గ్రూప్-1 మెయిన్స్ లో మెరవండిలా....
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. అర్హత
సాధించిన వాళ్లంతా మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిలబస్‌లో ముఖ్యమైన విభాగాలను గుర్తించడం; ఈ విభాగాల నుంచి ఏపీపీఎస్‌సీ కోణంలో ఎలాంటి ప్రశ్నలు రావొచ్చో ఊహించడం; ముఖ్యమైన అంశాలపై సొంతంగా ప్రశ్నలు సిద్ధం చేసుకొని, సమాధానాలు రాయడాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కీలకం. అభ్యర్థులు
మెయిన్స్‌లో మెరవడానికి ఎలా సన్నద్ధమవ్వాలి.. సిలబస్
విశ్లేషణ.. ప్రిపరేషన్ ప్రణాళికపై నిపుణుల గెడైన్స్..!!
పేపర్-1 వ్యాసం..
సమయం: మూడు గంటలు
మార్కులు: 150
మూడు వ్యాసాలను మూడు గంటల్లో రాయాలి కీలకం: విశ్లేషణ, భాష, భావం
ఈ పేపర్‌లో ప్రశ్న ఏదైనప్పటికీ భావవ్యక్తీకరణ, భాష, సమాచార స్పష్టత వంటి లక్షణాలు గమనిస్తారు. ఈ పేపర్‌కు సంబంధించి 2008లో కరువు లేదా దుర్భిక్ష పరిస్థితులు అంటే ఏమిటి? దేశంలో మహిళా జనాభా తగ్గిపోవడానికి కారణాలు? లాంటి ప్రశ్నలు సెక్షన్-1లో అడిగారు. సెక్షన్-2లో యూరోపియన్ యూనియన్ చరిత్ర, పరిపాలన విధానంపై ప్రశ్నలు వచ్చాయి. అలాగే భారత్-అమెరికా అణు ఒప్పందం, దాని ప్రాధాన్యంపై ప్రశ్న సంధించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధించిన విజయాలను అడిగారు. ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ పరిణామాలు, విదేశాల్లో జరిగే అధికార మార్పిడులు, తగాదాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. సెక్షన్-3లో రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, పరిణామాలపై ప్రశ్నలొస్తాయి. జలయజ్ఞం, వరదలు, ఇటీవల చర్చనీయాంశంగా మారిన సూక్ష్మ రుణసంస్థలు- సమస్యలు, స్వయం సహాయక బృందాలు-వాటి పనితీరు, ఆరోగ్యశ్రీ, ప్రజారోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి సమకాలీన అంశాలపై ప్రశ్నలు ఆశించొచ్చు. గతంలో ప్రత్యేక ఆర్థికమండళ్లపై ప్రతికూల, అనుకూల అంశాలపై ప్రశ్న వచ్చింది. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్థానిక ప్రభుత్వాల అధికారాల బదలాయింపు, పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరుపైనా ప్రశ్నలు వచ్చాయి. రాష్టస్థ్రాయిలో రాజ్యాంగ సంస్థల పనితీరుపై దృష్టి సారించాలి. దేని గురించైనా ప్రశ్నలో వర్ణించమని అడిగినప్పుడు వర్ణనకే ప్రాధాన్యం ఇవ్వాలి. విశ్లేషించమన్నప్పుడు 360 డిగ్రీల కోణంలో పుట్టుపూర్వోత్తరాలు, ప్రస్తుత పరిణామాలు, దానివల్ల మంచి, చెడు.. ఇలా అన్నీ స్ఫురణకు రావాలి.
- ఆర్‌సీ రెడ్డి, డెరైక్టర్,
ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్
పేపర్-2... హిస్టరీ- పాలిటీ
సమయం: మూడు గంటలు
మార్కులు: 150
మొత్తం 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ ఒక్కో విభాగం నుంచి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
హిస్టరీ
ఇందులో ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశం నుంచి ప్రశ్నలు వస్తారుు. యూనిట్-1కు సంబంధించి సింధు నాగరికత, వేదకాలం-నాగరికత, మతపరమైన ఉద్యమాల అవతరణ(బౌద్ధ, జైన తదితర), మగధ సామ్రాజ్యం; యూనిట్-2లో ఇస్లాం మతం - ప్రభావం, భక్తి ఉద్యమాలు- స్వభావం, లలిత కళలు, విజయనగర సామ్రాజ్యం, మెుగల్ సామ్రాజ్యం, శివాజీ; యూనిట్-3లో వలసవాదం దశలు, 1857 తిరుగుబాటు-ప్రభావం, భారతదేశంలో జాతీయ వాదం పెరుగుదల, గాంధీ శకం ప్రాధాన్యం; యూనిట్-4లో ఆధునిక భారతదేశం-వివిధ పరిణామాలు; యూనిట్-5లో జాతీయవాద సాహిత్యం, వివిధ ఉద్యమాలు, దేశ విభజన, దేశ స్వాతంత్య్రానంతరం ముఖ్య ఘట్టాలు బాగా చదవాలి.
