| రసాయన ఎరువులు భూసారాన్ని పిప్పి చేస్తున్నాయి. సాగునీటి కొరత రైతన్న కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గిట్టుబాటు ధరల్లేవు. ధరలుంటే పంటల్లేవు. సేద్యం ఖర్చులేవో చుక్కల్ని తాకుతున్నాయి. సమస్యలతో, సంక్షోభాలతో బక్కచిక్కిపోతున్న వ్యవసాయరంగాన్ని ఎలాగైనా సరే, బతికించుకోవాలన్నదే రైతు ఆరాటం. ఆ తపనే అతన్ని శాస్త్రవేత్తను చేసింది. రైతు...
పండిందా పండగ.ఎండిందా శ్రమంతా దండగ. అతనికి చేతనైంది సేద్యవెుక్కటే. తాత తండ్రికి నేర్పాడు. తండ్రి బిడ్డకి నేర్పాడు. బిడ్డ మళ్లీ తన బిడ్డకి నేర్పుతాడు. తరాలు మారాయి. సాంకేతిక పరిజ్ఞానం మారింది. ఆ మార్పులన్నీ పల్లెలదాకా వెళ్లడం లేదు. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రయోగ ఫలితాలు రైతుకు అందడం లేదు. శాస్త్రవేత్త...
అద్దాల భవంతుల్లో, ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఏవో ప్రయోగాలు చేస్తుంటాడు. అరలకొద్దీ పుస్తకాలే ప్రపంచం. అక్షరాల నివేదికలతోనే మార్గదర్శనం. కంప్యూటర్ తెర మీద వర్చువల్ పొలాల్ని సృష్టిస్తాడు. గ్రాఫిక్స్‌తో పంటలు పండిస్తాడు. దిగుబడుల డేటాబేస్ చూసుకుని పసిపిల్లాడిలా మురిసిపోతాడు. రైతు బాధలేమిటో, అతనేం కోరుకుంటున్నాడో శాస్త్రవేత్తకు అర్థంకావడం లేదు.
రైతే శాస్త్రవేత్త అయితే...
ఇంకేముంది. పొలం ప్రయోగశాల. బురదమట్టి గాజునాళిక. అటకెక్కిన పాతసామాన్లు పరికరాలూ పనిముట్లూ! అవసరం ఐడియాలిస్తుంది. పరిస్థితులు ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తాయి. తొలి ప్రయోగం విఫలమైనప్పుడు అతను, పట్టువదలని ఎడిసను. తొలి విజయం వరించినప్పుడు అతను, చేతులూపుతున్న సీవీ రామను. అంతలోనే, ఆకాశంలోంచి రాలిపడే నాలుగు చినుకులు, విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మిన్నంటిన చప్పట్లు! చెమటతో రంగుమారిన తలపాగా, పట్టభద్రుడి నల్లటోపీ. విరగబండిన కంకులే వేలవ ుంది ప్రేక్షకులు. 'మనవాడు వెునగాడ్రా!'...పక్కరైతు ప్రశంస ముందు, డాక్టరేటు దిగదుడుపు. పేటెంట్లు కోరుకోడు. పద్మశ్రీలు ఆశించడు. ప్రచారం కోసం మీడియా మేనేజర్ల్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడు. చరిత్ర నిర్లక్ష్యం చేసిన అలాంటి రైతుశాస్త్రవేత్తలు మన మధ్యా ఉన్నారు. వాళ్లను గుర్తిద్దాం, గౌరవిద్దాం. బురదనీటి చందనాలు పూద్దాం. ఎర్రమట్టి గులాల్ చల్లుదాం. సజ్జజొన్నకంకుల పుష్పగుచ్ఛాలిద్దాం. బండెనక బండికట్టి ఊరంతా ఊరేగిద్దాం!
పచ్చగడ్డి సైంటిస్టు
గేదె గడ్డితినకపోతే, రైతుకు తిండి సయించదు. అతనికి తెలుసు, పశువు అనారోగ్యానికి అది గుడ్డిగుర్తు. ఎంత మేలుజాతి పశువైనా సరైన గడ్డి పెట్టకపోతే ఆరోగ్యంగా ఉండదు. పుష్కలంగా పాలివ్వదు. కానీ మన రైతులకు తెలిసిన గడ్డిరకాలు చాలా తక్కువ. రాష్ట్రంలో పాడిపరిశ్రమ పెద్దగా అభివృద్ధి చెందకపోవడానికి ఇదో ప్రధాన కారణం. ఆ గడ్డిపరకతోనే సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించారు కారకాంపల్లి మాధవరెడ్డి. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలంలోని గుండ్లకట్టమంచిలో ఉన్న రెండున్నర ఎకరాల పొలమే ఆయన లేబొరేటరీ. దొడ్లోని పశువులే పరిశోధన సాధనాలు. ఆయన దేశమంతా చుట్టొస్తారు. రకరకాల పశుగ్రాసాలు సేకరిస్తారు. ఆ విత్తనాలు తెచ్చి, పొలంలో పండిస్తారు. ముందుగా తన పశువులకే పెట్టిచూస్తారు. గేదె ఆరోగ్యం, పాల ఉత్పత్తిలో పెరుగుదల, నాణ్యత, ఆ గడ్డి మీద పశువుల ఆసక్తి... తదితర విషయాల్ని అధ్యయనం చేస్తారు. ఒకేరకమైన గడ్డిపెట్టడం కాదు, రకరకాల పశుగ్రాసాల్ని కలిపిపెడితే పాల దిగుబడి మరింత పెరుగుతుందని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అన్నిరకాలుగా సంతృప్తి చెందితేనే ఆ గడ్డిని చుట్టుపక్కల రైతులకు సిఫార్సు చేస్తారు మాధవరెడ్డి. ఇప్పటిదాకా ఆయన వందలాది రకాల్ని పరిశీలించారు. అందులో మన వాతావరణానికి తగినట్టుగా ఉండి, మన అవసరాలకు పనికొచ్చే నలభై రకాల్ని తన పొలంలో పండిస్తున్నారు. వాటి పేర్లేమిటో కూడా చాలామందికి తెలియదు. చుట్టుపక్కలంతా 'మాధవరెడ్డి గడ్డి' అనే వ్యవహరిస్తారు. ఆ కృషి సామాన్యమైంది కాదు. ఏ పరిశోధన సంస్థో చేపట్టాల్సినంత పెద్ద బాధ్యత. పన్నెండేళ్లుగా ఇదే ఆయన ప్రపంచం. మాధవరెడ్డి పరిచయం చేసిన పశుగ్రాసం నిజామాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలకూ విస్తరించింది. చత్తీస్‌గఢ్ నుంచి ఈమధ్యే ప్రతిపాదనలు అందాయి. ఆయనకున్న రెండెకరాల పొలం వెంకటేశ్వర వెటర్నరీ కాలేజీ విద్యార్థుల దృష్టిలో ఓపెద్ద యూనివర్సిటీ. అక్కడికి వెళ్లొస్తే కానీ వాళ్ల చదువు పూర్తయినట్టు కాదు. మాధవరెడ్డి నిరుపేద కుటుంబంలో పుట్టారు. పెద్దపెద్ద చదువులు చదవాలని కలలుగన్నారు. ఆర్థిక పరిస్థితులు ఆరోతరగతి దగ్గరే ఆపేశాయి. చదువైతే ఆగిపోయింది కానీ, జిజ్ఞాస ఆగలేదు. అదే ఆయనతో ప్రయోగాలు చేయించింది. రైతుశాస్త్రవేత్తగా నిలబెట్టింది. పేపర్లో రైతుల ఆత్మహత్య వార్తలు చదివినప్పుడల్లా మాధవరెడ్డి మనసు విలవిల్లాడిపోతుంది. పల్లెపల్లెకూ తిరిగి, 'రైతన్నా! వర్షాభావం, తుపాను బీభత్సం...ఏదో ఓ కారణంతో నీ పంట సర్వనాశనమైపోవచ్చు. నువ్వు అప్పులపాలు కావచ్చు. అంతమాత్రాన ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? నీకెన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయి. ఒక్కసారి నన్ను కలువు. వివరంగా చెబుతాను' అంటూ ఆత్మవిశ్వాస పాఠాలు చెబుతారు.
ఆయిల్‌పామ్ ప్రేమికుడు!
వెుక్కలకు మనసుందని జగదీష్ చంద్రబోస్ గుర్తించారు. ఆ మనసులో స్థానం సంపాదించడం ఎలాగో పర్వతనేని సుబ్బారావు పరిశోధించి తెలుసుకున్నారు. ఆయనది కృష్ణా జిల్లాలోని రేమల్లె. ఆయిల్‌పామ్‌తో ఆ రైతు ప్రేమాయణం ఇప్పటిది కాదు. రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఆ పంటను విరివిగా ప్రచారం చేసింది. చాలామంది లాగానే ఆయనా సంప్రదాయ రకాల్ని పక్కనబెట్టి సరికొత్త పంటమీద పడ్డారు. చాలామందిలో లేనిదీ సుబ్బారావులో ఉన్నదీ ఒకటే... వ్యవసాయం మీద ప్రేమ! చుక్కల్ని తాకుతున్న సేద్యం ఖర్చుల్ని నేలకు దించడానికి ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. సాధారణంగా ఆయిల్‌పామ్ పంట చేతికి రావడానికి ఐదేళ్లు పడుతుంది. అంతకాలం రైతు బతుకుబండి నడిచేదెలా? అందుకే వరి, వెుక్కజొన్న, మిర్చి వంటి రకరకాల మిశ్రమ పంటలతో ప్రయత్నించారు. వేరుశెనగను మిశ్రమంగా వాడి మంచి దిగుబడి సాధించారు. రసాయన ఎరువులూ క్రిమిసంహారకాల జోలికి వెళ్లకుండా, సేంద్రియ పద్ధతుల్ని ఎంచుకోవడం వల్ల మందుల ఖర్చు తగ్గింది. మిశ్రమ పంటలోని ఎండుటాకుల్నీ వ్యర్థాల్నీ సేంద్రియ ఎరువుల తయారీకి వాడుకున్నారు. అందులోనూ వర్మీకంపోస్టు షెడ్ల నిర్మాణానికి చాలానే ఖర్చవుతుంది. దాన్ని తగ్గించడానికి ఆయిల్‌పామ్ చెట్లనీడను ఆశ్రయించారు. దీంతో షెడ్ల భారం తగ్గింది. డబ్బూ శ్రమా ఆదా అయ్యాయి. ఆ పద్ధతి మిగిలిన రైతులకూ నచ్చింది. హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల పల్లెల్లో ఆ పద్ధతినే పాటిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ఇంకో ఉపయోగం ఉంది. ఆయిల్‌పామ్ వెుక్కలు మరీ ఏపుగా పెరగవు. అదే రసాయన ఎరువులు వాడితే, చకచకా పెరిగిపోతాయి. మరీ ఎత్తుగా పెరిగితే, కొట్టేసి కొత్తవెుక్క నాటడం తప్పించి మరో మార్గం ఉండదు. సుబ్బారావుకు ఆ సమస్య ఎప్పుడూ రాలేదు. రసాయనసేద్యంతో పోలిస్తే 30 శాతానికిపైగా అధిక దిగుబడి సాధించి సేంద్రియానికి తిరుగులేదని చాటారాయన. నీటి పొదుపులోనూ సుబ్బారావు తర్వాతే ఎవరైనా. బిందుసేద్యం ద్వారా సగానికి సగం నీటిని పొదుపు చేశారు. వెుత్తంగా ఆయన సేద్యమే రైతన్నలకు ఓ పొదుపు పాఠం, దుబారా తగ్గించుకునే మార్గం. ఆయనేం బిందుసేద్యాన్ని కనిపెట్టలేదు. మిశ్రమ పంటల పద్ధతినీ కొత్తగా పరిచయం చేయలేదు. వాటన్నిటినీ సమర్థంగా మేళవించడంలోనే ఆ రైతుశాస్త్రవేత్త నైపుణ్యమంతా ఇమిడి ఉంది.
ఆయిల్‌పామ్‌కు ఆయన తెచ్చిన గుర్తింపు ఒక ఎత్తు అయితే, ఆయనకు ఆయిల్‌పామ్ ద్వారా వచ్చిన గుర్తింపు మరొక ఎత్తు. ఆయిల్ పామ్ రైతుల జిల్లా సంఘానికీ, రాష్ట్ర సంఘానికీ అధ్యక్షుడిగా వ్యవహరించారు సుబ్బారావు. ప్రస్తుతం జాతీయ స్థాయి సంఘానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇరవై ఎకరాల పొలాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే అసోసియేషన్ కార్యక్రమాలూ పర్యవేక్షిస్తుంటారు. అవగాహన సదస్సులనీ సెమినార్లనీ ఎప్పుడూ ఏదో ఓ పని. ఏడుపదుల పెద్దమనిషికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో? అదేమాట అడిగితే 'వ్యవసాయాన్ని మించిన వ్యాయామం ఏముంది?' అంటూ ప్రశ్నకు ప్రశ్న రూపంలోనే జవాబిస్తారు రేమల్లె మాజీ సర్పంచిగారు!
అవసరమే ప్రేరణ
కేంద్ర ప్రభుత్వ సంస్థ...ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ప్రతినిధులు గత ఏడాది దేశవ్యాప్తంగా రైతన్నల సృజనాత్మక ఆవిష్కరణల మీద అధ్యయనం చేసినప్పుడు...ఎన్నో పేర్లు బయటికి వచ్చాయి. కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగు చూశాయి. వాటి సృష్టికర్తలెవరూ పెద్ద చదువులు చదువుకోలేదు. కనీసం పట్టభద్రులు కూడా కాదు. గణితశాస్త్ర సూత్రాలు తెలియవు. భౌతికశాస్త్ర సిద్ధాంతాలు అర్థంకావు. అవసరం, అవసరమే వాళ్లకు కొత్త ఆలోచననిచ్చింది. ప్రయోగాలకు పురిగొల్పింది. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో గుట్టుగా సేద్యం చేసుకుంటున్న జాయ్ అనే సామాన్య రైతు, ఏకంగా ఓ కొత్తరకం బూడిదగుమ్మడికాయను సృష్టిస్తాడనీ అది 'ఏకలవ్య' పేరుతో ప్రాచుర్యం పొందుతుందనీ జాతీయ అవార్డులు సాధించిపెడుతుందనీ ఎవరు మాత్రం ఊహించారు. ఆ మాటకొస్తే జాయ్ కూడా ఊహించలేదు. తన పొలంలో పండుతున్న బూడిదగుమ్మడికాయలు రకరకాల చిడపీడల దెబ్బకు సర్వనాశనమైపోతుంటే, ఆ యువకుడి మనసు విలవిల్లాడిపోయేది. స్థానికంగా దొరికే రకాలు పురుగుల్ని తట్టుకుంటాయి. కాకపోతే, దిగుబడి తక్కువ. సీమ జాతులేవో మంచి దిగుబడి నిస్తాయి కానీ, మహా నాజూకు. రోగాలకు కుప్పకూలిపోతాయి. రెండింట్లోని మంచి గుణాల్ని మేళవించి 'ఏకలవ్య' రకాన్ని సృష్టించారు జాయ్. కాయ పెద్దగా ఉంటుంది. రుచి బావుంటుంది. రసాయన ఎరువుల అవసరం పెద్దగా ఉండదు. రైతుకు ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికీ ఎంతోకొంత మంచి జరుగుతుంది. జాయ్‌కి ఇప్పుడు దాదాపు ఐదువందలమంది 'ఏకలవ్య' శిష్యులున్నారు.
