మన భౌగోళికంపై మీకు పట్టుందా ?



                       మన భౌగోళికంపై మీకు పట్టుందా ?

ఎ. ఎం. రెడ్డి
కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌
ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై అవగాహన అవసరం. ఈ సబ్జెక్టును చదవటంలో కొన్ని మెలకువలు పాటిస్తే తేలిగ్గా పట్టు సాధించవచ్చు!
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నిర్వహించే ఏ పోటీ పరీక్షలోనైనా జనరల్‌స్టడీస్‌ పేపర్‌ తప్పనిసరి. గ్రూప్‌-1 మెయిన్స్‌లో కూడా దీని పాత్ర కీలకమే. ఈ పరీక్షలన్నింటిలో అభ్యర్థుల మెరిట్‌ను, తద్వారా వారి తుది ఎంపికను నిర్థారించేదిగా జనరల్‌స్టడీస్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పేపర్లో భూగోళశాస్త్రం (జాగ్రఫీ) నుంచి దాదాపు 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్‌స్టడీస్‌
ఏపీపీఎస్సీ వారు ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ 'Focus on AP Geography' అని స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే పరీక్ష సన్నద్ధతలో ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి అవసరం. మొత్తం భూగోళశాస్త్రం నుంచి వచ్చే 25 ప్రశ్నల్లో నాలుగో వంతు- అంటే ఆరేడు ప్రశ్నలు ఆంధప్రదేశ్‌ భౌగోళికాంశాలపై ఉంటాయి. పోటీ పరీక్షల్లో అభ్యర్థుల తుది ఎంపికను నిర్ణయించేది ఒకే ఒక మార్కు కదా!
గ్రూప్‌-2 పేపర్‌ III
గ్రూప్‌-2 పరీక్షకు సంబంధించి మూడో పేపర్‌ రెండో విభాగం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినదే. మొత్తం 75 మార్కులకు దాదాపు 40 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాల నుంచి వస్తాయి. నిజానికి గత గ్రూప్‌-2 పరీక్షలో అభ్యర్థుల తుది ఎంపికను ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాల ప్రశ్నలే నిర్ణయించాయి. దీనికి కారణం చాలామంది అభ్యర్థులు ఈ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే!
ఒకవేళ ఈ అంశాలపై కేంద్రీకరించి సిద్ధమవుదామంటే సరైన తాజా సమాచారం గల పుస్తకాలు గానీ, స్టడీ మెటీరియల్‌ గానీ అందుబాటులో లేకపోవడం మరో సమస్య. కాబట్టి రాబోయే గ్రూప్‌-2 పరీక్షలో ఈ విభాగంపై దృష్టి కేంద్రీకరించి తాజా సమాచారాన్ని సేకరించి సిద్ధం కావలసివుంటుంది.
గ్రూప్‌-1 మెయిన్స్‌
ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనీసం వంద మార్కుల ప్రశ్నలు గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఉంటాయి.
ఈ అంశాలను చదవటానికి ముందు భారతదేశ భూగోళశాస్త్రంపై పట్టు సాధించాలి. భౌగోళికాంశాల మౌలిక భావనలను ముందు అర్థం చేసుకోవాలి. వాటిని భారతదేశ భౌగోళికాంశాలకు అన్వయం చేసుకొని, తరవాత వాటిని ఆంధ్రప్రదేశ్‌కు అన్వయించుకుంటే సబ్జెక్టు సునాయాసంగా అర్థమవుతుంది. అంటే భారతదేశ భౌగోళికాంశాలలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాటిని అనుసంధానం చేసుకోవలసి ఉంటుందన్నమాట!
ఉదాహరణకు భారతదేశ ఎల్లలు, భౌగోళిక విస్తీర్ణం, సముద్రతీరం పొడవు, వివిధ రాష్ట్రాల భౌగోళిక స్వరూపం (మ్యాప్‌ల రూపంలో), ప్రధాన భూస్వరూపాలు (పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, సరస్సులు, మృత్తికలు, శీతోష్ణస్థితి, అటవీ సంపద, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయం, ముఖ్యమైన పంటలు, పశుపోషణ, ఖనిజ సంపద, పరిశ్రమలు, రవాణా, సమాచార సాధనాలు, జనాభా మొదలైనవి) చదివేటప్పుడు ముందుగా భారతదేశ భౌగోళికాంశాలను చదవాలి. ఆ తరవాత వాటికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను అనుసంధానం చేసుకోవాలి.
భౌగోళికాంశాలు తప్పనిసరిగా చిత్రపటాలను (మ్యాపులు) ముందుంచుకొనే చదవాలి.
జనాభా
రెండు/ మూడు ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అంశం జనాభా. భారత్‌, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన జనాభా అంశాలన్నింటిని, రాష్ట్రాలు- జిల్లాల వారీగా (శాతాల రూపంలో) జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా త్వరలో రాబోయే 2011 జనగణన వివరాలను 2001 జనగణనతో పోల్చి చదవాలి.
