మార్కులు తెచ్చే వ్యాసంగం!

మార్కులు తెచ్చే వ్యాసంగం!
కొడాలి భవానీ శంకర్‌
గ్రూప్‌-1 సిలబస్‌లో 'జనరల్‌ వ్యాసం' అని ఉంటుంది. వ్యాస విషయం ఏదైనా కానివ్వండి- ప్రత్యేక జ్ఞానం లేని వ్యక్తి కూడా చదవగానే ఒక అవగాహనకి రాగలిగితే వ్యాసం విజయం సాధించినట్టే! ఆకట్టుకునే వ్యాసానికి రూపురేఖలను ఎలా ఇవ్వాలో వివరంగా తెలుసుకుందాం.
విచ్ఛిన్నత (ధార), విషయ సమగ్రత, విషయ విశ్లేషణ, భావ వ్యక్తీకరణ, భాషాపాటవం మొదలైన లక్షణాలను వ్యాసంలో ప్రదర్శించినంత మాత్రాన గ్రూప్‌-1లో మంచి మార్కుల్ని సాధిస్తామని చెప్పలేం. ఎందుకంటే గ్రూప్‌-1 వ్యాస ప్రశ్నలో ఎగ్జామినర్‌కి ఏయే అంశాలు కావాలో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి, ఆయా అంశాల్ని ఒక పద్ధతి ప్రకారం పై లక్షణాలను కలిపి రచిస్తేనే మంచి మార్కులు లభించే అవకాశం ఉంది. 'సివిల్స్‌'లో చిన్న వాక్యం ఇచ్చి హద్దులు నిర్ణయించకుండా అభ్యర్థి సామర్థ్యాన్ని నిర్ణయిస్తారు. కానీ గ్రూప్‌-1 వ్యాసంలో నిడివి, హద్దులు, సమయం అనే సవాళ్లని ఎదుర్కొంటూ, వ్యాస లక్షణాలలో రచనని పూర్తి చేయడం కత్తిమీద సాము లాంటిదే.
వ్యాసం- ఎన్ని దశల్లో?
ప్రశ్నని క్షుణ్ణంగా చదవటం
కీ (కీలక పదాలు) గుర్తించడం
చిత్తు ప్రతి తయారీ: 7-8 నిమిషాలు
వ్యాస రచన: 45 నిమిషాలు
సమీక్ష/సవరణలు: 5 నిమిషాలు
ఈ వ్యాస దశల్ని 2008 గ్రూప్‌-1 మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నల ద్వారా విశ్లేషిద్దాం.
ప్రశ్న: కరువు లేదా దుర్భిక్షం అనగానేమి? దుర్భిక్ష ప్రభావాల్ని తెలిపి, వాటిని అంతమొందించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని చర్చించండి. మూడు సంవత్సరాలకు పైగా కరువు కొనసాగితే దాని నివారణకు చేపట్టే చర్యలు ఏమిటి?
కీలక పదాలు:
1) దుర్భిక్ష నిర్వచనం 2) దుర్భిక్ష ప్రభావాలు 3) ప్రభుత్వ చర్యలు 4) 3 సంవత్సరాల కరువు నివారణ చర్యలు
ఈ నాలుగు అంశాలనూ క్రమబద్ధీకరించి వ్యాస లక్షణాల్ని మిళితం చేయడం ఎలా? అని ఆలోచించాలి. ఈ నాలుగు అంశాల్నే ఉప శీర్షికల్లాగా రాసుకొంటూ పోతే అది జనరల్‌ స్టడీస్‌ సమాధానాల శైలిలో ఉండి వ్యాస రూపాన్ని ప్రతిబింబించదు.
ప్రశ్నలో అడిగిన కీలక పదాల వరుస క్రమంలోనే చిత్తు ప్రతిని తయారుచేయాల్సిన అవసరం కూడా లేదు. కీలక పదాల్ని ఏ వరుస క్రమంలో కలిపితే అందమైన రూపం వస్తుంది అనే ఆలోచనే సరైన చిత్తు ప్రతికి దారి తీస్తుంది. దాంతో సరైన వ్యాసం వస్తుంది.
చిత్తుప్రతి తయారీ
భవనం నిర్మించటానికి ముందు తయారుచేసే ప్రణాళిక లాంటిదే చిత్తు ప్రతి తయారీ. సమగ్రత, అవిచ్ఛిన్నత, విషయావగాహన, విశ్లేషణ మొదలైన అంశాలు కలిపేందుకు అనుగుణంగా సరైన క్రమంలో కీలక పదాలు, ఇతర అంశాల అనుసంధానంతో చిత్తుప్రతిని తయారుచేసుకోవాలి.
కీలక పదాలకు అదనంగా- కరవు పరిణామం - నిర్దేశించే విధానం - కరవు కారణాలు - అదనపు పరిష్కార మార్గాలు అనే అంశాల్ని చేర్చాం. ఇలా జోడించటం వల్ల విషయ సమగ్రత ఏర్పడుతుంది. అదేవిధంగా సరైన ధార కూడా! సమస్య కారణాలు చర్చించడం వల్ల సమస్య లోతుని అభ్యర్థి బాగా అర్థం చేసుకున్నాడనే భావన దిద్దేవారిలో ఏర్పడుతుంది. పైగా గ్రూప్‌-1 స్థాయి అధికారికి సమస్య కారణాలు అన్వేషించే సామర్థ్యం చాలా అవసరం. అది ఇలా జోడించటం ద్వారానే ప్రదర్శితమవుతుంది. ప్రభుత్వ చర్యలు సరైన రీతిలో వెళుతున్నాయా? లేదా? అనే పరిశీలన అధికారులకు అవసరం. అందుకే 'ప్రభుత్వ చర్యలు- సాధించిన ఫలితాలు' అనే కోణాన్ని కూడా జోడించాము. అదనపు పరిష్కార మార్గాలు రాయడం ద్వారా అభ్యర్థి సమస్యా పరిష్కార శక్తి ప్రదర్శితం అవుతుంది. సృజనాత్మకతా బయటపడుతుంది.
