గ్రూప్స్‌ గెలుపు... ఇదే మేలుకొలుపు!

గ్రూప్స్‌ గెలుపు... ఇదే మేలుకొలుపు!



కొడాలి భవానీ శంకర్‌
 అభ్యర్థుల ఉద్యోగావకాశాలను పెంచుతూ గ్రూప్‌-1కి తాజాగా, గ్రూప్‌-2కి సప్లిమెంటరీ నోటిఫికేషన్లు రాబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. 'ప్రకటనలు విడుదల కాలేదు; పరీక్ష తేదీలు తెలియకుండా చదవబుద్ధి కాద'నుకుంటే పోటీలో వెనుకబడే ప్రమాదముంది. ఇప్పటినుంచే మేలుకొని, సన్నద్ధమవటం ప్రారంభిస్తే మొత్తం సిలబస్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది!
కడమిక్‌ పరీక్షలకు నాలుగు నెలల ముందు చదవటం ప్రారంభించినా మంచి మార్కులు సాధించవచ్చు. కానీ పోటీ పరీక్షల్లో పోటీ ఎక్కువ; ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తేనే మంచి ఉద్యోగాలు వస్తాయి. 2008 పరీక్షలో విఫలమైన అభ్యర్థులతో పాటు గత 3 సంవత్సరాలుగా చదువుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. ఫలితంగా తాజా అభ్యర్థులు తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిందే. గ్రూప్‌-2 మూడు పేపర్లలో మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌, రెండోది ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, పాలిటీ; మూడోది భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు.
ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సిలబస్‌ పరిమితం కాబట్టి చరిత్ర పట్ల ఆసక్తి ఉంటే దీనితో ప్రిపరేషన్‌ మొదలుపెట్టొచ్చు. ఒక్కో సిలబస్‌ అంశాన్ని చదివి ప్రశ్నలు సాధన చేస్తే ఆత్మవిశ్వాసం త్వరగా పెంపొందుతుంది. పాలిటీ సిలబస్‌ కూడా పరిమితమే. పైగా మెటీరియల్‌ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి పేపర్‌-2 పై త్వరగా పట్టు సాధించే అవకాశం ఉంది.
ఆర్థికశాస్త్రాన్ని గ్రాడ్యుయేషన్‌/ పీజీ స్థాయిలో చదివినవారు పేపర్‌-3లోని ఇండియన్‌ ఎకానమీ సిలబస్‌ అంశాలతో అధ్యయనం మొదలుపెడితే ప్రేరణ బాగుంటుంది. తరవాత ఏపీ ఎకానమీని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఇందుకోసం గ్రూప్‌-2 కోసం రచించిన పుస్తకాలు మార్కెట్లో బాగానే ఉన్నాయి. వాటి అధ్యయనం ద్వారా ప్రిపరేషన్‌ గాడిలో పడే అవకాశం ఎక్కువ.
సైన్సు, ఇతర సబ్జెక్టులు డిగ్రీ/ పీజీలో సంబంధం కలిగినవారు నేరుగా జనరల్‌ స్టడీస్‌తో మొదలుపెట్టొచ్చు. జీఎస్‌లో వచ్చే ప్రశ్నల్లో కనీసం 60 శాతం పాఠశాల స్థాయి సమాచారానికి సంబంధించినవే. కాబట్టి వాటిపై ముందుగా దృష్టి నిలపాలి. పాఠశాల స్థాయిలో వివిధ సబ్జెక్టుల్లోని సమాజ అన్వయ విషయాలపై శ్రద్ధ చూపాలి.
సమాంతరంగా...
మొత్తం మీద 3 పేపర్లలోనూ ప్రిపరేషన్‌ సమాంతరంగా సాగించాలి. పాఠ్యాంశాల వారీగా సిద్ధమవుతూ ఆబ్జెక్టివ్‌ ధోరణిలో ప్రతి అంశాన్నీ ఆలోచించడం అవసరం. ప్రతి పేపర్‌లోనూ కనీసం 50 శాతం ప్రిపరేషన్‌ ముగిసిన తరవాత ప్రామాణికమైన నమూనా ప్రశ్నల్ని, ఏపీపీఎస్సీ గత ప్రశ్నపత్రాల్ని సాధన చేయాలి. చదివిన సిలబస్‌లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాల్ని ఎంత కచ్చితంగా గుర్తించారో సరిచూసుకోవాలి.
తప్పుల శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఎందుకలా జరుగుతోందో సమీక్షించుకోవాలి. వాస్తవాల ఆధారిత ప్రశ్నల్లో ఎక్కువ తప్పులు వస్తుంటే ప్రధానాంశాల ప్రిపరేషన్‌ను అవసరమైతే కొంత బట్టీ ధోరణిలోకి మార్చాలి. విశ్లేషణాత్మక ప్రశ్నల్లో వెనకబడివుంటే ఆయా విషయాల్లోని భావనలను మరొక్కసారి పరిశీలించుకోవాలి. ఎక్కువశాతం ప్రశ్నలు అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టుగా అన్పిస్తే మాత్రం చదువుతున్న పుస్తకాలను మార్చాలి!
'సీనియర్లతో పోటీపడగలమా?'
పాత, కొత్త అభ్యర్థులకు గ్రూప్‌-2 ఒకే పరీక్ష ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో తాజా అభ్యర్థులు తాము పోటీపడగలమా అనే భావనకు గురవుతున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో సత్తా కలిగిన అభ్యర్థులు 5 లేదా 6 నెలలు కష్టపడి మంచి ర్యాంకులు సాధించిన సంఘటనలు ఎక్కువే ఉన్నాయి. ఎగ్జామ్‌ ఓరియంటేషన్‌, భావనలపై అవగాహన, ప్రామాణిక సమాచారం, గ్రహణశక్తి, అన్వయ దృక్పథం మొదలైనవి విజయంపై ప్రభావం చూపుతాయి. ఈ లక్షణాల్ని అలవర్చుకుంటే వారు సీనియర్‌ అయినా, జూనియర్‌ అయినా గెలుపు సాధించగలరు.
సీనియర్‌ అభ్యర్థుల సంగతి?
గత మూడు సంవత్సరాలుగా ఇదే పరీక్షకు అగమ్యగోచరంగా చదువుతూ ఉండటంతో కొంత నిరాశ ఏర్పడి ఉంటుంది. 'చాలామంది పరీక్ష తేదీలు వచ్చాక చూసుకోవచ్చులే' అని తాత్కాలిక విరామం ప్రకటించారు. తాబేలు- కుందేలు కథ మాదిరిగా దెబ్బతినకుండా ఉండాలంటే వీరు అప్రమత్తంగా ఉండాల్సిందే!
గత మూడేళ్ళలో ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విషయాల్లో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా ఎకానమీ అంశాల్లో విస్తృత సమాచారం అందుబాటులోకి వచ్చింది. తాజా అభ్యర్థుల పోటీ నిర్లక్ష్యం చేయదగ్గది కాదు. పూర్తిగా పుస్తకాలు అటకెక్కించవద్దు. పీజీ/బ్యాంక్‌ మొదలైన పరీక్షలకు సిద్ధమవుతున్నా నిత్యం 2, 3 గంటల సమయాన్ని గ్రూప్స్‌కి వెచ్చించడం సముచితం.
గ్రూప్‌-1, 2... పరస్పర ఆధారితాలు
ఏదో ఒక పరీక్షనే అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకోకుండా, రెండింటికీ సిద్ధమవటం మెరుగైన ఫలితాలనిస్తుంది. రెంటిలోనూ కామన్‌గా 30 శాతం ప్రశ్నలున్నాయి. వాటిని ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌ కోణంలో చదవాలి.
భారత్‌ జట్టు క్రికెట్‌ ప్రపంచకప్‌ రెండోసారి గెలవడానికి 28 సంవత్సరాలు పట్టింది. అనివార్యమైన నిరీక్షణను సహనం, పట్టుదలతో అధిగమిస్తేనే అంతిమ విజయమని గ్రూప్స్‌ అభ్యర్థులూ గుర్తించాలి!




