తెలుగు 'నటరాజు' కన్నుమూత


తెలుగు 'నటరాజు' కన్నుమూత
పేరిణి శివతాండవం, ఆంధ్రనాట్యం రూపకర్త రామకృష్ణ మృతి 
 కళాదిగ్గజం నేలరాలింది... తెలుగువారి ప్రాచీన నాట్యకళారీతులకు తిరిగి జీవంపోసి... ఆరు దశాబ్దాలుగా దశదిశలా వ్యాపింపజేసిన భరత కళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్‌ నటరాజ రామకృష్ణ మంగళవారం ఉదయం మరణించారు. ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం వంటి నాట్య రీతులకు వూపిరిలూదిన ఆయన వయసు 88 సంవత్సరాలు. వేలాది మందికి శిక్షణనిచ్చిన ఈ నాట్యగురువు... ఐదారేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతనెల 26న పరిస్థితి విషమించడంతో శిష్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆయన కన్నుముశారు. భౌతికకాయాన్ని శిష్యగణం సందర్శనార్థం బేగంపేటలోని కళాకృష్ణ అనే శిష్యుని నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. కళకే అంకితమైపోయిన రామకృష్ణ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. సోదరి, సోదరుడు చాన్నాళ్ల క్రితమే చనిపోయాగా శిష్యుల నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు.ప్రఖ్యాత నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ మృతికి పలువురు నివాళులు అర్పించారు. ఆంధ్రనాట్యానికి, పేరిణి నృత్యానికి, కూడిపూడి సంప్రదాయరీతులకు రామకృష్ణ విశేష ప్రాచుర్యం కల్పించారని, ఆయన మృతి కళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నాట్యాన్నే జీవిత సర్వస్వంగా చేసుకొని ఆరు దశాబ్దాలుగా కళామతల్లికి విశేష సేవలందించిన కళాదిగ్గజం అని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. కళను, సునిశిత మేధస్సును రంగరించి ఆయన చేసే పేరిణి శివతాండవం నృత్యరూపకం అద్భుతమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. నటరాజ రామకృష్ణ అస్తమయం కళా ప్రపంచానికి తీరనిలోటని, తెలంగాణ నృత్య విశేషం 'పేరిణి'ని పునరుజ్జీవింపజేసిన మహానాట్యాచార్యుడు అంటూ తెరాస అధ్యక్షులు కేసీఆర్‌ తన సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు తారామతి బారాదరి వద్ద ప్రభుత్వ లాంఛనాలతో రామకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రమణమూర్తి తెలిపారు.

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..
చిన్ననాటే 'నటరాజు' బిరుదాంకితుడైన రామకృష్ణ పూర్వీకులది కోనసీమ ప్రాంతం. అప్పట్లో ఇండోనేషియాకు వలసపోయారు. 1923 మార్చి 21న బాలి ద్వీపంలో రాంమోహన్‌రావు, దమయంతి దంపతులకు రామకృష్ణ జన్మించారు. తల్లిది నల్గొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాక. రామకృష్ణ చిన్నతనంలోనే ఆమె మృతిచెందారు. తర్వాత ఆయన కుటుంబం ఇండోనేషియా నుంచి చెన్నైకి వచ్చేసింది. పదో ఏట నుంచే నాట్యంపై మక్కువ ఉండేది. గజ్జెలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఎండిన తుమ్మకాయలను కాళ్లకు కట్టుకుని నాట్యం అభ్యసించేవారు. క్రమంగా సోదరుడి సాయంతో ప్రసిద్ధ కళాకారుల వద్ద నాట్యశాస్త్రాన్ని అభ్యసించారు. భరతనాట్యంతో ప్రారంభించి ఎన్నో నృత్యరీతులను నేర్చుకున్నారు. జీవితాన్ని కళకే అంకితం చేసిన ఆయన ఆజన్మ బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. చెన్నై నుంచి ఆరు దశాబ్దాల క్రితం తెలుగుగడ్డపై అడుగుపెట్టారు. శ్రీకాళహస్తిలో ఎక్కువ కాలం నాట్యశిక్షణ పొందారు. పుట్టింది ఇండోనేషియాలో... పెరిగింది చెన్నైలో... చదువంతా నాగపూర్‌లో... కాని ఆయన జీవితమంతా తెలుగుకళకే అంకితం చేయడం విశేషం.నాట్యరీతులకు పునరుజ్జీవనం
*స్వయంగా నాటకాలు రచించి ప్రదర్శిస్తూ, ఎంతోమంది కళాకారులకు శిక్షణనిస్తూ గడిపేవారు రామకృష్ణ. ఆయన సృష్టించిన అద్భుతమైన నాట్య ప్రక్రియల్లో 'నవ జనార్దన పారిజాతం' విశేష జనాదరణ పొందింది.
*దేవదాసీ చట్టం అమల్లోకి రావడంతో దేవదాసీలు కనుమరుగయ్యారు. ఆ నృత్యరీతులు కూడా తెరమరుగయ్యాయి. అలాంటి సమయంలో అద్భుతమైన ఆ నాట్య ప్రక్రియకు తిరిగి జీవం పోయాలనే సంకల్పంతో నటరాజ రామకృష్ణ ఊరూరా తిరిగి నృత్య కళాకారిణులను సంఘటితపరచి, సంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేసి 'ఆంధ్రనాట్యం' పేరిట దానిని తిరిగి తెలుగునాట సుస్థిరం చేశారు.
*700 ఏళ్ల క్రితం మరుగున పడిన కాకతీయుల కాలం నాటి 'పేరిణి శివ తాండవం' నృత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఏ ప్రభుత్వమూ, పాలకులూ, అకాడమీలూ, విశ్వవిద్యాలయాలూ చేయని పనిని రామకృష్ణ చేసి చూపించారు. పురుషులు మాత్రమే చేసే ఈ నృత్యాన్ని నృత్యరత్నావళి గ్రంథం ద్వారా తెలుసుకుని విశేష ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఆయన చేసిన ఓ అద్భుతం. ఆ స్ఫూర్తితోనే తర్వాత అనేక వందలమంది మగపిల్లలు గజ్జెకట్టి రంగస్థలంపైకి చేరారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడాయన శిష్యులు, ప్రశిష్యులు దేశవిదేశాల్లో వేలాదిగా ఉన్నారు.
*నాట్య కళారీతులపై వందలాది వ్యాసాలతోపాటు నలభైకి పైగా గ్రంథాలను, ఒక పరిశోధనాత్మక గ్రంధాన్ని ఆయన రచించారు.
పద్దెనిమిదో ఏటనే నటరాజు...
*మహారాష్ట్రలోని బందార సంస్థానం రాజాగణపతి పాండ్య 18వ ఏటనే రామకృష్ణను 'నటరాజ' బిరుదుతో సత్కరించారు. అప్పటినుంచి అది ఆయన సార్థకనామధేయమైంది.
*1968లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 'భరత కళాప్రపూర్ణ బిరుదు'తో గౌరవించింది.
*1980లో శ్రీశైల దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఏడాది ఆస్థాన నాట్యాచార్యునిగా నియమించింది.
*కళాప్రపూర్ణ, కళాసరస్వతి, రాజ్యలక్ష్మి అవార్డులు అందుకున్నారు.
*1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ 'దక్షిణ భారత ఉత్తమ నాట్యాచార్యుడు' బిరుదుతో సత్కరించింది.
*వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
*కేంద్ర ప్రభుత్వం 1992లో 'పద్మశ్రీ'తో గౌరవించింది.

No comments:

Post a Comment