పంటను పురుగూపుట్రా ఆశించకుండా పచ్చరిబ్బన్లు వేలాడదీయడం మామూలే. కానీ మారుమూల ప్రాంతాల్లో అలాంటి రిబ్బన్లు దొరకవు. దొరికినా, అసలే అప్పుల్లో ఉన్న రైతన్నలకు వాటిని కొనే స్థోమతా ఉండకపోవచ్చు. ఒడిషా రైతు లక్ష్మీధర్ వెుహంతా కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. కుమ్మరి వీధిలో వృథాగా పడున్న చిల్లుల కుండలు తెచ్చారు. వాటికి పచ్చరంగు పూశారు. దాని మీద జిగురులాంటి పదార్థాన్ని అతికించి పొలంలో వేలాడదీశారు. సాధారణంగా పైరుకు హానిచేసే తెల్లదోమలాంటి కీటకాలు పచ్చరంగు ఆకర్షణకు లోనవుతాయి. పొరపాటున కుండను తాకాయా, అంతే సంగతులు! అక్కడే అతుక్కుపోతాయి. ఈ పద్ధతిలో ఘాటైన రసాయనాల అవసరం ఉండదు. రైతుకు మంచిచేసే జీవాలు ఆ దెబ్బకు చచ్చిపోతాయన్న భయమూ లేదు. అదే రైతు ఆవిష్కరణలోని గొప్పతనం. అతనికి శత్రువులెవరో తెలుసు. మిత్రులు ఎవరన్నది కూడా తెలుసు!
వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తోంది. వేతనాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యరైతు ఆ ఖర్చుల్ని తట్టుకోలేకపోతున్నాడు. విధిలేని పరిస్థితుల్లో వ్యవసాయానికే దూరమైపోవాలని ఆలోచిస్తున్నాడు. కూలీ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి పంజాబ్‌రైతు సర్దార్ రచ్‌పాల్‌సింగ్ కూరగాయలు కడిగే యంత్రాన్ని కానుకగా ఇస్తున్నారు. నీళ్లు రావడానికి ఒక పైపు, వెళ్లడానికి ఒకపైపు, మధ్యలో ఓ డబ్బా, దాన్ని గిరగిరా తిప్పేందుకు చిన్న ఇంజిను...ఇదీ యంత్ర నిర్మాణం. పదిమంది కార్మికులకు సరిసాటి. ధర సుమారుగా ఆరేడువేలు. తనకున్న పదెకరాల పొలంలో క్యారెట్లూ కూరగాయలూ పండించుకునే ఈ యువరైతు హైస్కూలు దాకా చదివాడు.
మరో పంజాబీ షేర్ గుర్విందర్‌సింగ్‌నూ పరిచయం చేసుకుని తీరాల్సిందే. రైతులోకానికి అతను చేసిన మేలు తక్కువేం కాదు. ట్రాన్స్‌ఫార్మరు పొలానికి గుండెకాయ లాంటిది. లోడు పెరిగిపోయి అది పేలిపోయిందా, రైతు గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇక దొంగల భయం ఉండనే ఉంది. సెల్‌ఫోన్ సాయంతో పనిచేసే ట్రాన్స్‌ఫార్మర్ పరిరక్షణ యంత్రాన్ని రూపొందించారు గుర్విందర్. కరెంటు లోడు ఎక్కువైనా, ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్‌లో తేమ కనిపించినా వెంటనే రైతుకు సంక్షిప్త సందేశం వెళ్లిపోతుంది. 'చిన్నప్పటి నుంచి మా నాన్న పడుతున్న కష్టాలు చూస్తున్నాను. ఆయనలాంటి రైతుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలోంచే ఈ పరికరం పుట్టింది' అని చెబుతారు గుర్విందర్. అతని ఐటీఐ చదువు ఈ పరిశోధనకు పనికొచ్చింది.