సెక్షన్-2లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్రపై ప్రశ్నలు వస్తారుు. యూనిట్-1లో శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, ఆంధ్రలో బౌద్ధం వ్యాప్తి; యూనిట్-2లో క్రీ.శ.1000-1565 మధ్యకాలంలో ఆంధ్రదేశంలోని పరిస్థితులు, తెలుగు భాషా సాహిత్యాభివృద్ధి, కవులు; యూనిట్-3లో ఆధునిక ఆంధ్రదేశం-వివిధ ఉద్యమాలు; యూనిట్-4లో ఆసఫ్‌జాహీ వంశం - తెలంగాణాలో సామాజిక సాంస్కృతిక ఉద్యమం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సారస్వత పరిషత్తు, వందేమాతరం ఉద్యమంలో రాష్ట్ర కాంగ్రెస్; యూనిట్-5లో తెలంగాణా సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలు, భారతీయ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం, ఆంధ్రప్రదేశ్ అవతరణ వంటి అంశాలు ముఖ్యమైనవి.
గతంలో అడిగిన ప్రశ్నలు: ఏపీ హిస్టరీ నుంచి.. విజయనగర రాజుల కాలంనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను విశ్లేషించండి? శాతవాహనుల కాలం నాటి పరిస్థితులు? భారత దేశ చరిత్రలో స్ర్తీ జనోద్దరణ, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు? భారతదేశ ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ వలస పాలన ప్రభావాలు?
రిఫరెన్స్ బుక్స్:
ఎన్‌సీఈఆర్‌టీ - 11, 12 హిస్టరీ పుస్తకాలు, ప్రాచీన భారతదేశ చరిత్ర - ఆర్య శర్మ, మధ్యయుగ చరిత్ర - సతీశ్ చంద్ర, ఆధునిక భారతదేశ చరిత్ర - బిపిన్ చంద్ర, ఆంధ్రుల చరిత్ర - బీఎస్‌ఎల్ హనుమంతరావు, ఆంధ్రుల చరిత్ర - పి.రఘునాథరావు
పాలిటీ
ముఖ్యంగా రాజ్యాంగం, దాని విధులు, ప్రాథమిక హక్కులు, విధులు, చట్టసభలు-వాటి అధికార పరిధి-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన-షెడ్యూల్ కులాలు, తెగలు, వారి హక్కులు, షెడ్యూల్ కులాలు, తెగల జాతీయ కమిషన్-దాని విధులు-పరిధులు-పంచాయతీరాజ్ వ్యవస్థ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. షెడ్యూల్ కులాలు, తెగలు, వాటి కమిషన్‌పై ప్రశ్న అడగొచ్చు. 2008లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ విధులను వివరించండి? పంచాయతీరాజ్ వ్యవస్థపై పంచాయతీరాజ్ అనేది విజయవంతం కాని దేవుడు? ప్రశ్నలు వచ్చాయి. రాష్టస్థ్రాయికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు లేదా చట్టసభల పనితీరు? దిగజారుతున్న విలువలపైనా ప్రశ్నలు రావొచ్చు.
పాలిటీ విషయంలో సిలబస్‌కుతోడు కొన్నిసార్లు దేశ, రాష్టస్థ్రాయిలో నెలకొన్న పరిణామాలు, కీలకమైన బిల్లుల గురించి ప్రశ్నలు రావొచ్చు. గత ప్రశ్నాపత్రంలో మహిళా రిజర్వేషన్ బిల్లులో రాజకీయాలు?అనే ప్రశ్న వచ్చింది. ఈ నేపథ్యంలో సమకాలీన అంశాలపైనా దృష్టిసారించి ప్రిపరేషన్ చేస్తే పోటీలో సులువుగా నెగ్గుకు రావచ్చు.
