మనసు పెడితే... మార్కుల 'చరిత్ర'! ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న అన్ని పోటీపరీక్షల జనరల్ స్టడీస్‌లో భారతదేశ చరిత్ర కీలకమైంది. చరిత్రపై పట్టు సాధిస్తే గ్రూప్-Iప్రిలిమినరీ, గ్రూప్-IIలో నెగ్గటం, విజయవంతంగా ఇంటర్వ్యూ చేయటం, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సులభమవుతాయి.
వి. వీరబ్రహ్మం
ట్రెయినీ డెప్యూటీ కలెక్టర్
అత్యధిక మార్కులు ఎలా?
చరిత్ర అంటే సిలబస్ ఎక్కువ, కష్టం, విసుగు అనే వ్యతిరేక ధోరణులను మనసు నుంచి దూరం చేయండి. సులభం, ఇష్టం, క్రమ పద్ధతిలో చదివితే ఎంత సిలబస్ ఉన్నా పూర్తి చేయవచ్చనే ఆలోచనలను ఆవాహన చేసుకోండి. సానుకూల వైఖరే విజయానికి పునాది అని వేరే చెప్పాలా!
చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనే కోరిక మీలో ఉంది. అది రగిలే కోరికగా ఉండాలి. పరీక్ష సన్నాహకాల్లో ముఖ్యాంశం వ్యూహరచన. కన్పించిన చరిత్ర పుస్తకాలన్నీ వెనువెంటనే చదవడానికి ముందు ఒక్కసారి మేధోమథనం చేయాలి.
సిలబస్‌లోని అంశాలు, మార్కులు - వీటిపై అవగాహన ఉన్న అంశాలు, పూర్తిగా అవగాహన లేనివి, సులభంగా నేర్చుకొనేవి, కష్టమైనవి... చదవాల్సిన పుస్తకాలు, ఉన్న సమయం, సిలబస్‌ను ఎప్పటిలోగా పూర్తిచేయాలి? ఎన్నిసార్లు పునశ్చరణ?.... ఇలా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు నోట్‌బుక్‌లో వ్యూహరచన చేయాలి. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే వ్యూహరచన ఆచరణకు సాధ్యమయ్యే రీతిలో ఉండాలి.
అభ్యర్థులు రకరకాల మెటీరియల్, అమితమైన సమాచారం సేకరించాలనే ఆత్రుత కనబరుస్తారు. అలాకాక ప్రామాణిక, గుణాత్మక మెటీరియల్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఎక్కువ మెటీరియల్‌ను తక్కువ సార్లు కాకుండా అతి ముఖ్యమైనవాటిని ఎక్కువసార్లు చదవడమే ఉత్తమం.
భారతదేశ చరిత్రకు సంబంధించి కొన్ని పుస్తకాలు:
* 6 నుంచి 10 తరగతి చరిత్ర పుస్తకాలు
* ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చరిత్ర పుస్తకాలు
* డిగ్రీ చరిత్ర పుస్తకాలు
* బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ, పీజీ చరిత్ర పుస్తకాలు
ఆరు నుంచి పదో తరగతి పుస్తకాలు చదవటం వల్ల ప్రాథమిక అంశాల పట్ల స్పష్టత ఏర్పడుతుంది. 2008 గ్రూప్-1, 2... 2010 గ్రూప్-1 జనరల్ స్టడీస్‌లో చరిత్ర ప్రశ్నలు గమనిస్తే ప్రాథమిక అంశాలపై ప్రశ్నలున్నాయని అర్థమవుతుంది.
* వర్థమాన మహావీరుడు ఒక... (2008 గ్రూప్-1)
1. బ్రాహ్మణుడు 2. క్షత్రియుడు 3. వైశ్యుడు 4. శూద్రుడు (2)
* కింది వారిలో మితవాద నాయకుడు (2008 గ్రూప్-1)
1. గోఖలే 2. తిలక్ 3. నేతాజీ 4. అనిబిసెంట్(1)
* హరప్పా ప్రజలు కిందివానిలో ఏ ఇతరులతో అంతర్జాతీయ సంబంధం కలిగి ఉన్నారు. (2010 గ్రూప్-|)
1. ఇరాన్ 2. ఈజిప్టు 3. బహ్రెయిన్ 4. మెసపొటేమియా (4)
ఇలా ప్రతి పరీక్షలో కనీసం ఐదు ప్రశ్నలు ఆరు నుంచి పదో తరగతి వరకు ఉండే ప్రాథమిక అంశాలపై ఉంటాయి.
ఇక ఇంటర్మీడియెట్ చరిత్ర పుస్తకాలు విధిగా చదవాలి. అవి చదివితే కనీసం 60 శాతం ప్రశ్నలు సులభంగా చేయవచ్చు. తరవాత డిగ్రీ లేదా ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఏవి చదివినా, ఉన్న సమయం బట్టి ఎంచుకొంటే సరిపోతుంది.
