Showing posts with label MANASULO MAATA. Show all posts
Showing posts with label MANASULO MAATA. Show all posts

ప్రేమా... నీకు జోహారు!

మనసులో మాట
ప్రేమా... నీకు జోహారు!
'ప్రేమిస్తున్నా'నంటూ వెంటపడ్డాడో అబ్బాయి. 'జీవితంలో స్థిరపడితే అప్పుడాలోచిస్తా' అందా అమ్మాయి. తీరా కుర్రాడికి ఉద్యోగమొచ్చాక ఏమైంది?

'యాహూ...' నా కేకతో బోర్డుపై పేర్లు చూసుకుంటున్న వాళ్లంతా షాక్‌. 'ఏంటి బాబూ! ప్రపంచాన్నేమైనా జయించావా?' అన్నారొకరు. ఔను.ప. ప్రభుత్వ కాలేజీలో సీటు దొరకడం నాకు అంతకన్నా ఎక్కువే. ఇంటర్లో నాకొచ్చినవి అత్తెసరు మార్కులే మరి. టిప్‌టాప్‌గా తయారై డిగ్రీ క్లాసులో అడుగుపెట్టా. ఎప్పట్లాగే చదువులో బిలో యావరేజ్‌. కానీ కాలేజీలో వినిపించే ప్రేమకథలకు చెవులొగ్గేవాణ్ని. తొందర్లోనే నాకూ ఆ లవ్‌ వైరస్‌ సోకింది. ఆ ప్రభావం నన్నో అమ్మాయి వెంట పడేలా చేసింది. తను ఇంటర్‌ సెకండియర్‌. ఆమె దృష్టిలో పడటానికి ఎన్నో గిమ్మిక్కులు చేశా. ఎలాగైతేనేం ఓరోజు ఆమెతో 'హాయ్‌' అనిపించుకున్నా. ఆరోజు నాకు పండగే. ఈ గొడవలో పడి రెండు సబ్జెక్టులు డింకీ కొట్టా. మిగతా వాటిల్లో మార్కులు నలభైకి లోపే. తనతో చెప్తే 'ఇలాగ కూడా పాసవుతారా?' అని వేళాకోళమాడింది. తర్వాత తనే భుజం తట్టింది. 'నువ్‌ తలచుకుంటే ఫస్ట్‌క్లాస్‌లో పాసవుతావ్‌' అంది.
అదేం మహత్యమో! తన మాట నాలో వూహించని మార్పు తీసుకొచ్చింది. చెప్పినట్టే కష్టపడి చదివా. సెకండ్‌ క్లాస్‌తో డిగ్రీ పాసయ్యా. తర్వాత ఓ స్కూళ్లో టీచర్‌గా అవతారమెత్తా. స్థిర పడ్డానన్న ఫీలింగ్‌. ఆలస్యం చేయకుండా నా మనసులో మాట చెప్పేశా. తప్పకుండా 'ఓకే' చెబుతుందనే నమ్మకం. సీన్‌ రివర్సైంది. 'నాకా ఉద్దేశం లేద'ంటూ తేల్చేసింది. 'డిగ్రీ చదివా. నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నా. ఇంకేం కావాలి?' అంటూ వాదనకు దిగా. ముందు మౌనంగా ఉంది. కాసేపయ్యాక నోరు విప్పింది. 'బతకడానికి ప్రేమొక్కటే సరిపోదు. ముందు జీవితంలో స్థిరపడు అప్పుడాలోచిస్తా' అంది. పట్టుదలతో అక్కడ్నుంచి కదిలా.