రిఫరెన్స్ బుక్స్: ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ - ఎస్.అరవింద్, అవర్ కాన్‌స్టిట్యూషన్ - కాస్యప్ సుభాష్
జాగ్రఫీ
పేపర్-1లో ఎస్సే రైటింగ్‌లోని సెక్షన్ 1, పేపర్ 4లో సెక్షన్ -3 మొత్తం, సెక్షన్ 1లో కొంతభాగం జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. గత ప్రశ్నాపత్రంలో పేపర్1లో కరువు లేదా దుర్భిక్ష పరిస్థితులపై అడిగిన ప్రశ్న జాగ్రఫీ కిందకే వస్తుంది. అంటే.. పేపర్ 1లో సెక్షన్1లో పేర్కొన్న ఉత్పాతాలు విభాగంలో కచ్చితంగా జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా పేపర్ 3లో ఏపీ ఎకానమీ విభాగంలో సైతం ప్రాంతీయ అసమానతలపై అడిగే ప్రశ్నలకు జాగ్రఫీ కోణంలో సమాధానం రాయాలి.
ఈ విభాగంలోని ప్రశ్నలకు రాష్ట్రంలో ప్రాంతాలవారీగా ఆర్థిక, సామాజిక, భౌగోళిక కారణాలు ప్రస్తావించాలి. గత మెయిన్స్ ప్రశ్నాపత్రం సెక్షన్ 3లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ వ్యత్యాసాలకు కారణం? అనే ప్రశ్న అడిగారు. సెక్షన్ 2లో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకాలు, జనాభా, సమస్యలు, సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించి ప్రశ్నలు రావొచ్చు.
పేపర్ 4లోని సెక్షన్ 3 మొత్తం ఎన్విరాన్‌మెంట్ జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి. సెక్షన్-1లో ఇంధన వనరుల విభాగం కూడా జాగ్రఫీ పరిధిలోకే వస్తుంది. శీతోష్ణస్థితి-మార్పులు-ప్రకృతి వైపరీత్యాలు-నగరీకరణ-పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలన్నీ జాగ్రఫీకే చెందుతాయి. ముఖ్యంగా ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కుల స్కోరింగ్‌కు సహజసిద్ధ, ప్రకృతిసిద్ధ ఈ రెండు కోణాల్లో సంభవించే వైపరిత్యాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై దృష్టిపెట్టి చదవాలి. ఏపీ, ఇండియాకు సంబంధించి జాగ్రఫీ పుస్తకాలు ఎక్కువగా చదవాలి. అదేవిధంగా సోషియో ఎకనామిక్ సర్వేలు, హ్యూమన్ డెవలప్‌మెంట్ రిసోర్సెస్‌కు సంబంధించిన డేటాపై దృష్టిపెట్టాలి.
-హిస్టరీ - కరీం; పాలిటీ - కృపాదానం; జాగ్రఫీ - గురజాల శ్రీనివాసరావు; సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
పేపర్-3
సమయం: మూడు గంటలు
మార్కులు: 150, ఒక్కో వి భాగం నుంచి ఐదు ప్రశ్నలు మొత్తం 15 ప్రశ్నలకు సమా ధానాలు రాయాలి.
సెక్షన్-1-ఎకానమీ...
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సిలబస్‌లో ప్రతి అంశంపై ప్రాథమిక పరిజ్ఞానం అవసరం. మొదటి చాప్టర్‌లో.. జాతీయాదాయంలో వివిధ భావనలను అవగాహన చేసుకున్న తర్వాత జాతీయాదాయాన్ని మదించే పద్ధతులు, జాతీయాదాయ లెక్కింపులో ఎదురయ్యే సమస్యలు, జాతీయాదాయ మదింపు వల్ల ఉపయోగాలతోపాటు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల ప్రాధాన్యత, శ్రామిక శక్తి, ఆర్థికాభివృద్ధిలపై పరిజ్ఞానం, జాతీయాదాయం, మానవ వికాసంపై అవగాహన ఉండాలి.
