
కారల్‌మార్క్స్ 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాస్తే, మమతాబెనర్జీ 'యాంటీ కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాశారు. మూడున్నర దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మార్క్సిస్టు పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి... తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు ఆ రాయల్‌బెంగాల్ ఆడపులి!కమ్యూనిస్టు కోట కుప్పకూలిన ఆనవాళ్లు... గుట్టలుగుట్టలుగా ఎర్రజెండాల పీలికలు... ఓటమి గాయాలతో కామ్రేడ్ల మూలుగులు... చెదపురుగుల పాలైనమార్క్సిస్టు సాహిత్యం. ఆ శిథిలాల మధ్య నుంచి మమతాబెనర్జీ నడుస్తున్నారు. ఎప్పట్లాగానే రబ్బరు చెప్పులు.
ఎప్పట్లాగానే ముతక చీర.
ఎప్పట్లాగానే చిందరవందర జుత్తు.
ఎప్పట్లాగానే భుజానికి గుడ్డ సంచి.
వెుహంలో మాత్రం...
ఎప్పుడూ కనిపించని విజయగర్వం!
సుదీర్ఘ పోరాట ఫలితమిది. ఈరోజు కోసమే ఇన్నేళ్లూ ఎదురుచూశారు. ఈ విజయం కోసమే ఎన్నాళ్లుగానో కలలుగన్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం దగ్గరైతే సందడే సందడి. జయజయధ్వానాలు. కరతాళధ్వనులు. విజయహారతులు. బాణసంచా పేలుళ్లు. మీడియా కెమేరాల మెరుపులు. పాత్రికేయుల పాతరోత ప్రశ్నలు. ఎవరో కాళికతో పోలుస్తున్నారు. ఇంకెవరో ఇందిరమ్మను గుర్తుచేసుకుంటున్నారు. ఇక, ఢిల్లీ పీఠమే మిగిలిందని అంచనాలు వేస్తున్నారు. ఏవో... ఎవరు చెప్పగలరు? సంకీర్ణాల యుగంలో ఏదీ అసాధ్యం కాదు. అయినా, పదీపదిహేనేళ్ల నాడు... కమ్యూనిస్టుల ఉక్కుకవచం తుక్కుతుక్కు అవుతుందని ఎవరైనా వూహించారా? ఆ ఎరుపుజెండా మెరుపు తగ్గిపోతుందని ఏ నిపుణుడైనా విశ్లేషించాడా? కాకలుతీరిన కామ్రేడ్లు కాడి వదలాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఏ పెద్దమనిషైనా అంజనమేసి చెప్పాడా?
అటువైపు... యోధానయోధులు. సుశిక్షిత కార్యకర్తలు. వ్యూహప్రతివ్యూహాల్లో ఆరితేరిన సలహాబృందాలు. గగుర్పాటు కలిగించే విప్లవాల చరిత్ర. చేతినిండా అధికారం. గల్లాపెట్టె నిండా నిధులు.
ఇటువైపు... మామూలు మహిళ. ఆస్తిపాస్తుల్లేవు. రాజకీయ వారసత్వం లేదు. చెప్పుకోదగ్గ అనుచరగణమూ లేదు. కొంత రాజకీయానుభవం, కొండంత ఆవేశం... అవే ఆమె అర్హతలు.
ఆ ఒంటరి నారి... వింటినారి సవరిస్తుంటే అంతా వినోదంలా చూశారు. ఆ పడతి పైటబిగిస్తుంటే... ఫక్కుమని నవ్వారు. ఆ గాండ్రింపులకు భయపడిందెవరు? ఆ ప్రతిజ్ఞలను పట్టించుకుందెవరు? నవ్వినచోటే, ఓట్లచేను పండింది. మూడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతూ వస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్టు ప్రభుత్వం... కుప్పకూలిపోయింది. మమత విజేతగా నిలిచారు.

