Showing posts with label GROUP 1 Prelims. Show all posts
Showing posts with label GROUP 1 Prelims. Show all posts

సమీకరణే సగం విజయం గురూ....

సమీకరణే సగం విజయం
కొడాలి భవానీ శంకర్‌
యుద్ధంలో గెలవాలంటే సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలి. దానికంటే ముందు సరైన ఆయుధాల ఎంపిక తప్పనిసరి కదా! గ్రూప్స్‌ పరీక్షల పోటీలో ప్రామాణిక మెటీరియల్‌నుసమీకరించుకోవటమూ అలాంటిదే! లక్ష్యానికి అనుగుణంగా విషయసేకరణ ఉండాలి. ఆ పునాదిపైనే అభ్యర్థి అవగాహనా, విశ్లేషణలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే అభ్యర్థుల కృషి ఫలిస్తుంది!
గ్రూప్‌-1, 2 పరీక్షల కొత్త సిలబస్‌కు తగిన మెటీరియల్‌ లభ్యం కాక అభ్యర్థులు తికమక పడుతున్నారు. మెటీరియల్‌ను సమర్థంగా సమీకరించుకోగలిగితే సగం విజయం సాధించినట్లే! కాబట్టి ఈ అంశంపై అభ్యర్థులు శ్రద్ధ చూపాల్సి ఉంది.  త్రికోణాలు
అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్‌ను మూడు కోణాల్లో సేకరించుకోవాలి.
1. ప్రాథమిక సమాచారం
పోటీ పరీక్షల్లో దాదాపు 50 శాతం బిట్ల వరకూ ప్రాథమిక (బేసిక్‌) సమాచారంపైనే ఆధారపడివుంటాయి. అందుకే ప్రతి పేపర్‌లోని ప్రతి సబ్జెక్టుపైనా ప్రాథమిక సమాచారం సేకరించుకోవాలి. సొంత నోట్సు వీలైనంతవరకూ రాసుకోవాలి. సమయం లేదనుకుంటే ప్రాథమిక సమాచారం కోసం ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకోవాలి.
సేకరించే ప్రాథమిక సమాచారంపైనే అభ్యర్థి అవగాహనస్థాయి, విశ్లేషణ శక్తులు ఏర్పడతాయి. దాన్నిబట్టే ఉన్నతస్థాయి, వర్తమాన విషయాల్లో సంబంధమున్న ఆయా సబ్జెక్టులను అర్థం చేసుకోగలుగుతారు.
2. ఉన్నతస్థాయి విషయాలు
సబ్జెక్టుపై ప్రాథమికంగా మెటీరియల్‌ సేకరించాక అదే సబ్జెక్టుపై ఉన్నతస్థాయి (అడ్వాన్స్‌డ్‌) విషయాలపై దృష్టి నిలపాలి. ఇందుకోసం పీజీ పుస్తకాలనూ, ప్రామాణిక పుస్తకాలనూ ఆశ్రయించాలి. ఉన్నతస్థాయి అంశాలపై 30 శాతం వరకూ ప్రశ్నలు వస్తుంటాయి. అందుకని అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ అంశాలు చదవక్కర్లేదు. పరీక్ష అవసరాలను బట్టి సమయం కేటాయించుకోవాలి.
3. ‘వర్తమాన’ సంధానం
ఒక విషయానికి సంబంధించి ఉన్నతస్థాయి మెటీరియల్‌ కూడా రూపొందించుకున్నాక ఆయా అంశాలతో సంబంధమున్న వర్తమాన అంశాలు (కరంట్‌ అఫైర్స్‌) ఏమున్నాయో గమనించి, నోట్సు తయారుచేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కరంట్‌ అఫైర్స్‌తో పాటు సబ్జెక్టు మెటీరియల్‌ను కూడా సమర్థంగా రూపొందించుకున్నట్లు అవుతుంది.
ఇలా చేస్తే మేలు
* జీకే ప్రిపరేషన్‌
ఇటీవల ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో జనరల్‌ నాలెడ్జ్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల గ్రూప్స్‌ అభ్యర్థులు ఇయర్‌బుక్స్‌ను అధ్యయనం చేయటం అవసరం.
* ఏపీ ఎకానమీ
అభ్యర్థులు ఈ సబ్జెక్టు మెటీరియల్‌ కోసం బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ఎకానమీ నోట్సు తయారీకి 1) ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి-ఆర్థిక సంస్కరణల సవాళ్ళు (ప్రజాశక్తి ప్రచురణ) 2) ‘ఈనాడు’, ‘హిందూ’ పత్రికల కథనాలు ఉపయోగపడతాయి.
* కరంట్‌ అఫైర్స్‌
పరీక్ష తేదీకి 6 నెలల ముందటి సంఘటనలపై ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల విభజన చేసుకోవాలి. ప్రతి అంశంలోనూ సాంఘిక, రాజకీయ, సాంకేతిక, క్రీడారంగాలు; అవార్డులు; నూతన అన్వేషణలు అనే కోణాల్లో ఎప్పటికప్పుడు సొంతనోట్సు తయారుచేసుకోవాలి. దినపత్రికలతో పాటు పోటీ పరీక్షల మ్యాగజీన్లను పరిశీలిస్తుండాలి.
చిక్కులు… పరిష్కారాలు
1. గ్రూప్‌-1, 2లకు ప్రత్యేకంగా మెటీరియల్‌ తయారుచేసుకోవాలా?
*గ్రూప్‌-2 మెటీరియల్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు కూడా సరిపోతుంది. పైగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ క్వాలిఫైయింగ్‌ పరీక్ష కాబట్టి పెద్దగా ఆందోళనేమీ లేకుండా అదే మెటీరియల్‌ను వాడుకోవచ్చు.
గ్రూప్‌-1 మెయిన్స్‌లో పేపర్‌-2,3 ల్లోని అంశాలకూ గ్రూప్‌-2లోని పేపర్‌-2,3 అంశాలకూ సారూప్యతలున్నాయి. వాటిని అనుసంధానం చేసుకొని మెటీరియల్‌ రూపొందించుకోవచ్చు.
2. గ్రూప్స్‌ రెంటికీ మెటీరియల్‌ రూపకల్పనలో ఒకే పంథా సరిపోతుందా?
*గ్రూప్‌-2 మెటీరియల్‌ తయారీలో సమగ్రతకూ, సూక్ష్మతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్‌-1లో అంశాలవారీగా కీలక ప్రశ్నలను ఊహించుకొని మెటీరియల్‌ తయారుచేసుకోవాలి.
3. తాజా గణాంకాల సమాచారం తెలుసుకోవటం ఎలా?
*ఈ సమస్య ఆర్థిక అంశాల్లో ప్రధానంగా ఉంది. 2007-08 ఎకనమిక్‌ సర్వే, 2008-09 బడ్జెట్‌ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత ఆర్థికవ్యవస్థ సమాచారం 2005-06, 2006-07 వరకూ లభిస్తోంది. మనరాష్ట్ర ఆర్థికాంశాలే సమస్య. 2004-05, 2005-06 ఆర్థిక గణాంకాలపై ఆధారపడితే సరిపోయే అవకాశాలున్నాయి.
4. సొంతనోట్సు తయారీకి సమయం లేదు. ఎలా?
*ఇలాంటప్పుడు ప్రామాణిక మెటీరియల్‌ను తీసుకొని అందులోని సమాచారాన్ని ప్రాథమిక ఆధారంగా తీసుకోవాలి. దానికి అదనపు సమాచారాన్ని జోడిస్తూ కొంత సమయం ఆదా చేసుకోవచ్చు.
5. ఒక అంశానికి సంబంధించి ఒకటి రెండు పాఠ్యపుస్తకాలకు పరిమితమైతే చాలదా?
*అభ్యర్థికి లభించే సమాచారాన్ని బట్టి మాత్రమే దీనికి జవాబు ఉంటుంది. ఎక్కువ సమయం లభ్యమైతే అదనపు పుస్తకాలను అధ్యయనం చేసి సొంత మెటీరియల్‌ను రూపొందించుకోవాలి. సమయం తక్కువున్నపుడు తక్కువ పుస్తకాలకు పరిమితమవ్వటమే సరైంది.
6. భారీ సమాచారాన్ని క్లుప్తీకరించటం ఎలా?
*కొన్ని సబ్జెక్టులకు విస్తృతస్థాయిలో మెటీరియల్‌ దొరుకుతుంది. దాన్ని ఏ స్థాయిలో, ఎంత పరిమాణంలో వినియోగించుకోవాలనేది సమస్యే. రాయబోయే పరీక్ష ఆబ్జెక్టివ్‌ అయితే సమాచారాన్ని చిన్న చిన్న ప్రశ్నలుగా మార్చుకుంటే సరిపోతుంది.
కొన్ని సబ్జెక్టుల్లో సమాచారం కొరతగా ఉంది. ఇలాంటివాటివల్ల ఆబ్జెక్టివ్‌ పరీక్షలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ గ్రూప్‌-1 మెయిన్స్‌లో ‘ఒక్కమాట’నే ఇచ్చి విశదీకరించమని అడిగే అవకాశముంది. ఉదా: ‘రాజ్యాంగ మౌలిక నిర్మితిని విశ్లేషించండి’. నిజానికి ‘మౌలిక నిర్మితి’ అనే పదం రాజ్యాంగంలో కన్పించదు. కాబట్టి సబ్జెక్టును సమగ్రంగా అర్థం చేసుకుంటేనే ఇలాంటివాటికి జవాబులు రాయటం సాధ్యమవుతుంది.
సాధ్యాసాధ్యాలు గమనించాలి!
ఆర్‌.సి. రెడ్డి మెటీరియల్‌ ఎంపిక అనేది పోటీ పరీక్షల్లో చాలా కీలకం. కనపడిన ప్రతి పుస్తకాన్నీ చదివెయ్యకూడదు. గుడ్డిగా చేసే కృషి ఫలితాలనివ్వదు. ఎంతవరకూ చదవగలమో సాధ్యాసాధ్యాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను చదివితే చాలు. ఏది ప్రామాణికమనే విషయంలో సందేహముంటే నిపుణుల సలహాలు తీసుకోవాలి. చదివే సమాచారం స్పష్టంగా, క్లుప్తంగా ఉంటే మేలు. ఒక అంశం మీద ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండటం (ప్యారలల్‌ అప్రోచ్‌) సరైంది కాదు. దీనివల్ల ఫలితం తక్కువ; సమయం వృథా. అందుకే ఒక అంశానికి సంబంధించి పరిమితంగానే, అవీ ప్రామాణిక పుస్తకాలనే ఎంచుకోవటం (వర్టికల్‌ అప్రోచ్‌) ఉత్తమం. ఏ పుస్తకాన్ని అయినా కవర్‌ పేజీనుంచి చివరిపేజీ వరకూ చదవక్కర్లేదు. పరీక్షకు అవసరమైనవే చదవాలి. ఇలా మొదటిదశ ప్రిపరేషన్‌ ముగించాలి. ఇంకా సమయం ఉంటే రెండో దశలో అదనపు పుస్తకాలు చదవొచ్చు.
గ్రూప్‌-2 మెటీరియల్‌ తయారీలో సమగ్రతకూ, సూక్ష్మతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్‌-1లో అంశాలవారీగా కీలక ప్రశ్నలను వూహించుకొని మెటీరియల్‌ తయారు చేసుకోవాలి. సొంతనోట్సు తయారీకి సమయం లేనప్పుడు ప్రామాణిక మెటీరియల్‌లోని సమాచారాన్ని ప్రాథమిక ఆధారంగా తీసుకోవాలి. దానికి అదనపు సమాచారాన్ని జోడిస్తూ సమయం ఆదా చేసుకోవచ్చు.
ఒక అంశం మీద ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండటం సరైంది కాదు. దీనివల్ల సమయం వృథా. అందుకే ఏ అంశంపైనైనా సరే, పరిమితంగా, ప్రామాణిక పుస్తకాలనే అధ్యయనం చేయాలి.

