లక్ష్యం గ్రూప్ - II

రాష్ట్రస్థాయిలో రెండో అత్యున్నత పరీక్ష గ్రూప్ ||. సాధారణ గ్రాడ్యుయేట్లు సామాజిక హోదా ఉన్న ఉద్యోగాన్ని సాధించడానికి ఈ పరీక్ష ఒక చక్కని మార్గం. ఖాళీల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలోని అంశాలు, ప్రిపరేషన్ విధానం గురించి తెలుసుకుందాం.
గ్రూప్ -|| పరీక్ష విధానం
మొత్తం మూడు పేపర్లుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటాయి.
పేపర్ -1 (150 మార్కులు) : జనరల్ స్టడీస్ 
పేపర్ -2 (150 మార్కులు) :  ఎ)  -  ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
                                              బి)  -  భారత రాజ్యాంగం - ఒక అవలోకనం.
పేపర్ -3 (150 మార్కులు) :  ఎ) భారతదేశంలో ప్రణాళికా రచన, భారతదేశ ఆర్థిక వ్యవస్థ
                                              బి) ఆంధ్రప్రదేశ్: ప్రత్యేక ప్రాధాన్యంతో గ్రామీణ సమాజంలో సమకాలీన  సమస్యలు, పరిణామాలు
ఇంటర్వ్యూ : (50 మార్కులు)
మొత్తం మార్కులు : 500
¤ ఆప్షనల్స్ లేవు
ప్రిపరేషన్ ఎలా
?               రాత పరీక్షలో అందరికీ ఒకేరకమైన పేపర్లు ఉంటాయి. ఆప్షనల్స్ లేవు. ఒక్కో విభాగానికి సిలబస్ ఆధారంగా సమయాన్ని కేటాయించి చదవాలి. సిలబస్ ఎక్కువగా ఉన్న పార్ట్‌కు కొంత ఎక్కువ సమయాన్ని, తేలికైన అంశాలకు కొంత తక్కువ సమయాన్ని ఇచ్చి మొత్తం మీద అన్ని విభాగాలు కవరయ్యేలా చూసుకోవాలి. 
 ¤ పేపర్ -1 - జనరల్ స్టడీస్ : దీన్లో చాలా వరకు ప్రాథమిక అంశాల (బేసిక్స్) పైనే అధిక ప్రశ్నలు వస్తాయి. కాబట్టి పాఠశాల స్థాయిలోని ఆయా సబ్జెక్టులను మరోసారి సునిశితంగా చదవాలి. పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. పరీక్షకు అనుగుణంగా జనరల్‌స్టడీస్ అంశాలను కింది విధంగా విభజించారు. 
¤  జనరల్ సైన్స్
¤  భారతదేశ చరిత్ర
¤  భూగోళశాస్త్రం (ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది)
¤  కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు)
¤  మెంటల్ ఎబిలిటీ.
గమనిక : మిగిలిన పోటీ పరీక్షల్లో మాదిరి ఇక్కడ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ విభాగాల నుంచి ఉండవు. ప్రశ్నలు ఇవ్వరు.
1) జనరల్ సైన్స్: ఇందులో భౌతిక, రసాయనిక, వృక్ష, జంతుశాస్త్రాలు; సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. సాధారణ శాస్త్ర విజ్ఞానంతోపాటు అంతరిక్ష విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అణుశాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి మొదలైన అంశాలుంటాయి. భౌతిక, రసాయనిక శాస్త్రాల్లో ప్రాథమిక కొలతలు, కాంతి, ఆధునిక భౌతికశాస్త్రం, బయోకెమిస్ట్రీ, ఎరువులు, మానవ శరీర నిర్మాణం తదితర టాపిక్‌లు ఉంటాయి.

ఈ విభాగం ఎక్కువగా లోతైన అధ్యయనంపై ఆధారపడిందికాదు. ప్రధానంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నిరంతరం సంభవిస్తున్న పరిణామాలు, ప్రాథమిక అవగాహనలపై ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వాటిపై ఎక్కువ దృష్టి సారించాలి. అయితే సబ్జెక్టు పరంగా ప్రతి అంశం గురించి సమాచారాన్ని సేకరించాలి. వాతావరణ పరిస్థితుల్లో వాయువులు, పర్యావరణం; రసాయన శాస్త్రంలో అణువులు, వాటి ధర్మాలు, రసాయనిక మూలాలు, రసాయనిక బంధాలపై ప్రశ్నలు వస్తాయి. అలాగే జీవశాస్త్రంలో జీవపరిణామ క్రమం, శాస్త్రజ్ఞుల పరిశోధనలు, వ్యాధులు, వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలు, విటమిన్లు, ప్రొటీన్లు, కిరణజన్య సంయోగక్రియ, మానవ జీర్ణవ్యవస్థ వంటి అంశాలను బాగా చదవాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికొస్తే సైన్స్ విధానాలు, పర్యావరణ కాలుష్యం, జీవసాంకేతిక పరిజ్ఞానం, సమాచార సాంకేతిక రంగం, ఉపగ్రహ వ్యవస్థ, నానోటెక్నాలజీ, క్షిపణులు, యుద్ధ వ్యవస్థ తదితర అంశాలను కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో అన్వయించుకోవాలి. అప్‌డేట్‌గా ఉండాలి.  
2) భారతదేశ చరిత్ర:  ఇది చాలా విస్తారమైంది. చరిత్రకారులు దీన్ని మూడు భాగాలుగా వర్గీకరించారు అవి
¤   ప్రాచీన
¤   మధ్యయుగ
¤   ఆధునిక యుగ చరిత్ర.
చరిత్ర ప్రారంభం మొదలు ముస్లిం పాలన, వలస వాదుల ఆక్రమణలు, బ్రిటిష్ పరిపాలన స్వాతంత్య్ర పోరాటం మొదలైన అంశాలన్నీ దీన్లో వస్తాయి. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి సింధు నాగరికత నుంచి అరబ్బుల దండయాత్ర వరకు; మధ్యయుగ భారతదేశ చరిత్రలో అరబ్బుల దండయాత్ర మొదలు 1857 సిపాయిల తిరుగుబాటు వరకు; ఆధునిక భారతదేశ చరిత్రలో భారత్‌లోకి యూరోపియన్ల రాక నుంచి స్వాతంత్య్ర ఉద్యమం వరకూ చదవాలి. జాతీయోద్యమంలో భాగంగా సిపాయిల తిరుగుబాటు, వందేమాతర ఉద్యమం, హోంరూల్ ఉద్యమం, దండిసత్యాగ్రహం, క్విట్ ఇండియా, బ్రిటిష్ వైస్రాయ్‌లు, గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యమైన ఘటనలకు సంబంధించి విడిగా నోట్స్ రాసుకుంటే సిలబస్ అధికమనే సమస్య ఉండదు.
                  చరిత్ర సిలబస్ చదవడానికి ప్రణాళిక వేసుకోవాలి. లేకపోతే ఎంత చదివినా ఇంకా మిగిలే ఉంటుంది. కళలు, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలను క్షుణ్నంగా చదవాలి. ప్రధాన, చారిత్రక యుద్ధాలు ఎప్పుడు జరిగాయో గుర్తుపెట్టుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను అధ్యయనంచేస్తూ ప్రశ్నలు ఏ తరహాలో వస్తున్నాయో గ్రహించాలి. ఆయా టాపిక్‌లను ఇంకా ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్‌లోనే ఉన్నా ఆన్సర్ చేయడంలో మాత్రం నిశిత పరిశీలనా శక్తి అవసరం. 

3) భౌగోళికశాస్త్రం: ప్రపంచ; భారతదేశ; ఆంధ్రప్రదేశ్‌కు భౌగోళికంగా ఉన్న హద్దులేమిటి? విశ్వ రహస్యాలేమిటి; సౌరకుటుంబం, వాతావరణం - ప్రకృతి మార్పులు, రుతుపవనాలు, ప్రపంచం పారిశ్రామిక జనాభా, ఉత్పత్తులు, ఇంధన వనరులు మొదలైన అంశాలను చదవాలి. భారతదేశ భౌగోళిక అంశాలతో పాటు రాష్ట్ర భౌగోళిక అంశాలపై కూడా ఎక్కువ శ్రద్ధపెట్టాలి. ప్రపంచ పటాన్ని దగ్గర పెట్టుకుని ఏ ఖండం ఎక్కడ నుంచి ఎక్కడదాకా విస్తరించింది? భారతదేశ భౌగోళిక స్వరూపం, దాన్లో రాష్ట్ర స్వరూపం ఎలా ఉందో నోట్ చేసుకోవాలి. దేశాభివృద్ధికి సహకరించే బహుళార్థ సాధక ప్రాజెక్టులు, మత్స్య సంపద, పరిశ్రమలు, మౌలిక ఉత్పత్తులు వంటి అంశాలను చదవాలి.
4) కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు): నిత్యం పేపర్లలో, టీవీల్లో చూస్తున్నవే. అయినా పరీక్షలో అడిగే విధానం విభిన్నంగా ఉంటుంది. కరెంట్ టాపిక్స్ అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినంత వరకే పరిమితం కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వివిధ సంఘటనలు వస్తాయి. వార్తల్లోని ప్రదేశాలు, వ్యక్తులు; అవార్డులు, నియామకాలు, క్రీడలు - ప్రదేశాలు, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరిణామాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రముఖ వ్యక్తుల పర్యటనలు, మరణాలు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
                    పరీక్షకు ముందు సుమారు 5 లేదా 6 నెలల నుంచి దీనికోసం సిద్ధం కావాలి. రోజూ ప్రధాన దినపత్రికలు చూస్తూ నోట్స్ రాసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ విభాగాలుగా నోట్స్‌ను సెట్‌చేసుకుని టాపిక్‌లను ఆయా విభాగాల్లో రాసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ పోవాలి. 