రెండో చాప్టర్‌లో.. భారత్‌లో ప్రణాళికా రచనతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పాత్ర గురించి అడుగుతారు. ప్రణాళికల పరంగా వనరుల కేటాయింపుతోపాటు, 11వ ప్రణాళిక మధ్యంతర సమీక్ష, ప్రణాళికలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాలు; సంస్కరణల ముందు, తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర ఆయా రంగాల్లో మార్పులు అవగాహన చేసుకోవాలి.
మూడో చాప్టర్‌లో.. పేదరికం, నిరుద్యోగానికి కారణాలు పరిశీలించడంతోపాటు పేదరికం, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు స్వయం ఉపాధి, వేతన ఉపాధి పథకాలను విశ్లేషించి, ఆర్థిక సమస్యల నిర్మూలన ఎలా సాధ్యమవుతుంది అనే భావనపై అవగాహన ఉండాలి.
నాల్గో చాప్టర్‌లో.. ద్రవ్య మార్కెట్‌కు సంబంధించి సంస్కరణల యుగంలో బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పులు భారత ఆర్థికాభివృద్ధికి ఎలా దోహదపడ్డాయి, కేంద్రబ్యాంకు పరపతి నియంత్రణకు ఇటీవలి కాలంలో ఎటువంటి విధానాలు అవలంభించింది, సంస్కరణల యుగంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ప్రగతిని పరిశీలించాలి. వీటితోపాటు భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యవిధాన పాత్ర పట్ల అవగాహన పెంపొందించుకోవాలి.
5వ చాప్టర్‌లో.. కోశ విధానానికి సంబంధించిన సిలబస్ పొందుపర్చారు. రెవెన్యూ విధానంలో భాగంగా ప్రభుత్వం తన రాబడిని ఎలా సమీకరించుకుంటుంది, ప్రభుత్వ వ్యయ పెరుగుదల ఆర్థికాభివృద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశం పట్ల పరిజ్ఞానం అవసరం. అధిక ప్రభుత్వ రుణప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఏర్పడే అనుకూల, ప్రతికూల ప్రభావాలతో పాటు, ప్రభుత్వ వ్యయయాజమాన్యం గురించి తెలుసుకోవాలి.
సెక్షన్-2.. ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు..
సెక్షన్-2లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భూసంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ స్వరూపం, జనాభా, బడ్జెటరీ విధానం, పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన సిలబస్‌ను పొందుపర్చారు. భూసంస్కరణలకు సంబంధించి చారిత్రాత్మక నేపథ్యంలో భాగంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో మధ్యవర్తుల వ్యవస్థ, కౌలు విధానంలోని లోపాలు భూసంస్కరణల ఆవశ్యకతకు ఎలా దారితీశాయి అనే అంశాలు చదువుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాష్ర్టంలో భూసంస్కరణల అమలు తీరు, సమస్యలు, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పరిశీలించాలి. ఈ సెక్షన్‌లో రెండో చాప్టర్‌లో.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని పొందుపర్చారు. రాష్ర్టంలో వివిధ ప్రాంతాల్లో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల ప్రగతిని పరిశీలించాలి. రాష్ర్టంలో పట్టణ పేదరికం పెరగడానికి కారణాలు, పేదరిక నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు వ్యవసాయ ఉత్పాదితాలైన విద్యుత్, నీటిపారుదల, పరపతి, మేలు రకమైన విత్తనాలు, ఎరువులు లాంటి అంశాల స్థితిగతులతోపాటు వ్యవసాయరంగ అభివృద్ధిలో చోటుచేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించాలి.
మూడో చాప్టర్‌కు.. సంబంధించి సామాజిక అంశాల స్థితిగతులను తెలుసుకోవాలి. రాష్ర్టంలో మూడు ప్రాంతాల్లో సామాజిక అసమానతలు ఏర్పడడానికి కారణాలు, వాటి నివారణ చర్యల పట్ల అవగాహన అవసరం. జనాభా పరమైన లక్షణాల్లో భాగంగా జనాభా పరిణామ సిద్ధాంతంలో ఏ దశలో ఆంధ్రప్రదేశ్ ఉందో పరిశీలించాలి. పేదరిక నిర్మూలనకు మహిళా సాధికారత ఏ విధంగా దోహదపడిందో వివరించడానికి అనుగుణంగా అవగాహన అవసరం.
