బెంగాలీ బాంబు!

కారల్‌మార్క్స్‌ 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాస్తే, మమతాబెనర్జీ 'యాంటీ కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాశారు. మూడున్నర దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మార్క్సిస్టు పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి... తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు ఆ రాయల్‌బెంగాల్‌ ఆడపులి!
మ్యూనిస్టు కోట కుప్పకూలిన ఆనవాళ్లు... గుట్టలుగుట్టలుగా ఎర్రజెండాల పీలికలు... ఓటమి గాయాలతో కామ్రేడ్ల మూలుగులు... చెదపురుగుల పాలైనమార్క్సిస్టు సాహిత్యం. ఆ శిథిలాల మధ్య నుంచి మమతాబెనర్జీ నడుస్తున్నారు. ఎప్పట్లాగానే రబ్బరు చెప్పులు.
ఎప్పట్లాగానే ముతక చీర.
ఎప్పట్లాగానే చిందరవందర జుత్తు.
ఎప్పట్లాగానే భుజానికి గుడ్డ సంచి.
వెుహంలో మాత్రం...
ఎప్పుడూ కనిపించని విజయగర్వం!
సుదీర్ఘ పోరాట ఫలితమిది. ఈరోజు కోసమే ఇన్నేళ్లూ ఎదురుచూశారు. ఈ విజయం కోసమే ఎన్నాళ్లుగానో కలలుగన్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం దగ్గరైతే సందడే సందడి. జయజయధ్వానాలు. కరతాళధ్వనులు. విజయహారతులు. బాణసంచా పేలుళ్లు. మీడియా కెమేరాల మెరుపులు. పాత్రికేయుల పాతరోత ప్రశ్నలు. ఎవరో కాళికతో పోలుస్తున్నారు. ఇంకెవరో ఇందిరమ్మను గుర్తుచేసుకుంటున్నారు. ఇక, ఢిల్లీ పీఠమే మిగిలిందని అంచనాలు వేస్తున్నారు. ఏవో... ఎవరు చెప్పగలరు? సంకీర్ణాల యుగంలో ఏదీ అసాధ్యం కాదు. అయినా, పదీపదిహేనేళ్ల నాడు... కమ్యూనిస్టుల ఉక్కుకవచం తుక్కుతుక్కు అవుతుందని ఎవరైనా వూహించారా? ఆ ఎరుపుజెండా మెరుపు తగ్గిపోతుందని ఏ నిపుణుడైనా విశ్లేషించాడా? కాకలుతీరిన కామ్రేడ్లు కాడి వదలాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఏ పెద్దమనిషైనా అంజనమేసి చెప్పాడా?
అటువైపు... యోధానయోధులు. సుశిక్షిత కార్యకర్తలు. వ్యూహప్రతివ్యూహాల్లో ఆరితేరిన సలహాబృందాలు. గగుర్పాటు కలిగించే విప్లవాల చరిత్ర. చేతినిండా అధికారం. గల్లాపెట్టె నిండా నిధులు.
ఇటువైపు... మామూలు మహిళ. ఆస్తిపాస్తుల్లేవు. రాజకీయ వారసత్వం లేదు. చెప్పుకోదగ్గ అనుచరగణమూ లేదు. కొంత రాజకీయానుభవం, కొండంత ఆవేశం... అవే ఆమె అర్హతలు.
ఆ ఒంటరి నారి... వింటినారి సవరిస్తుంటే అంతా వినోదంలా చూశారు. ఆ పడతి పైటబిగిస్తుంటే... ఫక్కుమని నవ్వారు. ఆ గాండ్రింపులకు భయపడిందెవరు? ఆ ప్రతిజ్ఞలను పట్టించుకుందెవరు? నవ్వినచోటే, ఓట్లచేను పండింది. మూడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతూ వస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్టు ప్రభుత్వం... కుప్పకూలిపోయింది. మమత విజేతగా నిలిచారు.
సంకెళ్లు తెంచుకుని...