పండ్లతోటలతో ఎప్పుడూ ఓ సమస్య ఉంది. ధరల్లేవని ఓ నాల్రోజులు నిల్వచేసుకుంటే సగానికి సగం సరుకు కుళ్లిపోతుంది. నవ్‌నాథ్ మల్హర్‌కు ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. అవసరమైతే పంటను ఓ రెండుమూడు వారాలు చెట్టుమీదే ఉంచగలిగితే, రైతుకు చాలా కష్టాలు తప్పుతాయి. గిట్టుబాటు ధరలున్నప్పుడే వాటిని తెంపి, మార్కెట్‌కు తీసుకెళ్లవచ్చు. మల్హర్ అభివృద్ధి చేసింది సరిగ్గా అలాంటి రకం సీతాఫలాల్నే. వాటి పేర్లు... అన్నోనా 2, ఎన్‌ఎమ్‌కె 1. రంగూ రుచి అద్భుతంగా ఉంటాయి. గింజలు తక్కువ. గుజ్జు ఎక్కువ. మహారాష్ట్రలోని పది జిల్లాల రైతులు మల్హర్ రకాల్ని పండిస్తున్నారు.
సాదాసీదా టెక్నాలజీ
రైతు ప్రయోగాల్లో గజిబిజి సిద్ధాంతాలుండవు. అర్థంకాని ఈక్వేషన్స్ ఉండవు. కొరుకుడుపడని టెక్నాలజీ ఉండదు. రైతన్న తనకేం అవసరవో దాని గురించే ఆలోచిస్తాడు. తన సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అక్కడే శ్రద్ధపెడతాడు. ఏడోతరగతి దాకా చదివిన త్రిపుర యువతి సఫాలీ దేబ్‌నాథ్ సన్నకారు టొమాటో రైతులకు పెద్ద కష్టమే తీర్చారు. పంటలుంటే ధరలుండవు. ధరలుంటే పంటలుండవు. ఈ తూరుపు పడమరల మధ్య రైతన్న బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. కోల్డు స్టోరేజీలో నిల్వచేసుకునేంత దిగుబడీ స్థోమతా ఎంతమందికి ఉంటుంది? సాధారణ రైతుల కోసం సులువైన నిల్వ మార్గం చెబుతున్నారు సఫాలీ. గాలీవెలుతురూ ధారాళంగా ఉండే గదిలో రెండు వెదురుకర్రలు నాటి, టొమాటో పళ్లను గుత్తులుగా పురికోసతో కట్టి వేలాడదీయాలి. ఈ పందిరి నేల మీంచి ఆరడుగుల ఎత్తులో ఉండాలి. పైకప్పు కంటే రెండడుగులు కింద ఉంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో టొమాటో పంటను మూడు నుంచి నాలుగు నెలలు నిల్వ చేసుకోవచ్చంటారు సఫాలీ. త్రిపురలోని పశ్చిమ జిల్లాలో ఈ పద్ధతి ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. 'నా అనుభవాలే నాకీ ఆలోచననిచ్చాయి' అంటారా మహిళారైతు. నిజానికి పల్లెల్లో పాలూపెరుగే కాదు, రొట్టెలకూ ఉట్టికట్టే సంప్రదాయం ఉంది. దీనివల్ల వాటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఆ సంప్రదాయ టెక్నాలజీని పంటల నిల్వకూ అన్వయించారు సఫాలీ. పదోపాతికో పాడిగేదెలున్న పెద్దరైతు సంగతి వేరు. పాతిక నలభైవేలు పెట్టి యంత్రాలూ గట్రా కొనుక్కుంటాడు. ఒకటిరెండు పశువులతో నెగ్గుకొచ్చే సామాన్యులకు నిన్నవెున్నటిదాకా మరో దారి లేదు. చచ్చినట్టు చేతులతో పాలు పితకాల్సిందే. ముత్తుస్వామి పుణ్యమాని, ఓ ఐదు వేల రూపాయలతో సమస్య పరిష్కారం అయిపోతోందిప్పుడు. ఆ యంత్రంలో అర్థంకాని సాంకేతిక పరిజ్ఞానం ఏమీ ఉండదు. గాలిపంపు టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. మరమ్మతులు కూడా పెద్దగా ఉండవు. ఏదైనా సమస్య వస్తే, స్వయంగా సరిచేసుకోవచ్చు. ఇప్పటి దాకా ముత్తుస్వామి ఒక్క తమిళనాడులోనే వంద యంత్రాలు విక్రయించారు.
