బ్యాంకు కొలువుకు సిద్ధమవుదాం

బ్యాంకు కొలువుకు సిద్ధమవుదాం ఎస్‌. అరుణ్‌మోహన్‌
డైరెక్టర్‌, బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌
బ్యాంకింగ్‌ నియామకాలు జోరుగా సాగుతున్న తరుణంలో ఎస్‌బీఐ నుంచి 1000 పీఓ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారందరూ పరీక్ష రాయవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఎలా సంసిద్ధమవ్వాలో పరిశీలిద్దాం!
ఎస్‌.బి.ఐ. పీఓ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు (గడువు జూన్‌ 9) చేసుకునేటప్పుడు కేటగిరీ కాలమ్‌ నింపడానికి కోడ్‌లు ఉన్నాయి. ఆయా కేటగిరీ అభ్యర్థులు తమ విభాగానికి సంబంధించిన కోడ్‌ను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాలలో పరీక్ష కేంద్రాలున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రొబేషనరీ కాలపరిమితి రెండేళ్లు. నెల జీతం ప్రారంభంలో అన్నీ కలిపి రూ. 27,800 వరకు ఉంటుంది. ఎస్‌.బి.ఐ. పరీక్షకు హాజరయ్యే విషయంలో పరిమితి ఉంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు నాలుగుసార్లు, ఓబీసీ వారు 7 సార్లు మాత్రమే రాయడానికి వీలుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి పరిమితులూ లేవు.
ఎంపిక ప్రక్రియ
ఇది రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ రాత పరీక్ష. రెండో దశ గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ. జులై 24న జరిగే రాత పరీక్షలో 200 మార్కులకు 2 గంటల కాల వ్యవధిలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష జరుగుతుంది. 50 మార్కులకు గంట వ్యవధిలో డిస్క్రిప్టివ్‌ పరీక్ష జరుగతుంది.
ఆబ్జెక్టివ్‌ పరీక్షలో 4 విభాగాలుంటాయి.
1. ఇంగ్లిష్‌ లాంగ్వేజి: ఇతర బ్యాంకు పీఓ పరీక్షల లాగే ఎస్‌బీఐలో కూడా ఇంగ్లిషు విషయంలో గ్రామర్‌, వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లదే ప్రధాన పాత్ర. గ్రామర్‌లో ప్రాథమికాంశాల ప్రిపరేషన్‌ ముఖ్యం. ప్రాక్టీసు చేయడం ద్వారా కాంప్రహెన్షన్‌పై పట్టు పెంచుకోవచ్చు. ఎస్‌.బి.ఐ. పరీక్షలో ఇంగ్లిషులో వచ్చిన మార్కులు మెరిట్‌ ర్యాంకింగ్‌ కోసం పరిగణిస్తారు.
2. జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌ : జనరల్‌ అవేర్‌నెస్‌ బిట్స్‌ కోసం అప్‌డేట్‌ చేసుకునే సమాచారంతోనే మార్కెటింగ్‌ అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. దీనికోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్‌, మెటీరియల్‌ సేకరణ అంతగా అవసరం లేదు. ప్రతిరోజూ ఆర్థిక సంబంధమైన ఒక వార్తాపత్రిక ఉదా. బిజినెస్‌ లైన్‌, ఎకనామిక్‌ టైమ్స్‌లతో పాటు బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌ లాంటి మ్యాగజీన్లు చదవటం మేలు.
3. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: మిగిలిన విభాగాలతో పోలిస్తే అభ్యర్థి ఈ విభాగంపై ఎక్కువ శ్రద్ధ, సమయం పెట్టవలసి వస్తుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రిపరేషన్‌లో హైఎండ్‌ అంశాలు ఇవి. ప్రాథమికంగా అర్థమెటిక్‌ అంశాల ప్రిపరేషన్‌పై పట్టు సాధించిన తరవాత ఇచ్చిన డేటాను సమర్థంగా విశ్లేషించగలుగుతారు. విశ్లేషించిన సమాచారాన్ని ప్రజెంట్‌ చేయడానికి సృజనాత్మకత కొంతమేరకు అవసరం అవుతుంది. కాబట్టి ఈ విభాగం విషయంలో అభ్యర్థి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి సాధన చేయాల్సి ఉంటుంది.
4. రీజనింగ్‌ (హైలెవెల్‌): పూర్తిగా లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌దే పాత్ర. అభ్యర్థి విశ్లేషణాత్మక, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ విభాగపు ముఖ్య ఉద్దేశం. అభ్యర్థిలో ఉన్న తార్కిక ప్రతిభను ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. ప్రాథమిక స్థాయి రీజనింగ్‌ ప్రిపరేషన్‌ మాత్రమే కాకుండా స్టాండర్డ్‌ పుస్తకాల ప్రిపరేషన్‌ ద్వారా సన్నద్ధమవ్వాలి.
డిస్క్రిప్టివ్‌ పేపరు విషయంలో ఎస్‌.బి.ఐ. పీఓ పేపరుకూ, ఇతర బ్యాంకు పీఓ పేపరుకూ వ్యత్యాసం ఉంది. ఇతర బ్యాంకు పీఓ పేపర్లలో మాదిరిగా ఆర్థిక సామాజిక విషయాలపై కాకుండా ఎస్‌.బి.ఐ. పీఓలో డిస్క్రిప్టివ్‌ పేపరు ఇంగ్లిషు లాంగ్వేజికి సంబంధించి ఉంటుంది. వ్యాసరచన, లెటర్‌ రైటింగ్‌, కాంప్రహెన్షన్‌ మొదలైన అంశాల ప్రశ్నలుంటాయి.