వందేళ్లు నిండిన కాంగ్రెస్‌. వందకు దగ్గర్లో ఉన్న వృద్ధనేతలు. పేరుకు రాజకీయ పార్టీయే కాని, నరనరానా పెత్తందారీ పోకడలే. స్వతంత్ర భావాల్ని స్వాగతించలేని ఛాందసవాదుల సమూహం. సొంత గొంతుకల్ని నొక్కిపడేసే ఖద్దరు పెద్దల గుంపు. సీతారాం కేసరి ముక్కుతూ మూలుగుతూ కాంగ్రెస్‌ అధ్యక్షపదవిలో నెట్టుకొస్తున్నరోజులవి. చేవలేకపోయినా, చేతకాకపోయినా... ఒక్కసారి, ఒక్కసారైనా ప్రధాని పీఠం మీద కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారా వృద్ధనేత. సరిగ్గా అదే సమయానికి కలకత్తా నగరంలో కాంగ్రెస్‌ ప్లీనరీ జరుగుతోంది. మమతకు మాత్రం పిలుపులేదు. పిలవని పేరంటాలకెళ్లడం ఆమెకెప్పుడూ అలవాటు లేదు. కానీ, పిలవాలన్న ఆలోచన లేని పెద్దమనుషులకు బుద్ధిచెప్పడం ఎలాగో బాగా తెలుసు. ప్లీనరీ వేదికకు కూతవేటుదూరంలోనే బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు. 'ఏమిటీ? కేసరి నన్ను పార్టీలోంచి బహిష్కరిస్తారా? బహిష్కరించనివ్వండి? నేనూ ఆయన్ని బహిష్కరిస్తాను'... అంటూ ఏకంగా అధ్యక్షుడికే సవాలు విసరాలంటే ఎంత దమ్ముండాలి? ఆ తిరుగుబాటు స్వరం ప్రజలకు నచ్చింది. కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు.
కాంగ్రెస్‌ పార్టీని వీడాలన్న ఆలోచన మమతకు ఏ కోశానా లేదు. పరిస్థితులే అందుకు ప్రేరేపించాయి. వారసత్వం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా... స్వశక్తితో వ్యక్తిత్వసంపదతో నాయకురాలిగా ఎదిగారామె. మమతాబెనర్జీ కలకత్తాలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. పదిహేనేళ్ల వయసులో తండ్రి మరణించారు. మంచానపడిన మనిషికి వైద్యం చేయించలేనంత పేదరికం. వెుత్తం ఆరుగురు సోదరులు. పెద్దతమ్ముడి టీకొట్టే కుటుంబానికి ఆధారం. ఆ నాలుగురాళ్లతో గుట్టుగా నెట్టుకురావాల్సిన బాధ్యత మాత్రం మమతదే! పదింటికంతా ఇంటి పనులన్నీ ముగించుకుని కాలేజీకి వెళ్లేవారు. సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్లు చెప్పేవారు. రాజకీయాల మీద ఆసక్తితో కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగంలో చేరారు. ఓసారి ఏదో బహిరంగ సభలో మాట్లాడుతుంటే, అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్‌రే చూశారు. కారు ఆపి మరీ, శ్రద్ధగా ప్రసంగం విన్నారు. ఆ ఉపన్యాసపటిమే విద్యార్థి నేతను ప్రజానాయకురాలిగా తీర్చిదిద్దింది. కొద్దికాలంలోనే, రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా విభాగంలో చురుకైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాదవ్‌పూర్‌ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేసే అవకాశమూ వచ్చింది. ప్రత్యర్థి ఎవరో కాదు... కమ్యూనిస్టు దిగ్గజం సోమనాథ్‌ చటర్జీ. ముపైశ్ఫ ఏళ్లు కూడా నిండని ఆ యువతి ఆత్మవిశ్వాసం ఓటర్లను అబ్బురపరిచింది. ఇందిరాగాంధీ హత్యతో పెల్లుబికిన సానుభూతి కూడా తోడైంది. మమతాబెనర్జీ నలభై ఎనిమిదివేల మెజారిటీతో గెలిచారు. అదో సంచలనం! ఫలితాలు ప్రకటించగానే మమత నేరుగా సోమనాథ్‌ ఇంటికెళ్లి ఆశీర్వాదాలు అందుకున్నారు. 