సాంఘిక శాస్త్రం చదవండిలా...


జన గణన 2011.. విశేషాలు, వివరాలు..

భారతదేశ జనాభా 121 కోట్లకు చేరింది. ఇది అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాకు సమానం. 2011 జనగణన వివరాల ప్రకారం.. గత పదేళ్లలో దేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది.

1911-21 దశాబ్దాన్ని మినహాయిస్తే.. వృద్ధి రేటు తగ్గడం దేశంలో ఇదే తొలిసారి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. 19.9 కోట్లతో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉండగా.. కేవలం 64,429 మంది జనాభాతో లక్షదీవులు అట్టడుగు స్థానంలో ఉంది.



స్వదేశీ మార్కెట్ పరిమాణాన్ని నిర్ణయించడంలో ఒక ముఖ్య కారకం జనాభా. సాపేక్షికంగా ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉన్నప్పటికీ.. చైనా, భారత్‌లలో జనాభా కూడా అధికంగా ఉండడంతోపాటు అంతే స్థాయిలో మార్కెట్లు కూడా విస్తరించాయి. దీంతో బహుళజాతి సంస్థలు ఈ దేశాల్లోని మార్కెట్లలో ప్రవేశించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాయి.


21వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ జనాభా 6.1 బిలియన్లు కాగా.. అది 2007లో 6.6 బిలియన్లకు చేరుకుంది. 2010లో 6.9 బిలియన్లకు పెరిగింది. 2015 నాటికి 7.2 బిలియన్లకు, 2050 నాటికి 9.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 90 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. 2001లో భారత్ జనాభా 1,028, 737,436 నుంచి 2011లో 1,210,193,422 కు పెరిగింది.


ప్రపంచ జనాభాలో భారత్:

ప్రస్తుత భారతదేశ మొత్తం జనాభా..అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాకు సమానం. ఈ ఆరు దేశాల మొత్తం జనాభా 1214.3 మిలియన్లు కాగా భారత్ జనాభా 2011 లెక్కల ప్రకారం.. 1210.2 మిలియన్లు. చైనా, భారత్ జనాభాలోని తేడా 2001లో 238 మిలియన్లు. 2011లో ఈ వ్యత్యాసం 131 మిలియన్లకు తగ్గింది.

ప్రపంచంలోని మొత్తం జనాభాలో 19.4 శాతం చైనాలో, 17.5 శాతం భారత్‌లో నివసిస్తున్నారు. భారత్, అమెరికా జనాభాలోని తేడా 2001లో 741 మిలియన్లు ఇది 2011 నాటికి 902 మిలియన్లకు పెరిగింది. 2000-10 మధ్య కాలంలో ప్రపంచ జనాభావృద్ధి 1.23 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి అభిప్రాయంలో ఇదే కాలానికి సంబంధించి చైనాలో జనాభా వృద్ధి 0.53 శాతం. భారత్‌లో వృద్ధి 1.64 శాతం.


20వ శతాబ్దం ప్రారంభంలో భారత్ జనాభా 238.4 మిలియన్లు. గత 110 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా 4 రెట్లు పెరిగి.. 2011లో 1210 మిలియన్లకు చేరుకుంది. 20వ శతాబ్దం ప్రథమార్థంలో జనాభా ఒకటిన్నర రెట్లు, ద్వితీయార్థంలో మూడు రెట్లు పెరిగింది. స్వాతంత్య్రానంతరం దశాబ్దపు జనాభా వృద్ధి 1981-91 మధ్య 23.87 శాతం నుంచి 1991-2001 మధ్య 21.54కు తగ్గి 2001-2011 మధ్య 17.64 శాతానికి చేరుకుంది.

జనాభా-రాష్ట్రాలు:

దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్ర జనాభా బ్రెజిల్ దేశ జనాభాకు సమానం. ఉత్తరప్రదేశ్, మహారాష్టల్ర జనాభా కలిపితే 312 మిలియన్లు. ఈ మొత్తం అమెరికాలో నివసించే జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 10 మిలియన్ల కంటే ఎక్కువజనాభా కలిగి ఉన్నాయి. మరోవైపు దేశంలోని 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జనాభా ఒక మిలియన్‌కు చేరుకునే అవకాశం ఉంది.

1991-2001 కాలంలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో దశాబ్దపు జనాభా వృద్ధి శాతం ఎక్కువగా ఉంది. కాగా 2001-11 మధ్య ఈ వృద్ధి శాతం తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తగ్గుదల స్వల్పంగా 3.5 శాతంగా ఉంది. మహారాష్టల్రో 6.7 శాతం, తమిళనాడులో 3.9 శాతం కాగా పుదుచ్చేరిలో అత్యధికంగా 7.1 శాతంగా నమోదైంది.


