. మీరు ఏర్పరచుకున్న లక్ష్యాల కక్ష్యలో పరిభ్రమిస్తున్నారా లేక కక్ష్యకు ఆవల ఎక్కడో విసిరివేసినట్టు ఉన్నారా అనేది నిరంతర సమీక్ష వల్లనే సాధ్యమవుతుంది. మీ 'గోల్‌పోస్టర్‌'ను చూసుకుంటూ మీరు ఎందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలో, వాటివల్ల వచ్చే లాభాలేమిటో స్మరించుకుంటే మీరు ప్రగతిపథంవైపే ముందడుగు వేస్తారు.

7) అప్పుడప్పుడూ మిమ్మల్ని సన్మానించుకోండి
మీ విజయపథంలో ప్రధాన మైలురాళ్ళు దాటుతున్న ప్రతిసారీ మీకు మీరో బహుమతి ఇచ్చుకోండి. మిమ్మల్ని మీరు సన్మానించుకోండి. ఓ వ్యాసం రాయడం పూర్తయినప్పుడూ, క్లాసు టెస్టు బాగా రాసినప్పుడూ ఓ గంట అదనంగా వినోదానికి కేటాయించండి. టీవీ చూడండి లేదా షికారుకు వెళ్ళండి. అలాగే వాయిదా పడ్డప్పుడు దండన విధించుకోండి. అంటే మీ టీవీ సమయానికి కోత పెట్టండి.

8) శక్తినిచ్చే నమ్మకాలతో జీవించండి
అన్నిటికంటే ముఖ్యంగా బలమైన నమ్మకాలతో శ్వాసించండి. నమ్మకాలు మనిషిని మహాత్ముణ్ని చేస్తాయి; లేదా మట్టిపాల్జేస్తాయి. ఆకాశానికి ఎత్తుతాయి; లేదా అధః పాతాళానికి తొక్కుతాయి. అవి మనిషికి ప్రాణం పోస్తాయి; లేదా జీవం తీస్తాయి. అందుకే 'నమ్మకమా! నీకు నమస్కారం!' అంటారు విజ్ఞులు. కంప్యూటర్‌ పనిచేయడానికి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఎంత కీలకమైందో, విజయం సాధించడంలో మన మెదడు అనే కంప్యూటర్‌కు నమ్మకాల వ్యవస్థ అంత ప్రధానమైంది.

నమ్మకాలు రెండు రకాలు.
'నేను ఎందుకూ పనికిరాను' అని నిర్వీర్యపరిచే నమ్మకాలు (desempowering beliefs) ఒక రకం కాగా,
'నేను దేనినైనా సాధిస్తాను' అనే శక్తినిచ్చేవి (
empowering beliefs) మరో రకం.
శక్తినిచ్చే నమ్మకాలే మనిషిని ఉన్నతుణ్ని చేస్తాయి. అలాంటి నమ్మకాలున్న విద్యార్థే ఉన్నతస్థాయి మార్కులు తెచ్చుకోగలుగుతాడు.
'నేను ఈ ఏడాది గ్రూప్‌-1 టాపర్లలో ఉంటా'నని మీ మిత్రులతో, తల్లిదండ్రులతో, సన్నిహితులతో చెప్పండి. చెప్పడమే కాదు; ప్రామిసరీ నోటులా మీరు సంతకం చేసిన వాగ్దానపత్రం మీద వారిచేత కూడా సంతకం చేయించండి. దానివల్ల వారంతా మీ లక్ష్యసాధనకు సహకరిస్తారు.

నిత్యకృషీవలుణ్ని చేసే అష్ట సూత్రాలు:
1. అవాంఛనీయ స్థితికి బాధను జోడించండి
2. వాంఛనీయ స్థితికి హాయిని జత చేయండి
3. కంఫర్ట్‌జోన్‌ను బద్దలు కొట్టండి
4. మీకు మీరు వాగ్దానం చేసుకోండి
5. మీ వాగ్దానాలను బహిరంగపరచండి
6. సాధించిన ప్రగతిని సమీక్షించుకోండి
7. సాధించినదానికి మిమ్మల్ని సన్మానించుకోండి
8. నిత్యం శక్తినిచ్చే నమ్మకాలతో జీవించండి

------------------------
(ఈనాడు, ౧౨:౦౧:౨౦౦౯)
------------------------


మెదడు హార్డ్‌వేర్‌కు నమ్మకమే సాఫ్ట్‌వేర్‌!
సత్య
ఎక్కువ మార్కులు రావాలంటే శక్తినిచ్చే నమ్మకాలను దరిచేర్చుకోవాలి. ప్రతి విద్యార్థీ 'నేను తెలివైన వాణ్ని. నాకు మంచి మార్కులు వస్తాయి. చదువు ఆటలాంటిది' వంటి నమ్మకాలు ఏర్పరచుకోవాలి. సామాన్య విద్యార్థి కూడా విజేతగా మారటానికి ఇదెంతో ఉపకరిస్తుంది! నిషి జీవితానికి నమ్మకం చాలా ప్రధానమైనది. 'కంప్యూటర్‌' పని చేయడానికి 'ఆపరేటింగ్‌ సిస్టం' ఎంత ప్రధానమైందో, మనిషి మెదడు అనే కంప్యూటర్‌ పనిచేయడానికి నమ్మకాల వ్యవస్థ అంత ప్రధానం. మనిషి 'మెదడు' అనే హార్డ్‌వేర్‌ పనిచేయడానికి 'నమ్మకం' అనే సాఫ్ట్‌వేర్‌ కావాలి.
విద్యార్థి మార్కులకూ, అతని నమ్మకాలకూ సంబంధం ఉంటుందా అని కొందరికి సందేహం రావొచ్చు. విద్యార్థి మార్కులనే కాదు, అతని జీవితాన్ని సైతం మార్చేయగల శక్తి నమ్మకాలకుంది.
ఓ నమ్మకం అందలమైనా ఎక్కిస్తుంది. అగాధానికైనా తోసేస్తుంది. అది స్వర్గానికి నిచ్చెనలేస్తుంది. నరకానికి లాకులు తీస్తుంది. నమ్మకానికున్న అనంతశక్తిని చూసే 'అది దేనినైనా సృష్టించగలదు; దేనినైనా నిర్జించగలదు' అంటాడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఏంథోని రాబిన్స్‌.
బలమైన నమ్మకమున్న విద్యార్థి మనసు- ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి దారులు వెదుకుతుంది. తన శక్తినంతా కేంద్రీకరించి మంచి ఫలితాలు సాధించడానికి వ్యూహాలు పన్నుతుంది. సరైన నమ్మకం లేని విద్యార్థి మెదడు మొద్దుబారిపోతుంది. తన ముందున్న దారులను మూసేస్తుంది. ఫలితంగా ఏదీ సాధ్యం కాకుండాపోతుంది.

'విజయ-విఫల' వృత్తం* ఓ పనిలో విజయం సాధించడానికైనా, విఫలం కావడానికైనా నమ్మకమే ప్రధానం.
* ఆ నమ్మకానికి అనుగుణంగానే ఏ వ్యక్తి అయినా చర్య (action) తీసుకుంటాడు.* చర్య తీసుకున్నపుడే అతని శక్తి అంతా వినియోగానికి వస్తుంది.
* శక్తి వినియోగమైనప్పుడే ఫలితం వస్తుంది.
ఆ ఫలితమే నమ్మకాన్ని మరింత బలపడేట్టు చేస్తుంది. వృత్తాకారంలో అనునిత్యం అది పరిభ్రమిస్తూ ఉంటుంది.

విజయ వృత్తం (Circle of success)
విద్యార్థి మార్కుల దృష్ట్యా దీనికి ఓ దృష్టాంతాన్ని చూద్దాం. 'నేను తెలివైనవాణ్ని.' 'నాకు ర్యాంకు వస్తుంది'. 'చదువు ఆటలాంటిది'. ఇలాంటి సానుకూల నమ్మకాలు ఉండే విద్యార్థి ఎలాంటి చర్యలు తీసుకుంటాడు?
తప్పనిసరిగా ఎక్కువ మార్కులు రావాలని ఓ లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. చదువు ఆటలాంటిది కాబట్టి ఇష్టపడి చదువుతాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఎక్కువ గంటలు పనిచేస్తాడు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఆ విద్యార్థి తన శక్తి సామర్థ్యాల్లో 90 శాతానికి మించి ఉపయోగించుకుంటాడు. ఫలితంగా అతడు లక్ష్యంగా నిర్దేశించుకున్న మార్కులు వస్తాయి. లేదా దానికి దగ్గర మార్కులు వస్తాయి.
దీనివల్ల ఆ విద్యార్థికి ఉండే 'నేను తెలివైనవాణ్ని, నాకు ర్యాంకు వస్తుంది, చదువు ఆటలాంటిది' లాంటి నమ్మకాలు మరింత బలపడతాయి. భవిష్యత్తులో విజయం సాధించడానికి మరింత ఉపకరిస్తాయి. ఇదే విజయ వృత్తం/సాఫల్య వృత్తం. సామాన్య విద్యార్థులు కూడా విజేతగా మారటానికి కారణం- వారికుండే బలమైన నమ్మకమే.

దీన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.