'ప్రజల తీర్పునే కాదు... ప్రత్యర్థి పెద్దరికాన్ని కూడా గౌరవించాలి' అన్న ఆలోచన ఆమె వ్యక్తిత్వానికి మచ్చుతునక. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో, కాంగ్రెస్‌పార్టీ బెంగాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎదురుగాలి మమతనూ ఓడించింది. మళ్లీ 1991లో దక్షిణ కలకత్తా నియోజకవర్గం నుంచి గెలిచారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో యువజన శాఖ చేపట్టారు. అంతకంటే పైకెదగనివ్వలేని పరిస్థితులే ఆమెను నిరాశకు గురిచేశాయి. పార్టీలోని వెన్నుపోటు రాజకీయాలు మరింత ఇబ్బందిపెట్టాయి. దానికితోడు, బెంగాల్‌ కాంగ్రెస్‌ పెద్దలు ఎన్నికల్లో తమ పీఠాలు కాపాడుకోడానికి కమ్యూనిస్టుల అడుగులకు మడుగులొత్తుతుంటే కడుపుమండిపోయేది. ఏదో ఒకరోజు కమ్యూనిస్టుల్ని గద్దె దించాలన్న కోరిక మనసులో బలపడిపోయింది. అదేం అకారణ ద్వేషం కాదు. మార్క్సిస్టుల పాలనలో అవినీతి పెచ్చుపెరిగింది. అధికార దుర్వినియోగం సర్వసాధారణమైంది. ఆ అవినీతిని నిలదీయాలి. ఆ దుర్వినియోగానికి అడ్డుకట్టవేయాలి. కాంగ్రెస్‌లో ఉంటే అది అసాధ్యమని అర్థమైపోయింది. అందుకే, బయటికొచ్చి కొత్తపార్టీని స్థాపించారు. ఇదీ కాంగ్రెసే. కానీ, పెత్తందార్ల కాంగ్రెస్‌ కాదు. వృద్ధ జంబూకాల కాంగ్రెస్‌ కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌... అంటే, అట్టడుగు కార్యకర్తల కాంగ్రెస్‌! మమత భారతీయ జనతాపార్టీతో జతకట్టినా, అది ఎక్కువకాలం నిలబడలేదు. ఆ స్నేహం కారణంగా, బెంగాల్‌లోని మైనారిటీలు తనకు దూరమయ్యే ప్రమాదం ఉందని అర్థమైపోయింది. మళ్లీ కాంగ్రెస్‌కే దగ్గరయ్యారు. దగ్గరకావడం అంటే సాగిలపడటం కాదు, రాజీపడటం కాదు, వ్యక్తిత్వాన్ని చంపుకోవడం కాదు. ప్రజా ప్రయోజనాల్ని పణంగా పెట్టడం కాదు. ఎన్నికల సమయంలో కొద్దిపాటి రాజకీయ సర్దుబాటు. అంతే, అంతకుమించి ఎలాంటి ప్రాధాన్యం లేదు. అవసరమనుకుంటే, ఆ బంధాన్ని తెంచుకోడానికి కూడా ఎప్పుడూ వెనుకాడరు. అంతెందుకు, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంత బతిమాలినా ఇవ్వాలనుకున్న సీట్లకుమించి, ఒక్కటి కూడా అదనంగా ఇవ్వలేదు. ఆ పట్టుదల తెలుసు కాబట్టి, కాంగ్రెస్‌ అధిష్ఠానమూ కిమ్మనకుండా పుచ్చుకుంది. తృణమూల్‌కు కాంగ్రెస్‌ అవసరం కంటే, కాంగ్రెస్‌కు తృణమూల్‌ అవసరమే ఎక్కువ. పందొమ్మిది మంది ఎంపీలతో ఆపార్టీ యూపీఏ-2లో ప్రధాన భాగస్వామి. బెంగాల్‌లో కాంగ్రెస్‌ పరిస్థితీ ఏమంత గొప్పగా లేదు. మహా అయితే, తృణమూల్‌కు ఓ తోకపార్టీ! అసెంబ్లీ ఫలితాలే, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం అయితే, మమత కేంద్రంలో మరింత శక్తిమంతురాలు అవుతారు.