చిన్న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాద్రానగర్ హవేలీ, డామన్-డయ్యూల్లో ఈ వృద్ధి 5.3 శాతం కంటే ఎక్కువగా ఉంది. లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులు, గోవాలలో ఈ వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. కాగా నాగాలాండ్‌లో మాత్రమే ఈ అంశానికి సంబంధించి రుణాత్మక వృద్ధి నమోదైంది.


కేరళలో జనాభా వృద్ధి 1961-71 మధ్య 26.29 శాతం కాగా 1991-2001 మధ్య 9.43 శాతానికి పడిపోయింది. వివిధ కార్యక్రమాల ద్వారా 2001-11 మధ్య జనాభా వృద్ధి రేటును 4.9 శాతానికి పరిమితం చేసుకోగలిగింది. జనాభా వృద్ధి రేటు విషయంలో..40 సంవత్సరాల క్రితం కేరళ, తమిళనాడులలో నెలకొన్న స్థితి ప్రస్తుతం బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కనిపిస్తోంది.


స్త్రీ-పురుష నిష్పత్తి:

దేశ స్వాతంత్య్రానంతరం సమాజంలో మహిళా ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష నిష్పత్తిలో పెరుగుదల ఉంటుందని భావించారు. కానీ దానికి భిన్నంగా మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఈ నిష్పత్తి తగ్గింది. 1961 నుంచి కేరళలో స్ర్తీ-పురుష నిష్పత్తిలో మంచి పెరుగుదల కనిపించింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్ర్తీ-పురుష నిష్పత్తి జాతీయ సగటు క ంటే ఎక్కువ.

జనాభా వృద్ధి రేటు తగ్గుదల:

భారత్‌లో స్వాతంత్య్రానంతరం ఆరోగ్య సౌకర్యాల విస్తరణతోపాటు అంటు వ్యాధులను పూర్తిగా అరికట్టడం వల్ల మరణాల రేటు తగ్గింది. 1950-51లో జననాల రేటు ప్రతి 1000 మందికి 39.9. కాగా మరణాల రేటు ప్రతి 1000 మందికి 27.4. మరణాల రేటు 2009 నాటికి ప్రతి 1000 మందికి 7.4 కు తగ్గింది. 1911-21 మధ్య కాలంలో జనన, మరణాల రేటు సమానంగా ఉండటంతో జనాభా పెరుగుదల సంభవించలేదు. గత 50 సంవత్సరాల కాలంగా శిశు మరణాల రేటులో తగ్గుదల నమోదైంది. 20వ శతాబ్దపు రెండో దశాబ్దంలో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 218 కాగా 2007 నాటికి 55కి తగ్గింది.

అవసరమైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోయినప్పటికీ, పేదరిక తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రసూతి మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదు కావడం గమనార్హం. జననాల రేటు ప్రతి 1000 మందికి 1950-51లో 39.9గా ఉంది. కాగా ఈ రేటు 2008-09లో 22.8కి తగ్గింది. పెరుగుతున్న పట్టణీకరణ కూడా జనాభా వృద్ధి తగ్గడానికి ఒక రకంగా కారణమైందని చెప్పొచ్చు. జనాభా నియంత్రణలో భాగంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందింది.


చైనాలో జననాల రేటు ప్రతి 1000 మందికి 24 కాగా ప్రస్తుతం 12కు తగ్గించుకోగలిగింది. అక్కడ వివాహితులైన స్త్రీలలో 85 శాతం మంది గర్భనిరోధక సాధనాలు వినియోగిస్తున్నారు. మన దేశంలో వీరి శాతం 41 మాత్రమే. గర్భనిరోధక సాధనాల వినియోగంలో మన దేశం కంటే శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంది. దాంతో ఆ దేశంలో జననాల రేటు 19కి తగ్గింది. కేరళ, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలను మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పట్ల ఎక్కువ మంది ప్రజలకు అవగాహన లేదని చెప్పొచ్చు.


జనాభా వృద్ధి రేటులో తగ్గుదల గణనీయంగా ఉన్నప్పటికీ.. ప్రోత్సాహక విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ వృద్ధిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. మహిళా సాధికారత పెంపు, వివాహ వయసు పెంచడం, ఒకే బిడ్డ విధానం (వన్ చైల్డ్ నార్మ్) పాటించిన వారికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించడం, హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యల ద్వారా జనాభా వృద్ధి రేటును నియంత్రించవచ్చు. దేశంలో జనాభా వృద్ధి రేటులో తగ్గుదల నమోదుకావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగుపడగలదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.


ముఖ్యాంశాలు:

1950లో ప్రపంచ జనాభాలో చైనా జనాభా 22 శాతం కాగా భారత్ వాటా 14.2 శాతం.
ప్రపంచ విస్తీర్ణంలో భారత్ వాటా 2.4 శాతం. జనాభా వాటా 17.5 శాతం.
ప్రపంచ విస్తీర్ణంలో అమెరికా వాటా 7.2 శాతం. జనాభా వాటా 4.5 శాతం.
2001-11 మధ్య కాలంలో భారత్‌లో జనాభా పెరుగుదల 181 మిలియన్లు.
భారతదేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ శాతం 16. అంధ్రప్రదేశ్ జనాభా ఏడు శాతం.
2000-10 మధ్య కాలంలో ప్రపంచ జనాభా వృద్ధి 1.23 శాతంగా ఉండగలదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ప్రపంచంలో జనాభా పరంగా ఐదో పెద్ద దేశం బ్రెజిల్.
199.6 మిలియన ్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (112.4 మిలియన్లు), బీహార్ (103.8 మిలియన్లు), పశ్చిమ బెంగాల్ (91.3 మిలియన్లు), ఆంధ్రప్రదేశ్ (84.7 మిలియన్లు) ఉన్నాయి.
నాగాలాండ్ రాష్ట్రంలో మాత్రమే దశాబ్దపు జనాభావృద్ధి శాతం పరంగా రుణాత్మకం.
డామన్-డయ్యూలో స్ర్తీ-పురుష నిష్పత్తి 618:1000
కేరళలో స్ర్తీ-పురుష నిష్పత్తి 1084:1000
భారత్ జనాభాలో 0-6 వయో వర్గం 13.2 శాతం
భారత్‌లో అక్షరాస్యత 74.04 శాతం. కాగా పురుషుల అక్షరాస్యత రేటు 82.14 శాతం, స్ర్తీల అక్షరాస్యత రేటు 65.46 శాతం.

గ్రూప్స్‌ గెలుపు... ఇదే మేలుకొలుపు!

గ్రూప్స్‌ గెలుపు... ఇదే మేలుకొలుపు!