వైఫల్య వృత్తం (
Circle of failure)

అదే విద్యార్థికి ప్రతికూల నమ్మకాలు ఉన్నాయనుకుందాం. 'నేను మందబుద్ధిని. ఎంత చదివినా బుర్రకెక్కదు. చదువంటే బోరు. అది చాలా కష్టం' లాంటి నమ్మకాలు బుర్రలో తిష్ఠ వేసే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ కుర్రాడు చదవడానికి ప్రయత్నిస్తాడా?
చదువనగానే పుస్తకాన్ని పక్కన పారేస్తాడు. కాలాన్ని కంప్యూటర్‌ క్రీడలకో, సెల్‌ఫోన్‌ చాటింగ్‌కో, టీవీలో చెత్త ప్రోగ్రాములకో వినియోగిస్తాడు. చదవడం ఇష్టం లేని కుర్రాడి మెదడు ఎంత శక్తిని వినియోగించుకుంటుంది? బహుశా సున్నా శాతాన్ని. ఫలితం- సున్నా మార్కులు లేదా అత్తెసరు మార్కులు.
ఆ మార్కులు వచ్చిన విద్యార్థికి ఏమనిపిస్తుంది?- ''నే చెప్పలే! మనకి చదువు అచ్చిరాదు. అది మన ఒంటికి సరిపడదు. అదో పెద్ద బోరు''. ఈ నమ్మకాలు బలపడ్డ విద్యార్థి ఏం చేయగలడు? ఇంకేం మార్కులు తెచ్చుకోగలడు? ఇదే వైఫల్య వృత్తం. విఫలమయ్యే విద్యార్థి మరింత విఫలుడు కావడానికి కారణం అతనిలో తాను సఫలుణ్ని కాలేననే నమ్మకాలే.

దాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.


మరేం చేయాలి?
ఎక్కువ మార్కులు రావాలంటే ప్రతి విద్యార్థీ వైఫల్య వృత్తం నుంచి బయటపడాలి. అలా బయటపడాలంటే ముందు తనలోని నిర్వీర్య నమ్మకాలను తొలగించుకోవాలి. శక్తినిచ్చే నమ్మకాలను దరిచేర్చుకోవాలి. నమ్మకాల్లో మార్పు వస్తే జీవితంలో కూడా మార్పు వస్తుంది. అందువల్ల ప్రతి విద్యార్థీ 'నేను తెలివైన వాణ్ని. నాకు మంచి మార్కులు వస్తాయి. చదువు ఆటలాంటిది' వంటి శక్తినిచ్చే నమ్మకాలు కలిగివుండాలి. ఆ నమ్మకాలే విద్యార్థి జీవితాన్ని మార్చే సంజీవని లాంటివి.
నిర్వీర్య నమ్మకాలను ఎవరూ కావాలని కోరుకోరు. మనకు తెలియకుండానే మన పరిసరాల నుంచీ, మన అనుభవాల నుంచీ, మన విద్యావ్యవస్థ నుంచీ ఈ నమ్మకాలు చొరబడతాయి. క్రమేపీ వేళ్ళు దన్ని వూడలు దింపి మర్రిమానుల్లా ఎదిగిపోతాయి. అందుకే వేగవంతమైన విద్యార్జన (Accelerated Learning)కు ఆద్యుడైన జార్జ్‌ లొజనెవ్‌ ''పుట్టినప్పుడు అంతా మేధావులే. పెరుగుతున్నకొద్దీ ఆ మేధ తరిగిపోతుంది'' అంటాడు.
చిన్నప్పుడు 'నువ్వో పనికిమాలినవాడివి, బుద్ధిహీనుడివి, బుర్ర తక్కువవాడివి' లాంటి బిరుదులు తగిలిస్తారు. వీటిని మన అచేతన మనసు గ్రహించి అలాగే మనల్ని మార్చేస్తూ ఉంటుంది. వాటినే మనం నమ్ముతాం; అలాగే ప్రవర్తిస్తాం. ఆ విధంగానే మారతాం.
విద్యా విషయంలో కూడా తమలో ఏర్పడ్డ నమ్మకాలనే విద్యార్థులు నిజమని నమ్ముతారు. 'ఆల్‌జీబ్రా గుండె గాభరా', 'లెక్కలంటే లంకణాలు పడడం', 'ఇంగ్లిష్‌ అంటే గింగరాలు తిరగడం' 'బోటనీ బోరు బోరు' లాంటివి విద్యార్థులకు బయటినుంచి వచ్చే నమ్మకాలే. వీటన్నిటినీ మార్చుకుంటే తప్ప మన సబ్జెక్టుల మీద ఆసక్తి రాదు. ఆసక్తి లేకుంటే ఆశించే ఫలితాలు రావు. అందువల్ల నిర్వీర్యమైన నమ్మకాలను తుంగలో తొక్కి, శక్తినిచ్చే నమ్మకాలను అక్కున చేర్చుకోవాలి.

ఈ నమ్మకాలు శక్తినిస్తాయి!
విజేతలైన విద్యార్థులంతా శక్తినిచ్చే నమ్మకాలతో జీవిస్తారు. ఆ నమ్మకాలే ఉత్తమ ఫలితాలు రావటానికి ఉపకరిస్తాయి. అలాంటి విజేతలైన విద్యార్థులు పాటించే ఓ ఐదు శక్తిమంతమైన నమ్మకాలను మనవిగా చేసుకుని మననం చేసుకుందామా?
1. ఇతరులు చేయగలదాన్ని నేనూ చేయగలను (If others can do, so can I) :
ఒక వ్యక్తి చేయగలిగినదాన్ని ఎవరైనా చేయగలరు. ఒక మైలు దూరాన్ని నాలుగు నిమిషాల లోపు ఎవరూ పరుగెత్తలేరని శతాబ్దాల కాలం నుంచి ఉన్న నమ్మకాన్ని రోజర్‌ బేనిస్టర్‌ బద్దలు కొట్టాడు. రోజర్‌ చేసిన తర్వాత వందలకొద్దీ జనాలు తామూ చేయగలమని నిరూపించారు.
2. వైఫల్యం లేనేలేదు, అది కేవలం సంకేతమే (There is no failure, only feedback) :
విజయం రాకపోతే అది వైఫల్యంగా భావిస్తారు సగటు వ్యక్తులు. విజయం రాకపోతే తమ ప్రయత్నం స్థాయిని తెలియజేసే సంకేతంగా భావిస్తారు విజేతలు. థామస్‌ ఎడిసన్‌, బిల్‌గేట్స్‌లు తమ వైఫల్యాలను విద్య నేర్పే అనుభవాలు (Learning experiences) గా అభివర్ణించారు.
3. చదువనేది ఓ ఆట (Learning is fun):
ఏది సాధించాలన్నా, ముందు దాన్ని ప్రేమించాలి. ప్రతి వ్యక్తీ ఆటల్ని ప్రేమిస్తాడు కాబట్టే ఆటలంటే చెవి కోసుకుంటాడు. చదువును ప్రేమించే విద్యార్థి దాన్ని ఆటలానే తీసుకుంటాడు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాడు.
4. నా జీవిత గమనానికి నేనే బాధ్యుణ్ని (I am responsible for my destiny) :
విద్యారంగంలో విప్లవాన్ని సృష్టించిన మార్వా కొలీన్స్‌ ప్రారంభించిన పాఠశాలలో ఓ ఆరేళ్ళ విద్యార్థి తల్‌మాగ్డే. 'నువ్వేం నేర్చుకున్నా'వని అడిగితే ఆ విద్యార్థి చెప్పిన మాట- 'నీ గురించి సమాజం ఏమైనా అనుకోనీ. కానీ నీ గమ్యాన్ని నిర్దేశించుకోవాల్సింది కేవలం నువ్వే'. ఆ చిన్నపిల్లాడి మాట కోటి మార్కుల మూట.
5. నేను తెలివైనవాణ్ణి. చురుకైనవాణ్ణి:
'నేను తెలివైనవాణ్ణి, చురుకైనవాణ్ణి, అవిశ్రాంత శ్రామికుణ్ణి. నాకు ఎక్కువ మార్కులు వచ్చి తీరతాయి' అనే నమ్మకాలు విజేతలైన విద్యార్థుల్లో కనిపిస్తాయి.
ఇలాంటి ఓ అయిదు నమ్మకాలు మీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఉంటే పరీక్షల్లోనే కాదు, బతుకుబాటలో కూడా మార్కులన్నీ మీవే!
____________________________________
'ఆల్‌జీబ్రా గుండె గాభరా', 'లెక్కలంటే లంకణాలు పడడం', 'బోటనీ బోరు బోరు' లాంటివి విద్యార్థులకు బయటినుంచి వచ్చే నమ్మకాలే. వీటన్నిటినీ మార్చుకుంటే తప్ప ఆ సబ్జెక్టుల మీద ఆసక్తి రాదు. ఆసక్తి లేకుంటే ఆశించే ఫలితాలు రావు.


చిన్నప్పుడు 'నువ్వో పనికిమాలినవాడివి, బుద్ధిహీనుడివి, బుర్ర తక్కువవాడివి' లాంటి బిరుదులు తగిలిస్తారు. వీటిని మన అచేతన మనసు గ్రహించి అలాగే మనల్ని మార్చేస్తూ ఉంటుంది. వాటినే మనం నమ్ముతాం; అలాగే ప్రవర్తిస్తాం. ఆ విధంగానే మారతాం.
________________________________
(ఈనాడు, చదువు, ౧౯:౦౧:౨౦౦౮)
________________________________

'
'ముందు వరస' ఎందుకని ముఖ్యం?[ఎనిమిదంచెల వ్యూహంలో నాలుగో అంశం-4
'విద్యాసంస్థల్లో విజ్ఞాన బీజాలు నాటుకోవడం'.
]
సత్య
విద్యార్థులు తమ కళాశాల నుంచి గరిష్ఠంగా లబ్ధి పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కుల సాధనే కాదు; సభ్యతా సంస్కారాలను నేర్చుకునేది కూడా విద్యాసంస్థల్లోనే.