సంకెళ్లు తెంచుకుని... |





ఉద్యమాల జీవితం |
అతికొద్దిమంది నేతల్లో కనిపించే అరుదైన లక్షణం... నిజాయతీ. పెద్దగా ఆధారాల్లేని ఒకట్రెండు విమర్శలు తప్పిస్తే...మమతాబెనర్జీ ప్రజా జీవితంలో ఎలాంటి అవినీతి మరకలూ లేవు. లంచాలూ వాటాలూ సిఫార్సులూ ఆమె గడప తొక్కడానికి కూడా భయపడతాయని చెబుతారు బాగా ఎరిగినవారు. కొత్తగా కేంద్రమంత్రి అయిన రోజుల్లో... ఓ రియల్ఎస్టేట్ గొడవలో మాటసాయం చేయమంటూ సొంత తమ్ముళ్లే ఎవర్నో తీసుకెళ్లారు. ఆమెకు పైరవీలంటే గిట్టదు. ఆచెంపా ఈచెంపా వాయించాలన్నంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు. గబగబా నాలుగు చీరలు సూట్‌కేసులో సర్దేసుకుని మౌనంగా ఇంట్లోంచి వచ్చేశారు. నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయి అక్కడే మకాం పెట్టారు. అదే ఆమె సమాధానం. పేరుకు రైల్వేమంత్రి అయినా, విలాసాల బోగీల్లో ఎప్పుడూ ప్రయాణించింది లేదు. బహుమతులకూ నజరానాలకూ ఆమె ఆమడదూరం, అవి చిన్నవైనా సరే. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు, ఓ ముస్లిం అభిమాని ప్రేమతో శాలువా ఇవ్వబోయాడు. వెుదట తిరస్కరించారు. కానీ ఆ అభిమాని ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడో అని, 'నేను బహుమతులు ఇష్టపడను. ప్రేమతో ఇస్తున్నావు కాబట్టి, అంతే ప్రేమతో అందుకుంటున్నా' అంటూ చిరునవ్వుతో స్వీకరించారు. ఆ అభిమాని కళ్లలో ఆనందబాష్పాలు!

ఓరోజు మమతాబెనర్జీ ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. దార్లో ట్రాఫిక్‌జామ్! ఏమిటా అని అద్దాల్లోంచి తొంగిచూస్తే... రోడ్డు ప్రమాదం. ఓ యువకుడు కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మమత పరుగుపరుగున అక్కడికెళ్లారు. క్షతగాత్రుడిని తన కార్లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మాట పెళుసే కానీ, మనసు వెన్న. ఎదుటి మనిషి కష్టాల్ని చూసి తట్టుకోలేరు. కన్నీళ్లు పొంగుకొచ్చేస్తాయి. అంత సున్నిత మనస్తత్వాన్ని ఏ కళాకారుల్లోనో చూస్తాం. నిజానికి, మమతలో ఓ మంచి కళాకారిణి ఉన్నారు. ఆమెకు చదవడం ఇష్టం. రాయడం ఇష్టం. బొమ్మలు గీసుకోవడం ఇష్టం. హావభావాల్ని పలికిస్తూ రవీంద్రుడి గీతాంజలి చదువుకోవడం మరీమరీ ఇష్టం. 'వేర్ ద మైండ్ ఈజ్ విథవుట్ ఫియర్...' ...ఠాగూర్ కవితాపంక్తిని తరచూ ఉటంకిస్తుంటారు. 'బద్లా నోయి, బద్లా ఛాయి' (మాకు మార్పు కావాలి, ప్రతీకారం కాదు), మా... మాటి... మనుష్ (తల్లి, నేల, ప్రజలు) తదితర నినాదాల్లో ఆమె సాహితీ స్పృహ తొంగిచూస్తుంది.

మంకుపట్టు మహారాణి |
పేరుకు మన్మోహన్సింగ్ మంత్రివర్గ సహచరురాలే అయినా, తనను తాను సర్వస్వతంత్రురాలిగానే భావించుకుంటారు మమత. తన మద్దతుతో నడిచే ప్రభుత్వంలో తన నిర్ణయానికి తిరుగేం ఉంటుందన్న ధైర్యమూ కావచ్చు. కేబినెట్ అనుమతులేవీ లేకుండానే బెంగాల్ మీద వరాల వర్షం కురిపించుకున్నారు. షాలిమార్ దగ్గర ఆటోహబ్, గూడ్స్‌యార్డు మంజూరు చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. సింగూర్‌లో కోచ్‌తయారీ పరిశ్రమ పెట్టాలన్నది ఆమె ఆలోచన. పాపం, ప్రధానమంత్రి! అవునన్నా తిప్పలే. కాదన్నా తిప్పలే. ఆ మంకుపట్టు వల్ల ఆమె కొన్ని శత్రుత్వాల్ని కొనితెచ్చుకుని ఉండవచ్చు. చిన్నాచితకా ఇబ్బందులూ ఎదురై ఉండవచ్చు. కానీ ఆ మంకుపట్టే లేకపోతే, శత్రుదుర్భేద్యమైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చేసేవారు కాదు. ఆ మంకుపట్టే లేకపోతే అన్నన్ని వైఫల్యాల్నీ అవమానాల్నీ తట్టుకుని నిలబడేవారే కాదు. ఆ మంకుపట్టే లేకపోతే ఎవరెన్ని అనుకున్నా పట్టించుకోకుండా, పెద్దపెద్ద రైల్వే ప్రాజెక్టుల్ని రాష్ట్రానికి తరలించుకు వెళ్లేవారే కాదు. బెంగాలీల హృదయాల్లో స్థానం సంపాదించేవారే కాదు.


బెంగాల్ మీదే బెంగ! |