నాల్గో చాప్టర్‌లో.. ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ స్వరూపాన్ని పరిశీలించాలి. బడ్జెట్‌లో ప్రధానాంశాలైన రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా, ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర అంశాల స్థితి రాష్ర్ట అవతరణ తర్వాత ఏ విధంగా ఉందో గమనించాలి. ప్రభుత్వ వ్యయం, రుణ ధోరణులు ఏ విధంగా ఉన్నాయో అనే అంశాల్లో పరిజ్ఞానం ఉండాలి.
ఐదో చాప్టర్‌కు సంబంధించి రాష్ర్టంలో పంచవర్ష ప్రణాళికల అమలు, వనరుల కేటాయింపు, ప్రణాళికలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రణాళికల అనుభవాలు గమనించాలి. రాష్ర్ట ప్రభుత్వం తన సొంత బడ్జెటరీ వనరులతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వనరుల పంపిణీ పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. 10, 11వ ప్రణాళికల్లో వాస్తవ వ్యయం వివిధరంగాల మధ్య ఎలా పంపిణీ చేశారో తెలుసుకోవాలి.
సెక్షన్- 3.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ...
సెక్షన్-3లో మొదటి చాప్టర్‌కు సంబంధించి రాష్ర్టంలో భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఫ్యాక్టరీల ప్రగతితో పాటు ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీనతలను పరిశీలించాలి. వీటితోపాటు రాష్ర్టంలో పారిశ్రామిక రంగ అభివృద్ధిని పరిశీలించాలి.
రెండో చాప్టర్‌లో... వ్యవసాయ ఉత్పాదకత, ధరలకు సంబంధించి సిలబస్ పొందుపర్చారు. రాష్ర్టంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండడానికి కారణాలు, అల్ప ఉత్పాదకత నివారణా చర్యలు పరిశీలించాలి. వ్యవసాయ ధరలకు సంబంధించి మద్దతు ధర, సేకరణ ధర, ప్రాంత ధరలను పరిశీలించడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు తీరును, వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ విధుల పట్ల అవగాహన అవసరం.
మూడో చాప్టర్‌లో... రాష్ర్టంలో వివిధ అంశాలకు సంబంధించిన అసమానతలను పొందుపర్చారు. ఆదాయం, పారిశ్రామిక ఉత్పత్తి, వర్షపాతం, నీటిపారుదల, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడడానికి కారణాలను పరిశీలించాలి. ప్రాంతీయ అసమానతల నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశం పట్ల అవగాహన అవసరం.
నాల్గో చాప్టర్‌లో... వ్యవసాయ పరపతికి సంబంధించి సంస్థాపరం కాని, సంస్థాపరమైన ఆధారాల పాత్ర, పరపతి ధోరణులను పరిశీలించాలి. సహకార వ్యవస్థ పాత్ర బలహీనపడడానికి కారణాలు, రాష్ర్టంలో సహకార రంగ ప్రగతి గమనించాలి.
ఐదో చాప్టర్‌లో.. సేవారంగ ప్రగతితో పాటు ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలి. సేవారంగంలో ముఖ్యాంశాలైన రవాణా, పర్యాటకం, సమాచార సాంకేతిక విజ్ఞాన ప్రగతిని పరిశీలించాలి.
గత ప్రశ్నాపత్రంలో...
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సెక్షన్-1లో అడిగిన ప్రశ్నలు చాలావరకు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. జాతీయాదాయాన్ని మదించే పద్ధతులు, సమస్యలు, 10వ ప్రణాళిక, పేదరికాన్ని కొలిచే పద్ధతులు, నిరుద్యోగాన్ని కొలిచే పద్ధతులు, ద్రవ్యవిధాన లక్ష్యాలు, బ్యాంకింగ్ రంగ ప్రగతి, ప్రభుత్వ రెవెన్యూ విధానం, వ్యయ విధాన నియమాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. సెక్షన్ 2, 3ల్లో కొంతమేరకు అనువర్తిత ప్రశ్నలతోపాటు అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. సిలబస్‌లోని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. కొన్ని చాప్టర్‌లకు సంబంధించి చిన్న ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది.