గత ప్రశ్నల అధ్యయనం
మెటీరియల్ సేకరణతో పాటు గత ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రాలు సేకరించుకొని అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలు మనకు నిజమైన మార్గదర్శకాలు. ఇవి విస్త్రత పరిధి ఉన్న సబ్జెక్టులో ప్రావీణ్యం సంపాదించడానికి దోహదం చేస్తాయి. సరైన మార్గంలో, పరీక్షా కోణంలో ప్రిపరేషన్ కొనసాగించటానికి ఉపకరిస్తాయి.
* పరీక్ష పేపర్ సెట్టర్స్ ఎలాంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారో పసిగట్టవచ్చు. పేపర్ సెట్టర్స్ ప్రతి పరీక్షకు మారినా, ఇచ్చే ప్రశ్నలపై వారి ఆలోచనలు దాదాపు ఒకే సరళిలో ఉంటాయి.
* ప్రశ్నల తీరు తెలుసుకొని మరికొన్ని రాబోయే ప్రశ్నలను మనమే తయారుచేసుకోవచ్చు.
* ప్రశ్నల పరిధి స్పష్టంగా తెలుస్తుంది.
చదువుతున్న అంశాలకు సంబంధించి నోట్సు రాసుకోవడం మంచిది. పుస్తకాల్లోని మొత్తం విషయాలన్నీ రాయటం కాకుండా ముఖ్యమైనవి సొంత మాటల్లో గుర్తుండేలాగా రాసుకోవాలి. ఇలా చేయటానికి కొద్దిగా సమయం పట్టినా లాభాలు ఎక్కువ ; పునశ్చరణ సులువు.
జనరల్ స్టడీస్‌లోని అన్ని విభాగాలతో కలిపి చరిత్రను ప్రతిరోజూ చదవాలా? చరిత్రనంతా ఒకేసారి చదవాలా? అనే సందేహం కూడా మొదటగా సిద్ధమయ్యేవారికి వస్తూంటుంది. ఇది వారి వైయక్తిక భేదాలను (Individual differences) బట్టి ఉంటుంది. ఏ విధానాన్ని ఎన్నుకొన్నా ప్రణాళిక ప్రకారం, ఇతర విభాగాలను కూడా దృష్టిలో ఉంచుకొని పునశ్చరణకు అనుగుణంగా పూర్తిచేయాలి.
చరిత్ర అధ్యయనం చేసే అభ్యర్థులకు కొన్ని అంశాలపై ముందుగానే అవగాహన ఉండవచ్చు. మరికొన్ని అంశాలు అసలు అవగాహనే లేకుండా ఉండొచ్చు. అందువల్ల కష్టంగా ఉండే అంశాలపై ముందు దృష్టి పెట్టండి. అప్పుడు వాటిని ఎక్కువసార్లు చదివేందుకు వీలవుతుంది. పరీక్షా సమయం దగ్గర పడేకొద్దీ సహజంగా కొంత ఒత్తిడి పెరిగి, కష్టమైనవి వదిలేసే అవకాశం ఉంటుంది. ఉదా: మధ్యయుగ చరిత్రకు సంబంధించి ఢిల్లీ సుల్తానులు, మొఘలుల చరిత్రాధ్యయనం కష్టంగా అనిపిస్తే వాటిపై ముందునుంచీ శ్రద్ధ పెట్టి చదవాలి.
అయితే ఒకటి- తక్కువ సమయం ఉంది. పరీక్షకు మొదటిసారి ప్రిపేర్ అవుతున్నాం. ఇలాంటప్పుడు కష్టమైన అంశాలను కాక అతి తక్కువ సమయంలో (ప్రాధాన్యత, సులువైన) ఏయే అంశాలు చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో వాటి మీద దృష్టి పెట్టాలి. పరీక్షకు ఉండే సమయాన్ని బట్టి వ్యూహాన్ని రూపొందించుకోవాలి.
చదివిన విషయాలను పదేపదే పునశ్చరణ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. వారానికి ఒకరోజు నేర్చుకొన్న విషయాలన్నింటినీ పునశ్చరణ చేసుకోవడానికి కేటాయిస్తే బాగుంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకొనేందుకు గ్రూప్ డిస్కషన్ చేయండి. మీలాగే చదివే ముగ్గురు నలుగురితో కలిసి నేర్చుకొన్న విషయాలను చర్చించాలి. దీనితో 100% సమయం, శక్తి చదువుతున్న విషయాలపైనే ఏకాగ్రతతో పెట్టవచ్చు.