5) మెంటల్ ఎబిలిటీ: టెన్త్ వరకు చదివిన మ్యాథమెటిక్స్ ప్రాథమిక మూల సూత్రాల చుట్టూనే ప్రశ్నలు ఉంటాయి. అధిక మార్కుల కోసం ఎక్కువగా పేపర్ వర్క్ చేయాలి. దీన్లో రీజనింగ్, అరిథ్‌మెటిక్‌లకు సంబంధించిన అంశాలుంటాయి. నాన్-వెర్బల్ రీజనింగ్ విభాగం దీన్లో లేదు. రీజనింగ్‌లో డైరెక్షన్స్, కోడింగ్, డీ-కోడింగ్, డైరెక్షన్స్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్, క్లాసిఫికేషన్స్, లాజికల్ వెన్ డయాగ్రమ్స్ మొదలైనవి ఉంటాయి. ఇక అరిథ్‌మెటిక్ విభాగంలో సరాసరి, శాతాలు, సగటు, భాగస్వామ్యం, సింప్లిఫికేషన్స్, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం - పని, కాలం -దూరం, క్షేత్రగణితం తదిర అంశాలు వస్తాయి.
           మెంటల్ ఎబిలిటీ విభాగంపై పూర్తి సాధన కోసం మోడల్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్లు, టెన్త్ వరకు ఉన్న ప్రాథమిక మ్యాథ్స్ సబ్జెక్టు అంశాలను బాగా స్టడీ చేయాలి. సూత్రాలను బాగా గుర్తుంచుకోవాలి.
పేపర్ -2
ఎ) భారత రాజ్యాంగం - ఒక అవలోకనం - 75 మార్కులు
బి) ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర - 75 మార్కులు
ఎ) భారత రాజ్యాంగం - ఒక అవలోకనం: ఈ విభాగంలో మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. ఒక్కో దాన్నుంచి కనీసం 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 చాప్టర్లనూ చదవాల్సిందే. భారత రాజ్యాంగ నిర్మాణం మొదలు, చట్టాలు, షెడ్యూళ్లు, రాజ్యాంగ మౌలిక లక్షణాలు, ప్రాథమిక హక్కులు - ఆదేశ సూత్రాలు చదవాలి. రెండోవిభాగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, అవశిష్టాధికారాలు తెలుసుకోవాలి. మూడోవిభాగంలో సమాజ వికాస ప్రయోగం కింద మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ, రాజ్యాంగ సవరణలు, వాటి అమలు వస్తాయి. నాలుగోవిభాగంలో భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం, అల్ప సంఖ్యాక వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర కులమత వర్గాలకు వర్తించే చట్టాలు మొదలైనవి అధ్యయనం చేయాలి. అయిదో విభాగంలో శాసనసభ వ్యవస్థలుంటాయి. ఈ విభాగంలో పట్టు సాధించేందుకు పక్కా వ్యూహంతో వెళ్లాలి.