ఎక్కువ మార్కులు తెచ్చే ఎనిమిదంచెల వ్యూహంలో
నాలుగో అంశం- 'విద్యాసంస్థల్లో విజ్ఞాన బీజాలు నాటుకోవడం'.
చదువుకు సరైన పునాది పడేది విద్యాలయంలోనే. ఏం చదవాలో, ఎలా చదవాలో, ఏ పుస్తకాలు చూడాలో, విషయాన్ని ఎలా సేకరించుకోవాలో, ప్రశ్నలకు జవాబులు ఎలా రాయాలో... ఆ మెలకువలన్నీ నేర్చుకునేది విద్యాసంస్థలోనే. విద్యార్థి చదువుకే కాదు; సంస్కృతికీ ఇక్కడే పునాది వేసుకుంటాడు.

విద్యాసంస్థ నుంచి ఎక్కువ లబ్ధి పొందాలంటే అందుకు ప్రతి విద్యార్థీ 12 అంశాల మీద శ్రద్ధ పెట్టాలి.

1. నచ్చిన సబ్జెక్టునే ఎంచుకోవాలి
నచ్చిన సబ్జెక్టును ఎన్నుకునే అవకాశం ప్రతి విద్యార్థికీ ఇంటర్‌ విద్య నుంచి ఉంటుంది. అయితే, తనకు ఏ సబ్జెక్టు అంటే ఆసక్తి ఉందో తెలుసుకుని, దాన్ని తన చదువుకు మూలమైన మాతృ విషయంగా ఎన్నుకున్న విద్యార్థి మాత్రమే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతాడు.

'విద్యార్థుల్లో/పోటీ పరీక్షల అభ్యర్థుల్లో చాలామంది మార్కుల పరంగా విఫలం కావడానికి కారణం- తమకు నచ్చిన సబ్జెక్టును సకాలంలో గుర్తించి, దాన్ని అభ్యసించకపోవడమే' అంటాడు ప్రముఖ మానసిక నిపుణుడు విలియమ్‌ జేమ్స్‌. 'జీవితంలో రాణించాలంటే నచ్చిన రంగంలోనే అడుగుపెట్ట'మంటాడు హెన్రీ ఫోర్డు. 'స్కోరింగ్‌ సబ్జెక్టు అనే కారణంతో ఆప్షనల్‌ని ఎంచుకోరాదు. ఆ సబ్జెక్టుపై ఆసక్తి ఉందా లేదా అనేది ముఖ్యం' అంటాడు సివిల్స్‌ టాపర్‌ ముత్యాలరాజు.

నచ్చిన సబ్జెక్టు తీసుకుంటే అది చదువులా అనిపించదు. విజ్ఞానార్జన సైతం వినోద క్రీడగా, ఆసక్తికరంగా సాగిపోతుందనేది స్వీయానుభవం. బి.కామ్‌ ప్రథమశ్రేణిలో పాసయ్యాక అందరూ ఎం.కామ్‌, ఎంబీఏ చేయమని పోరుపెట్టినా సరే, ఇష్టమైన తెలుగుసాహిత్యాన్ని తీసుకున్నాను. చదివిన రెండేళ్ళూ అదో వినోద కార్యక్రమంగా గడిచింది. యూనివర్సిటీ ప్రథమస్థానం కూడా లభించింది!

2. ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థనే...
స్పర్థతో విద్య వర్థిల్లుతుందంటారు. అది వ్యక్తులకే కాదు, వ్యవస్థలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో ఉన్నత ప్రమాణాలు అందుకోవడానికి ప్రతి విద్యాసంస్థా ప్రయత్నిస్తుంది. కొన్ని ఉత్తమ ప్రమాణాలు అందుకొని ఆయా ప్రాంతాల్లో/ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ విద్యాసంస్థగా స్థిరపడుతుంది. అలాంటి సంస్థలో ప్రవేశం పొందడానికి విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ ఎగబడతారు. అక్కడ పోటీ విపరీతంగా ఉంటుంది. చెల్లించాల్సిన మూల్యం కూడా అధికంగానే ఉంటుంది.

మరి అలాంటి సంస్థలోకి ఓ నిరుపేద విద్యార్థి ప్రవేశం సాధ్యమవుతుందా? సాధ్యం కావడానికి ఒకే ఒక పాస్‌పోర్టు ఎక్కువ మార్కులు!
మనదేశంలో ఐఐటీ, ఐఐఎం, ఐఎస్‌బీ... ఇలా కొన్ని ప్రత్యేక ప్రమాణాలను సంతరించుకున్న సంస్థల్లో చేవగల విద్యార్థులే చేరగలుగుతారు. పుటంలో నిగ్గుతేరి పుత్తడిలా భాసిస్తారు. కొడితే సిక్సే కొట్టాలన్నట్టు చేరితే ఇలాంటి విద్యాసంస్థల్లోనే చేరాలి.

3. దారిచూపే మార్గదర్శిని ఎన్నుకోవాలి
కౌరవ పాండవులను విద్యాపరంగా తీర్చిదిద్దడానికి ఎంతో అన్వేషించి చివరకు ద్రోణుణ్ని వెదికి పట్టుకుంటాడు భీష్ముడు. ద్రోణుడే తనకు గురువుగా ఉండాలనుకుంటాడు ఏకలవ్యుడు. ప్రత్యక్షంగా ఆయన గురువుగా దొరక్కపోయేసరికి పరోక్షంగా ఆయన్నే తన విలువిద్యకు మార్గదర్శిగా ఎన్నుకున్నాడు. మంచి గురువు కోసం పడరాని పాట్లు పడ్డాడు కర్ణుడు. విద్యను అభ్యసించడానికి గురువు ఎంత ముఖ్యమో మహాభారతంలో వీరుల చరిత్ర మనకు విశదం చేస్తుంది. ఇది కేవలం కథలో వ్యవహారమే కాదు, ఇలలో సైతం హెలెన్‌ కెల్లర్‌ తన గురువుగా ఏనీ సల్లీవన్‌ను ఎన్నుకొని ఎలా ఎదిగిందో అందరికీ తెలుసు.

విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోకపోవడానికి కారణం- వారికి అధ్యాపకులపై అయిష్టతే అంటారు మానసిక నిపుణులు. మంచి మార్కులు సాధించి తనకు నచ్చిన గురువును మెప్పించే అవకాశం లేనప్పుడు వాటిని సాధించాలనే ప్రేరణ అతనిలో కరువవుతుంది. తనకు నచ్చిన సబ్జెక్టులో సరైన అధ్యాపకుడు లేనపుడు, అలాంటి ఉత్తమ అధ్యాపకుడి కోసం తనకంతగా నచ్చని వేరే సబ్జెక్టుకైనా మారే విద్యార్థులున్నారు.

ఓ మంచి విద్యావేత్తను ఎన్నుకోవాలనుకుంటే కాలేజీలో చేరబోయే ముందు ఆ లెక్చరర్‌తో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడండి. ఆయన అనుమతితో తరగతిలో కూర్చుని పాఠాలు వినండి. ఆయన పాఠ్యగ్రంథాలు రాసివుంటే వాటిని చదవండి. మీకు నచ్చిన అధ్యాపకుడు ప్రత్యక్షంగా తారసిల్లకపోతే మీ సబ్జెక్టులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులనే మీ ఏకలవ్య గురువులుగా స్వీకరించండి. సాధ్యమైనంతవరకూ వాళ్ళను కలిసి, చర్చించండి. అందుకు 'వేలు' ఖర్చయినా ఫర్వాలేదు. మీ బొటన'వేలు'కి ఏమాత్రం ప్రమాదం లేదు.

4. ముందు వరసలో కూర్చోవాలి
ఎక్కువ మార్కులు లక్షించే విద్యార్థి తన కాలాన్నీ, శక్తినీ పొదుపుగా వాడుకోవాలి. అందుకు అనువైనదే- తరగతి గదిలో ముందు వరసలో కూర్చోవడం. దానివల్ల లాభాలేమిటంటే-

* శ్రద్ధకు అంతరాయం కలగదు.
* అ ధ్యాపకుడు చెప్పే అంశంలో లీనమైపోతారు.
* క్రియాశీలంగా ఆలోచించడానికి ప్రేరణ పొందుతారు.
* ముందు కూర్చుంటే నిద్రమత్తు ఉండదు.
* మనసులో ఉన్న అనేక సందేహాలను తీర్చుకోవచ్చు. వేగంగా ప్రశ్నలు సంధించవచ్చు.
* ముందు కూర్చున్న విద్యార్థుల మీదే గురువులు గురిపెడతారు. *అంతే కాదు, ఎప్పుడూ ముందు ఉండాలనే తత్వం పెరుగుతుంది. జీవితంలో కూడా ముందుండే తత్వానికి ఇదే పునాదిగా మారుతుంది.

5. ఒక్క క్లాసు కూడా మిస్‌ కాకూడదు
సగటు విద్యార్థి ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటాడు. సూపర్‌ విద్యార్థి సీరియస్‌గా తీసుకుంటాడు. 'ఓ క్లాసు పోతే ఏమిలే', 'క్లాసులో పాఠం ఓ ఐదు నిమిషాలు పతే ఏమిలే...' అనే తత్వం వల్ల అనర్థాలు జరుగుతాయి. ఎప్పుడు అధ్యాపకుడు ఏ అంశాన్ని ప్రస్తావిస్తాడో, ఏది తనకు భుజం తట్టి అత్యంత ప్రేరణగా నిలుస్తుందో చెప్పలేం.

అందుకే సూపర్‌ విద్యార్థులు కళాశాల జీవితాన్ని బిజినెస్‌ కెరియర్‌గా భావిస్తారు. కీలకమైన సమావేశానికి హాజరు కాకపోతే, వ్యాపారవేత్తకు ఎంత నష్టం వస్తుందో, ఓ క్లాసు తప్పిపోతే సూపర్‌ విద్యార్థి అలానే బాధపడతాడు. జీవితం అనే బిజినెస్‌కు శిక్షణ ఇచ్చే సంస్థగా కళాశాలను భావిస్తాడు. కళాశాలలో ఓ తరగతి తప్పిపోతే డబ్బూ, కాలం వ్యర్థమైనట్టు అతడు భావిస్తాడు. జీవితంలోని అతి ముఖ్యమైన ప్రారంభకాలాన్ని విద్యార్థి కళాశాలలోనే గడుపుతాడు. ఒక్క తరగతి కూడా తప్పకుండా కళాశాల జీవితాన్ని ఓ బిజినెస్‌గా ఎవరు భావిస్తారో... వారికి ఎక్కువ మార్కులు రావడంలో వింతేముంది?