రిఫరెన్స్ బుక్స్
భారత ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడెమీ, భారత ఆర్థిక వ్యవస్థ - మిశ్రా, పూరి; భారత ఆర్థిక వ్యవస్థ - దత్, సుందరం; ఎకనమిక్ సర్వే - 2009-10
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడెమీ, 50 years of Andhra Pradesh M.Hanumantha Rao, A.P. Economic Survey 2009 10
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంస్కరణలు - CESS, , హైదరాబాద్ ప్రచురణ
- టి.కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
పేపర్4... స్కోరింగ్ స్కోప్
సమయం: మూడు గంటలు, మార్కులు: 150
మొత్తం 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
పేపర్ 4 సైన్స్ అండ్ టెక్నాలజీ కాస్త భిన్నం. ఎందుకంటే.. ఎప్పటికప్పుడు ఈ రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. అందుకే సమకాలీన అంశాలను జోడించి సిలబస్ ప్రిపేర్‌కావాలి. అప్పుడే ఎక్కువ మార్కుల స్కోరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. టెక్నాలజీ మిషన్, భారతదేశ అంతరిక్ష ప్రయోగాలు, ప్రగతి; గ్రామీణ భారతావనిలో సాంకేతి సమాచార వ్యవస్థ పాత్ర, స్థూల ఐటీ అనువర్తనాలు, అణుశక్తి, విపత్తుల నిర్వహణ తదితర అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు.
2008లో అంతరిక్ష రంగానికి సంబంధించి వ్యవసాయక, గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలో భారతదేశ అంతరిక్ష కార్యక్రమం పాత్ర ఏంటి? అనే ప్రశ్న వచ్చింది. అలాగే దేశ ఆర్థికవృద్ధిలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పాత్ర వివరించండి? అని అడిగారు. ఈ నేపథ్యంలో.. తప్పనిసరిగా అంతరిక్షం, కమ్యూనికేషన్ల వ్యవస్థపై దృష్టిపెట్టాలి.
సెక్షన్ 2లో... జీవ సాంకేతిక విజ్ఞాన పరిచయం, కిణ్వన ప్రక్రియ, అనువర్తన, హానికర మొక్కలు, వన్యప్రాణులు, మూలకణాలు, జన్యుఇంజనీరింగ్‌పై దృష్టిసారించాలి. మూలకణాలు అంటే ఏమిటి? లేదా ఇండియాలో మూలకణ పరిశోధనలు? లాంటి ప్రశ్నలు సంధించొచ్చు. అలాగే పర్యావరణ వాదం? ఆవిర్భావ విధానం? ప్రస్తుతం పర్యావరణ వాదం ప్రాముఖ్యత? ఘనవ్యర్థ పదార్థాల ప్రభావం? వాటర్‌షెడ్ అభివృద్ధి? వంటి అంశాలు బాగా చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ విషయంలో అభ్యర్థికి తప్పనిసరిగా కాన్సెప్ట్స్‌పై స్పష్టత అవసరం.
రిఫరెన్స్ బుక్స్:
తెలుగు అకాడమీ ప్రచురించిన పర్యావరణ పుస్తకాలు, డిగ్రీ మైక్రోబయాలజీ బుక్స్ -అనంతనారాయణ, ఇండియా ఇయర్ బుక్ - (అంతరిక్షం, శక్తి టాపిక్స్), ఇండియా ఇన్ ఆర్బిట్, నాన్- రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్.
- సి.హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
పేపర్-5.. డేటా ఇంటర్‌ప్రిటేషన్
అండ్ ప్రాబ్లం సాల్వింగ్
సమయం: 3 గంటలు, మార్కులు: 150
మిగిలిన పేపర్లతో పోల్చితే స్కోరింగ్ పేపర్ ఇదే. మ్యాథ్స్, ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులతో ఇతర అభ్యర్థులు పోటీపడాలంటే ఈ పేపర్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి.
ప్రాథమిక గణిత అంశాలు
పట్టు సాధించాల్సిన అంశాలు...
