జేఎన్‌టీయూలో బీటెక్. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్, సత్యం కంప్యూటర్స్‌లో ఉద్యోగం. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్. మొదటి ప్రయత్నంలోనే 117 ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపిక. రెండో ప్రయత్నంలో 12వ ర్యాంక్...ఇదీ కెవీఎన్ చక్రధర బాబు స్వగతం. ప్రస్తుతం అసోం లోని శివసాగర్‌కు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా చక్రధరబాబు పనిచేస్తున్నారు. విజయగాథ ఆయన మాటల్లోనే...
సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్న అభ్యర్థులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు? అలవర్చుకోవాల్సిన స్కిల్స్?
ఓపిక, సహనం ఉండాలి. చేసే పనిపై స్పష్టత ఉండాలి. సివిల్స్ ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారో ప్రశ్నవేసుకోవాలి. కేవలం హోదా కోసమైతే 30 ఏళ్లపాటు సర్వీస్‌లో కొనసాగలేరు. సేవ చేయాలనే తపన, లక్ష్యంపై స్పష్టత ఉంటే ప్రిపరేషన్ సులువవుతుంది.
తెలివితేటలు, కష్టపడేతత్వం రెండూ ఉండాలి. ఓరియంటేషన్ రావాలి. రాతలో నైపుణ్యం పెంచుకోవాలి. డిగ్రీలో ఉన్నప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. చిన్నప్పుడే ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో ఉన్నత స్థానంలోకి చేరడానికి అవకాశం దక్కుతుంది. ఒకసారి పరీక్ష రాస్తే ఆ ప్రాసెస్ ఏడాదికిపైగా పడుతుంది. ఏ స్టేజ్‌లో ఫెయిలైనా మళ్లీ మొదటి నుంచి చదువుకోవాల్సి వస్తుంది. ఏం చదువుతున్నారు? అది పరీక్షలో ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయంలో అవగాహన ఉండాలి.
సివిల్స్‌లో ప్రశ్నను అన్ని కోణాల్లోనూ ఆలోచించి విశ్లేషించాలి. అకడమిక్ పరీక్షల్లా కుదరదు. తక్కువ సమయంలో అర్థవంతమైన పదాలతో స్పష్టత లోపించకుండా రాయాలి. పదపరిమితి చాలా ముఖ్యం. బాగా రాస్తే దిద్దేవారి పని సులువవుతుంది. అడిషనల్స్ ఎక్కువ తీసుకుని తెలిసిందంతా రాసేస్తే సరైన సమాధానం కోసం ఎగ్జామినర్ వెతుక్కోవాల్సి వస్తుంది. పేజీల సంఖ్య కంటే సమాచార నాణ్యత ముఖ్యం.
సివిల్స్ లక్ష్యంగా ఎప్పుడు నిర్ణయించుకున్నారు? దీన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?
మానాన్న భాస్కరరావు ప్రస్థుతం తహసీల్దారుగా పనిచేస్తున్నారు. ఆయన అప్పట్లో సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. నేను కలెక్టర్ కావాలని నాన్న ఆకాంక్ష. చిన్నప్పుడే కలెక్టర్ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. బాధ్యతలు, హోదా కెరీర్ ఆరంభంలోనే సివిల్ సర్వెంట్లకు లభిస్తాయి. మిగతా ప్రొఫెషన్లలో ఈ అవకాశం దక్కాలంటే ఎంతో సమయం ఆగాలి.
{పిపరేషన్ ఎప్పుడు ప్రారంభించారు?
సిస్టమేటిక్‌గా చదవలేదు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ చదివేవాణ్ని. చివర్లో ఆరు నెలలు సెలవు పెట్టి రోజుకి 14 గంటలు చదివాను. అదే నా ప్రిపరేషన్. మొదటి ప్రయత్నంలోనే 117 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను.
ఎన్నాళ్లు... రోజుకి ఎన్ని గంటలు చదివేవారు?
