ఆహార భద్రత.. భారత్ అనుసరించాల్సిన వ్యూహాలు

ఆర్థిక ప్రణాళికల ముఖ్య లక్ష్యం.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరిపడ పౌష్టికాహారాన్ని అందించడమే. ఆహార భద్రత అనే పదం 1970 వరకు ఆహార భద్రత, ఆహార స్థిరీకరణ వంటి అంశాలకే పరిమితమైంది. కానీ ఇటీవలి కాలంలో దీని పరిధి పెరిగింది. ఆహార ఉత్పత్తిలో పెరుగుదల సాధించడమే కాకుండా దేశంలో అట్టడుగువర్గాల ప్రజల్లో చివరి సభ్యుడికి కూడా పౌష్టికాహారాన్ని అందించడమే ప్రస్తుతం ఆహార భద్రతగా భావిస్తున్నారు.

భారతదేశంలో ఆహార భద్రత అతి ముఖ్యమైంది. ఒక వైపు దేశ ఆర్థిక వృద్ధి రేటులో గణ నీయ పెరుగుదల నమోదవుతుండగా.. మరోవైపు 46శాతం మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికీ 27శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖ దిగువన నివసిస్తున్నారు. ఆహార సమస్య ఏర్పడడానికి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉండడం, ధరల పెరుగుదల, ఆహార ధాన్యాల నిల్వ వంటి అంశాలను ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. దేశంలో ఆహార భద్రత స్వభావాన్ని పరిమాణాత్మకం, గుణాత్మకం, పంపిణీ పరంగా, ఆర్థికంగాను పరిశీలించవచ్చు.


స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు (successive governments) ఆహార సరఫరా పెరుగుదల, ఆహార భద్రత సాధించడంపై ప్రముఖంగా దృష్టి సారించాయి. 1960, 70లలో హరిత విప్లవం కారణంగా ధనాత్మక ప్రభావం కనిపించిన దేశాల్లో.. భారత్ ఒకటి. ప్రాంతాల పరంగా చూస్తే.. ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలు మంచి పురోగతిని సాధించాయి. పంటల విషయానికొస్తే వరి, గోధుమల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. శ్వేత విప్లవం (వైట్ రెవల్యూషన్) కారణంగా పాల ఉత్పత్తిలో ఇదేవిధమైన ప్రగతి సాధించామని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


పెరుగుతున్న డిమాండ్:

భవిష్యత్తులో.. అధిక జనాభా, అధిక ఆదాయాలు ఆహార ఉత్పత్తుల డిమాండ్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. ఇటీవల అనుభవపూర్వక ఆధారాల ప్రకారం దేశంలో..2010-30 మధ్య కాలంలో కొన్ని ఆహార పంటల విషయంలో సరఫరా కంటే డిమాండ్ పెరుగుదల ఎక్కువగా ఉండగలదని అంచనా. 2011లో తృణ ధాన్యాల(ఛ్ఛిట్ఛ్చట) విషయంలో 21.2 టన్నుల మిగులు ఉత్పత్తి నమోదైతే 2026 నాటికి వీటి సరఫరా అవసరమైన డిమాండ్ కంటే తక్కువగా ఉండగలదని అంచనావేస్తున్నారు.

జాతీయంగాను, అంతర్జాతీయంగాను 2010వ సంవత్సరంలో పెరిగిన ఆహార ధరలు ఆహార భద్రత సాధించే విషయంలో‘ప్రభుత్వ విధానాల’ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. 2010 చివరి నాటికి ఆహార ద్రవ్యోల్బణం 18 శాతానికి చేరుకుంది. 1980కి ముందు భాగంలో వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నాయి. ఈ చర్యల ఫలితంగా 1980లలో ఆహార ఉత్పత్తుల్లో పెరుగుదల సాధ్యమైంది.


1990లలో వ్యవసాయరంగంలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఉత్పాదకత పెరుగుదల స్తంభించింది. ఒక ముఖ్య ఉత్పాదక వనరుగా భూమిని వినియోగించుకునే క్రమంలో నీటి లభ్యత ప్రధానమైంది. ప్రపంచంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఉన్న మొదటి పది దేశాల్లో భారత్ ఒకటి. 1997లో తలసరి నీటి లభ్యత 1957 క్యూబిక్ మీటర్లు. సబర్మతి బేసిన్ ప్రాంతంలో తలసరి నీటి లభ్యత 360 క్యూబిక్ మీటర్లు. కాగా బ్రహ్మపుత్ర, బరాక్ బేసిన్‌లలో 16,589 క్యూబిక్ మీటర్లు.


పెరుగుతున్న జనాభాకు అనుపాతంగా రైతుల సంఖ్య పెరగకపోవడానికి వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రారంభంలో ఉత్పాదకత పెరిగినప్పటికీ.. తర్వాతి కాలంలో భూసార నాణ్యత తగ్గుదల, పర్యావరణ సమతుల్య దెబ్బతినడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. రైతులకు అధిక ఆదాయం పట్ల పెరిగిన వ్యామోహం, అధిక లాభాలు, ఆధునిక పరిజ్ఞానం దుర్వినియోగం వెరసి.. ఆహార ఉత్పత్తులు మరింత ప్రియం అయ్యాయి. దాంతోపాటు నాణ్యత కూడా తగ్గింది.


బ్రెజిల్-భారత్:

వ్యవసాయరంగ నిర్మాణత, వ్యవసాయదారుల వర్గీకరణకు సంబంధించి భారత్-బ్రెజిల్‌ల మధ్య తేడా ఉన్నప్పటికీ..ఈ రెండు దేశాల్లోను మొత్తం జనాభాలో ‘లక్షిత గ్రామీణ గ్రూపులు’ ముఖ్యంగా చిన్నతరహా ఉత్పత్తిదారులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నారు. రైతుల జీవన ప్రమాణాలు పెంచే దిశగా.. ఈ రెండు దేశాలు ‘పెద్ద తరహా సేకరణ కార్యక్రమాల’ను అమలు చేస్తున్నాయి. అంతేకాకుండా ‘ప్రయోజనకరమైన మార్కెట్ ప్రత్యామ్నాయాల’ను రైతులకు కల్పిస్తున్నాయి.

భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా ‘మధ్యాహ్నా భోజన కార్యక్రమాన్ని’ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దాదాపు 110 మిలియన్ మంది పిల్లలకు ప్రతిరోజు పాఠశాల పని దినాల్లో ఒక సారి ఆహారాన్ని అందించడం ద్వారా ఆహార భద్రతకు ప్రయత్నిస్తుంది. బ్రెజిల్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన విద్యార్థులకు ‘నేషనల్ స్కూల్ ఫీడింగ్ కార్యక్రమం’ద్వారా ప్రతిరోజు 47 మిలియన్ల మంది విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తుంది. వీరు ఆ దేశ జనాభాలో 1/4వ వంతు.


భారత్ లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 160 మిలియన్ కుటుంబాలకు బియ్యం, గోధుమ, పంచదార, కిరోసిన్‌ను నెలవారీ ప్రాతిపదికన దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సరఫరా చేస్తుంది. బ్రెజిల్ కూడా ‘ఫుడ్ అక్విజిషన్ ప్రోగ్రామ్’ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 13 మిలియన్ల కుటుంబాలకు ముఖ్య ఆహార ఉత్పత్తులను ఉచితంగా అందిస్తూ ఆహార భద్రత సాధించడానికి ప్రయత్నిస్తుంది. మొదటి మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించిన బ్రెజిల్ 2015 నాటికి ఆకలి సమస్యను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.


1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో భారత్‌లో పేదరికం తగ్గినప్పటికీ..మరో వైపు ఆదాయ అసమానతలు పెరిగాయి. 238 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలంగా ఆకలితో అలమటిస్తున్నారు. మూడేళ్లలోపు సరైన బరువు లేకుండా జన్మిస్తున్న శిశువుల విషయంలో పెద్దగా పురోగతి లేదు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మాదిరి అనేక విషయాల్లో గ్యాప్స్(తేడాలు) ఎక్కువగా కనిపిస్తున్నాయి.


పౌష్టికాహారలోపంతో ఇబ్బంది పడుతున్న ప్రజల శాతం.. లక్షిత వర్గాల ప్రజల్లో వీరి శాతం అధికంగా ఉంటోంది. ఐదేళ్లలోపు తగిన బరువు లేకుండా జన్మిస్తున్న శిశువుల శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల్లో ఎక్కువ. ఎస్సీ వర్గాల్లో 55 శాతం, ఎస్టీ వర్గాల్లో 48 శాతం, మిగతా వర్గాల్లో 34 శాతం మంది తగిన బరువు లేకుండా జన్మిస్తున్నారని కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.


అసమానతలు:

భారత్‌లో ప్రాంతీయ అసమానత లు కూడా ఎక్కువే. హంగర్ ఇండెక్స్ విలువలను పరిగణనలోకి తీసుకుంటే.. పంజాబ్ విలువ13.6 కాగా మధ్యప్రదేశ్ విలువ 30.9గా ఉంది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, చత్తీస్‌ఘడ్, ఒడిషాలలో హంగర్ ఇండెక్స్ విలువ అధికంగా ఉండటం ఆయా రాష్ట్రాల్లో ఆకలితో అలమటిస్తున్న ప్రజల శాతం ఎక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. ఐదేళ్లలోపు తగిన బరువు లేకుండా జన్మించిన శిశువుల సంఖ్య.. పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 13 శాతం ఎక్కువగా నమోదవుతుంది.

భారత ప్రభుత్వ నివేదిక-2009 ప్రకారం.. 2004లో గ్రామీణ ప్రాంతాల్లో 41.8 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.7 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. లింగ సంబంధమైన తేడా కూడా కుటుంబంలోని సభ్యుల మధ్య ఆహార భద్రతకు దారితీస్తుందని చెప్పొచ్చు. స్త్రీలు గృహ సంబంధ విధుల్లో పూర్తిగా నిమగ్నం కావడం వల్ల వారు ఆదాయాన్ని ఆర్జించే మార్గాలు తక్కువగా ఉంటున్నాయి.