చదివిన అంశాలకు సంబంధించి బిట్స్ సాధన అవసరం. దీని ద్వారా మనకు ఎంతవరకు అవగాహన అయింది? ఏయే అంశాలలో వెనుకబడి ఉన్నాం? తెలుస్తుంది. బిట్స్ సాధన తరవాత వెనుకబడివున్న, గుర్తు పెట్టుకొనేందుకు కష్టంగా ఉన్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
చరిత్రపై మరింత పట్టు సాధించేందుకు ఎక్కువ మార్కులు సంపాదించేందుకు వివిధ రాజవంశాల మధ్య పోలికలు చదవాలి. ఉదా. సాంఘిక పరిస్థితులను తీసుకొంటే సింధు నాగరికత, వేద నాగరికత, మౌర్యుల, గుప్తుల కాలాల్లో ఎలా ఉన్నాయో ఓసారి అవగాహన చేసుకోండి. మొదట ప్రతి కాలానికీ సంబంధించి సాంఘిక పరిస్థితులు చదివి, రెండోసారి పోల్చుకొని చదవడం మంచిది. రాజకీయ విధానం, మతం, సాంస్కృతిక పరిస్థితుల్లో తేడాలు వంటి కొన్ని ఎంచుకుని, సామ్యాలు చదివితే బాగా గుర్తుంటాయి. నేర్చుకొన్న విషయాలను క్రమ పద్ధతిలో మెదడులో అమర్చుకోవాలి. ఉదా. మౌర్యుల కాలంలో గ్రంథాలు, రచయితలు చదివితే ఆ అంశానికి సంబంధించి గుర్తుండిపోతాయి. తిరిగి గుప్తుల కాలంలో గ్రంథాలు, రచయితలు చదివితే పాతవి మరిచిపోయే అవకాశం ఉంది. అందుకని గ్రంథాలు-రచయితలు ఒక టాపిగ్గా తీసుకొని వివిధ కాలాల్లోని వారిని ఒకచోట చేర్చుకొని వరుసగా చదివితే మనసులో హత్తుకుపోతాయి. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఒక అంశానికి సంబంధించి వీలైనన్ని అభ్యర్థులే తయారుచేసుకోవడం వల్ల కూడా దానిపై రకరకాలుగా అడిగే ప్రశ్నలు తెలుస్తాయి. ఏ రకంగా ప్రశ్న వచ్చినా జవాబు రాయగలిగే అవగాహన ఏర్పడుతుంది. ఇక ప్రిపేర్ అయ్యేవారిలో ఇప్పటికే కొద్దిమంది ప్రిపరేషన్ పూర్తిచేసి ముందు వరుసలో ఉంటారు. వారు పరీక్ష తేదీలు ఎప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారు, వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీసు పరీక్షలు రాయటం, సొంతంగా బిట్స్ తయారుచేసుకోవడం, సమయాన్ని వృథా చేయకుండా ఇతరులకు నేర్చుకొన్న విషయాలను నేర్పించడం చేయాలి. |
* కాంగ్రెస్‌కు పూర్వం జాతీయ వాద వ్యవస్థలు- స్థాపకులు- స్థలం. ఉదా. ఈస్టిండియా కంపెనీ మొదలైనవి. * భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు - మొదటి నాలుగు సమావేశాలు, స్థలం, అధ్యక్షులు. ప్రముఖ వ్యక్తులు హాజరైన సమావేశాలు, వాటిల్లోని తీర్మానాలపై కూడా అవగాహన ఉండాలి. * ప్రముఖ గిరిజన ఉద్యమాలు- నాయకులు. ఉదా. సంతాల్స్, ముండాస్. * ప్రముఖ రైతు, కుల ఉద్యమాలు - నాయకులు, ప్రదేశాలు * గవర్నర్ జనరల్స్, వైశ్రాయ్‌ల కాలంలో ప్రధానసంఘటనలు * రాజ్యాంగ సంస్కరణలు. ముఖ్యంగా 1909, 1919, 1935 చట్టాలు * సిపాయీల తిరుగుబాటు జరిగిన ప్రదేశాలు- నాయకులు * రాజులు- ఆస్థానాన్ని సందర్శించిన విదేశీయులు * చరిత్రలో ప్రముఖ సంవత్సరాలు. ఉదా: అరబ్బుల దండయాత్ర, ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యాదినం, ఉప్పు సత్యాగ్రహం * ప్రముఖ నిర్మాణాలు, చేపట్టినవారు, రాజులు- ప్రముఖ ఒప్పందాలు. * ప్రముఖ శాసనాలు, నాణేలు, వేయించిన రాజులు * ప్రముఖ సిక్కు గురువులు, వారి కాలం- సంఘటనలు పై విధంగా గత ప్రశ్నపత్రాల ద్వారా ముఖ్యమైనవి గుర్తించి, వాటికి ప్రాధాన్యం ఇస్తూ ఇతర అంశాలు కూడా చదవాలి. |
No comments:
Post a Comment