 
ఉద్యమాల జీవితం
మమతాబెనర్జీకి కుట్రలు తెలియవు. కుతంత్రాలు తెలియవు. ఓట్లకోసం కోట్లకుకోట్లు కుమ్మరించగల స్థోమతా లేదు. ఇన్నేళ్ల ప్రజాజీవితంలో, రాజకీయాల్లో నిలదొక్కుకోడానికి అవసరమైన అవలక్షణాలేవీ ఒంటబట్టించుకోలేదామె. అయినా, ఎలా నిలవగలిగారు? ఎలా గెలవగలిగారు?ప్రజాప్రతినిధులంతా తెలుసుకోవాల్సిన రాజకీయ సత్యమిది. సామాన్యుల తరపున నిలబడే ధైర్యం ఉంటే, సమస్యల మీద పోరాడే తెగువ ఉంటే, ఎన్ని వైఫల్యాలొచ్చినా తట్టుకోగల గుండె దిటవు ఉంటే... ఏదో ఒకరోజు గెలుపు పిలుపు వినిపిస్తుంది! మమతా బెనర్జీ విషయంలోనూ అక్షరాలా అదే జరిగింది. ఆమె చేసిన పోరాటాలకూ ఉద్యమాలకూ లెక్కేలేదు. దాడుల్ని తట్టుకున్నారు. లాఠీదెబ్బల్ని భరించారు. హత్యాయత్నాలూ జరిగాయి. ప్రత్యర్థుల విమర్శలు, పార్టీలో కుమ్ములాటలు... ఆమె స్త్థెర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. అయినా వెనుకడుగు లేదు. గెలిచినా గెలవకపోయినా, ఎన్నికలున్నా లేకపోయినా... ప్రజల మధ్యే ఉన్నారు. ప్రజల్నే నమ్ముకున్నారు. ప్రజలను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు!
అతికొద్దిమంది నేతల్లో కనిపించే అరుదైన లక్షణం... నిజాయతీ. పెద్దగా ఆధారాల్లేని ఒకట్రెండు విమర్శలు తప్పిస్తే...మమతాబెనర్జీ ప్రజా జీవితంలో ఎలాంటి అవినీతి మరకలూ లేవు. లంచాలూ వాటాలూ సిఫార్సులూ ఆమె గడప తొక్కడానికి కూడా భయపడతాయని చెబుతారు బాగా ఎరిగినవారు. కొత్తగా కేంద్రమంత్రి అయిన రోజుల్లో... ఓ రియల్‌ఎస్టేట్‌ గొడవలో మాటసాయం చేయమంటూ సొంత తమ్ముళ్లే ఎవర్నో తీసుకెళ్లారు. ఆమెకు పైరవీలంటే గిట్టదు. ఆచెంపా ఈచెంపా వాయించాలన్నంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు. గబగబా నాలుగు చీరలు సూట్‌కేసులో సర్దేసుకుని మౌనంగా ఇంట్లోంచి వచ్చేశారు. నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయి అక్కడే మకాం పెట్టారు. అదే ఆమె సమాధానం. పేరుకు రైల్వేమంత్రి అయినా, విలాసాల బోగీల్లో ఎప్పుడూ ప్రయాణించింది లేదు. బహుమతులకూ నజరానాలకూ ఆమె ఆమడదూరం, అవి చిన్నవైనా సరే. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు, ఓ ముస్లిం అభిమాని ప్రేమతో శాలువా ఇవ్వబోయాడు. వెుదట తిరస్కరించారు. కానీ ఆ అభిమాని ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడో అని, 'నేను బహుమతులు ఇష్టపడను. ప్రేమతో ఇస్తున్నావు కాబట్టి, అంతే ప్రేమతో అందుకుంటున్నా' అంటూ చిరునవ్వుతో స్వీకరించారు. ఆ అభిమాని కళ్లలో ఆనందబాష్పాలు!