సంఖ్యలు-సంఖ్యామానాలు ప్రాథమిక గణిత పరిక్రియలు కారణాంకాలు, గుణిజాలు, క.సా.గు భిన్నాల కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు సాధారణ భిన్నాలు, మిశ్రమ భిన్నాలు సమీకరణాలను సాధించడం ఘాతాలు-ఘాతాంకాలు
వీటికోసం స్టేట్ సిలబస్ 6, 7వ తరగతి గణిత పుస్తకాలు చదివితే సరిపోతుంది. సిలబస్‌లోని అన్ని అంశాలను ఆకళింపు చేసుకొని అందులోని భావన(కాన్సెప్ట్)లను అర్థం చేసుకోవాలి. అన్ని సూత్రాలను, వాటి వెనుక ఉన్న లాజిక్‌ని, వాటిని ఏ సందర్భంలో ఏ విధంగా అనే విషయాలను క్షుణ్నంగా అర్థం చేసుకొని సాధన చేయాలి. బేసిక్ కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోకుండా.. కేవలం కొన్ని మోడల్ ప్రశ్నలను, వాటిని సాధించే పద్ధతులను గుర్తుంచుకుంటే ప్రయోజనం ఉండదు. వివిధ అంశాలను మిళితం చేసి, ప్రశ్నలను ఎన్నో విధాలుగా ట్విస్ట్ చేసి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని చదవాలి.
సెక్షన్-1
సెక్షన్-1లో సగటు, నిష్పత్తులు, శాతాలు అనే మూడు అంశాలున్నాయి. వీటిలో సగటు అత్యంత ప్రధానం.
ఈ అంశాలు చాలా కీలకం..
గుణమధ్యమాన్ని ఉపయోగించి సగటు పెరుగుదల/తగ్గుదల శాతాన్ని కనుక్కోవడం, హరాత్మక మధ్యమాన్ని ఉపయోగించి సగటు వేగం, సగటు ధర, సగటు మైలేజీ కనుక్కోవడం, అంకమధ్యమాన్ని, ప్రామాణిక విచలనాలను సవరించడం, ఉమ్మడి అంకమధ్యమం, భారిత అంకమధ్యమం వాటి అప్లికేషన్లు, మధ్యగతం, బాహుళకాలను కనుక్కోవడం, ప్రామాణిక విచలనం, విచలన గుణకం వీటిని ఉపయోగించి దత్తాంశంలో నిలకడను గుర్తించడం.
రిఫరెన్స్ బుక్స్:
ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ - (కితాబ్ మహల్ పబ్లికేషన్స్), ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ - ఎస్.సి. గుప్తా అండ్ వి.కె. కపూర్ (చాంద్ పబ్లికేషన్స్), ఎన్‌సీఈఆర్‌టీ స్టాటిస్టిక్స్ - XI, XII
సెక్షన్-2
ఈ విభాగంలో సాధారణంగా ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది, ఒక రాశిలో ఇంకొక రాశి ఎంత శాతం, రెండు రాశుల మధ్య నిష్పత్తి ఎంత, సగటు ఎంత... ఇటువంటి సులభమైన ప్రశ్నలే అడుగుతారు. దృష్టి సారించాల్సిన అంశాలు.. ఇచ్చిన దత్తాంశానికి పట్టిక నిర్మించడం, ఇచ్చిన దత్తాంశానికి వృత్త రేఖాచిత్రాన్ని గీయడం, సగటు, నిష్పత్తి, శాతాలను ఉపయోగించి దత్తాంశాన్ని అన్వయించడం(టేబుల్స్, బార్ డయాగ్రమ్, పై-డయాగ్రమ్, గ్రాఫ్)
రిఫరెన్స్ బుక్స్:
డేటా ఇంటర్‌ప్రిటేషన్ - కె. కుందం (బి.ఎస్.సి. పబ్లికేషన్స్), సివిల్ సర్వీసెస్ మెయిన్స్ - స్టాటిస్టిక్స్ గైడ్ (స్పెక్ట్రం సిరీస్)
సెక్షన్-3
ఇక సెక్షన్-3లో ఉండే అంశాలన్నీ కూడా జనరల్‌గా ఉండేవే. ఈ సెక్షన్‌లో ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ అభ్యర్థులు కూడా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. చదవాల్సిన అంశాలు... 1.సంఖ్యాశ్రేణులు, ద్విసంఖ్యాశ్రేణులు 2.సంఖ్యల మధ్య సామ్యం 3.అక్షరాల శ్రేణులు, సామ్యం 4.ఆడ్‌మన్ ఔట్ 5.కోడింగ్ అండ్ డీకోడింగ్ 6.క్లాక్స్ అండ్ క్యాలండర్ 7.సీటింగ్ అరేంజ్‌మెంట్ 8.ఏదైనా ఒక సమస్యను పరిశోధించి నివేదిక సమర్పించడం (రిపోర్టింగ్) 9.నిర్ణీతాంశ విశ్లేషణ.