ఎంట్రన్స్‌ రాసి బీఈడీలో జాయినయ్యా. మధ్యమధ్యలో తనను కలిసేవాణ్ని. బాగా ప్రోత్సహించేది. ఆమె ప్రతి మాటా ఓ సూచనలా ఉండేది. ప్రతి ఆలోచన జీవితంపై ప్రేమను పెంచేది. బీఈడీ చివరి పరీక్షలు. అప్పుడే తనకు పెళ్లి చూపులని తెలిసింది. పరుగెత్తుకెళ్లాను. 'చూపులే. పెళ్లికి ఒప్పుకోన్లే' అని భరోసా ఇచ్చింది. తర్వాత ఫస్ట్‌క్లాస్‌తో బీఈడీ పాసయ్యా. అదృష్టం కొద్దీ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌. పోయినేడుతో పోల్చితే తక్కువ పోస్టులు. జాబ్‌ రాదేమోనని మళ్లీ నిరాశ. 'తప్పకుండా జాబ్‌ కొడతావ్‌. ఇదే నీ ప్రేమకు చివరి పరీక్షనుకో' అంది. అది టానిక్‌లా పని చేసింది. పగలు రాత్రులు ఏకం చేసి చదివా. ఆఖరికి బాత్రూమ్‌కెళ్లినా చేతిలో పుస్తకముండేది. ఆ కష్టానికి ఫలితం దక్కింది. జిల్లాలో వందలోపు ర్యాంకు. కోరుకున్నచోట పోస్టింగు. చెప్పలేనంత ఆనందం. గర్వంతో ఆమె ముందు నిలబడ్డా. విషయం వినగానే తన కళ్లలో మెరుపు. ఆమె హడావుడి చూసి నా ప్రేమకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసిందనుకున్నా.
ఇంకోసారి నా వూపిరి ఆగిపోయే మాట వినాల్సి వచ్చింది. 'నా పెళ్లి ఫిక్సయింది' అంటూ ఓరోజు బాంబు పేల్చింది. సంతోషం స్థానంలో విషాదం. 'ఎందుకిలా?' అన్నా కన్నీళ్లతో. 'నువ్‌ బాగు పడాలనే' జవాబొచ్చింది. 'ముందే నీ ప్రేమకు నో చెబితే నువ్‌ ఇంత పట్టుదలగా చదివే వాడివా? టీచర్‌ అయ్యేవాడివా?' అని ప్రశ్నించింది. తను చెప్పిందినిజం. తను అప్పుడే అలా చేస్తే దేవదాసులా మారిపోయేవాణ్నేమో! ఉద్యోగం వచ్చాక కూడా నన్ను వద్దనడానికీ కారణం చెప్పింది. 'ఇరవై ఏళ్లు ప్రాణంలా పెంచిన తల్లిదండ్రుల్ని ఎదురించలేను' అని. ఏదేమైనా ఆమె నిర్ణయం కొన్నాళ్లు నా మనసును తీవ్రంగా బాధపెట్టింది. తర్వాత తేరుకుని మళ్లీ మామూలు మనిషయ్యా. ఇప్పుడు నేను వేరొకరికి భర్తను. చక్కని సంసారం. ఈ సంతోషకరమైన జీవితం ఆమె చలవే.

ఆ మాటలే గెలిపించాయి


మనసులో మాట
ఆ మాటలే గెలిపించాయి
డిగ్రీ చదువు... గుమాస్తా ఉద్యోగం... ఐదేళ్ల కిందట ఓ కుర్రాడి గురించి ఈ మాటలు చాలు. మరిపుడు అతడు డిప్యూటీ తహశీల్దార్‌. ఓ గుమాస్తా, ప్రభుత్వాధికారిగా ఎలా మారాడు?
'మస్తే సర్‌' ఈ పదం వింటే నా గతం గుర్తొస్తుంది. సినిమా రీళ్లలా పాత జీవితం కళ్లముందు మెదుల్తుంది. ప్రేమను పంచే అమ్మ... ఒకే తనువులా మెదిలే ఫ్రెండ్స్‌... అప్పుడప్పుడు వాళ్లతో చేసుకొనే పార్టీలు... ఇవంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేనేనాడూ వూరిని వదల్లేదు. ఆఖరుకు 'ఉద్యోగం ఇప్పిస్తా' అని ఓ బంధువు చెప్పినా. కానీ బండి నడవాలంటే ఇం'ధనం' కావాలిగా. అందుకే ఓ షాపులో గుమాస్తాగా చేరా.
'నీకన్నా చిన్నవాళ్లకు పెళ్లిళ్లు అవుతున్నాయ్‌... నువ్వెపుడు చేసుకుంటావురా?' అమ్మ అడిగిందోరోజు. 'తొందరేముందిలే' అన్నా మనసులో నాకూ చేసుకోవాలనే ఉంది. ఆ ఆలోచనలే పదేపదే ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే రజని (పేరు మార్చాం) గుర్తొచ్చింది. మంచితనం, కలుపుగోలుతనంతో కుందనపు బొమ్మలా ఉండేది. ఈ సంగతి స్నేహితులతో చెబితే 'సూపర్‌ సెలెక్షన్‌ మామా' అన్నారు. వాళ్లిచ్చిన ధైర్యంతోనే నేరుగా రజని నాన్న దగ్గరికెళ్లి మాట్లాడా. ఎప్పుడూ ప్రేమగా పలకరించే తను ఇంతెత్తున లేచాడు. 'కూలీ కొడుకుతో నా కూతరు పెళ్లేంట్రా?' అంటూ వూగిపోయాడు. మా కుటుంబం గురించి నానా మాటలన్నాడు.
నిజమే... మా అమ్మ ఒకప్పుడు కూలీనే. కానీ ఇప్పుడు కాదు. పదిహేనేళ్ల కిందట నాన్న చనిపోతే కూలీ పనులు చేసి అక్కను, నన్నూ పెంచింది. ఇప్పుడు నా సంపాదనతో మేం సంతోషంగా బతుకుతున్నాం. ఇంకో వ్యక్తి అదనంగా చేరినా మాకొచ్చే ఇబ్బందేం లేదు. అయినా కూలీ పనులు చేయడం తప్పేం కాదుగా? దానికే ఇంతలా అవమానించడం తట్టుకోలేకపోయా. ఇన్నిమాటలు అన్న తనే 'శెభాష్‌' అనేలా మంచి ఉద్యోగం సాధించాలనే కసితో హైదరాబాద్‌ బయల్దేరా.
ఉద్యోగం, డబ్బు సంపాదించడం అనుకున్నంత సులువేం కాదని తొందరగానే అర్థమైంది. 'కొలువు ఇప్పిస్తా'నన్న బంధువు మొహం చాటేశాడు. చేసేదిలేక ఓ స్నేహితుడి రూంలో దిగా. ఇరుకు గదిలో ఇంకో నలుగురితో నేను. 'ఇంత జనమేంటి?' అంటూ ఓనర్‌ రోజూ తిట్టేవాడు. చివరకో స్నేహితుడి సలహాతో సాఫ్ట్‌వేర్‌ కోర్సులో చేరా. కోర్సులు పూర్తయ్యాయి... డబ్బులు కరిగిపోయాయి... ఉద్యోగం మాత్రం రాలేదు. ఓ సంస్థను నమ్మి పెద్దమొత్తంలో డబ్బులు కడితే వాళ్లూ మోసం చేశారు. ఒక్కోసారి బస్‌ఛార్జీలు మిగుల్తాయని కిలోమీటర్ల కొద్దీ నడిచేవాణ్ని. ఇవన్నీ గుర్తొస్తుంటే ఆవేశంతో సిటీకొచ్చి తప్పు చేశానేమో అనిపించేది.
అప్పుడే నా ధైర్యాన్ని పెంచే టానిక్‌లా గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ వెలువడింది. దాంతో నా లక్ష్యమేంటో స్పష్టంగా అర్థమైంది. ఈసారి అవసరాల కోసం అమ్మ నగలు కరిగిపోయాయి. ఆర్నెళ్లు వంచిన తల ఎత్తకుండా చదివా. నా కష్టం, అమ్మ పూజలు ఫలించాయి. డిప్యూటీ తహశీల్దారుగా మా జిల్లాలోనే పోస్టింగ్‌ దక్కింది. ఏడాది కిందట లక్ష్మితో పెళ్త్లెంది. తను నాతో కలిసి కోచింగ్‌ తీసుకుంటున్నపుడు పరిచయం. నా పరిస్థితి తెలుసుకొని ఆర్థిక సాయం చేసేది. ఇప్పుడు మాకో పాప. జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. అప్పుడప్పుడు వూరెళ్తే 'ఏం బాబూ బాగున్నావా?' అంటూ పలకరిస్తాడు రజనీ వాళ్ల నాన్న. అలా అంటున్నపుడు ఆయన కళ్లల్లో పశ్చాత్తాపం. నాకు మాత్రం తనను చూసినప్పుడల్లా కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఎందుకంటే నేనీస్థాయిలో ఉండటానికి కారణం తనే కాబట్టి.
- శ్రీ

ప్రేమ మత్తులో జ్ఞానోదయం!

ప్రేమ మత్తులో జ్ఞానోదయం!
మనసు ప్రేమను కోరింది... మాట పెదవి దాటి రానంది. అందని ప్రేమకు 'మందే' తోడనుకుంటే జీవితం అంధకారమైంది. ఎందుకలా జరిగింది? అబ్బాయి చెబుతున్నాడు..
'డాక్టర్లు చెప్పినట్టు వాడి కాలు అతుక్కోవడం కష్టమేనా?' అమ్మ ఏడుస్తూ అడుగుతోంది. నాన్నేమో కన్నీళ్లతో బేలగా నావైపే చూస్తున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా వాళ్లెపుడూ అంతలా చలించలేదు. 'నాకేం కాద'ంటూ వాళ్లను ఓదార్చడానికి పైకి లేవబోయాను. నా ప్రయత్నం వృథా ప్రయాసే అయింది. ఒళ్లంతా నొప్పులతో కదల్లేకపోయా. 'అసలెందుకిలా జరిగిందిరా?' దుఃఖాన్ని దిగమింగుకుంటూ నాన్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పలేదు.
సవాళ్లకు ఎదురెళ్లి పోరాడటమంటే నాకిష్టం. అందుకే పట్టుపట్టి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరా. హర్యానాలోని అంబాలాలో డ్యూటీ. నచ్చిన కొలువుతో జీవితం జాలీగా గడిచిపోయేది. ఓ సెలవురోజు షాపింగ్‌ చేసి బైక్‌పై తిరిగొస్తుంటే సడెన్‌గా ప్రత్యక్షమైందో అమ్మాయి. బ్రేక్‌తో బైకును అదుపు చేసినా ఆ సౌందర్యాన్ని చూసి నా గుండె వేగం 70 నుంచి 170కి పెరిగింది. టెన్షన్‌లో నేనుంటే తను మాత్రం మెరుపులాంటి చిరునవ్వుతో మాయమైంది. ఆ మందహాసమే నా గుండెల్లో అలజడి రేపింది. అందమైన రూపం, ఆకర్షించే నవ్వు పదేపదే గుర్తొచ్చేవి. నన్ను కరుణించడానికా అన్నట్టు అప్పుడప్పుడు మా క్వార్టర్స్‌ దగ్గర ఎదురుపడేది.
కష్టపడి వివరాలు సేకరిస్తే తనూ ఓ డిఫెన్స్‌ అధికారి కూతురని తెలిసింది. సలహా కోసం స్నేహితుల దగ్గరికి పరుగెత్తుకెళ్లా. 'డిఫెన్స్‌లో పనిచేసే అధికారి తన కూతుర్ని ఇంకో ఉద్యోగికిచ్చి పెళ్లి చేయడు. చేద్దామనుకున్నా మిగతా జీవితమంతా ఇదే వాతావరణంలో గడపడానికి ఆ అమ్మాయి ఇష్టపడదు. పైగా ఇద్దరివీ వేర్వేరు భాషలు. వేర్వేరు ప్రాంతాలు. అంతస్తుల్లో తేడా. కాబట్టి తనను మర్చిపోవడమే బెటర్‌' తేల్చేశారు వాళ్లు. అయినా నా మనసు మారలేదు. తను నా ప్రేమను ఒప్పుకుంటుందనే నమ్మకం సడల్లేదు. కానీ అదేం చిత్రమో తను ఎదురుపడితే మాత్రం నోరు పెగలదు. మనసులోమాట చెప్పే సందర్భం కోసం ఎదురుచూస్తే కొత్త సంవత్సరం ఓ కొత్త అవకాశాన్నిచ్చింది. Wish You Happy NewYear అంటూ మొబైల్‌కి మెసేజ్‌ పంపాను. స్పందిస్తే మాటల్లో పెట్టి విషయం చెప్పేద్దామని నా ఆశ. ప్చ్‌... రోజంతా ఎదురుచూపులతోనే గడిచిపోయింది.
మరుసటిరోజు తన నుంచి ఫోన్‌ వస్తుంటే దేవత కరుణించిందనుకున్నా. 'ఆప్‌ కౌన్‌ హై... కల్‌ ఇస్‌ నంబర్‌ సే మెసేజ్‌ ఆయా...' అంటూ ఓ మగ గొంతు మాట్లాడగానే నా గుండె జారిపోయింది. ఆ కంచు కంఠం అమ్మాయి నాన్నది. విషయం నేరుగా ఆయనకే చెబుదామనుకున్నా. కానీ 'ఇది ఆయనకిష్టం లేకపోతే... కోపంతో నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయిస్తే?' వూహించగానే బెదిరిపోయాను. 'రాంగ్‌ నంబర్‌...' అంటూ చేతకాని వాడిలా ఫోన్‌ పెట్టేశా. ధైర్యంలేని నాకు ప్రేమించే అర్హత లేదని అర్ధమైంది. తనను మర్చిపోవాలని పదిహేను రోజులు ప్రయత్నించినా నావల్ల కాలేదు. ఈసారి నేరుగా వాళ్లింటికే బయల్దేరా. తోవలో ఫ్రెండ్‌ చెప్పిన మాటలు విని అక్కడే కుప్పకూలిపోయా.
ఆ అమ్మాయి నాన్నకు బదిలీ అయితే వారం కిందటే వూరొదిలి వెళ్లారట. ఇక తను కనపడదు. ఆ బాధలో అలవాటులేని బార్‌కెళ్లాను. ఎంత తాగానే తెలియదు. తూలుతూనే బండి కిక్‌ కొట్టాను. తీరా కళ్లు తెరిస్తే ఉంది మిలిటరీ ఆసుపత్రిలో. కాలు విరిగింది. భుజం చితికింది. తలకు బలమైన గాయం. రెండ్రోజులు కోమాలోనే ఉన్నా. తిరుపతిలో ఉండాల్సిన అమ్మానాన్నలు నా పక్కన చేరారు. ఇంతకీ నేను ప్రేమించి సాధించిందేంటి? ప్రేమించిన అమ్మాయి కనపడదు. నేను కోలుకొని మళ్లీ ఉద్యోగం చేస్తానో లేదో తెలియదు. అంటే ప్రేమ మోజులో పడి నన్ను నమ్ముకున్న కన్నవాళ్లని నట్టేట ముంచాను. అందుకే అనుభవంతో చెబుతున్నా అందని వాటికోసం అర్రులు చాస్తే నాలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ప్రేమ వ్యామోహంలో పడేముందు మీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించండి.

పాతాళంలోకి తోస్తే... ఆకాశంలోకి ఎదిగా!


మనసులో మాట
పాతాళంలోకి తోస్తే... ఆకాశంలోకి ఎదిగా!

మూడు నెలల పరిచయం మూడేళ్ల ప్రేమగా మారింది. మూడు రోజుల ప్రయాణంతో అది ముక్కలైంది... ఎందుకిలా? మనసు విరిగిన అబ్బాయి చెబుతున్నాడు...
'బాబూ నీకు ఫోన్‌... ఎవరో అమ్మాయి లైన్లో ఉంది' ఇంటి ఓనర్‌ చెప్పగానే నాలో అయోమయం. 'నాకు ఫోన్‌ చేసేదెవరబ్బా?' అనుకుంటూనే 'హలో' అన్నా. 'హాయ్‌ హరీ బాగున్నావా...' అందామె. సర్‌ప్రైజ్‌... తను ఏడాది కిందట నాతోపాటు కంప్యూటర్‌ కోర్సు నేర్చుకున్న అమ్మాయి. ఆ మూడు నెలలూ తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌. ఇప్పుడైతే దాదాపు మర్చిపోయా. పాత సంగతులు చెబితేగానీ గుర్తుకు రాలేదు. చాలాసేపే మాట్లాడి చివర్లో నా అడ్రస్‌ తీసుకుంది. పదిహేను రోజుల తర్వాత ఓ ఉత్తరం పంపింది. మొదట్లో నేనేం పట్టించుకోలేదు. తర్వాత మరోటి రావడంతో స్పందించక తప్పలేదు. ఇలా రెండేళ్లు సాగింది మా లేఖల రాయబారం. ఆ ఉత్తరాల అక్షరాల్లో భావాలు తర్జుమా అయ్యాయ్‌. మనసులు మాటాడుకున్నాయ్‌. చిగుళ్లు వేసిన ప్రేమ వట వృక్షంలా ఎదిగింది. అప్పుడప్పుడు నా రూమ్మేట్స్‌ మొబైల్స్‌కి కూడా ఫోన్‌చేసి నాతో మాట్లాడేది. తనప్పుడు ఇంజినీరింగ్‌ మూడో ఏడాది. 