6. ప్రశ్నార్థక దృష్టితో ఆలకించాలి
'వినడం ఓ కళ' అంటారు పెద్దలు. చెప్పేదానిమీద చెవి పారేస్తే చాలదు. మనసు పెట్టాలి. విన్నదాన్ని ఆకళించుకోవాలి. మనసులో విశ్లేషించుకోవాలి. నిజానిజాలు నిర్థరించుకోవాలి. అప్పుడే విన్న విషయం వంటపడుతుంది.

వక్త చెప్పేదానిమీద కడకంటా దృష్టి నిలవాలంటే వినేవారు మంచి శ్రోతలు కావాలి. అందుకు చక్కగా సహకరించేది ప్రశ్నార్థకమైన మనసు. సబ్జెక్టును ముందుగా చదవడం వల్ల ప్రశ్నలు తెలుస్తాయి. వాటికి జవాబులు వెదికే క్రమంలో అధ్యాపకుణ్ని కదిలిస్తే మంచి జవాబులు వస్తాయి. అలా ప్రశ్నించాలంటే పాఠాన్ని శ్రద్ధగా వినాలి. మనసు ప్రశ్నలు వేసేలా సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చినా ఎదుర్కోడానికి మనసు సిద్ధపడుతుంది.

విద్యార్థి సబ్జెక్టులోని సైడ్‌ హెడ్డింగ్స్‌ను ప్రశ్నలుగా మార్చివేయాలి. అధ్యాపకుడు పాఠం చెబుతున్నపుడు మధ్యలో కానీ, చివర కానీ మీ దగ్గరున్న ప్రశ్నలు వేసి, జవాబులు రాబట్టండి. మీ మిత్రులను సైతం ప్రశ్నించండి. మిమ్మల్ని కూడా ప్రశ్నించుకోండి. అధ్యాపకుడు అడిగే ప్రశ్నలన్నీ రాసుకోండి. ఒక్కొక్కసారి అధ్యాపకుడు పరీక్షల్లో అడగబోయే ప్రశ్నలకు ఎక్కువ వూనిక (స్ట్రెస్‌) ఇస్తుంటారు. దాన్ని గుర్తిస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.

అందువల్ల తరగతిలో ప్రశ్నలు అడగటానికి భయపడవద్దు. చాలామందికి ఎన్నో సందేహాలున్నా, వారు చొరవ తీసుకోరు. మీరు ప్రశ్నలు వేయడం వల్ల వారి సందేహాలు కూడా తీరతాయి. అంతేకాదు, మీరు వేసే ప్రశ్నలకు వచ్చే జవాబులు పరీక్షల్లో బాగా గుర్తుండిపోయి ఎక్కువ మార్కులు సాధించడానికి పనికొస్తాయి.

-----------------------------
ఉత్తమ విద్యార్థులు కళాశాల జీవితాన్ని బిజినెస్‌ కెరియర్‌గా భావిస్తారు. అత్యంత కీలకమైన సమావేశానికి హాజరు కాకపోతే, వ్యాపారవేత్త ఎంత నష్టంగా భావిస్తాడో, ఓ తరగతి తప్పిపోతే మంచి విద్యార్థి అలానే బాధపడతాడు.
-----------------------------
(ఈనాడు, ౨౬:౦౧:౨౦౦౯)
-----------------------------

స్కోరింగ్‌ పెంచే దారులు
[విద్యాసంస్థలో విజ్ఞాన బీజాలు నాటుకోవాలనీ,
దానికి 12 అంశాలు పాటించాలనీ తెలుసుకున్నాం.
ఆరు అంశాలను చూశాం కదా! మిగతావి ఇప్పుడు పరిశీలిద్దాం.
]
సత్య
కళాశాలల్లో నిర్వహించే విద్యేతర కార్యక్రమాలు మార్కులతో సంబంధం లేనట్టు కనిపిస్తాయి. కానీ నిజానికివి అనేక ప్రయోజనాలు ఇవ్వటంతో పాటు పరీక్షల్లో అధిక మార్కుల సాధనకూ దోహదం చేస్తాయి.
విద్యాసంస్థలో విజ్ఞాన బీజాలు నాటుకోవాలనీ, దానికి 12 అంశాలు పాటించాలనీ తెలుసుకున్నాం.
ఆరు అంశాలను చూశాం కదా! మిగతావి ఇప్పుడు పరిశీలిద్దాం.

7. పాఠం వింటూ నోట్సు
వంద పుస్తకాల సారం ఓ ఉపన్యాసంలో దొరుకుతుందంటారు విజ్ఞులు. వక్త చెప్పేది విని అలాగే వదిలేయక దాన్ని శ్రద్ధగా రాసుకోవాలి. మక్కీకి మక్కీగా కాక, ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిజానికి క్లాసు నోట్సు మూడు దశల్లో జరగాలి.
- క్లాసుకు ముందు:
* క్రితం క్లాసులో రాసుకున్న నోట్సును సమీక్షించుకోవాలి.
* అధ్యాపకుడు చదవమని చెప్పిన విషయాలు పూర్తిచేయాలి.
* నోట్సు రాసుకోవడానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకోవాలి.

- క్లాసు జరుగుతున్నపుడు:
* కీలకమైన భాగాలను శ్రద్ధగా వినాలి.
* వీలైనంత వేగంగా వాటిని రాసుకోవాలి. అవసరమైనచోట్ల పొడి అక్షరాలు వాడుకోవాలి.
* స్పష్టం కానిచోట్ల ప్రశ్న మార్కు పెట్టాలి. క్లాసు అయ్యాక స్పష్టీకరించుకోవడానికి ఇది సహకరిస్తుంది.

- క్లాసు అయ్యాక:
* నోట్సులోని పొడి భాగాలను పూర్తిగా తిరగరాయాలి.
* ప్రశ్న రూపంలో అసంపూర్తిగా ఉన్న భాగాలను అధ్యాపకులు లేదా తోటి విద్యార్థులను అడిగి పూర్తి చేసుకోవాలి.
* పాఠానికి సంబంధించిన ఇతర ఆధారాలను సేకరించాలి.
నోట్సులో శీర్షికలను ప్రశ్న రూపంలో రాసుకుంటే మంచిది. అది ఆలోచనలను ప్రేరేపిస్తుంది. జవాబులు వెదుక్కోవడానికి సహకరిస్తుంది.

మరో విధంగా కూడా నోట్సు పనికివస్తుంది. తను చెప్పేది వినేవారికన్నా, వింటూ రాసుకునేవారినే లెక్చరర్‌ బాగా ఇష్టపడతారు. ఇష్టపడ్డ విద్యార్థికి ఈనాముగా ఎక్కువ మార్కులు ఇస్తారని వేరే చెప్పాలా? నిజానికి వక్తకు గొప్ప అభినందన తెలపడం కేవలం అతడు చెప్పేది వినడం మాత్రమే కాదు, అతడు చెప్పేది రాసుకోవడమే.

8. ఎప్పటి హోంవర్క్‌ అప్పుడే
తరగతి గదిలో వినటమే కాక, దాని ఆసరాతో దాన్ని పోలిన అంశాలను విద్యార్థి స్వయంగా నేర్చుకోవడానికి హోం వర్క్‌ సహకరిస్తుంది. అంటే వినడమే కాక, స్వయంగా అభ్యాసం చేయడం వల్ల సబ్జెక్టు అవగతమవుతుంది. అందువల్ల ప్రతి విద్యార్థీ హోం వర్క్‌ మీద మనసు పెట్టి సకాలంలో పూర్తిచేస్తే సబ్జెక్టు వంటపట్టటమే కాకుండా ఉపాధ్యాయుల ప్రశంస పొందటానికీ వీలవుతుంది.

9. క్లాసు పరీక్షలపై దృష్టి
తాము చెప్పిన సబ్జెక్టు విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందో, విద్యార్థి పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నాడో తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు క్లాసు పరీక్షలు నిర్వహిస్తారు. సగటు విద్యార్థులు వీటిని తేలికగా తీసుకుంటారు. కానీ సూపర్‌ విద్యార్థులు వీటిని సైతం తమ ప్రతిభ చాటుకునే అవకాశాలుగా తీసుకుంటారు. ఈ మార్కులు అసలు పరీక్ష మార్కులతో కలవకపోయినా, వారు రాయబోయే చివరి పరీక్ష సన్నద్ధతకు ఉపకరిస్తాయి. ముఖ్యంగా విద్యార్థి తప్పిదాలను/ తన సన్నద్ధతలోని లోపాలను దీనివల్ల సరిచేసుకోవడానికి వీలవుతుంది. జవాబుపత్రాలు తిరిగివచ్చిన తర్వాత విద్యార్థి వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు.

విద్యార్థులు చేసే తప్పిదాలు- 1) అసలు సబ్జెక్టును చదివి వుండకపోవటం 2) చదివినదాన్ని గుర్తుపెట్టుకోకపోవడం 3) నిర్లక్ష్యంగా తప్పులు చేయడం 4) తెలిసినదాన్ని తగినవిధంగా అనువర్తింప (అప్ప్ల్య్)చేయలేకపోవడం ఈ లోపాలను చివరి పరీక్షల్లో సవరించుకుంటే చక్కని మార్కులు సొంతం చేసుకోవచ్చు.