భారత్-ఆహార భద్రత
వైఫల్యానికి కారణాలు:
వ్యవసాయరంగం ఎక్కువగా రుతుపవనాలపై ఆధారపడటం. దీంతో ఆ రంగంలో అనిశ్చిత పరిస్థితులు పెరిగాయి. తద్వారా ఆహార ఉత్పత్తిలో స్థిరమైన తగ్గుదల కనిపిస్తుంది.
ఆహార ధాన్యాల వృద్ధి రేటు కంటే జనాభా వృద్ధి రేటు అధికంగా ఉండటం.
అధిక ద్రవ్యోల్బణంతో పోల్చినప్పుడు ప్రజల ఆదాయంలో పెరుగుదల నమోదు కాలేదు.
{పజా పంపిణీ వ్యవస్థలో పెరిగిన అవినీతి, అనేక లోపాలు.
పర్యావరణ క్షీణత కారణంగా వ్యవసాయరంగంలో ఉత్పత్తి కుంటుపడటం.
కూరగాయలు, పాలు, పండ్ల ధరలు సాధారణ స్థాయికి మించి పెరగటం.

భారత్ తీసుకోవాల్సిన చర్యలు

బ్రెజిల్‌లో ప్రభుత్వం ‘ఆహార ఉత్పత్తుల సేకరణ విధానం’ స్థానికంగా అభివృద్ధి సాధనకు ఉపకరించింది. ఫుడ్ అక్విజిషన్ కార్యక్రమం, నేషనల్ స్కూల్ ఫీడింగ్ కార్యక్రమాలు సంస్థాపరమైన కార్యక్రమాలుగా రూపుదిద్దుకున్నాయి. ఫుడ్ అక్విజిషన్ కార్యక్రమం.. కింద స్థానికంగా రైతు కుటుంబాలు, ఇతర కేటగిరీల నుంచి ఆహార ఉత్పత్తుల కొనుగోలు జరుగుతుంది.


నేషనల్ స్కూల్ ఫీడింగ్ కార్యక్రమం ద్వారా 30 శాతం ప్రభుత్వ వ్యయాన్ని స్థానికంగా ఈ వర్గాల రైతుల నుంచి ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగిస్తున్నారు. బ్రెజిల్ అనుభవం ఆధారంగా స్థానిక ఆహార ఉత్పత్తులు, ఆహార పంపిణీ మధ్య పరస్పర సంబంధం ఉండే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి.


బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు శాశ్వతంగా ఆహార భద్రత కు సంబంధించి నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ చర్య ఆయా దేశాల్లో ఆహార భద్రత విషయంలో ధనాత్మక ప్రభావాన్ని చూపి పేదరికం, అసమానతలు తగ్గడానికి కారణమైంది. మన దేశంలో కూడా ఇటువంటి పథకం అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి.


ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయ ఉత్పాదితాల సబ్సిడీ, అధిక మద్దతు ధరలను దశల వారీగా తొలగించాలి. ధరల్లో అధిక ఒడిదుడుకులను తొలగించి చిన్న రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరల వద్ద విక్రయించుకోకుండా చూడాలి. ఇందుకోసం ఫ్యూచర్ మార్కెటింగ్ విధానాన్ని ప్రోత్సహించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సమాచార వ్యవస్థను మెరుగుపరిచి..రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన ధ రల సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలి. పంటల బీమా పథకాన్ని విస్తృత పరస్తూ రైతులు చెల్లించాల్సిన ప్రీమియంలో అధిక భాగాన్ని ప్రభుత్వమే భరించాలి.


రాష్ట్రాల మధ్య ఆహార ధాన్యాల రవాణాకు సంబంధించి అమల్లో ఉన్న అన్ని రకాల ఆంక్షలను తొలగించాలి. స్టాకింగ్, ఎగుమతులు, సంస్థాపరమైన పరపతి-ట్రేడ్ ఫైనాన్సింగ్‌లను ప్రోత్సహించాలి. వినియోగం-ఉత్పత్తి మధ్య తేడా ఏర్పడకుండా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. ఈ విధానం వనరుల సమర్థ వినియోగానికి తోడ్పడుతుంది.


వ్యవసాయరంగానికి అవసరమైన మౌలిక సౌకర్యాలపై అధిక పెట్టుబడులు పెట్టాలి. వరి, గోధుమ పంటలపైనే కాకుండా ఏ ప్రాంతంలో ఏ పంటల దిగుబడికి అవకాశం ఎక్కువగా ఉంటుందో పరిశీలించాలి. నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పాదితాలు, విద్యుచ్ఛక్తి వంటి ఉత్పాదితాలు వ్యవసాయ కార్యకలాపాల సమయంలో సక్రమంగా లభ్యమయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి.


పెరుగుతున్న జనాభా వృద్ధిని నియంత్రించనట్లయితే ప్రజలకు ఆహార భద్రత చేకూరదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం ద్వారా పేద ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి తగిన చర్యలు చేపట్టాలి. రైతులకు సంబంధించి ఉపాధి పథకాలను పటిష్టంగా అమలు చేయాలి.

No comments:

Post a Comment