రిఫరెన్స్ బుక్స్:
ఎ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్(ఎస్. చంద్ పబ్లికేషన్స్)
ఒక సమస్యను సాధించేటప్పుడు, దాని సొల్యూషన్ చూడకుండా, స్వతహాగా సాధించి సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం చేయాలి. ఈవిధంగా సాధన చేయడం ద్వారా మనకు లాజికల్ అప్రోచ్ అలవడుతుంది.
సరైన స్టెప్స్ రాయడం: ఇచ్చిన సమస్యకు సరైన స్టెప్స్ రాస్తూ సాధన చేయడం చాలా ప్రధానం. ఇది సెక్షన్-1లో చాలా అవసరం. ఎందుకంటే.. స్టెప్స్‌ని బట్టి మార్కులు కేటాయిస్తారు. స్టెప్స్ విశ్లేషణాత్మకంగా, తగినంత వివరణ పదజాలంతో, సరైన క్రమంలో రాయాలి. వివిధ స్టెప్స్ మధ్య లాజికల్ ఫ్లో ఉండాలి. అప్పుడే మనం సమస్యను ఏ విధంగా సాధించామనేది మూల్యాంకనం చేసిన వాళ్లకు అర్థమవుతుంది. అంటే మనం రాసే సమాధానం సెల్ఫ్-ఎక్స్‌ప్లానెటరీగా ఉండాలి. ప్రతి మోడల్‌కి సంబంధించి ఒకటి లేదా రెండు ప్రశ్నలకు పూర్తి స్టెప్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయాలి.
సరైన సమాధానాన్ని రాబట్టడం చాలా ప్రధానం. మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసిన మెథడ్ సరైనదే ఐనప్పటికీ సరైన సమాధానం రాకుంటే మార్కుల్లో కోత తప్పదు.
- ఎ.అనిల్ కుమార్ రెడ్డి, 2008 గ్రూప్ 1 విజేత
ఇలా చేయండి..
సిలబస్ పుర్తైన తర్వాత మోడల్ ప్రశ్నాపత్రాలను వీలైనన్ని ఆన్సర్ చేయాలి. దీంతో ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది.
వార్తాపత్రికల కోసం రోజుకు గంట కేటాయించి మీకు పనికొచ్చే ముఖ్యాంశాలు నిశితంగా గమనిస్తే సరిపోతుంది. పత్రికా పఠనమంతా పరీక్ష కోణంలోనే జరగాలి.
అడిగిన విషయం గురించి నాకు ఏం తెలుసు? ప్రశ్నలో నన్నేం రాయమని అడిగారు? నాకు తెలిసిన దాంట్లోంచి, అడిగిన ప్రశ్నకు ఎంత స్పష్టంగా సమాధానం రాయగలను? ఇవి అభ్యర్థులు సమాధానం రాసేముందు వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఏ ప్రశ్నకైనా మన వద్ద ఉన్న సమాచారాన్నంతా రాసేద్దామనుకుంటే పొరపాటే.
బాగా తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానాలు రాయడం మేలు.
వ్యాసంలో బ్యాలెన్స్‌డ్ అభిప్రాయూలతో సమాధానాన్ని ప్రారంభించాలి.
సాంఘిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రాసేటప్పుడు రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా అనుసరించాలి.
చేతిరాత మూల్యాంకనం చేసేవారికి తేలికగా అర్థమయ్యేలా ఉండాలి. అందంగా లేకపోయినా.. చదవగలిగేదిగా ఉండాలి. చేతిరాతలో స్పష్టత లేనివారు... పదాలు, లైన్లు మధ్య దూరం పెంచాలి. చేతిరాత పైనే తలరాత ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.
సమాధానాలు చక్కని భాషలో, అతివాద భావాలు లేకుండా.. నిర్మాణాత్మక దృక్పథంలో సాగాలి. భాష, భావ సంయమనం రెండూ అవసరం. మానసిక స్థితి ప్రశాంతంగా ఉండాలి. ఫలితంపై కంటే ప్రయత్నం పైనే దృష్టంతా ఉండాలి.
No comments:
Post a Comment