'నిన్ను చూడాలనిపిస్తోంది వూరొస్తావా?' అందోరోజు. నాకూ ఆమెను చూడాలనే ఉంది. అయితే ఇన్నాళ్ల తర్వాత మా కలయిక ఓ తీపి జ్ఞాపకంలా ఉండాలనుకున్నా. అందుకే వైజాగ్‌, అరకు టూర్‌ ప్లాన్‌ చేశా. దీని కోసం తనను ఒప్పించడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. పెళ్లి కాకుండానే కలిసి తిరగడం బాగుండదని ఇంకో ఇద్దరు స్నేహితుల్ని కూడా తీసుకెళ్లా. అనుకున్నట్టుగానే ముందు వైజాగ్‌లో కలుసుకున్నాం. తనను చూడగానే నాలో ఉద్వేగం. తనూ అంతే... అంతులేని ప్రేమ కురిపించింది. మూడ్రోజులు మూడు నిమిషాల్లా గడిచిపోయాయి. చివరి రోజైతే రాత్రి నుంచి తెల్లవారేదాకా ఒకటే కబుర్లు చెప్పుకున్నాం.
వూరు దగ్గరే కావడంతో తను పొద్దునే వెళ్లిపోయింది. నేనూ, ఫ్రెండ్స్‌ హైదరాబాద్‌ వెళ్లే హడావుడిలో ఉన్నాం. అప్పుడే ఆమె నుంచి ఫోన్‌. 'హరీ... నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి' అంది. 'కచ్చితంగా పెళ్లి గురించే' అనుకుంటూ వూహల్లో మునిపోయా. కానీ నా అంచనా తప్పింది. 'నీతోపాటు టూర్‌కొచ్చిన నీ ఫ్రెండ్‌కి ప్రపోజ్‌ చేయాలనుకుంటున్నా' అంటూ నా నెత్తిన పిడుగులు కురిపించింది. ఆ మాటతో నా నోరు మూగబోయింది. 'ఏంటి సైలెంట్‌గా ఉన్నావ్‌... కొంపదీసి నన్నేమైనా ప్రేమిస్తున్నావా?' అంది ఏమీ తెలియనట్టుగా. అంటే మూడేళ్ల నుంచి లెటర్లు రాసుకోవడం... ఫోన్లలో మాట్లాడుకోవడం ప్రేమ కాదా? 'నిన్ను చూడాలని ఉంద'ని ఇక్కడి దాకా రప్పించడంలో ఏ అర్థం లేదా? తన తీరుకు పీకల్దాకా కోపమొచ్చినా మూడు రోజుల్లో మనసు మార్చుకున్న తనతో మాట్లాడటం... ప్రేమిస్తున్నాని అర్థించడం వ్యర్థమనిపించింది.
ఒక్కడ్నే హైదరాబాద్‌ బయల్దేరా. చిన్నప్పట్నుంచి నాకు ఏడుపంటే గిట్టదు. అది చేతగాని వాళ్లు చేస్తారని అనుకునేవాణ్ని. కానీ బస్సులో వెళ్తున్నంతసేపూ నేను అసహ్యించుకునే కన్నీళ్లే వెంట వచ్చాయ్‌. తర్వాత ఆ ఏడుపే కోపంగా... తెగింపుగా... కసిగా మారింది. తన మీద చూపించిన ప్రేమ, తపనను లక్ష్యంపై పెట్టా. ఐదేళ్లు తిరిగేసరికి లక్షల సంపాదన... మంచి ఉద్యోగంలో చేరిపోయా. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది... సమాజంలో గౌరవముంది. మనసును అర్థం చేసుకునే తనకంటే అందమైన అమ్మాయితో పెళ్త్లెంది. ఏదేమైనా అప్పుడు నాకు కన్నీళ్లు తెప్పించిన తనే నేనీ స్థితిలో ఉండటానికి కారణం. కానీ దురదృష్టం... నన్ను వంచించిన అమ్మాయి... నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడు జీవితంలో ఒక్కటి కాలేకపోయారు.
- హరి