తొలిసారి రాసినప్పుడు ఉద్యోగానికి 6 నెలలు సెలవు పెట్టాను. ఆ సమయంలో రోజుకి 14 గంటలు చదివేవాణ్ని. రెండో సారి రాసినప్పుడు చాలా తక్కువ సమయం ఉండేది. అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా పనిచేస్తూ చదివేవాణ్ని. కరెంట్ అఫైర్స్ ఇంటర్నెట్‌లో ఫాలో అయ్యాను. కేవలం పరీక్షలు, ఇంటర్వ్యూ కోసమే సెలవు పెట్టాను. అస్సాం ఎన్నికల దృష్ట్యా సెలవు పెట్టడానికి కుదరలేదు.
మీ ఆప్షన్స్ ... వాటినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు సాహిత్యం నా ఆప్షనల్ సబ్జెక్టులు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్‌ని కాబట్టి కొత్త సబ్జెక్టులు తీసుకోవాలనుకున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగానికి దగ్గరగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివాను. తెలుగు సరిగా రాదు. రానిది నేర్చుకోవాలనే తపన నాకెక్కువ. అందుకే తెలుగు లిటరేచర్ ఒక ఆప్షనల్‌గా తీసుకున్నాను. హైస్కూల్ స్థాయిలోనూ మ్యాథ్స్ సరిగా రాదు. ఈ కారణంతోనే ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ ఎంపిక చేసుకున్నాను.
మీకు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు... మీరు చెప్పిన సమాధానాలు?
ఇంటర్వ్యూ 45 నిమిషాలు పాటు జరిగింది. ప్రస్తుతం ఏఎస్పీగా పనిచేస్తుండటంతో అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రశ్నలడిగారు. ఐపీఎస్‌లో ఉన్నావు కదా ఐఏఎస్ ఎందుకు అని ప్రశ్నించారు. ఐపీఎస్‌లో కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే చేతిలో ఉంటుంది. ఐఏఎస్‌లో అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్లూ నిర్వహించడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పరిధులు, బాధ్యతలు విస్తరిస్తాయి. అందుకే ఐఏఎస్‌లో చేరాలనుకుంటున్నానని చెప్పాను. పోలీస్ రిఫార్మ్స్, హ్యూమన్ రైట్స్, కానిస్టేబుల్ ట్రైనింగ్, అసోం ఎన్నికలు, మిడ్‌డే మీల్, విమెన్ ఎంపోవర్‌మెంట్, లోక్‌పాల్ బిల్, అన్నా హజారే..తదితరాంశాల్లో ప్రశ్నలడిగారు.
ఎన్నో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు? దశలవారీ మీ అనుభవాలు, మీరు చేసిన పొరపాట్లు వివరిస్తారా? మధ్యలో ఆప్షన్స్ మార్చారా?
2008లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి ఐపీఎస్‌కి ఎంపికయ్యాను. ఇది రెండో ప్రయత్నం. మొదటి ప్రయత్నంలో అంతగా అవగాహన లేదు. సాధారణ విద్యార్థి రాసినట్లు సమాధానాలు రాశాను. చదివిందంతా, తెలిసిందంతా రాయాలి అనే భావనతో రాశాను. సమాధానంలో నాణ్యత కంటే పరిమాణంపై దృష్టి సారించాను. రెండో ప్రయత్నంలో నా అనుభవాలు జోడించి రాశాను. నాణ్యతపై దృష్టి సారించాను. ఐపీఎస్ శిక్షణ, అనుభవం బాగా ఉపయోగపడ్డాయి.
{పిపరేషన్ కోసం మీకు సహకరించిన ఫ్యాకల్టీ/ఇన్‌స్టిట్యూట్?
మొదటి సారి రాసినప్పుడు జనరల్ స్టడీస్‌లో జాగ్రఫీ, ఎకనామిక్స్ కోసం ఆర్‌సీరెడ్డి; మాక్ ఇంటర్వ్యూ కోసం బ్రెయిన్‌ట్రీలో కోచింగ్ తీసుకున్నాను. సర్వీస్‌లో ఉన్నప్పుడు మిత్రులతో చర్చించి, వాళ్ల అనుభవాల ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను.
