మనసులో మాట 'ప్రేమిస్తున్నా'నంటూ వెంటపడ్డాడో అబ్బాయి. 'జీవితంలో స్థిరపడితే అప్పుడాలోచిస్తా' అందా అమ్మాయి. తీరా కుర్రాడికి ఉద్యోగమొచ్చాక ఏమైంది?
ప్రేమా... నీకు జోహారు!
అదేం మహత్యమో! తన మాట నాలో వూహించని మార్పు తీసుకొచ్చింది. చెప్పినట్టే కష్టపడి చదివా. సెకండ్ క్లాస్‌తో డిగ్రీ పాసయ్యా. తర్వాత ఓ స్కూళ్లో టీచర్‌గా అవతారమెత్తా. స్థిర పడ్డానన్న ఫీలింగ్. ఆలస్యం చేయకుండా నా మనసులో మాట చెప్పేశా. తప్పకుండా 'ఓకే' చెబుతుందనే నమ్మకం. సీన్ రివర్సైంది. 'నాకా ఉద్దేశం లేద'ంటూ తేల్చేసింది. 'డిగ్రీ చదివా. నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నా. ఇంకేం కావాలి?' అంటూ వాదనకు దిగా. ముందు మౌనంగా ఉంది. కాసేపయ్యాక నోరు విప్పింది. 'బతకడానికి ప్రేమొక్కటే సరిపోదు. ముందు జీవితంలో స్థిరపడు అప్పుడాలోచిస్తా' అంది. పట్టుదలతో అక్కడ్నుంచి కదిలా.
ఎంట్రన్స్ రాసి బీఈడీలో జాయినయ్యా. మధ్యమధ్యలో తనను కలిసేవాణ్ని. బాగా ప్రోత్సహించేది. ఆమె ప్రతి మాటా ఓ సూచనలా ఉండేది. ప్రతి ఆలోచన జీవితంపై ప్రేమను పెంచేది. బీఈడీ చివరి పరీక్షలు. అప్పుడే తనకు పెళ్లి చూపులని తెలిసింది. పరుగెత్తుకెళ్లాను. 'చూపులే. పెళ్లికి ఒప్పుకోన్లే' అని భరోసా ఇచ్చింది. తర్వాత ఫస్ట్‌క్లాస్‌తో బీఈడీ పాసయ్యా. అదృష్టం కొద్దీ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్. పోయినేడుతో పోల్చితే తక్కువ పోస్టులు. జాబ్ రాదేమోనని మళ్లీ నిరాశ. 'తప్పకుండా జాబ్ కొడతావ్. ఇదే నీ ప్రేమకు చివరి పరీక్షనుకో' అంది. అది టానిక్‌లా పని చేసింది. పగలు రాత్రులు ఏకం చేసి చదివా. ఆఖరికి బాత్రూమ్‌కెళ్లినా చేతిలో పుస్తకముండేది. ఆ కష్టానికి ఫలితం దక్కింది. జిల్లాలో వందలోపు ర్యాంకు. కోరుకున్నచోట పోస్టింగు. చెప్పలేనంత ఆనందం. గర్వంతో ఆమె ముందు నిలబడ్డా. విషయం వినగానే తన కళ్లలో మెరుపు. ఆమె హడావుడి చూసి నా ప్రేమకు గ్రీన్‌సిగ్నల్ వచ్చేసిందనుకున్నా.
ఇంకోసారి నా వూపిరి ఆగిపోయే మాట వినాల్సి వచ్చింది. 'నా పెళ్లి ఫిక్సయింది' అంటూ ఓరోజు బాంబు పేల్చింది. సంతోషం స్థానంలో విషాదం. 'ఎందుకిలా?' అన్నా కన్నీళ్లతో. 'నువ్ బాగు పడాలనే' జవాబొచ్చింది. 'ముందే నీ ప్రేమకు నో చెబితే నువ్ ఇంత పట్టుదలగా చదివే వాడివా? టీచర్ అయ్యేవాడివా?' అని ప్రశ్నించింది. తను చెప్పిందినిజం. తను అప్పుడే అలా చేస్తే దేవదాసులా మారిపోయేవాణ్నేమో! ఉద్యోగం వచ్చాక కూడా నన్ను వద్దనడానికీ కారణం చెప్పింది. 'ఇరవై ఏళ్లు ప్రాణంలా పెంచిన తల్లిదండ్రుల్ని ఎదురించలేను' అని. ఏదేమైనా ఆమె నిర్ణయం కొన్నాళ్లు నా మనసును తీవ్రంగా బాధపెట్టింది. తర్వాత తేరుకుని మళ్లీ మామూలు మనిషయ్యా. ఇప్పుడు నేను వేరొకరికి భర్తను. చక్కని సంసారం. ఈ సంతోషకరమైన జీవితం ఆమె చలవే.
No comments:
Post a Comment