సివిల్స్‌ తెలుగును అశ్రద్ధ చేస్తే అసలుకే మోసం!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మన రాష్ట్ర విద్యార్థులకు తప్పనిసరి పేపర్‌గా మాతృభాష తెలుగు ఉంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే అయినా నిర్లక్ష్యం వహిస్తే అర్హత కోల్పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు డా. ద్వా.నా. శాస్త్రి.

అర్హత పరీక్షగా తెలుగు 300 మార్కులకు జరుగుతుంది. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. అయితే నలబై శాతం మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. అంటే 120 మార్కులు! 'ఈ మాత్రం రావా?' అనే నిర్లక్ష్యం పనికిరాదు. అశ్రద్ధ వల్ల 'క్వాలిఫై' అవ్వని అభ్యర్థులూ ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు.

'క్వాలిఫైయింగ్‌' తెలుగులో మొత్తం ఆరు ప్రశ్నలుంటాయి.

1) 300 పదాలతో వ్యాసం - 100 మార్కులు 2) ఒక ఖండిక ఇచ్చి చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయటం- 60 మార్కులు 3) ఒక ఖండికను మూడోవంతు పరిమాణానికి తగ్గించి రాయటం- 60 మార్కులు 4) ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించటం- 20 మార్కులు 5) తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించటం - 20 మార్కులు 6) ఎ) జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటం- 20 మార్కులు బి) సమానార్థక పదాలు రాయటం- 20 మార్కులు

పదో తరగతి స్థాయికి తగినది అని చెపుతున్నా నిజానికి ఈ పేపర్‌ డిగ్రీ స్థాయికి చెందినదే. పైగా ఆంగ్లమాధ్యమంలో చదువుతున్న అభ్యర్థులకు తెలుగు రాసే అలవాటు అంతగా ఉండదు. అందుకే ఈ పేపర్‌ను తేలిగ్గా తీసుకోవటం, నిర్లక్ష్యం చేయటం సరికాదు.

మొదటి ప్రశ్న
ఇది 'జనరల్‌ ఎస్సే'కి సంబంధించినది. సుమారు 300 పదాల్లో రాయమన్నారు కాబట్టి ఓ ఇరవై పదాలు ఎక్కువైనా, తక్కువైనా పట్టించుకోరు. తక్కువ రాయటం కంటే ఇరవై పదాలు ఎక్కువైనా ఫరవాలేదనుకోవాలి. లెక్కపెట్టి మరీ రాయనవసరం లేదు.

ఒక పేజీ రాసినతర్వాత సుమారుగా ఎన్ని పదాలు వచ్చాయో చూసుకుని దాని ప్రకారం రాయవచ్చు. వంద మార్కులున్నాయి కాబట్టి ఆచితూచి రాయాల్సివుంటుంది. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే... ఐదు ప్రశ్నల్లో ఒకటే రాయటం. 'చాయిస్‌' ఎక్కువుంది కాబట్టి దిగులు చెందనక్కర్లేదు.

నేపథ్యం, ప్రారంభం, విషయ వివరణ, అనుకూల ప్రతికూల అంశాలు, ప్రస్తుత స్థితి, సూచనలు, ముగింపు... అనేవాటిపై దృష్టి ఉంచి వ్యాసం రాయాలి. పెద్దల మాటలనూ, కవుల వాక్యాలనూ, సామెతలనూ, జాతీయాలనూ ప్రయోగిస్తే మార్కులు ఎక్కువ సంపాదించవచ్చు. అనుకూలమైనా, ప్రతికూలమైనా చర్చించే పద్ధతిని బట్టి మార్కులుంటాయి. సోదాహరణంగా వివరిస్తే స్పష్టత సాధించవచ్చు.

రెండో ప్రశ్న
చివరలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు- పైన ఇచ్చిన ఖండికలోనే ఉంటాయి. జాగ్రత్తగా చదివితే చాలు. అయితే సమయం ముఖ్యమని మర్చిపోకూడదు. ఖండికలో ఉన్నట్టే రాయక్కర్లేదు- 'మీ సొంత మాటల్లో' రాయాలని సూచిస్తారు.