మమతకు చాలా విషయాల మీద స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే, వెుహమాటం లేకుండా విమర్శిస్తారు. కడిగిపారేస్తారు. ఎదుటి వ్యక్తి... రాష్ట్రంలోని కమ్యూనిస్టు నేత కావచ్చు. కేంద్రంలోని కాంగ్రెస్‌ అధినేత్రీ కావచ్చు. అమాయక ప్రజల భూముల్ని లాక్కుని టాటాలకు అప్పగించారన్న కారణంతో 'నానో'ను వ్యతిరేకించిన మమత... సాక్షాత్తూ తన నేతృత్వంలోని రైల్వే మంత్రిత్వశాఖలో విస్తరణ కార్యక్రమాల కోసం సామాన్యుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదించినప్పుడూ అంతే కచ్చితంగా కాదన్నారు. 'అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. పారిశ్రామికీకరణనూ కాదనను. ఆ పేరుతో పేదల ఉసురు తీస్తే మాత్రం సహించేది లేదు' అని తేల్చిచెప్పారు. చుక్కల్ని తాకే నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆమె ప్రతిపక్షాల కంటే ముందున్నారు. 'ధరలకు పగ్గాలు వేయడానికి ఓ స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని నేనెప్పుడో చెప్పాను. అయినా మీరు పట్టించుకోలేదు' అని సర్కారు మీద విరుచుకుపడ్డారు. 'మమత నిరంకుశ నాయకురాలు. నలుగుర్నీ కలుపుకువెళ్లడం అస్సలు తెలియదు' అన్న విమర్శకు నందిగ్రామ్‌, సింగూర్‌ పోరాటాల ఘనవిజయమే సమాధానం. ఆమె వివిధ ప్రజాసంఘాలతో కలిసి పనిచేశారు. చిన్నాపెద్దా నాయకులతో వేదిక పంచుకున్నారు. వేలమందిని ఒక తాటిమీద నడిపించారు. ఆ ఉద్యమాలు మార్క్సిస్టు పాలకులకు చెమటలు పట్టించాయి.
ఓరోజు మమతాబెనర్జీ ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. దార్లో ట్రాఫిక్‌జామ్‌! ఏమిటా అని అద్దాల్లోంచి తొంగిచూస్తే... రోడ్డు ప్రమాదం. ఓ యువకుడు కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మమత పరుగుపరుగున అక్కడికెళ్లారు. క్షతగాత్రుడిని తన కార్లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మాట పెళుసే కానీ, మనసు వెన్న. ఎదుటి మనిషి కష్టాల్ని చూసి తట్టుకోలేరు. కన్నీళ్లు పొంగుకొచ్చేస్తాయి. అంత సున్నిత మనస్తత్వాన్ని ఏ కళాకారుల్లోనో చూస్తాం. నిజానికి, మమతలో ఓ మంచి కళాకారిణి ఉన్నారు. ఆమెకు చదవడం ఇష్టం. రాయడం ఇష్టం. బొమ్మలు గీసుకోవడం ఇష్టం. హావభావాల్ని పలికిస్తూ రవీంద్రుడి గీతాంజలి చదువుకోవడం మరీమరీ ఇష్టం. 'వేర్‌ ద మైండ్‌ ఈజ్‌ విథవుట్‌ ఫియర్‌...' ...ఠాగూర్‌ కవితాపంక్తిని తరచూ ఉటంకిస్తుంటారు. 'బద్లా నోయి, బద్లా ఛాయి' (మాకు మార్పు కావాలి, ప్రతీకారం కాదు), మా... మాటి... మనుష్‌ (తల్లి, నేల, ప్రజలు) తదితర నినాదాల్లో ఆమె సాహితీ స్పృహ తొంగిచూస్తుంది.
