మేమున్నామని....

అయినవాళ్లందరికీ దూరంగా వూరు కాని వూళ్లో రాష్ట్రం కాని రాష్ట్రంలో కూలి పనులు చేసే కొన్ని లక్షలమంది వలస కార్మికులకు మేమున్నామని భరోసా ఇచ్చారు వాళ్లు.
రాజస్థాన్‌లోని ఓ కుగ్రామం నుంచి అహ్మదాబాద్‌కు వలస వెళ్లాడు ఇందర్‌సింగ్‌. హోటల్లో పనిచేస్తూ, అక్కడే ఉంటున్నాడు. అతడు డబ్బుని హోటల్లో తానుండే చిన్న గదిలోనే దాచుకునేవాడు. చాలాసార్లు దొంగతనాలు జరగడంతో తన షూలో దాచుకోవడం వెుదలుపెట్టాడు. ఎవరూ కనిపెట్టలేదనుకున్నాడు గానీ ఎలుకలకు తెలిసిపోయింది. ఓసారి రెండువేల రూపాయలను ఎందుకూ పనికిరాకుండా కొరికేశాయి. వాటిని చూసినప్పుడు అతడి ముఖంలో కన్నీళ్లొక్కటే తక్కువ. పరాయి రాష్ట్రంవాడు కావడం వల్ల 'గుర్తింపు కార్డులు' ఇవ్వలేమని తేల్చేశాయి స్థానిక సంస్థలు. అందువల్ల బ్యాంకు అకౌంటూ రాలేదు. తన కుటుంబానికి డబ్బు పంపాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. వాళ్లు చాలా ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేవాళ్లు. ఒక్కోసారి పంపకుండా వోసం చేసేవాళ్లు కూడా.
గాంధీనగర్‌ ప్రాంతంలో చిన్నచిన్న హోటళ్లలో పనిచేస్తున్న 46 మందిది మరీ దీనగాథ. రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన ఆ కార్మికులు ఏడేళ్లుగా అక్కడ పనిచేస్తున్నా జీతాలు పెంచలేదు. పెంచాల్సిందిగా అడిగారని వాళ్లందరినీ బెదిరించి, హోటళ్ల నుంచి గెంటేశారు. వాళ్లంతా రోడ్డునపడ్డారు. వాళ్లలో ఏ ఒక్కరికీ బ్యాంకు అకౌంటు లేదు. మరో పని చేతకాదు. ఎలాంటి గుర్తింపు కార్డులూ లేవు. తమకు జరిగిన వోసాన్ని ఎలా ప్రశ్నించాలో తెలియదు. ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి, దోపిడీకి గురయ్యే వలస కార్మికులు ఎందరో!
వీళ్లందరి కోసమే ఆజీవికా ఫౌండేషన్‌ ఏర్పడింది. దీని వ్యవస్థాపకుడు రాజస్థాన్‌కు చెందిన రాజీవ్‌ ఖండేవాల్‌. అతడు ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగి. తన ఆఫీసు పక్కనే ఉండే పనిచేసే భవన నిర్మాణ కార్మికులు కూలి డబ్బులు దాచుకునే పరిస్థితి లేకపోవడం, యజమానులు వాళ్లను దోచుకోవడం... ఆయన్ను ఆలోచింపజేశాయి. వాళ్లందరిలోనూ చైతన్యం తెచ్చి, కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడు. అలా 2005లో 'ఆజీవికా ఫౌండేషన్‌' ప్రారంభించారు. గుర్తించలేదు... నైపుణ్యమూ లేదు
వలస కార్మికుల సమస్యల్లో వెుదటిదీ అతి ముఖ్యమైనదీ గుర్తింపు కార్డు. అది లేకపోవడంతో... వాళ్లు పనిచేసే ప్రాంతాల్లో యజమానులు వాళ్లను అనేక రకాలుగా దోచుకుంటారు. 'చాలావరకూ వలస కార్మికులు భవన నిర్మాణ పనులూ వంటపనులూ డ్రైవింగ్‌లాంటివి చేసి బతుకుతారు. వీరికి జీతాలిచ్చేటప్పుడు ఎలాంటి లెక్కాపత్రమూ ఉండవు. మరికొన్ని సందర్భాల్లో... ఆ ప్రాంతంలో ఏవైనా నేరాలూ ఘోరాలూ జరిగినప్పుడు పోలీసుల దృష్టి సమీపంలో ఉండే వలస కార్మికులమీదకే వెళ్తుంది. అప్పుడు వాళ్లకు మేం ఫలానావాళ్లం అని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ ఉండదు' అంటారు రాజీవ్‌.