ఉదాహరణకు- జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో ఏ స్థానంలో ఉంది? లేదా ఏయే రాష్ట్రాల జనాభా ఏపీ కంటే ఎక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్‌ జనాభా దేశ జనాభాలో 2001లో ఎంత ఉంది? 2011లో ఎంత ఉంది? జనాభా వృద్ధిరేటులో జరిగిన మార్పు, షెడ్యూలు కులాల, తెగల జనాభా - జిల్లాల వారీగా శాతాలలో చదవాల్సి ఉంటుంది. 2011 జనగణనలో వెనుకబడిన వర్గాల వారి లెక్కింపు కూడా ఉంది కాబట్టి మొత్తం రాష్ట్రజనాభాలో వారి శాతం మొదలైన అంశాలన్నింటిని పోలుస్తూ చదవాలి.
గ్రూప్‌- 2
గ్రూప్‌-2 పరీక్ష విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీ కీలకపాత్ర వహిస్తుంది. సిలబస్‌లోనే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ అడవుల విస్తీర్ణం, విస్తరణ; స్థూల- నికర సాగుభూమి; వివిధ రకాల నీటిపారుదల సౌకర్యాలు, వాటి విస్తరణ, శాతాలు; ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లో పంటల విధానం, వాటిలో మార్పు- వాటి విస్తరణ, ఉత్పత్తి; రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు- అభివృద్ధి, విస్తరణ; రాష్ట్రంలో సేవారంగం, ప్రసార మాధ్యమాలు, రవాణా, టూరిజం సమాచార సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన ప్రముఖ కంపెనీలు, వాటి ఉత్పత్తులు, సాలీనా ఆదాయం, రాష్ట్రంలో జీవ సాంకేతిక విజ్ఞానం వాటికి సంబంధించిన ప్రత్యేక పార్కులు; రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) మొదలైనవి తాజా సమాచారంతో చదవాలి.
తాజా సమాచారం
ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రానికి సంబంధించిన సమాచారానికి ప్రధాన ఆధారం తెలుగు అకాడెమీ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రం. కానీ ఈ పుస్తకాన్ని ఎప్పటికప్పుడు నవీకరించటం (అప్‌డేట్‌) చేయకపోవడం వల్ల తాజా సమాచారం, ఇటీవల అభివృద్ధి కార్యక్రమాలు లభించవు. వాటిని ఎప్పటికప్పుడు వార్తాపత్రికల్లో కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక నుంచి కానీ సేకరించాలి. శాఖాపరమైన సమాచారాన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆయా శాఖలు కొన్ని ప్రముఖ వార్తాపత్రికలలో ఇచ్చే ప్రకటనల ద్వారా సేకరించి చదవవలసి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక, ఆర్థికాంశాలకు సంబంధించిన తాజా సమాచారం రాష్ట్రప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు ప్రచురించే 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే' పుస్తకంలో లభిస్తుంది. దీన్ని ఆంగ్లంలో ముద్రిస్తారు. దీనిని ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకుని ముఖ్యాంశాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకుని చదవాలి. ఎ.పి. సమాచారానికి ఈ పుస్తకం అత్యంత కీలకమని మరవకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే, పరీక్షలోని సగం ప్రశ్నలు అందులో నుంచే వస్తాయి. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ఇటీవల సమాచారం ఆధారంగా ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్నీ ప్రాథమికాంశాలతో పాటు తాజా సమాచారంతో అధ్యయనం చేస్తే ఎ.పి. జాగ్రఫీలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు.
గ్రూప్‌-1 మెయిన్స్‌
ఏపీ జాగ్రఫీపై పట్టు సాధిస్తే గ్రూప్‌-1 మెయిన్స్‌లో 100 మార్కులు సాధించవచ్చు. దీనికి కూడా ప్రధాన ఆధారం 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే' అని మరవకూడదు. మొదటి పేపర్లో వ్యాసరచనలో 50 మార్కులూ, మూడో పేపర్లో 50-60 మార్కులు తెచ్చుకోవచ్చు. 150-200 పదాలతో తాజా సమాచారం జోడించి సమగ్రంగా ముందే రూపొందించుకుని చదవాల్సివుంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలపై పట్టు సాధిస్తే ఉద్యోగం మీ సొంతం.
 