మంకుపట్టు మహారాణి
మమత అనుకుందంటే, ఆ పని జరిగిపోవాల్సిందే. నిబంధనలూ గిబంధనలూ జాన్తానై. చూస్తాం, ఆలోచిస్తాం అంటే కుదర్దు. మాటకు లొంగకపోతే... హెచ్చరిస్తారు, బెదిరిస్తారు, కయ్యానికి కాలుదువ్వుతారు. ఆమెను బుజ్జగించడానికి నానాకష్టాలూ పడినవారిలో సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఉన్నారు. ఎదుటివ్యక్తి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. ఎంత పేరున్న నేత అయినా కావచ్చు. ఆ ధాటికి తలవంచాల్సిందే. పెట్రోలు ధరల పెంపు విషయంలో అమర్‌సింగ్‌ను నలుగుర్లో నిలదీశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించినందుకు దరోగా ప్రసాద్‌ సరోజ్‌కూ అలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ తనకు తెలియకుండా బెంగాల్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు రచ్చరచ్చ చేశారు.
పేరుకు మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గ సహచరురాలే అయినా, తనను తాను సర్వస్వతంత్రురాలిగానే భావించుకుంటారు మమత. తన మద్దతుతో నడిచే ప్రభుత్వంలో తన నిర్ణయానికి తిరుగేం ఉంటుందన్న ధైర్యమూ కావచ్చు. కేబినెట్‌ అనుమతులేవీ లేకుండానే బెంగాల్‌ మీద వరాల వర్షం కురిపించుకున్నారు. షాలిమార్‌ దగ్గర ఆటోహబ్‌, గూడ్స్‌యార్డు మంజూరు చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. సింగూర్‌లో కోచ్‌తయారీ పరిశ్రమ పెట్టాలన్నది ఆమె ఆలోచన. పాపం, ప్రధానమంత్రి! అవునన్నా తిప్పలే. కాదన్నా తిప్పలే. ఆ మంకుపట్టు వల్ల ఆమె కొన్ని శత్రుత్వాల్ని కొనితెచ్చుకుని ఉండవచ్చు. చిన్నాచితకా ఇబ్బందులూ ఎదురై ఉండవచ్చు. కానీ ఆ మంకుపట్టే లేకపోతే, శత్రుదుర్భేద్యమైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చేసేవారు కాదు. ఆ మంకుపట్టే లేకపోతే అన్నన్ని వైఫల్యాల్నీ అవమానాల్నీ తట్టుకుని నిలబడేవారే కాదు. ఆ మంకుపట్టే లేకపోతే ఎవరెన్ని అనుకున్నా పట్టించుకోకుండా, పెద్దపెద్ద రైల్వే ప్రాజెక్టుల్ని రాష్ట్రానికి తరలించుకు వెళ్లేవారే కాదు. బెంగాలీల హృదయాల్లో స్థానం సంపాదించేవారే కాదు.
