ప్రేమ మత్తులో జ్ఞానోదయం!

ప్రేమ మత్తులో జ్ఞానోదయం!
మనసు ప్రేమను కోరింది... మాట పెదవి దాటి రానంది. అందని ప్రేమకు 'మందే' తోడనుకుంటే జీవితం అంధకారమైంది. ఎందుకలా జరిగింది? అబ్బాయి చెబుతున్నాడు..
'డాక్టర్లు చెప్పినట్టు వాడి కాలు అతుక్కోవడం కష్టమేనా?' అమ్మ ఏడుస్తూ అడుగుతోంది. నాన్నేమో కన్నీళ్లతో బేలగా నావైపే చూస్తున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా వాళ్లెపుడూ అంతలా చలించలేదు. 'నాకేం కాద'ంటూ వాళ్లను ఓదార్చడానికి పైకి లేవబోయాను. నా ప్రయత్నం వృథా ప్రయాసే అయింది. ఒళ్లంతా నొప్పులతో కదల్లేకపోయా. 'అసలెందుకిలా జరిగిందిరా?' దుఃఖాన్ని దిగమింగుకుంటూ నాన్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పలేదు.
సవాళ్లకు ఎదురెళ్లి పోరాడటమంటే నాకిష్టం. అందుకే పట్టుపట్టి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరా. హర్యానాలోని అంబాలాలో డ్యూటీ. నచ్చిన కొలువుతో జీవితం జాలీగా గడిచిపోయేది. ఓ సెలవురోజు షాపింగ్‌ చేసి బైక్‌పై తిరిగొస్తుంటే సడెన్‌గా ప్రత్యక్షమైందో అమ్మాయి. బ్రేక్‌తో బైకును అదుపు చేసినా ఆ సౌందర్యాన్ని చూసి నా గుండె వేగం 70 నుంచి 170కి పెరిగింది. టెన్షన్‌లో నేనుంటే తను మాత్రం మెరుపులాంటి చిరునవ్వుతో మాయమైంది. ఆ మందహాసమే నా గుండెల్లో అలజడి రేపింది. అందమైన రూపం, ఆకర్షించే నవ్వు పదేపదే గుర్తొచ్చేవి. నన్ను కరుణించడానికా అన్నట్టు అప్పుడప్పుడు మా క్వార్టర్స్‌ దగ్గర ఎదురుపడేది.
కష్టపడి వివరాలు సేకరిస్తే తనూ ఓ డిఫెన్స్‌ అధికారి కూతురని తెలిసింది. సలహా కోసం స్నేహితుల దగ్గరికి పరుగెత్తుకెళ్లా. 'డిఫెన్స్‌లో పనిచేసే అధికారి తన కూతుర్ని ఇంకో ఉద్యోగికిచ్చి పెళ్లి చేయడు. చేద్దామనుకున్నా మిగతా జీవితమంతా ఇదే వాతావరణంలో గడపడానికి ఆ అమ్మాయి ఇష్టపడదు. పైగా ఇద్దరివీ వేర్వేరు భాషలు. వేర్వేరు ప్రాంతాలు. అంతస్తుల్లో తేడా. కాబట్టి తనను మర్చిపోవడమే బెటర్‌' తేల్చేశారు వాళ్లు. అయినా నా మనసు మారలేదు. తను నా ప్రేమను ఒప్పుకుంటుందనే నమ్మకం సడల్లేదు. కానీ అదేం చిత్రమో తను ఎదురుపడితే మాత్రం నోరు పెగలదు. మనసులోమాట చెప్పే సందర్భం కోసం ఎదురుచూస్తే కొత్త సంవత్సరం ఓ కొత్త అవకాశాన్నిచ్చింది. Wish You Happy NewYear అంటూ మొబైల్‌కి మెసేజ్‌ పంపాను. స్పందిస్తే మాటల్లో పెట్టి విషయం చెప్పేద్దామని నా ఆశ. ప్చ్‌... రోజంతా ఎదురుచూపులతోనే గడిచిపోయింది.
మరుసటిరోజు తన నుంచి ఫోన్‌ వస్తుంటే దేవత కరుణించిందనుకున్నా. 'ఆప్‌ కౌన్‌ హై... కల్‌ ఇస్‌ నంబర్‌ సే మెసేజ్‌ ఆయా...' అంటూ ఓ మగ గొంతు మాట్లాడగానే నా గుండె జారిపోయింది. ఆ కంచు కంఠం అమ్మాయి నాన్నది. విషయం నేరుగా ఆయనకే చెబుదామనుకున్నా. కానీ 'ఇది ఆయనకిష్టం లేకపోతే... కోపంతో నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయిస్తే?' వూహించగానే బెదిరిపోయాను. 'రాంగ్‌ నంబర్‌...' అంటూ చేతకాని వాడిలా ఫోన్‌ పెట్టేశా. ధైర్యంలేని నాకు ప్రేమించే అర్హత లేదని అర్ధమైంది. తనను మర్చిపోవాలని పదిహేను రోజులు ప్రయత్నించినా నావల్ల కాలేదు. ఈసారి నేరుగా వాళ్లింటికే బయల్దేరా. తోవలో ఫ్రెండ్‌ చెప్పిన మాటలు విని అక్కడే కుప్పకూలిపోయా.
ఆ అమ్మాయి నాన్నకు బదిలీ అయితే వారం కిందటే వూరొదిలి వెళ్లారట. ఇక తను కనపడదు. ఆ బాధలో అలవాటులేని బార్‌కెళ్లాను. ఎంత తాగానే తెలియదు. తూలుతూనే బండి కిక్‌ కొట్టాను. తీరా కళ్లు తెరిస్తే ఉంది మిలిటరీ ఆసుపత్రిలో. కాలు విరిగింది. భుజం చితికింది. తలకు బలమైన గాయం. రెండ్రోజులు కోమాలోనే ఉన్నా. తిరుపతిలో ఉండాల్సిన అమ్మానాన్నలు నా పక్కన చేరారు. ఇంతకీ నేను ప్రేమించి సాధించిందేంటి? ప్రేమించిన అమ్మాయి కనపడదు. నేను కోలుకొని మళ్లీ ఉద్యోగం చేస్తానో లేదో తెలియదు. అంటే ప్రేమ మోజులో పడి నన్ను నమ్ముకున్న కన్నవాళ్లని నట్టేట ముంచాను. అందుకే అనుభవంతో చెబుతున్నా అందని వాటికోసం అర్రులు చాస్తే నాలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ప్రేమ వ్యామోహంలో పడేముందు మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి.

No comments:

Post a Comment