ఈ విధంగా వ్యాసాన్ని అభివృద్ధి చేసేటప్పుడు కీలక పదాలను అదనంగా ఏయే విషయాల జోడింపు అవసరమో నిర్ధారించుకుంటే సంపూర్ణత్వం దిశగా పయనించినట్లే.
ఎంత సమయం కేటాయించాలి?
వ్యాస రచనలో అనవసరమైన విషయాలకు ఎక్కువ, అవసరమైన విషయాలకు తక్కువ సమయం కేటాయించడం వంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలి. ఎగ్జామినర్‌కు కావల్సిన స్థాయిలో సమాచారం ఇవ్వాలి కదా! అందుకే చిత్తు ప్రతిలోని ప్రతి అంశానికీ ఎంత సమయం కేటాయించాలో ముందుగా నిర్ణయించుకోవాలి.
కరువు వ్యాసం చిత్తుప్రతి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే, రచనకు లభించే సమయం 45 నిమిషాలలో...
ఉపోద్ఘాతం 4 నిమిషాలు
కారణాలు 6 ని.
దుష్ఫలితాలు 15 ని.
ప్రభుత్వ చర్యలు 15 ని.
పరిష్కార మార్గాలు 5 నిమిషాలు కేటాయించుకోవాలి.
దుష్ఫలితాలు, ప్రభుత్వ చర్యలు అనేవి ప్రశ్నలోనే ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించాం. మిగతా అంశాలు సమగ్రత కోసం అవసరం కాబట్టి, లభించే సమాచారాన్ని బట్టి సమయాన్ని కేటాయించుకున్నాం. ఇదే రీతిలో ప్రతి వ్యాసంలో సమయం విలువను నిర్ణయించుకోవాలి.
సైన్సు - ఆర్ట్స్‌ అభ్యర్థులు
సైన్సు, ఆర్ట్స్‌ అభ్యర్థులలో వారి సబ్జెక్టుల స్వభావం రీత్యా సంక్షిప్తత, విస్తరణ అనే గుణాలు వారిలో ఇమిడిపోతాయి. సైన్సు అభ్యర్థులకు వివరణాత్మకంగా రాయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ప్రతి విషయాన్నీ సూత్రీకరణ రూపంలో చెప్పడం వీరి గుణం. దీనికి భిన్నంగా ఆర్ట్స్‌ అభ్యర్థులు ఒక పదాన్ని ఆధారంగా చేసుకొని ఎంత పెద్ద కథనయినా చెప్పగలుగుతారు. పైగా ఈ వ్యాసాలన్నీ సాంఘిక విషయాలకు సంబంధించినవే. అందువల్ల సైన్సు అభ్యర్థులు సాధన ద్వారానే, మంచి వ్యాసం అభివృద్ధి చేయగలుగుతారు.
2008 గ్రూప్‌-1 మెయిన్స్‌లో - 'ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించబడిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల అనుకూల, ప్రతికూల అంశాల్ని చర్చింపుము'అనే ప్రశ్నకి 'అనుకూల, ప్రతికూల' అంశాలు మాత్రమే రాస్తే మార్కులు తక్కువ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాసాన్ని ఈ కింది విధంగా విస్తరించవచ్చు.
సెజ్‌లపై తాజా స్థితి (5-6 లైన్లు)
సెజ్‌ల పరిణామం, తోడ్పడిన అంశాలు
ఆవశ్యకత (అనుకూలతలు)
ప్రతికూలత (దుష్పలితాలు)
ప్రభుత్వ చర్యలు
సిఫార్సులు
ముగింపు
ఆర్ట్స్‌ అభ్యర్థులు పేజీలు పేజీలు రాసెయ్యాలనే అపోహ వదిలి నిర్మాణాత్మకంగా, పొందికగా రాసేందుకు కృషి చేయాలి.

2 comments:

  1. Sir,

    Group-2 ki degree lo enta percentage kavali?? Age limit enta?? vanti vivaraalu kuda upload cheyyagalaru

    ReplyDelete
  2. Degree certificate is alone enough(pass).Age limit is 30 for OC and will be extended for BC/SC/ST

    ReplyDelete