సృష్టికర్త ప్రతిజీవి ఆత్మరక్షణ కోసం ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కొన్ని వెుక్కలకు ముళ్లిచ్చాడు. కొన్ని వెుక్కలకు ముడుచుకుపోయే గుణం ఇచ్చాడు. కొన్నింటికి దురదపుట్టించే లక్షణం ఇచ్చాడు. వూసరవెల్లిలాంటి జీవులకు రంగుమార్చుకునే వెసులుబాటూ కల్పించాడు. మనుషుల విషయానికి వచ్చేసరికి పరిస్థితులకూ అనుభవాలకూ అనుగుణంగా తమనుతాము మలుచుకునే గుణం ఇచ్చాడు. మమతాబెనర్జీ బాల్యంలో చాలా సౌమ్యురాలు. నలుగురి మధ్యకు వెళ్లాలంటేనే ముడుచుకుపోయేవారు. ఎదిగేకొద్దీ జీవితానుభవాలు పెరిగేకొద్దీ... ఆమె ఆలోచనలూ స్వభావం మారుతూ వచ్చాయి. పెద్ద కూతురిగా తండ్రి మరణం తర్వాత ఇంటి బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. పురుషాధిక్య సమాజంలో ధైర్యంగా నిలబడటానికి అవసరమైన లక్షణాల్ని కూడా అప్పుడే ఒంటబట్టించుకుని ఉంటారు. ఎదుటి వ్యక్తులు మితిమీరిన చొరవ ప్రదర్శించకుండా, తనకున్న పరిమితుల్ని అలుసుగా తీసుకోకుండా... గాంభీర్యాన్నీ గయ్యాళితనాన్నీ రక్షణ కవచంలా ఉపయోగించుకుని ఉండవచ్చు. నిజానికి, మమత రాజకీయ జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. సొంతపార్టీ పెట్టుకోగానే ఘనవిజయాలు వరించలేదు. ఒంటరి సభ్యురాలిగా పార్లమెంటులో చాలా అవమానాలే ఎదుర్కొన్నారు. ఆ నిస్పృహ ఆమె మాటల్లో చేతల్లో వ్యక్తంకావడం అసహజమేం కాదు. ఒకటి మాత్రం నిజం. ఆ కోపతాపాల్నీ పంతాల్నీ పట్టింపుల్నీ మమత ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికే అలకపాన్పులెక్కారు.

 
బెంగాల్‌ మీదే బెంగ!
ఏ శాఖ నిర్వహించినా, ఏ హోదాలో ఉన్నా... మమత మనసెప్పుడూ బెంగాల్‌ మీదే! మనసొక్కటేనా, మనిషీ బెంగాల్‌లో ఉండటానికే ఇష్టపడతారు. పేరుకు కేంద్రమంత్రే అయినా, ఢిల్లీలో గడిపేది తక్కువే. తను ఏ శాఖ చూస్తే, ఆ శాఖ పద్దుల్లో సొంతరాష్ట్రానికే సింహభాగం. రామ్‌విలాస్‌పాశ్వాన్‌ రైల్వేమంత్రిగా ఉన్నరోజుల్లో... బెంగాల్‌కు తగినన్ని నిధులు కేటాయించలేదని తన ఒంటిమీదున్న శాలువాను ఆయన వెుహం మీదికి విసిరేసి, సభ నుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాష్ట్రానికి ఏదో ప్రాజెక్టు మంజూరు చేయలేదని పరిశ్రమల మంత్రి క్యాబిన్‌ ముందు ధర్నా చేయడానికీ వెనుకాడలేదు. ఎలాగైనా సరే, మార్క్సిస్టులను మట్టికరిపించాలన్న కోరికే కాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి ఎంతోకొంత మంచి చేయాలన్న తపనా ఉంది ఆమెలో. ఆ చిత్తశుద్ధిని బెంగాలీలు కాస్త ఆలస్యంగా అయినా గుర్తించారు. 2008 పంచాయతీ ఎన్నికల్లో తూర్పు మిడ్నాపూర్‌, 24 పరగణా ప్రాంతంలో మంచి ఫలితాలు అందించారు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో 19 లోక్‌సభ స్థానాల్లో గెలిపించారు. మూడున్నర దశాబ్దాలుగా పట్టంకడుతున్న మార్క్సిస్టులను కాదని, అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీని అందించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం బెంగాల్‌ పరిస్థితి కూడా ఏమంత గొప్పగాలేదు. శాంతిభద్రతల్ని పునరుద్ధరించాలి. పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థికంగా మెరుగుపరచాలి. నిజానికి కమ్యూనిస్టులను ఓడించడం కంటే, ఇదే పెద్ద సవాలు. ఆ విషయం ఆమెకూ తెలుసు. మమత మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.

No comments:

Post a Comment