స్కోరింగ్‌కు ఆస్కారం.. పేపర్ 2

సెక్షన్-1 - ఏపీ హిస్టరీ
సెక్షన్-2 - భారత రాజ్యాంగం
ప్రశ్నలు: 150 మార్కులు: 150
సమయం: రెండున్నర గంటలు

ఈ పేపర్‌లోని మొదటి సెక్షన్ ఏపీ హిస్టరీ. మొత్తం 75 ప్రశ్నలు అడుగుతారు. ఇతర విభాగాలతో పోల్చితే కొంచెం ఎక్కువ మార్కులు సొంతం చేసుకోగల విభాగమిది. అంతేకాకుండా నిర్దేశిత సిలబస్ పరిధి తక్కువ కావడం కచ్చితంగా లాభించే అంశం.


పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను విశ్లేషణాత్మక కోణంలో సాగించాలి. డిస్క్రిప్టివ్‌గా చదివిన అంశాల నుంచి బిట్స్ రూపొందించుకోవాలి.

ఒక అంశం చదవడం పూర్తయ్యాక దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ రాసి విశ్లేషణ చేసుకోవాలి.

ఇక సిలబస్‌ను మూడు విభాగాలుగా చేసుకుని చదివితే అర్థవంతంగా ఉంటుంది. పోటీ పరీక్షలో ప్రతి మార్కు కీలకమే. కాబట్టి ఏ అంశాన్ని కూడా విస్మరించకూడదు.


ఏపీ హిస్టరీకి తొలి అంకమైన శాతవాహనులపై బాగా పట్టు సాధిస్తే సిలబస్‌లోని తర్వాత అంశాలకు చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రశ్న పత్రంలో కూడా శాతవాహనులకు సంబంధించి ఎక్కువ వెయిటేజీ లభిస్తోందని చెప్పవచ్చు.


సెక్షన్-2 భారత రాజ్యాంగం:


కోర్ సబ్జెక్టుపై అవగాహన, సమకాలీన పరిణామాలపై పట్టు అవసరమైన విభాగం భారత రాజ్యాంగం.


రాజ్యాంగ ప్రకరణలకు సంబంధించి తాజా సవరణలపై సమాచారాన్ని సొంతం చేసుకోవాలి.


ఇక ప్రిపరేషన్ క్రమంలో.. భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు; ప్రవేశిక; ప్రాథమిక విధులు- హక్కులు; ఆదేశిక సూత్రాలు; భారత సమాఖ్య- విశిష్ట లక్షణాలు; కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన; శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పాత్రలపై లోతుగా అధ్యయనం చేయాలి.


ఇలా చదివేటప్పుడు సిలబస్ ప్రకారం ముందుకు సాగాలి. విస్తృత మెటీరియల్‌లో ఉండే అంశాలన్నిటినీ చదవడం కంటే సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై బాగా పట్టు సాధించడానికి కృషి చేయాలి.


రాజ్యాంగ సవరణలకు సంబంధించి (73, 74 సవరణలు, పంచాయతీరాజ్ వ్యవస్థ) గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.


వీటితోపాటు ఆయా సవరణలు- వాటి ప్రాముఖ్యత- తేదీలు ఔపోసన పట్టాలి.


రాజ్యాంగ పర సంస్థల గురించి.. అంటే యూపీఎస్‌సీ; జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు; జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు; మైనార్టీ కమిషన్; - వాటి కూర్పు విధానం; కాల వ్యవధి; ప్రస్తుత అధ్యక్షుల గురించి సమాచారం పొందాలి.


శాసన వ్యవస్థలు- జవాబుదారీతనం; సంక్షోభాలు- సంబంధిత రాజనీతి సిద్ధాంతాలపై పట్టు ఉండాలి.


పాలిటీ ప్రశ్నల సరళి కోసం ఏపీపీఎస్‌సీ గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి.


దీంతోపాటు యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమ్స్ ప్రీవియస్ కొశ్చన్స్‌ను పరిశీలించడం కూడా లాభిస్తుంది.


పాలిటీలో ప్రాథమిక అవగాహన కోసం తొలుత ఎన్‌సీఈఆర్‌టీ 8-12వ తరగతి సివిక్స్, పొలిటికల్ సైన్స్ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.


ఇటీవల ఆమోదించిన బిల్లులకు సంబంధించి సమాచారం కూడా అవసరమే.


గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఎవరనే అవగాహన కూడా ఉండాలి.


పరిపాలన వ్యవస్థకు సంబంధించి (కలెక్టర్లు - విధులు; ప్రభుత్వ శాఖలు తదితర) సమాచారం కూడా తెలుసుకోవాలి.


తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం; కారణాలపై విశ్లేషణ చేయాలి.

1 comment: