నిన్నటిదాకా లక్షల్లో ఒకరు... ఇప్పుడు కోట్లమంది మెచ్చిన హీరోలు... బుగ్గకారు... దర్పం... సమాజంలో గౌరవం... ఇవన్నీ ఒక్కరోజు శ్రమకు దక్కిన ఫలితం కాదు... కొందరు త్యాగాలు చేశారు... ఇంకొందరు ఉద్యోగాలే వదులుకున్నారు... అపజయాలనే విజయాలకు సోపానాలుగా మలుచుకున్నారు... వీళ్లని విజేతలుగా నిలిపిన లక్షణాలేంటి? ముందుకు నడిపించిన శక్తులేంటి? విశ్లేషిస్తున్నారు మానసిక వ్యక్తిత్వ నిపుణులు.
ప్రేరణ, తపన, పట్టుదల, సకారాత్మక ఆలోచన విధానం, వైఫల్యాలకు నిరాశపడకపోవడం, కొంచెం సాధించగానే సంతృప్తి పడక పోవడం... ఇలా ఎన్నో చక్కని లక్షణాలు విజేతల వెనుక చోదక శక్తిగా ఉంటాయి. వీటిలో అన్నీ, లేదా కొన్ని కొందరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ వారిని ముందుకు నడుపుతాయి. మనం గమనించాల్సింది ఆ లక్షణాలనే.
ఆగిపోకు అక్కడే
సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయమనుకుంటే పొరపాటు. ఉన్నదాంతో సమాధానపడిపోతే కాలం గడిచిపోతుంది. పైకి లోపమేదీ ఉండకపోవచ్చు. కానీ విజయంలోని మజా దూరమవుతుంది. ఎవరైనా ఉత్తమ స్థితికేసి దృష్టి సారిస్తేనే అద్భుత ఫలితాలు అందుకుంటారు.
ఉదాహరణ: రెండో ర్యాంకు సాధించిన హైదరాబాద్ అమ్మాయి శ్వేతా మొహంతిలో ఇది ప్రస్ఫుటం. తండ్రి, భర్తలు ఐఏఎస్‌లు. తనదీ మంచి ఉద్యోగమే. సంతృప్తి పడి పోతే ఈనాటి విజయం లేదు. ముద్దులొలికే పాపతో పొద్దు గడిచిపోయేది. అయినా శ్వేత లక్ష్యం నిర్దేశించుకుంది. మొదటిసారి ప్రిలిమ్స్ దాటకపోయినా నిరాశతో వెనుకడుగేయలేదు. రెండోసారి 312 ర్యాంకుతో మంచి ఉద్యోగం వచ్చినా ఆగిపోలేదు. ముచ్చటగా మూడోసారి అనుకున్నది సాధించింది. రెండో ర్యాంకుతో దేశం దృష్టిని ఆకర్షించింది.
ఆశయమే ఆలంబన!
వాహనం నడవాలంటే ఇంధనం కావాలి. మనిషి ఎదగాలంటే ప్రేరణ కావాలి. విజయ పథంవైపు నడిపించే లక్షణాల్లో ఉత్తమమైన ఆశయం కూడా ఒకటి. అదే చోదక శక్తిగా మారి మార్గాన్ని నిర్దేశిస్తుంది. దాన్ని మనసులో ముద్రించుకున్నవారు మాత్రమే విజయాల దిశగా అడుగులు వేస్తారు.
ఉదాహరణ: హైదరాబాదీ అనిరుధ్ శ్రవణ్‌ది ఉన్నత స్థాయి కుటుంబం. కానీ అతడి దృష్టి ఎప్పుడూ పక్కనే ఉన్న గుడిసెల్లోని పేదలపైనే. సర్కారీ బడుల్లోని పిల్లల కోసం స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేశాడు. అదే తపన ఐ.బి.ఎం.లో ఉద్యోగం వదులుకునేలా చేసింది. సివిల్స్ సాధించేలా పట్టుదలను రగిల్చింది. మొదటి ప్రయత్నం విఫలం. రెండోసారి మూడు మార్కులతో మిస్. సేవా సంకల్పమే అతడిలో స్ఫూర్తిని రగిల్చింది. మూడో ప్రయత్నంలో పదమూడో ర్యాంకు ఇచ్చింది. 'సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పేదో ముందు మన నుంచే మొదలవ్వాలి' అంటాడు అనిరుధ్.
పట్టుదలతో ఫలితం!
చేయాలనుకున్న పనిని చేసేవరకు నిద్రపోని మనస్తత్వం విజేతల సొంతం. దీని కోసం ఇష్టాలను వదులుకుంటారు. కష్టాలకు ఎదురెళ్తారు. ఇందులో పేదా, గొప్ప తారతమ్యాలుండవు. స్థాయి, హోదాలు కానరావు. ఐఏఎస్ కూతురుకైనా, వాచ్‌మెన్ కొడుకుకైనా అందరిదీ ఒకే పంథా.
ఉదాహరణ: వాచ్‌మెన్ కొడుకు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఈ పరిస్థితుల్లో దొడ్డె ఆంజనేయులు సివిల్స్ సాధించాలనుకోవడం సాహసమే. చదువుల యాగం మొదలుపెట్టాడు. పది నుంచి ఇంజినీరింగ్ దాకా అన్నింట్లోనూ ర్యాంకులే. సాఫ్ట్‌వేర్ కొలువులో చేరాడు. ఏడాదికి ఏడు లక్షల రూపాయల జీతం. కానీ చిన్ననాటి లక్ష్యం ముందు ఇది చిన్నగానే కనిపించింది. ఉద్యోగం వదిలేసి పేదవాళ్లకు మేలు చేయాలని తపించాడు. ఈలోగా నాన్న మరణం. మొదటి రెండు ప్రయత్నాలూ ఫెయిల్. వేరొకరైతే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయేవారేమో! కానీ పట్టుదల తోడుగా ఆంజనేయులు 278 ర్యాంకు సాధించాడు. అందుకే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎస్సీ కాలనీ అతడిని తల్చుకుని గర్విస్తోంది.
ఒకొక్కటిగా లక్ష్యాలు!
జీవితంలో ఎదగాలనుకునే వారికి ఒక లక్ష్యం చాలదు. ఒక దాని తర్వాత మరో లక్ష్యం పెట్టుకుంటూ ముందుకు సాగుతారు. అదే వారికి విజయ సోపానమై ఉన్నత స్థితికి చేరుస్తుంది.
ఉదాహరణ: ఇరవై అయిదో ర్యాంకు సాధించిన ప్రకాశం జిల్లా కుర్రాడు జయచంద్ర భానురెడ్డిని విజేతగా నిలిపింది ఈ లక్షణమే. అతడి మొదటి లక్ష్యం మెడిసిన్. ర్యాంక్ సాధించి మెడిసిన్‌లో చేరినా సరదాగా గ్రూప్ 1 రాశాడు. ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. కానీ మొదటి లక్ష్యం పూర్తి అయ్యాకే మరొకటి అనుకున్నాడు. మెడిసిన్ అయింది. అయినా ఆగలేదు. ఈసారి లక్ష్యం సివిల్స్. మొదటి ప్రయత్నం ఫెయిల్. రెండో ప్రయత్నం సెభాష్!
మనసు తలుపులు తెరిస్తే...
సమాజంలో పరస్పర సహకారం లేనిదే ఏదీ సాధ్యం కాదు. ఇది గ్రహించిన వారు ఇతరుల నుంచి సూచనలు అందుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. ఇతరుల నుంచి ప్రోత్సాహం పొందాలంటే వారిలోని గొప్పదనాన్ని గ్రహించాలి. మనసు తలుపులు తెరిస్తే నలుదిశలా సహకారమే.
ఉదాహరణ: చదువుతున్న దశ నుంచీ హెప్సిబా రాణి అందరి సలహాలు వినయంగా స్వీకరించేది. ఢిల్లీలో పీజీ చదువుతున్నపుడు అక్కడికొచ్చే ప్రముఖులు, శాస్త్రవేత్తలను కలిసేది. విలువైన సూచనలు తీసుకునేది. విజయవాడలో ఉన్నపుడు మునిసిపల్ కమిషనర్ గుల్జార్ బ్లాగుని ఫాలో అయ్యేది. సబ్‌కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సివిల్స్ ఇంటర్వ్యూకు సంబంధించి సూచనలిచ్చారు. ఐఏఎస్‌లు వీణ, పి.కె.మహంతిలను తరచూ కలిసేది. 'సునామీ గురించి తెలుసుకో' అని అమ్మ ఇచ్చిన సలహా కూడా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నగా వచ్చింది. అందువల్లనే కృష్ణాజిల్లా గడ్డమణుగుకు చెందిన ఈ అమ్మాయి ఇరవయ్యో ర్యాంకు సాధించింది.
స్ఫూర్తి గెలిపిస్తుంది
ఉన్నత స్థానంలో నిలిచినవాళ్లను చూసి ఆశ్చర్యపోవడం సామాన్యుల వంతు. ఆ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని వారి సరసన చేరడం విజేతల లక్షణం. ఆ స్ఫూర్తే సంకల్పంగా మారుతుంది.
ఉదాహరణ: కడప జిల్లాకు చెందిన పొమ్మల సునీల్‌కుమార్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. అన్న సంపత్‌కుమార్ గ్రూప్ 1లో విజయం సాధించి ఆర్డీవోగా ఎంపికవడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. సివిల్స్ లక్ష్యాన్ని ఏర్పరిచింది. మొదటి ప్రయత్నంలో పది మార్కులతో సర్వీస్ మిస్. అయినా నేలకు కొట్టిన బంతిలా పైకి లేచాడు. రెండో ప్రయత్నంలో 18వ ర్యాంకు.
పకడ్బందీ ప్రణాళిక!
మొదట ఏం సాధించాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. తర్వాత దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక అనుక్షణం దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రణాళికను అమలులో పెట్టాలి.
ఉదాహరణ: గుంటూరు జిల్లా చిలుమూరు కుర్రాడు కొలసాని వెంకట సుబ్బయ్య చౌదరి విజయంలో ఈ లక్షణాలే కనిపిస్తాయి. సివిల్స్‌లో 26వ ర్యాంకు సాధించిన ఇతడు పెద్ద ఉద్యోగాలను కాదని తానేం చేయాలో నిర్ణయించుకున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు వారికోసమే సివిల్స్ సాధించాలనే స్పష్టత వచ్చింది. పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమం. పీజీ తర్వాత ఉద్యోగావకాశాలు వచ్చినా సేవా మార్గాన్ని ఎంచుకున్నాడు. తొలి ప్రయత్నంలో 268వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కి ఎంపికైనా తిరిగి రాసి 26వ ర్యాంకు సాధించాడు. ప్రతి సబ్జెక్ట్‌పైనా సొంతంగా నోట్స్ రాసుకోవడం, రోజుకి పది గంటలు చదవడం అతడి ప్రణాళికలో భాగం.
స్పష్టత ముఖ్యం!
ఎంత సేపు చదివామనేది ముఖ్యం కాదు. చదివినంత సేపు ఎంత స్పష్టతతో చదివామనేదే ప్రధానం. ఇది సాధించాలంటే ఇంత సేపు చదవాలని దేనికీ నిర్ణయమై ఉండదు. చదివిన ప్రతి విషయంపై మనసులో స్పష్టత కలిగి ఉండడం ముఖ్యం.
ఉదాహరణ: పదో తరగతి వరకూ తెలుగు మాధ్యమమే. ఇంటర్ వరకు గుంటూరులో. ఆపై చెన్నైలో కంప్యూటర్ ఇంజినీరింగ్. సాఫ్ట్‌వేర్ సంస్థలో ఎంపిక. జీవితం స్థిరపడిపోయింది. కానీ మనసు సమాధాన పడలేదు. అందుకే గుంటూరు జిల్లా వీరాపురానికి చెందిన రైతు కుటుంబంలోంచి వచ్చిన శాఖమూరి చంద్రశేఖర్ 24వ ర్యాంక్ సాధించాడు. తొలిసారి 422వ ర్యాంకు వచ్చి అనువైన కొలువు పొందినా రెండోసారి యత్నం. అదీ కాదని మూడోసారి విజయం. రోజుకు కేవలం ఆరు నుంచి ఎనిమిది గంటలే చదివినా స్పష్టతతో చదవడం మేలు చేసింది. సినిమాలు, ఫంక్షన్లు మానకుండానే సాధించడం విశేషం. గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ఇప్పుడితడి స్పష్టమైన లక్ష్యం.
ప్రతికూల ఆలోచనలకు స్వస్తి!
మనసు విభిన్న ఆలోచనల పుట్ట. ప్రతి కూల ఆలోచనలను అది ఎప్పుడూ ముందుకు తెస్తుంటుంది. వాటిని దూరం చేసుకుంటేనే విజయం. పల్లెటూరి వాడిననో, ఇంగ్లిషు రాదనో, కష్టపడినా ఫలితం ఉండదనో లాంటి ఆలోచనలకు లొంగకూడదు.
ఉదాహరణ: నాన్న పది కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి పాల వ్యాపారం చేస్తేనే ఇల్లు గడిచే నేపథ్యం. చదువు కోసం వడ్డీకి అప్పులు చేసిన ఆర్థిక స్థితి. ఆ పరిస్థితులే చదువును వెలిగించాయి. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారి పల్లె నుంచి వచ్చిన కుర్రాడు అన్నం మల్లికార్జున 252వ ర్యాంకు సాధించడానికి కారణం ప్రతికూల ఆలోచనలు జయించడమే. ఎంసెట్ ర్యాంకుతో మెడిసిన్ సాధించి పల్లెటూరిలో వైద్యాధికారిగా చేరినా గ్రామీణుల కోసం సివిల్స్ లక్ష్యం ఏర్పడింది. రెండు సార్లు పరీక్షలో, మూడోసారి ఇంటర్వ్యూలో వైఫల్యం. అయినా ఆగలేదు కాబట్టే ఇప్పుడు చక్కని ర్యాంక్.
సహకారం: జె.కళ్యాణ్‌బాబు (గుంటూరు), హసన్(హైదరాబాద్), ఎం.సుబ్బారావు(ఒంగోలు), మూల్పూరి పద్మజ(విజయవాడ), టి.సురేశ్(కడప)
No comments:
Post a Comment