10. ఫీడ్‌బ్యాక్‌ స్వీకరించాలి
క్లాసు పరీక్షల జవాబుపత్రాల మీదే కాక, తమ సన్నద్ధతపై కూడా నిష్పాక్షికంగా మేలు కోరే అధ్యాకుల నుంచీ, సహ విద్యార్థుల నుంచీ ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. దానివల్ల...
* చదువులో ప్రగతిని కొలుచుకోవచ్చు.
* చదివే విధానం సక్రమంగా ఉందో, ఏమైనా మార్పులు తీసుకురావాలేమో కనుక్కోవచ్చు.
* చదువు తీరు సంతృప్తిగా ఉన్నట్టయితే ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు.
* ఎక్కడ చక్కగా తర్ఫీదు అయ్యామో, మనం ఎక్కడ మెరుగుపరచుకోవాలో తెలుసుకోవచ్చు.
* బలహీనంగా ఉండే అంశాల పట్ల సలహాలు తీసుకోవచ్చు.
* ప్రేరణ పొంది ప్రోత్సాహాన్ని నింపుకోవచ్చు.
మనిషి ఎదుగుదలకు ఫీడ్‌బ్యాక్‌ గొప్పు పోషక ఔషధమే.

12. స్టడీ టీం తయారు చేసుకోవాలి
బృంద పఠనం ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడా, ఏకాకిగా నేర్చుకుంటాడా అనేది ఆయా విద్యార్థుల మనస్తత్వం మీద ఆధారపడివుంటుంది. కొందరు విద్యానిపుణులు బృంద పఠనాన్ని నిరుత్సాహపరుస్తారు. దీనివల్ల మేలుకన్నా కీడు జరుగుతుందంటారు. అయితే సూపర్‌ విద్యార్థులు బృంద పఠనానికే ప్రాధాన్యం ఇస్తారు. సివిల్‌ విజేతలు చాలామంది బృందపఠనం చేసినవారే. '... అలా చేయకపోవడం వల్ల మొదటి ప్రయత్నంలో నాకు గ్రూప్‌-1 రాలే'దంటారు గత గ్రూప్‌-1 టాపర్‌ వేణుగోపాలరెడ్డి. మిత్రబృందాన్ని ఓ టీముగా మార్చుకోవాలి.

* అలసటతో మన శక్తి చాలా దిగువగా ఉండేటప్పుడు, మనను ప్రోత్సహించి, ప్రేరణగా నిలుస్తుంది.
* తెలిసిన బృందంలో ప్రశ్నలు అడగడం తేలిక. తరగతి గదిలో ప్రశ్నలు వేసి, సందేహాలు తీర్చుకోలేనివారు మిత్రబృందంలో వాటిని నివృత్తి చేసుకోవచ్చు.
* చదువు పట్ల ఆసక్తి కలవారు కాబట్టి ఫలవంతమైన చర్చలు జరుగుతాయి.
* నేర్చుకోవడంలో వినికిడి కోణం జత అవుతుంది.
* బృందచర్చలో కొత్తభావాలు కొలువు తీరతాయి.
* కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి.
* నూతన నైపుణ్యాలు నేర్చుకోవచ్చు.
* తరగతిలో రాసుకున్న నోట్సును సరిచూసుకొని, తప్పిపోయిన అంశాలను పూరించుకోవచ్చు.
* సమాచార సేకరణ బాధ్యతలను పంచుకోవచ్చు.
* చదువును ఆహ్లాదపరచుకోవచ్చు.
* సలహాలను వినిమయం చేసుకోవచ్చు.
* పరస్పర సహకారంతో కార్యశీలురుగా ఎదగవచ్చు.

క్లాసు పరీక్షలను
సగటు విద్యార్థులు తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఉత్తమ విద్యార్థులు వీటిని సైతం తమ ప్రతిభ చాటుకునే అవకాశాలుగా తీసుకుంటారు. ఈ మార్కులు అసలు పరీక్ష మార్కులతో కలవకపోయినా, రాయబోయే చివరి పరీక్ష సన్నద్ధతకు ఉపకరిస్తాయి. ముఖ్యంగా వీటి ద్వారా విద్యార్థి తన తప్పిదాలనూ/ తన సన్నద్ధతలోని లోపాలనూ సరిచేసుకోవడానికి వీలవుతుంది.

సాంస్కృతిక కార్యక్రమాలు
ఎక్కువ మార్కులు రావాలంటే కేవలం పుస్తక పాండిత్యమే శరణ్యం అనుకుంటారు కొందరు. పుస్తక పఠనానికే ప్రాధాన్యం ఇస్తూ విద్యేతరమైన సాంస్కృతిక అంశాలకు దూరంగా ఉంటారు. దీనివల్ల సర్వతోముఖమైన అభివృద్ధికి వారు శాశ్వతంగా దూరమైపోతారు.

విద్యార్థి అభివృద్ధిని కాంక్షించి విద్యాసంస్థలన్నీ సాంస్కృతికపరమైన సంగీతం, సాహిత్యం, కళలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. సామాజిక సమస్యలపై చర్చలు, గోష్ఠులు, సదస్సులు, వర్క్‌షాపులు పెడుతుంటాయి. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మేధావులతో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తాయి. కాలేజీ మేగజీన్లలో వ్యాసాలు, కవితలు రాయమని ప్రోత్సహిస్తాయి. ఎన్‌.ఎస్‌.ఎస్‌., బ్లడ్‌బ్యాంకు, ఎయిడ్స్‌ వ్యతిరేక దినం లాంటి అనేక సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. అలాగే విద్యార్థిలో పోరాటపటిమ పెంచి, శారీరక వ్యాయామానికీ, ఆరోగ్య పరిరక్షణకూ అవసరమయ్యే క్రీడాంశాలను నిర్వహిస్తుంటాయి. యోగ, ధ్యానం, ఆసనాలు నేర్పుతాయి. వ్యక్తి సంపూర్ణ వికాసానికి అవసరమయ్యే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి.

ఈ కార్యక్రమాలు పైకి మార్కులతో సంబంధం లేనట్టు కనిపిస్తాయి కానీ అనేక ప్రయోజనాలతో పాటు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఇవి కూడా దోహదం చేస్తాయి.
* విద్యాసంస్థ మ్యాగజీన్‌లో వ్యాసాలు రాసే విద్యార్థి పరీక్షలో కూడా చక్కగా వ్యాసాలు రాయగలుగుతాడు.
* చర్చల్లో పాల్గొన్న విద్యార్థి సమస్యలను విశ్లేషణాత్మకంగా వివరించగలుగుతాడు.
* క్రీడాంశాల్లో పాల్గొన్న విద్యార్థి ఎక్కువకాలం కూర్చుని సహనంతో చదవగలుగుతాడు.
* మేధావుల క్లాసులకు హాజరైన విద్యార్థి తన భావాల పరిధిని విస్తృతపరచుకుంటాడు.
* వ్యక్తిత్వ వికాసానికి హాజరయ్యే విద్యార్థి చక్కని జీవిత దృక్పథాన్ని అలవర్చుకోవడమే కాక, పరీక్షల భయాన్ని అధిగమించి ఆశావహంగా ఆలోచించగలుగుతాడు. ఒత్తిడిని జయించి ఉత్సాహాన్ని పొందుతాడు. చక్కని భావ వ్యక్తీకరణను అలవర్చుకుని సమతుల్యమైన సమాధానాలు వ్యక్తం చేస్తాడు.

ఇవన్నీ విద్యార్థికి మార్కులు పెంచే అంశాలే.
పోటీ పరీక్షల్లో ఎంపికైనవారు, టాపర్లుగా నిలిచినవారు తమ సర్వతోముఖ ప్రతిభకు అకడమిక్‌ జీవితమే కాక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కారణమని చెపుతారు. అందువల్ల సూపర్‌ విద్యార్థులు వీటిని కాలం వ్యర్థం చేసే కార్యక్రమాలుగా కాక, తమ మేధోసంపత్తి, వ్యక్తిత్వ వికాసం పొందడానికి అవకాశాలుగా భావిస్తారు.

ఈ విధంగా విద్యాసంస్థల్లో విజ్ఞాన బీజాలు నాటుకోవాలి. విద్యాసంస్థలు కేవలం బీజాలు మాత్రమే వేస్తాయి. అవి మొక్కలై వృక్షాలుగా మారి చక్కని ఫలాలు ఇవ్వాలంటే విద్యార్థి స్వయంకృషి మీదే ఉంటుంది. విద్యాసంస్థలు కేవలం పది శాతమే ఇవ్వగలుగుతాయి. మిగతా తొంబై శాతం విద్యార్థే స్వయంగా అభ్యసించాలి. అదెలా చేయాలో, ఎక్కడ చేయాలో చూద్దాం.
----------------------------
(ఈనాడు , ౦౨:౦౨:౨౦౦౯)
---------------------------


నేర్చుకోవటంలో మీ శైలి?
[ఎనిమిది అంచెల వ్యూహంలోయిదోది-5
'ఇంటి దగ్గర విషయాలను విస్తరించుకోవడం'.]
సత్య

పరిమిత ప్రాంతంలో పెరిగిన నారును విస్తారమైన పొలంలో నాట్లు వేస్తే ఏపుగా పెరుగుతుంది. అలాగే విద్యాసంస్థలో వేసుకున్న విజ్ఞాన బీజాలను విద్యార్థి ఇంటిదగ్గర విస్తృత పరచుకోవాలి.
ఎక్కువ మార్కులు తెచ్చే ఎనిమిదంచెల వ్యూహంలో
అయిదోది ఇదే- 'ఇంటి దగ్గర విషయాలను విస్తరించుకోవడం'.