కొడాలి భవానీ శంకర్‌
 అభ్యర్థుల ఉద్యోగావకాశాలను పెంచుతూ గ్రూప్‌-1కి తాజాగా, గ్రూప్‌-2కి సప్లిమెంటరీ నోటిఫికేషన్లు రాబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. 'ప్రకటనలు విడుదల కాలేదు; పరీక్ష తేదీలు తెలియకుండా చదవబుద్ధి కాద'నుకుంటే పోటీలో వెనుకబడే ప్రమాదముంది. ఇప్పటినుంచే మేలుకొని, సన్నద్ధమవటం ప్రారంభిస్తే మొత్తం సిలబస్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది!
అకడమిక్‌ పరీక్షలకు నాలుగు నెలల ముందు చదవటం ప్రారంభించినా మంచి మార్కులు సాధించవచ్చు. కానీ పోటీ పరీక్షల్లో పోటీ ఎక్కువ; ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తేనే మంచి ఉద్యోగాలు వస్తాయి. 2008 పరీక్షలో విఫలమైన అభ్యర్థులతో పాటు గత 3 సంవత్సరాలుగా చదువుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. ఫలితంగా తాజా అభ్యర్థులు తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిందే. గ్రూప్‌-2 మూడు పేపర్లలో మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌, రెండోది ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, పాలిటీ; మూడోది భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు.
ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర సిలబస్‌ పరిమితం కాబట్టి చరిత్ర పట్ల ఆసక్తి ఉంటే దీనితో ప్రిపరేషన్‌ మొదలుపెట్టొచ్చు. ఒక్కో సిలబస్‌ అంశాన్ని చదివి ప్రశ్నలు సాధన చేస్తే ఆత్మవిశ్వాసం త్వరగా పెంపొందుతుంది. పాలిటీ సిలబస్‌ కూడా పరిమితమే. పైగా మెటీరియల్‌ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి పేపర్‌-2 పై త్వరగా పట్టు సాధించే అవకాశం ఉంది.
ఆర్థికశాస్త్రాన్ని గ్రాడ్యుయేషన్‌/ పీజీ స్థాయిలో చదివినవారు పేపర్‌-3లోని ఇండియన్‌ ఎకానమీ సిలబస్‌ అంశాలతో అధ్యయనం మొదలుపెడితే ప్రేరణ బాగుంటుంది. తరవాత ఏపీ ఎకానమీని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఇందుకోసం గ్రూప్‌-2 కోసం రచించిన పుస్తకాలు మార్కెట్లో బాగానే ఉన్నాయి. వాటి అధ్యయనం ద్వారా ప్రిపరేషన్‌ గాడిలో పడే అవకాశం ఎక్కువ.
సైన్సు, ఇతర సబ్జెక్టులు డిగ్రీ/ పీజీలో సంబంధం కలిగినవారు నేరుగా జనరల్‌ స్టడీస్‌తో మొదలుపెట్టొచ్చు. జీఎస్‌లో వచ్చే ప్రశ్నల్లో కనీసం 60 శాతం పాఠశాల స్థాయి సమాచారానికి సంబంధించినవే. కాబట్టి వాటిపై ముందుగా దృష్టి నిలపాలి. పాఠశాల స్థాయిలో వివిధ సబ్జెక్టుల్లోని సమాజ అన్వయ విషయాలపై శ్రద్ధ చూపాలి.
సమాంతరంగా...
మొత్తం మీద 3 పేపర్లలోనూ ప్రిపరేషన్‌ సమాంతరంగా సాగించాలి. పాఠ్యాంశాల వారీగా సిద్ధమవుతూ ఆబ్జెక్టివ్‌ ధోరణిలో ప్రతి అంశాన్నీ ఆలోచించడం అవసరం. ప్రతి పేపర్‌లోనూ కనీసం 50 శాతం ప్రిపరేషన్‌ ముగిసిన తరవాత ప్రామాణికమైన నమూనా ప్రశ్నల్ని, ఏపీపీఎస్సీ గత ప్రశ్నపత్రాల్ని సాధన చేయాలి. చదివిన సిలబస్‌లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాల్ని ఎంత కచ్చితంగా గుర్తించారో సరిచూసుకోవాలి.
తప్పుల శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఎందుకలా జరుగుతోందో సమీక్షించుకోవాలి. వాస్తవాల ఆధారిత ప్రశ్నల్లో ఎక్కువ తప్పులు వస్తుంటే ప్రధానాంశాల ప్రిపరేషన్‌ను అవసరమైతే కొంత బట్టీ ధోరణిలోకి మార్చాలి. విశ్లేషణాత్మక ప్రశ్నల్లో వెనకబడివుంటే ఆయా విషయాల్లోని భావనలను మరొక్కసారి పరిశీలించుకోవాలి. ఎక్కువశాతం ప్రశ్నలు అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టుగా అన్పిస్తే మాత్రం చదువుతున్న పుస్తకాలను మార్చాలి!
'సీనియర్లతో పోటీపడగలమా?'
పాత, కొత్త అభ్యర్థులకు గ్రూప్‌-2 ఒకే పరీక్ష ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాంతో తాజా అభ్యర్థులు తాము పోటీపడగలమా అనే భావనకు గురవుతున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో సత్తా కలిగిన అభ్యర్థులు 5 లేదా 6 నెలలు కష్టపడి మంచి ర్యాంకులు సాధించిన సంఘటనలు ఎక్కువే ఉన్నాయి. ఎగ్జామ్‌ ఓరియంటేషన్‌, భావనలపై అవగాహన, ప్రామాణిక సమాచారం, గ్రహణశక్తి, అన్వయ దృక్పథం మొదలైనవి విజయంపై ప్రభావం చూపుతాయి. ఈ లక్షణాల్ని అలవర్చుకుంటే వారు సీనియర్‌ అయినా, జూనియర్‌ అయినా గెలుపు సాధించగలరు.
సీనియర్‌ అభ్యర్థుల సంగతి?
గత మూడు సంవత్సరాలుగా ఇదే పరీక్షకు అగమ్యగోచరంగా చదువుతూ ఉండటంతో కొంత నిరాశ ఏర్పడి ఉంటుంది. 'చాలామంది పరీక్ష తేదీలు వచ్చాక చూసుకోవచ్చులే' అని తాత్కాలిక విరామం ప్రకటించారు. తాబేలు- కుందేలు కథ మాదిరిగా దెబ్బతినకుండా ఉండాలంటే వీరు అప్రమత్తంగా ఉండాల్సిందే!
గత మూడేళ్ళలో ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విషయాల్లో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా ఎకానమీ అంశాల్లో విస్తృత సమాచారం అందుబాటులోకి వచ్చింది. తాజా అభ్యర్థుల పోటీ నిర్లక్ష్యం చేయదగ్గది కాదు. పూర్తిగా పుస్తకాలు అటకెక్కించవద్దు. పీజీ/బ్యాంక్‌ మొదలైన పరీక్షలకు సిద్ధమవుతున్నా నిత్యం 2, 3 గంటల సమయాన్ని గ్రూప్స్‌కి వెచ్చించడం సముచితం.
గ్రూప్‌-1, 2... పరస్పర ఆధారితాలు
ఏదో ఒక పరీక్షనే అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకోకుండా, రెండింటికీ సిద్ధమవటం మెరుగైన ఫలితాలనిస్తుంది. రెంటిలోనూ కామన్‌గా 30 శాతం ప్రశ్నలున్నాయి. వాటిని ఆబ్జెక్టివ్‌, సబ్జెక్టివ్‌ కోణంలో చదవాలి.
భారత్‌ జట్టు క్రికెట్‌ ప్రపంచకప్‌ రెండోసారి గెలవడానికి 28 సంవత్సరాలు పట్టింది. అనివార్యమైన నిరీక్షణను సహనం, పట్టుదలతో అధిగమిస్తేనే అంతిమ విజయమని గ్రూప్స్‌ అభ్యర్థులూ గుర్తించాలి!




సరైన సన్నద్ధత
అకడమిక్‌ పరీక్షల్లో 80, 90 శాతం మార్కులు సాధించామనే ధీమాను పోటీ పరీక్షల విషయంలో అన్వయించలేము. అకడమిక్‌ పరీక్షల్లో ఛాయిస్‌ విధానం, ముఖ్యమైన పాఠ్యాంశాలు మొదలైన అనుకూలతలుంటాయి. గ్రూప్‌- 2 లాంటి ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ఏ చిన్న అంశంపైనయినా ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి సమూలమైన అధ్యయనం కీలకపాత్ర పోషిస్తుంది. సమూలమైన అధ్యయనం అంటే... సిలబస్‌లో ప్రాథమిక భావనలు, విశ్లేషణ, ప్రాధాన్యం, అడ్వాన్స్‌డ్‌ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేయడం.
ఈ ప్రతి విభాగంలోనూ వాస్తవాల, భావనాధార ప్రశ్నలు ఉంటాయని గుర్తించి అధ్యయనం చేయాలి.
1: ప్రతి పాఠ్యాంశంలోని మౌలిక విషయాలపై పట్టును సాధించాలి.
2: ప్రతి పాఠ్యాంశంలోని కోర్‌ (ప్రాధాన్య) అంశాలపై దృష్టి నిలపాలి.
(ఈ రెంటిపై గట్టి పట్టు సాధించిన అభ్యర్థి 50 శాతం పైన మార్కులు సాధించగలుగుతారు.)
3: ప్రతి పాఠ్యాంశంలోని విశ్లేషణాత్మక ప్రశ్నలు, అడ్వాన్స్‌ సబ్జెక్టు విషయాల్ని అధ్యయనం చేయాలి.
నమూనా పరీక్షల్లో తప్పుల శాతం ఎక్కువ ఉన్నట్లయితే ఎందుకలా జరుగుతోందో సమీక్షించుకోవాలి. విశ్లేషణాత్మక ప్రశ్నల్లో వెనకబడివుంటే ఆయా విషయాల్లోని భావనలను మరొక్కసారి పరిశీలించుకోవాలి. ఎక్కువశాతం ప్రశ్నలు అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టు అన్పిస్తే మాత్రం చదువుతున్న పుస్తకాలను మార్చెయ్యాలి!

భారీ సిలబస్‌కు బహుముఖ వ్యూహం


భారీ సిలబస్‌కు బహుముఖ వ్యూహం
గ్రూప్‌-2 సిలబస్‌ భారీగా ఉందనేది ఎక్కువ మంది అభ్యర్ధుల ఫిర్యాదు. ఇప్పుడున్న 75 రోజుల వ్యవధిలో సిలబస్‌ను సమగ్రంగా చదవటానికి బహుముఖ వ్యూహం అవలంబించాలి.
ఇటీవల 'ఈనాడు-చదువు' నిర్వహించిన SMS పోల్‌లో 68 శాతం మంది అభ్యర్థులు సిలబస్‌ భారీగా, భారంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇది నిజమే అయినా ఆ ఆలోచన మీ దరిదాపుల్లోకి కూడా రానీయవద్దు. ఎంతటి భారీ, క్లిష్ట అంశానికైనా ఒక మార్గం కచ్చితంగా ఉంటుంది. మీ ప్రిపరేషన్‌లో కేవలం ఒక్క మార్గంపైనే ఆధారపడకుండా బహుముఖ మార్గాలను అనుసరించండి.

1) కొన్ని పాఠ్యాంశాల్లో లోతైన అధ్యయనం అవసరం.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌ సహకార వ్యవస్థ, ప్రజా పంపిణీ, సంక్షేమపాలన
2) కొన్ని అంశాల్లో స్థూల అవగాహన చాలు.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో రవాణా విధానం, కమ్యూనికేషన్‌ సిస్టమ్‌
3) కొన్నిటిని గణాంకాల ఆధారంగానే అధ్యయనం చేయాలి.
ఉదా: ఆంధ్రప్రదేశ్‌ పంచవర్ష ప్రణాళికలు, మానవ వికాససూచి, భారత ప్రణాళిక వ్యవస్థలు, విత్త బడ్జెట్‌
ఈ విధంగా ప్రతి పేపర్‌లోనూ సబ్జెక్టు పరిధిని బట్టి, ప్రాధాన్యం బట్టి స్థాయిని నిర్ణయించుకొని ప్రిపేరైతే సిలబస్‌ ఎంత భారీగా ఉన్నా చదవటం సులువుగానే ఉంటుంది.
పేపర్‌-1 లో జాగ్రఫీ, జనరల్‌సైన్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, కరంట్‌ అఫైర్స్‌ల నుంచి ఒక్కోదానిపై 35 బిట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. భారతదేశ చరిత్రకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. ఏపీ చరిత్ర పేపర్‌-2లో 75 మార్కుల ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయానికి అవకాశముంది. అందువల్ల పైన చెప్పిన నాలుగు సబ్జెక్టుల్లో లోతుగా చదవాలి. పాత పద్ధతిలోని జనరల్‌స్టడీస్‌ స్థాయి కంటే మించి ఉండేలా ప్రిపరేషన్‌ సాగించాలి.
పునశ్చరణ (రివిజన్‌)
మీ ప్రిపరేషన్లో పునశ్చరణ పాత్ర ఏమిటి? కొందరు అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టులోని ఒక్కో పాఠం చదువుకుంటూ మొత్తం పాఠాలను పూర్తిచేశాక వీలైతే రివిజన్‌ చేస్తారు. సమయం ఎక్కువ లేకపోతే రివిజన్‌ ఏమీ చేయకుండానే కొత్త సబ్జెక్టులోకి వెళ్ళిపోతారు. ఇలా అన్ని సబ్జెక్టులూ ఒకసారి పూర్తయ్యాక రివిజన్‌ మొదలుపెడతారు. ఇది సరైన ధోరణి కాదని జ్ఞాపకశక్తి అధ్యయన నిపుణులు చెపుతున్నారు. మొదటిసారి చదివిన సందర్భానికీ, రెండోసారి చదివిన సందర్భానికీ మధ్య కాలవ్యవధి చాలా ఎక్కువ ఉండటమే దీనిలో లోపం.
ఉదాహరణకు... మూడు పేపర్లు చదవాలనుకోండి. ప్రతిరోజూ 3 పేపర్లకు సమయాన్ని కేటాయించాలి.
ఈ విధంగా చదవటం వల్ల సమయం వృథా అవుతుందనే అపోహ అక్కర్లేదు. పునరభ్యాసం వల్ల మొదటి రోజు పట్టిన సమయం కంటే రెండో రోజు అదే పాఠానికి తక్కువ సమయం పడుతుంది. మూడో రోజు మరింత తక్కువ సమయం! అందుకని ఆందోళన పడకుండా ప్రతి సబ్జెక్టులోనూ అన్ని పాఠాలకూ ఇదే ధోరణిని అనుసరించాలి.
ఎవరైనా అభ్యర్థి గ్రూప్‌-2 సిలబస్‌ మొత్తంపై మంచి అవగాహన ఏర్పరచుకున్నాడనుకుందాం. అయినప్పటికీ పునశ్చరణ, నమూనా పరీక్షల సాధన ఏమీ చేయకుండా నేరుగా పరీక్ష రాస్తే అతడు విజయం సాధించటం కష్టమే. అతడే తగిన విధంగా పునశ్చరణ చేసి, నమూనా పరీక్షలు రాస్తే విజేతల జాబితాలో నిలవటం తథ్యం! విషయ అవగాహన ద్వారా లభించే విజయావకాశాలు 60 శాతం మాత్రమే. పునశ్చరణ (రివిజన్‌) ద్వారా వాటిని మరో 25 శాతం పెంచుకోవచ్చు.