సివిల్స్ సాధించాలంటే కోచింగ్ అవసరమా?
కోచింగ్‌తో సమయం కలిసొస్తుంది. అన్నీ ఒకే దగ్గర లభిస్తాయి. కానీ అవగాహన లేకుండా ఒక్క సంస్థపైనే ఆధారపడకూడదు. సొంత సామర్థ్యమే చాలా ముఖ్యం.
మిమ్మల్ని బాగా ప్రోత్సహించినవారు?
మా అమ్మ, నాన్న బాగా ప్రోత్సహించారు. అమ్మకు పోలీస్ సర్వీస్ అంటే భయం. దీంతో ఎలాగైనా ఐఏఎస్ సాధించాలని చెప్పేది. కొన్ని సందర్భాల్లో ఐపీఎస్ కంటే ఐఏఎస్ అయ్యుంటే బాగుండేది అనిపించేది.
చదువులో మీరు మొదటి నుంచే టాపర్‌గా ఉన్నారా?
మొదటి నుంచీ టాపర్‌గానే ఉన్నాను. పదోతరగతిలో స్కూల్ ఫస్ట్ నేనే. స్టీల్ ప్లాంట్ పరీక్షలో సీఎస్ స్ట్రీమ్‌లో టాపర్‌గా నిలిచాను. జీమ్యాట్ రాశాను దీంతో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ-అమెరికాలో సీటు కూడా వచ్చింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం, ఐఏఎస్ కావాలనే తపనతో చేరలేదు. క్యాట్, గేట్ పరీక్షల్లోనూ మంచి మార్కులే వచ్చాయి.
సులువుగా నేర్చుకోవడానికి మీకు తెలిసిన చిట్కాలేమైనా ఉన్నాయా?
పాయింట్లలో సమాచారం ఉంటే కోడ్స్ పెట్టుకోవాలి. కొన్నింటికి బట్టీ తప్పదు. కొన్ని విషయాలు చదివేటప్పుడు వాటికి లింక్ సబ్జెక్టులు ఉంటాయి. ఆ పుస్తకాలు దగ్గరపెట్టుకొని వాటిని వెంటనే చదువుకోవాలి. ముఖ్య సమాచారం, క్యాచీ వర్డ్స్ కింద గీతలు గీస్తే సులువుగా గుర్తుంచుకోవచ్చు. రివిజన్ తేలికవుతుంది.
ఇప్పుడున్న పరీక్షా విధానం ఓకేనా? ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది?
ఆప్షనల్ సబ్జెక్టుల్లో కంప్యూటర్ సైన్స్ లాంటివి చేర్చాలి. ఇప్పుడు టెక్నికల్ పరిజ్ఞానం, మేనేజేరియల్ స్కిల్స్ రెండూ ఉద్యోగానికి చాలా అవసరం కాబట్టి పరీక్షలో వీటిపై ప్రశ్నలు చేర్చాలి. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లి ఏ సర్వీసూ పొందనివారికి తర్వాత సంవత్సరం ప్రిలిమ్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. గ్రూప్ డిస్కషన్, స్పీచ్ ఈ రెండూ ఇంటర్వ్యూలో చేర్చాలి. సివిల్ సర్వెంట్లకు టీం వర్క్ చాలా ముఖ్యం. ఇప్పుడున్న ఇంటర్వ్యూ ద్వారా టీం స్కిల్స్ అంచనా వేయడానికి సాధ్యం కాదు. అభ్యర్థి బృంద సభ్యుడిగా ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి జీడీ ఉపయోగపడుతుంది.
కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది?
మా అబ్బాయి ఐఏఎస్ ఇదే మా నాన్నగారి కోరిక. ఎన్ని అవకాశాలొచ్చినా నన్ను ఐఏఎస్‌గా చూడాలనేది ఆయన కోరిక. బాగా చదువుకోవడానికి అమ్మా,నాన్న ప్రోత్సహించారు.
ఆశయాలు...భవిష్యత్తు ప్రణాళికలేమైనా ఉన్నాయా?