చదివే విషయం తలకెక్కాలన్నా, బాగా గుర్తుండాలన్నా ఎక్కడబడితే అక్కడ చదివితే కుదరదు. దానికి అనువైన వాతావరణం ఉండాలి. ఎప్పుడూ టీవీ వాగుతూ, టెలిఫోన్‌ మోగుతూ ఉంటే, మిత్రబృందం బాతాఖానీ వేస్తూవుంటే విద్యార్థి చదువెలా సాగుతుంది?

చదుకోవటానికి ప్రత్యేకమైన గది/స్థలం ఉండాలి. చక్కని వెలుతురు, మంచి గాలి ఉంటూ శబ్దాలూ, చికాకులూ లేని ప్రాంతమై ఉండాలి. ఎప్పుడూ ఒకేచోట కూర్చుని చదివితే అది చదువుకు మంచి ప్రేరణగా మారుతుంది.

అభ్యాసంలో విలక్షణశైలి
ప్రతి విద్యార్థీ విద్య నేర్చుకునే విధానం (preferred learning style) వేర్వేరుగా ఉంటుంది. కొందరు చూసి నేర్చుకుంటారు; కొందరు విని నేర్చుకుంటారు; కొందరు స్పర్శించి, అనుభవించి నేర్చుకుంటారు.

విద్యార్థి నేర్చుకునే బలమైన శైలి (learning style)ని తల్లిదండ్రులూ, గురువులూ గమనించాలి. ఆ దారిలోనే అతనికి విద్య చెప్పాలి. నేర్చుకోవడంలో విద్యార్థి తన వైయక్తిక విధానాన్ని తెలుసుకుంటే విజ్ఞానాన్ని ఆర్జించడం తేలిక. అంతే కాదు; అది వినోదాత్మకంగా సాగుతుంది. దానికి మంచి ఉదాహరణే 'తారే జమీన్‌ పర్‌' సినిమా.

క్రమబద్ధంగా నేర్చుకునే పద్ధతులు
క్రమపద్ధతిలో ఎలా నేర్చుకోవాలో, అందుకు ఏం చేయాలో తెలుసుకోవాలి. చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, సమాచారాన్ని తగిన విధంగా వినియోగించుకోవడం వంటి వివిధ ప్రక్రియలపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిని కొన్ని పద్ధతుల ద్వారా విద్యావేత్తలు తీర్చిదిద్దారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన పద్ధతి శ్Q3ఋ. ఇది చదువుకు ఓ ఫార్ములా వంటిది. దీంతోపాటు మెమ్లెటిక్స్‌ (memletics) మరో పద్ధతి. వీటిని తెలుసుకొని, ఆ విధంగా చదివితే విషయంపై సాధికారత వస్తుంది.

విషయ సేకరణ
పేపర్‌ దిద్దేవారు జవాబుల్లో నవ్యత ఆశిస్తారు. సృజనాత్మకతను ఆస్వాదిస్తారు. అందువల్ల ప్రతి విద్యార్థీ తన విజ్ఞాన పరిధిని విస్తరించుకోవాలి. విషయ నాణ్యతను మెరుగుపరచుకోవాలి. అందుకు వివిధ ఆకరాల (sources) నుంచి సమాచారం సేకరించుకోవాలి. దీనికి లైబ్రరీ రిఫరెన్స్‌ పుస్తకాలు, వివిధ పత్రికలు, ఇంటర్నెట్‌ ఎంతగానో సహకరిస్తాయి. వినియోగదారులకు ఆనందం కలిగితేనే అమ్మకాలు పెరుగుతాయి. పేపర్లు దిద్దేవారికి జవాబుపత్రం ఆహ్లాదకరంగా ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.

ప్రశ్నలనిధి పెంచుకోవాలి
సగటు విద్యార్థులు- పాఠాలు చదువుకొని, పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాస్తారు; ఉత్తమ విద్యార్థులైతే- పరీక్షల్లో ఏ ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఊహించుకొని సమాధానాలు ఎలా రాయాలో ముందే అభ్యాసం చేస్తారు. అందువల్ల పరీక్షల్లో రాబోయే ప్రశ్నలను ఒక జాబితాగా రాసుకోవాలి. ఓ సబ్జెక్టులో ఓ పాఠ్యాంశంపై గతంలో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇంకా ఎలా రావడానికి అవకాశముంది- అనే అవగాహన ముఖ్యం. అందుకు ప్రశ్నల నిధి (question bank) తయారుచేసుకోవాలి. నిత్యం ఆ జాబితాను పెంచుకుంటూ పోవాలి.

పాత ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాల చివర్లో ఇచ్చిన ప్రశ్నలు, ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలు, వారిచ్చే హోం వర్క్‌, ఆ సబ్జెక్టుపై ఇతరులు సూచించే విషయాలు ఒకచోట రాసుకొని విశ్లేషించుకోవాలి.

ఏ సబ్జెక్టుపై అయినా ఓ స్థాయి దాటి ప్రశ్నలు అడిగే అవకాశం తక్కువ. అందువల్ల మీరు తయారుచేసుకునే ప్రశ్నల నిధి నుంచే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇలా రాసుకోవడం వల్ల ఆత్మస్త్థెర్యంతో జవాబులు రాయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

నిర్మాణాత్మకమైన నోట్సు
మనం ఎన్ని పుస్తకాలు చదివాం, ఎంత సమాచారాన్ని సేకరించామనేది కాదు ప్రధానం. దాన్ని ఎలా నిర్వహిస్తున్నామనేది ముఖ్యం. 'సేకరించిన సమాచారానికి ఓ నిర్మాణం ఇవ్వకపోతే మొత్తానికే మోసం వస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా'నంటారు గ్రూప్‌-2 టాపర్‌ వేణుగోపాలరెడ్డి. నేర్చుకున్న విజ్ఞానానికి నిర్మాణం (structure/ frame work) ఏర్పరచుకోవాలి. అంటే పొందికగా, ఓ పద్ధతిగా అమర్చుకోవటం.

ప్రారంభం, ముఖ్యభాగం, అందులో వివిధ భావాలు, ముగింపు అనేవి నోట్సు నిర్మాణంలో ముఖ్యం. నేర్చుకోబోయే కొత్త విషయాన్ని అదివరకే ఉన్న పాతదానిలో ఎక్కడపెట్టాలో, ఏది తీసివేయాలో స్పష్టత ఉండాలి. క్రమపద్ధతిలో విషయాన్ని అభివృద్ధిపరచుకుంటూ విద్యార్జన చేస్తే గుర్తుపెట్టుకోవడం సులువు. అప్పుడది పేపర్‌ మీద పెట్టడం మరింత తేలిక.

నోట్సుకు సంక్షిప్త చిత్రణ
సుదీర్ఘంగా నోట్సులు తయారుచేసుకోవడం వల్ల పరీక్షల్లో రాబోయే ప్రశ్నలకు తమ దగ్గర సమాచారం ఉందనే సంతృప్తి ఉంటుంది. కానీ పరీక్షలు సమీపించేసరికి అదంతా మస్తిష్కంలో ఎలా నిక్షిప్తం చేయాలో తెలియక ఇబ్బంది తప్పదు. దీన్ని నివారించాలంటే... ముఖ్యంగా పరీక్షల కాలంలో సమయం వ్యర్థం కాకుండా ఉండాలంటే- రాసుకున్న నోట్సుకు మరింత సంక్షిప్త చిత్రణ (సారాంశం) తయారుచేసుకోవాలి. దీన్ని ఓ సమయ విరామం ఏర్పరచుకొని మననం చేసుకుంటూ ఉంటే మొత్తం సబ్జెక్టు మనసులో లోతుగా నాటుకుపోతుంది.

ప్రగతి పటాలు తయారుచేసుకోండి
చదువులో తమ ప్రగతిని పర్యవేక్షించుకోవటం ఉత్తమ విద్యార్థులు చేసే పని. ఎన్ని అంశాలు చదవటం పూర్తిచేయాలో వాటి జాబితాను ఓ గ్రాఫు ఆకారంలో పెట్టాలి. 'ఎక్స్‌' యాక్సిస్‌పై వారాలు/నెలలు; 'వై' యాక్సిస్‌పై జాబితాలోని అంశాలు రాయాలి. ఈ రెండూ ఎలా ప్రయాణిస్తున్నాయో గమనించాలి. వన్‌డే క్రికెట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీం స్కోరుతో పోల్చి రెండో టీం ఎలా స్కోరు చేస్తోందో గ్రాఫ్‌లో చూపిస్తున్నట్టుగానే 'పూర్తిచేయాల్సిన విధానం'- 'పూర్తి అయిన విధానం' గ్రాఫ్‌లో గమనించుకోవాలి. ఈ రకంగా మీ సన్నద్ధతలోని ప్రగతిని అంచనా వేసుకోవచ్చు.

శక్తిమంతమైన జ్ఞాపకశక్తి విధానాలు
గటు విద్యార్థులు సాధారణంగా బట్టీ విధానానికి బానిసగా ఉంటారు. బండగా కష్టపడుతూ చదువంటే చాలా కష్టమనే భావనతో ఉంటారు. కానీ ఉత్తమ విద్యార్థి ఎలాంటి సమాచారాన్ని అయినా నైపుణ్యంతో తేలిక చేయవచ్చని నమ్ముతాడు.

జ్ఞాపకశక్తి పుట్టుకతో వచ్చేది కాదు. కేవలం తర్ఫీదు ద్వారా లభించే అద్భుత ఫలం. 'ఈ భూమ్మీద ఏకసంథాగ్రాహులు, మందబుద్ధులు అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా తర్ఫీదైనవాళ్ళు, తర్ఫీదు కానివాళ్ళే' అంటాడు హేరీ లొరేనీ. కాబట్టి ఎక్కువ మార్కులు కోరే విద్యార్థులు శక్తిమంతమైన జ్ఞాపకశక్తి విధానాలు అనుసరించాలి.