ఆం.ప్ర.పై పట్టుందా?
గ్రూప్‌-1లోనైనా, గ్రూప్‌-2లోనైనా మారిన పరీక్ష విధానంలో ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక, ఆర్థిక, సామాజిక విషయాలు కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ చారిత్రక, ఆర్థిక విషయాలకు 450కు 150 మార్కులు కేటాయించారంటేనే జయాపజయాలను నిర్ణయించే స్థితికి 'ఆంధ్రప్రదేశ్‌ సమాచారం' చేరినట్టు గుర్తించాలి. అందుకే ఆం.ప్ర. చరిత్ర, ఆర్థిక వ్యవస్థలపై పట్టు అవసరం. దానికోసం ఈ రెండు అంశాలపై లోతైన, మారుమూల అంశాలను కూడా అధ్యయనం చేయాలి. మరి మీ ప్రిపరేషన్‌ ఈ రీతిగా సాగుతోందా?
ప్రాథమికం చదివితే చాలదు
పోటీ పరీక్షల్లో కాలానుగుణంగా అభివృద్ధి చెందే భావనలు, ఉత్పత్తులపైన ప్రశ్నలు అడిగే ధోరణి ఉంటోంది. అందువల్ల ప్రతి సబ్జెక్టులోనూ తాజా పరిణామాలపై దృష్టి నిలపాలి.
* చరిత్రలో ఇటీవల బయల్పడిన పురాతన సాక్ష్యాలు ఏమిటి?
* ఇటీవల చర్చనీయాంశాలు/ వివాదాస్పదంగా మారిన అంశాలు ఏమిటి?
ఈ తరహాలో ప్రశ్నించుకొని, సమాధానాలు సేకరించుకోవాలి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.
ప్లూటో ఒక గ్రహమా, కాదా అన్న ఆధునిక ధోరణులు, పరిశోధనలను బట్టి గ్రహమండల వ్యవస్థ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో లేదో గమనించాలి. 'సునామీ'లాంటి తాజా పరిణామాలు, కరుగుతున్న మంచుకొండలు మొదలైన కోణాల్లో సబ్జెక్టును అధ్యయనం చేయాలి.
ముఖ్యంగా... శాస్త్ర సాంకేతిక రంగంలో రోజుకో రీతిలో నూతన అంశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల ప్రాథమిక సమాచారంతోపాటు లోతుగా, తాజా అంశాలను చేర్చిన (అడ్వాన్స్‌డ్‌) సమాచారంపై దృష్టి నిలిపితేనే ఎగ్జామినర్‌ స్థాయి ఆలోచన మీలో ఏర్పడుతుంది. ఆ దృష్టికోణం ఎప్పుడైతే మీలో ఏర్పడుతుందో అప్పుడు ప్రతి అంశాన్నీ అదే రీతిలో అధ్యయనం చేయగలుగుతారు.
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ (పేపర్‌-3) విషయానికొస్తే... మన రాష్ట్రం సంప్రదాయ వస్తూత్పత్తి, తద్వారా సంపద పెంచుకోవటంపై కంటే సమాచార సాంకేతికత, బయోటెక్నాలజీ, పర్యాటకరంగం మొదలైన సేవారంగ సంబంధ అంశాలపై దృష్టి కేంద్రీకరించి స్థూల రాష్ట్రీయోత్పత్తి (జీఎస్‌డీపీ)ని పెంచుకుంటోంది. కాబట్టి ఆధునిక ఉత్పత్తి ధోరణులు మీ ప్రిపరేషన్‌లో ఏ మోతాదులో ఉన్నాయో చూసుకొని ఈ 75 రోజుల ప్రిపరేషన్‌కు పదును పెట్టండి.
వర్తమానం పరిధి, స్థాయి?
ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటే 6 నెలల క్రితం వరకూ జరిగిన అంశాలపైనే ప్రశ్నలు అడిగారు. అవి కూడా అభ్యర్థిలో కచ్చితమైన సమాచారాన్ని పరిశీలించేవిగా ఉన్నాయి. ఊహించి సమాధానాలు గుర్తించే అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రశ్న, చాయిస్‌లను తయారుచేశారు. అందువల్ల 'అదృష్టం' పాత్ర కన్పించలేదు. ఇదే ధోరణి గ్రూప్‌-2లో కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని గతంలో మాదిరిగా కాకుండా ప్రతి వర్తమాన అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయాలి. ఈ ధోరణి ఇప్పటివరకూ మీ ప్రిపరేషన్లో లేకుంటే వెంటనే మేల్కొనాలి. ప్రతిరోజూ కరంట్‌ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి.

'మెంటల్‌ ఎబిలిటీ' స్థాయి పెరిగిందా?
ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో తాజాగా విన్పిస్తున్న మార్పు- మానసిక సామర్థ్యం (మెంటల్‌ ఎబిలిటీ) ప్రశ్నల స్థాయి పెరగటం. మొన్నటి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఎసర్షన్‌, రీజనింగ్‌ ప్రశ్నలు వచ్చాయి. వాటి ద్వారా అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని పరిశీలిస్తారు. ఇదే ధోరణి గ్రూప్‌-2లో కూడా పునరావృతమయ్యే అవకాశం ఎక్కువ. అందువల్ల మెంటల్‌ ఎబిలిటీలో ఇలాంటి అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? అని అధ్యయనం చేయటం అవసరం. క్లిష్టమైన సమస్యలను బాగా సాధన చేయాలి. ప్రతి మార్కూ విలువైన ఈ పోటీ పరీక్షల్లో ఏ అంశాన్నయినా నిఖార్సుగా అధ్యయనం చేయాలి. ఇలాంటి ధోరణి మీ ప్రిపరేషన్లో ఉందా?

మానసిక సవాళ్ళు
లక్షలమంది ప్రేక్షకుల అరుపుల మధ్య బంతిని ఎదుర్కొనే క్రికెటర్‌ కంటే మీపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందా? ఆ ఒత్తిడిని అధిగమించి క్రికెటర్లు సెంచరీలు చేయటం లేదా? బౌలర్లు వికెట్లు తీయటం లేదా? ఏ లక్ష్యసాధనలోనైనా ఒత్తిడి సహజం. దీన్ని జయించేందుకు ఈ మెలకువలను మీ ప్రిపరేషన్లో భాగం చేసుకోండి.
* 'నేను బాగానే చదువుతున్నాను. నాకు ఉద్యోగం తప్పకుండా వస్తుం'దని తరచూ అనుకోవాలి.
* ప్రతిరోజూ నిద్రపోయేముందు ఆ రోజు చదివిన పాఠాలన్నీ గుర్తుచేసుకోండి. మంచి ఫలితం ఉందని సమీక్షించుకోవాలి.
* గతంలో మీరు సాధించిన విజయాలను ఒక్కసారి స్మరించుకోండి. అదే బాటలో పయనిస్తున్నానని స్థిమితపడండి.
* పోటీ ఎక్కువుందని లేనిపోనివి ఊహించుకొని ఆందోళన పడకండి. లక్షలమంది రాసినా 'నాలాంటి వాణ్ని నేనొక్కణ్నే. ఒక్క ఉద్యోగం ఉన్నా అది నాదే' అనే భావన పెంచుకోవాలి. ఈ ఆశావహ దృక్పథం పరీక్ష రాసేవరకూ కొనసాగాలి.

ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 6 నెలల క్రితం వరకూ జరిగిన కరెంట్‌ అఫైర్స్‌పైనే ప్రశ్నలు అడిగారు. అవి కూడా అభ్యర్థిలో కచ్చితమైన సమాచారాన్ని పరిశీలించేవిగా ఉన్నాయి. వూహించి సమాధానాలు గుర్తించే అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రశ్న, చాయిస్‌లను తయారుచేశారు. ఇదే ధోరణి గ్రూప్‌-2లో కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని గతంలో మాదిరిగా కాకుండా ప్రతి వర్తమాన అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయాలి.