మూడో ప్రశ్న
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇచ్చిన ఖండికను మూడో వంతు పరిమాణానికి తగ్గించి సంక్షిప్తంగా రాయాలి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన కాగితాలపైనే రాసి ప్రధాన సమాధాన పత్రానికి జత చేయాలి. మూడోవంతుకు తక్కువైనా, ఎక్కువైనా తగిన విధంగా మార్కులుంటాయన్న హెచ్చరికను గమనించాలి. కాబట్టి మొత్తం పంక్తులు లెక్కబెట్టి మూడో వంతుకు ఎన్ని పంక్తులు వస్తాయో ముందుగానే సరిచూసుకోవాలి. ఇలా సంక్షిప్తం చేయడమంటే ఇచ్చిన సమాచారంపై అవగాహన ఉండాలని భావం. రెండు మూడు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంగా కుదించాలి. భావం మారకుండా, సొంత కవిత్వం లేకుండా రాయాలి. ఇందుకు సామెతలు, జాతీయాలు తోడ్పడతాయి. రెండు మూడుసార్లు చదివినతర్వాతనే సంక్షిప్త రచన చేపట్టాలి.

అనువాదం
ఆంగ్లం నుంచి తెలుగులోకీ, తెలుగు నుంచి ఆంగ్లంలోకీ అనువదించమనే ప్రశ్నలుంటాయి. అనువాదం ఎప్పుడూ యథాతథానువాదం కాకూడదు. అంటే మక్కీకి మక్కీ ఉండకూడదు. భావాన్ని సొంతమాటల్లో చెప్పాలి. అనువాదంలా కాకుండా 'అనుసృజన' లాగా ఉండాలి.

రెండు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంలో చెప్పవచ్చు. సరైన పదాలు తట్టకపోతే మూలపదాలను అలాగే రాసి కొటేషన్లలో రాయవచ్చు. ఆంగ్లపదాలను రాయాల్సివస్తే ఆంగ్లంలో కాకుండా వాటిని కొటేషన్లో ఉంచి తెలుగులో రాయాలి. ఉదా: 'కంప్యూటర్‌', 'అడ్మినిస్ట్రేషన్‌', 'ఇంటర్వ్యూ' మొదలైనవి. అనువాదంలో భాషానుగుణమైన పదప్రయోగాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్లంలో staying at hotel అంటారు. దీన్ని తెలుగులో రాసేటప్పుడు 'హోటల్‌ వద్ద' అనకుండా 'హోటల్‌లో'బస చేస్తున్నాడనాలి. ఆంగ్లంలోని 'బ్రెడ్‌' అనే మాటను సందర్భాన్నిబట్టి 'ఆహారం' అని మార్చాల్సివుంటుంది. ఇలాంటి మెలకువలు గ్రహించాలి.

సొంతవాక్యాల్లో జాతీయాలు
ఇది ఎంత తేలికో అంత కష్టమైనది. జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటమంటే లోకజ్ఞానం, సందర్భం తెలిసివుండాలి. జాతీయం అనేది రెండు మూడు పదాల కలయిగా ఉండే పదబంధం. ఆంగ్లంలో 'ఇడియమ్‌' అంటారు. అసలైన అర్థం కాకుండా దానికి సంబంధించి మరో అర్థం వస్తుంది.

'కళ్ళల్లో కారం పోసుకోవడం' అంటే నిజంగా ఆ అర్థం కాదు. ఈర్ష్య పడటం, అసూయపడటం, ఓర్వలేకపోవడం అని. దీన్ని గ్రహించి వాక్యంలో ప్రయోగించాలి.

* వడ్డించిన విస్తరి: అధికారం, సంపద గలవారి జీవితం వడ్డించిన విస్తరి వంటిది.

* నత్తనడక: ప్రభుత్వ ప్రణాళికలు చాలావరకూ నత్తనడక నడుస్తున్నాయి.

*  చెవి కోసుకోవడం: కథలంటే మా అన్నయ్య చెవి కోసుకుంటాడు.

అమృతము= పీయూషము, సుధ

కలువ= ఉత్పలము, కల్హారం, కుముదం

మనుష్యుడు= మానవుడు, మనుజుడు, మర్త్యుడు, నరుడు, పురుషుడు

వాయువు= గాలి, మారుతము, పవనము, అనిలం, సమీరం

ఈ విధంగా తెలుగు అర్హత పరీక్ష ఉంటుంది. జనరల్‌స్టడీస్‌, ఆప్షనల్స్‌ ఎంత బాగా చదివినా, ఎంత బాగా రాయగలిగినా మాతృభాషలో అర్హత పొందకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరు విధం అవుతుంది. కాబట్టి మెయిన్స్‌కు సన్నద్ధమయ్యేవారు దీనిపై దృష్టి పెట్టడం అవసరం.

ఒక్కమాట- తెలుగులో రాయటం అంటే వాడుకభాషలో రాయటమే. పత్రికాభాషలో రాయటమే!
Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

No comments:

Post a Comment