నమూనా పరీక్షలు
ప్రతి మూడో రోజూ నమూనా పరీక్షలు రాయడమే తన విజయరహస్యమంటాడు సివిల్స్‌ టాపర్‌ ముత్యాలరాజు. చదవడంతోపాటు దాన్ని మనం ఎంత జీర్ణించుకున్నామో తెలుసుకోవాలంటే నమూనాపరీక్షలు రాయాలి. మీ ప్రశ్నల నిధి నుంచి కొన్ని ప్రశ్నలను తీసుకొని అసలు పరీక్షల మాదిరిగా రాయండి. రాసినదాన్ని మీ మిత్రులకిచ్చి దిద్దమని చెప్పండి. దీనివల్ల మీ లోటుపాట్లు తెలుస్తాయి. ఏఏ అంశాల్లో ఎక్కువ శ్రద్ధ కనబర్చాలో స్పష్టమవుతుంది. పైగా దీనివల్ల రాత అభ్యాసం కూడా జరిగి, ధారాళంగా జవాబులు రాయడానికి వీలవుతుంది.

అచేతన సామర్థ్యం అందుకోండి
నేర్చుకోవడంలో నాలుగు దశలు ఉన్నాయంటారు ఎన్‌ఎల్‌పీ నిపుణులు.
1) ఓ విషయం మనకు తెలియదనేది కూడా తెలియకపోవడం- అచేతన అసామర్థ్యం
2) ఓ విషయం మనకు తెలియదనేది తెలుసుకోవడం- చేతన అసామర్థ్యం
3) ఓ విషయం మనకు తెలుసని తెలుసుకోవడం- చేతన సామర్థ్యం
4) చివరి దశలో మనకు తెలిసిన విషయం అచేతనంగా ఉంటుంది. ఇదే అచేతన సామర్థ్యం. దీన్ని పొందినవాడే నిజమైన విజేత. ప్రతి విద్యార్థీ దీనికోసం సాధన చేయాలి.
ఎక్కువ మార్కులు లక్షించేవారు ఇలాంటి వ్యూహాలను ఇంటిదగ్గర అభ్యాసం చేయాలి.

జ్ఞాపకశక్తికి కిటుకు!
మెదడుపై ముద్రించిన సమాచారం శాశ్వతంగా రికార్డు కాదనీ, దాన్ని తగిన కాల వ్యవధిలో పునశ్చరణ (రివిజన్‌) చేసుకుంటే ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవచ్చనీ విద్యానిపుణులు వివరిస్తున్నారు.
ఈ పునశ్చరణకు ఓ పద్ధతి ఉంది.
నెలరోజుల్లో కనీసం నాలుగుసార్లు రివిజన్‌ జరగాలి.

  • కొత్తగా ఓ విషయం నేర్చుకున్న తర్వాత 10 నిమిషాల వ్యవధిలోనే ఓసారి పునశ్చరణ చేయాలి.
  • తిరిగి అదే విషయాన్ని 24 గంటలలోపు మరోసారి పునశ్చరణ చేయాలి.
  • వారం తర్వాత అదే విషయాన్ని పునశ్చరణ చేయాలి.
  • తిరిగి ఓ నెల తర్వాత దాన్నే పునశ్చరణ చేయాలి.
ఇలా చేస్తే ఇక మర్చిపోవడం జరగదు. ఎక్కువ మార్కులు తెచ్చుకునే సూపర్‌ విద్యార్థుల విజయ రహస్యం- శాస్త్రీయమైన పునశ్చరణే!-----------------
(ఈనాడు, ౦౯:౦౨:౨౦౦౯)
-----------------

పునశ్చరణలో మెలకువలు తెలుసా?
సత్య
పరీక్షల్లో అద్భుత ఫలితాలు పొందటానికి ఉపకరించే 8 అంచెల వ్యూహంలో 5 అంశాల గురించి చూశాం కదా! మిగిలిన 3 వ్యూహాలను ఇప్పుడు తెలుసుకుందాం.


చదువు అనే పుష్పానికి సంస్కారం అనే సుగంధాన్ని అద్దుకోవాలి. అప్పుడే విద్యాకుసుమం పరిమళ శోభితం కాగలుగుతుంది. ఎక్కువ మార్కులు తెచ్చే
ఆరో అంశం ఇదే- 'వ్యక్తిత్వాన్నిచ్చే ప్రవర్తన అలవర్చుకోవటం'.
సభ్యతా సంస్కారాలను పెంచుకోవడం.

[ఎనిమిది అంచెల వ్యూహంలో
ఆరో అంశం -6
'వ్యక్తిత్వాన్నిచ్చే ప్రవర్తన అలవర్చుకోవటం'.]

* చదువు ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ప్రతి రోజూ తేలికపాటి వ్యాయామం, సమతుల్యమైన ఆహారం, తగినంత నిద్ర, ప్రశాంతమైన విశ్రాంతి, కాలవ్యవధితో కూడిన ఆరోగ్యపరీక్షల పట్ల శ్రద్ధ చూపించాలి.

* విద్యార్థికి సత్ప్రవర్తన ఓ అలంకారం. తన ప్రవర్తనను తీర్చిదిద్దుకునే విద్యార్థి తన సహ విద్యార్థులతో పాటు గురువుల గౌరవాన్నీ పొందుతాడు.

* తరగతులకు సకాలంలో హాజరయ్యే గుణం విద్యార్థికి కాలాన్ని గౌరవించే తత్వాన్ని నేర్పుతుంది. కాలాన్ని గౌరవించే వ్యక్తే జీవితాన్ని ప్రేమించగలుగుతాడు.

* విద్యార్థి విజయం అతని దృక్పథం మీదే ఆధారపడివుంటుంది. సానుకూల దృక్పథంతో సాగిపోయే విద్యార్థి అన్నిటిలోనూ ముందు ఉంటాడు.
* విజయానికి విజ్ఞానం ఒక్కటే చాలదు. వ్యక్తీకరించే నైపుణ్యం కావాలి. నూటికి ఎనబై శాతం విద్యార్థులకు భావ వ్యక్తీకరణ సామర్థ్యం లేదని అనేక సర్వేల్లో తేలింది. ఉత్తీర్ణతతో పాటు ఉపాధి కూడా భావ వ్యక్తీకరణతోనే ముడిపడివుంది.

* చక్కని మానవ సంబంధాలు విద్యార్థి జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. అందుకు ఇతరుల పట్ల మర్యాద మప్పిదాలను (etiquette & manners) అలవర్చుకోవాలి.

* సామాజిక స్పృహ ఉన్నవారు విషయాలను పలు కోణాలనుంచి విశ్లేషించగలుగుతారు. అందువల్ల ప్రతి విద్యార్థీ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి.
* గ్రంథాలయ సందర్శన విద్యార్థికి ఓ నిత్యకృత్యం కావాలి. గ్రంథాలయాల్లో విజ్ఞానమే కాదు, వినయాన్ని పెంచే విజ్ఞుల దర్శన, పరిచయ భాగ్యం కూడా లభిస్తుంది.

ఈ అంశాలన్నీ ప్రత్యక్షంగా గురు శిష్య సంబంధం ఉండే సందర్భాల్లోనే కాదు; పరోక్షంగా జరిగేవాటి మీద కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మౌఖికంగా జరిగే ఇంటర్వ్యూల్లో విద్యార్థిలో చూసేది సమాచార సేకరణ కాదు, సంస్కారయుత ప్రవర్తననే!

ఎనిమిది అంచెల వ్యూహంలో
ఏడో అంశం-7
'పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం'

పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి
ఇక ఏడో అంశం 'పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం'. అదనుకు వచ్చిన పంటను రైతు పరిరక్షించుకున్నట్టుగానే తాను ఎన్నో నెలలుగా సముపార్జించుకున్న పరిజ్ఞానాన్ని క్రోడీకరించుకొని పరీక్షల్లో దాన్ని మార్కులుగా మలచుకోవడానికి ప్రతి విద్యార్థీ సన్నాహాలు చేసుకోవాలి.

పరీక్షలకు ముందు రెండు నెలల కాలంలో అంతవరకూ సంగ్రహించుకున్న పరిజ్ఞానాన్ని బలోపేతం చేసుకోవడానికి (consolidation process) ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు...

* నమూనా పునశ్చరణ పట్టిక (model revision schedule)ను తయారుచేసుకోవాలి. తాను పూర్తిచేయాల్సిన సబ్జెక్టుల సంఖ్య ఎంత, ఒక్కో సబ్జెక్టులో ఎన్నెన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటికి ఎంత సమయం కేటాయించాలి, ఏ పరీక్ష ఏ తేదీనాటికి అనేది స్పష్టంగా రాసుకోవాలి.

* ఒక సబ్జెక్టును ఒకేసారి పూర్తిచేయడం కాక రెండు నెలలూ దాన్ని విస్తరించుకోవాలి.
* రోజువారీ పునశ్చరణలో భిన్నమైన సబ్జెక్టులను కలిపి చదువుకోవాలి.
* సబ్జెక్టులో ముందు పాఠాలనుంచి కాక వెనక పాఠం నుంచి ముందుకు వెళ్ళేలా ప్రారంభించాలి.
* సన్నద్ధత కాలంలో ఓ అయిదు రోజుల సమయాన్ని అత్యవసరాల కోసం అదనంగా కేటాయించుకోవాలి.
* ప్రతి వారాంతంలో మొత్తం సబ్జెక్టును తిరిగి సమీక్షించుకోవాలి.
* వీలైతే మూడు లేదా నాలుగు పునశ్చరణలు జరిగేలా ప్లాను చేసుకోవాలి.
* సొంతగా రాసుకున్న నోట్సు చదవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
* పరీక్షల్లో రాబోయే నమూనా ప్రశ్నలను ఊహించుకొని వాటికి జవాబులు రాసి, మీ మిత్రబృందంతో కానీ, అధ్యాపకులతో కానీ చర్చించాలి.
* ప్రశ్న ఎలా వస్తే సమాధానం ఎలా రాయాలో అభ్యాసం చేయాలి.