గెలుపు లక్ష్యంతో.....తుది సన్నద్ధత


కొడాలి భవానీ శంకర్‌
రాష్ట్ర స్థాయి అత్యుత్తమ సర్వీసుల్లో  నియామకానికి రాసే పరీక్ష గ్రూప్‌-1... ఇప్పుడు ఐదు రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. శంకలూ, అపోహలూ విస్మరించి, ఏకాగ్రతతో ఈ  సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటారా? ఏపీపీఎస్‌సీ పోటీపరీక్షల నిపుణుల సూచనలివిగో...!
ఆయుధాలు ఎంత అధునాతనమైనవి అయినా, ఉపయోగించే నైపుణ్యం ఎంత బాగా ఉన్నా యుద్ధక్షేత్రంలో వాటి వినియోగంపైనే విజయం ఆధారపడివుంటుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీలో కూడా పరీక్షా సమయంలో జ్ఞానం, ఏకాగ్రత మొదలైన అస్త్రాలను సమర్థంగా వినియోగించటంపైనే విజయం ఆధారపడుతుంది. మానసిక సంసిద్ధత చాలా ముఖ్యం
పరీక్ష తేదీకి కనీసం 3 రోజుల ముందు నుంచే 'నేను బాగా ప్రిపేరయ్యాను' అనుకోవాలి. చాలామంది అభ్యర్థులు పరీక్ష తేదీ సమీపిస్తున్నకొద్దీ 'ఇది చదవలేదు', 'అది చదవలేదు' 'టైమ్‌ చాల్లేదు' అంటూ నానా హైరానాకు గురవుతారు. ఇలాంటి గందరగోళం తీవ్ర నష్టానికి దారితీస్తుందని గుర్తించాలి. ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో కనీసం 18 గంటలకు ముందే ప్రిపరేషన్‌ను ఆపివేయాలని మానసిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా చేస్తే చదివిన సమాచారం ఒక క్రమ పద్ధతిలో పరీక్షా సమయంలో ప్రతిభావంతంగా వెలుగుచూస్తుంది.
భౌతిక సంసిద్ధత కూడా ప్రధానమే
హాల్‌ టికెట్‌, పెన్సిల్‌ ఇతరత్రా సామగ్రి కోసం చివర్లో వెతుకులాట తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. వీటన్నిటినీ సిద్ధపరచుకోవటంతో పాటు పరీక్షాకేంద్రం మీ సొంత ఊరు కాకపోతే ఆ ఊరికి ముందురోజే చేరుకోవటం మంచిది. చాలామంది అభ్యర్థులు పరీక్ష మరో అరగంటలో ఉందనగా పరీక్ష హాలు వెదుకులాటలో ఉంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు!
పరీక్ష హాలు, పరిసరాలు ప్రాముఖ్యం లేనివి
పరీక్ష హాలుకు చేరగానే వందలమంది అభ్యర్థులు కన్పిస్తారు. వీళ్ళంతా ప్రత్యర్థులే. మళ్ళీ ఒత్తిడి ఖాయం. పరీక్ష హాలు దగ్గరే కళ్ళు ఎర్రబడి, పుస్తకాలు తెగ చదివేస్తున్న అభ్యర్థులు కన్పిస్తారు. ఒత్తిడి మరింత పెరిగిపోతుంది.
పైగా కొంతమంది అభ్యర్థులు- వ్యవసాయ వృద్ధిరేటు ఎంత? 104వ రాజ్యాంగ సవరణ ఏమిటి? హర్షవర్థనుని మొదటి భార్య కొడుకు ఏ రంగంలో ప్రసిద్ధుడు?.. లాంటి బిట్ల గురించి తీవ్రంగా చర్చించుకుంటూ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రశ్నలకు సమాధానం మీకు తెలియదనుకోండీ, ఆకాశం మీద పడుతున్న భావన కలుగుతుంది.
పరీక్ష హాలుకి చేరగానే అపరిశుభ్ర వాతావరణం, చిన్న చిన్న బెంచీలూ, కుర్చీలూ... ఇలాంటివి మళ్ళీ అసంతృప్తికి కారణాలవుతాయి. 'గ్రూప్‌-1 రాసే అభ్యర్థికి ఇలాంటి సౌకర్యాలా కల్పించేది?' అంటూ ఆవేశానికి గురికావొద్దు.
పరీక్ష హాలు పరిసరాల్లో, హాలు లోపలా ఎదురవుతున్న పరిస్థితులు తాత్కాలికం. కానీ పరీక్ష ఫలితం శాశ్వతమని గుర్తుంచుకోవాలి. అక్కడ ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలని అనుకోవద్దు. దానికంటే పరీక్ష సరిగా రాయటం మీదే దృష్టి కేంద్రీకరించాలి.
ఎగ్జామినర్ల సూచనలు తప్పక పాటించాలి
పరీక్ష హాలు లోపలికి కనీసం 1 నిమిషాల ముందుగా చేరాలి. పరీక్ష ప్రారంభమయ్యాక వచ్చే అభ్యర్థులు ఎంత ఒత్తిడికి గురవుతుంటారో గమనిస్తే చేయకూడనిది ఏమిటో అర్థమైపోతుంది. ఎగ్జామినర్‌ చెప్పే సూచనలను తప్పకుండా అనుసరించి ప్రశ్నపత్రం ఇచ్చేంతవరకూ మౌనంగా కూర్చోవటం మీ శక్తిని పెంచుతుంది. కోడ్‌ దిద్దకో, హాల్‌ టికెట్‌ నంబర్‌ సరిగా దిద్దకో కనీసం 2-3 శాతం అభ్యర్థులు పరీక్ష జరక్కముందే బరిలో నుంచి వైదొలుగుతున్నారనే విషయం గుర్తించాలి.
పరీక్ష కేంద్రంలో అవాంతరాలు సహజమే
పరీక్ష జరుగుతున్న సమయంలో కూడా కొంతమంది కాపీ కొడుతూ ఉండొచ్చు. కొందరు బిట్లు చర్చించుకుంటూ జవాబులు నిర్ణయించుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలు తక్కువే. అయినా వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. సీరియస్‌ అభ్యర్థులు తమ సబ్జెక్టుపై ఆధారపడతారే కానీ ఇలాంటివాటికి ఆకర్షితులు కారు. ప్రశాంతంగా మీ సామర్థ్యాలను ప్రదర్శించండి.
ఆన్సరింగ్‌ విధానంలో హేతుబద్ధ పద్ధతి ఏది?
* జనరల్‌స్టడీస్‌ లోని తనకిష్టమైన విభాగానికి సంబంధించిన ప్రశ్నల నుంచి మొదలుపెట్టవచ్చు. లేకుంటే ప్రశ్నపత్రంలోని వరసనే పాటించవచ్చు.
* అన్ని విభాగాలకూ సమానమైన సమయం కేటాయించాలని కూడా అనుకోనక్కర్లేదు. కొన్ని విభాగాల్లో ప్రశ్నలు సాధారణ స్థాయిలో అడిగినపుడు జవాబులు చాలా త్వరగా వచ్చేస్తాయి. ఆదా అయిన సమయాన్ని 'మెంటల్‌ ఎబిలిటీ' లాంటి విభాగాలకు వెచ్చించవచ్చు.
* ఒకసారి ప్రశ్న కోసం కొంత సమయాన్ని వినియోగించినపుడు వీలైనంత వరకూ సమాధానం అప్పుడే గుర్తించేందుకు ప్రయత్నించటం మంచిది. కొంత సమయం వెచ్చించాక, ఒక రౌండు పూర్తయ్యాక ఈ ప్రశ్నను మళ్ళీ చూడొచ్చులే అని వాయిదా వేయటం అన్ని సందర్భాల్లో సరైనది కాదు.
* ప్రశ్నపత్రం సమాధానం గుర్తించటం, అన్నీ పూర్తయ్యాక చివరి పది నిమిషాల్లో సమాధానాలన్నీ ఆన్సరింగ్‌ షీటులో మార్కింగ్‌ చేద్దామనుకోవటం కూడా సముచితం కాదు. ఎప్పటి ప్రశ్నకు అప్పుడే ఆన్సర్‌ షీటులో సమాధానం గుర్తించటం వల్ల సరైన టైమ్‌ ప్లాన్‌ వస్తుంది.
* బాగా కఠినంగా ఉన్న ప్రశ్నలకు ప్రశ్నపత్రంలో ఏదైనా గుర్తు పెట్టుకుని, ఒక రౌండు పూర్తయ్యాక మళ్ళీ పరిశీలించవచ్చు.
* ఎంతో స్పష్టంగా తెలిస్తే తప్ప ఒకసారి ఇచ్చిన సమాధానం మార్చకూడదు. ఇదే ఎక్కువ సందర్భాల్లో సహేతుక నిర్ణయమవుతుందని పరిశోధనలు చెపుతున్నాయి.
* ప్రశ్నల కఠినత్వ స్థాయి అధికంగా ఉన్నా కంగారుపడకుండా తెలిసినవి ప్రశాంతంగా జవాబులు గుర్తించుకుంటూ వెళ్ళాలి. ఇటీవల జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పేపర్‌ విభిన్నంగా వచ్చినప్పటికీ విజయం సాధించినవారి వెనక ఈ మెలకువ ఉందని గ్రహించాలి. కఠినత్వం అందరికీ వర్తిస్తుందని గుర్తించి వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించండి.
* ప్రశ్ననూ, ఆప్షన్లనూ పూర్తిగా చదవటం వల్ల నిర్లక్ష్యంలో చేసే పొరపాట్లను తగ్గించుకోవచ్చు.
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిజానికి జులై 25న జరగవలసి ఉంది. కాబట్టి పేపర్‌ జూన్‌లోనే తయారై ఉంటుంది. అందుకే జూన్‌ వరకు మాత్రమే కరెంట్‌ అఫైర్స్‌ చూసుకుంటే సరిపోతుంది.
పరీక్ష హాలు పరిసరాల్లో, హాలు లోపలా ఎదురవుతున్న పరిస్థితులు తాత్కాలికం. కానీ పరీక్ష ఫలితం శాశ్వతమని గుర్తుంచు కోవాలి. అందుకే పరీక్ష సరిగా రాయటం మీదే దృష్టి కేంద్రీకరించాలి.
పునశ్చరణ ఈ తీరులో
ఎ.ఎం. రెడ్డి
కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌
ఎప్పటి నుంచో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పోటీలో తమ ప్రతిభను చాటుకునేందుకు వ్యవధి ఇంకా ఐదు రోజులే మిగిలివుంది. కాబట్టి సిలబస్‌ ప్రకారం ఇప్పటివరకూ చదివిన వివిధ పాఠ్యాంశాలను సంఘటితం (consolidate) చేసుకోవాల్సివుంది. అంతే కానీ, ఇప్పటివరకూ చదవని అంశాలను కొత్తగా చదవటానికి ప్రయత్నించవద్దు. అంతే కాదు; ఇప్పుడు మెయిన్స్‌ పరీక్ష గురించి కూడా ఆలోచించవద్దు! ప్రిలిమ్స్‌లోని ఒక్కో సబ్జెక్టును తీసుకుని, మీరు ఇంతకుముందే సిద్ధం చేసుకున్న మీ పర్సనల్‌ నోట్సును పునశ్చరణ (రివిజన్‌) చేసుకోండి. మీరు పర్సనల్‌ నోట్సును సిద్ధం చేసుకోకపోతే ఇంతకుముందు చదివిన పుస్తకాలను ప్రతి పేజీ తిప్పివేస్తూ ముఖ్యమైన విషయాలను త్వరితగతిలో (at a glance) మొత్తం సబ్జెక్టును ఒకసారి పునశ్చరణ చేసినట్లవుతుంది. ఆ విధంగా ప్రతిరోజూ ఒకటి లేదా రెండు సబ్జెక్టుల పునశ్చరణ చేయాల్సివుంటుంది.
వీలుంటే మీలాగా బాగా చదివిన మిత్రులతో సబ్జెక్టులోని ముఖ్యాంశాలను చర్చించుకుంటే వాటి లోతుపాతులు తెలుసుకోవచ్చు. ఈ సమయంలో అనవసర విషయాలను ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను చర్చిస్తూ కాలం వృథా చేసుకోవద్దు.
ఈ ఐదు రోజులూ వార్తాపత్రికలకూ, టీవీ చానల్స్‌లోని మామూలు వార్తలకు దూరంగా ఉంటే మేలు. ప్రముఖ దినపత్రికల్లో సబ్జెక్టు నిపుణులు ఇచ్చే మోడల్‌పేపర్లను ఆన్సర్‌ చేస్తే ప్రయోజనకరం. అయితే వాటిలో మీకు వచ్చే మార్కులను చూసి, భయపడాల్సిన పనిలేదు. ఒక్కోసారి గ్రూప్‌-1 మోడల్‌ పేపర్‌ కదా అని ప్రశ్నలన్నిటినీ కఠినంగానో, పరోక్షంగా మెలితిప్పో (ట్విస్ట్‌) నిపుణులు ఇవ్వొచ్చు. పరీక్షలోని మొత్తం 150 ప్రశ్నలూ అదే రీతిలో, అదే స్థాయిలో ఉంటాయనుకుని కంగారు పడకూడదు.
సిలబస్‌ ప్రకారం ప్రామాణిక పుస్తకాలను చదివిన విద్యార్థులు పరీక్షలోని 150 ప్రశ్నలకు గానూ కనీసం 100 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలుగుతారు. నిజానికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించడానికి ఆ మార్కులు చాలు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ విధమైన ధైర్యంతో ముందుకు సాగాల్సివుంటుంది.
పరీక్షలోని ప్రశ్నల సరళి తెలుసుకునేందుకు వీలైనన్ని ప్రామాణిక మోడల్‌ పేపర్లు సాధించడం చాలా ఉపయోగకరం. పరీక్ష ముందు చేసే ఇలాంటి సాధన- పరీక్షలోని ప్రశ్నలను వేగంగా, క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.