ఐపీఎస్‌లో బాగుంది. ఐఏఎస్ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండు విభాగాల్లో మార్పుల దిశగా కృషి చేయాలనుకుంటున్నాను.
మీ హాబీలేంటి?
ఐపీఎస్‌లో చేరిన తర్వాత నుంచి టెన్నిస్, బ్యాడ్నింటన్ ఆడుతున్నాను. ఇంటర్నెట్ చూస్తుంటాను.
మీకు నచ్చిన పుస్తకం?
టువార్డ్స్ ది గోల్ ఆఫ్ బ్యూటిఫుల్ లైఫ్-సద్గురు వామన్‌రావ్‌పాయ్
మెచ్చిన సినిమాలు... ఇష్టమైన నటులు...
పాత సినిమాలంటే ఇష్టం. కె.విశ్వనాథ్, కమల్ హాసన్, మణిరత్నం సినిమాలు చూస్తుంటాను.
మీకిష్టమైన క్వొటేషన్...
toil to make yourself remarkable
మీరు ఆరాధించే వ్యక్తులు...
మా అమ్మ,నాన్న
మీ రోల్ మోడల్ ఎవరు?
చాలా మంది ఉన్నారు. మా ఐపీఎస్ డెరైక్టర్, టీఎన్ శేషన్, కిరణ్‌బేడి, ఇళయరాజా, ఎస్వీరంగారావు, మదర్ థెరిస్సా, కమల్‌హాసన్..
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు/సంఘటనలు?
విద్యార్థిగా ఉన్నప్పుడు సింహాచలం గుడికి వెళ్లినప్పుడు మేం క్యూలో నిల్చున్నాం. అదే సమయంలో అక్కడికి కలెక్టర్ వచ్చారు. ఆలయ నిర్వాహకులు అతిథి మర్యాదలతో అతనికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆ సమయంలో నువ్వుకూడా ఐఏఎస్ ఐతే మాకు ఇలాంటి అవకాశం దక్కుతుందని అమ్మ, నాన్న అన్నారు.
మరిచిపోలేని అనుభూతులు...
ఐపీఎస్ శిక్షణ. ఒక వ్యక్తిగా ఎదగడానికి తోడ్పడింది. మానసికంగా, శారీరకంగా పరిణతి వచ్చింది. శిక్షణ ద్వారా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాను.
కోపాన్ని ఎలా అదుపు చేసుకుంటారు...
మొదట్లో కోపం ఎక్కువగా ఉండేది. ఉద్యోగంలో చేరిన తర్వాత తగ్గింది. పబ్లిక్‌ని హ్యాండిల్ చేయాలంటే కోపం ఉండకూడదు. సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తాను. మాటల ద్వారా అవతలి వ్యక్తుల్లో ఆవేశం తగ్గుతుంది.
ఒత్తిడిని ఎలా అధిగమించేవారు...
యోగ, ప్రాణాయామం చేస్తుంటాను. ఐపీఎస్ శిక్షణలో వీటిని కూడా నేర్పుతారు.
యువతకు మీ సలహా...
శక్తి, సామర్థ్యాలన్నీ సానుకూలాంశాలపై వినియోగించుకోవాలి. చెడు ప్రభావాలకు లోనుకాకూడదు. నచ్చిన రంగం/అంశంలో స్కిల్స్ పెంచుకోవాలి. తర్కం, ఆలోచనా సామర్థ్యం మెరుగుపరచుకోవాలి. బయట చాలా శక్తులు వాళ్ల అవసరాలకు యువతను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.
మీరు చదివిన ప్రామాణిక
పుస్తకాల వివరాలు?
హిస్టరీ: బిపిన్‌చంద్ర
జాగ్ర ఫీ: 10,11,12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
ఎకనామిక్స్: ఎకనమిక్ సర్వే, ఇండియా ఇయర్ బుక్
పాలిటిక్స్: లక్ష్మీకాంత్, డిడిబసు
కరెంట్ అఫైర్స్: www.india.gov.in, నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్, టైమ్ మ్యాగజీన్, వికీపీడియా..వెబ్‌సైట్లు చూసేవాడిని.
No comments:
Post a Comment