సిద్ధంగా పరీక్ష కిట్‌
* పరీక్షలకు ముందురోజు... నోట్సుకు తయారుచేసుకున్న సారాంశాన్ని (సినాప్సిస్‌) మాత్రమే తిరగవేయాలి.
* పరీక్షకు కావలసిన హాల్‌టికెట్‌, రాత సామగ్రి వగైరాలతో పరీక్ష కిట్‌ (exam kit) ముందుగానే తయారుచేసి పెట్టుకోవాలి.
* తేలికైన ఆహారం తీసుకొని, పెందరాళే నిద్రపోవాలి.
* పరీక్ష రోజున... ఉదయం తొందరగా లేచి, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన నోట్సు సినాప్సిస్‌ ఒకసారి మననం చేసుకోవాలి.
* అల్పాహారం తీసుకోవాలి; పరీక్ష కిట్‌తో అర్థగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సిద్ధమవ్వాలి.
* ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పరీక్షల గురించి చర్చించవద్దు.

ఎనిమిది అంచెల వ్యూహంలో
చివరిది-8
'పరీక్షహాల్లో మార్కుల పంట పండించుకోవటం'


మార్కుల పంట...
ఎనిమిది అంచెల వ్యూహంలో చివరిది- 'పరీక్షహాల్లో మార్కుల పంట పండించుకోవటం'. సబ్జెక్టు ఎంత తెలిసినా, పరీక్షల్లో దాన్ని సక్రమంగా ప్రదర్శించకపోతే మార్కులు రావు. పరీక్షల కురుక్షేత్రంలో విజయుడిలా విజృంభించటానికి మూడు స్థాయుల్లో మెలకువలు పాటించాలి.

జవాబులు రాయటానికి ముందు:
* పరీక్ష కేంద్రానికి వెళ్ళిన వెంటనే ఎవరితోనూ బాతాఖానీ వేసుకోకుండా నేరుగా హాల్లోకి వెళ్ళి కేటాయించిన స్థలంలో కూర్చుని, రిలాక్స్‌ కావాలి.
* ప్రశ్నపత్రం ఇచ్చినంతనే జవాబులు రాసేయాలని ఆత్రపడకూడదు.
* సావధానంగా అక్కడ ఇచ్చే సూచనలు గమనించాలి. అనుకున్న రీతిలో ప్రశ్నపత్రం ఉందా, కొత్తగా ఏమైనా మార్పులు జరిగాయా పరిశీలించాలి.
* ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఎన్నిటికి సమాధానాలు రాయాలి, సమయం, ఒక్కో ప్రశ్నకు కేటాయించిన మార్కులు వంటివి స్పష్టం చేసుకోవాలి.
* ప్రశ్నలోని కీలక పదాలను గుర్తించి, వాటిని అండర్‌లైన్‌/హైలైట్‌ చేయాలి.
* ఏ ప్రశ్నలకు జవాబులు రాయాలనుకుంటారో వాటిని స్పష్టం చేసుకొని, వాటిమీదే దృష్టి పెట్టాలి.
* ప్రశ్నలను అడిగిన తీరును సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఉదా: వర్ణించమన్నారా, విమర్శనాత్మకంగా వివరించమన్నారా, పోల్చి చెప్పమన్నారా, విరుద్ధ అంశాలను వ్యక్తం చేయమన్నారా అనేది గమనించడం చాలా ముఖ్యం.
* మార్కులు, ప్రశ్నల పరిధిని ఆసరాగా చేసుకొని సమయాన్ని ముందుగానే కేటాయించుకోవాలి.
* కొంత అదనపు సమయం మిగిలివుండేలా చూసుకోవాలి.
* ప్రశ్నలకు ఏ క్రమంలో జవాబులు రాయాలో ముందే అనుకోవాలి.
* రాయబోయే పెద్ద ప్రశ్నలకు ముందుగానే ఓ అవుట్‌లైన్‌ తయారుచేసుకోవాలి.

జవాబులు రాసేటప్పుడు:
* ముందుగా రోల్‌నంబర్‌, ప్రశ్నల సంఖ్యను స్పష్టంగా ఆయా పత్రాల్లో చూసి రాయాలి.
* జవాబులను కాగితమ్మీద రాసేముందు వాటిని ఏ పద్ధతి (ఫ్రేమ్‌ వర్క్‌) లో రాయాలో మనసులో నిర్ణయించుకోవాలి.
* అడిగిన ప్రశ్నలకు తగినంత సమాచారాన్నే ఇవ్వాలి. తెలుసు కదా అని చాట భారతాలు రాయవద్దు.
* సాధ్యమైనంత వరకూ పాయింట్ల రూపంలో జవాబులు రాస్తే విషయం స్పష్టంగా ఉంటుంది. సమాధానాలు సంక్షిప్తంగా, సూటిగా, పాయింట్ల రూపంలో ఉండాలి.
* రాసేటప్పుడు అతి తొందర వద్దు. బరబరా బరికేస్తే ఆ రాసేది మనకే అర్థం కాదు. అర్థం కాని జవాబులకు మార్కులు రావు.
* సమాధానాన్ని అందమైన రీతిలో తీర్చిదిద్దాలి. సైడ్‌హెడ్స్‌ పెట్టి వాటిని అండర్‌లైన్‌ చేసి, పేపర్లో చక్కని మార్జిన్లు పాటిస్తూ ఆహ్లాదంగా ముస్తాబు చేయాలి. అప్పుడే పేపర్లు దిద్దేవారికి హాయిగా ఉంటుంది.
* వ్యాసరూప ప్రశ్నపత్రం విషయంలో... జవాబుకూ, జవాబుకూ మధ్య ఓ నిమిషం పాటు విరామం తీసుకోవాలి. ఈ సమయంలో రాయబోయే జవాబులోని విషయంపై, దాని నిర్మాణంపై దృష్టిపెట్టాలి. రాసుకున్న అవుట్‌లైన్‌ చూసుకోవాలి.
* రాస్తున్నపుడు ఓ కన్ను వాచీ మీద కూడా పెట్టాలి. తెలుసు కదా అని కొన్ని ప్రశ్నలకు ఎక్కువ సమాధానం ఇస్తే మిగతావాటికి సమయం దక్కకుండా పోయే ప్రమాదముంది.
* నిర్ణీత గడువు కన్నా ముందుగా పరీక్ష హాలు విడిచి వెళ్ళకూడదు. బయటకు వెళ్ళి చేసేది ఏమీ ఉండదని గుర్తుపెట్టుకోవాలి.
* పేపర్‌ గడ్డుగా ఉందనీ, చదివిన ప్రశ్నలు రాలేదనీ నిరుత్సాహపడకూడదు. పేపర్‌ మీకు కష్టంగా ఉంటే మిగతావారికీ అలానే ఉంటుంది. అందువల్ల మీకు మార్కులు తగ్గిపోయే ప్రమాదమేమీ లేదు.
* ఇంకా 10, 15 నిమిషాల్లో పరీక్ష సమయం ముగుస్తుందనగానే జవాబు పత్రాలను దారంతో కట్టేసి, రాసిన సమాధానాలు పరీక్షించుకోవాలి.
* సమాధానాల్లో ఏవైనా పాయింట్లు తప్పిపోతే వాటిని సందర్భానికి తగ్గట్టు చేర్చి రాయాలి.

పరీక్ష పూర్తయ్యాక...
* పరీక్షను రాయటం పూర్తిచేసి, బయటకు వచ్చినపుడు... పరీక్షల్లో రాసినదాన్ని గురించి ఆలోచించకూడదు. 'ఒలికిన పాలు ఎత్తడం సాధ్యం కాదు'. దృష్టిని రాయబోయే పరీక్షల మీద కేంద్రీకరించాలి.
* నేస్తాలతో పరీక్ష పేపర్‌ గురించీ, సమాధానాల తీరు గురించీ చర్చించకూడదు. దానిమూలంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
* పరీక్షలన్నీ అయిపోయాక మీ అనుభవాలనూ, అభిప్రాయాలనూ రాసి పెట్టుకోవాలి. భవిష్యత్తులో రాయబోయే వేరే పరీక్షలకు ఇవే కరదీపికలు. మీరు చేసిన తప్పిదాలు తర్వాతి పరీక్షల్లో లేకుండా చేసుకొని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఇవి సహకరిస్తాయి.

ఏడాది కష్టానికి ఇష్టమైన ఫలాలనిచ్చే మధురక్షణాలే పరీక్షలు. వ్యూహాత్మకంగా సిద్ధమైనవారికి అవి ఆహ్లాదంగా ఉంటాయి. మీలో దాగిన విజ్ఞానదీపాలను వెలికితీసి మీ బంగారు భవిష్యత్తుకు దివిటీలుగా పనిచేస్తాయి. విజయీభవ!

ఇవీ మొత్తం 8 వ్యూహాలు
ఎక్కువ మార్కులు ఇచ్చే 8 అంచెల వ్యూహం సంక్షిప్తంగా...

1. స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి.
2. ప్రణాళికాబద్ధంగా తయారుకావాలి.
3. నిరంతరం ఉత్సాహంతో ప్రయత్నించాలి.
4. కళాశాలలో విజ్ఞానబీజాలు నాటుకోవాలి.
5. ఇంటిదగ్గర వాటిని విస్తరించుకోవాలి.
6. వ్యక్తిత్వాన్నిచ్చే ప్రవర్తన అలవర్చుకోవాలి.
7. పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి.
8. పరీక్షహాల్లో మార్కుల పంట పండించుకోవాలి.

No comments:

Post a Comment