ఒకదానితో మరొక అంశం ముడిపడి ఉన్నప్పుడు తర్కబద్ధంగా ఆలోచించి ఆయా అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రిపరేషన్ కోసం అన్ని యూనిట్లను సమగ్రంగా చదువుకుంటూ పోవాలి. భారత రాజకీయ వ్యవస్థలో ఎప్పటికప్పుడు వస్తున్న తాజా పరిణామాలు, సుప్రీం కోర్టు తీర్పులు, చట్టాలు - సవరణలు నోట్ చేసుకోవాలి. పరిపాలనా యంత్రాంగం విధి విధానాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
బి) ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర:  ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, రాజకీయంగా సంభవించిన పరిణామాలు, చరిత్రలో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యం మొదలైన అంశాలను చదవాలి. రాష్ట్ర సంస్కృతి, ఇతర సామాజిక సంప్రదాయాల ప్రభావం గమనించాలి. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం, రాష్ట్రంలో స్వాతంత్య్ర ఉద్యమ వ్యాప్తి, సాహితీ వికాసం, వాస్తు శిల్ప సంపద, లలిత కళలు తదితర అంశాలను బాగా చదవాలి.
పేపర్
-3 ఎ) భారతదేశంలో ప్రణాళికా రచన, భారతదేశ ఆర్థిక వ్యవస్థ - 75 మార్కులు
బి) ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రాధాన్యంతో గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, పరిణామాలు - 75 

మార్కులు
            ఆర్థిక రంగాన్ని సిలబస్ వారీగా అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీని సాధారణ పరిజ్ఞానంతో అర్థం చేసుకోవాలి. ప్రణాళికా బద్ధంగా, లోతుగా చదవాలి. పేపర్ - 2, పేపర్ - 3లలో ఒక్కో దాంట్లో 75కు 70 మార్కుల దాకా స్కోర్ చేయవచ్చు. తాజా సమాచారంతో ఈ పేపర్లను చదవాలి. 

) భారతదేశంలో ప్రణాళికా రచన: భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక భావనలపై ఎంత పట్టు సాధిస్తే అంత ప్రయోజనం ఉంటుంది.     
ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, బ్యాంకింగ్ రంగం, జాతీయాదాయం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఆర్థిక సంస్కరణలకు ప్రత్యేకంగా చోటు కల్పిస్తూ ఆర్థిక సంస్కరణల ప్రారంభంతో వచ్చిన మార్పులపై మంచి అవగాహన ఏర్పరచుకోవాలి.
బి) ఆంధ్రప్రదేశ్ - ప్రత్యేక ప్రాధాన్యంతో గ్రామీణ సమస్యలు: ఇక్కడ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించిన పూర్తి అవగాహన అవసరం. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏయే పంటలు ఎక్కువగా పండుతాయి? గ్రామీణ అభివృద్ధి పథకాలు ఏమిటి? నీటిపారుదల వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి మొదలైన అంశాలను తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద మంచి పట్టు ఉండేలా చూసుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార రంగం, ప్రత్యామ్నాయ మార్గాలు, భూ సంస్కరణలు వాటి పరిణామాలు, ప్రణాళికల్లో రాష్ట్ర కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక పురోగతి నివేదికలు తదితర అంశాలను విపులంగా చదివి, ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోవాలి.
గుర్తుంచుకోండి ¤  సిలబస్‌పై పూర్తి స్పష్టత ఏర్పరచుకోవాలి.
¤  ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను వర్గీకరించుకోవాలి.
¤ పరీక్ష నెల ముందు నుంచీ మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో సమయం ఎలా ఆదాచేయాలో తెలుస్తుంది. అంతేకాదు క్లిష్ట సమస్యలను ఏ విధంగా ఆన్సర్ చేయవచ్చో ఒక అవగాహన ఏర్పడుతుంది.
¤  ప్రశ్నలు ఎలా వస్తున్నాయో గమనించాలి. దీనివల్ల పరీక్ష ప్రశ్నల స్థాయి తెలుస్తుంది.


  చదవాల్సిన పుస్తకాలు ¤  జనరల్ స్టడీస్ - టాటా మెక్‌గ్రాహిల్ -జనరల్ స్టడీస్ గైడ్.
¤  కరెంట్ అఫైర్స్ - ప్రధాన దినపత్రికలు, పోటీ పరీక్షల మ్యాగజీన్‌లు
¤  ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎన్.ఎల్.హనుమంతరావు.
¤  ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర - రఘునాథరావు.
¤  ఇండియన్ పాలిటీ - కె.లక్ష్మీకాంత్
¤  భారత ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడమీ పుస్తకాలు.
వీటితోపాటు ఇయర్‌బుక్, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే మొదలైనవి.


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

1 comment:

  1. Sir,
    I Want to prepare to Group-II So how can i start what type of books to be fallow please give yours valuable information

    ReplyDelete