ప్రణాళికాబద్ధంగా కృషి చేసి సన్నద్ధమైతే రాతపరీక్షలో నెగ్గి, గ్రూప్‌డిస్కషన్‌, ఇంటర్వ్యూ దశల్లోకి దూసుకువెళ్ళ గలుగుతారు.
.
ఇలా సన్నద్ధం కండి! జి.ఎస్‌. గిరిధర్‌
డైరెక్టర్‌, RACE
డేటా ఎనాలసిస్‌, ఇంటర్‌ప్రెటేషన్‌లో Reading comprehension passageని చదివి అర్థం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయాల్సివుంటుంది. అలాగే డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లో passageకి బదులుగా డేటా, గ్రాఫ్‌లు, ఛార్టులు, పట్టికల రూపంలో ఉంటాయి; దానికి సంబంధించిన ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది. ఈ విభాగం పీఓ పరీక్ష రాసేవారికి కొత్తదేమీ కాదు. ఇతర పీఓ పరీక్షల్లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లోని 50 ప్రశ్నల్లో 20-25 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి ఉంటాయి. ఎస్‌.బి.ఐ. పరీక్షలో 45 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచీ, 5 ప్రశ్నలు permutations and combinations, probability నుంచి ఉంటాయి. అభ్యర్థులు వివిధ రకాలైన గ్రాఫులు- అంటే బార్‌ డయాగ్రమ్‌, లైన్‌ గ్రాఫ్‌, పై-ఛార్ట్స్‌, టేబుల్స్‌ గురించి తెలుసుకోవాలి. అంకగణితం (Arithmetic)లోని అంశాల మీద పట్టు సాధించాలి. ముఖ్యంగా శాతాలు, సరాసరి, నిష్పత్తులు, లాభం-నష్టం మీద అవగాహన ఉండాలి.
సూక్ష్మీకరణలు త్వరగా చేయగలగాలి. అందుచేత స్పీడ్‌ మ్యాథ్స్‌ లాంటివి నేర్చుకుంటే మంచిది. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ బాగా సాధన చేసి, కొన్ని ప్రశ్నలను పెన్ను ఉపయోగించకుండా గ్రాఫులను చూసినంతనే జవాబు గుర్తించేలా తయారవ్వాలి.
జనరల్‌ ఇంగ్లిష్‌
ఈ విభాగం ఎస్‌.బి.ఐ. పీఓ పరీక్షలో చాలా ముఖ్యమైంది. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌... రెండు టెస్టుల్లోనూ ఈ విభాగముంది. డిస్క్రిప్టివ్‌ టెస్టు మార్కులను కూడా ఎంపిక ప్రక్రియలో పరిగణిస్తారు. అందువల్ల దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
విద్యార్థులు వ్యాకరణం (Grammar)మీద పట్టు పెంచుకోవాలి. గత ప్రశ్నపత్రాలను చూసి సరళిని గమనించి ఆ ప్రకారం సాధన చేయాలి. చాలామంది Reading comprehensionలోని ప్రశ్నలను సాధించడానికి 10-15 నిమిషాల సమయం తీసుకుంటారు. దీన్ని 5 నిమిషాల్లోపే పూర్తిచేయగలగాలి. చదివే వేగం పెరిగేలా చూసుకోవాలి. ఆంగ్ల వార్తాపత్రికలు చదవడం వల్ల కరెంట్‌ అఫైర్స్‌ను కూడా కవర్‌ చేయవచ్చును.
జనరల్‌ అవేర్‌నెస్‌
కరెంట్‌ అఫైర్స్‌లో బ్యాంకింగ్‌, ఆర్థిక అంశాలతో పాటు మార్కెటింగ్‌, కంప్యూటర్లకు సంబంధించిన వివరాలను కవర్‌ చేస్తూ గత 6-8నెలల పరిణామాలను బాగా చూసుకోవాలి. ఈ రెండు సబ్జెక్టుల్లో ప్రాథమికాంశాల మీద బాగా అవగాహన పెంచుకోవాలి. Different types of marketing, consumer behaviour, product life cycle వంటి వాటి గురించి లోతుగా తెలుసుకోవాలి. బాగా స్కోర్‌ చేయగలిగే విభాగం కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, రీజనింగ్‌ విభాగాలలోని వివిధ టాపిక్స్‌పై ముందుగా అవగాహన పెంచుకొని అంశాల వారీగా ప్రశ్న జవాబులను సాధన చేయాలి. ఆపైన అన్ని టాపిక్స్‌కు సంబంధించిన Mixed bag of questions practiceచేయాలి. ప్రతిరోజూ అన్ని విభాగాలు కవర్‌ చేసే విధంగా క్రమబద్ధంగా, స్థిరంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ఎస్‌.బి.ఐ. పరీక్షకున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు 15- 20 రోజుల ముందు టాపిక్స్‌ అన్నింటినీ పూర్తిచేసి ఆపై పూర్తిగా పరీక్షా విధానంలో ప్రాక్టీస్‌ చేయాలి. ఆబ్జెక్టివ్‌ టెస్టులోని 2 గంటల సమయాన్ని 4 విభాగాలకు సబ్జెక్టు క్లిష్టత, ప్రశ్నల సంఖ్య ఆధారంగా విభజించుకోవాలి. General awareness 15 నిమిషాలలో... ఇంగ్లిష్‌ని 20 నిమిషాలలో పూర్తి చేసేవిధంగా సాధన కొనసాగాలి. గణిత ప్రశ్నలు అర నిమిషంలో సాధించేలా పరిణతి సాధించాలి.రోజుకు కనీసం ఐదారు గంటలు తగ్గకుండా సాధన కొనసాగిస్తే ఫలితం ఉంటుంది.


 

No comments:

Post a Comment