మొట్టమొదటిది... కొత్త విధానంలో జరిగిన తొలి పరీక్ష ఇది. ఏ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుందనేది చివరివరకూ ఏ ఒక్కరూ నిర్థారణగా చెప్పలేకపోయారు. ప్రతి విద్యార్థినీ, సబ్జెక్టు నిపుణులనూ, ప్రచురణకర్తలనూ ఈ సందేహమే వెంటాడింది. మొదటి పేపర్‌కు అందరూ ఒకే పద్ధతిని అనుసరించారు కానీ రెండో పేపర్ విషయంలోనే అయోమయం! చాలామంది విద్యార్థులూ, శిక్షణ సంస్థలూ బ్యాంకింగ్ పరీక్షల పద్ధతినో, MAT, CATలాంటి మేనేజ్‌మెంట్ పరీక్షల పద్ధతినో అనుసరించారు. ఇక కొందరు విద్యార్థులైతే పరీక్షకు దూరంగా ఉన్నారు; పరీక్షా విధానం స్పష్టం కాని పరీక్షకు హాజరై ఓ attemtని వృథా చేసుకోవడం వారికిష్టం లేకపోయింది.
అయినప్పటికీ జాతీయ, రాష్ట్రస్థాయుల్లో సివిల్స్ దరఖాస్తుదారుల సంఖ్య బాగానే పెరిగింది. దేశవ్యాప్తంగా 4.5 లక్షలమంది దరఖాస్తు చేశారు. మనరాష్ట్రంలో ఏటా సివిల్స్ అభ్యర్థుల సంఖ్య 24 వేలుండేది. అలాంటిది హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి కలిపి ఒక్కసారిగా ఈ సంఖ్య 35 వేలమందికి పెరిగిపోయింది!
వూహలు తారుమారు
అభ్యర్థులందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 12న జరిగింది. దరఖాస్తుదారుల్లో సగం మందే పరీక్షకు హాజరయ్యారు. ఇది మామూలే! హైదరాబాద్ నుంచి 16,500 మంది రాశారు. గత సంవత్సరాల్లో ఇచ్చినట్టే ప్రశ్నల సంఖ్య ఉంటుందని ఊహిస్తూ పరీక్షకేంద్రంలోకి వెళ్ళారు ప్రతి ఒక్కరూ!
ప్రశ్నపత్రం చూసినక్షణంలో చాలామంది రిలీఫ్ పొందివుంటారు. మొత్తం ఇచ్చినవి వంద ప్రశ్నలే. గతంలో 150 ప్రశ్నలుండేవి. ప్రశ్నలను ఓసారి చకచకా చూస్తూపోయిన అభ్యర్థుల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. ప్రతిదీ రాయగలిగేలాగే కనిపించింది మరి! అయితే ఒకసారి సమాధానాలు రాయటం మొదలెట్టాక తెలిసొచ్చింది ఇబ్బందేమిటో! ప్రతి ప్రశ్నా సరళమైన, తెలిసిన భావనకు సంబంధించిన వివరాల్లోకి దారితీస్తూవచ్చింది. ఆప్షన్లన్నీ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి.
చాలామంది అభ్యర్థులు సగం సమాధానాలు సరిగా గుర్తించారు. మరో పాతికశాతం ప్రశ్నలను వూహించి రాసి మిశ్రమ భావాలతో పరీక్ష నుంచి బయటికి వచ్చారు.
ఎదురుచూసిన పేపర్
అందరూ ఎదురుచూసిన పేపర్-2లో 80 ప్రశ్నలే! మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ ప్రశ్నలు అటు బ్యాంకింగ్ స్థాయిలో కానీ, ఇటు CAT స్థాయిలో గానీ లేవు; బాగా తక్కువ స్థాయిలో ఉన్నాయి. కాంప్రహెన్షన్ పాసేజ్‌లు ఎక్కువున్నాయి. కష్టంగా భావించిన ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్‌మేకింగ్ ప్రశ్నలు తక్కువిచ్చారు.
వెలిగిపోతున్న మొహంతోనే పరీక్షాకేంద్రం నుంచి బయటికొచ్చారు అభ్యర్థులు. పట్టణాల్లో ఇంగ్లిష్‌మీడియంలో చదివినవారిలో ఉత్సాహం కనిపించింది. వృత్తిఉద్యోగాల్లో ఉండి సమగ్రంగా సన్నద్ధమవ్వటానికి వ్యవధి చాలనివారు కూడా ఇదే రీతిలో సంతోషపడ్డారు. లక్ష్యం సాధించగలిగినట్టే ఉందని దాదాపు ప్రతిఒక్కరూ భావించారు.
పరీక్ష బడలిక తీరాక రెండ్రోజుల తర్వాతినుంచీ చాలామంది పరీక్షాపత్రాల 'కీ'ల కోసం వెబ్‌సైట్లలో అన్వేషించారు. తమ జవాబులు ఎంత సరైనవో తెలుసుకోవటానికి ప్రయత్నించారు. మెయిన్స్‌కు అర్హత పొందటానికి కటాఫ్ మార్కులు ఎంత ఉండొచ్చంటూ చర్చల్లో పడిపోయారు. 400 మార్కులకు 200 కటాఫ్ ఉంటుందని భావించాను. కానీ చాలామంది మాత్రం 160-170 మధ్యే ఉండొచ్చని ఊహించారు. (క్వాలిఫైయింగ్ మార్కులు జనరల్ క్యాటగిరీకి 50 శాతం కంటే పైనే. ఇతరులకు 45-50 మధ్య ఉండొచ్చు.)
ఫలితాలు జులై 15కల్లా వస్తాయని వదంతులు. ఆ నెల ఏమీ జరగలేదు. ఆగస్టు మొదటివారంలో కూడా ఎలాంటి వార్తా లేదు. మొత్తానికి ఆగస్టు 18న ఫలితాలు వెలువడ్డాయి.... కిందటి ఏడాది మల్లే! 11,984 మంది మెయిన్స్‌కు అర్హత సంపాదించారు. క్వాలిఫై అవుతామని ఆశించిన ఎందరో నిరాశపడ్డారు. ఓసారి చూద్దామని ప్రయత్నించినవారిలో కొద్దిమంది క్వాలిఫై అయ్యారు. దీంతో కొత్త పద్ధతిలో అర్హత పొందే రహస్యం ఏమిటా అని ఆలోచనలు మొదలయ్యాయి!