ప్రతి సబ్జెక్టులో సబ్జెక్టు వర్తమాన ప్రాధాన్యానికి సంబంధించిన అంశాలపై మరోసారి దృష్టి సారించండి.
* ఉదాహరణకు 2010 సంవత్సరం 60వ గణతంత్ర సంవత్సరం కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం, భారత సుప్రీంకోర్టు మొదలైన రాజ్యాంగ సంస్థలు కూడా వజ్రోత్సవాలను నిర్వహించుకున్నాయి. కాబట్టి ఆ దిశలో- భారతదేశ మొట్టమొదటి ఎన్నికల కమిషనర్‌, సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అనే అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. * భారతీయ రిజర్వ్‌ బ్యాంకు 2010 సంవత్సరాన్ని ప్లాటినం సంవత్సరంగా జరుపుకుంటోంది. కాబట్టి ఆర్‌బీఐపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి.
* భారతదేశ భూగోళశాస్త్రంలో ఇటీవల ప్రాజెక్టులు, వివాదాస్పదమైన గనులు, ఖనిజ వనరులపై ప్రశ్నలు ఉండొచ్చు.
* శాస్త్ర సాంకేతిక విషయానికొస్తే... వివిధ రంగాల్లో గత ఏడాది సాధించిన విజయాలపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి.
* చరిత్రకు సంబంధించి ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది.
* భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు 2010-2011 బడ్జెట్‌పై, ఇటీవల ప్రవేశపెట్టి అమలుచేస్తున్న వివిధ పథకాలపై ఉంటాయి. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళికపై కూడా ప్రశ్నలుంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ విధమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించండి.
ఈసారి దేశ జన గణనను దృష్టిలో పెట్టుకొని జనాభాపై తప్పకుండా ప్రశ్నలు ఉంటాయి. 2011 జనగణనలో నూతనంగా ప్రవేశపెట్టే అంశాలపై ప్రశ్నలు సంధిస్తారు. ఉదాహరణకు యూనిక్‌ ఐడెంటిటీ, జాతీయ జనాభా రిజిస్టర్‌ బయోమెట్రిక్‌ విధానం, ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జనగణన మొదలైన అంశాలను చూసుకోవలసి ఉంటుంది.
* అసలు సమస్య అంతా కరెంట్‌ అఫైర్స్‌పై ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిజానికి జులై 25న జరగవలసి ఉంది. కాబట్టి పేపర్‌ జూన్‌లోనే తయారై ఉంటుంది. అందుకే జూన్‌ వరకు మాత్రమే కరెంట్‌ అఫైర్స్‌ చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా 2010 జనవరి నుంచి జూన్‌ వరకు జరిగిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను చూడవలసి ఉంటుంది. ఉదాహరణకు నోబెల్‌ బహుమతులపై ప్రశ్న తప్పనిసరి. అది 2009 అక్టోబరు సంఘటనలపై ఆధారపడి ఉంటుందని గమనించండి.
పరీక్ష రోజుకు ముందు రాత్రి సాధ్యమైనంత వరకు త్వరగా నిద్రపోండి. అంతేకానీ, తెల్లవార్లూ మేల్కొని ఆఖరు గంట ప్రిపరేషన్‌ చేయవద్దు. ఎందుకంటే నిద్రలేమి వల్ల మీరు పరీక్ష హాలులో సరిగా ఆలోచించలేకపోవటంతో ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివి కచ్చితమైన సమాధానాలను గుర్తించటంలో ఇబ్బంది పడతారు.
ఈ పరీక్ష కోసం రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రిపరేషన్‌, పరీక్ష హాలులోని రెండు గంటల కాలానికి సమానమని మరవకూడదు. అందుకే పరీక్ష రోజు ఏ విధమైన ఒత్తిడికీ లోనుకావద్దు. పరీక్ష హాలులోని అభ్యర్థులను అప్పటికప్పుడు పరిచయం చేసుకోవడం గానీ, వారితో ప్రశ్నల సరళి గురించి చర్చించడం గానీ, వారి సమాధానాలను అడగడం గాని ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు. ఇది మీ విజయానికి అవరోధం. మీకు ఇచ్చిన ఓఎంఆర్‌ సమాధాన పత్రంలోని సమాచారాన్ని స్పష్టంగా, క్షుణ్ణంగా పూర్తి చేయండి. అక్కడ ఏమాత్రం పొరపాటు చేసినా మీరు ఇంతకాలం చేసిన శ్రమంతా వృథా అవుతుంది. ఎందుకంటే ఓఎంఆర్‌ షీట్‌లోని సమాచారం చాలా కీలకమైనదని మరవరాదు. దానిని తేలికగా తీసుకొని ఆదరాబాదరగా నింపకూడదు.
మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలకు వెంటనే సమాధానం తెలియకపోతే వాటిని వదిలేసి చివరకు ప్రయత్నించండి. నెగటివ్‌ మార్కులు లేవు కాబట్టి మీకు కచ్చితమైన సమాధానం తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్‌ పద్ధతిని ఉపయోగించి ప్రతి ప్రశ్నకూ సమాధానాన్ని గుర్తించండి.