సరైన సన్నద్ధత
కడమిక్‌ పరీక్షల్లో 80, 90 శాతం మార్కులు సాధించామనే ధీమాను పోటీ పరీక్షల విషయంలో అన్వయించలేము. అకడమిక్‌ పరీక్షల్లో ఛాయిస్‌ విధానం, ముఖ్యమైన పాఠ్యాంశాలు మొదలైన అనుకూలతలుంటాయి. గ్రూప్‌- 2 లాంటి ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ఏ చిన్న అంశంపైనయినా ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి సమూలమైన అధ్యయనం కీలకపాత్ర పోషిస్తుంది. సమూలమైన అధ్యయనం అంటే... సిలబస్‌లో ప్రాథమిక భావనలు, విశ్లేషణ, ప్రాధాన్యం, అడ్వాన్స్‌డ్‌ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేయడం.
ఈ ప్రతి విభాగంలోనూ వాస్తవాల, భావనాధార ప్రశ్నలు ఉంటాయని గుర్తించి అధ్యయనం చేయాలి.
1: ప్రతి పాఠ్యాంశంలోని మౌలిక విషయాలపై పట్టును సాధించాలి.
2: ప్రతి పాఠ్యాంశంలోని కోర్‌ (ప్రాధాన్య) అంశాలపై దృష్టి నిలపాలి.
(ఈ రెంటిపై గట్టి పట్టు సాధించిన అభ్యర్థి 50 శాతం పైన మార్కులు సాధించగలుగుతారు.)
3: ప్రతి పాఠ్యాంశంలోని విశ్లేషణాత్మక ప్రశ్నలు, అడ్వాన్స్‌ సబ్జెక్టు విషయాల్ని అధ్యయనం చేయాలి.
నమూనా పరీక్షల్లో తప్పుల శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఎందుకలా జరుగుతోందో సమీక్షించుకోవాలి. విశ్లేషణాత్మక ప్రశ్నల్లో వెనకబడివుంటే ఆయా విషయాల్లోని భావనలను మరొక్కసారి పరిశీలించుకోవాలి. ఎక్కువశాతం ప్రశ్నలు అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టు అన్పిస్తే మాత్రం చదువుతున్న పుస్తకాలను మార్చెయ్యాలి!

No comments:

Post a Comment