శ్రీసాగు పద్ధతిలో వాడే కలుపుతీసే యంత్రం బంకమట్టినేలల్లో అంత సమర్థంగా పనిచేయలేదు. యంత్రానికి మట్టి అతుక్కుపోతుంది. దీనివల్ల పంట వేళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదమూ ఉంది. ఐదెకరాల రైతు షణ్ముగసుందరానికి ఆ సంగతి అర్థంకావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. పాత సామాన్ల దుకాణంలో దొరికే తుక్కంతా పోగేసి 'కేజ్‌వీల్ రకం' కలుపు యంత్రాన్ని ఆవిష్కరించారు. తోటి రైతులకూ అది నచ్చింది. షణ్ముగసుందరం దగ్గర నుంచి అద్దెకు తీసుకెళ్లడం వెుదలుపెట్టారు. పొరుగు గ్రామాలవారూ ఆసక్తి చూపడంతో... మరిన్ని యంత్రాల్ని తయారుచేశారు. ఇప్పుడు తమిళనాడులోని సేలం జిల్లాలోనేకాదు, ఇరుగుపొరుగు ప్రాంతాల్లోనూ షణ్ముగసుందరం యంత్రాలు కనిపిస్తాయి.
పర్యావరణానికి మేలు
రైతుకు ప్రకృతి సౌందర్యం తెలుసు. పర్యావరణం విలువ తెలుసు. తన పంట పండితే చాలనో, తన వల్లో చేపలుపడితే అదే పదివేలనో అనుకునేంత అల్పసంతోషి కాదు. లోకాస్సమస్తా సుఖినోభవంతు...అని ఆశీర్వదించే పెద్ద మనసు అతనిది. ఆ ఆవిష్కరణల్లో ఎక్కడా పర్యావరణానికి ఇసుమంతైనా అపకారం జరగదు. హద్దూ అదుపూలేని చేపలవేట వల్ల, చేపలతోపాటూ అనేక రకాల జలచరాలూ వలలో చిక్కుకుంటున్నాయనీ దీనివల్ల అరుదైన జాతులు అంతరించిపోతున్నాయనీ పర్యావరణ ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తుంటారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని గాలో అనే గిరిజన తెగకు చెందిన న్యాతోరిబా అనే రైతు... స్థానికంగా దొరికే కర్రలతో ఓ కొత్తరకం వలను తయారుచేశారు. చేపలు తప్ప మిగతా జీవులు అందులోంచి సులభంగా బయటికి వెళ్లిపోవచ్చు. నామమాత్రపు ధరే కాబట్టి, ఏ జలచరాలో కొరికేయడం వల్ల వల చిరిగిపోయి, మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉండదు. అందుకే న్యాతోరిబా రూపొందించిన వల అరుణాచల్‌లో అంత ఆదరణ పొందుతోంది.
