ఆ మాటలే గెలిపించాయి
డిగ్రీ చదువు... గుమాస్తా ఉద్యోగం... ఐదేళ్ల కిందట ఓ కుర్రాడి గురించి ఈ మాటలు చాలు. మరిపుడు అతడు డిప్యూటీ తహశీల్దార్. ఓ గుమాస్తా, ప్రభుత్వాధికారిగా ఎలా మారాడు?
'నమస్తే సర్' ఈ పదం వింటే నా గతం గుర్తొస్తుంది. సినిమా రీళ్లలా పాత జీవితం కళ్లముందు మెదుల్తుంది. ప్రేమను పంచే అమ్మ... ఒకే తనువులా మెదిలే ఫ్రెండ్స్... అప్పుడప్పుడు వాళ్లతో చేసుకొనే పార్టీలు... ఇవంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేనేనాడూ వూరిని వదల్లేదు. ఆఖరుకు 'ఉద్యోగం ఇప్పిస్తా' అని ఓ బంధువు చెప్పినా. కానీ బండి నడవాలంటే ఇం'ధనం' కావాలిగా. అందుకే ఓ షాపులో గుమాస్తాగా చేరా.
'నీకన్నా చిన్నవాళ్లకు పెళ్లిళ్లు అవుతున్నాయ్... నువ్వెపుడు చేసుకుంటావురా?' అమ్మ అడిగిందోరోజు. 'తొందరేముందిలే' అన్నా మనసులో నాకూ చేసుకోవాలనే ఉంది. ఆ ఆలోచనలే పదేపదే ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే రజని (పేరు మార్చాం) గుర్తొచ్చింది. మంచితనం, కలుపుగోలుతనంతో కుందనపు బొమ్మలా ఉండేది. ఈ సంగతి స్నేహితులతో చెబితే 'సూపర్ సెలెక్షన్ మామా' అన్నారు. వాళ్లిచ్చిన ధైర్యంతోనే నేరుగా రజని నాన్న దగ్గరికెళ్లి మాట్లాడా. ఎప్పుడూ ప్రేమగా పలకరించే తను ఇంతెత్తున లేచాడు. 'కూలీ కొడుకుతో నా కూతరు పెళ్లేంట్రా?' అంటూ వూగిపోయాడు. మా కుటుంబం గురించి నానా మాటలన్నాడు.
నిజమే... మా అమ్మ ఒకప్పుడు కూలీనే. కానీ ఇప్పుడు కాదు. పదిహేనేళ్ల కిందట నాన్న చనిపోతే కూలీ పనులు చేసి అక్కను, నన్నూ పెంచింది. ఇప్పుడు నా సంపాదనతో మేం సంతోషంగా బతుకుతున్నాం. ఇంకో వ్యక్తి అదనంగా చేరినా మాకొచ్చే ఇబ్బందేం లేదు. అయినా కూలీ పనులు చేయడం తప్పేం కాదుగా? దానికే ఇంతలా అవమానించడం తట్టుకోలేకపోయా. ఇన్నిమాటలు అన్న తనే 'శెభాష్' అనేలా మంచి ఉద్యోగం సాధించాలనే కసితో హైదరాబాద్ బయల్దేరా.
ఉద్యోగం, డబ్బు సంపాదించడం అనుకున్నంత సులువేం కాదని తొందరగానే అర్థమైంది. 'కొలువు ఇప్పిస్తా'నన్న బంధువు మొహం చాటేశాడు. చేసేదిలేక ఓ స్నేహితుడి రూంలో దిగా. ఇరుకు గదిలో ఇంకో నలుగురితో నేను. 'ఇంత జనమేంటి?' అంటూ ఓనర్ రోజూ తిట్టేవాడు. చివరకో స్నేహితుడి సలహాతో సాఫ్ట్‌వేర్ కోర్సులో చేరా. కోర్సులు పూర్తయ్యాయి... డబ్బులు కరిగిపోయాయి... ఉద్యోగం మాత్రం రాలేదు. ఓ సంస్థను నమ్మి పెద్దమొత్తంలో డబ్బులు కడితే వాళ్లూ మోసం చేశారు. ఒక్కోసారి బస్‌ఛార్జీలు మిగుల్తాయని కిలోమీటర్ల కొద్దీ నడిచేవాణ్ని. ఇవన్నీ గుర్తొస్తుంటే ఆవేశంతో సిటీకొచ్చి తప్పు చేశానేమో అనిపించేది.
అప్పుడే నా ధైర్యాన్ని పెంచే టానిక్‌లా గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడింది. దాంతో నా లక్ష్యమేంటో స్పష్టంగా అర్థమైంది. ఈసారి అవసరాల కోసం అమ్మ నగలు కరిగిపోయాయి. ఆర్నెళ్లు వంచిన తల ఎత్తకుండా చదివా. నా కష్టం, అమ్మ పూజలు ఫలించాయి. డిప్యూటీ తహశీల్దారుగా మా జిల్లాలోనే పోస్టింగ్ దక్కింది. ఏడాది కిందట లక్ష్మితో పెళ్త్లెంది. తను నాతో కలిసి కోచింగ్ తీసుకుంటున్నపుడు పరిచయం. నా పరిస్థితి తెలుసుకొని ఆర్థిక సాయం చేసేది. ఇప్పుడు మాకో పాప. జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. అప్పుడప్పుడు వూరెళ్తే 'ఏం బాబూ బాగున్నావా?' అంటూ పలకరిస్తాడు రజనీ వాళ్ల నాన్న. అలా అంటున్నపుడు ఆయన కళ్లల్లో పశ్చాత్తాపం. నాకు మాత్రం తనను చూసినప్పుడల్లా కృతజ్ఞతా భావం కలుగుతుంది. ఎందుకంటే నేనీస్థాయిలో ఉండటానికి కారణం తనే కాబట్టి.
- శ్రీ
ఎవరో ఏదో అన్నారని చిన్న చిన్న విషయాలకే ఆత్మ హత్య చేసుకునే యువకులకి మీరు ఎంతో ఆదర్శం. ఒక్కో సారి కోరుకున్న అమ్మాయి దొరకలేదని చనిపోయే వాళ్ళకి మీ కదా ఎంతో స్ఫూర్తి దాయకం.
ReplyDeleteplease guide me ..how can i start for groups...
ReplyDeleteis it possible without coaching r not...am waiting reply me soon
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGreat Job bro
ReplyDelete