మనదేశంలో వలస కార్మికుల సంఖ్య 10 కోట్లకుపైనేనని అంచనా. వీరిలో కేవలం 22 శాతం మందికే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ మైక్రోఫైనాన్స్‌ అధ్యయనం. ఇందుకు ప్రధాన కారణం... అధికారిక గుర్తింపు కార్డులు లేకపోవడమేనట.
ఇక, రెండోది... నైపుణ్యం. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే కార్మికుల్లో సగానికిపైగా సదరు పనిలో నైపుణ్యం లేనివాళ్లే.
వలస కార్మికుల సమస్యల్లో మరో ముఖ్యమైనది... ఆరోగ్యం. అపరిశుభ్ర ప్రదేశాల్లోనే వంటలూ భోజనాలూ చేయడం వల్ల సంపాదనలో సగం వైద్య ఖర్చులకే సరిపోతుంది. ఇంటికి డబ్బు పంపే మార్గాలూ తెలియవు. ఈ సమస్యలన్నింటినీ ఆజీవికా గుర్తించింది.
కార్డులిచ్చారు... శిక్షణా ఇచ్చారు వలస కార్మికులను ఆజీవికా ఫౌండేషన్‌ సభ్యులే గుర్తిస్తారు. స్థానిక సంస్థల సాయంతో వాళ్లందరికీ ఫొటో గుర్తింపు కార్డులు వచ్చేలా కృషి చేస్తారు. ఆ కార్డులతో వాళ్లకు బ్యాంకు అకౌంటు వచ్చేలా చేస్తారు. ఇప్పటివరకూ రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో 50వేల మందికి గుర్తింపు కార్డులిచ్చారు. అయితే వారిలో కేవలం వెయ్యిమందికే బ్యాంకులు అకౌంట్లు ఇచ్చాయి. మిగతావాళ్లకూ అకౌంట్లు ఇప్పించేందుకు 'ఆజీవికా' ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంది. వలస కార్మికులను వాళ్ల వాళ్ల యజమానులు డబ్బులివ్వకుండా వోసం చేసినా, మహిళా కార్మికులపై అత్యాచారాలకు పాల్పడినా ఆజీవికా వాళ్లకు న్యాయ సహాయం చేస్తుంది.
ఆజీవికాలో నిరుపేద నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, తాపీపని, వెల్డింగ్‌ లాంటి అనేక అంశాల్లో శిక్షణ ఇస్తారు. అది పూర్తయ్యాక వాళ్లే ఉద్యోగాలిప్పిస్తారు. వలస కార్మికుల కోసం ఇటీవలే 'సామాజిక వంటశాలలు' ఏర్పాటుచేసింది ఆజీవికా. ఇందులో భాగంగా ఓ గదిలో గ్యాస్‌ స్టౌలు ఏర్పాటుచేస్తారు. సామాన్లూ కూరగాయలూ బియ్యమూ తెచ్చుకుని కార్మికులు ఇక్కడే వండుకోవచ్చు. రోజుకు అయిదు రూపాయలు చెల్లిస్తే చాలు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది.
'మేం గతంలో కిరోసిన్‌, కట్టెలూ ఉపయోగించి, ఎక్కడ ఉంటే అక్కడే వంట చేసేవాళ్లం. అందువల్ల ఎప్పుడూ ఆరోగ్య సమస్యలే. ఈ వంట గదులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. 'ఆజీవికా' వాళ్లు మాకు గుర్తింపు కార్డులిచ్చారు. బ్యాంకు అకౌంట్లు ఇచ్చారు. మా పిల్లలకు మంచి ఉద్యోగాలిచ్చారు. మేం మంచి భోజనం తినేలా చేస్తున్నారు. వీళ్లే లేకపోతే మా జీవితాలు ఎలా ఉండేవో?' అంటున్నప్పుడు 30 ఏళ్ల మీనా కళ్లల్లోని ఆనందం ... ఆజీవికాకు ఇంతకంటే ప్రశంస ఏముంటుంది.
నిజమే... ఎంతోమంది వలస కార్మికులకు 'ఆజీవికా' పునర్జన్మ ప్రసాదించింది. త్వరలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ శాఖలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరెంతోమందికి వారి సేవలు అందాలని ఆశిద్దాం.

PREVIOUS NEXT


No comments:

Post a Comment