చిత్రపటాలే ఆధారం
టీవల గ్రూప్‌-1 ప్రిలిమినరీలో ఒక ప్రశ్నలో ఓ రాష్ట్ర పటాన్ని ఇచ్చి అది ఏ రాష్ట్రమో గుర్తించమని అడిగారు. తరవాత ప్రశ్నలో ఒక జిల్లా పటాన్ని ఇచ్చి అది ఏ జిల్లానో గుర్తించమన్నారు. కాబట్టి భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ పటాలు మీ కళ్లముందు కదలాడుతూ ఉండాలి. భౌగోళిక విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ఏ స్థానంలో ఉందో గుర్తించాలి. భారతదేశ భూ సరిహద్దు దేశాలను చదివి, ఆ తరవాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలేమిటో తెలుసుకోవాలి. భారతదేశ పర్వతాలను విశ్లేషించి చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పర్వత శ్రేణుల విస్తరణను, వివిధ ప్రాంతాలలో వాటి ప్రాంతీయ నామాలను, వాటి సరాసరి ఎత్తును, అత్యున్నత పర్వత శిఖరం మొదలైనవాటిని ప్రత్యేకించి చదవవలసి ఉంటుంది. భారతదేశ నదులు, వాటి ఉపనదులు చదివేటప్పుడు- ఆంధ్రప్రదేశ్‌లోని నదులు, వాటి ఉపనదులు సమగ్రంగా చదవవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల వార్తల్లోకెక్కిన అంశాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ప్రాణహిత ఏ నదికి ఉపనది అని అడగవచ్చు. పోలవరం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడుతుంది? మూసీ ఏ నదికి ఉపనది అనో లేదో మూసీ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందనో అడగవచ్చు.
భారతదేశంలో నేలలు (మృత్తికలు) చదివేటప్పుడు వాటి వర్గీకరణను, విస్తరణను అర్థం చేసుకొని ఆ తరవాత ఆంధ్రప్రదేశ్‌లోని నేలల వర్గీకరణ, విస్తరణ చదవాలి.
* భారతదేశంలో అత్యధికంగా విస్తరించివున్న నేలలు ఏ రకానికి చెందినవి? (ఒండ్రుమట్టి నేలలు).
* ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా విస్తరించియున్న నేలలు? (ఎర్రనేలలు).
ఈ విధంగా ప్రతి అంశాన్నీ మొదట భారతదేశ అంశాలను చదివి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను చదవాలి. ముఖ్యంగా వ్యవసాయం-పంటల విస్తరణ-ఉత్పత్తి, ఖనిజాలు- విస్తరణ, ముఖ్య పరిశ్రమలు - రవాణా సౌకర్యాలు- సమాచార సాధనాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి.





No comments:

Post a Comment