జీడిమామిడి తోటలో టీ దోమల బెడద అంతాయింతా కాదు. ఎన్ని మందు వదిలిపెట్టవు. ఎర్రచిమలకు ఎరగా వేసే మాంసం ముక్కలూ చేపలే ఇక్కడ పెట్టుబడి. ఇక చెప్పేదేముంది, దెబ్బకు ఠా... టీ దోమలముఠా!
తమిళనాడులోని మెల్లక్కల్ గ్రామానికి చెందిన మురుగేశన్ అరటి పీచుతో తాళ్లు పేనే యంత్రాన్ని తయారు చేశారు. తాళ్లే కాదు, దాంతో బ్యాగులూ పర్సులూ కూడా తయారుచేయవచ్చు. డొక్కు సైకిలే అతని ఆవిష్కరణకు ఆధారం. 'పదమూడేళ్ల వయసు నుంచి సేద్యంలో ఉన్నాను. రైతు ఒక్క వ్యవసాయం మీదే ఆధారపడే పరిస్థితుల్లేవు. ఏదో ఒక అదనపు సంపాదన ఉండాలి. నేనేం చేయగలనా అనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది' అంటారు మురుగేశన్. తొమ్మిదో తరగతితో చదువు ఆపేసిన ఆ రైతుబిడ్డ ఇప్పుడు మదురై జిల్లాలోని నలభై గ్రామాల యువతకు ఉపాధిమార్గం చూపుతున్నారు. మరుగేశన్ వంటి యువరైతుల్ని ప్రోత్సహిస్తే పాలిథిన్‌కు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయడం పెద్ద కష్టమేం కాదు.
జై కిసాన్!
ఆ ఆవిష్కరణలేం యథాలాపంగా పుట్టుకురాలేదు. ఆ విజయాలేం చేదు అనుభవాల్లేకుండా ప్రాణంపోసుకోలేదు. ఎంతోకొంత పెట్టుబడి లేకుండా ప్రయత్నాలు ముందుకు సాగలేదు. సమాజం మాత్రం ఆ రైతు శాస్త్రవేత్తల్ని ప్రశాంతంగా పనిచేసుకోనిచ్చిందా? నవ్వినవాళ్లు నవ్వారు. వెక్కిరించినవాళ్లు వెక్కిరించారు. తొలిరోజుల్లో, పచ్చగడ్డి సాయంతో జీవితాల్ని పచ్చగా మార్చుకోవచ్చని మాధవరెడ్డి చెబుతుంటే, ఆయన మాట ఎవరూ పట్టించుకోలేదు. వెుహం మీదే నవ్వారు. 'ఉన్న కసువు జాలదా...అతనికేం, దుడ్లు మస్తుగ ఉండాయి!' అని వెనక నుంచి తిట్టుకున్నవారే. ట్రాన్స్‌ఫార్మర్‌ను సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేయడం ఎలాగో అధ్యయనం చేయడానికి పదివేలుపెట్టి పరికరాలు కొనలేని పరిస్థితి గుర్విందర్‌సింగ్‌ది.
అయినా ఎవరూ మడమతిప్పలేదు.
రైతు దేశానికి వెన్నెముక.
వెన్నెముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి.
కుమిలిపోకుండా, కుంగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ... సమాజానిది, ప్రభుత్వానిది, వెుత్తంగా మనందరిదీ!
వ్యవసాయం ఖరీదైపోతోంది. ఆ ఖర్చులు భరించలేక పెద్దపెద్ద భూస్వాములే చేతులెత్తేస్తున్నారు. ఇక, చిన్నాచితకా రైతుల బాధ మాటల్లో చెప్పలేను? ఈ పరిస్థితుల్లో పొదుపుగా సేద్యం చేసుకోవడం తప్ప మరో మార్గంలేదు. - పర్వతనేని సుబ్బారావు |
| |
|
No comments:
Post a Comment